దివినుంచి భువికి దిగిన దేవతలు 20

0
6

[box type=’note’ fontsize=’16’] మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞాన రహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రచన చేశారు డా. ఎం. ప్రభావతీదేవి. [/box]

వేదాల్లోని విజ్ఞాన వీచికలు

20.0. వేదాలు విఙ్ఞాన గనులు :

వేదాలు, వాటి అంగాలు, ఉపాంగాలు అంటే ఏమిటో, ఈ వేదశాస్త్రాలను యజ్ఞ యాగాల్లో ఎలా ఉపయోగిస్తారో అన్న విషయాలు తెలుసుకున్నాం లోగడ. ఇప్పుడు మనం తెలుసుకోవలసిందేంటంటే వేదాల్లో నిక్షిప్తమైయున్న కొన్ని విజ్ఞాన విషయాలు. ముందుగా ఆయుర్వేదంలోని కొన్ని అద్భుతాలను చూద్దాం. అవి తెలుసుకోవాలంటే వేదానికి ఆయుర్వేదానికి గల సంబంధమేంటో తెలుసుకోవాలి.

20.1. వేదం – ఆయుర్వేదం :

వేదానికి శ్రుతి అని, ఆమ్నాయం అని పేర్లు. శ్రుతి అంటే వినబడినదనర్థం. ఆమ్నాయమంటే వల్లించుటనర్థం. వేదమంటే తెలియజేసేది. ప్రత్యక్ష, అనుమాన ప్రమాణాలచేగాని, ఇంకే ఇతర ఉపాయాలతోగాని తెలియరాని విషయాలను తెలియజేసేది వేదం. అటువంటి వేదానికి ఉపవేదం ఆయుర్వేదం. ఉపవేదమంటే వేదంలోని కొంతభాగమే వేరుపడి ప్రత్యేక విజ్ఞానాన్నిచ్చేది. ఆయుర్వేదమంటే ఆయుర్దాయం గురించి చెప్పేది.

20.2. ఆయువంటే ఏమిటి?

శరీరం, ఇంద్రియాలు, మనస్సు, ఆత్మ – ఈ నాలుగింటి యొక్క కూడికయే ఆయువంటే. ఆయుర్వేదమంటే ఆయుర్దాయం గూర్చి ప్రత్యక్ష, అనుమాన ప్రమాణాలచే గాని, మరే ఇతర ఉపాయాలతోగాని తెలియబడని విషయాలను తెలిపేది. ప్రతి జీవి చాలా కాలం ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలనుకుంటుంది. ఆయువుని పెంపొందించుకుని, చాలాకాలం జీవించే ఉపాయాలు ఒక్క ఆయుర్వేదంలోనే ఉన్నాయి.

20.3. భారతీయ ఆయుర్వేదం యొక్క అవతరణ :

సృష్టికర్త బ్రహ్మ సృష్టికి ముందు తపస్సు చేస్తుండగా వేదం శబ్దరూపంగా వినబడింది. దానిని ఆయన స్మరించాడు. ఆ వేదంలో ఆయుర్వేదం అంతర్భూతమై ఉంది. దాన్ని ఆయన దక్షునికి ఉపదేశించగా ఆయన దేవతలలో ఆయుర్వేదం ప్రచారం చేయడానికి అశ్వనీదేవతలకు, వారు ఇంద్రునకు ఉపదేశించారు. కృతయుగాంతాన మానవులు రోగాలతో బాధపడుతూ తపస్సు, యజ్ఞయాగాలు మొ॥ ధర్మకార్యాలు చేయలేకపోవడం చూసి వారి కష్టాలను నివారించడానికి భరద్వాజాది ఋషులు సభచేసి అందుకు సమర్దుడు భరద్వాజుడేనని తలచి ఆయన్ను ఇంద్రుని వద్దకు పంపారు. ఇంద్రుడు విషయం గ్రహించి ఆయుర్వేదమంతా ఒకేవ్యక్తి గ్రహించడానికి సమర్దుడు కాడని తలచి ఆయుర్వేదాన్ని అష్టాంగచికిత్సలని 8 భాగాలుగా చేసాడు. అవి : కాయ, బాల, గ్రహ, ఊర్ధ్వాంగ (శాలాక్య), శల్య, దంష్ట్ర, జరా,వృష. అందులో కాయచికిత్స ప్రధానంగా ఉన్న ఆయుర్వేద భాగాన్ని భరద్వాజుని కుపదేశించాడు. భరద్వాజుడు దాన్ని తన శిష్యుడైన ఆత్రేయునకు ఉపదేశించాడు. ఆయన తన శిష్యులైన అగ్నివేశ,భేల,జతూకర్ణ, క్షారపాణి, హారీత మహర్షులకుపదేశించాడు. వారంతా వారివారి పేర్లన తంత్రాలుగా రచించి ఈ లోకంలో ప్రచారం చేసారు గురుశిష్యపరంపరగా. వాటిలో అగ్నివేశుడు రచించిన ‘అగ్నివేశ’ తంత్రం కాలగమనంలో శిథిలమౌతూరాగా దాన్ని చరకుడు ప్రతిసంస్కరించగా అదిప్పుడు ‘చరకసంహిత’గా ప్రచారమౌతోంది. ఆయుర్వేదంలో ప్రధానంగా రెండు పేర్లు వినిపిస్తుంటాయి : ‘చరక,సుశ్రుత’. వారి పేర్లతోనే ఉన్నాయి రెండు సంహితలు : ‘చరకసంహిత’, ‘సుశ్రుతసంహిత’. దివోదాసు అన్న పేరుగల కాశీరాజుకు, ధన్వంతరి అన్న పేరు గూడా ఉంది. ఆయన గూడా తపశ్శక్తి కలవాడు. ఆయన ఇంద్రుని వద్దకు వెళ్ళి ఆయుర్వేదాన్ని ఉపదేశించమని కోరగా ఇంద్రుడు శస్త్రచికిత్స ప్రధానంగా గల ఆయుర్వేద భాగాన్ని ఉపదేశించాడు. ధన్వంతరి ఈలోకంలో తన శిష్యులైన సుశ్రుతుడు (విశ్వామిత్రుని కుమారుడు), ఔషధేనవుడు, ఔరభ్రుడు, పౌష్కలావతుడు, గోపురరక్షితుడు, కరవీర్యుడు అన్న 6 గురు ఋషులకు ఉపదేశించగా, వారు వారివారి పేర్లన శస్త్రచికిత్స ప్రధానంగా గల తంత్రాలు రచించారు. ఇప్పుడు ఒక్క ‘సుశ్రుతసంహిత’ తప్ప తక్కినవన్నీ లుప్తమైపోయాయి. సుశ్రుతుడు 22 లక్షల సం॥ల క్రితం ఉన్నవాడు. ఈ ‘సుశ్రుతసంహిత’ ను నాగార్జునుడు సుమారు 2000 సం॥ల క్రితం ప్రతిసంస్కరించాడు. ఆయుర్వేదశాస్త్రంలో వాగ్భటాచార్యుని పేరు గూడా వినిపిస్తుంటుంది. వాగ్భటుడు గూడా చరక, సుశ్రుతులతో సమానమైన పేరుగలవాడు. ఆయన ‘చరకసంహిత’, ’సుశ్రుతసంహిత’ లను క్లుప్తీకరించి కాయచికిత్స, శస్త్రచికిత్సలను ప్రధానంగా గల ‘అష్టాంగ హృదయము’ అన్న గ్రంథాన్ని రచించాడు.

20.4. ఆయుర్వేద అష్టాంగ చికిత్సలు :

  1. కాయచికిత్స : శరీరానికి వాతాది దోషాలవల్ల కలిగే జ్వరం, అతిసారం, మేహం, ఉన్మాదం మొ॥న వ్యాధుల నివారణకై చేసే చికిత్స.
  2. బాలచికిత్స : చిన్నపిల్లలకు వచ్చే వ్యాధుల నివారణకై చేసే చికిత్స.
  3. గ్రహచికిత్స : భూతవైద్యం. ఇది మంత్రశాస్త్రంపై ఆధారపడిఉంది.
  4. ఊర్ధ్వాంగ (శాలాక్య) చికిత్స : ఇది తలలోని – మెడపై భాగానగల అవయవదోషాలకై చేసే చికిత్స. అంటే ఇ.ఎన్.టి లకుచేసే చికిత్స..
  5. శల్యచికిత్స లేక శస్త్రచికిత్స : శరీరంలో చేరి బాధపెట్టే ఎముకలు, మేకులు, దంతాలు మొ॥ శల్యాలనబడతాయి. వాటిని శస్త్రచికిత్సచే తీసి నయంచేయడం.
  6. దంష్ట్రచికిత్స (విషచికిత్స) : రకరకాల విషాలకు చికిత్సలు.
  7. జరా చికిత్స (రసాయన చికిత్స) :రసాది ధాతువులతో చేసిన ఔషధ సేవనం. అంటే కాయకల్ప చికిత్స.
  8. వృష చికిత్స (వాజీకరణ చికిత్స) : వీర్యపుష్టికోసం చేసే ఔషధ సేవనం.

పైనిచ్చిన ఈ 8 రకాల చికిత్సల్లో మనవారు బంగారం మొ॥ లోహాలు, పాదరసం మొ॥ రసాయన పదార్థాలు, వజ్రాది రత్నాలు, వృక్షసంబంధమైన మూలికలు, జంతు సంబంధమైన పదార్థాలు ఉపయోగిస్తారు. ఈ ఆయుర్వేద చికిత్సా విధానాల వల్ల ఎన్నో అద్భుతాలు చేయచ్చని ఆయుర్వేద గ్రంథాలవల్ల తెలుస్తోంది. కేవలం సోమలత సేవనంవల్లనే వేల సం॥లు జీవించ వచ్చనడానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. కొన్ని చూద్దాం.

