దివినుంచి భువికి దిగిన దేవతలు 6

1
6

[box type=’note’ fontsize=’16’] మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞాన రహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రచన చేశారు డా. ఎం. ప్రభావతీదేవి. [/box]

లోకంబులు-లోకేశులు-లోకస్థులు

6.0 బ్రహ్మాండ లోకాలు:

[dropcap]బ్ర[/dropcap]హ్మాండంలో ఎన్నో లోకాలున్నాయి. వాటిలో నివసించడానికి అనేక రకాల జీవులను సృష్టించడానికి బ్రహ్మదేవుడు ప్రజాపతులను, స్వాయంభువ మనువు,శతరూపలను సృష్టించాడు. వారి సంతతి ద్వారా అనేక రకాలుగా ప్రజాభివృద్ధి జరిగింది. వారంతా అన్ని లోకాల్లో నిండిపోయారు. ఈ విషయం గురించి పురాణాల్లో ఎక్కడా విపులంగా లేదు. కొంచెం కొంచెం ఉంది. దొరికినంత మేరకు మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. బ్రహ్మాండంలోని కొన్ని లోకాల పేర్లు తెలుసుకున్నాం లోగడ. ఇప్పుడు ఆ లోకాల గురించి కొంచెం విపులంగా తెలుసుకుందాం.

6.1 కొన్ని ముఖ్యలోకాలు:

ఈ బ్రహ్మాండంలోని ఆకాశంలో ప్రధానంగా 7 ఊర్ద్వ లోకాలు, 7 అధోలోకాలున్నాయి. ఊర్ధ్వలోకాలకు పైన ఇంకా కొన్ని లోకాలున్నాయి. వాటి వివరాలు (పైనుండీ కిందికి):

ఊర్ధ్వలోకాలకు పైనున్న లోకాలు:

  1. నిరామయస్థానం: ఇది ముక్తస్థానం
  2. త్రిఖండసోపానం: ఇది మూడు సోపానాలు గలది. వసు, రుద్ర, ఆదిత్యులనే పితృదేవతల నివాసస్థానం. దీనికి వారు రక్షకులు.
  3. కారణబ్రహ్మలోకం: చతుర్ముఖబ్రహ్మస్థానం.
  4. శ్రీనగరం: విద్యాస్థానం-మూలప్రకృతిస్థానం.
  5. మహా కైలాసం: ఉమాసహితశివుని స్థానం
  6. కారణ వైకుంఠం: లక్ష్మీసహిత విష్ణుస్థానం. ఇవన్నీ కూడా ఊర్ధ్వలోకాలకు పైనున్న లోకాలు. వీటి తర్వాతనే మనమనుకుంటున్న ఊర్ధ్వలోకాలు వస్తాయి.
  7. సత్య లోకం: బ్రహ్మదేవుని నివాసస్థానం. ఇందులోగల పురాణపురం విద్యాధర స్థానం.
  8. తపోలోకం: ఇందుగల అంజనావతీపురంలో సాధ్యులు మొదలగు వారుంటారు.
  9. జనలోకం: ఇందుగల అంభావతీపురంలో సనక సనందాదులుంటారు.
  10. మహర్లోకం: ఇందులోగల జ్యోతిష్మతీపురంలో సిద్ధాదులుంటారు.

    11.సువర్లోకం(స్వర్గలోకం): ఇందుగల అమరావతీపురంలోదేవేంద్రాది దేవతలుంటారు. ఈ పై ఐదు లోకాలను కలిపి స్వర్గం అంటారు.

