దివ్యాశీస్సుల జయంతి శతజయంతులు

0
17

[డా. జొన్నలగడ్డ మార్కండేయులు రచించిన ‘దివ్యాశీస్సుల జయంతి శతజయంతులు’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]మ[/dropcap]రణానంతరము దేహముండదు. కాని దివ్యశరీరముగ అదృశ్యరూపముగ ఆత్మపితృలోకములో ఉంటుందని హిందూమత నమ్మకము. దివ్యశరీరులుగ పితృదేవతలకు ఆత్మరూపము. జయంతి లేదా శతజయంతి పేరిట దివ్యాశీస్సులు కొరకు ప్రార్ధన యిహలోకస్మరణ ఆహ్వానము భక్తిప్రపత్తి పితరపూజగ శాస్త్రసమ్మతము ఉందా?

పుట్టినరోజు అంటే బ్రతికిన్నవారికి జరిగే లేదా జరుపుకునే జన్మతిథి వేడుక. అయితే దివ్యాశీస్సులు కోరుకుంటూ మరణానంతర  దైవస్వరూపముగ, దైవాంశభావనగ చేసే పుట్టినరోజుకు జయంతిగ పేరు. ఆరాధనోత్సవముగ జయంతి పండుగ. అవతార పురుషులకు, మహామహులకు పంచాంగతిథిగ ఆమోద యోగ్యమయింది. మన మధ్య లేని ఆత్మీయుల పుట్టిన రోజుకు కూడ భక్తిప్రపత్తులు నిశ్శరీరికి చాయాచిత్రరూపారాధనగ పరోక్ష పుట్టినరోజుగ జయంతి భావనగ మన మధ్యనే ఉన్నట్లు జరపడం తప్పు అవదు.. శుభకార్యాది ఆహ్వాన పత్రికలలో కూడ దివ్యాశీస్సులిస్తూ మన మధ్యనే ఉన్నారనే భావన నేపథ్యంలో జయంతికి, శతజయంతికి ఖేదములో మోదముగ విశేష ప్రాముఖ్యము ఉంది. తనువు చాలించిన తరువాత వచ్చేవారికి పుట్టినరోజు అర్థములోజయంతి నిలద్రొక్కుకుంది.

దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసిన రామకృష్ణాదిదశావతారాలు, శంకరాచార్యులు, రామానుజులు వంటి మతాచార్యులు, పీఠాధిపతులుకు దైవాంశ స్వరూపము జయంతి పండగ రూడార్థముగ పంచాంగతిథిగ పండుగల పట్టికలో చేరాయి. కాని అవతారపురుషులే కాక బహుజనాదరణ గల లోకోత్తర పురుషులున్నారు. వారి జన్మదిన కాలము నిర్దారించారు. గుర్తింపు పొందిన అవధూతలు, యోగులు, భక్తులు సిద్ధులు, ప్రవక్తలు, గాంధి, నెహ్రూ వంటి ప్రజాభిమాన లోకప్రసిద్ధ దేశనాయకులు, మొదలైనవారిని ప్రబోధాత్మకులుగ కారణజన్ములుగ గుర్తించారు. వారికి భక్తిప్రపత్తులుగా జయంతి, శతజయంతి వేడుకలు సర్వసాధారణమయాయి. సామాన్య జనంలో ఆత్మీయులకు మరణానంతరము పుట్టినరోజు స్మృత్యర్ధం జయంతి మరియు శత జయంతి వేడుకలను నేడు దివ్యాశీస్సుల కొరకు జయంతి పండగ అనవచ్చా?   హిందూమతాచారముగ ఇబ్బందులున్నాయా?

‘జాతస్యసి ధ్రువో మృత్యుః’ అన్నాడు భగవానుడు. శతమానం జీవించాలన్నది కోరిక తీరడం అదృష్టం. నూటయిరవై సంవర్సరాలు పైబడి జీవించిన వారున్నారు. జీవనసాఫల్యముగ అంతర్యామియై పరమాత్మకు దర్శన స్మరణము సంసారికి ముముక్షు అనుభూతి. దేహధారిగ షష్టి, సప్తతి, సహస్రమాసచంద్రదర్శనముగ ఎనభయ్యవ పుట్టినరోజు మధురానుభూతి. నూరవ పుట్టినరోజు, ఆపైన జరుపుకోగలగడం అదృష్టమవుతుంది. కాని ఈలోగానే మరణించివారు పితరులు అవుతున్నారు. పరలోకాత్మగ పిండప్రధాన దినములకెదురు చూస్తారు. వారసులు, అర్హులు పురోహిత నిర్ణయ తిథి బాధ్యతను శిరసావహించి ఆబ్దికము పేరిటనే కాక ఇతర పవిత్రదినాలలోకూడ విస్మరించరు. అరుదు.

