దివ్యాంగనలు

0
7

[dropcap]లం[/dropcap]చ్ టైం అయిపోయింది అన్నట్టుగా బెల్ మోగింది. గబ, గబా బాక్స్‌లు తెరిచి తెచ్చుకున్న అన్నాలు, చపాతీలు లాంటివి తినేసి, ఆటల్లో పడిన పిల్లలంతా సీతాకోక చిలుకల్లా రివ్వున ఎగురుతూ వారి వారి క్లాసుల్లోకి పరుగులు పెట్టారు. అప్పుడే లంచ్ ముగించుకున్న నీతా టీచర్ బోర్డు మీద తన క్లాస్ ఏదుందో చూసుకుంది. పదో తరగతి “సి” సెక్షన్‌కి వెళ్ళాలి. ఆవేళ చెప్పాల్సిన పాఠం తాలూకు నోట్స్ తయారు చేసుకున్న రిజిస్టర్ తీసుకుని తన క్లాసు వైపు బయలుదేరింది. పొడుగాటి కారిడార్‌లో చివరి క్లాస్.. మధ్యలో పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. ఆవిడ మెట్ల దాకా వెళ్ళగానే సన్నగా ఏడుపు వినిపించింది. ఆగిపోయి చుట్టూ చూసింది.. అప్పటివరకూ అల్లరి చేస్తూన్న పిల్లలతో సందడిగా ఉన్న ప్రాంగణం ఖాళీగా, ప్రశాంతంగా ఉంది. రెండే రెండు పెద్ద పసుపు పూల చెట్లు పూలు రాలుస్తూ భూదేవిని అర్చిస్తున్నాయి. కుడి వైపు గేటు.. అక్కడ ఎవరున్నా స్పష్టంగా కనిపిస్తుంది.. కానీ ఎవరూ కనిపించలేదు ఆవిడకి. ఓ సారి తలతిప్పి వెనక్కి చూసింది. ఏడుపు ఎక్కడి నుంచి వినిపిస్తోందో అర్థం కాలేదు.. టక్కున ఆగిపోయి చెవులు రిక్కించింది. మెట్ల దగ్గర నుంచి.. ఆవిడ మెట్ల వైపు వెళ్ళింది.. మెట్ల కింద ఖాళీ స్థలంలో ఒక కాలు ముడుచుకుని, ఒక కాలు చాపుకుని కూర్చుని రెండు చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తోంది.. ఆవిడ హృదయం ద్రవించింది. దిక్కులేని దానిలా అలా ఒంటరిగా కూర్చుని రోదిస్తున్న ఆ పన్నెండేళ్ళ పిల్ల పేరు దామిని.. నిరుపేద కుటుంబంలో పుట్టిన పిల్ల.. తల్లి, తండ్రుల నిరక్షరాస్యత, అజ్ఞానం, అవగాహనా రాహిత్యంతో పోలియో డ్రాప్స్ వేయించకపోవడం వల్ల ఆ పిల్ల కాలు పోలియోతో వంకర పోయింది. ప్రభుత్వం వారు అందిస్తున్న ఉచిత భోజనం కోసం స్కూల్‌కి వస్తుంది.

నీత ఆమె దగ్గరకు నడిచి మోకాళ్ళ మీద కూర్చుని భుజం మీద చేయెసి “దామినీ” అని పిలిచింది. ఉలిక్కిపడి మొహానికి చేతులు అడ్డం తీసింది. కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి. “ఏమైంది ఎందుకేడుస్తున్నావు? క్లాస్‌కి వెళ్ళకుండా ఇక్కడెందుకు కూర్చున్నావసలు..” ప్రేమగా అడిగింది.

“టీచర్..” అంటూ ఆవిడ ఒళ్లో వాలిపోయి బావురుమంది దామిని.

“అరెరే… ఏమైంది తల్లి…” ఆ పిల్లని గుండెలకు హత్తుకుంటూ అడిగింది నీత..

“నన్ను అందరూ కుంటి, కుంటి అంటున్నారు టీచర్.. రేపటి నుంచీ నేను స్కూల్‌కి రాను టీచర్.. నాకు అన్నం ఒద్దు… చచ్చిపోతా..”

ఆవిడ గుండెల్లో కెలికినట్టు అయి కదిలిపోయింది. “తప్పు… అలా అనకూడదు.. అసలు ఎవరన్నారు నిన్ను కుంటి అని..?” కన్నీళ్లు తుడిచి మొహం మీద అతుక్కున్న వెంట్రుకలు సవరిస్తూ అడిగింది.