20.5 అద్భుతమైన కాయకల్ప చికిత్స :

విష్ణుదాసు అనే ఒక తాపసి గురించి 5.5.1951 ఆంధ్రప్రభలో ప్రచురించారు. ఈవిషయం కోట నిత్యానందశాస్త్రి (కోట వెంకటాచలంగారి కుమారుడు) గారి పుస్తకం ‘భారతీయ వైద్యవిజ్ఞానం -ఆయుర్వేదం’ లో ప్రచురితమైంది. ఆ పుస్తకాన్ని ఆధారం చేసుకునే ఇక్కడ ఆయుర్వేద విఙ్ఞాన రహస్యాలను చర్చిస్తున్నాం. విష్ణుదాసు, శ్రీమదనమోహన మాలవ్యా లాంటి వారికి కాయకల్ప చికిత్స చేసాడు. ఈ తాపసి 18వ శతాబ్దానికి చెందినవాడు. ఆయన పూర్వాశ్రమంలో పటియాలా మహారాజైన మంగళసింగ్ గారి రెండవ కుమారుడు కృష్ణసింగ్. ఆయన కొంతకాలం రాజ్యం చేసాడు. శత్రుదాడులను తిప్పికొట్టగల సైనికశక్తి లేకపోవడాన, తన 55వ ఏట, సర్వసంగపరిత్యాగిగా మారి హిమాలయాలకు వెళ్ళి, ఒక సద్గురువు వద్దశిష్యునిగా చేరి, వేదవేదాంగాలు, యోగవిద్యలు నేర్చుకుని, విష్ణుదాసుగా పేరొందాడు. ఆయన తన శిష్యునితో అనేక పుణ్యస్థలాలు సందర్శిస్తూ, ఒకసారి బదరీ నుండి ఖాట్మండుకు కాలినడకన ప్రయాణిస్తూ ఒక మహాత్ముడ్నిచూసాడు. ఆ మహాత్ముడు 8 అడుగుల పొడవరి, ఆజానుబాహువు, దృఢశరీరి, జటాజూటం ధరించాడు, మొలకు పెద్దఆకును చుట్టుకున్నాడు. ఆయనొక ఋషి. వీరికి ఆతిథ్యం ఇచ్చి తనగురించి చెప్పాడు. ఆయన 5000 సం॥ల క్రితంవాడు. ఆయన పేరు ద్వివేది, జన్మస్థలం అయోధ్య. ఆయనకు శ్రీకృష్ణుని తాతగారైన ఉగ్రసేనుడు తెలుసు. ఆ కాలంనుండి తపమాచరిస్తున్నాడు. ఆయన గురువు ఆయన్ను మధురలోనున్న శ్రీకృష్ణుని చూసి రమ్మంటే ఆయన అక్కడికి వెళ్ళగా, అప్పటికే శ్రీకృష్ణుడు మధుర విడిచి ద్వారక వెళ్ళిపోయాడుట. ఆక్కడనుండి ఆయన ఇంక హిమాలయాల్లో బదరికాశ్రమం చేరుకుని తపమాచరించసాగాడు. ఐదువేల సం॥ల నుండి ఆయన శరీరం శుష్కించకుండా ఎలా ఉందని విష్ణుదాసు ఆయన్నడిగితే, ఆయన చెప్పాడు : తను సోమలత ఆకును నూరుకుని ఆవుపాలలో కలిపి తాగుతాడట రోజూ. ఆ సోమలత ఆకులను శాస్త్రప్రకారం సేవిస్తే 10వేల సం॥లు జీవించవచ్చు. సోమలత లాంటి దివ్య ఓషధీలతలకు శరీరంలోని మృతకణాల్లో జీవలక్షణాలను తీసుకురాగలిగిన శక్తి ఉందన్న మాట. అలాంటి జ్ఞానం కలిగిన మహాత్ములు మనకున్నారు ఇప్పటికీ. ఆ విషయం మనలో ఎంతమందికి తెలుసు? విష్ణుదాసుకు అప్పటికే 100సం॥లున్నాయి. తర్వాత ఆయన దక్షిణ అస్సాంలోగల పరశురామకుండుకు చేరుకున్నాడు అతి ప్రయాసపడి, తనువు చాలించాలనే ఉద్దేశంతో. అక్కడ ఇంకో మహాత్ముడిని కలిసాడు. ఆయనవల్ల కాయకల్ప చికిత్స చేయించుకున్నాడు. ఆ చికిత్సా విధానం కూడా నేర్చుకున్నాడు. ఆ పరశురామకుండు యోగి, విష్ణుదాసు కోసం ఒక కుటీరం నిర్మించి, అందులో వరిగడ్డితో చేసిన పరుపును పరిచాడు. రోజుకో మోతాదు చొప్పున మందిచ్చాడు. అలా3 నెలలు చికిత్స జరిగింది. చికిత్స మొదలుపెట్టేటప్పడికే విష్ణుదాసు శరీరం చిక్కిశల్యమైంది, పళ్ళూడిపోయాయి, చెవుడు వచ్చేసింది, కళ్ళు సరిగా కనిపించవు, నడుం ఒంగిపోయింది, కర్రసాయంతో నడుస్తున్నాడు, శరీరం ముడతలు పడిపోయింది. ఈ స్థితిలో వైద్యం మొదలైంది. చికిత్సా విధానమంతా ఎప్పటికప్పుడు ఒక పుస్తకంలో నమోదు చేయసాగారు : ఏరోజు ఏ పరిమాణంలో మందిచ్చారు? నాడి వేగమెంత? ప్రగతి ఎలా ఉంది? ఆ కుటీరంనుండి ఆయన బయటకెళ్ళకుండా కాలకృత్యాల కోసం ఒక మూల ఒకతొట్టెను ఏర్పాటుచేసారు. అది ఆయనే శుభ్రం చేసుకునేవాడు. చికిత్స మొదలైన 5 రోజులు ఆయన మామూలుగానే ఉన్నాడు. 6వ రోజు ఆయన అపస్మారకస్థితిలో ఉన్నట్టనిపించింది. ఐనా మందు, పాలు తీసుకున్నాడు. ఆ రోజు చీకటిపడ్డాక ఆయన పూర్తిగా తెలివి కోల్పోయాడు. ఆ స్థితి 22వ రోజు వరకు ఉంది. ఐనా వైద్యుడు రోజూ ఉదయం మందు, పాలు ఇవ్వసాగాడు. 22వ రోజు విష్ణుదాసుకు తెలివి వచ్చింది. ఆయన ఆరోగ్యంలో చాలా మార్పులు కనిపించాయి: కంటి చూపు బాగుపడింది, కొత్తపళ్ళు పుట్టుకొస్తున్నాయి,శరీరంమీద వెంట్రుకలు నల్లబడ్డాయి. 3 నెలల్లో ఎవరూ నమ్మలేనంతగా విష్ణుదాసు 20 ఏళ్ళ నవయువకుడుగా కనిపించసాగాడు. అవయవాలు, కండరాలు కొత్తజీవం పోసుకున్నాయి, నిటారుగా నిలబడగలిగాడు, గెంతసాగాడు. మిలమిలా మెరిసి పోతున్నాడు, గొంతు చక్కగా వినిపిస్తోంది. ఈయనతో పోలిస్తే పరశురామకుండు యోగి బలహీనంగా కనిపించాడు. ఆనందంతో కొన్ని రోజులు గడిపి ఆయన కాయకల్పచికిత్సా విధానం గూడా నేర్చుకున్నాడు, మూలికా జ్ఞానం గూడా సంపాదించాడు. ఇంక శేషజీవితం తపస్సమాధిలో గడపాలని నిశ్చయించుకుని ఆ విషయం తన వైద్యుడికి చెప్పగా ఆయన తనకు గురుదక్షిణగా ఆ కాయకల్ప చికిత్సను తనకు గూడా చేయమన్నాడు. అలాగేనని గురువుకుగూడా ఆ కాయకల్ప చికిత్స చేసి అనేక ప్రదేశాలు తిరిగి 1938లో మదనమోహనమాలవ్యాకి ఆయన మిత్రుడికి ఆమలక ప్రధానంగా రసాయన చికిత్స చేసాడు. అప్పటికి ఆయన వయసు 168సం॥లు. ఆయుర్వేద అష్టాంగ చికిత్సల్లో ఒకటైన రసాయన చికిత్స (కాయకల్ప చికిత్స) ను ప్రపంచదేశాలదృష్టికి తెచ్చిన గొప్పవ్వక్తి ఆయన. ఆయన గురించి దేశవిదేశాల్లో గూడా గొప్పగా చెప్పకున్నారు. ‘లైఫ్’ అన్న అమెరికన్ పత్రిక గూడా ఆయన్ను గురించి వ్యాసం ప్రచురించింది. ఆయన తన 186వ ఏట తనువు చాలించాడు.

