దివినుంచి భువికి దిగిన దేవతలు 21

0
8

[box type=’note’ fontsize=’16’] మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞాన రహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రచన చేశారు డా. ఎం. ప్రభావతీదేవి. [/box]

ఎందరో మహానుభావులు

21.0. మన ప్రాచీన శాస్త్రాల్లో ఊహకందని వింతలు:

[dropcap]ఇం[/dropcap]తవరకు మన భారతీయ శాస్త్రాల్లోని కొన్ని వింతవింత విజ్ఞానరహస్యాలను గూర్చి తెలుసుకున్నాం. విశ్వమెంత అనంతమో వేదాలుగూడా అంతే అనంతం. ఈ వేదాల్లోని విషయాలను నమ్మగలిగితే అంతకన్నా ఆనందమింకోటి ఉండదు. ఇదంతా అపోహే, కల్పనే అననుకుంటే ఇంతకాల్పనిక సాహిత్యాన్నందించిన మన ప్రాచీనుల మేధాశక్తికి ఆశ్చర్య పోవాలి. ఎందుకంటే అలాంటి కల్పనలను మనమూహించలేం కలల్లోగూడా చూడలేం. ఈకాలంలో గూడా ప్రాచీనుల్లాంటి ఋషితుల్యులు కొందరున్నారు. వారిని గూర్చి గూడా తెలుసుకుందాం ఈ అధ్యాయంలో. వారిని తెలుసుకునే ముందు మనకు రామకృష్ణాది అవతారాల గురించి కొన్ని అపోహలున్నాయి. వాటిని విచారిద్దాం.

21.1. రాముడు సీతాపరిత్యాగమెందుకు చేసాడు?

రాముడు అవతారపురుషుడైనప్పటికీ మానవుడిలాగ ప్రవర్తించి,మానవుడు ఎలా ఆదర్శపురుషుడుగా జీవించగలడన్నది ఆచరించి చూపించాడు. తాను అలా జీవించి మనకారాధ్యుడయ్యాడు. ఇంక ఆయన సీతాదేవిని ఎందుకు త్యజించాల్సివచ్చిందో గూడా తెలుసుకోవాలి. సీతారాములు చాలాకాలం జీవించారు. దాదాపు 11వేల సం॥లని రామాయణంలో ఉంది. దేవతల ప్రార్థన వల్ల వారికి అవతార సమాప్తి చేయాల్సిన సమయం వచ్చింది. అందువల్ల ముందుగా ఓ అపవాదుని సృష్టించి సీతను త్యజించాడు. ఆ విషయాన్ని గూర్చి సీతతో సమాలోచన చేసాడు ముందుగా. ఆవిడ గర్భవతని తెలుసు. అందుకే ఋష్యాశ్రమానికి పంపించాడు. ఆవిడ అక్కడే పిల్లల్నికని రాచరికపు వాతావరణంలో కాకుండా, ఋష్యాశ్రమ వాతావరణంలో పిల్లల్ని పెంచగలదని తెలిసే చేసాడు. ఇది రామాయణం చదివిన వారికి తెలుస్తుంది. సీత భూప్రవేశం చేసాక, తాను గూడా వెళ్ళిపోయాడు వైకుంఠానికి.

21.2. కృష్ణునికెందుకు వేలమంది భార్యలు?

కృష్ణునికి అష్టభార్యలు కాక ఇంకా 16 వేల మంది భార్యలున్నారు. ఇంతకీ కృష్ణుడు వారి వెంటపడ్డాడా లేక వాళ్ళు ఆయన వెంట పడ్డారా? రుక్మిణీ కళ్యాణం ఎలా జరిగిందో అందరికీ తెలుసు. రుక్మిణీదేవి తనకు శిశుపాలునితో వివాహం జరగబోతోందని, అది తనకిష్టం లేదని, తను కృష్ణుడినే భర్తగా వరించానని,తన్ని శిశుపాలుడి నుంచి రక్షించి, వివాహమాడమని ఒక బ్రాహ్మణుడితో సందేశం పంపింది. దాని ప్రకారం కృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకున్నాడు. తక్కిన భార్యలను గూడా సాహసకృత్యాలు చేసి గెలిచి మరీ వివాహమాడాడు. ఇంక 16 వేల మంది రాచకన్యలను ఎలా పెళ్ళాడాడన్నది చూద్దాం. నరకాసురుడు వామాచార పూజల కోసం16 వేలమంది రాచకన్యలను బంధించి అత్యాచారం చేసాడు. నరకుడ్ని సంహరించాక కృష్ణుడు వారిని వారి రాజ్యాలకు వెళ్ళిపొమ్మన్నాడు. వారు తాము తమరాజ్యాలకు వెళ్ళమని చెప్పి, కృష్ణుడ్నే పతిగా కావాలని వేడుకున్నారు. వారి ప్రార్థనలు మన్నించి వారిని తాను వివాహమాడాడు. వారికి తన భార్యల స్థానాలిచ్చి వారి గౌరవాన్ని పెంచాడు. అదీ కృష్ణుని ఔన్నత్యం. గోపికలతో రాసక్రీడలాడాడంటారు. భాగవతంలోనే ఉంది గోపికలంటే పూర్వజన్మల్లో తపస్సు చేసినవారు. వారికి ముక్తినివ్వడానికే ఆయన వారిని దగ్గరకు చేరదీసాడు. ఐనా ఆయన పరమాత్ముడు గనక ఆయన సృష్టిలోని వారే అందరూ గనక ఆయన ఏంచేసినా చెల్లుతుంది. అందుకే ఆయన భూమ్మీద అవతరించి కొందరిని అనుగ్రహించాడు, కొందరిని శిక్షించాడు. అందుకే ఆయనవి కృష్ణలీలలు అంటారు.

21.3. నవనాథులు:

మన భారతదేశంలో ఎందరో మహాత్ములున్నారు. వారిప్పటికీ పర్వతగుహల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారని నానుడి. ఇలాంటి మహాత్ములే నవనాథులు. వారు ఇటీవలి కాలానికి చెందినవారేనట. వారి పుట్టుకే చిత్రం. వారిని గూర్చి సూక్ష్మంగా తెలుసుకుందాం. మన భూమ్మీద స్థూలసృష్టి మొదలయ్యాక ప్రియవ్రతుని వంశానికి చెందిన సంతానం ద్వారా కలిగిన మహాత్ముల్లో ఒకరైన ఋషభ చక్రవర్తికి 100 మంది పుత్రులు. వారిలో 9 మంది సంసారమందు విరక్తికలిగి అవధూతమార్గాన్ని ఎంచుకున్నారు. వారే నవనాథులు- నవనారాయణులు. ఈ తొమ్మండుగురు నారాయణాంశ సంభూతులు. వారు: కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిరోత్రుడు, దృమీళుడు,చమసుడు,కరభాజనుడు. వీరంతా అవధూత స్థితిలోనుండే సిద్ధపురుషులు. ఐతే ధర్మస్థాపన చేయడానికి వీరంతా మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు. ఆ క్రమంలో వీరు నవనాథులుగా అవతరించారు.

1. కవి = మత్కేంద్రనాథుడు :

ఉపరిచరవసువు అన్నవాడు ఊర్వశినిచూసి మోహించగా అతనివీర్వం ద్రవించి యమునానదిలో పడింది. దాన్ని ఒక చేప తాగింది. ఆ మత్స్యం నుండి మత్సేంద్రనాథుడు పుట్టాడు.

2. హరి = గోరక్షకనాథుడు: గోరక్ నాథుడు=మత్సేంద్రనాథుని శిష్యుడు:

మత్సేంద్రనాథుడు దేశసంచారం చేస్తున్నప్పుడు కొంత భస్మాన్ని ఒక సంతానంలేని స్త్రీ కివ్వగా ఆమె దాన్ని పెంటకుప్పలో పడేసింది. అందులోనుండి గోరక్షకనాథుడు ఉద్భవించాడు.