  1. భువర్లోకం: ఇది ఖగోళానికి సంబందించిన గ్రహ,నక్షత్రాదులు గల లోకం. ఇందులోగల రథంతరపురంలో దేవశిల్పి విశ్వకర్మ ఉంటాడు.
  2. భూలోకం: భూలోకమంటే మనంనివసిస్తున్న భూమి + మహాభూమి (మనకి కిందుగా 5 కోట్ల బ్రహ్మాండ యోజనాల దూరంలోనున్నది). బ్రహ్మాండ యోజనమంటే 30 and 10/33 miles. ఈ భూ,భువర్లోకాలను కలిపి మర్త్యలోకమంటారు. మర్యులంటే జన్మించి, మరణించే వారు. స్థూలశరీరాలతో పైలోకాలకు పోలేరు. మరణంతో స్థూలశరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. సూక్ష్మశరీరాలతోనే పైలోకాలకు పోవాలి. మనం మహాభూమి అని చెప్పుకుంటున్నాం. ఈ మహాభూమి అన్నది ఒకటున్నదని ఎవరికీ తెలియదు. ఇందులోనే సప్తద్వీపాలు, సప్తసముద్రాలూ ఉన్నాయి. దీని మధ్యలో జంబూద్వీపముంది. ఇది 9 ఖండాలుగా విభజించబడింది. ఇందులోగల భరతపురంలో స్వాయంభువ మనువు, వారి పరివారంతో, ఇంకా అనేకులైన పుణ్యజీవులు, ఋషులతో గూడి ధర్మాధర్మాలను విచారిస్తూ లోకాలను పాలిస్తుంటాడు. మహాభూమిలోగల సప్త ద్వీపాలను చుట్టుకుని 3 పర్వతాలుంటాయి. అవి చలాచల, చక్రవాక, లోకాలోక పర్వతాలు. అవి స్వర్గలోకం వరకూ వ్యాపించి ఉంటాయి.

అధోలోకాలు:

మహాభూమి గురించి ఇంకా కొంచెం తర్వాత తెలుసుకుందాం కానీ ఇప్పుడు మటుకూ అధోలోకాల గురించి కొంచెం తెలుసుకుందాం. భూలోకం (భూమి+మహాభూమి) కిందుగా 7 అధోలోకాలున్నాయి. వాటన్నిటనీ కలిపి పాతాళలోకాలంటారు.

  1. అతలం: ఇందులో పిశాచగణాలుంటాయి.
  2. వితలం: ఇక్కడ గుహ్యకులుంటారు. మనబ్రహ్మాండానికి కోశాధిపతి అయిన కుబేరుడు ఇక్కడగల అలకాపురిలో ఉంటాడు. ఈ వితలమందే ఉన్న యోగినీపురంలో రాక్షసశిల్పి అయిన మయుడు నివసిస్తాడు.
  3. సుతలం: ఇందులో బలిచక్రవర్తి రాక్షసులతో నివసిస్తాడు. ఈ సుతలంలోని వైవస్వతపురంలో యముడు నివసిస్తాడు. పాపులందరూ ఇక్కడే నరకయాతనలు అనుభవిస్తుంటారు.
  4. రసాతలం: ఇందులోగల పుణ్యపురంలో నైఋతి అనే దైత్యుడు నివసిస్తాడు.
  5. తలాతలం: ఇందులోగల ధనిష్టానపురంలో భేతాళుడు పిశాచగణాలతో కూడి నివసిస్తాడు. ఇందులోగల కైలాసంలో సర్వభూతగణాలతో కలిసి ఈశానుడుంటాడు. ఈయన ఈశన్య దిక్కునకధిపతి. ఇందులోగూడా పితృదేవతలుంటారు.
  6. మహాతలం: ఇందులో పితృదేవతలుంటారు.
  7. పాతాళం: ఇందులోగల వైకుంఠాన్ని శ్వేతద్వీప వైకుంఠమంటారు. ఇందులో శ్రీమన్నారాయణుడు అసురులతో, వాసుకి మొదలైన సర్పగణాలతో ఉంటాడు. దీన్నే శ్వేతద్వీప గతకార్యవైకుంఠమంటారు.
  8. పాతాళంలోగల త్రిఖండసోపానం: ఈ పాతాళంలోనే కిందుగా మేరువునంటి పెట్టుకుని త్రిఖండ సోపానముంది. ప్రధమ ఖండంలో అనంగజీవులుంటారు. ద్వితీయ ఖండంలో ప్రేతగణాలుంటారు. తృతీయుఖండంలో యాతనాదేహం పొందిన పాపజీవులు దు:ఖంతో విలపిస్తుంటారు.
  9. నిరాలంబసూచ్యస్థానం: ఇందులో మహాపాపులు (మహాపాతకులు) ఉంటారు. వీరు ఎంతోకాలం నుండి నరకబాధల నుభవిస్తుంటారు. వీరి కోసమే బ్రాహ్మణులు భోజనానంతరం ఉత్తరాపోశనలో మంత్రంతో నీరు ధారపోస్తారు.
  10. ఉపలోకాలు: భూలోకానికి అనుబంధంగా కొన్ని ఉపలోకాలున్నాయి. ఇవి అంతరిక్షంలోనే ఉన్నాయి: గంధర్వ, అప్సరస, విద్యాధర, కిన్నెర, కింపురుష, వసు, యక్ష, రాక్షస, సిద్ధ, సాధ్య, నాగ, గుహ్యక, పితృ, యమ మొదలగు లోకాలు. ఇవి సూర్యమండలంలో గల భూమికి నలుదిక్కుల్లో ఉండే పరిసరలోకాలు. ఇవి భూలోక కర్మఫల భోగ లోకాలే. ఇవి సూక్ష్మలోకాలు మాత్రమే, స్థూలలోకాలు కావు.