20. 6. ఇంకొంతమంది యోగులు :

కాయకల్పచికిత్సా విధానం లాంటి చికిత్సనే ఆంధ్రలో గోదావరి ప్రాంతానికి – దోసకాయలపల్లికి చెందిన ఆయుర్వేద వైద్యులైన శ్రీపాకాలపాటి కొండ్రాజుగారు కుటీత్రేవేశి పద్ధతిలో చేసారు. ఆవిషయం గురించి ఆయన 31.10.1938 ఆంధ్రపత్రికలో ప్రకటించారు. ఇంకో యోగి, కేరళకు చెందినవాడు, 685 సం॥ల వయసుగలవాడు 30సం॥లలోపు వాడుగా కనిపించేవాడు. ఆయన్ను గురించి 1948లో జూన్ 8,15 తేదీల్లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురించారు ‘మిస్టరీ మాన్ ఇన్ కొచ్చిన్’ అని. ఆయన పేరు ప్రభాకరన్. ఆయన కేవలం లంగోటీ, జంధ్యం మాత్రం ధరించి ‘మఠాన్‌చెరి’లో కనపడ్డాడు. ఆయన్ను రక్షకభటులు బంధించి, పరీక్షించారు. ఆయన 1263 సి.ఇ లో నంబూద్రి వంశానికి చెందిన ‘అకవూర్మన’ కుటుంబానికి చెందినవాడని చెప్పాడు. ఆయన 11 సం॥లు సముద్రంలోనే ఉండి చిన్న చిన్నచేపలు, కలుపుమొక్కలు, నాచు తింటూ గడిపాడుట. ఇంకా 400 సం॥లు పైగా హిమాలయాల్లో గడిపాడుట. రక్షకభటుల బందోబస్తులో ఆయన్ను వైద్యులు పరీక్షించారు. ఆయన ఆన్నం, నీరు తీసుకోలేదు, మలమూత్ర విసర్జన చేయలేదు. ఇలాంటి మహాత్ములు మన దేశంలో చాలామంది ఉండి ఉండచ్చు. కానీ సామాన్యులకు కనిపించరు. మనబోంట్లకు తెలియదు. ఐనా అలాటి విషయాలు మన కనవసరమనుకుంటాం. కానీ విదేశీమతాల వారు మన దేవుళ్ళను, మన మహాత్ములను దూషిస్తూ, వాళ్ళ ప్రవక్తలే దేవుళ్ళంటూ డబ్బు ఎరచూపి వాళ్ళ మతాల్లోకి మనవాళ్ళను మారుస్తుంటే పూర్వాపరాలు ఆలోచించకుండా మారిపోతున్నారు. మనం చోద్యం చూస్తూ కూచుంటున్నాం. ఆయుర్వేదంలో మనవారు ఇంకా ఏం చెప్పారో చూద్దాం.

20.7. శరీరమర్మస్థానాల విజ్ఞానం :

మన ఆయుర్వేద శాస్త్రంలో మన శరీరంలోగల మర్మస్థానాల వివరణ గూడా ఉంది. ఆయుర్వేద వైద్యునికి శరీర అవయవాల గురించిన జ్జానం పూర్తిగా తెలిసి ఉండాలి. మన శరీరంలో కొన్ని మర్మస్థానాలుంటాయి. మర్మలంటే శరీరంలో గల మాంసం, సిరలు, స్నాయువులు, అస్థులకు పరస్పర సంబంధం కలిగించేవి. వాటికి సంబంధం కలిగిఉండేలా ప్రత్యేక స్థానాలుంటాయి. వాటిని మర్మస్థానాలుంటారు. అలాంటివి శరీరంలో 107 ఉన్నాయిట. వాటిలో ప్రాణాలు సంచరిస్తుంటాయి. ఈ మర్మస్థానాల్లో దెబ్బలు తగిలితే ప్రాణాపాయం కలుగుతుంది. అవి 5 రకాలు :

  1. సద్యః ప్రాణహర మర్మస్థానాలు : ఇవి 19 ఉన్నాయి. వీటికి దెబ్బలు తగిలితే వెంటనే ప్రాణాలు పోతాయి.
  2. కాలాంతరప్రాణహర మర్మస్థానాలు : ఇవి 33 స్థానాలు. వీటికి దెబ్బలు తగిలిన కొంత కాలానికి ప్రాణాలు పోతాయి.
  3. రుణాకర మర్మస్థానాలు : ఇవి 8 స్థానాలు. వీటికి దెబ్బ తగిలితే అవి రోగాలను కలగజేస్తాయి.
  4. వైకల్యకర మర్మస్థానాలు : ఇవి 44 స్థానాలు. వీటియందు దెబ్బ తగిలితే అవి నయం కాకుండానే అంగవైకల్యం,ఇబ్బంది కలగజేస్తాయి.
  5. విశల్యకర మర్మస్థానాలు : ఇవి 3 స్థానాలు. వీటియందు దెబ్బ తగిలితే ఆ శల్యాన్ని తీస్తుడగానే ప్రాణాలు పోతాయి.

పూర్వకాలంలో యుద్ధాల్లో ఇనపములికలుగల బాణాలు, కత్తులు మొ॥ ఆయుధాలను వాడేవారు. వాటి గురించిన జ్ఞానంగల శస్త్రచికిత్సకులనే యుద్ధాల్లో వైద్యానికి వాడుకునేవారు. రామాయణం యుద్ధాకాండలో ఇంద్రజిత్తు లక్ష్మణుని విశల్యమర్మ స్థానంలో బాణంతో కొట్టగా లక్ష్మణుడు మూర్ఛపోతాడు. వానరసేనకు చెందిన సుషేణుడనే వైద్యుడు హనుమంతుని హిమాలయాలకు పంపి లక్ష్మణునికి చికిత్సకు అవసరమైన సంజీవికరణి, విశల్యకరణి, సంధానకరణి, సావర్ణకరణి అనే దివ్య ఔషధాలను తెప్పించి వాటితో మెల్లిగా అభిఘాతాన్ని మారుస్తూ శల్యాన్ని బయటకు తీస్తూ చికిత్సచేసి లక్ష్మణుని బతికించాడు. నిజానికి విశల్యమర్మస్థానంనుండి శల్యాన్ని లాగినవెంటనే ప్రాణం పోతుంది. అలాంటి చికిత్స నిపుణులైన వైద్యులే చేయాలి.

20.8. వివిధ శస్త్రకర్మలు :

ఆయుర్వేదంలో 8రకాల శస్త్రకర్మల గురించి గూడా చెప్పారు :

  1. ఛేద్యం= ఛేదించుట. తెగగొట్టుట. గ్రంధులు మొ॥న వాటిని తెగగొట్టడం.
  2. భేద్యం= పగలగొట్టుట.చీల్చుట.విభజించుట.
  3. లేఖ్యం= శస్త్రాదులచే గీచుట.
  4. వేధ్యం=పొడచుట. సూదుల్లాంటి శస్త్రాలతో గుచ్చడం.
  5. ఏష్యం= వెదకుట. వ్రణాల్లో ఏవైనా కల్మషాలున్నాయేమోనని వెదకడం.
  6. ఆహార్యం=పైకితీయుట.లోపల ఇరుక్కున్న శల్యాలను పైకితీయడం.
  7. విస్రావ్యం= స్రవింపజేయుట. చీము మొ॥ వాటిని కారేట్టుచేయడం.
  8. సీవ్యం=కుట్టుట. ఛేదించినవాటిని మళ్ళీకుట్టడం..

శస్త్రచికిత్సకు అవసరమైన యంత్రాలు, శస్త్రాలు ఎన్నోఉండేవి ఆ రోజుల్లో. అవి ఈ కాలపు ఆధునిక వాటిని పోలినట్లే ఉండేవిట. అసలు మనవాళ్ళవి చూసే ఆధునికశాస్త్రజ్ఞులు ఇప్పటి పరికరాలని తయారుచేసుకున్నారన్నా తప్పులేదు. ఎందుకంటే మనవారి శాస్త్రాలన్నీ ఎప్పుడో విదేశీయులు అనువాదాలు చేయించుకున్నారు వారి భాషల్లోకి. ఆధునికులు చేస్తున్న ప్లాస్టిక్ సర్జరి గూడా మనవారిదేనని అనడానికి గూడా మన వద్ద ఎన్నో ఆధారాలున్నాయి.

20.9. ప్లాస్టిక్ సర్జరి :

ఆరోగ్యంగానున్న శరీరభాగంలోని చర్మాన్ని తీసి అనారోగ్యభాగానికి అతికించే శస్త్రచికిత్స ఆ రోజుల్లో భారతీయ వైద్యులు చేసేవారని ఆంగ్లేయులే పుస్తకాల్లో రాసుకున్నారు. ఇటుకపని చేసేవాడొకడు, తన తోటివాడి ముక్కుకు దెబ్బతగిలితే అతని ముఖంలోనుండే కొంత చర్మం తీసి అతని ముక్కుకే అతికించి సరిచేసాడుట.

మన వైద్యులు మూత్రంలోగల రాళ్ళను తీసేవారుట. కంటి పొరలను తొలగించేవారుట. గర్భస్థపిండాన్ని శస్త్రాలద్వారా బయటకు తీసేవారుట.

20.10. ఆయుర్వేదంలో క్రిమి విజ్ఞానం :

విదేశీయులే క్రిమిసిద్దాంతం కనుగొన్నారు. భారతీయులకు దాని గురించేమీ తెలియదు అన్నారు చాలామంది విదేశీయులూ, ఆంగ్లం నేర్చుకున్నమనవాళ్ళూ. అందుకే మన ఆయుర్వేదంలో క్రిమిసిద్ధాంతం గురించి ఏముందో చూద్దాం.