“అందరూ..” అంది..

“అందరూ అంటే.. మీ క్లాసులో వాళ్ళా.. స్కూల్‌లో ఉన్న వాళ్ళా.. నిన్నోక్కదాన్నే అంటున్నారా.. జాబిలీ, హిమ కూడా కుంటివాళ్ళేగా..”

“పాపం వాళ్ళని కూడా అంటారు.. రోజూ లంచ్ టైంలో మీరు కూడా మాలాగా పరిగెత్తండి… మమ్మల్ని పట్టుకోండి అని ఏడిపిస్తారు.. హిమ ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయింది. జాబిలేమో గేటు బయట కూర్చుంది”

“అయ్యో… అవునా.. ఈ విషయం నాకు అప్పుడే చెప్పచ్చుగా.. ఇంకో టీచర్‌కి ఎవరికన్నా చెప్పచ్చుగా.. పద దాన్ని కూడా తీసుకుని క్లాస్‌కి వెళదాం” దామిని చేయి పట్టుకుని లేవదీసింది. కుర్తీతో కళ్ళు తుడుచుకుని ఆవిడ చేయి అందుకుంది. ఆ పిల్లని జాగ్రత్తగా నడిపిస్తూ “ఇన్నాళ్ళ నుంచి ఏడిపిస్తుంటే ఇప్పుడా చెప్పడం..” మందలిస్తోన్న ఆమె వైపు బిక్కుబిక్కుమంటూ చూస్తూ “మీకు చెప్తే వాళ్ళు కొడతారు” అంది.

ఆవిడ కనుబొమలు ముడుచుకున్నాయి.. ఈ నిస్సహాయులైన అమ్మాయిలను తోటి అమ్మాయిలు ఇంతగా మానసికంగా హింసిస్తుంటే తనకి కానీ, ఇంకో టీచర్‌కి కానీ ఇప్పటివరకు ఈ విషయం తెలియనివ్వకుండా రహస్యంగా ఉంచారు ఈ ముగ్గురూ అంటే వాళ్ళు హేళన చేసి బాధ పెట్టడం కాకుండా బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారనమాట.. ఆవిడకి కోపం రాలేదు.. పిల్లల ప్రవర్తన ఏది అయినా దానికి బాధ్యులు టీచర్లు… ఇంట్లో పెద్దలు.. అంటే తామంతా బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నారనమాట అనుకుంది.

గేటు బయట పేవ్‌మెంట్ మీద కూర్చుంది జాబిలీ. “జాబిలీ ఇక్కడ కూర్చున్నావా తప్పు కదూ… ఆడపిల్లవి ఒక్కదానివి ఇక్కడ ఒంటరిగా ఉండడం ఎంత ప్రమాదం తెలుసా..” జాబిలికి చేయి అందించింది నీత. అది అందుకోకుండా… “నేను రాను టీచర్.. నాకు భయం వేస్తోంది.. అందరూ కొడతారు” అంది జాబిలీ వస్తున్న ఏడుపు ఆపుకుంటూ.

ఆవిడ హృదయం జాలితో నిండిపోయింది.. “ఎవరూ ఏమి అనరు.. నేనున్నాగా రా…” అంటూ బలవంతంగా లేపి ఇద్దరినీ చెరో చేత్తో పట్టుకుని క్లాసు రూమ్ వైపు నడిచింది. ఆవేళ ఏడిపించిన ఏడుపుకి ఇంక స్కూల్‌కే రారు అనుకున్న వాళ్ళల్లో ఇద్దరు టీచర్ సాయంతో లోపలికి రావడంతో నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయారు అమ్మాయిలంతా. నీత జాబిలిని, దామినిని “మీరు వెళ్లి మీ సెట్లలో కూర్చోండి” అని చెప్పి, తన టేబుల్ దగ్గరకు నడిచి “గుడ్ ఆఫ్టర్ నూన్ గర్ల్స్” అంది కొంచెం గంభీరమైన మందహాసం చేస్తూ.

ప్రతిస్పందించడం మర్చిపోయిన ఎవరూ మాట్లాడలేదు. వాళ్ళ మొహాల్లో భావాలు క్రీగంట గమనించిన నీత అప్పటికప్పుడు మనసులో ఒక నిర్ణయం తీసుకుని “పిల్లలూ! మీరంతా రేపు సివిల్ డ్రెస్ వేసుకుని రండి… మధ్యాహ్నం నుంచి క్లాసులు ఉండవు.. పాటలు, డిబేట్ ఉంటుంది… అందరూ మాట్లాడాలి. టాపిక్ దివ్యాంగులు అంటే ఎవరు? దీని మీద మీరంతా మాట్లాడాలి” అంది వాళ్ళ మొహాల్లో భావాలు వెతుకుతూ.