6.2 అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు:

సప్తఊర్ధ్వలోకాలకు, సప్తఅధోలోకాలకు గల సమమధ్య ప్రదేశంలో అంతరిక్షముంది.

నక్షత్రాలు: అంతరిక్షంలోనే నక్షత్రకక్ష్య ఉంది. ‘నక్షత్రము’ అంటే సరైనర్థం మనకు ‘శతపథబ్రహ్మణం’లో కనపడుతుంది. రాత్రివేళ అమితతేజస్సుతో ప్రకాశించే నక్షత్రాలు, పగటివేళ సూర్యుని తేజస్సులో వాటి యొక్క క్షాత్రము (తేజస్సు) ను ప్రక టించలేవు, గనక అవి పగలు క్షాత్రహీనములై నక్షత్రాలైనాయి.

తారలు: ఆకాశంలో ఎన్నో చుక్కలు కనిపిస్తాయి. కానీ మనకు తెలిసినవి మటుకూ 27 నక్షత్రాలైన అశ్విని మొదలు రేవతి వరకే. తక్కినవాటి గురించి మనకు తెలియదు. ఎందుకంటే మనకంటికి బాగా కనపడేవి 7 గ్రహాలు, ఈ 27నక్షత్రాలే. ఈ 7గ్రహాలు, ఈ 27 నక్షత్రాల మీదుగానో, లేక, సమీపంగానో ఉండి ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తాయి. ఈ మార్గానికే ‘క్రాంతిచక్రము’, ‘క్రాంతివృత్తం’, ‘దాక్షాయణీచక్రం’ అని గూడా అంటారు. ఈ తారలు 27 గుంపుల చుక్కలు (నక్షత్రాలు). పురాణకథ ప్రకారం దక్షప్రజాపతి పుత్రికలైన ఈ అశ్విని మొదలు రేవతిగా గల తారలు చంద్రుని భార్యలు. అందుకు చంద్రుడు గూడా ఈ 27 నక్షత్రాల్లోనే తిరుగుతాడు. ఈ ఈ 27 నక్షత్రాలకూ అభిమాన దేవత తారాదేవి (బృహస్పతి భార్య). అలాగే సూర్యుడు గూడా ఈ నక్షత్రాల్లోనే తిరుగుతూంటాడని మన జ్యోతిశ్శాస్త్రంలో ఉంది. మన జాతకచక్రాల్లో గ్రహ, నక్షత్రాలన్నీ ఉంటాయి. ఈ 7 గ్రహాలే కాక ఛాయాగ్రహాలైన రాహు, కేతువులుగూడా మన జాతకచక్రాల్లో కనపడతారు.

గ్రహాలు: మనకి ముఖ్యంగా కంటికి కనపడే 7 గ్రహాలున్నాయి: రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శనులు. కంటికి కనపడని రెండు ఛాయాగ్రహాలున్నాయి: రాహు, కేతువులు. ఈ గ్రహాలన్నీ కలిపి సూర్యకుటుంబానికి చెందినవి. వీటిలో సూర్యునికి తప్ప తక్కిన వాటికి స్వయంప్రకాశ శక్తి లేదు. ఇవి సూర్యుని నుండి గ్రహించిన కాంతిని ప్రతిఫలిస్తాయి. రాత్రి పూట తల పైకెత్తి ఆకాశంలోకి చూస్తే ఈ గ్రహాలు వాటికేర్పడిన వృత్తమార్గంలో సంచరిస్తూ కనిపిస్తాయి. ఆ వృత్తమార్గాన్నే ‘కాంతివృత్తం’ అంటారు. ఇవి ఉత్తర, దక్షిణ దిక్కుల్లో కనిపించవు. ఆకాశంలో తూర్పు, పడమర వైపు ప్రయాణం చేస్తూ కనిపిస్తాయి.

ద్యులోకం: అంతరక్షంలో సూర్యుని కాంతి ఎంత వరకూ ప్రసరిస్తుందో అదే ద్యులోకం.

