దివ్యాంగ ధీరులు 7 – విద్యతో వైకల్యాన్ని అధిగమించిన రేవంత్

2
7

[box type=’note’ fontsize=’16’] దివ్యాంగులైనప్పటికీ, ధీరత్వంతో జీవనపోరాటం సాగిస్తున్న వ్యక్తులను పరిచయం చేస్తున్నారు గురజాడ శోభా పేరిందేవి. రేవంత్ తన వైకల్యాన్ని అధిగమించిన తీరుని వివరిస్తున్నారు. [/box]

[dropcap]“అ[/dropcap]మ్మా”

“ఏంటి బాబు?”

“ఏం చేస్తున్నావ్?”

“ఏమీ లేదు నాన్నా”

“ఏదో వుంది, చూడనీ”

“ఏమీ లేదన్నానుగా” అని అమ్మ గబగబా లోపలి వెళ్ళిపోయింది.

రేవంత్ స్వామి నేలమీద ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు.

“అమ్మ ఏం చేస్తోంది అని కదురా అడిగావు”

“అవునక్కా” అన్నాడు రేవంత్.

“అమ్మ మందు రాసుకుంటోందిరా”

“ఎందుకక్కా, అమ్మకి ఏమైంది?”

”నిన్ను రోజూ ఎత్తుకుని స్కూలికి తీసుకు వెళ్తుంది. మళ్లీ ఎత్తుకునే తీసుకుని వస్తుంది. అందువల్ల అమ్మకి జబ్బలు ఎప్పుడూ గుంజుతూ వుంటాయికదా, అందుకు”

“నిజమా అక్కా? నీకు తెలుసా?”

తల ఊపింది. తమ్ముడివైపు చూసి ఇలా చెప్పింది.

“తెలుసురా. నేనెన్నోసార్లు అడిగాను నెప్పి ఎందుకు? అని అమ్మ నవ్వింది కానీ జవాబు చెప్పలేదు. తర్వాత నాకే అర్థమయ్యింది. ఎంత సన్నగా వున్నా ఎముక బలం ఉంటుంది కదా. నిన్ను మోయడం కష్టమేగా పుట్టినప్పటినుండి మనందరి కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాడు నాన్న. అమ్మ మన పనులు చెయ్యలేక అలసిపోతోంది.”

నిట్టూర్చాడు రేవంత్. అమ్మ వెళ్ళినవైపు చూస్తూ వుండిపోయాడు. అక్క చెప్పినమాట రేవంత్‌ని కదిలించింది.

 

‘పాపం అమ్మ నవమాసాలూ మోయడమే కాక తొమ్మిది సంవత్సరాలు దాటి పదో ఏడు కూడా వొచ్చిన తనని మోస్తోంది’ అని బాధపడ్డాడు.

రాయికోడు మండలం, సంగారెడ్డి జిల్లా ధర్మాపూర్ గ్రామానికి చెందిన రాచయ్యస్వామి, బసమ్మలకి 1994వ సంవత్సరంలో పుట్టాడు రేవంత్.

మౌనికనీ, రేవంత్ స్వామిని ప్రేమగా జాగ్రత్తగా పెంచడo తమ ప్రథమ బాధ్యతగా భావించారా దంపతులు.

ఈ పని ఆ పని చేస్తూ వంటలవాళ్ళ దగ్గర పనిచేసి అనుభవాన్ని, తనపై తాను నమ్మకాన్ని ఏర్పరచుకున్న రాచయ్యస్వామి స్వయంగా వంటలు చేసి అమ్మే స్థాయికి చిన్నగా ఎదిగాడు. సాయంత్రం బజ్జీల బండి పెట్టుకుని బాగా నడిపిస్తూ వచ్చాడు.

మేనరికం కాకున్నా వారికి పుట్టిన పిల్లలు ఇద్దరూ పోలియో మస్క్యూలర్ డెస్ట్రోఫీ అనే వ్యాధితో పుట్టారు. అది కండరాల క్షీణత వ్యాధి. ఈ వ్యాధి దురదృష్టవశాత్తు వొస్తుంది. కొన్ని కొన్ని చోట్ల కుటుంబాలలో వరసగా ముగ్గురు పిల్లలుంటే ముగ్గురికీ వస్తుంది. ఈ రకమైన వ్యాధిలో ఎనభై తొమ్మిది దాకా రకాలున్నట్టు తెలుస్తోంది. కొందరికి పుట్టుకతో వొస్తే ఇంకొందరికి సంవత్సరమోచ్చాక, మరికొందరికి నడక అందుకున్నాక పద్దెనిమిది ఏళ్ళు వచ్చాక… ఇలా ఎప్పుడు ఇది ఎటాక్ చేస్తుందో చెప్పలేము ఒక్కసారిగా కాళ్ళు చచ్చుపడిపోతాయి. పోనీ ఇది కాళ్ళకి సంబంధించిన వ్యాధే అనుకుందామా అంటే అదీకాదు. మాట్లాడడం కష్టమవుతుంది. మింగలేరు. మామూలు పిల్లల్లా ఎదగలేరు.