3. అంతరిక్షుడు= జాలంధరనాథుడు:

బృహద్రధుడన్నరాజు యజ్ఞంచేయగా ఆ యజ్ఞకుండం నుండి జాలంధరనాథుడు ఉద్భవించాడు.

4. ప్రబుద్ధుడు= కర్ణకానీఫా:

బ్రహ్మదేవుడు సరస్వతిని చూసి మోహించగా ఆయన వీర్యం హిమాలయ ప్రాంతాల్లో నిద్రిస్తున్న ఒక ఏనుగు యొక్క చెవిలో పడింది. ప్రబుద్ధుడు జీవదశనొంది ఆ ఏనుగు చెవినుండి జన్మించాడు.

5. పిప్పలాయనుడు= చర్పటనాథుడు:

బ్రహ్మగారు శివపార్వతుల కళ్యాణమప్పుడు, పార్వతి రూపంచూసి మోహితుడవగా ఆయన వీర్యం ద్రవించింది. దాన్ని ఆయన ఎవరికీ తెలియకుండా కాలిమడమతో తొక్కి రుద్దగా 60వేలమంది వాలఖిల్యులనే ఋషులు జన్మించారు. దానిలో కొంత బాగం మిగిలిపోయి పెంటకుప్పగా మారి భాగీరథీ నదిలో పడి రెల్లుదుబ్బులో చిక్కుకు పోయింది. దాంట్లో పిప్పలాయనుడి ఆత్మ ప్రవేశించి చర్పటనాథుడు ద్భవించాడు.

6. అవిర్హోత్రుడు= నాగేశనాథుడు:

బ్రహ్మ వీర్యం అనేకచోట్ల పడింది. కొంతభాగం ఒక నాగసర్పం తలమీదపడగా దాన్ని అది తినే పదార్థమనుకుని తినగా గర్భం ధరించింది. ఆ సర్పం నుండే ఆస్తీకుడు అనే ఋషి జన్మించాలి గనక తక్షకుని పుత్రిక ఆ సర్పాన్ని ఒక మర్రిచెట్టు తొర్రలో దాచి ఉంచింది. అందులోనుండి వటసిద్ధనాగనాథుడనే పేరుతో అవిర్హోత్రుడు జన్మించాడు.

7. దృమీళడు= భర్తరీనాథుడు :

కౌశికుడు అనే ఋషి తన భిక్షాపాత్రను తన పర్ణసాల బయట ఉంచగా, అందులో సూర్యుని రేతస్సు పడింది. దాన్ని మహర్షి భద్రపరచగా అందులోనుండి భర్తరీనాథుడు జన్మించాడు. భర్తరి అంటే భిక్షాపాత్ర, దాన్నుండి జన్మించాడు గాన భర్తరీనాథుడన్న పేరు వచ్చిందాయనకు.

8. చమసుడు=రేవణసిద్ధుడు:

బ్రహ్మవీర్యం రేవానది( నర్మదానది) లో పడగా రేవణసిద్ధుడు జన్మించాడు.

9. కరభాజనుడు = గహనీనాథుడు:

గోరక్షకుడు సంజీవని మంత్రం చదువుతూ మట్టితో మనిషి బొమ్మ చేయగా కరభాజనుడి ఆత్మ అందులో ప్రవేశించి గహనీనాథుడుగా అవతరించాడు.

వీరంతా శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం మందరపర్వతంలో తమ స్థూలశరీరాన్ని భద్రపరచి తమతమ అంశల చేత భూలోకంలో నవనాథులుగా అవతరించారు. వీరినే నవకృష్ణులు, నవనారాయణులు అని గూడా అంటారు. భారతదేశంలో ఎందరో మహాత్ములు అవతరించి ఈ భూమిని పవిత్రం చేసారనడానికి నిదర్శనంగా ఈ విచిత్రమైన జన్మలుగల నవనాథులను గూర్చి ప్రస్తావించటం జరిగింది.

21.4. వైదికధర్మవినాశనం:

సృష్టి జరిగినప్పటినుండి ఈ భూమిని ఎందరో రాజులు పాలించారు. వారిలో దర్మబద్ధంగా రాజ్యం చేసిన వాళ్ళున్నారు, ప్రజలను పీడించి పాలించిన వాళ్ళూ ఉన్నారు. ఈ కలియుగం వచ్చాక రాజుల్లో ధర్మబుద్ధి క్షీణించింది. యజ్ఞయాగాల్లో పశుబలులు ఎక్కువవడం మూలాన బౌద్ధంలాంటి కొత్త మతాలు పుట్టుకొచ్చి వైదిక ధర్మాన్ని నాశనం చేయాలని చూసాయి. వర్ణాశ్రమధర్మాలు లోపించాయి. అందరూ ఒకటేనంటూ గుంపులు గుంపులుగా బౌద్ధభిక్షువులు గృహస్థుల ఇళ్ళ మీద పడసాగారు భిక్ష కోసం. రాజులను వశపరచుకుని బౌద్ధ భిక్షకులను పోషించేట్టు చేసారు. సైనికులు, సైన్యాలు తగ్గిపోయాయి. ఇదే అదనుగా భావించి విదేశీయులు మనదేశమ్మీద దండయాత్రలు చేసారు. నిర్వీర్యులైన భారతీయులు లొంగిపోయి మతాలు మార్చుకుని జీవించసాగారు. చదవండి కల్హనుడి ‘కశ్మీరరాజతరంగిణి’. బుద్ధుని అనంతరం బౌద్ధం గూడా కలుషితమైపోయింది. అందులో తంత్రం చోటు చేసుకుంది. బౌద్ధులు అనేక విధాలుగా వైదిక బ్రాహ్మణులను హింసించారు బౌద్ధమతంలోకి మారమని. మారనివారిని సజీవదహనం గూడా చేసేవారు. రాజులు ఇవేవీ పట్టించుకోలేదు. బౌద్ధసన్యాసులు చేసిన ఆగడాలు ఇన్నీ అన్నీ కావు. తర్వాత విదేశీయులవల్ల బౌద్ధులందరూ మాతమార్పిడికి లోనయ్యారు. తర్వాత విదేశీయులు భారతదేశంలోని ఒక్కో ప్రాంతాన్ని యుద్ధోన్మాదంతో స్వాధీనపరచుకుని మనల్ని కొల్లగొట్టి, ఊచకోతలు కోసి, మతమార్పిడులు చేసి మన అస్తిత్వం మీదే దెబ్బకొట్టారు. విదేశీ సంస్కృతుల్లో మన ఉనికే ప్రమాదకరంగా మారిపోయింది. దైవభీతి, పాపభీతిలేని వాళ్ళ సంస్కృతి వల్ల మనం గూడా దైవాన్ని గురించిన జ్ఞానాన్ని మరచిపోయాం.