6.3 సూర్యాదిగ్రహాలు-వాటి అధిదేవతలు:

అంతరిక్షంలో ఈ భూమికి పైన ఈ గ్రహాలు, వాటిపైన ఈ 27 తారలు, వాటిపైన మిగతా నక్షత్రాలు ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తాయి. గ్రహరాజైన సూర్యుని చుట్టి తక్కిన చంద్రాది గ్రహాలు తిరుగుతాయి. కాబట్టి వాటిని సౌర కుటుంబమంటారు. కాని నిజానికి మన కంటికి కనిపించే సూర్యాదిగ్రహాలకు, వాటికి సంబంధించిన, మనకంటికి కనపడని అధిదేవతలుంటారు. వారికుండే లోకాలు వేరని మనశాస్త్రాలు చెపుతున్నాయి. ఉదా:మన కంటికి కనిపించే గ్రహరాజైన సూర్యుడు వేరు, ఈ గ్రహాధిదేవతుండే లోకం వేరు. గ్రహాలు, వాటి అధిదేవతల, స్వర్గాదిలోకాలు భూమి నుండి ఎంతెంత దూరంలో ఉన్నాయి, బ్రహ్మాండాన్ని చుట్టి ఉంచే అండభిత్తి యొక్క విస్తీర్ణం లోపల, బయట ఎంతెంత, భూమికి, ఇతరలోకాలకు మధ్య గల దూరం ఎంతెంత అన్న వివరాలు కిందున్నాయి. ఇక్కడ బ్రహాండ యోజనమంటే 30 and 10/ 33 miles.

6.4 భువర్లోకం:

మనం నివసించే ఈ భూగోళానికి పైనుండే సువర్లోకం వరకూ గల ప్రదేశమూ, ఇంకా అడ్డంగా చుట్టూ ఉండే జ్యోతిశ్చక్రమునూ కలిపి భువర్లోకమంటారు.

6.5 మనం నివసించే భూమి:

నక్షత్రగణాలతో కూడిన వృత్తాకారమైన జ్యోతిశ్చక్రం ఎంతో ప్రకాశిస్తూ ఉంటుంది. దాని మధ్యనే మనం నివసిస్తున్న ‘భూమి’ (భూగోళం) ఉంది. బ్రహ్మాండం యొక్క సమ మధ్యప్రదేశంలో ఈ భూమి ఈశ్వరుని ధారణశక్తి వల్ల నిలబడుంది. భూగోళం నిమ్మపండు లాగా గోళాకారంలో ఉంటుంది. ఇది పాపపుణ్యాల కర్మలననుభవించాల్సిన కర్మభూమి. స్థూలశరీరధారులుండాల్సింది ఇక్కడే. ఇక్కడ యుగప్రళయాలు, మహా యుగప్రళయాలు, మనుప్రళయాలు జరుగుతుంటాయి. బ్రహ్మ ప్రళయంలో పూర్తిగా మునిగిపోతుందని శాస్త్రాల్లో ఉందిగా. ఈ భూగోళాన్ని ‘మహి, ఉర్వి, క్షితి, పృథ్వి, భూమి’ అంటారు. ఈ భూమియందు గల జంబూద్వీపంలో 9 భాగాలున్నాయి. వాటిని నవ వర్షాలంటారు: భారత, కింపురుష, హరి, కేతుమాల, ఇలావృత, భద్రాశ్వ, రమ్యక, హిరణ్యక, కురువరాలు.

6.5 మహాభూమి:

మహాభూమిని ధాత్రి, విధాత్రి అని గూడా అంటారు. ఇది మనం నివసించే భూమికి కిందుగా 5కోట్ల బ్రహాండయోజనాల దూరంలో ఉంది. ఇది 5 0కోట్ల బ్రహాండయోజనాల విస్తీర్ణం కలది. మధ్యభాగంలో మిర్రుగా, తాబేటిపై పెంకులాగుండి, చక్రాకారంలో గుండ్రంగా ఉంటుంది. ఇందువల్ల దీనిపై భాగంలో సూర్యచంద్రుల ప్రకాశం నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుంది. ఎప్పుడూ వెలుతురుంటుంది కాబట్టి కాలనిర్ణయం లేదు. ఇందులోగల మధ్య ప్రదేశంలో మేరువు దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటుంది. జీవులను పరిపాలించే మనువులిక్కడుంటారు. మనువుల నివాసస్థానమిది. మహాభూమిలో శీత, వాత, తాపాలు తక్కువగా ఉంటాయి. అంటే శీతోష్ణ స్థితిగతులు తక్కువగా ఉంటాయి. సదా పగలుగా ఉండి, చీకటన్నది లేకుండా, కాలవ్యత్యాసం లేకుండా ఉంటుంది. మహాభూమి పుణ్యఫలానుభవాన్ని మాత్రమే పొందదగింది. స్థూలశరీరంతో పొందలేనిది. సూక్ష్మ శరీరంతో మాత్రమే పొందదగింది. ఇక్కడ చిన్న చిన్న ప్రళయాలుండవు. మను, బ్రహ్మ ప్రళయాలు మాత్రముంటాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిందేమంటే మహాభూమిలో పాలకులైన మనువులుంటారు. మనం నివసించే భూమ్మీద పాలితులైన జీవులుంటారు.