ఆవిడ ఏం చెప్తోందో అర్థం కాని వాళ్ళలా తెల్లబోయి చూస్తూ ఉండిపోయారు అందరూ.

ఆవిడ నవ్వి “అర్థం కాలేదా” అంది.. గబా,గబా తలలూపారు.. “గుడ్ రేపు మీరంతా ప్రిపేర్ అయి రండి” అని మరోసారి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

మరునాడు ప్రాంగణం అంతా సందడిగా ఉంది.. సుమారు యాభై కుర్చీలు వేసారు.. మిగతావి బల్లలు వేసారు. వేదిక మీద టేబుల్, నాలుగు కుర్చీలు వేసారు. హెడ్ మిస్ట్రెస్‌తో పాటు నీత, తెలుగు టీచర్ వసుధ, హిందీ టీచర్ మేరీ వేదిక మీద కూర్చున్నారు. వాళ్లకి ఎదురుగా కొంచెం దూరంలో చక్రాల కుర్చీలో కూర్చుని ఉంది ఇరవై ఎనిమిదేళ్ళ యువతి.

పిల్లలు నిశ్శబ్దంగా కూర్చున్నారు.. ఇద్దరు అమ్మాయిలు వేదిక మీదకు వెళ్లి ప్రార్థన పాడారు. తరవాత నీత లేచి మైక్ తీసుకుంది. “ పిల్లలూ.. మీ ఎదురుగా చక్రాల కుర్చీలో ఉన్న ఈమె పేరు సూక్తి.. ఈమెని మీలో కొందరన్నా చూసి ఉంటారు.. ఎక్కడ చూసారో చెప్పగలరా “ అడిగింది.

“చూసాం… టివి లో” ఒక్కసారిగా వంద గొంతులు అరిచాయి.

“గుడ్ … టివిలో ఎందుకు మాట్లాడింది.. ఏమి మాట్లాడింది చెప్పగలరా!”

ఎవరూ మాట్లాడలేదు.. నీత అందరి మొహల్లోకి పరీక్షగా చూస్తూ అంది “అంటే మీరంతా టివి లో సినిమా కార్యక్రమాలు, సీరియల్స్ చూడడం మీద చూపిన శ్రద్ధ ఆమె చెప్పే విషయాల పట్ల చూపించలేదన మాట.. అర్థమైంది…సరే! ఇప్పుడు ఆమె మీ ఎదురుగా కూర్చుంది.. మీరంతా ఆమెని ఏమని పిలుస్తారు?” అడిగింది.

ఎవరూ నోరెత్తలేదు.. నీత మాట్లాడుతోంటే వేదిక మీద ఉన్నవాళ్ళు అందరూ ఆసక్తిగా చూడసాగారు ఈమె ఏం చెప్పబోతోంది! అన్న కుతూహలం వాళ్ళల్లో క్షణక్షణానికి ఎక్కువ అవుతోంది.

“ఇవాళ మీ ఎదురుగా చక్రాల కుర్చీలో కూర్చున్న ఈ యువతి టివిలో తరచూ కనిపించింది అంటే ఆమె సినిమా స్టార్ కాదు.. యాంకర్ కాదు… సీరియల్ నటి కాదు… మోడల్ అంతకన్నా కాదు.. జీవితాన్ని జయించిన ఒక అవిటి యువతి.. జీవితాన్ని ఎలా జయించింది….ఆమె జీవితంలో ఏం జరిగింది? ఈ విషయాలు అన్నీ తన నోటిద్వారా విందాం..” చెప్పడం ముగించి సూక్తి చేతికి మైక్ ఇచ్చింది.

సూక్తి మైక్ రెండు మోచేతులతో పట్టుకుంది. పిల్లలంతా నోళ్ళు తెరుచుకుని చూస్తూ ఉండిపోయారు. ఆమె అందరివైపు చిరునవ్వుతో చూసి “గుడ్ ఆఫ్టర్ నూన్” అంది.. పిన్ డ్రాప్ సైలెన్స్‌తో నిండి ఉన్న ప్రాంగణం ఒక్కసారిగా వందల బెలూన్లు పేలినట్టు వినిపించాయి చప్పట్లు.