21.5. ఎందరో మహనీయులకు పుట్టినిల్లు భారతదేశం:

దైవసమానులైన వేదవేత్తలకు జన్మనిచ్చింది ఈ భరతభూమి. దేవుళ్ళు దివినుండి భువికవతరించిన చరిత్ర మనకుంది. విష్ణువు రామకృష్ణాది అవతారాలెత్తాడు. దత్తాత్రేయులవారు అనేక అవతారాలెత్తారు మనల్ని అనుగ్రహించడానికి. ఎందరో మహాత్ములు పుట్టుకొస్తూనే ఉన్నారు, లుప్తమైపోతున్న మన ధర్మాలను పునరుద్ధరించడానికి. ఉదాహరణకి సూర్యుడినే శపించబోయారు భాస్కరరాయల వారు. వారు పిలిస్తే పలికేది పరాశక్తి. చైతన్య ప్రభువు కృష్ణ భక్తితో ఎందరో దుర్మార్గులను సైతం సన్మార్గులుగా మార్చాడు. తులసీదాసు ఎన్ని అద్భుతాలు చూపాడో, తన రామభక్తివల్ల. విదేశీయుల పాలనలో విసిగి విరక్తి చెందిన హిందువులకు దైవమున్నాడా అన్న సందేహం కలిగినప్పుడు బెంగాల్‌లో రామకృష్ణ పరమహంస గారు దైవమున్నది అని చెప్పి వివేకానంద లాంటివాళ్ళలో దైవంపట్ల నమ్మకం కలిగేట్టు చేసారు. ఇటు దక్షిణభారతంలో రమణమహర్షి వల్ల దైవంపట్ల నమ్మకం కలిగింది చాలామందికి. మళ్ళీ మనవారికి లుప్తమైపోయిన జ్ఞానమార్గం లభించింది. మన శాస్త్రాల మీదకు ధ్యాస మళ్ళింది. వివేకానంద, అరవిందులు,యోగానంద, మహేశ్ యోగి లాంటి వారివల్ల విదేశాల్లో భారతీయ ఆధ్యాత్మికత అంటే ఏంటో అందరికీ తెలిసింది. యోగవిద్యలకి ప్రాచుర్యంలభించింది. భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. కొందరు మహనీయుల గూర్చి తెలుసుకుందాం.

21.6. శ్రీ కంచి మహాస్వామి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి:

ఎందరో మహాత్ములిప్పటికీ మనదేశంలో ఉన్నారనడానికి నిదర్శనం జగద్గురువులుగా పేరు గాంచిన ఆదిశంకరులు స్థాపించిన పీఠాలు – శంకరమఠాలు (శృంగేరి, పూరి మొ॥వి), ఆ మఠాలకు చెందిన పీఠాధిపతులు. ఇంకా అనేక సంప్రదాయాలకు చెందిన యతీశ్వరులున్నారు. వీరంతా దేశం కోసం, ధర్మం కోసం పాటుపడుతూనే ఉన్నారు. వారిని గూర్చి అనేక కథలున్నాయి. మనమిక్కడ కంచి కామకోటి పీఠానికి చెందిన నడిచే దేవుడు అని పేరుగాంచిన పరమాచార్యశ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతుల వారిని గూర్చి చర్చించుకుందాం.

కంచి కామకోటి పీఠానికి చెందిన 68వ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు మనమధ్య ఇప్పుడు లేకపోయినా మన హిందూధర్మ/మత రక్షణకు ఎంతో కృషి చేసారు. ఆయన సన్యాసి అయినప్పటికీ మన హిందూధర్మానికి రాజ్యాంగ బద్ధంగా రక్షణ కల్పించడానికి ఎంతో కృషి చేసారు. ఆ సంగతి చాలామందికి తెలియదు. ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశానికి స్వతంత్రం రాకముందు మన మతసంస్థలు నిస్సహాయ స్థితిలో ఉండేవి. వాటికి రాజ్యాంగ రక్షణ లేదు. ఈ విషయాన్ని జాతీయోద్యమ నాయకులు గమనించలేదు. మన జాతీయోద్యమ నాయకులు రాజకీయాలకే ప్రాధాన్యతనిచ్చారు గానీ మన మతం పట్ల ఉపేక్ష వహించారు. దానివల్ల మనకు స్వతంత్రం సిద్ధించిన నాడు మన మతానికి, ఆధ్యాత్మిక ప్రయోజనాలకూ హానికలగవచ్చని కంచిమహాస్వామి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మటుకూ అనుమానించారు. ఈ విషయమై చాలామంది రాజకీయనాయకులను హెచ్చరించారు. కానీ ఆ నాయకులు అవన్నీ లెక్కచేయలేదు. అప్పడు స్వామి ఒక్కరే మతసంరక్షణకై అవిశ్రాంతంగా 5 సం॥లు పాటుపడ్డారు. తనవద్దకువచ్చే కొంతమంది ప్రముఖుల ద్వారా ఆంగ్లేయులకు సైతం తగిన సలహాలు, సూచనలు అందజేసి తెరవెనుకనే ఉండి ఎంతో కృషిచేసారు.

భారత రాజ్యాంగనిర్మాణదశలో వారు ప్రదర్శించిన రాజకీయ పరిజ్ఞానం వల్లనే నేడు మన రాజ్యాంగ చట్టంలో మతస్వాతంత్ర్యానికి, మత సంస్థల సంరక్షణకూ నియమ నిబంధనలు స్థిరంగా నెలకొన్నాయి. మతం ప్రాధమిక హక్కుగా పరిగణించాలని సూచించారు. అన్నిమతాలు, ఆ మతాలకు చెందిన అన్ని శాఖలు ఈ హక్కులు కలిగి ఉంటాయి. ‘మతస్వాతంత్ర్యం’ అన్న పదానికి ముందు ‘చట్టసమ్మతమైన’ అన్న మాటలను చేర్పించాలని సూచించారు. వారి కృషే లేకపోతే ఇప్పుడు ఇంకా ఘోర పరిస్థితుల్లో ఉండేది మన హిందూధర్మం/మతం. బ్రహ్మజ్ఞానానికి లౌకిక జ్ఞానం గూడా తోడైతే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నది ఈ స్వామిలోనే చూస్తాం.

21.7. బ్రహ్మశ్రీ మద్దూరి వెంకటేశ్వర యాజులుగారు – గొప్పకర్మిష్ఠి:

దేశమంటే మట్టేకాదు మనుషలుగూడా. మనభారతదేశం ఎంతోమంది పుణ్య పురుషులకు పుట్టినిల్లు. పుణ్యపురుషుల్లో ఒక యతీశ్వరుడి గురించి తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు ఒక వేదపరుషుడి గురించి గూడా తెలుసుకుందాం. మన వైదిక ధర్మంలో యేయే క్రతువులు చేస్తే యేయే పదవులు వస్తాయో గూడా ఉంది. 100 యజ్ఞాలు చేస్తే ఇంద్రపదవి లభిస్తుందంటారు. అలాంటప్పుడు ఇంకా ఎక్కువ క్రతువులు చేస్తేనో? చెప్పలేం. అలాంటి యజ్ఞపురుషుల్లో ఒకరు బ్రహ్మశ్రీ మద్దూరి వెంకటేశ్వర యాజులుగారు. మనం లోగడచెప్పుకున్నాం యజ్ఞయాగాలు, తపస్సులు చేసి పండిపోయినవాళ్ళని ఈశ్వరుడు తనలోనికి తీసుకుని అవసరం వచ్చినప్పుడు విశ్వనిర్వహణ కోసం వారిని వాడుకుంటాడు తగిన పదవులిచ్చి అని. అలాంటి మహాపురుషులు మనమధ్య ఉంటూనే ఉంటారనడానికి సాక్ష్యం బ్రహ్మశ్రీ మద్దూరి వెంకటేశ్వర యాజులుగారు. ఈ యజ్ఞపురుషడిని నిత్యాగ్నిహోత్రిని, అహితాగ్నిని ఇంద్రుడిగా అభివర్ణించారు ఒక కార్యక్రమంలో. ఈయన బందువర్గానికి చెందిన దాన్నైనప్పటికీ ఆయన ఇంత గొప్పవారని తెలియదు. ఈయన్ను గురించి పత్రికల్లో చదివాక అద్భుతమనిపించి కొన్ని విషయాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది.

