దివినుంచి భువికి దిగిన దేవతలు 12

0
5

[box type=’note’ fontsize=’16’] మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞాన రహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రచన చేశారు డా. ఎం. ప్రభావతీదేవి. [/box]

12. దేవాసుర వైరం

12.0 అందరిలోనూ ఉండే అరిషడ్వర్గాలు:

[dropcap]కా[/dropcap]మక్రోధాది అరిషడ్వర్గాలు ఎక్కువగా మనుషుల్లోనే ఉంటాయనుకుంటాం మనం. కానీ ఈ పురాణాలు చదువుతుంటే అసురుల్లో ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. అసురులే కాదు, మనుషులే కాదు, దేవతలు, ఋషుల్లాంటి వారు, చివరికి జ్ఞానుల్లాంటి వారు గూడా వాటికి అతీతులు కారని ఈ పురాణాలే చెప్తున్నాయి. ప్రతి జీవిలోను ఈ భావాలుంటాయి కాబట్టి అవి కలిగి ఉండటం జీవలక్షణం అనుకుంటే సరిపోతుంది.

12.1 దేవదానవుల మధ్య వైరం:

దేవతలంటే దివ్య శక్తులు కలవారు. వారు తమ దివ్యశక్తిని లోకాల్లోని జీవుల మేలు కోసం ఉపయోగిస్తారు. దైత్య, దానవ, రాక్షసుల్లో గూడా ఎంతో మంది తపస్సు చేసినవారున్నారు. కానీ వారు తమ తపశ్శక్తిని ముల్లోకాలను పీడించడానికి, బాధించడానికి ఉపయోగిస్తారని పురాణాల వల్ల తెలుస్తోంది. దేవతలకు, దానవులకు మధ్య వైరం అనాదిగా ఉందన్నది మనకు తెలుసు. అసలు బ్రహ్మ సృష్టి మొదలు పెట్టకముందు నుంచే ఈ వైరముందని మధుకైటభ వృత్తాంతం ద్వారా తెలుస్తోంది. విష్ణువు యొక్క కర్ణమలంనుండి పుట్టిన మధు కైటభులనే దానవులు తపస్సుచేసి, పరదేవత అనుగ్రహంతో స్వేచ్ఛామరణం ఉందన్న వరగర్వంతో విర్రవీగుతూ బ్రహ్మను గూడా భయపెట్టి, విష్ణువు తోనే యుద్ధంచేసి, ఆయన అలిసిపోతే, తామే ఆయనకు వరమిస్తామన్నారు. విష్ణువు తన చేతిలోనే వారు మరణించాలని వరం కోరి వారిని వంచన తోనే సంహరించాడు. ప్రతి మన్వంతరంలోను దేవతలకు అసురులకు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి దేవతలు జయిస్తారు, ఇంకోసారి అసురులు జయిస్తారు. దేవతలకు దానవుల వల్లగానీ రాక్షసుల వల్లగానీ కష్టం కలిగినపుడు భగవంతుడైన విష్ణువు అవతారాలెత్తి దుష్టసంహారం చేసి దేవతలను రక్షిస్తాడని పురాణాలు చెపుతున్నాయి. ఇంతవరకూ జరిగిపోయిన మన్వంతరాల్లో విష్ణువు వివిధ పేర్లతో అవతరించి దేవదానవ యుద్ధాల్లో ఇంద్రాది దేవతలను రక్షించడం జరిగింది. అలాంటి ఘట్టాలను కొన్నింటిని చూద్దాం.

12.2 జయవిజయులకు శాపం దైత్యాదుల అభివృద్ధి:

అసలు చెడుగుణాలు గల దైత్యాదులు ఎలా పుట్టారో తెలుసుకోవాలి. మహర్షులైన సనకాదులు వైకుంఠానికి వెళ్ళారు విష్ణుదర్శనం కోసం. విష్ణుపార్షదులైన జయ విజయులు వారినడ్డగించారు. దానితో ఆ మహర్షులాగ్రహించి వారికి శాపాలిచ్చారు రాక్షసులై పుట్టమని. వైకుంఠవాసులైన వారికి రాక్షసజన్మ వచ్చింది. బ్రహ్మ పుత్రుడైన మరీచికి పుట్టినవాడు కశ్యప ప్రజాపతి. ఆయనకు దక్షుని పుత్రికల వల్ల ఇంద్రాది దేవతలు, దైత్య, దానవాదులూ గూడా పుట్టారు. దక్ష పుత్రికైన దితి భర్తను అసుర సంధ్యలో కలవడం వల్ల అసురగుణాలు గల హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు పుట్టారు. వైకుంఠవాసులైన జయవిజయులే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా పుట్టారు. వారివల్ల దైత్యసంతతి అభివృద్ధి చెందింది. హిరణ్యాక్షుడ్ని చంపడానికి విష్ణువు యజ్ఞవరాహ అవతారమెత్తాల్సి వచ్చింది. దానికి హిరణ్యకశిపుడు విష్ణువు మీద కక్ష గట్టి విష్ణుభక్తులను, యజ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులను, తనవారితో హింసించి, తాను తపస్సుకు పోయి, బ్రహ్మను మెప్పించి, అనేకవరాలు పొందాడు. దానితో లోకాలను ఆక్రమించుకుని, దేవతలను మొదలైనవారిని అణిచి తనకిష్టం వచ్చినట్లు వ్యవహరించసాగాడు. చివరకు తన కొడుకైన ప్రహ్లాదుడు విష్ణు భజన చేస్తున్నాడని, పసిబాలుడని గూడా చూడకుండా, అనేకవిధాల హింసించి విష్ణుని అవతారమైన నరసింహునిచే చంపబడ్డాడు. హిరణ్యకశిపుని తర్వాత రాజ్యం ప్రహ్లాదునికి వచ్చింది. ప్రహ్లాదుడు విష్ణుభక్తుడైనప్పటికీ దేవతలతోగల జాతివైరాన్ని మరచిపోకుండా నిలబెట్టుకున్నాడు.

12.3 ప్రహ్లాదుడు దేవతలతో యుద్దం చేయుట:

1. ప్రహ్లాదునికి నరనారాయణులతో యుద్దం:

చాక్షుష మన్వంతరంలో, పాతాళలోకంలో రాక్షసరాజైన ప్రహ్లాదుడు ధర్మపరంగా రాజ్యం చేస్తున్న సమయంలో, ఒకసారి అక్కడకు వచ్చిన చ్యవనమహర్షి ద్వారా భూలోకానగల తీర్థాల్లోకెల్ల పవిత్రమైన నైమిశం గురించి తెలుసుకుని, దాన్ని చూడ్డానికి భూలోకానికి బయల్దేరాడు. అక్కడ అతనికి ఒక వటవృక్షంకింద ధనుర్బాణాలను పక్కన పెట్టుకుని తపస్సుచేస్తున్న నరనారాయణులు కన్పించారు. అది అతనికి వింతగా, అధర్మంగా అనిపించి వారిరువురితో చాలా సంవత్సరాలు యుద్ధం చేయగా చివరికి విష్ణువు కలగజేసుకోవలసి వచ్చి, వారు తన అంశలని ప్రహ్లాదునికి చెప్పి వారి మధ్య యుద్దాన్ని నివారించాడు.

2. ప్రహ్లాదునికి ఇంద్రునితో యుద్ధం:

ప్రహ్లాదుడు రాజయ్యాక దేవతలతో యుద్ధంచేసి ఓడిపోయి తన పుత్రుడైన విరోచనుని కొడుకైన బలికి రాజ్యమిచ్చి తాను తపస్సుకు వెళ్ళాడు. బలి గూడా దేవతలతో వైరం కొనసాగించాడు. శ్రీహరి వామనుడిగా అవతరించి బలిని పాతాళానికి పంపి, ఇంద్రునికి స్వర్గమిప్పించాడు. ఓడిన దానవులు శుక్రాచార్యుడిని ఆశ్రయించారు. వారి కోసం శుక్రుడు శివుడ్ని ఆరాధించి ఆయన చెప్పినట్లు తలకిందులుగాఉండి, ధూమపానం చేస్తూ చాలా సంవత్సరాలు తపస్సుచేసి మృత సంజీవని విద్య సంపాదించాడు. ఈలోపల శుక్రుని తపస్సు గురించి తెలుసుకున్న ఇంద్రుడు భయపడి తన కూతురైన జయంతిని శుక్రునికి సేవ చేయడానికి వినియోగించాడు. శుక్రుడు ఆమె చేసిన సేవకు మెచ్చి ఆమెతో చాలా కాలం విహరించాడు. ఈ లోపల బృహస్పతి దానవుల వద్దకు శుక్రుని వేషంలో వెళ్ళి, అహింస పరమధర్మమంటూ దానవులకు శాంతి బోధలు చేస్తూ, వారిలో హింసా ప్రవృత్తిని మాన్పించాడు. వారు ఆయన మత్తులో పడిపోయారు. ఈలోగా శుక్రుడు వచ్చి జరిగింది తెలుసుకున్నాడు. ఆ మాయలమారి బృహస్పతి అని తెలుసుకుని దానవుల వద్దకు వెళ్ళి తానే అసలు శుక్రుడని జరిగింది చెప్పినా వారు వినిపించుకోకుండా ఆయనే మాయావి అని నిందించారు. దానికి ఆయన కోపించి వారిని శపించాడు ‘దేవతలవల్ల పరాభవం పొందాలి’ అని. తర్వాత దేవతలు దానవులను ఓడించారు. దానవులు జరిగిన పొరబాటు తెలుసుకుని ప్రహ్లాదుని ముందుంచుకుని శుక్రుని శరణు వేడారు. శుక్రుడు వారికి హితబోధ చేసాడు పాతాళానికి పోయి సమయం కోసం వేచి యుండమని. ప్రహ్లాదుడు గూడా జయాపజయాలను లెక్క చేయక దేవతలతో యుద్దం చేసాడు. ఇంద్రుడు పరాశక్తిని ధ్యానించి ఆ దేవి సాయంతో దానవులను ఓడించగలిగాడు. ప్రహ్లాదుడు గూడా పరాశక్తిని ధ్యానించగా ఆ దేవి చెప్పింది అది వారికి మంచి కాలంకాదు పాతాళానికిపోయి జీవించమని.

12.4 ఇంద్రుడు – మరుత్తులు:

కశ్యప ప్రజాపతి భార్య అయిన దితి తన పుత్రులను ఇంద్రుడు చంపుతున్నాడని ఆ ఇంద్రుని చంపితేనే గానీ తనకు సుఖం లేదని తలచి భర్త మెచ్చేలాగ సపర్యలు చేసింది. ఆయనకు ఆవిడ కోరిక ఇష్టం లేకపోయినా ‘పుంసవన’ మనే ఒక వ్రతమాచరించమని చెప్పాడు. ఆవిడెంతో నియమనిష్ఠలతో ఆ వ్రతం చేస్తూ గర్భం ధరించింది. ఇంద్రుని తల్లి అయిన అదితి ఆ విషయం తెలుసుకుని ఇంద్రుని ప్రేరేపించింది దితి గర్భాన్ని ఛేదించమని. ఇంద్రుడు దితికి సేవ చేస్తున్నట్లు నటించసాగాడు. ఆవిడ ఒక రోజు సంధ్యాకాలంలో పాదాలు కడుక్కోకుండా నిద్రపోయింది. ఆ సమయంలో ఇంద్రుడు యోగమాయవల్ల సూక్ష్మరూపంలో ఆమె గర్భంలో ప్రవేశించి ఆ గర్భస్థ శిశువును 7 ముక్కలుగా చేసాడు. అవి ఏడుగురు శిశువులుగా అయ్యాయి. వాటిని ఇంకా 7 ముక్కలుగా చేయగా అవి మొత్తం 49 బాలురుగా అయ్యాయి. ఆ బాలురు ఏడుస్తూ ఇంద్రుని వేడుకున్నారు తమని హింసించవద్దని. వారిని ఏడవవద్దని మరుత్తులని పేరుపెట్టి దేవత్వమిచ్చాడింద్రుడు. దితికి మెలకువ వచ్చాక 49 మందిని చూసి తను ఒక్కరి కోసం వ్రతంచేస్తే 49 మంది ఎలా కలిగారో అర్థంకాక నిజం చెప్పమని ఇంద్రుని అడగగా అతను జరిగిందంతా చెప్పాడు. దితి బాధపడుతూ శపించింది ఇంద్రునికి రాజ్యంపోవాలని, అదితికి కారాగారవాసం కలగాలని, పుట్టిన పిల్లలు చావాలని. అదితి ద్వాపరయుగంలో కృష్ణుని తల్లి దేవకిగా పుట్టి ఆ శాపఫలం అనుభవించింది.