“మీరంతా నన్ను టివిలో చూసాము అని మేడం అడిగిన వెంటనే చెప్పారు.. చూడడం అంటే నేనే చీర కట్టుకున్నాను.. ఎలాంటి డ్రెస్ వేసుకున్నాను.. ఏం నగ పెట్టుకున్నాను అని చూసారా.. లేక ఈమె కుంటిది అయి స్క్రీన్ మీదకు ఎలా వచ్చింది అని చూసారా!” నవ్వు మొహంతో ఆ పిల్లల మొహాల్లో కలిగే మార్పులు గమనించే ప్రయత్నం చేస్తూ అడిగింది. ఎవరూ మాట్లాడలేదు…

ఆమె తిరిగి చెప్పడం మొదలు పెట్టింది.. “నేను చిన్నప్పటి నుంచీ ఇలాగే ఉన్నాను అని మీరనుకుంటున్నారు అవునా!” ఎవరూ మాట్లాడలేదు… ఆమె నవ్వేసి చెప్పసాగింది. “నేను చెప్పేది విన్నాక విజయగాథనా, ఇది విషాదగాథనా మీరే ఆలోచించి చెప్పండి. విజయం అనేది పై నుంచి ఊడిపడేది కాదు. ఎంతో కృషి చేయాలి… కృషి చేయడానికి కావలసిన ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉండాలి. కృషి చేయకుండా ఎవరినీ విజయం వరించదు.. ప్రతి విజయం వెనుకా అనేక వైఫల్యాలు ఉంటాయి. నా జీవితం ఇంతే నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అనుకోడం పలాయన వాదం అవుతుంది. విజయం అనేది ఒక రోజులోనో, ఒక వారంలోనో, నెలలోనో, లభించదు.. సంవత్సరాలు పట్టచ్చు.. కొందరికి జీవితాంతం పట్టచ్చు.. అంత మాత్రాన వ్యాకుల పడాల్సిన పనిలేదు… నిరాశతో క్రుంగిపోకూడదు. టాల్‌స్టాయ్ అన్నట్టు ట్రై, ట్రై అంటిల్ యు డై.. మరణించే వరకూ జీవించాలి.. జీవించినంత కాలం ఆశని విడువకూడదు. ఎవరో మనలని మోటివేట్ చేయాలని ఆశించకూడదు. మోటివేషన్ ఎవరికీ వారే చేసుకోవాలి. మనకి మనమే గురువు, మనకి మనమే ఆదర్శం.. నిజాయితీతో మనకి ఎవరన్నా చేయూత ఇవ్వడానికి ముందుకు వస్తే ఆ చేయి అందుకోడంలో తప్పులేదు.. కానీ చేయూత ఇచ్చే చేయి లేదని, మన చేతులు ముడుచుకుని కూర్చోడం నిరాశావాదానికి పరాకాష్ట.

ఎంతో మంది జీవిత చరిత్రలు తిరగేస్తే మనకి ఉత్తేజాన్ని ఇచ్చే కథలు ఎన్నో కనిపిస్తాయి. ఆ కథలు సృష్టించినవి కావు… అనుభవాలకు అక్షరరూపాలు. ఒక స్టీవ్ జాబ్స్‌ని ఉదాహరణగా తీసుకోండి..యాపిల్ అనే కంపెనీకి ఆయన ఒక ఐకాన్.. కేవలం ఒక కారు గరాజ్ లో ఇద్దరు ఉద్యోగులతో ఒక చిన్న వ్యాపారం ప్రారంభించిన ఆయన సాధించిన విజయం అనూహ్యం. దీని వెనుక స్టీవ్ చేసిన అంతులేని కృషి ఉంది.. ప్రారంభంలో తాను పని చేస్తున్న కంపెనీ నుంచి ఆయన డిస్మిస్ చేయబడ్డాడు.. తరవాత అతని సామర్థ్యం వెలుగులోకి వచ్చి అతనేమిటో ఋజువు చేసుకున్నాడు. అలాగే బిల్ గేట్స్… ఫెయిల్యుర్స్‌ని పాఠాలుగా తీసుకోవాలని తెలిపిన గొప్ప సక్సెస్‌ఫుల్ మాన్ బిల్ గేట్స్. తను స్వంతంగా ప్రారభించిన ట్రాఫ్ ఓ డేటా అనే కంపెనీ ద్వారా ఆర్ధికంగా ఎంతో నష్టపోయి చదువు పూర్తి చేయడానికి కూడా ఆర్థిక స్తోమత లేని స్థితికి దిగజారాడు. ఆయనలో నిగూఢమై ఉన్న ఆత్మవిశ్వాసం ఓటమిని అంగీకరించడానికి ఒప్పుకోలేదు.. తనలో సహజంగా నిబిడీకృతమైన కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌తో అంతులేని కృషి చేసి ఈ రోజు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మైక్రోసాఫ్ట్ అధినేతగా ఎదిగాడు. ఇంక ఐన్‌స్టీన్ గురించి, అబ్రహం లింకన్ గురించి, మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గురించి మీకు నేను వేరే చెప్పనవసరం లేదు.. ఇలాంటి గొప్పవాళ్ళ సరసన మనం కూడా చేరినరోజే మనం సక్సెస్ ఫుల్ అవుతాము. విజయాన్ని సాధించడానికి గొప్ప, గొప్ప చదువులు అవసరం లేదు.. కష్టపడే తత్వం ఉండాలి.. కాబట్టి చిన్నారులారా! ఇలాంటి అనేక మంది విజయవంతమైన కథలు స్ఫూర్తిగా తీసుకుని, మీరు కూడా మీకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేస్తూ గొప్ప వ్యక్తులుగా చరిత్రలో మిగలాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”