తెలుగునాట సనాతన భారతీయ వైదిక ధర్మాన్ని, సంస్కృతిని పరిరక్షిస్తున్న కుటుంబాలు ఇంకా కొన్నిచోట్ల ఉన్నాయి. వారు కేవలం వైదికధర్మాన్ని కొనసాగించడానికి ఎంతో నిరాడంబరంగా జీవిస్తున్నారు. అలాంటివారిలో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ మద్దూరి వెంకటేశ్వర యాజులుగారిని అగ్రగణ్యులుగా పేర్కొనవచ్చు. బ్రహ్మశ్రీమద్దూరి వెంకటేశ్వర యాజులుగారు 13.7.1925 నాడు కృష్ణాజిల్లాకు చెందిన జుజ్జూరులో జన్మించారు. వీరు కృష్ణయజుర్వేదం, ఆగమశాస్త్రం, స్మార్తం, శ్రాత, వ్యాకరణశాస్త్రాల్లో అపార పాండిత్యం గణించారు. అనేక యజ్ఞయాగాలు అనేకచోట్ల నిర్వహించారు: అగ్నిష్టోమం, అత్యాగ్నిష్టోమం, ఉర్ధ్యం, షోడశీ, వాజపేయం, అతిరాత్రం, ఆపోర్యామం, సప్తసోమయాగాలతో పాటు పౌండరీకం, ఆప్తవాజపేయం, జ్యోతిర్వాజపేయం, చతుర్ధాగ్నియుక్త సర్వజిన్మహావ్రతం, నాచికేత యుక్త సర్వస్తోమ సర్వవృష్ట ఆప్తోర్యామం మొ॥వి. వైదిక సంప్రదాయాలను నిలబెట్టడానికి అనేక క్రతువులు చేస్తూ, నిత్యకర్మానుష్టానాన్ని త్రికాలాగ్నిసత్రంతో ముడి పెట్టి, ఎంతో నియమనిష్ఠలతో వారు తమ జీవనాన్ని కొనసాగించారు. ఆస్తికలోకానికి మార్గదర్శకంగా నిలుస్తున్న అహితాగ్ని యజ్ఞ పురుషులు వారు. 50 సోమయాగాలు, 600 పైగా ఆలయప్రతిష్ఠలు, వందలాది ఇతర క్రతువులు నిర్వహించారు. ఎంతో మంది శిష్యులను తీర్చిదిద్దారు. ఎందరో పీఠాధిపతులు వారిని ప్రశంసించారు. వారు దేవాదాయ శాఖ ఆగమ సలహామండలి అధ్యక్షులుగా విజయవాడ దురామల్లేశ్వర దేవస్థానం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానాలకు ఆగమ సలహాదారులుగా సేవలందించారు. అనేక బిరుదులు పొందారు. నేపాల్‌లో ఖాట్మండులో క్రతువు నిర్వహించగానే భారీవర్షం కురిసింది. అందుకు నేపాల్ రాజు సత్కరించారు. ఇలాంటివారే నన్నమాట భూసురులు అంటే. వైదిక ధర్మాన్ని చులకన చేస్తూ మాట్లాడేవారికి కనువిప్పు కలిగించారు. చివరగా చార్‌ధాం యాత్ర చేస్తూ 18.9.2018 నాడు బదరీనాథ్‌లో నారాయణునిలో ఐక్యం చెందారు.

21.8. తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రిగారు :

తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రిగారి గురించి ఇలా చెప్తారు. ఆయన ఒక సిద్ధుడు. శ్రీచక్రేశ్వరి అయిన అమ్మవారు ఆయన్ని దూరంగా ఉన్న ఇద్దరు యువతుల్ని తీసుకు రమ్మంది. ఆయన ఒకరిని మోసుకుని, ఇద్దరినీ తీసుకొచ్చాడు. అమ్మవారు అతనితో ఇలా అంది: మనసు కొంచెం చలించింది. భూలోకంలో జన్మించు. మోసుకొచ్చిన అమ్మాయే భార్య అవుతుంది. అంటే ఊర్ధ్వలోకాలనుండి కిందికి వస్తే ఎలా ఉంటుంది అనడానికి నిదర్శనం శ్రీశాస్త్రి గారి జీవితం.  తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రిగారినే చందోలు శాస్త్రిగారని గూడా అంటారు. వారు ఆధునిక కాలంలో ప్రభవించిన ఋషి అని పేరుగాంచారు. వీరి శాస్త్ర పాండిత్యం, జ్ఞానసంపత్తి,కర్మనిష్ఠ, ఉపాసనాదీక్ష మొ॥వి. ఎంతో గొప్పవి. చిన్నతనంనుండి వైదిక సంప్రదాయంలో పెరిగారు. తండ్రిగారైన శ్రీ వెంకటప్పయ్య శాస్త్రి గారు నిర్వహణలోనున్న వేదపాఠశాలలో తనవంతు సాయమందిస్తూ ఉండేవారు. అన్ని శాస్త్రాల్లో నైపుణ్యం సంపాదించారు. కవిత్వంలో దిట్ట. అనేక అవధానాలు చేసారు. అమ్మవారిని ఉపాసించి ప్రసన్నం చేసుకున్నారు. ఉపాసనాబలం ఉన్న వారు. అమ్మవారు ఈయన బదులు పలికేది. శాస్త్రిగారి భార్య పార్వతి. ఆవిడగూడా భర్తకు తగ్గభార్య. ఒక కూతురు, ఒక కొడుకు పుట్టారు. చిన్నతనంలో కొడుకు, వివాహమైన కొద్దికాలానికే కూతురూ మరణించారు. ఎంతోకాలం అన్నసంతర్పణలతో గడపిన వారైనా కొంతకాలం అష్టకష్టాలు పడ్డారు. చివరకు అప్పులపాలై గుంటూరు చేరారు. తెనాలిలో గంగానమ్మ పేటలోగల బాలాత్రిపురసుందరి ఆలయప్రతిష్ఠకు ఆయన్ను తీసుకువెళితే ఆయన ధ్యానంలో ఉండగా అమ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంది. ఆయన కోరుకున్న వరం: ఏ భక్తులైనా ఈ కింద ఇచ్చిన శ్లోకం చదివి నీకు 11 ప్రదక్షిణలు చేసి ఏకోరిక కోరినా అది తీర్చి వారి దుఃఖం పోగొట్టు అని ఒక శ్లోకం ఆ గుడిలోగల శిలాఫలకం మీద చెక్కించారు:

‘జన్మాన్యతీతాని కియన్తిమేహో/ఉచావచత్వంయదభూత్ సుఖదుఃఖహేతోః అజీవ దాసతమతామభిపద్యపుణ్యాత్/బాలే త్వదీయ కరుణాతవ సుప్రభాతం.’

(ఓ బాలా సుఖాలు,దుఃఖాలూ కారణాలుగా ఎన్నో జన్మలు గడచిపోయాయి. ఇప్పుడు ఏదో పుణ్యం వల్లనూ, నీ అనుగ్రహం వల్లనూ నీ సేవ చేసే దాసునిగా నాకు అవకాశం లభించింది. నీకు సుప్రభాతం.)

ఆయన 96వ ఏట పరమపదించారు. చందోలులో వీరి పీఠం ఉంది. ఇప్పటికీ కొంతమంది వేదపండితులు ఆర్థికంగా చాలా చితికి పోయిన వారున్నారు. వారంతా యాచకవృత్తితో జీవిస్తున్నారు. వారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేవు. విదేశీమతస్థులకైతే మనదేశంలో అనేక ప్రభుత్వ ప్రోత్సాహకాలుంటాయి. కానీ మన వేదపండితులకు అలాంటి ఏర్పాట్లు ఉన్నట్టు కనపడటం లేదు. ఇది మనదేశానికి పట్టిన దుర్దశ అనుకోడం తప్ప ఇంకేమీ చేయలేం.

