దివినుంచి భువికి దిగిన దేవతలు 8.1

1
9

[box type=’note’ fontsize=’16’] మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞాన రహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రచన చేశారు డా. ఎం. ప్రభావతీదేవి. [/box]

8.10 ఉపాంగాలు 4:

[dropcap]వే[/dropcap]దాధ్యయనానికి ఈ 6 వేదాంగాలు నేర్చుకోడమే ముఖ్యమని అంతటితో ఆగిపోకూడదు. వేదానికి ఇంకా ఉపాంగాలున్నాయి. అవి మీమాంస, న్యాయం, పురాణం, ధర్మశాస్త్రం. అవి గూడా నేర్చుకోవాలి.

1. మీమాంస:

మీమాంస అన్న పదసమాసంలో “మాజ్’ అన్నధాతువుకు ‘సన్’ అన్న ప్రత్యయం చేర్చబడింది. ఈమాటల కర్థం: పూజిత ‘విచారణ’ లేక ‘ ఆదరణీయమైన విషయమై గంభీరమైన పరిశీలన’. వేదమంత్రాల ప్రాముఖ్యత, ఉద్దేశం, వాటి విశిష్టతా నిర్దుష్టంగా గ్రహించే పద్ధతిని మీమాంస తెల్పుతుంది. వేదాల్లో రెండు ముఖ్య భాగాలున్నాయి: 1.కర్మకాండ అనబడే పూర్వభాగం, 2. జ్ఞానకాండ అనబడే ఉత్తరభాగం. వీటినే మీమాంస పరంగా పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అంటారు. పూర్వమీమాంస కర్మకాండలోచెప్పే కర్మల, యజ్ఞాల ప్రాముఖ్యాన్ని విశదీకరిస్తుంది. పూర్వమీమాంసని జైమినిమహర్షి సూత్రబద్ధంచేయగా, శబరిస్వామి భాష్యం రచించగా, కుమారిలభట్టు, ప్రభాకరుడు వార్తికాలందించారు.

పూర్వమీమాంస సారాంశం: వేదాలు శాశ్వతం, ఆద్యంతరహితం. అవి దైవవిహిత శాసనాలు. మనం పాలితులం. దైవం ప్రభువు. ఆయన ఎందరో అధికారుల్ని నియమించాడు. సృష్టి పరిపాలననంతా ఎందరో దేవతలు – ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, యముడు, ఈశానుడు, కుబేరుడు, నిరృతి లాంటి వారు నిర్వహిస్తారు. 14 భువనాల్లోని జీవరాసుల్ని పరిపాలించడానికి కొన్ని నియమ నిబంధనలుండాలి వారికి. ఇవి వేదాల్లో ఉన్నాయి. వేదాలను విశ్లేషిస్తే మనమెలా నడచుకోవాలో, నిబంధనలను దేవతలేలా అమలుపరుస్తారో తెలుస్తుంది.

ఉత్తరమీమాంస జ్ఞానకాండ విషయమైన ఆత్మసాక్షాత్కారం ప్రాముఖ్యాన్ని వివరిస్తుంది. ఇందులో ఉపనిషత్తుల, బ్రహ్మసూత్రాల గురించి ప్రస్తావనుంటుంది. ఇది వేదాంతం.. వేదవ్యాసులవారు ఉపనిషత్తుల యొక్క అర్థాలని, బ్రహ్మసూత్రాల ద్వారా వివరించారు. ఉత్తరమీమాంసపై వార్తికాన్ని ఆదిశంకరుల శిష్యుడైన సురేశ్వరాచార్యుడు రచించాడు. ఈ సురేశ్వరాచార్యుడు, సన్యాసం స్వీకరించక ముందు తన పూర్వాశ్రమంలో మండనమిశ్రుడని పేరుగాంచిన పూర్వమీమాంసకుడు.. పూర్వమీమాంసకులు ఈశ్వరుడున్నాడా లేడాన్నది పట్టించుకోరు. వారికి వేదాల్లో చెప్పినట్లు నడచుకోడమే ముఖ్యం. వారి దృష్టిలో ప్రతి కార్యానికి ప్రతిఫలం వెంటనే ఉంటుంది. అందువల్ల ఈశ్వరుని ప్రమేయం లేదు. మంచి పనులకు మంచి ఫలితాలు, చెడు పనులకు చెడు ఫలితాలు కలుగుతాయని వారి నమ్మకం.