సూక్తి ఉపన్యాసం ముగ్ధులై వింటున్న రెండువేల మంది విద్యార్థులు కొట్టిన చప్పట్ల శబ్దం సముద్రపు హోరుని తలపించింది. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు పాండవుల విజయాన్ని కాంక్షిస్తూ శ్రీ కృష్ణుడు పూరించిన పాంచజన్యం చేసిన ఉత్తేజపూరితమైన మహాధ్వనిలా అనిపించింది. అణువణువూ ఆ శంఖానాదంతో పునీతమవుతున్నట్టు, తన మీద సమస్త దేవతలు పూల వాన కురిపిస్తున్నట్టుగా అనుభూతి చెందింది. ఆమె కళ్ళు ఆనందభాష్పాలతో నిండాయి..

“ఆరేళ్ళు….ఆడుతూ, పాడుతూ వనంలో లేడిలా, ఆకాశంలో పక్షిలా, నదిలో చేపలా స్వేచ్చగా, ఆనందంగా ఎగురుతూ, నవ్వుతూ, తుళ్ళుతూ ఉన్న నన్ను విధి క్రూరంగా కాటేసింది. అయితే చిన్నప్పటి నుంఛీ భవిష్యత్తు గురించి ఓ మధురమైన కలలో విహరించాను.. నా కల సాకారం చేసుకోడానికి విధిని ఎదిరించాను..” ఆమె కొన్ని క్షణాలు గంభీరంగా ఉండిపోయింది.

ఒక పక్కగా ఆహ్వానితుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చున్న యాదగిరి కంటికి వేదిక మీద ఉన్న తన కూతురు అధ్బుతంగా కనిపించింది.. ఆత్మవిశ్వాసంతో, దేనికీ చెదరని వ్యక్తిత్వంతో ఆమె మొహం పాల సముద్రం మీద తేలుతున్న చందమామలా ఉంది… వెన్నెల్లో స్నానం చేసిన మల్లె చెండులా ఉంది… ఆమె చెంప మీద మచ్చ చందమామలో వడ్లు దంచుతున్న ముసలమ్మాలా కనిపిస్తోంది.. ఆ ముసలమ్మ అచ్చు తన తల్లిలా ఉంది.. అవును.. అమ్మ చనిపోయి చందమామలో చేరింది అనుకున్నాడు.. నా తల్లే నాకు బిడ్డగా పుట్టింది.. నన్ను తన బిడ్డని చేసుకుంది… యాదగిరి కళ్ళు వర్షిస్తున్నాయి.. ఆ కన్నీటి పరదా చాటున సూక్తి మొహం ఎంతో అందంగా కనిపించింది. సభలో సూది కింద పడినా వినిపించేంత నిశ్శబ్దం ఆవరించింది. ఆమె చెప్పబోయే కథ వినడానికి అందరూ ఉద్వేగంతో చూస్తున్నారు. ఆమె మెల్లగా పెదవి విప్పింది. మేఘాల్లోంచి ఓ వీణానాదం భూమి మీదకు ప్రవహిస్తున్నట్టుగా ఉంది ఆమె స్వరం.