21.9. ఓంస్వామి :

భారతదేశానికి చెందిన కొంతమంది చదువుకున్న యువతలో గూడా దైవం పట్ల నమ్మకం కలుగుతోందనడానికి నిదర్శనం ఓంస్వామి జీవితం. అదేంటో చూద్దాం. ఆయన రాసిన పుస్తకం: If Truth Be Told : A Monk’s Memoir (ఇఫ్ ట్రూత్ బి టోల్డ్: అ మాంక్స్ మెమ్వా). అమిత్ శర్మ పంజాబ్‌లో పటియాలకు చెందినవాడు. అతనికి ఓ అన్న, ఓ అక్క ఉన్నారు. చిన్నప్పడినుండి దేవుడ్ని చూడాలన్న తపన బాగా ఉండేది. చిన్నప్పడినుండి కొన్ని తంత్రవిద్యలు నేర్చుకున్నాడు. జ్యోతిషం లాంటి విద్యలు గూడా నేర్చుకున్నాడు. చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. తనునేర్చుకున్న విద్యలద్వారా కొంత డబ్బుసంపాదించుకునేవాడు. 18 ఏళ్ళకే ఆస్ట్రేలియా వెళ్ళిపోయి ఐటి చదువులు చదివాడు. ఓ కంపెనీకి సి.ఇ.ఓ.గా చేసాడు. కొన్నాళ్ళకు ఓ ఐటి కంపెనీని తనే సొంతం చేసుకున్నాడు. 30 ఏళ్ళకు ఈ ప్రాపంచిక విషయాల మీద విరక్తి పుట్టి, దేవుడ్ని చూడాలన్న తపనపుట్టి, భారతదేశం వచ్చేసాడు. బంధువులందరినీ చూసి, తను సంపాదించిన దాంట్లో తనకోసం కొంత అట్టేపెట్టుకుని, మిగతాది బంధువులకి పంచేసి, ఒక్కడూ వారణాసి వెళ్ళిపోయాడు గురువును వెతుక్కుంటూ. సరైన గురువు లభించలేదు. ఒక మాయావి చేతులో పడి చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. చివరికి ఆ గురువంటే విరక్తి పుట్టి బదరీనాథ్ వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోడానికి. ఓ చిన్నగుహలో ఉంటూ అనేక సాధనలు చేసాడు. అతని తీవ్రతపస్సు ఫలించి చివరకు అమ్మ దర్శనం లభించింది. అతన్ని తన చేతిలో పట్టుకుని ఎన్నోలోకాలు తిప్పింది అమ్మ ఆ కొద్ది సేపట్లోనే. అతనికింకేం కావాలి? కోరుకున్నది లభించింది. తర్వాతకొన్ని తాంత్రికవిద్యల్లో సాధనచేసాడు. ఇప్పుడు ఆయన పేరు ఓంస్వామి. హిమాలయ ప్రాంతంలో ఓ ఆశ్రమం స్థాపించాడు. అనేకమందికి ఆధ్యాత్మిక సలహాలిస్తూ మార్గదర్శకం చేస్తున్నాడు.

21.10. శ్రీ ఎం:

శ్రీ ఎం గారి చరిత్ర ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఆయన పేరు ముంతాజ్ ఆలీఖాన్. ఆయనలో ఉన్న జీవాత్మ ఒక బ్రాహ్మణ యువకునిది. అతని పేరు మధు. కర్మచక్రం ఎంత విచిత్రంగా పనిచేస్తుందనడానికి నిదర్శనం ఆయన జీవితం. ఆయన రాసిన పుస్తకం : Apprenticed to a Himalayan Master. A Yogi’s Autobiography. బదరీనాథ్‌లో ఓ కొండగుహలో మధుకర్‌నాథ్ అన్న యువకుడు తపస్సు చేసుకుంటున్నాడు. అతను శ్రీగురుబాబాజీ (మహావతార్ బాబాజీ అని గూడా అంటారు) శిష్యుడు. ఆ సమయంలో ఓ ముస్లిం ఫకీరు వచ్చి అతని తపస్సుకు అంతరాయం కలిగించి ఇలా అంటాడు: తనను తన గురువు అతనివద్ద దీక్ష తీసుకోమని అక్కడకు పంపాడని తనకు దీక్ష ఇవ్వమని కోరతాడు.

కానీ మధుకు కోపంవచ్చి అతను తన్ను మైల పరిచాడని, అందుకు అతన్ని వెళ్ళిపొమ్మంటాడు. ఆ ఫకీరు తను చచ్చినా పోనంటాడు. సరే చావమంటాడు ఆ సాధకుడు మధు. ఆ ఫకీరు చనిపోతాడు. అప్పుడు ఆ సాధకుని గురువు వచ్చి అతను చాలా తప్పు పని చేసాడని. అది కర్మను పెంచుతుంది కాబట్టి సాధకులకు మంచిదికాదు. అది అనుభవించి తీరాలని అతన్నిగూడా ఆ ఫకీరులాగ చనిపొమ్మంటాడు. ఐతే ఆ సాధకుడు గురువుని ఓ కోరిక కోరతాడు: తను ఏ జన్న ఎత్తినా తన బాగోగులు మటుకూ గురువుగారు చూసుకోవాలని. అలాగేనంటాడు గురువు. ఆ యువకుడు గంగలో దూకి ఆత్మాహుతి చేసుకుంటాడు. అతను తర్వాత కేరళలో గల ఓ ముస్లిం కుటుంబంలో పుడతాడు. అతనిని చిన్నప్పటినుండి కొందరు గురువులు కనిపెట్టుకుని ఉంటారు. అతనికి చిన్నప్పటినుండి ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. 19 ఏట ఇంట్లో చెప్పకుండా ఋషీకేశ్ వెళ్ళి పోతాడు. అతని ఓ మంచి గురువు – మహేశ్వరనాథ్ జీ లభిస్తారు. ఆయనఅండలో ఎన్నో ఆధ్యాత్మిక విద్యలు నేర్చు కుంటాడు. 3 ఏళ్ళ తర్వాత ఇంటికి వెళతాడు. తర్వాత మద్రాసులోగల జిడ్డు కృష్ణమూర్తి సంస్థలో పనిచేసి ఆశ్రమ నిర్వహణలో మెలకువలు నేర్చుకుంటాడు. ఆ సంస్థకు సంబంధించిన ఓ బ్రాహ్మణ యువతిని వివాహం చేసుకుంటాడు. ఇప్పుడు మదనపల్లిలో ఓ ఆశ్రమం నడుపుతున్నారు. అంతర్జాతీయంగా పేరుగాంచి చాలామందికి ఆధ్యాత్మిక సూచనలు సలహాలు అందిస్తున్నారు.

21.11. రాంబహదూర్ బోంజోన్ :

రాంబహదూర్ బోంజోన్ గురించి ఓసారి టీవిలో చూపించారు. డిస్కవరి చేనల్ వారు ఇతన్ని గురించి పరిచయం చేసారు. ఇతను నేపాలీ యువకుడు. 15వ ఏట తపస్సు చేసుకోడానికి వెళ్ళిపోయి ఓ చెట్టుతొర్రలో కూర్చుని తపస్సుచేయసాగాడు.

అతను శాంతిని కాంక్షించి దూరంగా పోతే అతని వద్దకు జనాలంతా పోయి ఆ స్థలాన్ని వ్యాపారస్థలంగా చేసేసారు. ఇంక ఆంగ్లేయులు ఇష్టమొచ్చినట్లు ప్రవచనాలు చెప్పసాగారు. వాళ్ళకి తపస్సంటే ఏంటో తెలియకపోయినా వ్యాఖ్యానాలు చేయసాగారు. అతనిలోంచి మంటలొచ్చాయి. ఎవరో అతని మీద ఓ గుడ్డవేసారు. ఆ గుడ్డ మటుకూ కాలిపోయింది, కానీ అతనికేం కాలేదు. ఇవన్నీ యూట్యూబ్‌లో చూపిస్తున్నారు.

