దివినుంచి భువికి దిగిన దేవతలు 14

0
6

[box type=’note’ fontsize=’16’] మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞాన రహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రచన చేశారు డా. ఎం. ప్రభావతీదేవి. [/box]

కలియుగాదిలో గల కొందరు మహనీయులు

14.0 కలియుగప్రారంభంలో భారతదేశం:

[dropcap]కిం[/dropcap]దటి అధ్యాయంలో యుగధర్మాలు, కలియుగ లక్షణాలు, మ్లేచ్ఛజాతి యొక్క ఆవిర్భావం, శని, రాహు కేతువుల ప్రభావం మానవులపై ఎలా ఉంటుందన్న విషయాలు తెలుసుకున్నాం. కృతయుగంలో ధర్మం 4 పాదాలమీద, త్రేతాయుగంలో 3 పాదాలమీద నడిచింది. వాటికి వ్యతిరేకంగా కలిలో ధర్మం ఒక్క పాదం మీద మాత్రమే నడుస్తుంది. మూడు పాదాల అధర్మంతో, పాపంతో ఈ కలిలో అంతా దోషభూయిష్టంగానే ఉంటుంది. కృత, త్రేతా, ద్వాపరాల్లో రాక్షసులు విడిగా పుట్టేవారు. కానీ కలిలో మానవుల మనసుల్లో దూరి దురాగతాలు చేయిస్తారుట. ఈ కలి మొదటిపాదంలోనే మ్లేచ్చజాతి వారసులైన విదేశీ మతస్థులు మన భారతదేశం మీద అధర్మ, అక్రమ దాడులు జరిపి మన ధర్మం మీదా, సంస్కృతీ సంప్రదాయాల మీదా కోలుకోలేని దెబ్బకొట్టారు. విదేశీయుల్లో ముఖ్యంగా ఆంగ్లేయులు మన దేశచరిత్రనే వక్రీకరించి, మన దేశచరిత్ర యొక్క కాలగణనాల్లోనే మార్పులు చేసారు. శ్రీకోట వేంకటాచలంగారు ఎంతో పరిశోధించి సరైన కాలగణనాలను మనకు అందించారు వారి పుస్తకమైన ‘కలిశక విజ్ఞానము’ ద్వారా. అవే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందువల్ల మన దేశచరిత్రలోని సత్యాసత్యాలను గురించి మనకిప్పుడు తెలుస్తాయి. ఆంగ్లేయుల దురాగతాల్ని సందర్భాన్ని బట్టి తర్వాతి అధ్యాయాల్లో తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో కలియుగ ప్రారంభకాలం గురించి, కొందరు భారతవీరుల జీవితకాలాల గురించి, కలియుగాదిలో ఉద్భవించిన కొందరు మహనీయుల గురించి కొన్ని వివరాలున్నాయి. వాటికన్న ముందుగా ఇప్పటి వరకూ గడిచిన కాలం గురించి తెలుసుకుందాం.

14.1. ఇప్పటివరకూ గడిచిన కాలం:

బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాక ఎన్నో మన్వంతరాలు గడిచాయి. ఇప్పుడు 7వదైన వైవస్వత మన్వంతరం నడుస్తోంది. ఇందులో చాలా యుగాలు గూడా గడిచాయి. ప్రస్తుతం 28వ మహాయుగం జరుగుతోంది. ఇందులో కృత, త్రేత, ద్వాపరాలు గడిచి కలియుగం ప్రథమపాదం నడుస్తోంది. ప్రస్తుతం మనం కలిశకం 5119/5120లో ఉన్నాం. ప్రస్తుతం మనకు ఆంగ్ల సంవత్సలరాల లెక్కల ప్రకారం 2019-20 నడుస్తోంది కాబట్టి దాన్ని కలిశకంలో చెప్పుకోవాలంటే కలిశకం (క.శ.) 5119 అని కొందరంటున్నారు, కొందరు 5120 అనంటున్నారు. భారతీయులకు అనేక శకాలకు సంబంధించిన కాలనిర్ణయాలున్నాయి. ఉదా: కలి శకం, యుధిష్ఠిర శకం, విక్రమ శకం, శాలివాహన శకం మొదలైనవి. కానీ ఆంగ్లేయుల పాలనలో ఉన్నప్పటి నుంచి అనుసరిస్తున్న వాళ్ళ కాలనిర్ణయ లెక్కలనే, ప్రస్తుతం గూడా మనం వాడుతున్నాం. అవి వాళ్ళకి సంబంధించిన పేర్లలోనే ఉన్నాయి – బి.సి., ఎడి అని. ఐతే వీటిని ఇప్పుడు Before Common Era ( బి.సి.ఇ.) సామాన్యశక పూర్వం, Common Era (సి.ఇ.) సామాన్యశకం అంటున్నారు. అందుకు ఇక్కడ బి.సి. ఇ.సి.ఇ. అని ఇవ్వడం జరిగింది.

