దివినుంచి భువికి దిగిన దేవతలు 9

0
7

[box type=’note’ fontsize=’16’] మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞాన రహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రచన చేశారు డా. ఎం. ప్రభావతీదేవి. [/box]

9. వేదాల్లో యజ్ఞవిజ్ఞానం

9.0 యజ్ఞవిద్య:

[dropcap]మ[/dropcap][dropcap][/dropcap]నం ఇంతవరకు వేదాలు, వాటికి గల అంగోపాంగాలని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం యజ్ఞవిద్యలోగల విజ్ఞాన రహస్యాలను తెలుసుకోడానికి ముందుకెళదాం. ప్రాచీన భారతంలో జీవనమంతా యజ్ఞయాగాది కర్మకాండలతో నిండి ఉండేది. ఈ క్రతువులన్నీ వేదాలపై ఆధారపడి ఉండడంవల్ల మన ధర్మాన్ని వేదధర్మమన్నారు. ఈ వేదసాంప్రదాయంలో ఋషులు యజ్ఞవిద్యకు ప్రాధాన్యతనిచ్చారు. ఎందుకు? భగవతత్త్వాన్ని అనుభవసిద్ధం చేసుకోడానికి చింతన ద్వారా కలిగే జ్ఞానమవసరం. ప్రాపంచిక విషయాల్లో తేలిపోయే మన జీవితాలను ఎంతో క్రమశిక్షణకు లోను చేస్తేనే గాని ఆ స్థితికి చేరుకోలేం. ధర్మమార్గంలో పోతూ మనసును క్షాళనం చేసి పరిణతిని కలిగించే క్రతువులను చేయాలి. అప్పుడు ప్రాపంచిక బంధాలు తెగిపోతాయి. ఆ గమ్యాన్ని చేరుకోడానికి అనేక మార్గాలను, ఉపాయాలను సూచించాయి వేదాలు. వీటిలో యజ్ఞమనే కర్మ అతి ముఖ్యం. ఇందులోఒకే ఒక దేవునికి కాక, అనేక దేవతలకి ఉపాహారాలిస్తూ ఫలితాన్ని భగవంతునికి సమర్పించడమే యజ్ఞం. యజ్ఞమన్నది మన ధర్మానికి ప్రత్యేకం. ఇంకే మతంలోనూ ఈ ప్రక్రియ లేదు.

9.1 యజ్ఞప్రక్రియ:

యజ్ఞప్రక్రియంటే మత్రోచ్చారణతో, అగ్నిసాయంతో విధ్యుక్త కర్మలు చేయడమే. ‘యజ్జ’ అన్న పదం ‘యజ్’ అన్నధాతువు నుండి వచ్చింది. ‘యజ్’ అంటే ‘సమర్పించు’ లేక ‘ఆరాధించు’ అని అర్థం. అగ్నికార్యాలను మనసారా పరమాత్మ పట్ల, దేవతల పట్ల పరిపూర్ణమైన శ్రద్ధాభక్తులతో నిర్వహించడమే యజ్ఞమంటే. యజ్ఞం వేదోక్తమైన ముఖ్యమైన విధుల్లో ఒకటి. యజుర్వేదంలోని ‘యజుస్’ అన్నపదం గూడా యజ్ఞానికి కావలసిన కర్మకాండని సూచిస్తుంది. ఋగ్వేదంలో స్తోత్రరూపంలో ఉన్న మంత్రాలకి యజ్ఞం చేయడానికి వీలైన రూపాన్ని యజుర్వేదం కల్పిస్తుంది. రకరకాల యజ్ఞాలని కొనసాగించే పద్ధతులను కూడా వచన రూపంలో యజుర్వేదం సూచిస్తుంది. స్తోత్రంతో ఆరాధించడం నేర్పుతుంది ఋగ్వేదం. ఈ మంత్రాలనే, ఈ స్తోత్రాలనే యజ్ఞం చేయడానికెలా ఉపయోగించుకోవాలో నేర్పుతుంది యజుర్వేదం. యజుర్వేదమంతా వైదిక కర్మలను, కర్మకాండను విశదీకరిస్తుంది. ఉదా: సోమయాగం, రాజసూయయాగం, అశ్వమేధం మొదాలగునవి. వేదమంత్రాలని పఠిస్తూ వివిధ పదార్థాలను అగ్నికి ఆహుతి చేయాలి యజ్ఞంలో. దీన్ని ‘హెూమ’ మంటారు. అగ్నికి ఆహుతి చేసినపుడు అవన్నీ అగ్నికే సమర్పిస్తున్నామని కాదు. ప్రత్యేకంగా అగ్నికి సమర్పిస్తున్నట్లు మంత్రం చెప్పినప్పుడే అవి అగ్నికి చెందుతాయి. ఇతర దేవతలకి సమర్పిస్తున్నట్లు మంత్రం చెప్తే అవి వారికి అగ్ని ద్వారా చేరుతాయి. అంటే రుద్రుడు, విష్ణువు, ఇంద్రుడు, వరుణుడు మొదలైన దేవతలకు మంత్రం ద్వారా సమర్పిస్తే వాటిని వారికి చేరుస్తాడు అగ్ని. వేదాలు చెప్తున్నాయి: ‘భగవంతుడొక్కడే, ఆయనే అనేక దేవతల రూపాలను ధరిస్తాడు’. ఒకే దేవుడు అనేక దేవతలుగా కనపడతాడని అర్థం. విశ్వనియంత్రణకై అనేక దేవతలని సృష్టించాడు భగవంతుడు. ఈ దేవతలు వేరు వేరు విధులను నిర్వహించాలి. మనమెలా భగవంతుని వల్ల సృజింపబడ్డామో, అలాగే దేవతలు గూడా భగవంతుని వల్ల సృజింపబడ్డారు. అద్వైతస్థితికి చేరుకునే వరకు మనకు దేవతలకు భేదముందనుకుంటూ యజ్జాలూ, పూజలూ లోకక్షేమం కోసం చేస్తుండాలని వేదాలు నిర్దేశించాయి. ప్రకృతి లోని శక్తులన్నీ పరమాత్ముని ఆదేశానుసారం దేవతల ఆధీనంలో ప్రవేశిస్తాయి. కాబట్టి మనమూ, మన చుట్టూ ఉన్న ప్రపంచమూ ప్రకృతినుండి లాభం పొందాలంటే ఆయా అధిష్ఠాన దేవతలను సంతృప్తి పరచాలి. దేవతలు యజ్ఞాల వల్ల తృప్తి పొందుతారని వేదాలు చెప్తాయి. ఐతే ఆత్మజ్ఞానం కలిగినవారు విడిగా దేవతలని యజ్ఞయాగాల ద్వారా తృప్తిపరచనక్కరలేదు. ద్వైతభావం ఉన్నంత వరకూ మాత్రం దేవతలని పూజించాలి.

9.2 పూర్వమీమాంసకుల దృష్టిలో యజ్ఞకర్మ:

కర్మకాండను నమ్మే పూర్వమీమాంసకులు వేదాలని దైవశాసనాలుగా భావిస్తారు. దైవం సృష్టి పరిపాలన కోసం ఎందరో అధికారుల్ని నియమించాడు. వారే దేవతలు ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, యముడు, ఈశానుడు, కుబేరుడు, నిరృతి మొదలగువారు. వారికి భగవంతుడు బ్రహ్మాండంలోని జీవరాసుల్ని పరిపాలించడానికి కొన్ని నియమ నిబంధన లేర్పరచాడు. అవన్నీ వేదాల్లో ఉన్నాయి. వేదాలు మనమెలా నడచుకోవాలో, నిబంధనలను దేవతలెలా అమలుపరుస్తారోనన్న విషయాలు చెప్తాయి. ఈ కర్మిష్ఠులు యజ్ఞకర్మల ద్వారానే ఏ కోరికైనా సాధ్యమై తీరుతుందనుకునేవారు. వారి దృష్టిలో మోక్షం గూడా సాధ్యవస్తువే. దాన్ని యజ్ఞం ద్వారా సాధించవచ్చనుకునేవారు. మోక్షమంటే స్వర్గంలో దొరికే అమృతత్వమే కాబట్టి దాన్ని జ్యోతిష్టోమమనే యజ్ఞం ద్వారా సాధించవచ్చనుకునేవారు. అంటే యజ్ఞం ద్వారా స్వర్గం, తద్వారా ముక్తిని గూడా సాధించవచ్చని వారి నమ్మకం. సంతానం కావాలంటే పుత్రకామేష్టి యజ్ఞంతో సాధించవచ్చు. శత్రువులను జయించడానికి గూడా ఇటువంటి క్రతువులనేకమున్నాయి. ఇలా అనేక కోరికలు తీరడానికనేక యజ్ఞక్రతువులున్నాయని వారి నమ్మకం.

9.3 కర్మల వల్ల ప్రయోజనాలు:

కర్మలకు 3 రకాలైన ప్రయోజనాలుంటాయి.