మరణించినవారు పితరులుగ పితృదేవతల లోకములో ఉంటారని నమ్మకము. దివ్యాశీస్సులిచ్చే లోకవాసులుగ కనిపెట్టి రక్షిస్తున్నారని నమ్మకము. అందుచేత మరణతిథి పితృదేవతదినంగ శాస్త్రసమ్మతం. ఆ రోజున  పితరులు యిలకు దిగివస్తారు. భక్తిప్రపత్తులుగ అందించిన పిండములకు తృప్తిపడతారు. దివ్యాశీస్సులు అందిస్తారు.

మరణతిథిని శాస్త్రవిధిగ శ్రాద్ధము పేరుతో, ‘పితృపితామహ ప్రపితామహాః ఆమీవో గంధాః..’.ఇత్యాదిగ పురోహిత బ్రాహ్మణుని పితరునిగ భావించి పూజించి ‘నమోనఃపితరో జీవాయనమోనమః’ అని పితృలోకాహ్వానము విధివిధాన శాస్త్రసమ్మతము కులాతీతముగ వ్యాప్తిలో ఉంది.

కాని జయంతి పేరుతో విశేషదినముగ జన్మదినమును కూడ జరుపుతున్నారు. జయంతినే కాక, లెక్కకట్టి నూరవ పుట్టిన రోజును దేహానంతరము దివ్యాశీస్సుల పేరిట జయంతి, శతజయంతిగ ఆరాధనోత్సవము భక్తిప్రపత్తులు కాదనరానివి. అయితే శాస్త్రవిధి పితరులకు ఉత్తరక్రియల మాదిరి ఔచిత్యముందా? పిండప్రధాన విధివిధానముగ జయంతిగ పండుగకు అంగీకారము చేయొచ్చా? పితృలోకమునకు పిలుపవుతుందా? చర్చించదగినది.

నూట యిరవై సంవత్సరాలు పైబడి జీవించినవారున్నారన్నది నిజము. సజీవులుగ నూరవ పుట్టినరోజుకు మరో శతమానంభవతి దీవనకు దగ్గరవుతున్నవారు గౌరవింపబడుతున్న పుట్టినరోజులు జరుపుకుంటున్న కాలమిది. కాని నూరు నిండకుండానేతనువు చాలించడం ఖేదమొ మోదమొ విధినిర్ణయం తప్పదు. తృప్తికర విశ్రాంత జీవితవైరాగ్యము అరవైవయసు దాటినప్పటి నుంచి మొదలవుతుంది. అయినా మనవలు, మునిమనవలు తరాలు జరిపే పుట్టినరోజు శరీరధారులకు అనిర్వచ నీయానందము జయంతిశతజయంతులనాడు కలగాలన్నది ఆశ.

అదృశ్యదేహులు పితృదేవతలు.  యిలకు ఆహ్వానము పితృదివసము నాడు మాత్రమే చేయాలి. ఒకప్పుడు సశరీరులు. ప్రజాజీవనము లోని మేలుకీడులు ప్రేమాభిమానములను కుటుంబసభ్యులుతో పంచుకున్నారు. ముగిసిన ఆనాటి సహజీవనము దైవాంశ సంభూతులుగ దిగివచ్చిన అనుభూతి కాదనరానిది. పితృతిథిగ బ్రాహ్మణభోక్త రూపము శాస్త్రసమ్మతారాధన కులాతీత హిందూధర్మమత భక్తిభావన. కాని జయంతిలేదా శతజయంతి తిథి పేరు పితృతిథిగ హిందూధర్మము ఒప్పుకోదు. పితృదేవతలుగ వారికి శాస్త్ర నియమిత పర్వదినములు మాత్రమే ఆదరణీయము.

ఉత్తమ పరలోకవాసికి జన్మతిథిని జయంతినాడు భక్తిప్రపత్తులు పరలోక పిండప్రదాన కార్యక్రమ ఆధ్యాత్మికచింత నారాధనకు ముడిపెట్టలేము. సాధారణ గృహస్థులకు జయంతి నూరవపుట్టిన రోజుగ దేహానంతరము శతజయంతి పండుగ లేదా వేడుకగ విలువనివ్వగల పితృతిథి ఆశయ ఆచారమునకు శాస్త్రీయతగ ప్రశ్నార్థకము.

