దివినుంచి భువికి దిగిన దేవతలు 2

0
10

[box type=’note’ fontsize=’16’] మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞానరహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వ్యాస పరంపరని అందిస్తున్నారు డా. ఎం. ప్రభావతీదేవి. [/box]

పరమాత్మ-బ్రహ్మాండసృష్టి

2.0 పరమాత్మ చైతన్యం:

[dropcap]ప[/dropcap]రమాత్మే సర్వజగత్తుకూ మూలకారణం. పరమాత్మ వల్లే ఎన్నోబ్రహ్మాండాలు ఏర్పడ్డాయి. పరమాత్మంటే అనంతమైన స్వయంప్రకాశ స్వరూపం. అదే శుద్ధచైతన్యం. పరంజ్యోతి. దానికి స్ఫురణశక్తి ఉంది. అదే స్పందనశక్తి. చైతన్యమంటే దేనివల్ల సర్వం తెలుస్తుందో ఆ జ్ఞానం – జ్ఞానశక్తి – తెలివి. అదే శుద్ధజ్ఞానం. దాన్నే పరబ్రహ్మ, బ్రహ్మం అని గూడా అంటారు. అదే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని గూడా అంటారు. సత్యమంటే ఎటువంటి మార్పులేకుండా ఎప్పుడూ ఒకేలా ఉండేది, అంటే శాశ్వతమైన ఉనికి. జ్ఞానమంటే సర్వం తెలుసుకునేశక్తి. అనంతమంటే అంతటా నిండి ఉన్నది. దాన్నే ఇంకో విధంగా సత్-చిత్-ఆనందం (సచ్చిదానందం) అన్నారు. సత్ అంటే శాశ్వతమైన ఉనికి. చిత్ అంటే జ్ఞానం. ఆనందమంటే ఆనందమే తప్ప దుఃఖమన్నదే లేనిది. పరమాత్మ స్వరూపమంటేనే ఆనందం, అంతా నేనే అన్న చైతన్యమే ఉంది.

2.1 ప్రకృతి రెండు రకాలు:

ఈ బ్రహ్మాన్ని ఆధారం చేసుకునే ప్రకృతి రెండు రకాలుగా ఉంది: సూక్ష్మ ప్రకృతి, స్థూల ప్రకృతి. ప్రకృతంటే మూడు రకాల గుణాలైన సత్వం, రజస్సు, తమస్సులతో కూడుకొని ఉన్నది. ఇవే త్రిగుణాలంటే. ఇవే మూడు రకాల అహంకారాలంటే. ఈ మూడుగుణాలూ శుద్ధంగానూ ఉంటాయి, కలగలిపి మిశ్రమంగానూ ఉంటాయి. శుద్ద సత్వగుణం ప్రధానంగాగల ప్రకృతిని మాయ అంటారు. ఈ మాయనే శక్తి అంటారు. పరమాత్మలోనే ప్రకృతి కూడా కలిసిపోయింది. ఈ మాయకు ఆధారం ఈ పరమాత్మే.

2.2 పరమాత్మే సృష్టి విషయంలో ఈశ్వరుడు:

పరమాత్మ చైతన్యమే ఈ సృష్టి కంతటికీ మూలకారణ మైనప్పటికీ సృష్టి కారకుడు మాత్రం ఈశ్వరుడు – పరమేశ్వరుడు. పరమాత్మే జగత్తును సృష్టించడానికి శుద్ధసత్వ గుణం ప్రధానంగా గల మాయలో ప్రతిఫలించి ఈశ్వరుడుగా వ్యవహరిస్తున్నాడు. దీన్నే ఈశ్వరచైతన్యమంటారు. అందుకని ఈ కనిపిస్తున్న ప్రపంచమంతా ఈశ్వరచైతన్యంతో కూడుకొని ఉంది. పరమాత్మ ముడిసరుకైతే ఈశ్వరుడు దాన్నుపయోగించి ప్రపంచాన్నంతా కల్పించాడు. నిరాకారుడైన ఈశ్వరుడు తన సంకల్పశక్తితో ప్రపంచాన్ని సృజించాడు. ఆయనకున్నవి ఇచ్చా, జ్ఞాన, క్రియా శక్తులు .ఈశ్వరుడే తన చైతన్యంతో ఈ ప్రపంచాన్నికల్పించాడు. నిజానికి ఆయనే ఈ ప్రపంచంలో కన్పించే అన్నిటి ద్వారా వ్యక్తమౌతున్నాడు. ఆయన సమిష్టి చైతన్యం. ఈ ప్రపంచంలో కన్పించే ప్రతిదానిలో జీవమున్నా, జడపదార్ధమైనా కూడా ఈ ఈశ్వరచైతన్యం- ఆత్మతత్వం-నేను’ అన్న ఉనికి సాక్షిగా ఉంది. ఇది ఉంది కాబట్టే ఏ పదార్ధమైనా ఆ పదార్ధంలాగే కనిపిస్తోంది. ఉదా: ఓ మల్లె మొక్క ఉందంటే దానిలో దాని జీవికకు సంబంధించిన జ్ఞానముంది. ఈశ్వర చైతన్యం ఇంకా బాగా అర్థమవ్వాలంటే సూర్యగోళాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. సూర్యగోళం నిజానికి మండుతున్న అగ్నిగోళం. కానీ మనక్కనిపించేది మటుకూ తెల్లగా ప్రకాశిస్తున్న బింబంలాగుంటుంది. మండే అగ్నిగోళాన్ని పరమాత్మకి ప్రతీకగా తీసుకుందాం. ఆ గోళంనుండి వెలువడే వేడి వాయువుల వల్ల వాతావరణం ఏర్పడి అందులోనుండి తెల్లని సూర్యబింబం ప్రతిఫలిస్తోంది. అయనే ఈశ్వరుడు. ఆయన కిరణాలు చైతన్యవంతమైనవి. వాటివల్లే జీవచైతన్యం- వ్యష్టి చైతన్యం కలిగి అన్నిరకాల జీవులూ ఏర్పడ్డాయి. ఈ కిరణాల వల్లే దేవతలూ, మనుషులూ, రాయీ, రప్పా, చెట్టూ, పుట్టా, క్రిమికీటకాదులూ, రకరకాల జంతుజాలాలూ పుట్టుకొస్తున్నాయి. ఇన్నిటిద్వారా ఈశ్వరుడు వ్యక్తమౌతున్నాడన్నమాట. ఇదే ఈశ్వర చైతన్యమంటే. ఇదే ప్రతి జీవిలో సాక్షి ప్రకాశిస్తున్న ఆత్మతత్త్వం-జీవాత్మతత్వం .

ఇదే విషయాన్ని ఆదిత్యహృదయ స్తోత్రం బోధిస్తోంది.

ఇక్కడ పరమాత్మన్నా, ఈశ్వరుడన్నా సృష్టి విషయంలో తేడా ఉన్నా, ఇద్దరూ ఒకరేనన్న మాట. ఇది అర్థం చేసుకుంటే పరమాత్మన్న పదం వచ్చినా ఈశ్వరుడన్న పదం వచ్చినా భేదం చూపనక్కరలేదు. ఈ ఈశ్వరశక్తినే కొందరు పరమేశ్వరి, పరాశక్తి అని స్త్రీమూర్తిగా గూడా ఉపాసిస్తారు.

2.3 సృష్టికి ముందు ఏముంది?

సృష్టి-స్థితి-లయలు ఎప్పుడూ జరుగుతూ పోతూనే ఉంటాయి. పరమేశ్వరునికి ఇచ్ఛ కలిగినపుడు సృష్టి చేస్తూ ఉంటాడు. కొంతసేపు ఆ సృష్టి నిలిచి ఉంటుంది. కొంతకాలానికి అది పరమాత్మలో లయించిపోతుంది. దాన్ని ప్రళయమంటారు. ప్రళయంలో అంతా జలమయం, చీకటిమయం. ఇదీ సృష్టికి ముందుండేది.

2.4 సృష్టి ఆరంభం:

ఇప్పుడు ఈశ్వరుడే సృష్టి, స్థితి, లయలకి కారకుడు కాబట్టి ఆయన ద్వారానే సృష్టి జరగాలి. అందుకనే సృష్టి ఆరంభంలో పరమేశ్వరునికి ఇచ్చకలిగింది:  “ఏకమైన నేను అనేకం కావాలి” అని. ఇలా సృష్టి ఆరంభమైంది.