14.1. భారతదేశ చరిత్ర రెండు రకాలు:

భారతీయుల కాలనిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచేదిగా ఉంది. సృష్టి మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ గూడా లెక్కలున్నాయి. భారతవర్షచరిత్రను రెండు భాగాలుగా విభజించవచ్చు: 1. చరిత్రకందని ప్రాచీనకాలపుచరిత్ర. అది క్లుప్తంగా పురాణాల రూపంలో భద్రపరచబడింది. 2. చారిత్రకము, అనగా మన ఆధునిక చరిత్రకారుల దృష్టికి అందగలిగినది. అది బి.సి.ఇ.4938 సంవత్సరం అని అంటారు. ఈ చారిత్రక కాలం నిర్ణయించడానికి కలి ప్రారంభ కాలాన్ని ప్రాతిపదికగా తీసికోవచ్చు. భారతవర్ష చరిత్రలో కలిప్రారంభ సంవత్సరం అతిముఖ్యమైంది. దాన్ని కలిశక ప్రారంభం అని మనవాళ్ళంటారు. దాన్ని కృష్ణ నిర్యాణం జరిగిన రోజు నుండి గణనలోకి తీసికున్నారు. దాన్ని బి.సి.ఇ. 3102గా లెక్కలోకి తీసుకున్నారు మనవారు.

14.2. కలిశక ప్రారంభ కాలం:

భారతయుద్ధం కలిపూర్వం 36 సంవత్సరంలో జరిగింది. భారతయుద్ధం తర్వాత ధర్మరాజుకు (యుధిష్ఠిరుడు) పట్టాభిషేకం జరిగింది. ఈయన హస్తినాపురాన్ని పరిపాలిస్తున్న 36వ సంవత్సరంలో శ్రీకష్ణ నిర్యాణం జరిగింది. ఆరోజునే కలిప్రవేశం జరిగింది. అప్పటి నుండే కలిశక ప్రారంభమని జ్యోతిశ్శాస్త్రవేత్తలంతా నిర్ధారించారు. ఈ సంవత్సరంలోనే అర్జునుని కుమారుడైన అభిమన్యుని కొడుకైన పరీక్షిత్తుకు రాజ్యాభిషేకం చేసి పాండవులు రాజత్యాగం చేసి స్వర్గారోహణ కావించారని భారతంలో ఉంది. పరీక్షిత్తు మహారాజు తక్షకుడి కాటుతో మరణించాక ఆయన పుత్రుడైన జనమేజయుడు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. కొన్ని కారణాల వల్ల జనమేజేయుని కాలంలోను, ఆ తర్వాత ఆయన పుత్రుడైన శతానీకుని కాలంలోనూ హస్తినాపురం పూర్వవైభవం కోల్పోయింది. ఆ సమయంలో మగధకు ప్రాచుర్యం లభించింది. యుధిష్ఠిర శకం అంటే కలిపూర్వం 36 సంవత్సత్సరాలు. యుధిష్ఠిరుడు హస్తినను పాలిస్తున్న కాలంలో మగధను సోమాపి పాలించాడు, అయోధ్యను బృహత్సేనుడు లేదా బృహద్బలుడు అన్న రాజు పాలించాడు.

1.కలిశక ప్రారంభం:

శ్రీకృష్ణ నిర్యాణంతో కలిశకం ప్రారంభం. అది కలి1 సంవత్సరం -బి.సి.ఇ.3102 సంవత్సరం. కలిప్రవేశం 20.2.3102, రాత్రి 2గంటల 27నిమిషాల 30 సెకన్లకు జరిగింది. కలియుగ ప్రారంభ విషయంలోగూడా కొన్ని సందేహాలున్నాయి. ఇక్కడిచ్చిన తేదీలో 20.2 అనుంది. అంటే అది మాఘమాసమైయ్యుండాలి. కానీ సాధారణంగా యుగాది చైత్రమాసంలో వస్తుంది. అందుకు అది 20.3.3102 అని అంటే సరిగా ఉంటుందని కోట నిత్యానందగారి పరిశోధనలో తేలింది.