12.5 ఇంద్రుడు విశ్వరూపుని సంహరించుట:

అదితి కుమారుల్లో ఒకరైన త్వష్ట ప్రజాపతి కుమారుడు విశ్వరూపుడు. ఆయన మహాతపస్వి. దేవతల్లోని వాడైనప్పటికీ ఇంద్రుడు ఆయన్ను చంపాడు. ఒకసారి ఇంద్రసభకు బృహస్పతి రాగా ఆయన్ను చూసి ఇంద్రుడు లేచి గౌరవించలేదు. దాన్ని అవమానంగా భావించి బృహస్పతి ఆ సభలోంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇంద్రునికి కనిపించలేదు. దేవగురునికి కోపం వచ్చిందని అర్థం చేసుకున్న ఇంద్రుడు, ఆయన కోసం వెతికినా ఆయన కనిపించలేదు. ఈ విషయం దేవవిరోధులై దానవులు తెలుసుకుని ఇదే తగిన సమయం దేవతలను ఓడించడానికని శుక్రుడ్ని ఆశ్రయించి ఆయన కృపచే దేవతలమీద దాడిచేసి వారిని ఓడించారు. దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. బ్రహ్మ వారికి గురువు యొక్క గొప్పతనం వివరించి, త్వష్ట ప్రజాపతి కుమారుడు విశ్వరూపుని గురువుగా ఆరాధించమన్నాడు. దేవతలు విశ్వరూపుని ప్రార్థించారు గురుత్వం వహించమని. పౌరోహిత్యం చేయడమన్నది ఇష్టంలేకపోయినా ఒప్పుకున్నాడు విశ్వరూపుడు. ఆయనవల్ల దేవతల సంపదలు వృద్ధిచెందాయి. ఆయన ఇంద్రునికి నారాయణకవచం అనే విద్యని ఉపదేశించగా దానితో ఇంద్రుడు రాక్షసులను సంహరించగలిగి, అనేక సుఖాలను పొందాడు. విశ్వరూపునికి 3 తలలున్నాయి. ఆయన ఒకతలతో సురాపానం, ఇంకోతలతో సోమ పానం, మూడోతలతో అన్నం గ్రహిస్తాడు. ఆయన దేవతలతో ప్రత్యక్షంగా యజ్ఞభాగాన్ని స్వీకరిస్తూ, దైత్యులకు గూడా ఇవ్వసాగాడు. అది తెలుసుకుని ఇంద్రుడు భయపడి ఆయన తలలను తుంచివేసాడు. సోమపానంచేసే తల కపింజలపక్షిగాను, సురాపానం చేసే తల పిచ్చుకగాను, అన్నం తినే తల తిత్తిరిపక్షి గాను అయ్యాయి. ఇంద్రుడు బ్రహ్మహత్య చేసాడు గనక ఆయన్ని ఆ పాతకం బాధించసాగింది. ఆ పాతకాన్ని ఆయన భూమికి, జలానికి, వృక్షాలకు, స్త్రీలకు కొంచెం కొంచెం పంచి ఇచ్చి, బదులుగా వారికి కొన్ని వరాలను అనుగ్రహించాడు. త్వష్ట ప్రజాపతికి తన కుమారుడ్ని చంపినందుకు ఇంద్రుడి మీద చాలాకోపంవచ్చి, ఇంద్రుడ్ని చంపడానికి ఒక మారణహెూమం చేయగా, అందులోంచి భయంకరుడైన వృత్రాసురుడు పుట్టి ఇంద్రుడ్ని, దేవతలను బాధించసాగాడు. వారు భయంతో పారిపోసాగారు. దిక్కుతోచని దేవతలు విష్ణువుని ప్రార్థించగా ఆయన ఒక ఉపాయం చెప్పాడు ‘దధీచిమహర్షి యొక్క ఎముకలతో చేసిన నూరంచులుగల ఆయుధం సంపాదిస్తే దానితో వృత్రుడ్ని సంహరించవచ్చు’ అని. దధీచిమహర్షి దేవతల కోసం ప్రాణత్యాగం చేయగా, ఆయన యొక్క ఎముకలతో చేసిన వజ్రాయుధంతో వృత్రుడ్ని సంహరించాడు ఇంద్రుడు. ఇంద్రుడు మళ్ళీ బ్రహ్మహత్య చేసాడు గనక ఆయన్ని ఆ పాతకం బాధించసాగింది. అది వికారమైన చండాలరూపంధరించి ఇంద్రుడ్ని బాధించసాగింది. దానికి భయపడి ఇంద్రుడు కైలాస పర్వత ప్రాంతానగల మానస సరోవరంలో గల ఒక కమలనాళంలో ప్రవేశించి 1000 సంవత్సరాలు అందులోనే ఉన్నాడు. ఆ ప్రాంతం ఈశ్వరుడిది కావడంవల్ల బ్రహ్మహత్యాపాతకం ఆయన్ని ఏమీ చేయలేకపోయింది. ఈశ్వరుని కటాక్షంతో ఆ పాతకం తొలగిపోయింది.