  1. క్రిములు లేని ప్రాంతాలే ఉండవేమో! ఇళ్ళు, చెట్లు, చేమలు, కొండలు, గుట్టలు, నీటిప్రాంతాలు, మన శరీరం మీదా, లోపలా – ఇలా అన్నిచోట్లా ఉంటాయి. మన శరీరం మీదైతే చెమట, చెవిలో గులిమి మొ॥వాటిలో, లోపలైతే రక్తం, శ్లేష్మం, మలం మొII వాటిలో ఈ క్రిములు పుడుతుంటాయి.
  2. క్రిములకి కారణాలు చాలా ఉంటాయి. అరగనివి, తీపి, పులుపు, ద్రవ పదార్థాలు, నిషేధించినవి ఎక్కువగా సేవించడం వల్ల క్రిములు పుడుతుంటాయి.
  3. అనేక రకాలక్రిములు గూడా ఉన్నాయి. అనేక ఆకారాలు గలవి, తెల్ల, ఎర్ర, నల్ల రంగులవి, నల్లగా ఉండి తెల్లని చేతులు గలవి, తెల్లపొట్ట గలవి, కంటికి కనిపించేవి, కనపడనివి, భూమ్మీద పాకేవి, ఇసుకలో ఉండేవి, పక్కబట్టల్లో ఉండేవి, ఇలా అనేకరకాల క్రిములున్నాయి.
  4. క్రిములను సంహరించడానికి గూడా విధులున్నాయి. కేవలం మంత్రాల ద్వారా నయం చేసేవి గూడా ఉన్నాయి. అంటే క్రిమిసంహారక మంత్రాలుగూడాఉన్నాయన్న మాట. ఇప్పుడావిద్యలన్నీ లుప్తమైపోయాయన్నమాట. మన ఆయుర్వేదం గురించి చాలా ఉంది. కానీ కొన్ని విషయాలు మటుకూ చెప్పుకున్నాం. ఇక్కడితో ఆయుర్వేదం గురించిన చర్చను చాలించి, ఇంకా కొన్ని ఇతర శాస్త్ర విషయాల్లోకి వెళదాం.

20.11. భూమిలో వివిధ లోహాల పుట్టుక:

మన భూమిలో బంగారం, వెండి లాంటి రకరకాల లోహాలు ఎలా పుడతాయో మనకు తెలియదు. కానీ మన ఋషులకు తెలుసు. వారు వాటిని పురాణాల్లో వర్ణించారు. ఆ వర్ణనలు మనకు నమ్మబుద్దిగా ఉండవు. దానికి కారణం వారు సామాన్య జనులకు వైజ్ఞానిక పదాలు అర్థంకావని, మనోరంజకంగా ఉండటానికి కొన్ని వాక్యాలను వాడారు. ఉదా : భూమిని ఆదిశేషుడు, అష్టదిగ్గజాలు మోస్తున్నాయి అని. అంటే ‘ఆధారశక్తి, శ్రీవరాహ, కూర్మ, అనంత, అష్టదిగ్టపరి ప్రతిష్ఠితస్య’ మొ॥న వాక్యాలను వాడారు. ఆదిశేషుడంటే సర్పరాజు, దిగ్గజాలంటే ఇంద్రాద్యష్టదిక్పాలకుల వాహనాలైన ఐరావతాది గజాలని వర్ణించారు. ఇలాంటి వర్ణనలు, ఆంగ్లచదువులు చదివిన మనబోంట్లకు నమ్మదగ్గవిగా అనిపించవు. అందుకే పుక్కిటి పరాణాలని పరిహసిస్తాం.. ఈవాక్యాల్లో ‘కూర్మకశ్యప, మార్తాండ, భూత, భ, అర్క ఇందు, బాడబ’ అన్న పదాలు 8 శక్తులను సూచిస్తాయి. వాటికి ఋషులు చెప్పిన అర్థాలు :

  1. కూర్మశక్తి : భూగర్భమందున్న ఆకర్షణశక్తి.
  2. కశ్యపశక్తి : భూమిపైభాగాన గల కక్ష్యాశక్తి.
  3. మార్తాండశక్తి : సూర్యకిరణ ప్రవాహజశక్తి.
  4. భూతశక్తి : తన్మాత్రశక్తి. విశేషించి వాయుప్రవాహము.
  5. భశక్తి : గ్రహాలశక్తి.
  6. అర్కశక్తి : సూర్యగోళాంతర్గతమైన ఆకర్షణశక్తి.
  7. ఇందుశక్తి : చంద్రాకర్షణశక్తి.
  8. బాడబాశక్తి : భూమి – సూర్యుల మధ్యనుండి, భూమ్యాది గోళాలను అంతరిక్షాన మార్గం క్రమంతప్పకుండా పట్టి నడిపించే శక్తి.

ఈ 8 శక్తులు 3,8,11,5,2,6,4,9 అంశల్లో ఆ భూగర్భకోశానికి చేరుతూ అందులోనున్న శక్తులచే ఆకర్షింపబడి అక్కడ కలుస్తున్నాయి. ఆ భూగర్భకోశంలో 3 శక్తులున్నాయి : వారుణి, శేష, గజ.

  1. వారుణిశక్తి : భూమిలోనున్న ఆర్ధశక్తి. ఒక అణువును ఇంకో అణువుతో కలిపి పట్టి ఉంచే శక్తి. స్నిగ్ధత కలిగించేశక్తి.
  2. శేషశక్తి : భూమియొక్క రెండుధ్రువాల మధ్యనా వ్యాపించి ఉన్న మేరుదండశక్తి. తన చుట్టూ ఉన్నదాన్ని పట్టిఉంచేశక్తి.
  3. గజశక్తి : క్షితిజ ప్రవాహశక్తి.

ఈ 3 శక్తులయొక్క, ఆ కూర్మాది 8 శక్తులయొక్క నిర్ణీతమైన అంశల కలయికల వల్ల వివిధలోహాలు పుడుతున్నాయి.

20.12. తోకచుక్కలవిజ్జానం :

తోకచుక్కలు గానీ కనిపిస్తే విదేశీయులు తామే వాటిని ముందు చూసామని తమ పేర్లు పెట్టేస్తున్నారు. అలాంటిదే హేలి తోకచుక్క. అది 70 ఏళ్ళకొక్కసారి మాత్రమే కనిపిస్తుందిట. ఏం, తోకచుక్కలు ఇంకెవరికీ ముందర కనిపించవా? 70ఏళ్ళ కొక్కసారి హేలి తోకచుక్కే కనిపిస్తుందని ఎలా చెప్తారు? ఇంత పెద్ద ఆకాశం, ఎంతో చిన్నభూమి! భూమ్మీంచి ఆకాశంలోకి చూస్తే ఎన్నో గ్రహాలు, నక్షత్రాలు, తోకచుక్కలు ఒకేసారి చాలామందికి కనిపిస్తాయి. అలాంటప్పుడు అవి తమ సొంతమే అనుకొని తమపేర్లు పెట్టేసుకుని ఇతరులకు వాటి గురించి ఏం తెలుసు అని అనుకోడం మూర్ఖత్వం కాక ఇంకేమిటి! మన ఋషులు ఈ తోకచుక్కల గురించి ఎలాంటి విజ్ఞానాన్ని మనకందించారో చూద్దాం.. చాలామంది ఋషులకు ఈ తోకచుక్కల గురించి తెలుసు. వారిలో కొందరు: అగస్త్య, భరద్వాజ, జైమిని. ఈ ఋషులు మనకు తోకచుక్కల గురించి ఎన్నోవింత విషయాలు చెప్పారు :

  1. ఆకాశంలో 8వ మండలంలో 3,07,03,221 -3కోట్ల, 7లక్షల, 3వేల, 2వందల ఇరవైయ్యొక్క తోకచుక్కలున్నాయి.
  2. వీటిలో భయంకరమైనవి 8వేలు. ఇవి విద్యుత్తును తమ గర్భంలో కలిగుంటాయి.
  3. వీటిలో చాలా ఎక్కువ విద్యుత్తును ప్రసారం చేయగలిగేవి 12 ఉన్నాయి. అగస్త్యుల వారు వాటికి పెట్టిన పేర్లు : రోచిషా, దాహకా, సింహీ, పతంగా, కాలనేమికా, లతా, వృందా, రటా, చండీ, మూర్మీ, పార్వణీ, మృడా. ఇవన్నీ గూడా ఉల్మానేత్ర అనే తోకచుక్క యొక్క ఆకర్షణలో ఉన్నాయి. ఇతర మహర్షులు వీటికి వేరువేరు పేర్లిచ్చారు.
  4. ఈ తోకచుక్కల ప్రభావం ప్రతి సం॥ భూమిపై పడే సమయం : తోకచుక్కల్లో ఉండే విద్యుత్తు యొక్క ఘర్షణం ప్రతి సం॥ వసంత,శరదృతువుల్లో జరుగుతుంది.

స్వభావసిద్దంగా, ఎప్పుడూ, ఈ తోకచుక్కల్లోని వేడి, విద్యుచ్ఛక్తి గూడా సూర్యకిరణాల్లో అంతర్భూతమై ఉంటాయి. కానీ వసంత, శరదృతువుల్లో మాత్రం అధికంగా ఉంటాయి. అందుకే ఈ రెండు కాలాల్లో ఎండలో తీక్షణత ఎక్కువగా ఉంటుంది. ఎండవేడి తక్కువైనా గూడా ఆ ఎండ చురచురలాడుతూ రోమకూపాల ద్వారా శరీరంలో ప్రవేశించి శ్లేష్మాది ధాతువుల్లో మార్పులను తెస్తుంది. అందుకే కాబోలు మనవారు ఈ రెండు ఋతువుల్లోనూ, దేవీనవరాత్రి ఉత్సవాలు, రామనవమి ఉత్సవాలు జరుపుతారు. దైవారాధనను మనవారు సంప్రదాయబద్ధం చేసారు మన రక్షణ కోసం. ఈ సారి తోకచుక్కలు ఎవరికైనా కనిపిస్తే వారి పేర్లు పెట్టేసుకోండి – సుబ్బారావు, రామారావు అనో లేక సీత, సావిత్రి అనో, లేకపోతే విదేశీయులు వాటిమీద గూడా గుత్తాధిపత్యం తీసుకుంటారు.