పితృదేవతలున్నారని వారిని తృప్తి పరచితే దివ్యాశీస్సులు లభిస్తాయని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. విధివిధానము పాటించాలి. ఎఱ్ఱన హరివంశములో ద్వితీయా శ్వాసములో ఉంది. తన తండ్రి శంతనునకు ఔర్ధ్వ దైహికములు అంటే ఉత్తరక్రియలు నిర్వహించాడు. కుశాస్తరణంబు అంటే నేలమీద దర్భలు చాపలా పరిచి పిండప్రదానము చేసాడు. ఆ సమయంలో కంకణకేయూరాలతో భూమిని చీల్చుకుని తండ్రి శంతనుని హస్తము పైకి వచ్చింది. కాని పిండములను భీష్ముడు చేతికందీయలేదు. దర్భలు మీద పరచడమే శాస్త్రవిహితకర్మ అని నమస్కరించాడు. జయంతి పిండప్రధాన తిథి కాదు. శాస్త్ర్ససమ్మత దివసము కొరకే పితరులు ఎదురుచూస్తారు

శంతనుడు ఆవిశిష్టధర్మాచారణకు ముగ్ధుడయాడు. ‘పితరులకు పిండములు అందించవలసిన శాస్త్రరీతి తప్పలేదు. నీ అంతరంగము పరీక్షించాలని చేయి చాచాను.  శాస్త్రవిహిత ధర్మంపట్ల నీ ప్రమాణము నచ్చిందని’ సాకారుడై స్వచ్ఛంద మరణము వరముగా యిచ్చాడు. పిండప్రదాన కార్యక్రమ నిర్దేశిత పర్వదినములు క్రియావిధి తప్ప పితృదేవతలను జయంతి పేరున ఆహ్వానించడము శాస్త్రవిరుద్ధము అనిపిస్తోంది.. కాని పితృదేవత నామగోత్రార్చన దివ్యాశీస్సుల జయంతిగ ఏ లోకము నందున్న తృప్తి పరిచేవిధముగ ‘దివ్యాశీస్సుల జయంతి’ ప్రార్థనగ కార్యక్రమము జరపొచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. పిండప్రదాన పర్వదినముగ విచారణీయము.

పితృలోకనివాసులు దివ్యాశీస్సులిస్తారన్నది నిజము. రామాయణములో సీత అగ్నిపునీతయినపుడు ఆనందం పట్టలేక దశరథుడు పితృలోకము నుండి దిగి వచ్చి ఆశీస్సులిచ్చాడు. పిండప్రదాన తేదీని ఎందుకొచ్చిన తద్దినముగ భావించరాదు. జన్మతేదీని కూడ గుర్తుకు తెచ్చుకుంటూ పితృతర్పణము వదలగలిగే అదృష్టమున్న పితృదేవత సంతానము నూరవ పుట్టినరోజును జయంతి లేదా శతజయంతి వేడుకగ వాతావరణం దివ్యాశీస్సులుగ కుటుంబసభ్యులు బంధుమిత్రులతో గరుపుకోవడం మధురస్మృతులే అవుతాయి. ప్రశంసనీయము.

శశి సూర్యులున్నంత కాలము తనువు చాలించినా తలపులలో ప్రతి పుట్టినరోజుగ జయంతి జ్ఞాపకాల మహోత్సవముగ కుటుంబసభ్యులకు వారసత్వము అందించిన ఆదర్శవర్తనునికి దక్కే అరుదైన జ్ఞాపకము జయంతి మరియు శతజయంతి కూడ ఆహ్వానించదగ్గవి.. అశేష బంధుజనులకు ప్రీతిపాత్రమైన జీవితయంత అనగా జీవితరథ సారధిగ ఆదర్శజీవితము గడిపిన వ్యక్తిది తరానికి అందవలసినది లక్ష్యప్రబోధ స్మరణ ప్రశంశనీయమవుతుంది. కాని అతిసర్వత్ర వర్జయేత్. లోకస్తుత్య ప్రబోధమవాలన్నది పితృదేవతదివ్యాశీస్సుల శత జయంతి ఆశయము  పులిని చూసి నక్కవాత కారాదు. మొక్కుబడిగా కారాదు. జనప్రియ సందేశమవాలి.

‘ఆయుర్వర్షశతం నృణాం’ నరులకు ఆయుర్దాయము నూరేళ్ళకు పరిమితం. ‘వారితరంగచంచలతరేసౌఖ్యం కుతః ప్రాణినాం’ నీటి మీది కెరటంవలె క్షణభంగురమైన జీవితములలో ప్రాణులకు సుఖము లేదు. ఏకః పరమాత్మా బహుదేవవర్తీ అని పరమాత్మ పరంజ్యోతిరూపము మనలో ఆత్మరూపములో ఉంటాడు. దీనికి దైవానుగ్రహము అని పేరు. దుర్లభమైన ముముక్షుత్వాన్ని కోరుకుటుంది. గుణములే పూజాస్థానములుగల రూపము. దీనికి స్త్రీ పురుష వివక్షత, వయో న్యూనాధిక్యములుండవు. లీలామానుషరూపధరుడై తన ఆత్మలైన మనకు ఆహ్వానము అనే ఏకవింశతి రూపముగ సకలచరాచర లోకేశ్వరుడై ఎవరికి వారమే భిన్నులమనిపించే భ్రమ సంసారము కల్పించాడు. అందుకేవారు దివ్యాశీస్సులివ్వగల పితరదేహులు.