2.5 సృష్టికి కారణం:

కర్మలను బట్టి జీవులకు జన్మలొస్తుంటాయి. జీవుల కర్మఫలాలు పరిపక్వానికి రాగానే వాటికి తగ్గ ఫలితాల్ని ఈశ్వరుడే ఇస్తాడు. ఆయన తన సంకల్పశక్తితో ఒక క్రమపద్ధతి ప్రకారం ప్రపంచ సృష్టి చేస్తాడు. అనుకున్న వెంటనే ఈ ప్రపంచమేర్పడలేదు. ప్రపంచమేర్పడాలంటే ప్రకృతుండాలి ముందు. ఈ ప్రకృతిలా ఏర్పడ్డానికి చాలా కాలం పట్టింది. ప్రళయకాలపు జలమంతా ఎండాలి, జీవులకు తగిన స్థలాలేర్పడాలి, ప్రళయకాలపు చీకట్లు పోవాలంటే వెలుగులు విరజిమ్మాలి. ఇదంతా జరగాలంటే ఎంత కాలం పట్టుండచ్చో! ఎవరూహించగలరు?

2.6 సూక్ష్మపంచభూతసృష్టి:

ఈశ్వరునివల్ల ముందుగా సూక్ష్మసృష్టి ఏర్పడింది. ఇక్కడ పరమాత్మ చైతన్యం అవ్యక్తంగా ఉంది. అది కంటికి కనిపించేది కాదు. దాన్నుండి మహత్తత్వం (మాయ) వ్యక్తమైంది. మహత్తు నుండి అహంకారం కలిగింది మూడు రకాలుగా. అవే సత్వ, రజో, తమో గుణాలతో కూడుకున్నవి. ఈ మూడు రకాలైన గుణాల కలయికల వల్ల 5 రకాలైన తన్మాత్రలు ఏర్పడ్డాయి. వాటినే పంచతన్మాత్రలంటారు: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. నిజానికివే సృష్టికి అవసరమైన ద్రవ్యశక్తులు. వీటితో సూక్ష్మ పంచభూతసృష్టి జరిగింది. అంటే ఈ పంచతన్మాత్రలు ద్రవ్యశక్తులుగా గల పంచభూతాలేర్పడ్డాయి: ఆకాశం, వాయువు, అగ్ని (తేజస్సు), జలం, పృథ్వి (భూమి). అంటే సృష్టికి అవసరమైన సూక్ష్మ ముడిసరుకేర్పడింది. అంటే మూలప్రకృతేర్పడింది. సూక్ష్మదశలో ఇవన్నీ విడివిడిగా ఉన్నాయి. తన్మాత్రంటే అంకుర శక్తి కలది- బీజరూపం కలది. విత్తనంలో మొలకెత్తే తత్త్వం లాంటిది. ఉదా: ఓ విత్తనం పాతి నీరు పోస్తే కొంత కాలానికి అది రెండుగా చీలిపోయి మధ్యలోగల బీజతత్త్వం బయటపడి అంకురించి చెట్టుగా ఎదుగుతుంది. ఈ ఎదుగుదల శక్తివల్లే ఆ విత్తనం చెట్టుగా మారుతుంది. ఆ బీజంలోనే చెట్టు ఎదుగుదల తత్త్వమంతా ఇమిడుంది. అదే మూలకారణం – ముడిసరుకు. ఆ బీజతత్వమే ఈశ్వర చైతన్యమంటే. అదే దానిలోని జ్ఞానశక్తి – ప్రజ్ఞాశక్తి. నిద్రాణమై ఉండే రాయిలాంటి పదార్దంలో గూడా రాయి తయారవడానికి గల జ్ఞానం- ప్రజ్ఞ ఇమిడిపోయుంది. సూక్ష్మ పంచభూతాల యొక్క సాత్వికాంశంనుండి పంచ జ్ఞానేంద్రియాలేర్పడ్డాయి: చెవి, చర్మం, కళ్ళు, నాలుక, ముక్కు. సమిష్టి జ్ఞానేంద్రియాల వల్ల అంతఃకరణ చతుష్టయమేర్పడ్డాయి: మనసు, బుద్ది, చిత్తం, అహంకారం. సూక్ష్మ పంచభూతాల యొక్క రాజసికాంశం నుండి పంచ కర్మేంద్రియాలేర్పడ్డాయి: వాక్కు, చేతులు, పాదాలు, గుదం, ఉపస్థ. సమిష్టి కర్మేంద్రియాల వల్ల పంచ ప్రాణాలేర్పడ్డాయి.