12.6 దేవతలకు తారకునితో వైరం:

దితి కొడుకుల్లో ఒకడైన వజ్రాంగుడికి వరాంగి అనే భార్యవల్ల తారకుడు పుట్టాడు. తారకుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి శివపుత్రుడివల్ల తప్ప ఇంకెవరివల్లా చావు లేకుండా వరం కోరుకున్నాడు. అంతకుముందే శివుని పత్ని సతీదేవి దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకుంది. శివుడికి భార్యలేదు గనక పిల్లలు కలగరు, తనకిక చావు రాదన్నసంగతి తెలిసే తారకుడు ఆ వరం కోరుకున్నాడు. దేవతలంటే ఉన్న వైరం వల్ల తారకుడు దేవతలను బాధించసాగాడు.

12.7 శివపార్వతుల తపస్సు:

దక్షపుత్రికైన సతీదేవి దక్షయజ్ఞ సమయంలో ఆత్మాహుతి చేసుకున్నాక, శివుడు కైలాసం వదిలి భూలోకం వచ్చి హిమవత్పర్వత ప్రాంతంలో గల పర్వతం మీద తీవ్ర తపస్సు కొనసాగించాడు. అదే భూలోకంలో కైలాసంగా పేరొందింది. ఈ లోపల సతీదేవి మరోజన్మ తీసుకుని, భూలోకంలో హిమవంతునికి మేనకాదేవి యందు పార్వతిగా పుట్టింది. శివుడే పతి కావాలని, పార్వతి హిమవత్పర్వత ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న శివుని సేవించసాగింది. దేవతలు తారకాసుర పీడ వదిలించుకోడానికి, శివపార్వతుల కళ్యాణం కోసం ఎదురుచూడసాగారు. శివుని తపస్సు తీవ్రంగా ఉండడంతో, దేవతలు తొందరపడి మన్మథుడ్ని పిలిచి శివునికి తపోభంగం చేయమన్నారు. మన్మథుడు తన పూలబాణప్రయోగంతో శివునికి తపోభంగంచేసి, శివుని కోపాగ్నికి కాలిభస్మమయ్యాడు. శివుడు అక్కడనుంచి అంతర్థానమై భూలోకం వదలి, తన నిజకైలాసానికి వెళ్ళిపోయాడు. ఇదంతా చూసి పార్వతి చాలా బాధపడి తనుకూడా తపస్సులోకి వెళ్ళిపోయింది. శివపార్వతులు తపస్సు చేయడంవల్లనే భూలోకంలో హిమవత్పర్వత ప్రాంతమంతా పవిత్రమైపోయింది.

12.8 భండాసుర పుట్టుక:

బ్రహ్మదేవుడు తన కమండలంలోని నీటిని మన్మథుని భస్మంపై ప్రోక్షించగా అందులోంచి ఒక పురుషుడుద్భవించాడు. బ్రహ్మ అతడ్ని శతరుద్రీయం పారాయణ చేసి శివుని అనుగ్రహం సంపాదించమని చెప్పాడు. అతను అలా శివుని కోసం తపస్సుచేసి ఆయనవల్ల త్రిలోకరాజ్యాధిపత్యం, 60 వేల సంవత్సరాల దీర్ఘాయుషు మొదలైన వరాలు పొందాడు. బ్రహ్మ అతన్ని చూసి ‘భండ భండ’ అని మెచ్చుకున్నట్టుగా అన్నాడు. ఆనాటినుంచి అతని పేరు భండుడని ప్రసిద్దిగాంచింది. అతను జితేంద్రియుడై, వైభవంతో ఇంద్రాదులను జయించి, అజేయుడై గొప్ప యజ్ఞయాగాలు, దానాలు చేస్తూ ధర్మంగాపాలిస్తూ ఇంద్రుడ్ని మించిపోయాడు. ఇంద్రునికి తేజస్సు కళావిహీనమైంది. అది చూసి దేవతలు సహించలేకపోయారు. వారంతా కలిసి బ్రహ్మ సూచన మేరకు విష్ణుమాయనాశ్రయించారు. విష్ణుమాయ స్త్రీరూపం ధరించి భండుడ్ని మోహపరచగా అతను ధర్మభ్రష్టుడై ఒకవికృతశక్తిగా తయారై భండాసురుడుగా పేరు పొంది లోకాలను పీడించసాగాడు. సృష్టి యొక్క స్థితికే అతను విరోధిగా, సర్వనాశన స్వభావం కలవాడుగా తయారయ్యాడు. అసురసైన్యాన్ని తయారు చేసుకున్నాడు. విశుక్రుడు, విషంగుడు లాంటి అసురులు గూడా పుట్టుకొచ్చారు. వీరికి శుక్రాచార్యుడు గురుత్వం వహించాడు. కామదహనం వల్ల ప్రకృతంతా సారవిహీనమైపోయింది. దానవులంతా కలిసి లోకాల్ని రసవిహీనం చేసి నీరసపరిచారు. దేవతలు, ఋషులు మొదలైనవారు శక్తిహీనులై, నీరసించిపోయారు. మళ్ళీ దేవతలు బ్రహ్మను ముందిడుకొని విష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకోగా విష్ణువు చెప్పాడు వాడ్ని పరాశక్తి తప్ప ఇంకెవరూ సంహరించలేరని. అంటే బ్రహాండంలోని శక్తులేవీ వాడ్ని వధించలేవు. అనేక బ్రహాండాలను సృష్టించిన ఆ పరాశక్తి వల్లనే వాడి వధ జరగాలి.

12.9 పరాశక్తి శ్రీలలితాదేవిగా ఆవిర్భవించుట:

బ్రహ్మాది దేవతలంతా విష్ణువుని శరణువేడగా, విష్ణువు పరాశక్తి బ్రహ్మాండానికి ఆవల ఉంటుందని చెప్పి బ్రహ్మాండకటాహాన్ని ఏనుగులతో కొట్టించాడు. పరాశక్తి పరంజ్యోతిగా దర్శనమిచ్చింది. వారు ఆజ్యోతిని సగుణరూపంతో కనపడమని వేడుకోగా అన్నిటికీ మూలమైన పరశంభు (మహాశంభు) ప్రత్యక్షమై అహంకారం పోతేనే గానీ ఆ దేవి దర్శనం కాదని ఒక మహాయాగం చేయించి ఆ హెూమగుండంలో వారిని ఆత్మార్పణ చేసుకోమన్నాడు. వారలాగే చేసాక శ్రీలలితాదేవి ఆ చిదగ్నిగుండంలోంచి ఆవిర్భవించింది. దేవతల నందరినీ మళ్ళీఆరోగ్యంగా సృష్టించింది. బ్రహ్మదేవుడు ఆ దేవి కోసం విశ్వకర్మతో శ్రీమన్నగరమనే ఒక రాజధానిని నిర్మింపజేసాడు. ఇంకా పరశంభుతో వివాహం జరిపించాడు. వారే కామేశ్వరీ-కామేశ్వరులు, సృష్టికి కారణభూతులు. శ్రీమాతను సామ్రాజ్ఞిగా పట్టాభిషేకం చేసాడు బ్రహ్మ. దేవతలంతా ఆరోగ్యవంతులయ్యారు. ఇంక ఆ దేవి తన శక్తిసేనలతో బయలుదేరింది భండాసురునితో యుద్దానికి.