  1. ఈ లోకంలో మనమున్నంత కాలం మనకీ మన చుట్టూ ఉన్నవారికీ దేవతల అనుగ్రహం వల్ల క్షేమం కలుగుతుంది.
  2. మరణించాక దేవలోకంలో ఆనందంగా నివసించగలగడం. ఐతే దేవలోకంలో నివాసం శాశ్వతం కాదు. మనం సంపాదించుకున్న పుణ్యాన్నిబట్టి అక్కడ నివసిస్తాం. ఐతే అక్కడ లభించే ఆనందం భక్తుని యొక్క, జ్ఞాని యొక్క ఆనందం కన్నాతక్కువే.
  3. ప్రతిఫలాపేక్ష లేకుండా, లోకకళ్యాణం కోసం చేసే యజ్ఞం మనస్సుని పరిశుద్ధం చేసి జ్ఞానమార్గంలోకి తీసుకుపోయి మోక్షానికి చేరువ చేస్తుంది.

9.4 యజ్ఞాల వల్ల దేవతలకు, మానవులకు కలిగే పరస్పర లాభం:

వేదాల్లోని ముఖ్యాంశం యజ్ఞయాగాదులు చేయడం. బ్రహ్మ మానవులను సృజించి, వారు చేయవలసిన యజ్ఞాలను గూడా సృజించాడు. వేదమంత్రాల పఠనం వల్ల ఉద్భవించే తరంగాలకి దేవతలే ప్రత్యక్షమౌతారు. ఆ మంత్రపఠనంతో పాటు ఉపాహారాన్నిగూడా సమర్పిస్తేనే, సందేశాన్ని అగ్ని దేవతలకు చేరవేస్తాడు. మానవులకంటే ఎక్కువ శక్తిమంతులు దేవతలు. ఈ భూలోకంలో పంచభూతాలతోపాటు ఉన్నా దేవలోకంలో మాత్రం దేవతలు ప్రత్యేకమైన రూపాలతో ఉంటారు. మంత్రాలను సవ్యంగా పఠించడం వల్ల కలిగే సత్ఫలితాల్లో ఒకటి – దేవలోకంలోని వారి రూపాలను స్పష్టంగా చూడగలగడం, ఇంకోటి వారనుగ్రహించే ప్రసన్నతను కూడా అనుభవించగలగడం. మంత్రాలు దేవతల శబ్దరూపాలన్న మాట. యజ్ఞంలో ఒక్కోదేవతకి సంబంధించిన మంత్రాన్ని పఠించినప్పుడు ఆ దేవత ప్రత్యక్షమవుతాడు. ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించినవారు దేవతలను చూడగలుగుతారు. కంటికి కనపడకపోయినా వారి ఉనికి స్పష్టంగా తెలుస్తుంది. మంత్రోచ్చారణ జరుపుతూ అగ్నికి సమర్పించడం వల్లనే ఆ ఉపాహారాలు దేవతలకు ఆమోదయోగ్యమైన రూపాన్ని పొందుతాయి. యజ్ఞంలో అగ్ని మనమిచ్చే ఉపాహారాలను మంత్రప్రభావం వల్ల ఎంతో సూక్ష్మరూపంలోకి – శక్తిరూపంలోకి మార్చి దేవతలకు చేరవేస్తుంది. అవి దేవతల శక్తిని వృద్ధి చేస్తాయి. మనకంటే ఎక్కువ శక్తిమంతులైనా దేవతల శక్తి కూడా పరిమితమే. వారికీ కోరికలూ, అవసరాలూ ఉంటాయి. దేవతలను పటిష్ఠ పరచడానికి యజ్ఞాలను చేస్తాం. మనం స్వార్థం లేకుండా, మనసారా ఆహుతులను సమర్పించాలి. అందువల్లనే ద్రవ్యాన్ని సమర్పించేటప్పుడు ‘న మమ’ – ‘నాది కాదు’ అని అంటాం. ఇది ఒక విధంగా ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం. ఇందులో దేవతలు సంతృప్తి చెంది వరాలు మొదలైన వాటితో మనల్ని సంతృప్తి పరుస్తారు. మంత్రాలే పోషకాలై వారిని బలోపేతం చేస్తాయి. మనం ఎంతమంది దేవతల కోసం యజ్ఞాలను చేసినా అవన్నీ ఆ దేవతల ద్వారా పరమేశ్వరునికి చేరుతాయనుకోవాలి.