20.13. విమానవిజ్ఞానం – భూలోకంనుంచి బ్రహ్మలోకం వరకూ ప్రయాణం :

కృతయుగంలో ధర్మం 4 పాదాలమీద నడవడంవల్ల, అందరూ సత్వగుణం కలవారు అవడంచేత, వారికి మంత్రసాధన, యోగసాధనల అవసరం కలగలేదు. అందరూ పుట్టుకతోనే సిద్దపురుషులుగా, ఉత్తమఙ్ఞాన సంపన్నులుగా ఉండేవారు. అణిమాది అష్టసిద్దులు అన్నీ సహజంగా ఉండేవి. వారికి ఆకాశగమనశక్తి మొ॥ సహజంగా ఉండేవి. అందువల్ల విమానాల అవసరం లేకపోయింది. కృతయుగాంతాన, త్రేతా యుగాదిలోను, ధర్మం 4వ వంతు నశించడాన మానవులకు ఆకాశగమనశక్తి, వాయువేగశక్తి, అణిమాదిఅష్టసిద్దులు మొ॥వి నశించాయి. ఇది గ్రహించిన ఈశ్వరుడు, అప్పుడు మానవులమీద దయగలవాడై, దక్షిణామూర్తి అవతారం ధరించి, సమస్తవేదవిద్యలను సనకాదిఋషులకు బోధించాడు. వారిద్వారా అర్హులైన వారికి, చేరడానికి. సనకాదులు వేదరహస్యాలను అనేకశాస్త్రాల్లో నిక్షిప్తంచేసి అనేక గ్రంథాలను రచించారు. ఆవిధంగా వైమానిక విజ్ఞానం అనేక ఋషులకు చేరింది. ఈ విమానాలు 3 రకాలు: మాంత్రికాలు, తాంత్రికాలు, కృతకాలు. వీటిలో త్రేతా యుగంలోని విమానాలు మంత్రప్రభావంతో కూడుకుని ఉండేవి. పుష్పక విమానం అలాంటిదే. ద్వాపరంలో తాంత్రిక విమానాలు ఉండేవి. కలిలో కేవలం యాంత్రిక విమానాలు చేసే పద్దతులు తెలిపారు. ఈ విమానాల ద్వారా భూలోకంనుంచి బ్రహ్మ లోకం వరకూ ప్రయాణం చేయవచ్చు. అంటే పూర్వకాలంలో మనకు గూడా కృత్రిమ ఉపగ్రహాల సాయంతో పైలోకాలకు వెళ్ళే వీలుండేదన్నమాట.

20. 14. యాంత్రిక విమానశాస్త్రజ్ఞానం :

అనేక రకాలుగా విమానాలను నిర్మించే పద్ధతులున్నాయి. అవి భూమ్మీద, నీటిమీద, అంతరిక్షంలోనూ సంచరించగలిగేవి. ప్రాచీనఋషులు వీటిని గురించి శాస్త్రాలను రచించడమే కాకుంగా, స్వయంగా నిర్మించి అనుభవంలోకి తెచ్చుకున్నారు. మన పురాణాల్లో వీటిని గూర్చి చెప్పారు. పుష్పకం విశ్వకర్మనిర్మించింది.మయసభగురించి భారతంలో ఉంది. త్రిపురాలగురించి శివపురాణంలో ఉంది. భారతంలో ఉపరిచర వసువు విమాన ప్రయాణంచేసాడనిఉంది. పురాణాల్లో ఈ విమానాలను అనేకులు ఉపయోగించేవారని ఉంది. ఈ శాస్త్రాల్లో గల కొన్ని విషయాలను గమనిద్దాం.

1. మార్గనిబంధనలు :

విమాన తంత్రంలో విమానాలు ఏ మార్గాన సంచరించాలనడానికి గూడా శాస్త్ర జ్ఞానముంది. అక్షాంశ రేఖాంశలద్వారా భూమ్మీదున్న ప్రతిచిన్న భాగాన్ని ఎలా గుర్తించవచ్చో అలాగే ఆకాశంలో భూలోకంనుంచి బ్రహ్మలోకం వరకూ వచ్చేపోయే, విమానాలకు వచ్చే ప్రమాదాలను సూచించడానికి ఆయాలోకాలను, స్థలాలను, కక్యలను గుర్తించడానికి కోట్లకొలదీ సంఖ్యల్లో రేఖాంశలున్నాయని ఋషులు నిరూపించారు.

2. ప్రత్యేక వస్త్రాల ఉపయోగం :

అంతరిక్షంలో విమానాల్లో సంచరించేవారికి, ఋతుభేదాలనిబట్టి సూర్యకిరణాల్లో పుట్టే అనేక విషదోషాలవల్ల, అనేక రోగాలు వస్తాయి. వాటినిప్రతిఘటించడానికి రకరకాలవస్త్రాలను తయారుచేసే పద్ధతులున్నాయి. ఉదా: నూలు, పట్టు, ఉన్ని, నార, నాచు, అబ్రకం మొ॥ వాటినుండి దారాలనుతీసేయంత్రాలున్నాయి.

3. ప్రత్యేక ఆహార పద్ధతులు :

విమానాల్లో సంచరించేవారికి ఋతుభేదాలననుసరించి యేయే పదార్థాలు తినాలో నన్నది ‘ఆశన కల్పం’ లో ఉంది.

4. విమాననిర్మాణానికి వాడే లోహాలు :

విమాననిర్మాణానికి పనికివచ్చే లోహాల గురించి గూడా మన శాస్త్రాల్లో ఉంది, ఉదా: ‘లోహ కల్పం’. వివిధ లోహాలు, వాటినిశుద్దిచేసే విధానాలు, కరిగించే పద్దతులు – కరిగించడాని కవసరమయ్యే మూసలు, శుద్ధిచేసే ఓషధులు, అవి కరగడానికి సరిపడా ఉష్ణప్రమాణాలు. కృత్రిమ లోహాలను తయారుచేసే విధానాలు మొ॥వాటిగురించి చాలామంది ఋషులు గ్రంథాలను రాసారు.

5.విమానాల్లో విచిత్ర దర్పణాలు :

విమానాల్లో విచిత్ర దర్పణాలు వాడేవారని మన శాస్త్రాల్లో ఉంది. భరద్వాజులవారు ‘బృహద్విమాన శాస్త్రం’ లో 32 వైమానిక యంత్రాలను ఎక్కడెక్కడ అమర్చాలో గూడా చెప్పారు. ఉదా: పరివేషక్రియాయంత్రం, విశ్వక్రియాదర్పణం, శక్త్యాకర్షణ దర్పణం మొ॥వి.

6. విషశక్తుల పుట్టుక :

భూమి పైభాగాన ఉంది కక్ష్యాశక్తి. దానిపైన మేఘమండలం ఉంది. దానిపైన వారుణీ శక్తి (మేఘమండలంలోగల 5 విద్యుచ్ఛక్తుల్లో ఒకటి) ఉంది. దానిపైన 5 వేలరకాల వాయువులున్నాయి. అక్కడ అనేక రోగాలను కలిగించే 8 కోట్ల సూర్యకిరణాలు ఉన్నాయి. ఆ కిరణాలు, ఆ వాయువులు కలిసి అనులోమ విలోమ గతుల్లో సంచారం చేస్తుంటాయి. అలాంటప్పుడు విషశక్తులు పుట్టి అనేక రోగాలను కలిగిస్తాయి. ఇలాంటి అద్భుత విషయాలు, మనం కలలోగూడా ఊహించలేనివి, మనశాస్త్రాల్లో ఉన్నాయి.

7. విమానరహస్యాలు :

ఆ రోజుల్లోగూడా విమానాలు నడపడమంటే తేలికకాదు. విమాన చోదకుడైనవాడు 32 రహస్యాలను తెలుసుకునుండాలి. అవి : మాంత్రిక, తాంత్రిక, కృతక, అంతరాల, గూడ, దృశ్య, అదృశ్య, పరోక్ష, అపరోక్ష సంకోచ, విస్తృత, విరూపకరణ, రూపాంతర, సురూప, జ్యోతిర్భావ, తమోమయ, ప్రలయ, విముఖ, తార, మహాశబ్దవిమోహన,లంఘన, సార్పగమన, చాపల, సర్వతోముఖ, పరశబ్దగ్రాహక, రూపాకర్షణ, క్రియాగ్రహణ, దీక్రదర్శన, ఆకాశాకార, జలదరూప, స్తబ్ధక, కర్షణ. విమానచోదకుడు అనేకరకాల మంత్ర తంత్రాది విద్యల్లో సిద్ది సాధిస్తేనేగాని విమానం నడపడానికి అర్హత పొందలేడు. అదేగాక భూలోకంనుండి బ్రహ్మలోకం వరకూగల రకరకాల మార్గాలను (ఇవి కోట్లసంఖ్యలో ఉంటాయిట) తెలుసుకుని ఉండాలి. ఈ మార్గాల్లో అనేకరకాల శక్తుల సంఘర్షణలవల్ల సుడిగుండాలు ఏర్పడుతుంటాయి. ఆ సుడిగుండాల్లోకి విమానం వెళితే అది ఛిన్నాభిన్నమైపోతుంది. అటువంటి ప్రమాదాలనుండి రక్షించుకోడానికి అనేక రక్షక యంత్రాలను, వివిధ దర్పణాలను వాడతారు. వాటిగురించి బాగా తెలుసుకోనుండాలి.