21.12.శేషభట్టర్ సుదర్శనాచారిగారు:

శేషభట్టర్ సుదర్శనాచారిగారు ప్రఖ్యాతి చెందిన యోగాగురువు. ప్రపంచంలో ఈయన్ని మించిన వారు లేరు అనంటారు. ఈయన ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘యోగ అధ్యయన పరిషద్’కి ‘వైస్ ఛైర్మన్’గా ఉంటున్నారు. హైదరాబాద్‌లో గల ప్రకృతి చికిత్సాలయంలో గల ప్రాణాయామ పరిశోధన కేంద్రంలో అధ్యక్షుడుగా పనిచేసారు. భారత ప్రభుత్వం ఈయన్ను ఢిల్లీలో గల CCRYN (Central Council for Research in Yoga and Naturopathy)కి Governing Body Member గా గూడా నియమించింది. రోగి యొక్క మాట విని రోగమేంటో నిర్ధారిస్తారు. ఈయన చిన్నతనంలోనే విరక్తి చెంది హిమాలయాలకు వెళ్ళిపోయి అనేకమంది వద్ద యోగవిద్యలు, వైద్యం నేర్చుకున్నారు. బృందావనంలో ఉన్న శ్రీదేవరహబాబా వద్ద ప్రాణాయామ, కుండలిని యోగవిద్యలను నేర్చుకున్నారు. నేపాల్, టిబెట్ వెళ్ళారు. లాసాలో ఓ బౌద్ధసన్యాసి వద్ద టిబెట్‌లో దొరికే మూలికలతో మందులు చేయడం నేర్చుకున్నారు.

హిమాలయ ప్రాంతాల్లో సంచరిస్తుండగా ఓ విచిత్రమైన సన్యాసి (యేటి/యేతి)ని కలిసి ఆయనవద్ద 7 సం॥లుండి అనేక ప్రాణాయామ, మూలికావైద్యరహస్యాలను నేర్చుకున్నారు. చాలా ఏళ్ళ తరవాత తన ఇంటికి చేరుకుని తను నేర్చుకున్న విద్యలను అందరికీ ఉపయోగపడేట్టు చేసారు. ఎంతోమందికి ప్రాణాయామ విద్యను నేర్పారు. ఈయన టిబెట్‌లో దొరికే మూలికలతో మందులు చేసి ఇస్తారు. చాలా మంది ప్రముఖలకు, ఇందిరాగాంధీ, కరణసింగ్ మొ॥నవారికి. యోగ విద్య నేర్పారు. ఈయన ‘యోగ’,’ ప్రాణాయామం’ మీద చేసిన ప్రసంగాలను జ్ఞానయోగి చేనల్ వారు కొంతకాలం క్రితం ప్రసారం చేసారు. ఎంతో మంది ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈయనే చెప్పారు గరుడసంజీవని గురించి. యూట్యూబ్‌లో ఉంది చూడమన్నారు. మనం కిందటి అధ్యాయంలో సంజీవని గురించి చెప్పుకున్నాం – గద్ద తన పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకోడానికి నిఘా పెట్టడానికి ఈ సంజీవని పుల్లను పెడుతుందిట. ఇప్పుడు యూట్యూబ్‌లో గరుడసంజీవని గురించి చూపిస్తున్నారు. అందరూ చూసి దాని వింతలు తెలుసుకోవచ్చు.

21.13. పరశురామశర్మగారు:

పరశురామశర్మగారు రెండు వేదాలు అధ్యయనం చేసారు: ఋగ్వేదం, అథర్వణవేదం. అథర్వణవేదంలోగల వింతలు ఈయన విడమరచి చెప్పగలరు, మనం గనక అడిగితే. అథర్వణం అంటే ‘అసాధ్యం కానిది’, ‘అన్నిటినీ ఆవరించి ఉండేది’ అని అర్థం. అంటే ప్రతీది సాధ్యమేనని చెప్పేది. ఈయన మహర్షి మహేశ్ యోగి గారు స్థాపించిన వేదపాఠశాలల్లో కొన్నిటిలో ఆచార్యుడుగా పనిచేసారు. అన్ని వేదపాఠశాలలకు ఉపద్రష్టగా ఉన్నారు కొంతకాలం. రాజమండ్రిలో గల వేదపాఠశాలకు ప్రిన్సిపల్‌గా ఉన్నారు కొంతకాలం. ఢిల్లీలో గల ఓ వేదపాఠశాలలో పనిచేసారు కొంతకాలం. ఉత్తరప్రదేశ్‌లో గల సాందీపని విశ్వవిద్యాలయానికి సంబంధించి ఓ అనుబంధ వేదపాఠశాలను నడిపారు ఇక్కడ హైదరాబాద్, సూరారంలో, కొన్ని ఆలయాలు నిర్మించి అర్చనకు పురోహితులను ఏర్పాటుచేసారు. కొంతమంది వేదవిద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. యజ్ఞయాగాలు నిర్వహిస్తారు. ఈయనకు ‘వేదరత్న’ అన్న బిరుదు ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశగా ఉన్నప్పుడు ఈయన రంగారెడ్డి జిల్లా అర్చక సంఘానికి అధ్యక్షుడుగా పనిచేసారు కొంతకాలం. చాలా నిరాడంబర వ్యక్తి. వినయశీలి. ఇంత వేదపాండిత్యం ఉన్నదా అని ఆశ్చర్యం వేస్తుంది ఈయన్ను చూస్తుంటే. ప్రమాదవశాత్తు ఓ లారీకింద పడటం వల్ల ఆరోగ్యం పాడైంది. అన్నీ వదులుకున్నారు. ఇప్పుడు జ్యోతిషం, వాస్తు విషయాల్లో సూచనలు ఇస్తున్నారు. ఈయన చెప్పారు అథర్వణవేదంలో 9 శాఖలు ఉండేవి. 7 శాఖలను విదేశీయులు తస్కరించుకుపోయారు. ఇప్పుడు మన వద్ద 2 శాఖలే ఉన్నాయని. ఈయనే చెప్పారు. సంజీవనిలో చాలా రకాలు ఉన్నాయని : గరుడసంజీవని మృతసంజీవని, లక్ష్మీసంజీవని మొ॥వి. ఈయన ప్రస్తుతం జీడిమెట్లలో గల ఓ గుడిలో పూజాదికాలు నిర్వహిస్తున్నారు. అది పంచపంచాయతనం గల గుడి.

అందులో శివుడు, గౌరి, గణపతి, విష్ణువు, సూర్యుడు – ఈ ఐదుమంది దేవతలకు పంచాయతనం పూజలు నిర్వహిస్తారు. ఆ ఆలయాన్ని కుప్పా సీతారాం గారు నిర్మించారు తనకున్న ఓ చిన్నఇండస్ట్రీలో.

21.14. మనకు తెలియని మనవారి గొప్పతనం:

మనది పుణ్యభూమని, ఎంతో మంది మహాత్ములు నడయాడిన భూమని, ఇప్పటికీ మన మధ్య ఇంకా మహాత్ములున్నారని మనకు తెలియకుండా పోయింది. మన చదువుల్లో మనకు ఇవేవీ తెలియకుండా చేసారు మనరాజకీయ నాయకులు. ఎంతసేపూ అవి అగ్రవర్ణాలవారికి సంబంధించినవని, వారిని ద్వేషిస్తూనే చూసారు గానీ, మనకు ఇంత గొప్ప సంస్కృతి ఉందని దాన్ని గుర్తించి గౌరవిద్దామన్న తెలివి మనకు లేకుండా చేసారు. దీనికి కారణం ఆంగ్లేయుల కుట్ర. దానికి బలైపోయారు మనవారంతా. ఆంగ్లేయుల కుట్ర గురించి తెలుసుకోవాలంటే, రాజీవ్ మల్గోత్రాగారి పుస్తకం ‘బ్రేకింగ్ ఇండియా’ చదవాలి.