2. న్యాయం:

న్యాయశాస్త్రాన్ని తర్కశాస్త్రమని గూడా అంటారు. గౌతమమహర్షి ఈ న్యాయశాస్త్రాన్ని కూర్చాడు. తర్కమంటే యుక్తి. యుక్తుల ద్వారా ఈ సృష్టికి కర్త పరమేశ్వరుడేనని నిరూపించడమేనని ఆ శాస్త్రం యొక్క ముఖ్యోద్దేశం. ఆ శాస్త్రం ఈశ్వరుని ఉనికిని సహేతుకంగా ప్రతిష్ఠిస్తుంది. దీనికి ముఖ్యసాధనం తార్కిక పద్దతే (హేతు విచారణ పద్దతి). మౌలిక సత్యాన్ని 4 ప్రమాణాల (సాధనాల) ద్వారా ఈ శాస్త్రం చర్చిస్తుంది. అవి: 1. ప్రత్యక్షం, 2. అనుమానం,3. ఉపమానం, 4.శబ్దం. ప్రత్యక్ష ప్రమాణమంటే జ్ఞానేంద్రియాలైన కన్ను, చెవి మొదలగువాటి ద్వారా తెలుసుకోగలగడం. అనుమాన ప్రమాణమంటే ప్రత్యక్షంగా గోచరంగాని దాన్నిఇతర సాక్ష్యాలతో గుర్తించగలగడం. ఉదా: ఎక్కడో పొగను చూసి అక్కడ నిప్పుందని తెలుసుకోడం. ఉపమాన ప్రమాణమంటే మనకు తెలియనిదాన్ని గురించి తెలిసినదాని సహాయంతో తెలుసుకోడం. ఉదా: ‘ఆవు’ అన్నదెలా ఉంటుందో తెలియదు. దాని వర్ణనను బట్టి అలాంటి దాన్నిచూసి అదే అనుకోడం. శబ్ద ప్రమాణమంటే మహర్షులవంటి మహనీయుల సూక్తులను, ప్రవచనాలను ప్రమాణంగా స్వీకరించడం.

3. పురాణం:

వేదాలకు పురాణాలు భూతద్దాల్లాంటివి. వేదాల్లో సూక్తులు క్లుప్తంగా ఉంటాయి. వాటిని కథలుగా ఆఖ్యాయానాలుగా పెంచి చూపుతాయి పురాణాలు. ఒక భావాన్ని క్లుప్తంగా చెప్తే అది మనసులో నాటుకోకపోవచ్చు. దాని ఫలితమూ కనబడకపోవచ్చు. దాన్నేఒక కథగా చెప్తే మనస్సులో నిలచిపోతుంది. ఉదా: వేదాలు ‘సత్యంవద’ అంటాయి. సత్యవ్రతాన్ని పాటించడం ఎంత మహనీయతకు దారితీస్తుందో హరిశ్చంద్రుని కథ చెప్తుంది. అలాగే ‘ధర్మంచర’ అన్నవేదవాక్యం మహాభారతంలో పాండవుల ధర్మ నిరతిని తెలియజేస్తుంది. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ’ అన్న వేదవాక్యాల నిరూపణని రామాయణం చూపుతుంది. వైదిక నియమాలైన నిగ్రహం, క్షమ, కరుణ, పవిత్రత వంటి ధర్మాలనన్నింటినీ తమ తమ జీవితాల్లో ఎందరో స్త్రీ, పురుషులు పాటించి చూపించారు. ఇవన్నీ పురాణాలు, ఇతిహాసాల ద్వారా తెలుస్తాయి. వాళ్ళంతాఎన్నో కష్టనష్టాలకు గురయ్యారు. అవి తెలుసుకుంటుంటే మన మనస్సు కరుణతో కరిగిపోతుంది. మనదోషాలు క్షాళనమయినట్లు అనిపిస్తుంది. మనలో ధర్మబుద్ది కలుగుతుంది. ఒక విధంగా పురాణాలు మన ప్రాచీన చరిత్రకు నిదర్శనాలు. వ్యాసులవారు మనకు 18 పురాణాలందించారు. ఈ పురాణాలన్నీ మన దేవతలయొక్క మహిమాన్విత లీలల్ని తెలిపేవే. అదీగాక ఇవి దేవతలకి, మానవులకుగల సంబంధ బాంధవ్యాలు గూడా తెలియజేసేవే. వీటిలో ఉపాఖ్యానం,తత్వం, చరిత్ర ఉంటాయి. మనకు గల 18 పురాణాలు: బ్రహ్మ, విష్ణు, పద్మ, శివ, నారద, మార్కండేయ, అగ్ని లింగ, వరాహ, స్కాంద, వామన, కూర్మ, మత్స్య, గరుడ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, భవిష్య, శ్రీమద్భాగవత పురాణాలు. వీటిలో వైష్ణవ, శైవ, శాక్తేయ ధర్మాలకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా చాలా ఉపపురాణాలు గూడా ఉన్నాయి. ఇవన్నీ విశ్వ సృష్టి విజ్ఞాన రహస్యాలనూ తెలుపుతాయి. మన వైదికధర్మానికి సంబంధించిన ఆధ్యాత్మిక గ్రంథాల్లో మాత్రమే ఈ రహస్యాలుంటాయి. అందుకే ఇవి పవిత్రమైనవి.

4. ధర్మశాస్త్రం:

భూమ్మీద జన్మ ఎందుకొస్తుందంటే, మనం పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్య, పాపకర్మలను అనుభవించడానికేనని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మన నడవడిక బాగుండకే పాపకర్మలు చేస్తున్నాం. దానికి తగ్గ కష్ట ఫలితాల్ని అనుభవిస్తున్నాం. పుణ్యకర్మలు చేసుకుంటే మంచి ఫలితాల్ని అనుభవిస్తూ సఖమయమైన జీవితాల్ని గడుపుతున్నాం. పురాణాలను, ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలను చదువుతున్నాం. అవి మనకు మంచీ, చెడూ ప్రవర్తన కలవారి జీవితాలను తెలుపుతున్నాయి. ఐతే మనకు ఏయే కర్మల వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో సరిగా తెలియడం లేదు. ఇటువంటి విషయాలన్నీ ఒకే చోట క్రోడీకరించబడి మనకు దొరకడంలేదు. ఆ గ్రంథాల్లోకొన్ని, ఈ గ్రంథాల్లో కొన్ని లభిస్తున్నాయి. అందుకే మన ఋషులు మన కోసం ధర్మశాస్త్రాలను విడిగా అందించారు. ఈ ధర్మశాస్త్రాల్లో మన నిత్యజీవితమెలాగడపాలో నన్నదానికి విధివిధానాలను పొందుపరచారు. మన నిత్యకృత్యాలను మన సంస్కృతీ, సాంప్రదాయాల్లో పెనవేసుకుపోయేట్లు మన ధర్మాన్ని మలచారు. దాన్ని ధర్మమన్నా, మతమన్నా ఒకటేననుకోవచ్చు. పుట్టినప్పటినుంచి మరణించేవరకు ఎలాటి సంస్కారాలు జరగాలో నిర్దేశించారు. నిద్ర లేచినప్పటి నుంచి, మళ్ళీ నిద్రపోయే వరకూ చేసే ఇంటి పనులు,స్వంత పనులు, ఆహారనియమాలు, స్నానాదికాలు – ఇలా ఒకటేమిటి అన్నికర్మల విధివిధానాలను ఈ ధర్మశాస్త్రాల్లో నిక్షిప్తం చేసారు. లౌకిక జీవితం వేరు, ధార్మిక జీవితం వేరని ఈ ధర్మశాస్త్రాలు విడదీయలేదు. జీవితంలో ఏ పని చేసినా ధర్మబద్ధంగా ఉండాల్సిందేనని కట్టుబాట్లు ఏర్పాటు చేసారు. అలా చేయడం వల్ల మన వల్ల ఇతరులకు ఎటువంటి కీడు, హాని జరగడానికి వీలుండదు. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే, దానికి తగ్గ ప్రాయశ్చిత్త విధులుంటాయి. ఇవన్నీ వ్యక్తుల ఉన్నతికే. వ్యక్తుల ముక్తికే. లోక కళ్యాణానికే. ఈ ధర్మశాస్త్రాలే ఇప్పుడు మనకు స్మృతుల రూపంలో లభిస్తున్నాయి. ఉదా: మనుస్మృతి, పరాశరస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి మొదలగునవి.