మా నాన్న టాక్సీ డ్రైవర్. తన టాక్సీలో ఎక్కే అనేక మంది అమ్మాయిల మాటల్లో వాళ్ళ ఆశలను, ఆశయాలను చూస్తూ తన ఇద్దరు ఆడపిల్లలను ఎంత కష్టపడి అయినా బాగా చదివించాలని నిర్ణయించుకుని మా అక్క వినీతని, నన్ను కాన్వెంట్‌లో చేర్పించాడు. అక్క డిగ్రీ అవగానే బిఇడి చేసి టీచర్‌గా ఉద్యోగం సంపాదించుకుంది.. ఆ తరవాత ఒక టీచర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నేను అక్కకన్నా అన్నిట్లో ఉత్సాహంగా, చురుకుగా ఉండేదాన్ని. డాక్టర్ అవాలని చిన్నప్పటి నుంచీ నా కల.. నాన్నకి శక్తికి మించిందే అయినా తప్పకుండా చదివిస్తానని ప్రమాణం చేసాడు. నేను ఇంటర్ చదువుతూ ఉండగా ఒకసారి తనతో పాటు టాక్సీలో ఒక ప్రయాణీకుడిని దింపడానికి ఎయిర్‌పోర్ట్‌కి తీసుకుని వెళ్ళాడు నాన్న. ఎన్నడూ చూడని ఆ ఎయిర్‌పోర్ట్ ప్రాంగణం, ఆ వైభవం చూసి నాకు ఫ్లైట్ చూడాలని అనిపించింది.. “నాన్నా ఫ్లైట్ చూపిస్తావా” అడిగాను.

“మనలను లోపలికి రానివ్వరమ్మా! చూడడం ఎందుకు?నీ చదువు పూర్తీ అయాక ఫ్లైట్ లోనే తిరుగుదువు గాని” అన్నాడు.

మా మాటలు విన్న ప్రయాణీకుడు “నిన్ను లోపలికి నేను తీసుకుని వెళ్తానులేమ్మా.. నేను ఎయిర్ ఇండియాలో పని చేస్తున్నాను నాకు అనుమతి ఇస్తారు.” అని చెప్పి తనతో పాటు మమ్మల్ని ఇద్దరినీ కూడా లోపలికి తీసుకుని వెళ్ళాడు. అద్దాల్లోంచి ఆగి ఉన్న ఫ్లైట్స్‌ని చూస్తుంటే రెక్కలార్చుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్న పక్షి రాజుల్లా అనిపించాయి. కళ్ళు విప్పార్చుకుని విభ్రాంతిగా చూస్తున్నాను. అప్పుడే డ్యూటీ పూర్తీ చేసుకుని తెల్లని యూనిఫామ్స్‌లో వస్తున్న పైలట్స్ కనిపించారు. వాళ్ళంతా ఆకాశంలో విహరించి, విశ్రాంతి కోసం భూమ్మీదకు దిగిన దేవదూతల్లా కనిపించారు ఆ క్షణం.. అంతే… డాక్టర్ అవాలన్న నా కోరిక ఎలా మాయమైపోయిందో నాకు తెలియదు.. రివ్వున వాలిన పక్షిలా నా మనసులోకి పైలట్ అవాలన్న ఆశకి అంకురార్పణ జరిగింది.

నా కోరిక నాన్నకి చెప్పేముందు, అసలు పైలట్ అవడానికి కావలసిన విద్యార్హతలు, ఎలా అప్లై చేయాలి.. ఎక్కడ ట్రైనింగ్ అవాలి.. మొత్తం ఆ ట్రైనింగ్‌కి అయే ఖర్చు వగైరా సమాచారం అంతా సేకరించాను.. చాలా కష్టం అనిపించింది.. కానీ అసాధ్యం అని అనిపించలేదు.. నా ఆలోచన నాన్నకు చెప్పను.

అది విన్న నాన్న నివ్వెరపోయాడు. “పైలట్ అవుతావా! ఆడపిల్లవి విమానం నడిపిస్తావా” అన్నాడు.