రామానుజులవారు ‘సత్యాసంసృతిరీశనిగ్రహకృతా ముక్తిస్తుభ్క్త్యాదినా’ పరమాత్మ శ్రీమన్నారాయణుడు. ఆయన జీవులకు కలిగించిన సంసారము సత్యము. పరమాత్మ దూరముగా ఉన్నాడన్న భావన నశించాలి. భక్త్యాదుల వల్ల దగ్గరకు రమ్మని పిలుస్తుంటాడు. అక్కడికి చేరుకోగగడమే ‘ముక్తి’ అని చెప్పారు. శరీరిగ పుట్టినరోజు, నిశ్శరీరుడుగ పరమాత్మరూపము. బంధునుత స్మరణప్రలోభ ప్రబోధ శతజయంతి ఉత్సవము పుట్టినరోజు భువిగ ఊర్ధ్వలోకము నుంచి  భువికి దివ్యాశీస్సులివ్వగల ప్రార్థనాహ్వానము ఎవరికి? ఎందుకు?

యాంతి పితృవృతా పితౄన్ అని పితరులను సేవించువారు పితృలోకమునకు వెళతారు అని భగవద్గీత చెప్పింది. అదే భగవద్గీత పతంతిపితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః అని పిండోదకములు లోపిస్తే పితరులు అధోగతి చేరుతారని కృష్ణుడితో కులక్షయముకు దారారిగ యుద్ధవిముఖత  ద్వారా అర్జునుడు వ్యక్తపరిచాడు.

మరణానంతరము జరిపే అంత్యక్రియలకు పితృమేథ అని పేరు. శరీరము లేనివారిని పితరులుగ భావిస్తారు. భగవద్గీత పదిహేనవాధ్యాయములో ఐదవ శ్లోకముగ దేహాభిమానములేని నాశనరహితమైన పరమపదవిని జ్ఞానులు పొందుతారు అని భగవానుడు చెబుతాడు. ఇంకా తరువాతి వివరణగ మోహరహితుడై పరమాత్మను గుర్తించిన పరమాత్ముడిగ పరమాత్మ స్వరూపముగ దేహాత్మకు గుర్తింపు వస్తుంది. మోహాతీత ఆత్మజ్యోతిదేహము.

కుటుంబసభ్యులు పరంజ్యోతి నుంచి ఆత్మజ్యోతిని ప్రజ్వలనచేసి ఇహానికి రప్పించగలుగుతారా? అర్చించడం గొప్ప విషయమే. ఇహలోకసుఖము ఆశించని ఆ విడివడిన ఆత్మజ్యోతికి ప్రలోభపరిచే ఆహ్వానము సందడి మైమరపుగ పితృలోకమునకు దూరము చేయొచ్చా? ఉత్తమలోకపయనప్రాప్తి ఆధ్యాత్మ ఆరాధన నిష్ప్రయోజన మవుతుందా?

నిజమే! శరీరమే దేవాలయము. అందులోని జీవుడు అజ్ఞానమనే మాలిన్యాన్ని తొలగించుకుని సోఽహం నేనే పరబ్రహ్మను అని జీవన్ముక్తిని పొందడమే జన్మసాఫల్యము. జయంతిగ శతజయంతి ఆహ్వానముగ ఆత్మదేహము పరమాత్మనుండి విడివడితే పునర్జన్మ దేహఆశలు చిగురించి దేహధారి అవగలడా? శాశ్వతనివాస పరమాత్మకు గుర్తింపు దూరమయే జయంతిగాని నూరవపుట్టినరోజుగ ఆహ్వానము గాని ఆత్మారాధనకు శాస్త్రసమ్మతము లేదు. సామాన్యులైనా, అసామాన్యులైనా ఒక నిర్దిష్ట కార్యమునకు పునర్జన్మలేని భగవత్స్వరూపములుగ అవతరించినపుడు మాత్రమే జయంతిగ స్ఫూర్తిగ జరపడం తప్పు గాదు. మహాత్ములు, శంకరాచార్యులు వంటి వారు కారణజన్ములకు పునర్జన్మ ఉండదు. జయంతి తిథి పేరిట దైవస్వరూపారాధన అయింది – అట్టహాస, ఆర్భాట జాతరసందడి. సమకాలీన సామాన్య విధిగ పితృదేవత తృప్తి విధివిధాన పరిధి లేదు. ప్రజాబాహుళ్య నిర్ణయముగ ఐచ్ఛికము. జయంతి శతజయంతులు జరిపేవారు ఆలోచించుకోవలసిన అవసరముందన్నది పులిని చూసి నక్క వాతలులా వివాదము చేయడము కారాదన్నది వివాదములకతీతము ఈ వ్యాసోద్దేశము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here