6.6 మహాభూమిలో గల ద్వీపాలు మొదలైన వాటి వివరాలు:

మహాభూమిలో 7 ద్వీపాలు, వాటి చుట్టూగల సముద్రాలు, కొన్నిపర్వతాలున్నాయి. వాటియొక్క విస్తీర్ణం బ్రహ్మాండ యోజనాల్లో ఉంది. ఒక బ్రహ్మాండ యోజనమంటే 30 and 10/ 33 miles. ఒక యోజనమంటే 4 and 11/12 miles. ఈ ద్వీపాలకు ప్రియవ్రతుని పుత్రులే ప్రధమ చక్రవర్తులు. ఆ వివరాలు ఇక్కడున్నాయి:

పర్వతాలు:

  1. చలాచల పర్వతం – 128 లక్షలు. దీన్ని చుట్టి చక్రవాళ పర్వతముంటుంది.
  2. చక్రవాళ పర్వతం – 256 లక్షలు. దీన్ని చుట్టి లోకాలోక పర్వతముంటుంది.
  3. లోకాలోక పర్వతం – 512 లక్షలు. దీన్ని దాటి సూర్యరశ్మి లోపలికి పోలేదు.

తమోభూమి: 1250 లక్షలు. ఇది ఎప్పుడూ చీకటిగానే ఉంటుంది.

అండభిత్తి (గోడ-కటాహం): ఈ తమోభూమిని దాటాక అండభిత్తి ఉంది. బ్రహ్మాండం చుట్టూ ఒక గోడ (కటాహం) ఉంటుంది. దాన్ని అండభిత్తి అంటారు. అది బ్రహ్మాండమంతా ఆవరించుకుని ఉంటుంది. మహాభూమి యొక్కవిస్తీర్ణం ఈ అండభిత్తి వరకూ వ్యాపించి ఉంటుంది. అది 1 కోటి బ్రహ్నాండ యోజనాల మందం కలిగి ఉంటుంది. లోకాలోక పర్వతానికి అండభిత్తికి మధ్యగల ప్రదేశం ఎప్పుడూ చీకటిగా ఉంటుంది. మహాభూమిలో ఎప్పుడూ సాయంసంధ్య వెలుతురు మాత్రమే ఉంటుంది.

6.7 మహాభూమిలోగల నవఖండ జంబూద్వీపం:

మహాభూమిలోగల జంబూద్వీపంలో నవఖండాలున్నాయి: 1. దైవఖండంలో దేవతలు, 2. గభస్త్యఖండంలో భూతాలు, 3. పురుషఖండంలో కిన్నెరులు, 4. భరతఖండంలో మానవులు, 5. శరభ ఖండంలో సిద్ధులు, 6. గంధర్వఖండంలో గంధర్వులు, 7. తామ్ర ఖండంలో రాక్షసులు, 8. శేరుఖండంలో యక్షులు, 9. ఇందుఖండంలో పన్నగులుంటారు. భరతఖండంలో భరతపురంలో వైవస్వత మనువు భూఋషులతోను, మానవులతోను కొలువు తీరి ఉంటాడు.