మౌనిక బక్కగా పుట్టింది. మెల్లగా సమస్యకి గురయ్యింది. రేవంత్ పుట్టిన తొమ్మిదే నెలలకి ఈ వ్యాధి బారినపడ్డాడు. రకరకాల వైద్యాలు చేయించారు. హైదరాబాదులోని ప్రముఖ ఆసుపత్రులకు తీసుకువెళ్లి చూపించారు. అందుకోసం చాలా ఖర్చుపెట్టారు. కరెంటు షాక్ ట్రీట్మెంట్ కూడా ఇప్పించారు. కానీ రేవంత్ అందరు పిల్లల్లా నడవలేకపోయాడు.

మోకాళ్ళ మీద పాకడం, చేతులకి చెప్పులేసుకుని పాకుతూ పోవడమే నడవడం అయ్యింది.

మూడేళ్ళ వయసప్పుడు ‘అడవిలో అన్న’ సినిమాకి అమ్మతో కలసి వెళ్లిన తీయని జ్ఞాపకముంది రేవంత్‌కి. ఆ సినిమాలోని పాట ‘వందనాలమ్మా నీకు వందనాలమ్మా’ అతన్ని బాగా ఆకట్టుకుంది. ఆ పాట తీయగా పాడిన గాయని ఎవరో తెలియకున్నా ఆమెకి అభిమాని అయిపోయాడు రేవంత్.

నిత్యం ఆ పాట అతని చెవుల్లో మారుమ్రోగుతూ ఉండడం తెలియకుండా ఆతను ఆ పాటని హమ్ చెయ్యడం మామూలుగా మారింది.

ఇరుగూ పొరుగుల ఇళ్లల్లో టీవీ పెట్టినప్పుడు చిన్నారి రేవంత్ తాను విన్న గాయని పాటలు వినాలని వెళ్లడం, వాళ్ళు అతను రాగానే టీవీ ఆర్పేయడం లేదా ఛానల్ మార్చడం, అతను వెళ్ళిపోగానే మళ్లీ పాటల కార్యక్రమం చూడడం రేవంత్‌ని బాధించిన బాల్య జ్ఞాపకాలు.

అమ్మకి వొంట్లో బాలేని రోజుల్లో చేతులకి చెప్పులేసుకుని పాక్కుంటూ బడికి వెళ్ళి చూసుకోగానే మోకాళ్ళకి రాళ్లు గుచ్ఛుకుని గీరుకుపోయి, రక్తం కారి భగభగా మండిన రోజులు రేవంత్‌కి గుర్తున్నా మనసుకు తగిలిన గాయాలే మరింతగా మనసులో నిలిచిపోయాయి.

అలా అమ్మకి వొంట్లో బాలేని ఒక రోజున బాబాయ్ కొడుకు సైకిల్ మీద స్కూలికి తీసుకు వెళ్ళాడు. బాలన్స్ తప్పి రేవంత్‍ని కిందపడేశాడు. అలా పడేసినవాడు చెయ్యి అందించి పైకి లేపలేదు కానీ రేవంత్ వాళ్ళ ఇంటికి వెళ్లి ‘నీ కొడుకు కింద పడ్డాడు చూసుకో’ అని చెప్పి వెళ్లిపోయాడు.

పాదం మణిగిపోయి తల్లి వచ్చే దాకా కిందపడుండి కాలు విపరీతంగా నెప్పి కలిగించినా అంతకంటే ఎక్కువగా మనసు బాధ పడింది.

పిల్లలిద్దరూ బాగా చదువుతారని స్కూల్లో సగం ఫీజు మాత్రమే తీసుకోవడం వారిని కన్నవారికి సాయమయ్యింది.

తన ఈడు పిల్లల్లా పరుగులు పెట్టలేకపోయినా కొందరు పిల్లల్లా నిదానంగా నడవగలిగే అదృష్టం తనకు లేకపోయింది అనే ఆలోచన అతన్ని వేధించడం మొదలయ్యింది. దానికి తోడు అక్క చెప్పినట్టు అమ్మని ఇబ్బందిపెడుతున్నానే అనే బాధ కూడా కలగసాగింది

బళ్ళో స్నేహితులు వీలయినంత సాయపడ్డమూ జరుగుతూ వచ్చింది. ‘వొంకర కాలని వెక్కిరిస్తారు. వ్యంగ్యం మాటలంటారు’ అనే మాటని అబద్ధం చేస్తూ అతని స్నేహితులు ఆ పసివయసులో కూడా తోడ్పడడం అభినందనీయంగా చెప్పాలి.

వాళ్ళందరూ ఆడుకుంటుండగా తానూ అటువెళ్తే, వాన వొస్తే ఎత్తుకుని తీసుకు వచ్చేయడం స్నేహానికి అసలయిన అర్థంగా చెప్పాలి.