“అదేంటి నాన్నా… ఆడపిల్ల సైకిల్ నడపచ్చు.. బండి నడపచ్చు.. ఆటో, కారు, రిక్షా ఇవన్నీ నడపంగా లేనిది ఫ్లైట్ ఎందుకు నడపకూడదు.. నీకు తెలుసా.. మన దేశంలో మొట్టమొదటి లేడీ పైలట్…సరళా తుక్రాల్ అనే మహిళ. ఎయిర్క్రాఫ్ట్ ఫ్యామిలీకి కోడలిగా వెళ్ళిన ఆమె భర్త సహకారంతో పైలట్ అయి ఏవియేషన్ పైలట్ లైసెన్స్ పొందింది. 21 ఏళ్ల వయసులో ఒంటరిగా విమానం నడిపి చరిత్ర సృష్టించింది. కమర్షియల్ లైసెన్స్ కోసం ప్రయత్నించే లోపల ఆమె భర్త పిడి. శర్మ విమాన ప్రమాదంలో మరణించడంతో ఆమె కోరిక అక్కడ ఆగిపోయింది. ఆ తరవాత అవని చతుర్వేది అనే అమ్మాయి పైలట్ అయింది.. ఇప్పుడు ఇంకా ఎంతో మంది అమ్మాయిలు ఆ వృత్తిని ఇష్టపడుతున్నారు. డాక్టర్స్, ఇంజనీర్స్ చాలా మంది అవుతారు నాన్నా..పైలట్ అవడం అంతకన్నా గొప్ప .. కాకపోతే చాలా ఖర్చు అవుతుంది” … నా మాటలు విన్న నాన్న నెత్తిన పిడుగు పడినట్టు చూసాడు.. నావైపు వెర్రివాడిలా చూసాడు.. నేను సేకరించిన సమాచారంలో ఆఖరి విషయం చెప్పాను.. “నలభై లక్షల వరకు అవుతుంది నాన్నా” అన్నాను.

ఆయన స్వరం మూగపోయింది. “నలభై లక్షలా… నన్ను నడి బజారులో నిలబెట్టి వేలం వేసినా రాదుకదమ్మా” అన్నాడు.. నా గుండె ఆగిపోయింది.. నేను పైలట్ అవలేనా… నా కళ్ళల్లో నీళ్ళు చూసిన నాన్న విలవిలలాడిపోయాడు. నా కళ్ళల్లో కనిపిస్తున్న కలల దీపాల తోరణాల వెలుగు బహుశా ఆర్పేయలేకపోయాడు అనుకుంటా.. ఫలితంగా ఆయనకీ మా తాతగారి నుంచి సంక్రమించిన ఐదు ఎకరాల పొలం మాయమైంది..

రెండేళ్ళ పాటు అకుంఠీత దీక్షతో శిక్షణ పొంది అన్ని పరీక్షల్లో అనూహ్యమైన విజయం సాధించాను. శిక్షణ ప్రారంభించిన దగ్గర నుంచి అందరూ నన్ను నిరుత్సాహ పరిచిన వాళ్ళే.. ఆడపిల్లవు నువ్వు పైలట్ అవడం ఏమిటి? కావాలంటే ఎయిర్ హోస్టెస్‌గా వెళ్ళు అన్నారు.. విమానం నడపడం అంటే బొమ్మ విమానం అనుకుంటున్నావా.. నీ వయసేంటి… నువ్వు విమానం నడపడం ఏంటి? ఇలా ఎన్నో హేళనలు, తిరస్కారాలు, అవమానాలు.. నేను దేనికీ బెదరలేదు.. మొదటిసారి వంటరిగా, మరో పైలట్ లేకుండా సింగపూర్, తరవాత దుబాయ్ ఆత్మవిశ్వాసంతో విమానం నడిపి నేనేమిటో నిరూపించుకున్నాను.

నాన్న అమ్మిన ఐదెకరాల పొలం తిరిగి కొన్నాను.. త్వరలో యాభై ఎకరాలు కొంటాను నాన్నా అని ప్రమాణం చేసాను. కానీ అన్నీ అనుకున్నట్టు జరిగితే జీవితం కాదు కదా! ఆమె ఆగింది.. అందరూ ఉత్కం ఠగా చూడసాగారు.

ఆమె స్వరంలో అంతులేని బాధ తరవాత పొందిన రిలీఫ్ వినిపించింది. “ఆరోజు ఊహించని ప్రమాదం జరిగింది.. నేను నడిపిస్తున్న విమానం తుపాన్ కారణంగా కుప్పకూలింది.. ప్రాణాలు దక్కినా చేతులు ఇంకా ఎన్నటికీ విమానం నడపడానికి అర్హత లేదు నీకు అంటూ రెండు చేతులూ తీసేసాడు దేవుడు. మొహం మీద కరిగిపోయిన నా కలలకి సాక్ష్యాలుగా మచ్చలు మిగిలాయి. ఒక కాలు పోయింది.. ఫలితంగా ఉద్యోగం పోయింది.. జీవితంలో వెలుగుపోయింది. గుండెల్లో సప్త సముద్రాల దుఃఖం… ఈ జీవితం ఇంక ఎందుకు అనే నైరాశ్యం ఆవరించింది. అయినా నేను మా నాన్నకి చేసిన ప్రమాణం నా చెవుల్లో మారుమోగుతూ ఇంకో కాలుంది.. నీ మెదడు ఆలోచనాశక్తిని కోల్పోలేదు.. బోలెడు జీవితం ఉంది.. ముందుకు వెళ్ళు… నిరాశ పడకు అని వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటే నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను.. మోచేతులతో పట్టుకుని పుస్తకాలు చదవడం నేర్చుకున్నాను.