2.7 స్థూల పంచభూత సృష్టి:

ఇంతవరకు కంటికి కనబడని సూక్ష్మ ప్రపంచానికి అవసరమైన సూక్ష్మ పంచభూతాలేర్పడ్దాయి. సూక్ష్మపంచభూతాలు కంటికి కనపడవు. కానీ ఇప్పుడవి కంటికి కనబడాలంటే వాటి సూక్ష్మత్వం తగ్గి స్థూలత్వం రావాలి. సూక్ష్మ దశలో వేటికవి విడిగానున్న వాటిల్లోని తమోగుణాంశాలు కలిసిపోవడంవల్ల స్థూలత్వం కలిగింది. అంటే ఈ సూక్ష్మపంచ భూతాల్లోగల 5 తమోగుణాంశాలను విడదీసి ఈ ఐదింటిని బాగా కలపగా అవి కలిసిపోయాయి. అందువల్ల స్థూలత్వమేర్పడింది. సృష్టి దశలో ఈ మూలప్రకృతి-సూక్ష్మప్రకృతి, స్థూలప్రకృతిగా వ్యక్తమైంది. మన కంటికి కనపడని సూక్ష్మప్రపంచమంతా కనపడేదిగా తయారైంది. ఈశ్వరశక్తే సృష్టి దశలో ప్రపంచంగా వ్యక్తమైంది. సూక్ష్మ దశలో విడివిడిగానున్నపంచభూతాలన్నీ స్థూలదశలో ఒకదాంట్లో ఇంకోటి కలిసిపోయాయి. దీన్నే పంచీకరణమంటారు.

2.8 పంచభూతాల పంచీకరణమే ప్రపంచీకరణం:

పంచీకరణమంటే 5 గా తయారుచేయడం. పంచభూతాలు ఒక్కొక్కటిని 2 భాగాలు చేసి, అందులో ఒక భాగాన్ని మరలా 4 చేసి మిగతా నాలుగింటిలో ఒక్కక్క అంశన్నీ కలుపుతూపోవడం. అలా జరిగితే ప్రతిదానిలోని అర్ధభగం, మిగతా 4 భాగాలతో కలిసి ప్రతి ఒకభూతమూ పంచభూతాత్మకంగా తయారౌతుంది ఈ కిందివిధంగా:

ఈ పంచభూతాల్లో ఏ ఒక్కటీ స్వచ్ఛమైంది కాదు. అన్నీ కల్తీ చెందినవే. ఉదా: ఆకాశం సగమైతే మిగతావన్నీ కొంచెం కొంచెమే. భూమిలో సగమే భూమి. మిగిలిన సగంలో జలం, అగ్ని, వాయువు, ఆకాశాల అంశాలు కలిసిపోయుంటాయి. స్థూలప్రపంచమంతా ఇన్ని మిశ్రమాలతో కూడుకొనుందన్నమాట. సృష్టిలో ప్రతి జీవిలోనూ ఈ పంచభూత తత్త్వాలు కనిపిస్తాయి. ప్రపంచమంటేనే పంచభూతాత్మకమైందని అర్థం. ఈవిధంగా ఈ స్థూలప్రపంచంలో చీమ నుండి బ్రహ్మ వరకూ గల 84 లక్షల జీవరాసులూ ఏర్పడ్డాయి. ఇదంతా ఈశ్వర సంకల్పశక్తి వల్ల జరిగింది. ఇదంతా ఇలా ఏర్పడ్డానికి ఎంతకాలం పట్టిందో! ఇప్పుడు ముడిసరుకంతా తయారుగాఉంది. ఇంకొక్క సారి ఈ ప్రపంచమేర్పడిన విధానం చూద్దాం. ముందుగా సూక్ష్మ ప్రపంచం: పరమాత్మ నుండి మహత్తు (మాయ). మహత్తునుండి త్రిగుణాలతో అహంకారం (అహంవృత్తి – జీవుడు). అహంకారం నుండి పంచతన్మాత్రలు: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల వల్ల పంచభూతాలు: నింగి, గాలి, నిప్పు, నీరు, భూమి. పంచభూతాల సాత్వికాంశంనుండి ఙ్ఞానేంద్రియాలు: చెవి, చర్మం, కళ్ళు, నాలుక, ముక్కు. సమిష్టి జ్ఞానేంద్రియాల వల్ల అంతఃకరణ చతుష్టయం: మనోబుద్ధి చిత్తాహంకారాలు. పంచభూతాల రాజసికాంశం నుండి పంచకర్మేంద్రియాలు: వాక్కు, చేతులు, పాదాలు, గుదం-పాయు (మలవిసర్జకావయవం), ఉపస్థ (మూత్రావయవం). సమిష్టి కర్మేంద్రియాలవల్ల పంచప్రాణాలు: ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యానాలు. స్థూలప్రపంచం: ఈ సూక్ష్మ పంచభూతాల్లో గల 5 తమోగుణాంశాల సమ్మేళనంవల్ల స్థూలత్వం వచ్చింది. అంటే పంచభూతాల పంచీకరణంవల్ల స్థూల ప్రపంచమేర్పడింది.

పంచభూతాలకి ప్రత్యేక గుణాలు-లక్షణాలున్నాయి. అవి:

పంచభూతాలు గుణాలు
ఆకాశం శబ్దం
వాయువు శబ్దం, స్పర్శ,
అగ్ని శబ్దం, స్పర్శ, రూపం,
జలం శబ్దం, స్పర్శ, రూపం, రసం,
భూమి శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం

ఆకాశం కన్నా వాయువు స్థూలం. వాయువు కన్నా అగ్ని స్థూలం. అగ్ని కన్నా జలం స్థూలం. జలం కన్నా భూమి స్థూలం. పరమాత్మ నుండి ప్రపంచం ఈ విధంగా వ్యక్తమైంది, అన్ని రకాల జీవులూ సృష్టింపబడ్డారు. ఇప్పటికి ఎన్నో సృష్టులు జరిగాయి. అన్నీ ఒకే విధంగా ఉండవని మన ఆధాత్మిక గ్రంథమైన ‘యోగవాసిష్ఠము’ లో ఉంది. దాన్ని తెలుసుకుందాం.

2.9 అనేక రకాల సృష్టులు:

సృష్టి ఎప్పుడూ ఒకేవిధంగా జరగదు, అనేక రకాలుగా జరుగుతుందిట. అందుకే కాబోలు మన పురాణాల్లో కథలన్నీ ఒకేలాగుండవు. మనకు అనేక సందేహాలు కలుగజేస్తాయి. అసలు మనకు మన ధర్మం మీదే అపనమ్మకం కలగజేసేట్టుంటాయి. ఇక్కడ కొన్నిరకాల సృష్టుల గురించి తెలుసుకుందాం:

  1. ఎన్నో సృష్టులు జరిగాయి బ్రహ్మకల్పాల్నిబట్టి. అన్ని సృష్టుల్లో బ్రహ్మదేవుడే సృష్టికర్తగా లేడు. శివుడు, విష్ణువు, మునులు గూడా సృష్టి నిర్మాణం చేసారు. బ్రహ్మదేవుని ఆవిర్భావం గూడా ఎప్పుడూ ఒక్కలాగ జరగలేదు. ఆయన విష్ణు నాభి కమలంలోంచే కాక, జలం, అందం, ఆకాశాలనుండి గూడా ఉద్భవించాడు.
  2. ఈ వివిధ రకాల సృష్టుల్లో పంచభూతాల సృష్టి గూడా ఒకే విధంగా జరగలేదు. రకరకాలుగా జరిగింది. ఒక సృష్టిలో మొదట ఆకాశం కలిగితే, ఇంకొన్నిసృష్టుల్లో మొదటగా భూమి, జలం, అగ్ని, వాయువు ఇలా కలిగాయి. అంటే ఒక సృష్టిలో మొదటగా భూమి పుడితే ఇంకో సృష్టిలో మొదటగా జలం పుట్టింది. భూమి గూడా ఎప్పుడూ ఒకేలాగ లేదు. ఒకసారి మట్టితో, ఇంకోసారి రాతితో, మరోసారి బంగారంతో, ఇంకోప్పుడు మాంసంతో నిండి ఉండేదిట. బ్రహ్మకల్పాల్నిబట్టి ఇలా జరుగుతూండచ్చు. బ్రహ్మకల్పమంటే ఏమిటో తెలుసుకుందాం.