12.10 భండాసురవధ:

ఇరుపక్షాలవారు యంత్ర మంత్ర తంత్రాలనుపయోగించి యుద్ధంచేసారు. ఉదా: దానవుల తరపున విశుక్రుడు ఒకపెద్దశిలపై జయవిఘ్నయంత్రం గీసి దాన్ని శక్తి సేనల్లోకి విసిరేసాడు ఆకాశంలోంచి. దానివల్ల శక్తిసేనలు అలసత్వానికి గురై నిద్రలోకి జారుకున్నారు. శ్రీదేవికది తెలిసి గణపతిని వినియోగించింది. గణపతి తన దంతంతో దాన్ని పిండిచేసాడు. తర్వాత దానవులు గజాసురుడ్ని పంపారు. గణపతి తనలోంచి 7కోట్ల గణపతులను పుట్టించి పంపాడు వారిమీదకు. దానవులు అంధాస్త్రాన్ని వేసి శక్తిసేనలకు అంధత్వం తెప్పిస్తే, అమ్మ చక్షుష్మతీ విద్యతో వారికి మళ్ళీ చూపు తెప్పిచ్చింది. వాళ్ళు అంతకాస్రం వేస్తే అమ్మ మహామృతజయాస్త్రం వేసింది. ఎన్ని రకాల అస్త్రాలు వెయ్యాలో అన్నీ వేసారు దానవులు. అన్నిటినీ తిప్పి కొట్టించింది శ్రీమాత. అసురసేనలన్నీ చచ్చాయి. చివరికి కామేశ్వరాస్త్రంతో భండాసురుడ్ని దగ్ధంచేసి వాడి నగరమైన శూన్యకపట్టణాన్ని గూడా దహించివేసింది. భండాసుర వధతో దేవతలంతా సంతోషించారు. కానీ తారకుని బాధ తప్పలేదు వారికింకా.

12.11 శివపార్వతుల కళ్యాణం:

శివపార్వతుల కళ్యాణం జరగాలంటే మన్నథుడు బతకాలి మరి. అందుకు బ్రహ్మాదులు అమ్మని వేడుకున్నారు మన్నథుడ్ని బతికించమని. శ్రీమాత తన కంటి చూపుతోమన్నథుడ్ని బతికించింది. ఇప్పుడతను తన భార్య రతీదేవికి తప్ప ఇంకెవరికీ కనపడడు. అమ్మ పంచపుష్పబాణాలను మన్నథునికిచ్చి ‘ఇప్పుడు వెయ్యి వీటిని శివునిమీద’ అంది. అమ్మ అనుజ్ఞ తీసుకుని అప్పుడు మన్నథుడు శివుని మీద పూల బాణాలు వేసాక శివుని తపోభంగమైంది. పార్వతిని వివాహమాడాడు శివుడు. దేవతలంతా చాలా సంతోషించారు.

12.12 తారకాసురవధ:

శివపార్వతుల కళ్యాణమయ్యాక దేవతలు తారకుని సంహరించే శివపుత్రుని కోసం తొందరపడసాగారు. మహావిరాగి అయిన శివుని వీర్యం పతనమవ్వాలంటే చాలాకాలం పడుతుంది. దేవతల తొందరపాటువల్ల శివుడు తన తేజస్సును అగ్నిదేవుని కందజేసాడు. అగ్ని దాన్ని భరించలేక గంగలోవిడిచాడు. గంగ గూడా దాన్ని భరించలేకపోయింది. చివరికి ఆ తేజస్సు ఒక రెల్లుపొదలో చేరింది. అందులోంచి శివకుమారుడు ఉద్భవించి, కృత్తికలతో పెంచబడి, 7వరోజున తారకుడ్ని వధించాడు.

12.13 దేవతలకు త్రిపురాసురులతో యుద్ధం:

తారకాసురునికి ముగ్గురు కొడుకులు: విద్యున్మాలి,తారకాక్షుడు,కమలాక్షుడు. వారు మహాక్రూరులు, దేవతలంటే వైరభావం గలవారు. వారు బ్రహ్మను గూర్చి తీవ్రతపస్సు చేసి తమకు మరణం రాకూడదని వరమడిగారు. అది కుదరదంటే, కామసంచారం చేసే మూడు పురాలను నిర్మించిమ్మన్నారు. బ్రహ్మ మయునికి ఆదేశమిచ్చాడు వాటిని నిర్మించమని. మయుడు స్వర్గంలో సంచరించే బంగారపు పురాన్ని, అంతరిక్షంలో తిరిగే వెండిపురాన్ని, భూమండలంలో సంచరించే ఉక్కుమయమపురాన్ని తయారు చేసి వారికిచ్చాడు. ఆ మూదు పురాలు 1000 సంవత్సరాల కొక్కసారి కలుస్తాయి. ఆ సమయంలో ఎవరైతే ఒక్కబాణంతో ఆ మూడింటినీ నాశనం చేయగలరో వారి చేతిలోనే వారు మరణిస్తారు. ఆ పట్టణాల్లో వారు తిరుగుతూ లోకాల్లోని జీవులను క్రూరంగా హింసించసాగారు. దేవతలు బ్రహ్మను శరణు వేడారు. వారంతా కలిసి శివునివద్దకువెళ్ళారు. వారికి శివుడు చెప్పాడు దైత్యులకు పుణ్యబలమొక్కువగా ఉండటం వల్ల వారినెవరూ ఏమీ చేయలేరని, వారి ధర్మబలం క్షీణిస్తేనేగాని వారినెవరూ గెలవలేరని. దానికి విష్ణువే దారి చూపగలడని, వారిని విష్ణుని శరణువేడమన్నాడు. వారు విష్ణువుని శరణన్నారు. దానికి ఆయన వారితో రుద్రయాగం చేయించగా సైన్యం, ఆయుధాలు సమకూరాయి. దైత్యులను ధర్మభ్రష్టులను గావించడానికి ఒక మాయాసన్యాసిని సృజించి పాషండమతాన్ని ప్రబోధించేట్లు చేసి దానవులను ధర్మభ్రష్టులనుచేసే ప్రణాళికను రచించాడు విష్ణువు. దానవులు ధర్మాన్ని విడిచారు. ఇప్పుడు శివుడు బయలుదేరాడు త్రిపురాసురులను సంహరించడానికి, విష్ణువు, బ్రహ్మ ఇంకా ఇతర దేవతలతో కూడి. శివుడు ఒక్క బాణంతో ఆ మూడు పురాలు కలిసి ఉన్నప్పుడు వాటిని భస్మం చేసాడు. అలా త్రిపురాసురసంహారం జరిగింది.

12.14 క్షీరసాగరమథనం – అమృతపానం:

ఈ దేవదానవుల మద్య వైరం ఎప్పుడూ ఉండేదే. దానవులలో క్రూరత్వమెక్కువగా ఉండటాన, దేవతలు బ్రహ్మ ద్వారా విష్ణువుతో మొరపెట్టుకోగానే విష్ణువు ధర్మపక్షపాతిగా దేవతలకు చక్కని ఉపాయాలందిచ్చి, వారిని రక్షిస్తుంటాడు. చాక్షుషమన్వంతరంలో, ఒకసారి దుర్వాసమహర్షి శాపంవల్ల ఇంద్రాది దేవతలు స్వర్గం కోల్పోయారు, నిస్తేజులై బలహీనులైపోయారు. వారు బ్రహ్మతో మొరపెట్టుకోగా, బ్రహ్మవారితో కలిసి అజితుని పేర అవతరించిన విష్ణువుని వేడుకోగా, అమృతం కోసం క్షీరసాగర మథనం గావించమని ఉపాయం చెప్పాడు అజితునిగా నున్న విష్ణువు దేవదానవులిరువురూ మథనం చేస్తున్నప్పుడు, వాసుకి తాడుగా ఉండగా, కవ్వంగా ఉన్న మందరపర్వతం పడిపోకుండా, ఆ విష్ణువే కూర్మంగా గూడా మారి ఆధారమై, అమృతం లభించాక అది దానవులు లాక్కుంటే, ఆయనే మోహినీ అవతారమెత్తి దానవుల నుండి అమృతపాత్ర తీసుకుని, అంతా దేవతలకే పంచిచ్చి వారిని కాపాడాడు. అలా విష్ణురక్షణ దేవతలను కాపాడుతోంది. ఈ క్షీరసాగర మథనంలో అమృతమే కాదు చాలా లభించాయి. ముందుగా హాలాహలం పుడితే శివుడు దాన్ని మింగి లోకాలను రక్షించాడు. తరవాత అమూల్యమైన కామధేనువు, ఐరావతం, ఉచ్చైశ్రవం, కల్పవృక్షం అప్సరసలు, చంద్రుడు, సిరులతల్లి లక్ష్మీదేవి, వారుణి, చివరగా అమృతపాత్రతో ధన్వంతరి పుట్టారు. దేవాసురుల మధ్య జరిగిన కొన్ని యుద్ద సంఘటనలను గూర్చి తెలుసుకున్నాం ఈ అధ్యాయంలో. తర్వాతి అధ్యాయంలో యుగధర్మాలను గూర్చి తెలుసుకుందాం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here