20.15. విద్యుచ్ఛక్తులు – విచిత్ర విమాన గతులు :

మన ఋషులు ఈ విమాన తంత్రానికి సంబంధించి అద్భుతమైన అనేక రహస్యాలను మనకందించారు. అవి తెలుసుకుంటుంటే వారికున్న అపార వేదశాస్త్ర పరిజ్ఞానానికి మనమాశ్చర్యపడాల్సిందే, వారికెవరూ సాటిరారు. ఆధునిక మేధావులని అనుకుంటున్న వాళ్ళు వాళ్ళకాలిగోటికి గూడ సరిపోరనిపిస్తుంది. ఈ విద్యుచ్ఛక్తులు సూర్యకిరణాల్లో, తోకచుక్కల్లో ఉన్నాయి. రసాయన విద్యుత్తులు కొన్ని క్షారాలవల్ల, ద్రావకాలవల్ల కలుగుతాయి. ప్రాచీనులు ఈ రసాయన విద్యుత్తులనే ఎక్కువగా వాడేవారు. 12 రకాల విద్యుత్తులను గురించి శాస్త్రాల్లో ఉంది. ఈ 12 రకాల విద్యుత్తులు 12 రకాల విచిత్ర విమానగతులను కలిగిస్తాయి :

  1. చాలనా విద్యుచ్ఛక్తి : విమానాన్ని కదిలిస్తుంది.
  2. కంపనావిద్యుచ్ఛక్తి : విమానానికి కంపనం కలిగిస్తుంది. ]
  3. ఉర్థ్వావిద్యుచ్ఛక్తి : విమానంపైకెగిరేశక్తి.
  4. అథరావిద్యుచ్ఛక్తి : విమానం కిందికి దిగేశక్తి.
  5. మండలావిద్యుచ్ఛక్తి : దీనివల్ల విమానం మండలాకారంగా గిరగిరా తిరుగుతుంది.
  6. వేగినీ విద్యుచ్ఛక్తి : ఇది విమానాన్ని విచిత్రగతులతో నడిపిస్తుంది.
  7. అనులోమావిద్యుచ్ఛక్తి : దీనివల్ల విమానం కుడివైపు ప్రదక్షిణంగా తిరుగుతుంది.
  8. తిర్యంచీ విద్యుచ్ఛక్తి : దీనివల్ల విమానం పక్కగానడుస్తుంది.
  9. పరాన్ముఖీ విద్యుచ్ఛక్తి : దీనివల్ల విమానం వెనక్కినడుస్తుంది.
  10. విలోమ విద్యుచ్ఛక్తి : దీనివల్ల విమానం అపసవ్యంగా ఎడమవైపు నడుస్తుంది.
  11. స్తంభనావిద్యుచ్ఛక్తి : ఇది విమానాన్ని అంతరిక్షంలో స్తంభింపచేస్తుంది.
  12. చిత్రా విద్యుచ్ఛక్తి : దీనివల్ల విమానం నానారకాలుగా తిరుగుతుంది.

అద్భుతమైనది ఇంకోటుంది – చిత్రిణీ విద్యుచ్ఛక్తి. ఇది విమానంలోని 32 యంత్రకార్యాలు చేయగలదు. ఇలా వీటిని నడపడానికి విమానానికి తగినట్లుగా కీళ్ళు ( బటన్స్) ఉంటాయి.

20.16. విద్యుచ్ఛక్తులే ప్రకృతిశక్తులు :

ఈ విద్యుచ్ఛక్తే అనేకరూపాల్లో పూజింపబడుతోందని మంత్రశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఉదా : శ్రీలలితాదేవి యొక్క శ్రీచక్రార్చనలో నవావరణపూజలో – ‘సర్వాశా పరిపూరక చక్రం’ అన్నది 16 దళాల కమలం. ఆ చక్రమంతా విద్యుచ్ఛక్తి మయమే. ఇందులో శక్తి భేదాలు 16 రూపాల్లో వర్ణింపబడ్డాయి. వాటి పేర్లు : 1. కామాకర్షిణి, 2. బుద్ధాకర్షిణి, 3. అహంకారాకర్షిణి, 4. శబ్దాకర్షిణి, 5. స్పర్శాకర్షిణి, 6. రూపాకర్షిణి, 7. రసాకర్షిణి, 8. గంధాకర్షిణి, 9. చిత్తాకర్షిణి, 10. ధైర్యాకర్షిణి, 11. స్మృత్యాకర్షిణి, 12. నామాకర్షిణి, 13. బీజాకర్షిణి, 14. ఆత్మాకర్షిణి, 15. అమృతాకర్షిణి, 16. శరీరాకర్షిణి.

ఇవే నామాలు ఖడ్గమాలలో గూడా ఉన్నాయి. ఈ శక్తులన్నీ పంచభూతాలకి, పంచ ఙ్ఞానేంద్రియాలకి, పంచకర్మేంద్రియాలకి, మనసుకి (5+5+ 5+1=16) సంబంధించినవి. ఇవే శ్రీలలితాదేవినుండి ఉద్భవించిన యోగినీ శక్తుల్లో కొన్ని – విద్యుల్లతలు. వీటినే మనం దేవతలుగా పూజిస్తాం. ఇవే ప్రకృతిలోని శక్తులు. ఇవే ప్రకృతి అంతా వ్యాపించి ఉన్నాయి. ప్రపంచమంటే పంచభూతాలతో కూడుకుని ఉన్నదనర్థం. ప్రపంచమంతా ఎలా పంచభూతాలతో తయారైందో, అలానే మన శరీరం గూడా ఈ పంచభూతాలతో తయారైంది. పంచభూతాలద్వారా ఈ శక్తులన్నీ పనిచేస్తున్నాయి. ఈ శక్తుల పేర్లనిబట్టి అవి చేసే పనులు తెలుస్తున్నాయి. ఉదా: శబ్దాకర్షిణి అంటే శబ్దాన్ని ఆకర్షించే శక్తి -శబ్దజ్ఞానం. ఆ శబ్దశక్తి మనలో పనిచేస్తుంటేనే మనం చెవి ద్వారా శబ్దాన్ని వినగలుగుతున్నాం, నోటి ద్వారా శబ్దాన్ని పలక గలుగుతున్నాం. పంచభూతాల్లో ఒకటైన ఆకాశం యొక్క గుణం శబ్దం. అంటే శబ్దశక్తి బయటి ప్రపంచంలోనూ ఉంది, మన శరీరంలోనూ ఉంది. ఇంకో ఉదాహరణ : రూపాకర్షిణి – రూపాన్ని ఆకర్షించే శక్తి. ఈ శక్తి వల్లనే ఏదైనా దృశ్యాన్ని చూడగలుగుతున్నాం బయటా, మనలోపల గూడా.

ఈ శక్తులన్నీ సెకండ్‌కి 186 వేల మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయిట. అంటే ఈ శక్తులన్నీ కాంతికిరణాల రూపంలో ఉంటాయి గనక ఎంతదూరమైనా ప్రయాణం చేయగలవన్నమాట. ఇవన్నీమనచుట్టూ ఉన్న వస్తువుల ద్వారా గూడా పనిచేస్తున్నాయి. ఉదా : రేడియో, టీవి, సెల్‌ఫోన్, కంప్యూటర్ మొ॥వి. అంటే యంత్రాలు పనిచేయడానికి కారణం గూడా ఈ శక్తులే. రేడియో యంత్రంలో అమర్చిన పరికరం బయట ఎక్కడో ఉన్న శబ్దాన్ని ఆకర్షిస్తుంది. అందులో కేవలం శబ్దశక్తి పనిచేస్తోంది. దీనిలో శబ్దశక్తి, రూపశక్తి గూడా పనిచేస్తున్నాయి. అంటే రెండు శక్తులు పనిచేస్తున్నాయి. శబ్దం ఆకాశ లక్షణం, రూపం అగ్ని లక్షణం. ప్రస్తుతం వాడుకలో ఉన్న సెల్‌ఫోన్‌లో ఏమేమున్నాయో పరిశీలిద్దాం. అందులో శబ్ద, రూపశక్తులు పని చేస్తున్నాయి. మరి శబ్దం ప్రయాణించాలంటే వాయుశక్తి చాలా అవసరం. ఆ ప్రయాణానికి స్థలం (ఆకాశం) గూడా ఎంతో అవసరం. ఇప్పటికి ఆకాశం, వాయు, అగ్ని తత్త్వాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక పదార్థంతో చేసిన, అరచేతిలో పట్టేంత చిన్నపెట్టె పృథ్వీతత్వం కలది. దాన్ని నిప్పులో కాలిస్తే ద్రవంగా మారుతుంది. అంటే పంచభూతత్వాలన్నీ ఉన్నట్టేగా. అది పని చేస్తోందంటే దాని చిప్ లోని ప్రధానశక్తి వల్లే. అదే దానిలోని చైతన్యం – ఆత్మ అన్నమాట. ఇన్ని శక్తులు పనిచేస్తున్నాయి కాబట్టే ఇక్కడనుండి ఎంత దూరంలోనున్న వాళ్ళతోనైనా క్షణాల్లోమాట్లాడగలుగుతున్నాం, దృశ్యాలను గూడా చూడగలుగుతున్నాం.