2.10 బ్రహ్మకల్పం:

మానవులకి 100 సంIIలు పూర్ణాయుర్దాయమున్నట్లే బ్రహ్మదేవునికిగూడా 100సంIIలు పూర్ణాయుర్దాయం. బ్రహ్మకు ఒక రోజంటే 1పగలు +1రాత్రి. ఆయన పగటిపూట సృష్టిచేస్తాడు. దాన్ని సృష్టికల్పమంటారు. కొంతకాలమది నిలిచుంటుంది. రాత్రిపూట ఆ సృష్టంతా ప్రళయంలో లయించిపోతుంది. దాన్ని క్షయకల్పమంటారు. అది కొంతకాలముంటుంది. మళ్ళీ సృష్టికల్పం మొదలౌతుంది. అది కొంతసేపుంటుంది. మళ్ళీ ఆ సృష్టంతా ప్రళయంలో లయించిపోతుంది. ఇవే సృష్టి, స్థితి, లయలంటే. బ్రహ్మలోకంలోని కాలమానం, మానవలోకంలోని కాలమానమొకలాగుండవు. వేరుగా ఉంటాయి. బ్రహ్మకు ఒక రోజంటే మానవలోకంలో 8,64,00,00,000సంIIలు. బహ్మకు ఒకరోజంటే మనకు కోటానుకోట్ల ఏళ్ళన్నమాట. ఇలాంటి ఒక్కరోజు బ్రహ్మకు ఒక్కకల్పమన్నమాట. ఇప్పటికిలాంటి కల్పాలెన్ని జరిగి లయించిపోయాయో! ఇలాంటి సృష్టికర్తలు -బ్రహ్మలు ఎందరు గతించారో పూర్వ సృష్టుల్లో! అంతా మాయగా అనిపిస్తుంది! ఇందులో మనం పంచభూతాల సూక్ష్మ, స్థూల సృష్టుల గురించి కొంత తెలుసుకున్నాం. ఈ సందర్భంలో బ్రహ్మదేవుడు నిరాకార బ్రహ్మంనుంచి సాకార బ్రహ్మగా ఎలా ఆవిర్భవించాడో తెలుసుకోవాలి.

2.11 బ్రహ్మదేవునికి శరీరం వచ్చిన విధానం:

సృష్టికి ముందు అంతా నిరాకారమైన ఆత్మతత్త్వమే – శద్దచైతన్యమే – బ్రహ్మమే ఉంది. ఈ నిర్గుణ బ్రహ్మంనుండి సాకార బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. అదెలా జరిగిందన్నది యోగవాశిష్ఠంలో చక్కగా వివరించారు. ఆత్మతత్వం స్వశక్తి వల్ల జీవరూపం ధరించింది-బుద్దిరూపంధరించింది. ఆత్మయొక్క ప్రకాశం బుద్దిలో ప్రతిఫలిస్తేనే జీవుడంటారు. జీవుడంటే ‘అహం’ వృత్తి- ‘అహం’ స్ఫురణ – ‘నేను’ అన్న భావన. జీవుడిలోగల వాసనలు (పూర్వజన్మల సంస్కారాలు) చలించగా సంకల్ప వికల్పాలగు మనసుగా రూపొందింది. ఈ మనసే ఎన్నో రూపాలు ధరించింది ఈ కింది విధంగా:

  1. మనసు శబ్దతన్మాత్రను భావించి ఆకాశ రూపం పొందింది.
  2. ఆకాశ రూపం పొందిన మనసు స్పర్శగుణాన్ని స్మరించి వాయురూపం పొందింది.
  3. ఆకాశంలోగల వాయువుల సంఘర్షణల వల్ల ఆ మనసే రూపగుణం గల అగ్నిగా రూపొందింది. ఇంతవరకూ రూపంలేని వాటికి అగ్ని-తేజస్సు రూపాన్ని కలిగించింది.
  4. ఇలా రూపాంతరం చెందిన మనసే జలసంవేదనం వల్ల జలరూపం పొందింది.
  5. జలరూపం పొందిన మనసే గంధతన్మాత్రను స్మరించి పృథ్వి రూపం పొందింది.
  6. ఇలా పంచతన్మాత్రలు కలిగిన పంచభూతాలతో కూడిన మనసు అగ్నికణం లాంటి శరీరాన్ని ఆకాశంలో చూసేదిగా రూపొందింది.
  7. ఇప్పుడు ఈ శరీరం పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, బుద్దిగల సూక్ష్మ శరీరంగా రూపొందింది.
  8. ఈ శరీరమే తీవ్రమైన వాసనాబలం వల్ల ప్రకాశవంతమైన శరీరాన్ని – తేజోపుంజాన్ని స్మరించి పరిపాకవశాన స్థూలత్వాన్ని పొందింది.
  9. బంగారురంగులో ఆకాశంలో ప్రకాశిస్తున్న ఈ తేజోపుంజానికి తల, చేతులు, కాళ్ళు కలిగి ఓ ఆకారంగా రూపొందింది.
  10. ఈ ఆకారమే కాలక్రమేణా స్పష్టత సంతరించుకొని నిర్మలరూపం పొంది, బుద్ది, బలం, ఉత్సాహం, విజ్ఞానం, ఐశ్వర్యమనే గుణాలతో కూడి సర్వలోకాలకు పితామహుడనే బ్రహ్మదేవుడిగా పేరుగాంచింది.
  11. త్రికాలజ్ఞుడైన బ్రహ్మ అనంతాకాశంలో సృష్టి దేనితో మొదలుపెట్టాలా అని సంకల్పించి ధ్యానం చేయగా, పూర్వం గతించిన భూతజాలమంతా కనిపించింది. సమస్త ధర్మజాలాన్ని స్మరిస్తూ లీలామాత్రంగా, నానావిధాల ప్రజలనూ సంకల్ప మాత్రాన సృజించాడు. ప్రజలకు ధర్మార్ధకామసిద్ది కొరకు, భోగ, మోక్షంకొరకూ అనేక శాస్త్రాలను కల్పించాడు. ఈ విధంగా బ్రహ్మస్వరూపమైన మనసునుండి ఈ సృష్టంతా కల్పించబడింది. ఇదే బ్రహ్మకల్పమంటే.

2.12 బ్రహ్మాండం యొక్క ఆవిర్భావం:

ఈ ప్రపంచమంతా సృష్టి, స్థితి, లయలకు ఎప్పుడూ గురౌతూనే ఉంటుంది. సృష్టి దశలో వ్యక్తమైన ప్రపంచం లయ- ప్రళయ దశలో పరమాత్మలో లీనమైపోతుంటుంది. ఈ ప్రళయం ముందు అగ్నిరూపంలోనూ, తర్వాత జలరూపంలోనూ ఉంటుందని శాస్త్రాలు చెపుతున్నాయి. బ్రహ్మాండపురాణంలో జలప్రళయం తర్వాత బ్రహ్మాండం ఎలా ఆవిర్భవించిందో తెలియజేసారు. సృష్టికి ముందు ఈ విశ్వమంతా జలమయమై పోయింది. సృష్టి ఆరంభంలో పరమేశ్వరుడు జలంలో తన శక్తిని నింపి బంగారుకాంతులీను అనేక అండాలను సృష్టించాడు. అవే బ్రహ్మాండాలు – కోడిగుడ్డాకారం గలవి. అందులో ఒకటి మనముంటున్న బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండానికి పుట్టుక, వ్యాకోచమూ (పెరుగుదల) గూడా ఉంటాయిట. ఈ బ్రహ్మాండం లోపలంతా చీకటిమయంగా ఉండేది. అప్పుడు పరమేశ్వరుని తేజస్సు ఒకమూర్తి రూపం ధరించి అనిరుద్ధుడని పేరుగాంచింది. ఆయనే బ్రహ్మ, విష్ణు, శివ తత్వాలు గల – త్రిమూర్త్యాత్మకుడైన హిరణ్యగర్భుడు. ఆయన్నే సూర్యుడు, సవిత, పరంజ్యోతి అంటారు. ఈ బ్రహ్మాండమంటే ఏమిటో చూద్దాం.