21.15. కీకరకాయ చదువులు :

మనం ఆంగ్ల చదువులు నేర్చుకోడంవల్ల మహోన్నతమైన మన చరిత్రను మరచి పోయాం. ఆంగ్లేయులు తప్పులతడకలతో మన చరిత్ర రాస్తే అదే నిజమనుకున్నాం. వారేం చెపితే అదే వేదమనుకున్నాం. ఆంగ్లేయులకు మన సంస్కృతి, సంప్రదాయాలు అంటే ఏమిటో తెలియవు. అయినా మన వేదాల్లో తలదూర్చి ఇష్టమొచ్చిన వ్యాఖ్యానాలు చేసారు. దేవుడి గురించే తెలియని వారు దేవుడ్ని గురించి రకరకాల వ్యాఖ్యలు చేసారు. ప్రపంచ సృష్టి గురించి ఏమీ తెలియని వారు ఏవేవో రాతలు రాసారు. మనవాటి గురించి ఇష్టమొచ్చిన రాతలు రాసి మనవన్నీ తప్పని చెప్పడానికి ఇప్పడికీ శ్రమిస్తున్నారు. పుస్తకాలు రాస్తున్నారు. మనం కొంటున్నాం. వాళ్ళు డబ్బు చేసుకుంటున్నారు. మనం గూడా వారే గొప్ప అని వారినే కీర్తిస్తున్నాం.

అందుకు మనం గూడా ఈ కీకరకాయల వారి బోధనలవల్ల మన గొప్పతనాన్ని గుర్తించే స్థితిలో లేం. ఇది మన కర్మ అనుకోవాల్సిందే.

21.16. ఇప్పడు కొందరు విదేశీయులవల్ల మళ్ళీ వ్యాప్తి చెందుతున్నవేదధర్మం :

కొందరు విదేశీయులు మన వేదధర్మం మీద బురద జల్లడానికి చాలా శ్రమిస్తుంటే, కొందరు విదేశీయులు మన వేదమంత్రాల్లో రోగాలను నయంచేసే ప్రభావం ఉన్నదని తెలుసుకుని ఆ మంత్రాలను ఉపయోగించుకుని బాగుపడుతున్నారు. అదెలాగో చూద్దాం. వివేకానంద, యోగానంద, అరవిందులు, మహేశయోగి విదేశాల్లో వారికి వేద విజ్ఞానాన్ని పరిచయం చేసారు.

21.17. డేవిడ్ ఫ్రాలే:

వేద విజ్ఞానం వల్ల ప్రభావితులైనవారిలో ఒకరు పండిత వామదేవశాస్త్రిగా పేరుగాంచిన డేవిడ్ ఫ్రాలే. ఈయన శ్రీ అరవిందుల రచనలవల్ల ప్రభావితులై భారతీయ వేద, వేదాంత, యోగ, జ్యోతిష, ఆయుర్వేద శాస్త్రాలు అధ్యయనం చేసి వేదాచార్యునిగా పేరుగాంచి అమేరిక (అమెరికా)లో ఈ శాస్త్రాలను బోధిస్తున్నారు. కర్నాటకలో బెంగుళూరులో గల స్వామి వివేకానంద యోగా అనుసందాన సంస్థాన’ ‘శ్వాస’ (డీడ్జ్ యూనివర్సిటీ) కి విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. అందుకు ‘శ్వాస’ వారు ఈయనకు ‘డీలిట్’ పట్టా ప్రదానంచేసి సత్కరించారు. జనవరి 2015లో భారతదేశంలో ఈయనకు ‘పద్మభూషణ్’ బిరుదు ప్రదానం చేసారు.

21.18. మహర్షి మహేశ్ యోగి :

భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని దేశవిదేశాల్లో ప్రచారం కావించిన ఘనత నిజానికి మహర్షి మహేశ్ యోగి గారికే చెందుతుంది. మహేశ్ యోగి 1950-60 దశకంలో ప్రపంచమంతా పర్యటించి యోగవిద్యలను, భావాతీత ధ్యానమార్గాన్ని ప్రచారం చేసారు. ఈయన వద్ద యోగసాధన నేర్చుకుని వెళ్ళారు విదేశీ పాటగాళ్ళు బీటిల్స్. మహేశ్ యోగి శంకరాచార్యులు స్థాపించిన జ్యోతిర్మఠ పీఠాధిపతులైన శ్రీబ్రహ్మానంద సరస్వతి గారి శిష్యులు.

ఈయన మనదేశంలో, విదేశాల్లో అనేక పర్యటనలు చేసి భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చి ప్రపంచవ్యాప్తంగా పలు వేదవిజ్ఞాన విశ్వవిద్యాలయాల,కళాశాలల, పాఠశాలల స్థాపనకు కారకులయ్యారు. ఈ రకంగా భారతీయ వేదవిజ్ఞానం, యోగ విజ్ఞానం,ఆయుర్వేదం విదేశాల్లో ప్రాచుర్యం పొందాయి. ఈయన భావాతీత ధ్యానమార్గాన్ని ప్రచారం చేసారు. ఈయన దాదాపు 40 వేలమంది శిక్షకులను ఇందులో తయారు చేసారు. ఈ మహేశ్ యోగి 1990లో నెదర్లాండ్స్‌లో గల హాలెంలో ఒక సంస్థను స్థాపించారు. దాని పేరు ‘మేరు’ ( మహర్షి యూరోపియన్ రీసెర్చ్ యూనివర్సిటీ). 1998లో ‘ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఆర్గనైజేషన్’ స్థాపించారు. 2000లో ‘గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్’ ని స్థాపించారు. ఈయన ‘మహర్షి వేదిక్ వైబ్రేషన్ టెక్నాలజీ’ (ఎం.వి.వి) తయారుచేసి మంత్రాలద్వారా రోగాలను (హృదయ, ఉదర,కీళ్ళు మొ॥గు అవయవాలకువచ్చే రోగాలను) నయం చేయవచ్చని నిరూపించారు.

21.19. టోనీ అబూ నేడర్ :

టోనీ అబూ నేడర్ మహేశ్ యోగి గారి శిష్యుల్లో అతిముఖ్యుడు. లెబనన్ వాసుడు. ఈయన ప్రఖ్యాత న్యూరో సైంటిస్ట్, ప్రొఫెసర్. ఈయనకు మహేశ్ యోగి ‘మహా రాజాథిరాజ రాజారామ్’ అని బిరుదు ప్రదానం చేసి తన తర్వాత తన సంస్థకి వారసుడుగా ప్రకటించారు. ఏదైనా ఇబ్బందులొస్తే పరిష్కారానికి ఈయన వద్దకు అత్యంత ప్రముఖ వ్యక్తులే వెళ్తుంటారు. మంత్రాలకు రోగాలు తగ్గుతున్నాయి. టోనీ నేడర్ మహేశ్ యోగి ఆధ్వర్యంలో వేదవిజ్ఞానాన్ని ఒంటబట్టించుకుని దాన్ని ఎలా ఉపయోగించ వచ్చన్నది నేర్చుకున్నాడు. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా అని మనవాళ్ళు మన వేదమంత్రాలను ఎగతాళి చేసే స్థితికి దిగజారారు. కానీ ఈయన ఈ మంత్రాలతో రోగాలను కుదురుస్తున్నాడు.