2. మహాభారతానికి సంబంధించిన కొందరి వీరుల వయస్సులు:

భీష్ముని వయస్సు యవరాజ్యపట్టాభిషేకం నాటికి 30 సంవత్సరాలు

తన తండ్రిని సత్యవతికిచ్చి వివాహం చేసినప్పటి వయస్సు 40 సంవత్సరాలు

సత్యవతకి సంతానం కలుగునాటికి 50 సంవత్సరాలు.

సవతి తమ్ములకి 30 సంవత్సరాలు వచ్చి, అంబికా అంబాలికలనిచ్చి వివాహం చేసిననాటికి 80 సంవత్సరాలు

ధృతరరాష్ట్ర. పాండురాజుల జననం నాటికి 105 సంవత్సరాలు

వారి వివాహమప్పటికి 135 సంవత్సరాలు

ధర్మరాజు జననకాలం నాటికి 145 సంవత్సరాలు

మహాభారత యుద్ధ సమయానికి 236 సంవత్సరాలు

భీష్ముడు జీవించిన కాలం దాదాపు 236 సంవత్సరాలు ఉండచ్చని పండితుల అంచనా.

శ్రీకృష్ణుడు జీవించిన కాలం 126 సంవత్సరాలు

ధర్మరాజు జీవించిన కాలం 152 సంవత్సరాలు

భీముడు జీవించిన కాలం 151 సంవత్సరాలు

అర్జునుడు జీవించిన కాలం 150 సంవత్సరాలు

నకుల, సహదేవులు జీవించిన కాలం 149 సంవత్సరాలు

ద్రౌపది జీవించిన కాలం 130 సంవత్సరాలు

భారతయుద్ధం జరిగిన కాలం: శోభకృతు సంవత్సర, కార్తీక బహుళ 30, మంగళవారం నుండి మార్గశిర బహుళ 2 వరకు 18 రోజులు.

భీష్మ నిర్యాణం: శోభకృతు మాఘశుద్ధ అష్టమి, రోహిణి 3వ పాదం, పగలు 12 గంటలు – అభిజిన్ముహూర్తం.

3.కలిశకం ప్రారంభంలో నున్న కొందరు మహనీయులు:

కలిశక ప్రారంభంలో వేదవ్యాస, శ్రీశుక, పైల, జైమిని, సుమంత, వైశంపాయన, యాస్క, తిత్తిరి మొదలగు మహనీయులున్నారు.

4. కలి 4వ శతాబ్దంలో ఉన్న కొందరు మహనీయులు:

కలి 4వ శతాబ్దంలో పాణిని, ఉపకర్షణ, కాత్యాయన, బోధాయన, ఆపస్తంభ, హిరణ్యకేసు, వ్యాది (నిఘంటుకారుడు) మొదలగు మహనీయులున్నారు.

5. వేదభాష (దేవభాష) – పాణిని సంస్కృతం:

వేదం గీర్వాణభాష (దేవభాష) లో ఉంటుంది. సృష్టి ప్రారంభంలో స్వాయంభువ మనువు మొదలైనవారు మాట్లాడిన భాష దేవభాష. అదే భూలోకంలో మొదటిగా వాడబడింది. కాలం గడుస్తున్నకొద్దీ మాట్లాడుతున్న భాషలో విద్యాహీనులైన మానవుల వల్ల అపశబ్దాలుచ్చరింపబడ్డంవల్ల క్రమంగా భాష కలుషితమైంది. అది వేరే భాషగా మార్పు చెందసాగింది. అప్పుడప్పుడు పండితులు సంస్కరించి వ్యాకరణాలు తయారుచేసి భాషను ఛందోబద్ధం చేసేవారు. అవన్నీ కాలగర్భంలో లీనమయిపోయాయి. సామాన్య జనుల వల్లే ఈ భాషకాస్తా పలుభాషలుగా రూపాంతరం చెందింది. కాలక్రమేణ ఈ కలియుగంలో నాల్గవ శతాబ్దంలో పాణిని మహర్షి భాషను సంస్కరించాడు. పాణినిమహర్షి గొప్ప శివభక్తుడు. కేదారక్షేత్రంలో శివునిగూర్చి ఘోరమైన తపస్సు చేసాడు. దానికి మెచ్చి శివుడు తన ఢమరుకం ద్వారా మహేశ్వర సూత్రాలను ప్రసాదించాడు. వాటిని ఆధారం చేసుకుని ఆయన వ్యాకరణ శాస్త్రాన్ని రచించాడు. పాణిని మహర్షి అప్పటి కాలపు ప్రజలలో ప్రచారంలో నున్న భాషను సంస్కరించి దానికి సంస్కరింపబడిన భాష గనక ‘సంస్కృతం’ అని పేరుపెట్టాడు. సంస్కృతం దేవభాషను అనుసరించి వున్నా సంస్కృత పండితులకు దేవభాషలో ఉన్న వేదాలర్థం కావు.