చరిత్ర, సైన్సు, సాహిత్యం, రాజకీయాలు.. సైకాలజీ.. అంతులేని జ్ఞానం… నా మోచేతులే ఇప్పుడు నా ఆయుధాలు.. కొత్తగా మొదలుపెట్టిన జీవనపోరాటంలో గెలవడానికి అవే కరదీపికలు.. ఆరిపోయిన ఆశా దీపాలను వెలిగించేది అవే.. సివిల్స్ రాసాను….. గెలిచాను… మొట్టమొదటి దివ్యాంగ ఐఎఎస్.. మా నాన్న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన టెన్నిసన్‌లా పొంగిపోయారు. మొదటిసారిగా జాయింట్ కలెక్టర్‌గా ఉన్నత స్థానంలో కూర్చున్న రోజు ప్రపంచ సింహాసనం మీద కూర్చున్న మహరాణిలా గర్వంగా అనిపించింది.

ఇప్పుడు నేను సబ్ కలెక్టర్… నా అనుభవాలను పాఠాలుగా మార్చి ఎందఱో విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగించే ఆరేటర్ని.. ఎన్నో చానెల్స్ తమ చానెల్స్‌లో వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పమని ప్రతిరోజూ ఆహ్వానిస్తారు.. నాకు చేతనైనన్ని ఉపన్యాసాలు ఇస్తాను.. నిజానికి ఇవి ఉపన్యాసాలు కాదు.. నేను నేర్చుకున్న పాఠాలు మీ లాంటి అనేక మంది పిల్లలకి తెలియచేయడం అంతే.. నా అనుభవాలు మీ అందరికీ ఉపయోగపడి మీరంతా మీ, మీ ఆశలకు అనుగుణంగా మీ జీవితాలను తీర్చిదిద్దుకున్న తరవాత ఒక్క గంటసేపు నన్ను తలుచుకుంటే చాలు.. అన్నిటికన్నా ఘనవిజయం గా భావిస్తాను నేను.”

ఆకాశం దద్దరిల్లేలా మోగాయి చప్పట్లు… కళ్ళల్లో ఆనందభాష్పాలతో రెండు మోచేతులు దగ్గరకి చేర్చింది సూక్తి. ఒకదాన్ని ఒకటి తాకిన ఆ మోచేతులు నారదుడి చేతిలో మహతిలా మధుర నాదం చేసాయి..

మరునాడు దామినిని, జాబిలినీ, హిమనీ భుజాల మీద చేతులేసి నడిపిస్తూ తీసుకువస్తున్న తొమ్మిదిమంది అమ్మాయిలను చూస్తూ అంది హెడ్ మిస్ట్రెస్ నీతతో… “ఒక్క మాట కూడా అనకుండా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలా చేసి, వాళ్ళల్లో మార్పు తీసుకువచ్చిన నీకు మనసారా కృతఙ్ఞతలు నీతా!”

“నాదేం ఉంది మేడం. ఒక రాయి వేసి చూసాను. తగిలింది. మన విద్యార్ధులు అంటే మన పిల్లల్లాంటి వాళ్ళే కదా! వాళ్ళు దారి తప్పినా, మంచి దారిలో నడిచి చక్కటి గమ్యం చేరినా అందుకు కారణం మనమే అవుతాము. తల్లి తండ్రులు కని, పెంచుతారు. నాలుగు అక్షరాలు నేర్పడమే కాదు, ఉన్నతమైన సంస్కారాన్ని, విశాలమైన దృక్పథాన్ని వాళ్ళలో కలిగించాల్సిన వాళ్ళు, అందరినీ మంచి దారిలో నడిపించి చక్కటి బాట చూపించాల్సిన మార్గదర్శకులు గురువులే అని నమ్ముతాను నేను. అందుకే ఇది నా బాధ్యతగా భావించాను..” అంది నీత.. ఆమె వైపు అభినందనగా చూసింది హెడ్ మిస్ట్రెస్. దూరం నుంచి తారాజువ్వల్లా వెలుగులు విరజిమ్ముతున్న నవ్వులతో క్లాసులోకి వెళ్తున్న దామిని, హిమ, జాబిలి నిజంగానే దివ్యాంగనలులా కనిపించారు నీత టీచర్‌కి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here