దాన్ని ఎం.వి.వి టెక్నాలజీ అంటున్నారు. ఈయన చేసిన పరిశోధనకుగాను 1998లో ఈయన బరువుకు తగ్గ బంగారంతో తులాభారం తూచి సత్కరించారు. ఈయన బ్రెయిన్ సర్జన్ కావడం మూలాన మెదడుకు సంబంధించిన పరిశోధనలు చేసి ఆశ్చర్యకరమైన విషయాలు కనుగొన్నాడు. ఈయన చాలామంది బ్రెయిన్స్‌ని పరిశోధించాడు. జీవితాల్లో ఉచ్చస్థితిలో ఉన్నవాళ్ళవి, తాగుబోతులు, వ్యసనపరులు లాంటి వారివి గూడా. అందరి మెదళ్ళలో కన్నాలుంటాయని కనుగొన్నాడు. వ్యసనపరుల్లో పెద్ద పెద్ద కన్నాలుంటాయని, దానికి ఆధునిక వైద్యం పనిచేయదని తెలుసుకుని, దానికి ఏకైక మందు ఋగ్వేద మంత్రాలని గూడా తెలుసుకున్నాడు. ఈయన పతంజలి యోగసూత్రాల్లో చాలా శక్తి ఉందని, వీటిని చదవడం వల్ల లేక వినడంవల్ల మెదడుకు పట్టిన రోగాలు నయమవుతున్నాయని కనిపెట్టి, ఆచరించి చూపించాడు. పతంజలి యోగసూత్రాలు 195 ఉన్నాయి. అవి 4 విభాగాలుగా ఉంటాయి: సమాధిపాదం, సాధనాపాదం, విభూతిపాదం, కైవల్యపాదం. మన మెదడులోగూడా 4 భాగాలున్నాయి. ఈ మెదడులో రకరకాల ముడుతలుంటాయి. ప్రతి ముడుతకి ఒక సూత్రం వర్తిస్తుందని నిరూపించాడు. ఇదే ఎం.వి.వి టెక్నాలజీ. ఈ పద్ధతిలో చాలా రోగాలు నయం చేస్తున్నాడు. ఆయన రాసిన కొన్ని పుస్తకాలు: 1.హ్యూమన్ ఫిజియాలజి: ఎక్స్ ప్రెషన్ ఆఫ్ వేద అండ్ వేదిక్ లిటరేచర్ 1994. 2. రామాయణ ఇన్ హ్యూమన్ ఫిజియాలజి, 2011. ఈయన ఎంత గొప్ప శాస్త్రవేత్త అంటే వేదాల్లో దేవతలను మానవశరీరంలో చూపించాడు. శస్త్రచికిత్సల ద్వారా- శరీరంలోని అవయవాలను క్రాస్ సెక్షన్ చేసి శివుడు, విష్ణు, లక్ష్మి మొ॥ దేవతల రూపాలను చూపించాడు. అంతర్జాలంలో చూడచ్చు. మనదేశంలో వేదాలంటే గౌరవం పోయింది. కానీ ఈయన ప్రపంచ పర్యటనలు చేస్తూ వేదాలగురించి, రామాయణం గురించి ప్రసంగాలిస్తూ అందరికీ ఆసక్తి కలిగిస్తున్నాడు.

దీన్నిబట్టి ఏం తెలుస్తోందంటే కొందరు విదేశీయులు మన శాస్త్రాలపట్ల ఆసక్తి చూపిస్తున్నారు. వారి నుంచైనా మనం మన శాస్త్రాలను గౌరవిద్దామని తెలుసుకుంటే మంచిది.

21.20. మనం తీసే గుంజీలను’ సూపర్ బ్రెయిన్ యోగ’ అంటున్నారు :

మనం వినాయకచవితికి వినాయకుడిముందు గుంజీలు తీస్తాం. ఈ గుంజీలకు అమేరిక (అమెరికా) లో గిరాకీ పెరిగింది. దానికి ఓ మంచి పేరుపెట్టారు ‘సూపర్ బ్రెయిన్ యోగ’ అని. రోజూ ఉదయాన్నే ఈ గుంజీలు ఓ 5 నిముషాలు చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చేసే పద్ధతి: 1. ఎడమచేతితో కుడిచెవి పట్టుకోవాలి. బొటనవేలు చెవి ముందుభాగంలో ఉండాలి, చూసే వాళ్ళకి మన బొటనవేలు కనిపించేలా పట్టుకుని. 2. అలాగే కుడిచేతితో ఎడమచెవి పట్టుకోవాలి (ముందులాగానే). 3. గాలిపీలుస్తూ కింద కూచోవాలి. 4. అలాగే గాలి వదులుతూ పైకి లేవాలి. మన శిరస్సులో చిన్నమెదడు వినాయకుడి ఆకారంలో ఉంటుంది. ఎవరికైనా వినికిడి దోషం ఉందంటే అర్థం చిన్నమెదడు సరిగా లేదని. మన శరీరం లోని అంగాల చలనమంతా చిన్నమెదడు మీద ఆధారపడి ఉంటుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. అమేరిక (అమెరికా) లో చాలా యోగ కేంద్రాలు పనిచేస్తున్నాయి.

యోగ పద్ధతిలో శరీరశుద్ధి, పంచకోశశుద్ధి చేసుకు బాగుపడుతున్నారు. ఈ విధంగా విదేశీయులు మన యోగవిజ్ఞానం, వేదమంత్రాల వల్ల ఆరోగ్యం పొందుతుంటే, మనకు అవేంటో గూడా తెలియకుండా పోతోంది. ఒకవేళ యోగకేంద్రాలకి వెళ్ళి నేర్చుకుందామంటే చాలా ఖర్చుతో కూడుకుని ఉంటున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండటంలేదు.

21.21. మెదడుకు వచ్చే రోగాలను నయంచేసే వృక్షాలు :

మనకు ఎంతో వృక్షసంపద ఉంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. మనకు దేవతా వృక్షాలున్నాయి- చందనం, రావి లాంటివి. వాటి గురించిన జ్ఞానం మనకు ఇప్పుడు లేదు. మనపూర్వీకుల కుండేది. చందనం గురించి తెలుసుకుందాం. ఈ ప్రపంచం మొత్తంలోమన ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే చెందిన కొన్ని ప్రాంతాలైన కడప, చిత్తూరు, నెల్లూరు లాంటి ప్రదేశాల్లోనే పెరిగే ఎర్రచందనం చెట్లకు మెదడుకు సంబంధించిన రోగాలను నయం చేసేశక్తి ఉందని విదేశీయులు గూడా పరిశోధించి తెలుసుకున్నారు. ఒక జర్మన్ దేశీయుడు ఈ ఎర్రచందనం చెక్కతో చేసిన పెన్ స్టాండ్‌ని వాడేవాడు. ఆయన ఆ పెన్‌ని వాడుతున్నప్పుడు కొంచెం జలదరింపు కలిగేదిట. అంటే దానికి బ్రెయిన్‌ని ఉత్తేజపరిచేశక్తి ఉందన్నమాట. మన పూర్వీకులు ఎర్రచందనం చెట్ల యొక్క కొయ్యనుండి తయారుచేసిన బొమ్మలను ఇంట్లో పిల్లలు ఆడుకోడానికి ఇచ్చేవారు. ఆడపిల్ల పెళ్ళై అత్తారింటికి వెళ్ళేటప్పుడు గూడా ఎర్రచందనం బొమ్మలు, శ్రీచందనం చెక్క ఇచ్చి పంపించేవారు. బొమ్మల కొలువులో గూడా ఈ బొమ్మలకు బట్టలు చుట్టి పెట్టి పూజచేసి హారతిచ్చేవారు. లోగడ పాతిక సం॥ క్రితం వరకు ఇవి తిరుపతిలో విరివిగా దొరికేవి. ఇప్పుడు ఈ బొమ్మలు ఎలా ఉంటాయో అన్నది గూడా తెలియడం లేదు ఎవరికీ. ఎర్రచందనం యొక్క అమ్మకం మీదే నిషేధం పెట్టారుట. చైనా, జపాన్‌ లాంటి విదేశాల్లో ఈ ఎర్రచందనానికి బాగా గిరాకీ ఉందని అక్కడికి ఎగుమతులు చేస్తున్నారు. మనం రోగాలతో బాధపడుతున్నాం ఇక్కడ. అలాగే కానుగ చెట్టుకు గూడా మెదడుకు సంబంధించిన రోగాలను నయం చేసేశక్తి ఉందిట. ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం. వచ్చే అధ్యాయంలో దేవుడికి మనిషికి గల సంబంధం గురించి తెలుసుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here