6. ఆర్యభట్ట:

ఆర్యభట్ట (ఆర్యభట) దక్షిణ భారతంలో కేరళకు చెందినవాడు. ఉజ్జయినిలో విద్యాభ్యాసం చేస్తాడు. ఆయన తన గ్రంథమైన ఆర్యభటీయంలో తన వయస్సు గురించి తెలియజేసాడు : ఆయన వయస్సు కలియుగం 60X6=360 సంవత్సరాలకి 23 సంవత్సరాలు. అంటే ఆర్యభట్టు బి.సి.ఇ. 2719/20 సంవత్సరంలో పుట్టాడు. రఘువంశ కర్తయైన కాళిదాసు (1వ కాళిదాసు) తన గ్రంథమైన ‘జ్యోతిర్విదాభరణం’లో ఆర్యభట్టును ప్రశంసించాడు. అంటే ఈయన చాలా ప్రాచీనుడన్నమాట. కానీ ఆంగ్లేయులు ఈయన కాలాన్ని తప్పుగా నిర్ణయించి బి.సి.ఇ. 500 సంవత్సరాలకు తెచ్చారు.

7. జైనమతం:

జైనమత మూలపురుషుడైన జినుని యొక్క శకం కలి 468 సంవత్సరం (బి.సి.ఇ. 2635)లో ప్రారంభమైందని అంటారు. దాన్ని జైన యుధిష్ఠిర శకం అన్నారు. కానీ జైనులు ఋషభమహర్షిని మొదటి తీర్థంకరుడిగా పూజిస్తారు. ఈయన చాలా ప్రాచీనకాలానికి – కోటానుకోట్ల సంవత్సరాల క్రితానికి చెందినవాడు. ఈయన వంశవృక్షం: బ్రహ్మ పుత్రుడు స్వాయంభువ మనువు. ఆయన కుమారుడు ప్రియవ్రతుడు. ఆయన కుమారుడు అగ్నీధ్రుడు. ఆయన కుమారుడు నాభి. నాభి కుమారుడు ఋషభుడు. ఈయనే ఈ భూమండలమంతా ఒకప్పుడు పాలించాడు. తర్వాత తన కుమారుడైన భరతునికి (ఆయన్నే తరవాత జన్మలో జడభరతుడనేవారు) రాజ్యమప్పగించి తను వానప్రస్థాశ్రమ స్వీకారంచేసి భూత దయకలిగి, దిగంబరుడై పరమహంసలాగ జీవించాడు అడవుల్లో ఈయనతో మొదలై మహావీరుని వరకు మొత్తం 24 మంది తీర్దంకరులు.

ఈ అధ్యాయంలో కలియుగ ప్రారంభంలో ఉద్భవించిన కొందరు మహనీయుల గురించి తెలుసుకున్నాం. వచ్చే అధ్యాయంలో కొన్ని క్షత్రియ సామ్రాజ్యాల గురించి తెలుసుకుందాం. కొందరు ఈ మధ్య కొన్ని కులాల గురించి హేళనగా మాట్లాడుతున్నారు. ప్రత్యేకించి బ్రాహ్మణులగురించి – బ్రాహ్మణులు సమాజానికి ఏమి చేసారని ప్రశ్నిస్తున్నారు. బ్రాహ్మణులు గూడా రాజ్యాలేలారు క్షత్రియుల్లాగ, ధర్మాన్ని నిలబెట్టడానికి అన్న విషయాలు ముందు ముందు తెలుస్తాయి. నాలుగు వర్ణాలవారూ రాజ్యాలేలారు విదేశీ దురాక్రమణల నుండి దేశాన్ని రక్షించుకోడానికి అన్న విషయాలు నెమ్మదిగా తెలుసుకుందాం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here