9.5 యజ్ఞం యొక్క ఆవిర్భావం:

యజ్ఞం విష్ణుస్వరూపం. యజ్ఞంలో నిరంతరం ఇచ్చిపుచ్చుకునే – ఆదానప్రదాన ప్రక్రియ జరుగుతుంటుంది. విశ్వం యజ్ఞం వల్ల ఉద్భవించింది గనక, విష్ణువు యజ్ఞ స్వరూపుడు గనక, ఆయనకు సర్వం ఆహుతిగా సమర్పించడం వల్ల కలిగిన ఫలితంగా పశుపక్ష్యాది జీవులు ఉద్భవించాయని పురుషసూక్తంలో ఉంది. అది తెలుసుకుందాం. ముందుగా పరమాత్మ నుండి విరాట్పురుషుడు ఉద్భవించాడు. ఈ విరాట్టు బ్రహ్మాండ దేహుడు. అంటే బ్రహ్మాండమే దేహంగా గలవాడు. పరమాత్మ చైతన్యం ఆయనలో ప్రవేశించి చేతనత్వం కలగజేసింది గాన ఆయనే సమిష్టి జీవరూపం. ఆయనలోనే సమస్త జీవజాతులూ ఉన్నాయి. ఆయనే పరమేశ్వరుడిగా మన కర్మఫలభోగాల కోసం, అన్నిటినీ సృజించి, అన్నిరూపాలుగా ఉన్నాడు. విష్ణువుగా ఈ బ్రహ్మాండమంతా వ్యాపించినవాడు. ఆయనే బ్రహ్మగా సృష్టికికర్తగా గూడా ఉన్నాడు. ఆయనే నారాయణుడని దేవతలు, ఋషులు స్తుతించారు. మొట్టమొదట దేవతలు విరాట్పురుషునుద్దేశించి మానస యజ్ఞం చేసారు. అదెలాగ? మనకు కనిపించే ఈ స్థూలప్రపంచమంతా – విశ్వమంతా పరమాత్మ యొక్క విరాడ్రూపం. అంటే అది ఆయన యొక్క శిరసు నుంచి పాదాల వరకూ గల ఆకారంగా భావిస్తారు. ఈ పరమాత్మ బ్రహ్మాండమంతటా లోపలా, వెలుపలా కూడా వ్యాపించి ఉన్నవాడు. పరమాత్మ స్వరూపాన్ని 4 భాగాలుగా/పాదాలుగా తీసుకుంటే అందులో ఒకభాగం/పాదంలోనే ఈ విశ్వసృష్టి రచనంతా సాగింది. అందులోనే ఈ కనబడే విశ్వంలోని భూతవ్యవస్థంతా ఉంది. ఈ కనబడే పంచభూత ప్రపంచమంతా పరమాత్మలోని ఒకభాగం మాత్రమే. తక్కిన మూడువంతుల రూపం స్వయంప్రకాశమానంగా, నాశరహితమైనదానిగా ఉంది. ఈ పరమాత్మ నుండి విరాట్పురుషుడు పుట్టి సృష్టికర్తగా సృష్టిని చేయడానికి పూనుకున్నాడు. ముందుగా ఆయన చేసింది దేవాదుల సృష్టి. అంటే దేవతలు, సాధ్యులు, ఋషులు మొదలైనవారి సృష్టి జరిగింది. ఈ దేవతల వల్ల ఉత్తర సృష్టి, అంటే తరవాతి సృష్టి జరగాల్సి ఉంది. అప్పటికింకా తక్కిన సృష్టి – పశు, పక్షివృక్షాదులు, మానవులు మొదలగువారి సృష్టి జరగలేదు. స్థూలభూమి గూడా ఆవిర్భవించలేదు. వస్తుసముదాయం గూడా లేదు. ఈ దేవతలకు సృష్టిచేసే శక్తి, సామర్థ్యం అప్పటికింకా కలగలేదు. అది కలగడానికి వారు ఒక యజ్ఞం తలపెట్టారు. వారికి హవిస్సులు మొదలగునవి గూడా దొరకలేదు, బాహ్యద్రవ్యాలేవీ లేవు. అందుకు వారు ఆ విరాట్పురుషునే ఆధారంగా చేసుకుని యజ్ఞసామగ్రిగా వాడుకోవాలనుకున్నారు. అందుకు వారికి మానసిక యజ్ఞంతప్ప ఇంకేదీ చేయడం కుదరలేదు. అప్పుడు వారు ఆ యజ్ఞాన్ని ఈ కింది విధంగా సంకల్పించారు:

  1. కాలరూపంగా యజ్ఞం చేసారు. ఋతువులను ద్రవ్యాలుగా వాడారు. యాగానికి అవసరమైంది ఆజ్యం(నేయి). అది లేదు కాబట్టి వసంత ఋతువును ఆజ్యంగా భావించారు. గ్రీష్మకాలాన్ని సమిధలుగా వాడారు. శరదృతువును పురోడాశం (హవిస్సు)గా మనసులో భావించారు.
  2. పరిధులు ఏర్పాటు చేయడానికి గాయత్రి మొదలైన ఛందస్సులు వాడారు. ఇంకో అర్థంలోవారు బాహ్య, అంతర ప్రకృతులను సూచించే తత్త్వాలను వాడారు. అంటే మహత్తు, అహంకారం, పంచతన్మాత్రలను కలిపి 7 పరిధులుగా ఏర్పరచారు. తరువాత 5 జ్ఞానేంద్రియాలను, 5 కర్మేంద్రియాలను, 5 ముఖ్యప్రాణాలను, 4 అంతఃకరణాలను, ధర్మం, అధర్మంలను కలపగా వచ్చిన 21 తత్త్వాలను యజ్ఞానికి సమిధలుగా వాడారు.
  3. ఆ యజ్ఞపురుషుడ్నే యజ్ఞపశువుగా చేసి మంత్రజలాన్ని ప్రోక్షించి హవిస్సుగా చేసి బలిచ్చి యజ్ఞాన్ని పూర్తిచేసారు. వేదమంత్రాలకి అనేక అర్థాలుంటాయి. ఇక్కడ ఒకటే తీసుకోవడం జరిగింది. ఆ పరమపురుషుని నుండి ఉత్పన్నమైన దేవతలు మొదలైనవారు జ్ఞానస్వరూపులు. ఈశ్వరశక్తిని సృష్టి నిర్వహణ కోసం మానసికంగా వాడుకుని సంకల్పసిద్ధులయ్యారు. యజ్ఞం చేస్తే ఫలితం లభిస్తుందని తెలిసే యజ్ఞం చేస్తారు కాబట్టి ఇక్కడ దేవతలు మొదలైననవారు చేసిన యజ్ఞఫలితంగా లభించినవేమిటో తెలుసుకుందాం.

9.6 యజ్ఞఫలంగా ఉద్భవించినవి:

ఆ మానసిక యజ్ఞం నుండి అనుభవయోగ్యమైన పదార్థాలు కలిగాయి:

  1. సృష్టికి హేతువైన తేజస్సు – ‘పృషత్’ అనబడే పెరుగుతో కూడిన నేయి పుట్టింది.
  2. వేదమంత్రాలు, ఛందస్సులు ఉద్భవించాయి.
  3. ఆవులు, గుర్రాలు, పులులు, సింహాలు, లేళ్ళు, మేకలు, గొర్రెలు మొదలైన పశువులు, పక్షులు పుట్టాయి. అనేక విధాల కల్పనలు చేసి యజ్ఞాన్ని చేసారు. ఈ విధంగా దేవతలు యజ్ఞం ద్వారా పరమేశ్వరుడ్ని సాధనంగా చేసుకుని విశ్వంలో అనేక విధాల సృష్టి రచనను చేసారు.
  4. ఆ విరాట్పురుషునిలో అనేక రకాల జీవజాలమంతా దేవతలకు కనిపించింది. అందుకు ఆయన్నుండే వాటిని ఉత్పన్నం చేసుకున్నారు. ఆయన అంగాల నుండి ఏమేమి పుట్టాయో తెలుసుకుందాం. ఆయన మనసునుండి చంద్రుడు, నేత్రంనుండి సూర్యుడు, ముఖం నుండి ఇంద్రుడు, అగ్ని పుట్టారు. ఆయన ప్రాణం నుండి వాయువు, నాభినుండి అంతరిక్షం, శిరసు నుండి ద్యులోకం- దేవతలుండే స్వర్గలోకం, పాదాల నుండి భూమి, చెవుల నుండి దిక్కులు ఉద్భవించాయి. ఇంకా అనేక లోకాలు పుట్టాయి. ఈ విధమైన సృష్టులకు దేవతలు రూపకల్పనలు చేయగా విశ్వమేర్పడింది.