ఈ చైతన్యమన్నది ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థంలోనూ ఉంటుంది. రాళ్ళలాంటి జడపదార్థాల్లో నిద్రిస్థితిలో ఉంటుంది. మనలాంటి జీవుల్లో మానసిక వికాసం కలిగి ఉంటుంది కాబట్టి మనపన్లు మనం చేసుకోగలుగుతున్నాం. ఈయంత్రాలని తయారుచేసినవారికి అవి ‘ఎనర్జీ’ లనిపిస్తాయిగానీ, మనకులాగ ప్రకృతిలోని దివ్యశక్తులనిపించవు. సెల్‌ఫోన్‌లో అమర్చిన పరికరాన్ని వారు ‘చిప్’ అంటారు. దాన్నే మనం ‘బీజం’ లేక బీజశక్తి అనుకోవచ్చు. అది ఉంటేనే గానీ ఆ యంత్రం పనిచేయలేదు. ప్రతి జీవపదార్థంలో ఈ బీజశక్తి ఉండి అది ఎదిగేట్టు చేస్తుంది. ఒక విత్తనం(బీజం) భూమిలో పాతిపెడితే, అది మొలకెత్తి, పెరిగి, రెమ్మలు, కొమ్మలు కలిగి మనకు పూలు, కాయలు, పళ్ళు ఇస్తుంది. ఆ విత్తనంలో దాని ఎదుగుదలకు, ప్రయోజనానికి కావలసిన జ్ఞానమంతా నిక్షిప్తమై ఉందన్నమాట. ఇదే భగవంతుని సృష్టి విచిత్రం-అద్భుతం! అదే బ్రహ్మం-జ్ఞానం అంటే ! యంత్రాలు మానవులు చేసినవి కనుక వాటితో ఏపని సాధించాలో అంతవరకే పరిమితంగా ఉంటాయి. కాబట్టి దానికి తగినట్టు మాత్రమే ‘కోడింగ్’ ఇస్తారు. ఆ కోడింగ్ మారితే వేరే పని చేస్తుంది. ఈ కోడింగ్ విధానమే మనప్రాచీనులు గూడా పూర్వం యజ్ఞయాగాల్లో మంత్రాల ద్వారా వాడేవారు. అదే ‘సంకల్పం’. ఏ కోరిక తీరాలో, దాన్ని ఆ పని చేసే ముందు సంకల్పిస్తారు. ప్రకృతి అంతా దివ్యశక్తులతో కూడుకొని ఉందన్న సంగతి మన ప్రాచీనులకు తెలుసు. వారిదృష్టిలో అంతా బ్రహ్మమే, పరమాత్మే జ్ఞానమే. దాన్ని ఆశ్రయించుకుని శక్తి ఉంది. కాబట్టి ఆశక్తిని వాడుకోడానికి వారు యజ్ఞయాగాల ద్వారా మంత్రశక్తిని, అంటే శబ్దశక్తిని ఉపయోగించి కావలసినవి సాధించుకునేవారు. యజ్ఞాలు చేసే వారు ఒక సంకల్పంతోచేస్తారు. అంటే ఒక కోడింగ్ ఇస్తారన్నమాట. దాని ప్రకారం ఫలితాలుద్భవిస్తాయి. మన పురాణాల్లో ఎన్నో కథలున్నాయి : యజ్ఞాల్లో రథాలను, ఆయుధాలను పుట్టించినట్లు, ద్రౌపది లాంటి మనుషులు గూడా పుట్టినట్టు. మనం పురాణాలను నమ్మం. పుక్కిటి పురాణాలని హేళన చేస్తాం. ఎందుకంటే, పూర్వంలాగా ఇప్పుడు జరగడంలేదు . దానికీ కారణాలున్నాయి. విదేశీదండయాత్రల్లో మన సంస్కృతి, సంప్రదాయాలు మారిపోయాయి. మనలో చిత్తశుద్దిలేదు. పరిశ్రమల వల్ల వాతావరణమంతా కలుషితమైపోయింది. ప్రకృతి అంతా కలుషితమైంది. దేవతలు మానవులను అనుగ్రహించాలంటే పరిశుభ్రమైన వాతావరణం, పవిత్రమైన ప్రదేశాలు ఉండాలి. లేకపోతే వారు రారు. ఒక పురాణకథ చూద్దాం.

‘శ్రీమహాభాగవతము’ లో ఒక కథ ఉంది. ఒకప్పుడు ఇంద్రుడు త్వష్ట ప్రజాపతి పుత్రుడైన విశ్వరూపుడిని సంహరిస్తాడు. త్వష్ట ప్రజాపతి దానికి ఆగ్రహించి ఇద్రుడ్ని చంపే పుత్రుడికోసం ఓ యజ్ఞం చేస్తాడు – అంటే కోడింగ్ ఇచ్చాడు. కానీ మంత్రోచ్చారణలో స్వరభేదం జరగడంవల్ల ఇంద్రుడు చంపే పుత్రుడు కలుగుతాడు వృత్రాసురుడి రూపంలో. ఈ వృత్రాసురుడు గూడా సామాన్యుడు కాడు. కిందటి జన్మలో తపస్సంపన్నుడే. ఐతే పార్వతీదేవి శాపంవల్ల రాక్షసుడయ్యాడు. త్వష్ట బ్రహ్మ చేసిన యజ్ఞంలో ఆయనకు కొడుగ్గా పుట్టి, ఇంద్రుని చంపబోయి ఇంద్రుని చేత చంపబడ్డాడు. ఆ విధంగా శాపవిముక్తుడయ్యాడు. ఇలాంటి కథలెన్నో ఉన్నాయి మన పురాణాల్లో, మనం ఏ భాషలో సంకల్పం-కోడింగ్ చేసినా ప్రకృతిశక్తులన్నీ సర్వజ్ఞత కలవి గాన, భాషలోని భావాన్ని గ్రహించి తదనుగుణంగా పనిచేస్తాయి. ఈ విషయాలన్నీ మన వాళ్ళు మాత్రమే తెలుసుకున్నారు. మనం రాయి రప్పకీ, చెట్టుకీ పుట్టకీ, నదులూ…॥ వాటికి నమస్కారాలు పెట్టి పూజిస్తున్నామంటే వాటిలో దైవశక్తిని చూస్తున్నాం. ఇంక పుష్పక విమానం గూర్చి కొంత తెలుసుకుందాం.

20.17. హంస యానం-పుష్పక విమానం :

పుష్పక విమానం గురించి రామాయణంలో ఏదో కొద్దిగానే ఉన్నది, దాన్ని గురించిన వివరాలు ఎక్కువగా లేవు. ఓంకారేశ్వర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ ప్రతాపదక్షిణామూర్తి దీక్షితులు గారి ప్రవచనాల్లో ఒకసారి పుష్పక విమానం గురించి చెప్పారు. అవి తెలుసుకుందాం. పూర్వకాలంలో హంసలు ఎక్కువగా ఉండేవి. అవి విమానాలను లాగేవి. వాటి జీవన శైలిని ప్రాచీనులు బాగా పరిశీలించారు. అవి విపరీతంగా తింటాయి. అంతే విసర్జిస్తాయి. హంసల్లో శుక్ల, కృష్ణహంసలని తెల్లనివి, నల్లనివి ఉంటాయి. తెల్లవారినే ఋషులు పరిశీలించారు. ప్రకృతిలో వికృతి రాకూడదని ఈ హంసలతో ఆకాశగమనం సాధ్యమవుతుందని పరిశోధనలు చేసి, హంసవాహనాన్ని (పక్షివాహనాన్ని తయారుచేస్తారు. హంస చాలా పవిత్రమైన పక్షి, దాని రెక్కల్లో గల తూలికల్లో గాలి ప్రవేశించడంవల్ల ఆ గాల్లోని కాలుష్యమంతా పోయి గాలి శుభ్రపడి తేలికవుతుంది. అప్పుడు దాని ప్రయాణం తేలిగ్గా సాగుతుంది. ఈ హంసగమనం జరిగినచోట 30 యోజనాలవరకు వరకూ గాలి శుభ్రపడుతుంది. రెక్కలు కొట్టుకోడం వల్ల గాలి స్వచ్ఛమవుతుంది. అంత పవిత్రత కలది గనుకనే ఈ హంస పాలలో గల నీటిని వేరుచేసి పాలనే తాగుతుంది. ఈ కారణాల వల్ల చాలా హంసలను విమానాలు లాగడానికి వాడుకునేవారు. ఇదే పక్షిశక్తి అంటే. కుబేరుడివద్ద పుష్పకం ఉండేది. మగజాతి (పుంజాతి) హంసలు నడిపిస్తాయి గనక పుష్పకం అన్నారు. ఆ పుష్పకంలో ఒక కోటి, లక్ష జనాలు వచ్చారుట లంక నుండి అయోధ్యకు.

తరువాత హంసల బదులు, ఈ హంసల రెక్కలను వాడేవారు. అప్పుడు వెదురు బొంగులను విమానాలకు వాడేవారు. హంసయానానికి, ఈ వేణుదండంతో తయారుచేసిన విమానాలకు, పక్షులు లేకుండా వాటి పక్షాలను (రెక్కలను) కట్టి, వాటిని ఆడించి ప్రయాణం సాగించేవారు. ఈ వెదురు పొదలు నీరున్న చోట బాగా పెరుగుతాయి. మహాకార్తెలో, మేఘాలు ఎంతగట్టిగా గర్జిస్తే ఈ వెదురుచెట్లు అంత ఎత్తుకి ఎదిగిపోతాయి. వెదురు ఆకాశంలోని వాతావరణంలోగల కాలుష్యాన్ని పోగొడుతుంది. వాయువుకుగల కలుషితాన్ని సరిచేసేగుణం ఉండడంవల్ల, వెదురు బొంగులను మంచంలాగాచేసి విమానాలకు వాడేవారు. కిందనుండివచ్చే వాయువు, పైనుండి వచ్చే వాయువు పరస్పరం సంఘటితమవడంవల్ల ఆకాశంలో ఈ విమానాలు ఆగిపోగలవు గూడా. అందుకే నావలకు గూడా వెదురునే వాడేవారు. పురాణల్లో ఓ కథ ఉంది. తులసి భర్త శంఖచూడుడు శివభక్తుడు. విమానంలో కైలాసం వెళ్ళి శివుని దర్శిండానికి ఈ హంసపక్షాలను సంపాదించాడు. అవి 9 అడుగుల పొడవు గల 8 రెక్కలు, 9 అడుగుల వెడల్పు గల 3 రెక్కలు, 9 అడుగుల ఎత్తు గల 3 రెక్కలు. వాటిని ఉపయోగించి కైలాసానికి దూరంగా ఆపి, శివుని వద్దకు నడుస్తూ వెళ్ళి శివదర్శనం చేసేవాడుట. ఇలాంటి అద్భుతమైన విమానశక్తి గురించి మన వేదాల్లో ఉంది. మన ఆర్యభట్ట విమానయానం చేసాడుట, మనం నమ్మం. ఎందుకంటే మనకు ఏమీ తెలియదు. వేదభాష కూడా అర్థంకాదు. చాలామంది వేదవిద్యార్థులు వేదపఠనం చేస్తారుగానీ వేదానికి అర్థం చెప్పలేరు. వేదానికి అర్థం చెప్పగలిగినవారిలో ప్రస్తుతం ఉన్నవారిని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చేమో! మనకు తెలియదు. వేదార్థం చెప్పగలిగినమహాత్ములు శ్రీశ్రీశ్రీ ప్రతాప దక్షిణామూర్తిదీక్షితులు గారు ఇంకా కొన్ని వింత విషయాలు చెప్పారు. అవి చూద్దాం.