6.8 అంతరిక్షంలోని ఉపలోకాలు:

ఇంతవరకూ మనకు సంబంధించిన బ్రహ్మాండంలోని ముఖ్యమైన లోకాలను గూర్చి ఏదో కొంత తెలుసుకున్నాం. మన భూమి చట్టూ ఉన్న అంతరిక్షంలో గల ఉపలోకాలను గూర్చి ఎక్కువ సమాచారం లభింలేదు. లభించినంత వరకూ తెలుసుకుందాం. ఈ అంతరిక్షంలో మనం నివసిస్తున్న భూమి ఉంది. ఈ భూమి, బ్రహ్మాండం యొక్క సమ మధ్య ప్రదేశంలో ఉంది. ఈ భూమిని చుట్టి అన్నిదిక్కుల్లో ఈ ఉపలోకాలు ఉన్నాయి. భూమికి ఉత్తరదిశలో గంధర్వ, విద్యాధర, కిన్నెర, కింపురుష, యక్ష లోకాలున్నాయి. తూర్పుదిశలో వసులోకం ఉంది. భూమికి దక్షిణదిశలో నాగ, పితృ, యమ, రాక్షస, నరక లోకాలున్నాయి. ఉత్తరం వైపున్న లోకాలన్నీ భోగలోకాలే. అక్కడున్న జీవులంతా ఏ బాధలూ బాదరబందీలు లేకుండా ఆనందంగా ఉంటారు. వారంతా స్వేచ్ఛాజీవులు.

గంధర్వులకి ఊర్థ్వలోకాల గురించిన జ్ఞానముంది. అప్సరసలకి, విద్యాధరులకి భౌతిక లోకాలకు సంబధించిన వస్తుపరిఙ్ఞానముంది. యక్షులకు, గంధర్వులకున్నంత ఙ్ఞానసంపద లేదు. వసువులు 8మంది. వారిని అష్టవసువులంటారు. భారతంలో భీష్మాచార్యులవారు ఈ అష్టవసువుల్లో ఒకరు. ఈ అంతరిక్షంలోనే రుద్రగణాలెన్నో ఉన్నాయి. వారు అంతరిక్షం దాటి స్వర్గలోకం వరకూ గూడా వ్యాపించి ఉన్నారు. పితృలోకంలో 5మంది దివ్యపురుషులుంటారు. భూమ్మీద మరణించినవారంతా ఈ పితృలోకం చేరి అందులో నిరీక్షిస్తూ ఉంటారు భూమ్మీద పునర్జన్మ ఎప్పుడొస్తుందా అని. విశ్వేదేవులు అన్న దివ్యపురుషులు గూడా ఈ లోకంలోనూ, పైన ఉత్తరదిశలోనున్న లోకాల్లోగూడా ఉంటారు. యమలోకంలో యమధర్మరాజు పాపాత్ములను నరకాలకి, పుణ్యాత్ములను పుణ్యలోకాలకి పంపుతుంటాడు. అనేకరకాల నరకాలున్నాయిట. పాపాలకు తగ్గ నరకాలున్నాయన్నమాట. అలాగే పుణ్యానికి తగ్గ స్వర్గాది పుణ్యలోకాలుంటాయన్నమాట. రాక్షసలోకంలో ఘోరాతిఘోరమైన మహాపాతకాలు చేసిన పాపిష్టివాళ్ళంతా ఉంటారు. వాళ్ళు చేసిన పాపాలకింక నిష్కృతంటూ ఉండదు. అలాటి వాళ్ళంతా పుట్టగతుల్లేకుండా నరకంలో బాధల నుభవిస్తూంటారు. ఎంతవరకు? కల్పాంతం వరకు. పునర్జన్మంటూ ఉండదు అలాంటివారికి. ఘోరమైనపాపాలకు అధోగతేనని అంటూంటారు పెద్దలు. ప్రేతలోకమంటూ ఇంకోటుంది. భూమ్మీద కొందరికి విపరీతమైన కోరికలుండి అవి తీరక మరణిస్తే వారికి ఆ కోరికల వాసనలు వదలకుండా ఉంటాయి. చాలా వేదనలు అనుభవిస్తుంటారు. అలాంటివారు ప్రేతలోకానికి పోతారు. ఆ వాసనలు వదిలి పితృలోకం పోయేవరకు యమయాతనల నుభవిస్తుంటారు. మన భూమికి, చంద్రునికి మధ్యనున్న ప్రదేశమే ప్రేతలోకం.

నాగలోకమని ఇంకోలోకముంది. ఇది మనమనుకునే సర్పాల లోకం కాదు. ఇందులో దివ్యులైన నాగులుంటారు. మనం వారిని నాగదేవతలుగా పూజిస్తుంటాం. ఇలా చాలా లోకాలున్నాయి. ఇవన్నీ గూడా ఈ ద్యులోకానికి సంబంధించినవే కాబట్టి వారికి భూమ్మీద మనుషులతో సంబంధాలుంటాయి. ఈ లోకాలన్నీగూడా బ్రహ్మాండంలోని మేరువుని చుట్టి ఉన్నాయి. ఎన్నో లోకాల్లో కొన్నిటిని గురించే కొంతమేరకు మాత్రమే తెలుసుకున్నాం ఇక్కడ.