  5. దేవతలు మానసిక యజ్ఞం ద్వారా యజ్ఞస్వరూపుడైన ఆ విరాట్పురుషుని దేహం నుండే అనేక కల్పనలు చేసారన్నమాట. స్థూలభూమిలో మానవసృష్టిలో కనపడుతున్న వర్ణవ్యవస్థ గూడా ఆయన్నుండే వచ్చింది. ఆ విరాట్పురుషుని ముఖం నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడలనుండి వైశ్యులు, పాదాలనుండి శూద్రులు పుట్టారు. విరాట్టు దేవతలను సృష్టిస్తే, దేవతలు మానవులను సృష్టించారు. చేతనత్వంగల సర్వప్రాణులు, అచేతనమైన జడపదార్థాల్లాంటి రాయీ, రప్పా, కదిలేవి, కదలనివి అన్నీగూడా ఆ యజ్ఞపురుషుడైన విరాట్టునుండే ఉద్భవించాయి.
  6. విరాట్టులో సమిష్టిగా ఏ లక్షణాలైతే ఉన్నాయో అవే వ్యష్టిరూపంలో ప్రతిజీవిలోను ఉన్నాయి. ఉదా: విరాట్పురుషుని మనసునుండి చంద్రుడుద్భవించాడు. ఆ చంద్రుడు సమిష్టి చంద్రుడైతే మానవుల్లో ప్రతివ్యక్తిలోను ఆ చంద్రలక్షణముంటుంది. చంద్రుడు మనస్సుకు కారకుడంటారు. అలాగే విరాట్పురుషుని కన్నునుండి సూర్యుడుద్భవించాడు. ఆయన సమిష్టి సూర్యుడైతే మానవుల్లో ప్రతివ్యక్తిలోను కంటివెలుగు రూపంలో ఆ సూర్య లక్షణముంటుంది. సర్వప్రాణుల సమిష్టి రూపం ఈ బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండాన్ని ఎవరు దేహంగా కలిగి ఉన్నాడో ఆయనే విరాట్.
  7. దేవతలు ఈ విధమైన మానస యజ్ఞం ద్వారా భగవంతుడ్ని – పరమేశ్వరుడ్ని ఆరాధించారు. వారు ఏ ధర్మాలైతే ఈ ఆరాధనలో అవలంబించారో అవే ప్రథమ ధర్మాలుగా రూపొందాయి యజ్ఞవిషయంలో.
  8. పరమేశ్వరుడు గూడా దేవతలు చేసిన ఈ యజ్ఞానికి తృప్తి చెంది అనుగ్రహించాడు వారిని. వారు తనను యజ్ఞం ద్వారా తృప్తిపరచారు గనక ఇకపై వారు కేవలం ఈ యజ్ఞాల ద్వారా పోషింపబడుతూ, జీవకోటిని గూడా ఈ యజ్ఞాల ద్వారా రక్షించాలని వారితో అన్నాడు.
  9. యజ్ఞాలు గూడా సాత్విక, రాజసిక, తామసికమని 3 రకాలుగా ఉంటాయి. లోక కళ్యాణం కోసం చేసే సాత్విక యజ్ఞంలో పిండిని వాడతారు. స్వార్థంతో, కోరికలతోచేసే రాజసిక, తామసిక యజ్ఞాల్లో పశుబలులు ఉంటాయి.