8.11 అనుబంధ ఉపాంగాలు-4:

వేదాంగాలకి అనుబంధాలుగా ఇంకో 4 ఉపాంగాలున్నాయి: ఆయుర్వేదం, అర్థశాస్త్రం, ధనుర్వేదం, గాంధర్వ వేదం. వాటిని గూడా కలిపితే అష్టాదశవిద్యలు-18 విద్యలు. వాటిని గురించి సూక్ష్మంగా తెలుసుకుందాం.

1.ఆయుర్వేదం:

ఆయుర్వేదం యొక్క అవసరం కృతయుగంలో లేకపోయింది. త్రేతాయుగం నుండి మాత్రమే వాడుకలోకి వచ్చింది. ఈ యుగంలో ప్రజల్లో అధర్మప్రవర్తన మొదలైంది. దాని వల్ల శారీరక అనారోగ్యం చోటు చేసుకుంది. అందుకు ఋషులు వారిపట్ల జాలితో, ప్రకృతిలోని మూలికల ఔషధక్రియలతో రోగాల్ని నయం చేసుకునే విధానాల్ని రూపొందించారు. ఆ విధంగా ఆయుర్వేదం జీవితానికి సంబంధించిన శాస్త్రం. ఉదా: చరక, సుశృత సంహితలు.

2.అర్థశాస్త్రం:

అర్థశాస్త్రమంటే సంపదకి, అర్థానికి సంబంధించిన శాస్త్రం. రామాయణ, మహాభారతాల్లో గూడా ఈ అర్థశాస్త్రానికి సంబంధించిన సూచనలు చాలా సందర్భాల్లో కనిపిస్తాయి.

3.ధనుర్వేదం:

ధనుర్వేదం అస్త్రాలకి, యుద్దానికి సంబంధించిన శాస్త్రం. రామాయణ, మహాభారతాల్లో యుద్ధవిద్యలకు సంబంధించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ కలియుగంలో ఈ విద్యలన్నీ లుప్తమైపోయాయి. 4.గాంధర్వవేదం:

గాంధర్వవేదం సంగీతం, నృత్యం, నాటకం వంటి లలితకళలకి సంబంధించిన శాస్త్రం. గంధర్వులంటే దేవయోని వర్గానికి చెందినవారు. వారి ద్వారా ఈ విద్య మనకందింది. అది గూడా విదేశీయుల సంపర్కం వల్ల కలుషితమైపోయింది. ఇప్పుడు షడ్దర్శనాల గురించి తెలుసుకుందాం.

8.12 షడ్దర్శనాలు:

ప్రాచీన భారతీయ మహర్షులెందరో మనకనేక శాస్త్రాలనందించారు. వాటిలో చాలా లుప్తమైపోగా ఏవో కొన్నిమాత్రం మిగిలాయి. ఇంతవరకు మనం వేదాలు, వాటి అంగోపాంగాలు కొంత మేరకు తెలుసుకున్నాం. వాటికిందకే వచ్చే షడ్దర్శనాలని గురించి గూడా తెలుసుకుందాం. షడ్దర్శనాలు లేక షట్ శాస్త్రాలని ఆరున్నాయి. అవి: 1.గౌతముని న్యాయశాస్త్రం, 2.కణాదుని వైశేషిక శాస్త్రం, 3.కపిలుని సాంఖ్యశాస్త్రం, 4. జైమిని పూర్వమీమాంసశాస్త్రం, 5. వ్యాసుని ఉత్తరమీమాంస శాస్త్రం, 6.పతంజలి యోగశాస్త్రం. ఈ శాస్త్రాల్లో మీమాంస,న్యాయశాస్త్రాలు/దర్శనాలు అష్టాదశవిద్యల్లోవే. వీటిలో జగత్సృష్టికి కారణాలను నిరూపించు సిద్ధాంతాలున్నాయి. వాటిని చూద్దాం.

1.గౌతముని న్యాయశాస్త్రం:

గౌతముని న్యాయశాస్త్రాన్నే ‘అక్షపాద దర్శనం’ అని గూడా అంటారు. సృష్టికి కారణాలు రెండు నిమిత్తం, ఉపాదానం. ఉదా: మట్టి ఉంటేనే కుండ తయారౌతుంది. కుండకి కారణం మట్టి కాబట్టి మట్టిని ఉపాదానమన్నారు. ఐతే కుండ చేయాలంటే చేసేవాడైన కుమ్మరి ఉండాలి. అప్పుడు కుమ్మరి కారకుడు/నిమిత్తం అవుతాడు. దీనిని ‘ఆరంభ వాదం’, ‘అసత్కార్యవాదం’ అని గూడా అంటారు. ‘సత్’ అంటే ఉన్నది, ‘అసత్’ అంటే లేనిది. మట్టిలో కుండ లేదు. లేని కుండ మట్టి నుండి వస్తుంది. దీని ప్రకారం సృష్టికి కారణం అణువులు. అణువుల్లో లేని జగత్తును ఈశ్వరుడు అణువుల సాయంతో సృష్టించాడు. అణువులని ‘గాజు, అభ్రకం,స్ఫటికం’ లతో చేసిన సూక్ష్మదర్శిని సాయంతో చూడచ్చని అంటారు గౌతములు. ఈ అణువులు పాంచభౌతికమైనవే.

2. కణాదుని వైశేషికశాస్త్రం:

కణాదుడు తన వైశేషికశాస్త్రంలో పరమాణువులు జగత్కారణమని నిరూపించాడు. ఈ పరమాణువులు అణువులకన్న సూక్ష్మమైనవి. అవి గూడా పాంచభౌతికమైనవే. వీటిని సూక్ష్మదర్శిని సాయంతో గూడా చూడలేరు. దీన్ని బెలూక్య దర్శనమని గూడా అంటారు. దీన్ని గూడా ‘అసత్కార్యవాదం’ అంటారు. న్యాయ, వైశేషక శాస్త్రాలు రెండిటినీ బ్రహ్మవాదులు తోసిపుచ్చారు ‘అసత్కార్యవాదాలు’ అని. ఎందుకంటే గీతలోకృష్ణుడు చెప్తాడు: ఉన్న దానికి సర్వాత్మనాశనంగాని, లేని దానికి పుట్టుకగానీ జరగదు. ఈ సిద్దాంతాల గురించి వారు చెప్పారేగానీ అవే పరమావధులు అని అనలేదు. ఎందుకంటే వారు జ్ఞానులు. సూక్ష్మపదార్థ జ్ఞానం గలవారు.

3.కపిలుని సాంఖ్యశాస్త్రం:

కాపిల దర్శనం ప్రకారం ఈ జగత్తుకు మూలప్రకృతి కారణం. ప్రకృతి తన నుండి తానే జగత్తుని కల్పించింది. ప్రకృతి అంటే 24 తత్త్వాలతో కూడుకుని ఉంది: పంచభూతాలు+ పంచతన్మాత్రలు +పంచ జ్ఞానేంద్రియాలు +పంచకర్మేంద్రియాలు +అంతఃకరణ చతుష్టయం( 24). వీటికి ‘కాలం’ గూడాకలిపితే 25 తత్త్వాలు. సాంఖ్యుల ప్రకారం దేవుడు లేడు. అంటే నాస్తికవాదమని కాదు.సాంఖ్యులు నిర్గుణబ్రహ్మని (పురుషుడ్ని) జ్ఞానస్వరూపునిగా గుర్తిస్తారు. జడమైన ప్రకృతి యొక్క సక్రమ వ్యాపకాలకి కారణం “పురుషుని సాన్నిధ్య ప్రభావం. అదే సృష్టికి, అందులోని నియమబద్దతకి కారణమంటారు వారు. పురుషునికి ఏ వ్యాపకమూ లేదు. దీన్నే ‘పరిణామవాదం’ అంటారు. అంటే సాంఖ్యశాస్త్రం ప్రకారం ఈశ్వరుడు సృష్టికర్త కాడు. ఈశ్వరుడు శుద్ధచైతన్యం. జగత్తు భౌతిక పదార్థం కావడంవల్ల ఈశ్వరుడు సృష్టి కార్యాన్ని చేసి ఉండడు. దీనికి శంకరులవారు ‘నిర్గుణ బ్రహ్మమే సగుణ బ్రహ్మంగా కార్యకలాపంచేసి జగత్సృష్టి కావించాడు’ అన్నారు. జడమైన ప్రకృతికి కర్తృత్వమెలా ఉంటుందని కపిలసిద్దాంతాన్నిగూడా బ్రహ్మవాదులు తోసిపుచ్చారు.

4. జైమిని పూర్వమీమాంసశాస్త్రం:

జైమిని పూర్వమీమాంసశాస్త్రమంతా కర్మవాదమే. దాన్నిగూర్చి మీమాంసలో తెలుసుకున్నాం.

5.వ్యాసుని ఉత్తరమీమాంసశాస్త్రం:

ఇది అద్వైతవాదం. ఇది వివర్తవాదం గూడాను. వివర్తమంటే తన అసలు స్వరూపం వీడకనే తనయందితర పదార్థ భావనను భాసింపచేసేది. అంటే భ్రమను కల్పించేది. దీన్నే రజ్జుసర్పభ్రాంతి అంటారు. ఈ సిద్దాంతం అనంతకోటిబ్రహ్మాండాలకు కారణం పరమాత్మతత్వమేనని చెప్తుంది. అంటే అంతటా బ్రహ్మమే నిండి ఉంది. బ్రహ్మమే విశ్వంగా భాసిస్తోంది. ఆత్మతత్వమే అంతటా నిండి ఉంది. బ్రహ్మమంటే అన్నిటికంటే పెద్దదనర్థం. ఆత్మఅంటే అంతటా నిండి ఉన్నదనర్థం.

6. పతంజలి యోగశాస్త్రం:

పతంజలి యోగశాస్త్రంలో కాపిలసాంఖ్యంలో చెప్పబడిన 25తత్త్వాలకంటే అధికంగా ఈశ్వరుని చెప్పారు.. కాబట్టి దీన్ని ‘సేశ్వర సాంఖ్యం’ అంటారు. పాతంజల, కాపిల శాస్త్రాల్లో అణువుల కంటే సూక్ష్మ తత్త్వాలైన ‘అవ్యక్తం, మహత్, అహంకారం’ మొదలగువాటి గురించి చెప్పబడింది. పతంజలి యోగశాస్త్రంలో మనస్సుని నిరోధించాలని చెప్తారు. వేదాంతం అది కుదరదని చెప్తుంది. ఏ విషయమైనా తెలుసుకోవాలంటే మనసుతోనే సాధ్యం అంటుంది వేదాంతం. ఈ శాస్త్రాల గురించి తెలుసుకుంటుంటే అనేక యుగాలక్రితమే మన ఋషులు ఈ అణువాదాల, పరమాణువాదాల శాస్త్ర చర్చలు జరిపారని తెలుస్తోంది. ఈ విషయం ఆధునిక శాస్త్రజ్ఞులు తెలుసుకుంటే మంచిది.