2.13 బ్రహ్మాండమంటే ఏమిటి?

సృష్టికి పూర్వం పరమాత్వతత్వమైన అనంత శుద్ధచైతన్యం తప్ప ఇంకేమీ లేదు. సృష్టి ఆరంభంలో పరమేశ్వరుడు ఈ అనంత శుద్ధచైతన్యశక్తి నుండి కొంత భాగం వేరుచేసి ఒక బ్రహ్మాండంగా ఏర్పాటు చేసాడు. ఇందులో బ్రహ్మలోకం నుండి పాతాళలోకంవరకూ గల 14 లోకాలన్నాయి. ఈ బ్రహ్మాండంలోనే గ్రహ, నక్షత్ర, తారా మండలాలన్నీగూడా ఉన్నాయి. ఇలాంటి బ్రహ్మాండాలనేక కోట్లున్నాయి. పరమేశ్వరుడు తన చైతన్యశక్తితో ఈ బ్రహ్మాండంలో కొన్ని గోళాలను సృష్టించి కొందరి జీవులకు నివాసంకల్పించాడు. తన అనంతశక్తి వారిమీద పడకుండా ఉండడాని కోసం, తన శక్తితోనే ఒక్కొక్క బ్రహ్మాండానికీ చుట్టూతా ఒక బంగారపు కటాహం (గోడ) ఏర్పాటు చేసాడు. దీనివల్ల ఈ బ్రహ్మాండ పరిధిలోని శక్తి బయటకు పోకుండా, బయటిశక్తి లోపలకు రాకుండా ఒక పటిష్టమైన రక్షణ కవచమేర్పడింది.

2.14 బ్రహ్మాండంలోగల ముఖ్య లోకాలు:

ఈ బ్రహ్మాండంలోగల ఆకాశంలో ప్రధానంగా 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలున్నాయి. ఊర్ధ్వలోకాలకుపైన ఇంకా కొన్ని లోకాలున్నాయి. వాటి వివరాలు (పైనుండి కిందికి):

ఊర్ధ్వలోకాలకు పైనున్న లోకాలు:

  1. నిరామయస్థానం
  2. త్రిఖండసోపానం
  3. కారణబ్రహ్మలోకం
  4. శ్రీనగరం
  5. మహా కైలాసం
  6. కారణ వైకుంఠం

ఊర్ధ్వలోకాలు 7:

  1. సత్య లోకం
  2. తపోలోకం
  3. జనలోకం
  4. మహర్లోకం
  5. సువర్లోకం

ఈ పై ఐదు లోకాలను కలిపి స్వర్గం అంటారు.

  1. భువర్లోకం
  2. భూలోకం

ఈ భూ, భువర్లోకాలను కలిపి మర్త్యలోకమంటారు. మర్త్యులంటే జన్మించి, మరణించే వారు. స్థూలశరీరాలతో పైలోకాలకు పోలేరు. మరణంతో స్థూలశరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. సూక్ష్మశరీరాలతోనే పైలోకాలకు పోవాలి. భూలోకమంటే మనం నివసిస్తున్న భూమి + మహాభూమి.

అధోలోకాలు 7:

  1. అతలం
  2. వితలం
  3. సుతలం
  4. రసాతలం
  5. తలాతలం
  6. మహాతలం
  7. పాతాళం

ఈ 7 అధోలోకానూకలిపి పాతాళమంటారు. వీటిని గురించి ఇంకొంచెం విపులంగా తర్వాత తెలుసుకుందాం.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here