20.18. వేదాల్లోని కొన్ని విజ్ఞానవిషయాలు :

1. పర్వతాలు అసలెందుకున్నాయి?

పర్వతాలుభూమికి ఆధారభూతాలు. అవి లేకపోతే భూమి నీటిలో నిలువలేదు. పర్వతాలను మనం పిండి చేసేస్తున్నాం. అంటేచాలా తొందరగా భూమికి నీటిలో మునిగిపోయేకాలం వస్తుందన్నమాట.

2. మేఘాలు మంచినీటిని ఎలా వర్షిస్తాయి?

నీటికిగూడా రుచులుంటాయి : తీపి, ఉప్పు, చేదు మొ॥వి. మేఘాలు సముద్రం లోని ఉప్పును తీసుకుని మంచినీటిని వర్షిస్తాయి. గాలివల్ల ఉప్పుపలచబడి, కరిగిపోతుంది.

3. సముద్రంలో మణిమణిక్యాలు ఎలా ఏర్పడుతున్నాయి?

వాయువులో 64 లక్షణాలున్నాయి. దానివల్ల, కంటికికనిపించని వాయువు సముద్రంలో మథనం గావించడంచేత మణిమణిక్యాది ధాతువులు కలుగుతున్నాయి. ఈ మథనం సముద్రం మధ్యలో జరుగుతుంది. అందువల్లనే భూమి సముద్రంలో మునిగిపోకుండా ఉంటుంది.

4. అగ్ని పర్వతాల్లో లావా ఎలా ఏర్పడుతుంది?

వాయుసంఘర్షణ వల్ల అగ్ని ఏర్పడుతుంది. ఎంత అగ్ని పృధ్వికి అవసరమో అంతే పృధ్విలో ఉండి, ఎక్కువైంది అగ్నిపర్వతాలద్వారా లావాలాగ బహిర్గతమవుతుంది. మనం గుర్తు పెట్టుకోవలసిందేంటంటే ఈ ప్రపంచమంతా పంచభూతాలతో నిండి ఉంది. ఒక్కోభూతంలో తక్కినభూతాలుగూడా వాటికి తగపాళ్ళలో కలగలిపి ఉంటాయి. అందుకే నీటిలో, భూమిలో గూడా అగ్ని ఉంటుంది.

5. మన భూఖండాలు సముద్రంలో ఎందుకు తేలిఉంటాయి?

సముద్రంలో గల ఉష్ణశక్తి వల్ల భూమి తేలుతూ ఉంటుంది. ఉదా : మట్టికుండలో నీరుపోసి కాచితే ఆవిరొస్తుంది. దానిమీద ఒక లోహ పాత్ర పెడితే అది ఎగురుతూ ఉంటుంది ఎంతవరకు ఉష్ణశక్తి ఉంటుందో అంతవరకు.

5.1. పక్షుల్లో గూడా సంస్కారముంటుందా?

కొన్ని పక్షులు వాతావరణంలోని కాలుష్యాన్ని తీసివేసేస్తాయి. ఉదా: భరద్వాజపక్షి నల్లగా ఉంటుంది. దానికి వాతావరణం గురించిన జ్ఞానం ఉంది. శిశిరఋతువులో, అంటే మాఘ, ఫాల్గుణాల్లో ఆకులు రాలిపోతుంటాయి. ఎండకి మంచు కరుగుతూ ఉంటుంది. వాతావరణం కలుషితమవుతుంది. ఆ సమయంలో ఈ పక్షి రెండున్నర అడుగులున్న ప్రత్యేకమైన ఓచెట్టుమీద వాలి, దాని ఆకులు తుంచి, ముక్కున కరచుకుని ఉదయంనుండి ఎంతోదూరం ప్రయాణించి, వాతావరణంలోని కాలుష్యాన్ని నిర్మూలించడానికి తనవంతు సహాయం చేసి, తిరిగి మధ్యాహ్నానికి మళ్ళీ అదే చెట్టు మీదకు వచ్చి వాలుతుంది. ఇదే పక్షి శివరాత్రి నాడు ఉదయంనుంచి మరుసటి ఉదయంవరకు ఓ చెట్టుకొమ్మన కూచుని ఉపవాసం, జాగరణ చేస్తుందిట. అలా ఆస్వాదించిన ప్రకృతిశక్తిని వాతావరణంలో వెదజల్లుతుందిట, దాన్నిశుభ్రపరచడానికి. పక్షుల యొక్క సౌజన్యం మహాత్ములకే తెలుస్తుంది.

6. గద్ద తన పిల్లలమీద ఎలాంటి నిఘా పెడుతుంది?

గద్ద తన పిల్లలనుంచిన చెట్టు గూడులో ఒక ప్రత్యేకమైన కర్రపుల్లనుంచుతుందిట. దానివల్ల అది ఎంత దూరం పోయినా తనకి ఆ గూడు కనబడుతుంది ఆ పుల్లని బట్టి. ఈ విషయాన్ని శ్రీశ్రీశ్రీ ప్రతాపదక్షిణామూర్తి దీక్షితులుగారు స్వయంగా చూసారుట. వారు కొంతమందితో కలిసి హిమాలయప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఒకచెట్టు కింద నుంచుంటే వారికి వారిశరీరాల్లోని నాడులు మాత్రం కనిపించాయిట. ఆ చెట్టు మీద ఈ పక్షి గూడు ఉందిట. చెట్టు దాటివచ్చాక వారికి వారి శరీరాలు మామూలుగా కనిపించాయిట. తర్వాత, శాస్త్రాల్లో – అధర్వణ వేదంలో దానికి సమాధానం కనిపించిందిట. ఇలాంటి చమత్కారాలు సాధ్యమేనన్నమాట! ఈ కర్రపుల్ల ‘సంజీవని’ మొక్కకు సంబధించినది. దీన్ని గురించి వచ్చే అధ్యాయంలో తెలుసుకుందాం.

20.19. మనకి కాకుండాపోయిన మన విద్యలు:

మన వేదాల్లో మనకు తెలియనివి ఎన్నోవిషయాలు ఉన్నాయి. పాదరసవిజ్ఞానం, అయస్కాంత విజ్ఞానం గురించి గూడా బోలెడంత ఉంది. పాదరసం ఎలా ఏర్పడింది? శివపార్వతుల కళ్యాణం అయ్యాక దేవతలు శివపుత్రుని కోసం తొందరపడసాగారు. అప్పుడు శివుడు తన తేజస్సును అగ్నిదేవుని కందించాడు. అగ్ని దాన్ని మోసుకు పోతుండగా కొంత జారి భూమ్మీద పడింది. అదే పాదరసంగా ఏర్పడింది. మనకు మన ప్రాచీన విద్యలన్నీ అందకుండా పోయాయి. ఇప్పటికైనా మనవారు వేదశాస్త్రాధ్యయనానికి ఎక్కువ ప్రోత్సాహకాలందిస్తే మనం బాగుపడతాం. ఈమధ్య ఓ బుల్లితెర మాధ్యమంలో వేదాలమీద చర్చజరిగింది. సారాంశమేంటంటే, మనకు చెందిన ‘నాక్షత్రకల్పం’ అనే శాస్త్రం జర్మనీలో ఓ గ్రంథాలయంలో ఉందిట. మనవద్ద అది లేదుట. ఈ శాస్త్రంవల్ల మనకు మన భూమిలోపల గల కొన్నిరకాల నూనె పదార్థాల గురించి తెలుస్తుందిట. అంటే పెట్రోలియం లాంటి వాటి గురించి తెలుస్తుంది. ఆవును ఉపయోగించి – నడిపించి తెలుసుకోవచ్చుట. మనకు 64 కళలున్నాయన్నారు, కానీ ఇంకో 64 కళలు,ఇంకా ఇంకా గూడా ఉన్నాయిట. అనంతమైన వేదశాస్త్రాల్లో కొంచెమే మనకు దక్కాయి. అందులో చాలామటుకూ విదేశీయుల వల్ల అగ్నికి ఆహుతి అయ్యాయి. కొందరు విదేశీయులు కొన్నిటిని తస్కరించుకు పోయారు. కొద్దిగా మిగిలిన వాటికి అర్థం చెప్పేవాళ్ళు గూడా ఇప్పుడు కరువయ్యారు, విదేశీ విద్యలకే మనం ప్రాముఖ్యం ఇచ్చి, వాటినే నేర్చుకుంటున్నందువల్ల, ఇంతటితో వేదాల్లో విజ్ఞానం గురించి చాలిద్దాం. వచ్చే అధ్యాయంలో కొందరు మహానుభావులను గూర్చి తెలుసుకుందాం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here