8.13 అనేక గ్రంథాలసారం ఒకే గ్రంథంలో సాధించవచ్చా?

మనకు వేదాలు, వేదాంగాలు, వాటి ఉపాంగాలు, ఇంకా వాటి అనుబంధ శాస్త్రాలు – ఇలా అనేక విద్యలున్నాయి. వాటిలో ఏముంటాయో గూడా తెలుసుకున్నాం. ఇన్ని విద్యలుగల మన ప్రాచీన సంస్కృతి ఎంతో గొప్పదని మనం గర్వపడాల్సిన విషయం. ఇలా ఇంక ఏ దేశానికి ఇంత గొప్ప ప్రాచీన సంస్కృతి లేదని మనందరికీ తెలుసు. కానీ ఈ శాస్త్రాల సారమంతా ఒకే గ్రంథంలో ఉంటే మన యువతకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుదనిపిస్తుంది. మన యువతకు అసలు భారతదేశం యొక్క ఔన్నత్యమేమిటో తెలియటంలేదు. ధర్మానికి మతానికి మధ్యగల తేడా తెలియని ఈ రోజుల్లో, మన ధర్మానికి గల విశిష్టతను గూర్చిచెప్పాల్సిన అవసరమెంతో ఉంది. మనదేశంలో విభిన్న మతాలకు చెందినవారున్నారు – సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు, ముసల్మానులు మొదలగువారు. ఈ మతాల్లో ప్రతి మతానికీ ప్రధానమైన గ్రంథముంటుంది. ఆ మతానికి సంబంధించిన మతస్థాపకుడుంటాడు. వారి దృష్టిలో ఆ గ్రంథం పవిత్రమైంది. అదే ముక్తిమార్గం చూపుతుంది. ఉదా: సిక్కుల గ్రంథసాహెబ్, క్రైస్తవుల బైబిల్. అవి వారి మతపరమైన విద్యాబోధన చేస్తాయి. ఈ గ్రంథాల్లో విషయాలు భగవంతుని వాక్కులని అవి వారి ప్రవక్తల ద్వారా బహిర్గతమయ్యాయని వారు నమ్ముతారు. మనకు ఎన్ని ధర్మపరమైన పవిత్ర గ్రంథాలున్నాయో చూసాం. కానీ మన పిల్లలకు చిన్నతనం నుండి బోధించడానికి ఒక గ్రంథంగా ఏదీ లేదు. అనేకమున్నాయి గానీ, ఒక్కటిగా లేదు. మనకున్న అనేక గ్రంథాల్లోని ముఖ్యమైన విషయాలను వెలికితీసి ఒక చిన్నగ్రంథంగా చేసి మన పిల్లలకు చిన్నతనం నుంచి బోధిస్తే ఎంతో మంచిది. “మీ దేశం గురించి మీకేం తెలుసు? మీ సంస్కృతేంటి? మీ మతమేంటి?” అనెవరైనా మనవాళ్ళనడిగితే మనవాళ్ళేమీ చెప్పలేకపోతున్నారు. ఎందుకు? మనకు సముద్రమంత శాస్త్రాలున్నాయి. అవి ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చాయి. భౌతిక విషయాలే సర్వస్వమనుకుని అందులోనే కొట్టుకుపోయేవాళ్ళకి ఆధ్యాత్మికతంటే ఏం తెలుస్తుంది? విదేశీ సంస్కృతీ, సాంప్రదాయల్ని అనుకరిస్తున్నమన వాళ్ళకి మన సంసృతిని గురించి, మన సాంప్రదాయల్ని గురించి తెలియచెప్పాల్సిన అవసరమెంతైనా ఉందిప్పుడు. ఇప్పుడిప్పుడే మనవాళ్ళు గూడా వీటి మీద ఆసక్తి చూపుతున్నారు. ఇంతవరకు వేదశాస్త్రాల్లోని కొన్ని విషయాలను తెలుసుకున్నాం. వేదాల్లో ఉన్న యజ్ఞ విజ్ఞానాన్నిగురించి తరువాతి అధ్యాయంలో తెలుసుకుందాం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here