6.9 ఈలోకాలన్నీ ఎవరికోసం?

ప్రళయంలో జీవులు తమస్సులో లీనమై ఉంటారు. ఈ జీవుల కర్మానుసారంగా జన్మలనివ్వాల్సిన బాధ్యత ఈశ్వరుడిది. అందుకని ఆయన ముఖ్యంగా 3 కార్యాలు చేస్తాడు: సృష్టి, స్థితి, లయలు. ఇంకా రెండు కార్యాలు: తిరోధాన, అనుగ్రహమని గూడా చేస్తాడు. తిరోధానమంటే ప్రళయం తర్వాత తనలోనికి విలీనం చేసుకోవడం, అనుగ్రహమంటే మళ్ళీ జీవుల కర్మానుసారం జన్మనివ్వడం. నిజానికి ఈశ్వరుడు ఈ లోకాలని సృజించాడు గానీ, జీవులని కాదు. జీవులు వారు చేసుకున్న పూర్వజన్మల పుణ్యపాప కర్మఫలాలను అనుభవించడానికి మాత్రమే జన్మలను తీసుకుంటున్నారు. ఆ ఫలాలను ఇచ్చేది మాత్రం ఈశ్వరుడే. ఆయనే కర్మఫలప్రదాత. మనలో సాక్షిగా ఉంటూ, మనం చేసే ప్రతీపనీ గమనిస్తూ చిత్రగుప్తుడి లాగా పనిచేస్తూ తన చిట్టాలో మన పాపపుణ్యాల వివరాలన్నీ రాస్తూ ఉంటాడు. వాటి ఫలితాలన్నీ ఆయన చిట్టాలో ఉంటాయి. ఇవన్నీ మనకు తెలియవుగా, అందుకే పాపాలెన్నో చేసుకుంటూ పోతాం. తెలిసి పాపాలు చేస్తాం, తెలియక ఫలితాల్ని అనుభవిస్తాం. మనం చేసే పాపాలు కొండల్లాగా పెరిగిపోతుంటే వాటిలో కొంచెం కొంచెం తీసి అనేక జన్మల్లో సర్దుతాడు. మధ్యలో కొన్ని పుణ్యకర్మల ఫలితాల్ని గూడా చొప్పిస్తాడు. అందుకే భూలోకంలో మానవుల జీవితాలన్నీ కష్టసుఖాలతో కూడుకొని ఉంటాయి.

పుణ్యకర్మలు చేస్తే మనభూమికి సమీపంలోనున్న ఉపలోకాల్లో మంచివైన గంధర్వాది లోకాలకెళతాం. ఎక్కువ పుణ్యకర్మలు చేస్తే దేవతలుగా పుడతాం. ఎక్కువ పాపంచేస్తే నరకకూపంలో పడి పుట్టగతులు లేకుండాపోతాం. పాప,పుణ్యాలు సమంగాఉంటే భూమ్మీద పుడతాం. స్వర్గాది లోకాలైన ఊర్ధ్వలోకాలకు మాత్రం వెళ్ళాలంటే చాలా కష్టం. అవి యజ్ఞయాగాది పవిత్ర క్రతువుల ద్వారా మాత్రమే సాధ్యం. యజ్ఞయాగాల ద్వారా స్వర్గం రావచ్చేమో గానీ ముక్తి మటుకూ రాదు. మోక్షం రావాలంటే వైరాగ్యం తెచ్చుకుని అన్నీ విడిచిపెట్టి ఙ్ఞాన సముపార్జన కోసం తపస్సు చేయాల్సిందే. స్వర్గంలోని దేవతలు ఏదో యజ్ఞయాగాల ఫలితంగా పుట్టలేదు. సృష్టి జరిగినప్పుడే బ్రహ్మవల్ల సృజింపబడ్డారు. ఎంతో తపస్సు చేస్తేనే గానీ దేవతలుగా పుట్టలేరు. వారంతా కిందలోకాలకు రక్షకులుగా ఉంటారు. ఈశ్వరునిచే నిర్మించబడిన విశ్వం యొక్క విశ్వనిర్వహణశక్తులు వారు. మహర్లోక, జనలోక, తపోలోకాల్లోని జీవులంతా గొప్ప తపస్సు చేసినవారే. ఉదాహరణకి తపోలోకంలో అత్రి, కశ్యప, వసిష్ఠాది మునులంతా ఉంటారు.