9.7 నక్షత్రవిజ్జానం ఆధారంగా జీవకోటి సృష్టి:

దేవతలు మానసిక యజ్ఞం ద్వారా విరాట్పురుషుని నుండి జీవకోటిని ఎలా సృష్టించారని మనకు సందేహం కలగడం సహజం. ఆ మానస యజ్ఞం నుండి జంతువులు, పక్షులు మొదలైనవి ఎలా పుట్టాయి అనుకుంటాం. ఇక్కడొక విషయం గమనించాలి. దేవతలు, ఋషులు మొదలైనవారు సామాన్యులు కారు, జ్ఞానస్వరూపులని చెప్పుకున్నాం. వారు అనేక విధాల కల్పనలు చేసారు సృష్టికోసం. ఆ కల్పనలకు ఆధారంగా ఆ పరమ పురుషుని విరాడ్రూపమే ఆలంబనైంది వారికి. ఆయనవల్ల ఏర్పడిన విశ్వంలో అప్పటికే నక్షత్రమండలాలెన్నో ఉన్నాయి వివిధ పశుపక్ష్యాది ఆకారాల్లో. మనం భూమ్మీదనుండి ఆకాశంలోకి రాత్రిపూట చూస్తే మనకి అనేక ఆకారాల్లాగా ఆ నక్షత్రమండలాలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని మండలాలను ఎంచి 12 రాశులుగా చేసి భచక్రం అని పేరుపెట్టారు వేదఋషులు. వాటి ఆకారాల కనుకూలంగా పేర్లు కూడా పెట్టారు. ఉదా: మేషరాశి మేక ఆకారంలో ఉంటుంది. అలాగే వృషభరాశి ఎద్దు ఆకారంలో, కర్కాటకరాశి ఎండ్రకాయలాగ ఉంటాయి. భచక్రంలోని రాశులన్నీ పేరుకు తగ్గట్టు గానే కనపడతాయి నిశితంగా చూస్తే. నక్షత్రమండలాల దర్శనం చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాలు ఆకాశంలోని గ్రహ, నక్షత్రమండలాల దర్శనం చేసిన అనుభవంతోనే ఈ విషయం రాయడం జరిగింది. ఈ రోజుల్లో ఈ నక్షత్రమండలాలను ఆంగ్ల పదజాలంతో వాడుతున్నారు. ఉదా:- ‘సిగ్నస్’ (హంసమండలం- హంస ఆకారంలోకనిపిస్తుంది). ‘లైర’ అన్నది వీణ ఆకారంలో ఉంటుంది. దాన్ని సరస్వతీ మండలం అంటారు. అది గూడా ఒకవైపు నుంచి చూస్తే గ్రీకుల వాయిద్యమైన ‘లైర్’ ఆకారంలో కనిపిస్తుంది, ఇంకో వైపు నుండి చూస్తే మన వాయిద్యమైన వీణ ఆకారంలో కనిపిస్తుంది. వేసవికాలంలో డాబా మీద పడుకుని చూస్తే ఎన్నో అద్భుతాలు చూడచ్చు. జూన్ నెలలో ఈశాన్యదిక్కులో రాత్రి 8 గంటల తరవాత ఈ ‘లైర/ ‘లైరా’ మండలం, అందులో వెన్నముద్దలాగ మెరిసిపోతూ ‘వేగ’ నక్షత్రం కనిపిస్తాయి. దీన్నే ‘అభిజిత్’ (విష్ణువు యొక్క) నక్షత్రమంటారు. ‘హెర్యులస్’ (హరికులేశుడు) అనే నక్షత్రమండలం మన వామనావతారం ఆకారంలో కనిపిస్తుంది- ఒకకాలు కిందుండి, ఇంకోకాలు పైకెత్తి ఉంటుంది. అదే విష్ణుమండలమంటారు. విష్ణునాభికమలంలోంచి బ్రహ్మ ఉద్భవించినట్టు కనపడుతుంది. ఈ సరస్వతీమండలం (బ్రాహ్మీ మండలం), అంటే చతుర్ముఖ బ్రహ్మలాగ నాలుగు చుక్కలుండి దాని మధ్య అభిజిత్ నక్షత్రముంటుంది. ఇలా కనిపించే నక్షత్రమండలాలెన్నో ఉన్నాయి ఈ విశ్వంలో. అవన్నీ గూడా విరాట్టు లోనివే. వాటి ఆధారంతో దేవతలు, ఋషులు, సాధ్యులు మొదలైనవారు జీవకోటి సృష్టి చేసారన్నమాట.

9.8 యజ్ఞాల ద్వారా అయోనిజల పుట్టుక:

పురాణాలు చదువుతుంటే మనకు ఆశ్చర్యకరమైన విషయాలెన్నో తెలుస్తుంటాయి. అవి నమ్మలేనివిగా అనిపిస్తాయి. అమ్మానాన్నల ప్రమేయం లేకుండా పిల్లలు పుడతారా అంటే పుడతారని మన పురాణాలు చెప్తున్నాయి. అందుకు నిదర్శనం మహాభారతంలో ద్రౌపది పుట్టుక. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. పాంచాల రాజైన ద్రుపదుడు ప్రతీకారంతో ద్రోణుడ్ని చంపే కొడుకు కోసం యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం నుండి పుడతారు ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది. ఎలా పుట్టారన్నది చిత్రం. కానీ అది కూడా సంభవమేనని యజ్ఞవిజ్ఞానం నిరూపిస్తుంది. ఇదేదో కాకమ్మ కథ కాదు, నిజంగా జరిగింది. ద్రుపదుడు కొందరు తాపసుల సాయంతో యజ్ఞం చేయించాడు. వారు హవిస్సును సమంత్రకంగా సిద్ధంచేసి ద్రుపదుడి భార్యను స్వీకరించమన్నారు. ఆవిడ కొంచెం సేపాగి వస్తానంది. ఇక్కడ ఈ ‘హవిస్సు’ తయారుచేసిన వాడి తపశ్శక్తిని, మంత్రించినవాడి మంత్రశక్తిని కలిగి ఉంది కాబట్టి ఆవిడ స్వీకరించినా లేకున్నా అది ఫలితాన్నిస్తుంది. ఆవిడ రావడం ఆలస్యమవడాన ఆ వేదవేత్తలు ఆ హవిస్సును మంత్రిస్తూ అగ్నిహెూత్రంలో వేసారు. అప్పుడు దేవతలతో సమానమైన వ్యక్తి అగ్ని లోంచి ఉద్భవించాడు, రథంతో సహా. అతనే ధృష్టద్యుమ్నుడు. తరవాత ద్రౌపది అదే అగ్నిలోంచి ఉద్భవించింది. దీనికి శాస్త్రీయమైన వివరణ సామవేదం షణ్ముఖశర్మగారి మహాభారత ప్రవచనం 14వ భాగంలో ఉంది. వింటుంటే అద్భుతమనిపిస్తుంది. ద్రౌపది లాంటి వారు కారణజన్ములు. ఆమె కిందటి జన్మల్లో ఎంతో తపస్సు చేసింది. దానివల్ల స్త్రీగర్భం ద్వారా కాకుండా అయోనిజగా పుట్టింది. అంటే ఆమె మానవ స్త్రీ కాదన్నమాట. ఆమె దేవతా స్త్రీ. ఇదెలా సంభవమంటే కొందరు జీవులు జన్మలు తీసుకునేటప్పుడు పితృయాన మార్గం ద్వారా ఈకింది విధంగా ప్రయాణిస్తారు: ద్యులోకం నుండి పర్జన్యంలోకి (పర్జన్యమంటే జలరూపం), జలం ద్వారా పృథ్విలోకి, పృథ్వీతత్వమైన అన్నం ద్వారా పురుషునిలోకి, పురుషుని ద్వారా స్త్రీ లోకి. ఇందులో ముఖ్యంగా 5 లక్షణాలున్నాయి: 1.ద్యులోకం, 2.పర్జన్యం, 3.పృథ్వి, 4.పురుషుడు, 5.స్త్రీ. ద్రౌపది జన్మలో మొదటి 3 లక్షణాలే చోటు చేసుకున్నాయి. అందుకావిడ అయోనిజ. రామాయణంలో సీతాదేవి గూడా అయోనిజే. ఇంకా చిత్రమైన జన్మల గురించి మన పురాణాల్లో ఉన్నాయి. భరద్వాజ మహర్షి ఘృతాచి అనే అప్సరసను చూడగా వీర్య స్టలనమైంది. ఆ వీర్యాన్ని ఒక ద్రోణ (కుండ) లో పెట్టగా ద్రోణుడు పుట్టాడు. ఒక విధంగా ద్రుపదుడి జన్మ గూడా చిత్రమైనదే. ద్రుపదుడి తండ్రి రాజ్యం పోగొట్టుకుని అడవిలో తపస్సు సాగించాడు. ఒకనాడు మేనకను చూడగా వీర్య స్థలనమైంది. దాన్ని తన పాదంతో తొక్కిపెట్టి ఉంచాడు. అందులోంచి ఓ పిల్లవాడు పైకివచ్చాడు. పాదంతో తొక్కిపెట్టి ఉంచడంవల్ల ద్రుపదుడు అన్న పేరు వచ్చింది. ఇలా చిత్రమైన జన్మలు గలవాళ్ళ చరిత్రలు మన పురాణాల్లో అనేకమున్నాయి.

9.9 వేదబ్రాహ్మణుల విధులు:

ఇప్పుడు యజ్ఞకార్యాలు నిర్వహించే వేదబ్రాహ్మణుల కోసం – వేదం – పుట్టినప్పటినుంచి పోయేవరకూగూడా, ఎలాటి విధులు నిర్ణయించిందో తెలుసుకోవాలి: 1. వేదాధ్యయనం చేయాలి, 2. యజ్ఞాలను, ఇతరకర్మలను అభ్యసించాలి, ఆచరించాలి, వీటికి సంబంధించిన మంత్రాలను నేర్చుకోవాలి, యజ్ఞాల ప్రయోజనాలను తెలుసుకోవాలి, 3. అరణ్యకాలను మననం చేయాలి, 4. ఉపనిషత్తులు జీర్ణం చేసుకోవాలి, 5. మోక్షస్థితి నందుకోగలగాలి. 6. సమాజశ్రేయస్సు కోసం దైవానుగ్రహం సంపాదించాలి. అలౌకికశక్తులతో వ్యవహారం గనక నిష్ఠానియమాలు కలిగి మంత్రాలను సరిగా నేర్చుకొని, వాటి ద్వారా శక్తిని పొందాలి. 7. మంత్రాలు సత్ఫలితాలివ్వాలంటే ఎంతో నిగ్రహం, సంయమనం కలిగి ఉండాలి. 8. ఏ మంత్రాన్ని ఎప్పుడు, ఎలా, ఏ తిథినాడు పఠించాలి, సమర్పించాల్సిన ఉపాహరమేమిటి అన్న విషయాలు తెలుసుకుని ఉండాలి. అప్పుడే ఆ బ్రాహ్మణుడు సమర్థుడౌతాడు. మనం ఇంతవరకు యజ్ఞవిజ్ఞాన విషయాల గురించి తెలుసుకున్నాం. తరువాతి అధ్యాయంలో కాలమానం గురించి తెలుసుకుందాం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here