బ్రహ్మలోకమైన సత్యలోకంలోని వారంతా జీవన్ముక్తులైనవారే. అక్కడికి వెళ్ళిన వారికింక జన్మంటూ ఉండదు. కల్పాంతరం అయ్యాక బ్రహ్మతోపాటే పరమాత్మలో ఐక్యమైపోతారు. మనువులు, ఋషులు బ్రహ్మదేవునికి ప్రపంచసృష్టి విషయంలో సహాయం చేస్తూ ఉంటారు. ఈశ్వరుడు కర్మలకు తగ్గ జన్మలిస్తున్నాడంటే జీవులను ఉద్ధరించడానికే. మంచికర్మలు చేస్తే మంచి లోకాలకు, చెడు కర్మలు చేస్తే నరకాలకు పోతాం. మనిషి జన్మ వచ్చిందంటే సత్కర్మలాచరించి సద్గతులు పొందాలి. అందుకే ఈ జన్మలు. కనుక మనం ఏ లోకానికి పోవాలనుకుంటామో అది మన చేతిలోనే ఉంది. జంతువులకి అవేం చేస్తున్నాయో వాటికి తెలియదు. మనిషికి విచక్షణా జ్ఞానమిచ్చాడు ఈశ్వరుడు. అది ఉపయోగించి  ఇతరులకు మేలు చేయకపోయినా పరవాలేదు గానీ కీడు చేయకుండా ఉంటే ఏనాటికైనా ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతాడు. దానికోసం ఎన్ని జన్నలెత్తాలో?

6.10 బ్రహ్మాండాలన్నీ ఒకేలాగుంటాయా?

ఇంతవరకూ మనకు సంబంధించిన బ్రహ్మాండంలోని లోకాలను గూర్చి కొంత తెలుసుకున్నాం. ఇలాంటి బ్రహ్మాండాలు కోటానుకోట్లున్నాయి. ప్రతి బ్రహ్మాండంలోనూ 14 ప్రధాన లోకాలుంటాయిట. ప్రతి బ్రహ్మాండంలోనూ బ్రహ్మ, విష్ణు, రుద్రులుంటారు. ఇంకా ఇంద్రాది 33 కోట్ల దేవతలు, అసురులు, మానవులు మొదలగువారుంటారు. మన బ్రహ్మాండమున్నట్లే అన్ని బ్రహ్మాండాలుంటాయి. ఈ విషయాలన్నీ వేదాల్లో ఉన్నాయి.

6.11 అనేక బ్రహ్మాండాలకధిపతులు గూడా ఉన్నారు:

యోగవాసిష్ఠంలో చిత్రమైన వివరణుంది: శూరపద్మాసనుడనే రాజు ఈశ్వనానుగ్రహం వల్ల 1008 బ్రహ్మాండాలను పరిపాలించాడుట! ఆశ్చర్యమనిపిస్తుంది ఎంత తపస్సు చేసి ఆ శక్తి సంపాదించాడోనని! చిన్న చిన్నఊళ్ళనే పాలించలేక తన్నుకుంటున్నారే మన భూమ్మీద పాలకులు, అలాంటిది వెయ్యి ఎనిమిది బ్రహ్మాండాలను పరిపాలించాడంటే ఎంతటి మహాత్ముడో ఆయన!

6.12 ఇంతవరకు మన బ్రహ్మాండం గురించి తెలుసుకున్న విషయాలు:

మన బ్రహ్మాండంలో 14 ప్రధానలోకాలు, ఇంకా అనేక ఉపలోకాలున్నాయి. ఈ లోకాలన్నీ అనేకరకాల జీవులతో నిండిపోయున్నాయి: దేవ, అసుర, యక్ష, గంధర్వ, మానవ మొదలగువారితో.. స్వర్గాది పుణ్యలోకాలు, నరకాది పాపలోకాలూ ఉన్నాయి. మంచికర్మలకి పుణ్యలోకాలు, చెడుకర్మలకు పాపలోకాలు చేరుకోవచ్చు. ఎన్నో లోకాల్లో కొన్నిటి గురించి తెలుసుకున్నాం. వీటి వర్ణన పురాణాల్లో ఎక్కువగా లేదు. కానీ పరాశక్తి శ్రీదేవిగా కొలువైయ్యుండే మణిద్వీపం గురించి శ్రీదేవీభాగవతములో కొంత వర్ణనుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం తరువాయి అధ్యాయంలో.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here