అన్నింటికంటే మరువలేని జ్ఞాపకం అయిదవతరగతిలో ఒక మిత్రుడితో జరిగింది.

అమ్మ చంకకి ఎక్కి బడికి, ఇంటికి రావడం పోవడమే కానీ తమ గ్రామంలోని పచ్చని పొలాలని ఆరుబయలు అందాలని గొడుగుల్లా పరుచుకుని వూరికి నీడ, అందం ఇచ్చే చెట్లని చూసి ఎరుగడు రేవంత్ స్వామి.

ఒకరోజు మిత్రులమధ్య ఆ మాట చెప్పాడు.

“ఈ సారి నిన్ను తీసుకువెళ్తాం” అన్నారు మిత్రులు.

“నన్ను మీరెలా తీసుకెళ్తార్రా” అన్నాడు రేవంత్ ఆమాటని అక్కడితో ఆపేసి.

మర్నాడు బళ్ళో లంచ్ టైంకి “పదరా రేవంత్ నిన్ను పొలం దగ్గరికి తీసుకువెళతాను” అన్నాడు సాయి.

“ఎప్పుడు తీసుకువెడతావు? ఎలా తీసుకు వెడతావు?” అని అడిగాడు .

“ఉప్పు బస్తాలా ఎత్తుకుని ఇప్పుడే తీసుకువెళతాను. త్వరగా టిఫిన్ తీసెయ్యి. మళ్ళీ బెల్ కొట్టేసరికి తిరిగి వచ్చేద్దాం.”

ఇద్దరూ గబగబా తినేశారు.  సాయి రేవం‍త్‌ని వీపు మీద ఉప్పు బస్తాలా ఎత్తుకున్నాడు. పరుగులాంటి నడకతో ముందుకు సాగాడు సాయి. రేవంత్‌కి మధ్యాహ్నం వేళయినా బయటకి రావడం హాయనిపించింది.  రేవంత్ కళ్ళు మెరిసాయి.  పెదవులు విరిశాయి

చెట్లు తలలూపుతూ స్వాగతం పలికాయి. పూలు ఘుమఘుమలాడుతూ పెర్ఫ్యూమ్ చిలకరించిన భావం కలిగించాయి. ఆకాశం వీళ్లతో పాటే అడుగులేసింది అతి నెమ్మదిగా.

రేవంత్ చెట్టునానుకుని కూర్చుని పచ్చటి పొలాలను తలలూపే తరువులని పలకరించే పువ్వుల్ని చూస్తుండిపోయాడు.

వైకల్యానికి గురయిన పిల్లలు రెక్క తెగిన సీతాకోకచిలుకలు. రెక్క తెగినా ఒక రెక్కతో ఎగిరే యత్నం చేస్తుంది సీతాకోకచిలుక. ఆ అవకాశం వైకల్యానికి గురయినవారి పక్కనున్న వారు కల్పించడం అత్యవసరం. కానీ వెయ్యికోకరే ఓపికగా సాయిలా తోడ్పాటు ఇస్తారు, తోడ్కొని పోతారు.

అసలు పక్కవాడికి పదినిముషాలు సమయం వెచ్చించే ఓపికే ఇప్పుడెవ్వరికీ లేదు.

“రేవంత్ ఆ గాలిపటాన్ని చూడరా. దాన్ని కట్ చెయ్యాలని ఎన్ని వైపులనుండి ఎన్నెన్ని వొస్తున్నాయో! అయినా తోక ఊపుకుంటూ అది ఎగురుతోంది. చిరిగినా ఎగురుతోంది. అంతగా ఎగరడానికి కారణం ఏంటో తెలుసా?”

“గాలి బాగా వీచడమే” అన్నాడు రేవంత్

“కాదు తన పతంగ్‌కి బలం లేకున్నా ఒక పక్కన అది చిరిగినా నేర్పుగా ఎగరేస్తున్నాడు చూడు ఆ ఆటగాడిది గొప్పతనమంతా” అన్నాడు సాయి.

ఆకాశంలో ఎగురుతున్న పక్షులూ, పతంగులూ, పరుగుతీస్తున్న వాహనాలు, కుక్కలూ అన్నింటినీ చూస్తూ ఆ పాటి బలం తన కాళ్ళకి లేదే అనుకుంటూ కూర్చున్నాడు రేవంత్. అతని ముఖంలో విషాదం చూసి మాట మార్చి రేవంత్‌ని నవ్వించాడు సాయి.

స్నేహం అంటే అదే. కల్మషంలేని వయసువారిదే అసలైన స్నేహం. లంచ్ అవర్ పూర్తయ్యేసరికి రేవంత్‌ని ఎత్తుకుని బడికి చేరుకున్నాడు సాయి.

సాయికి రేవంత్ తన మాథ్స్ నోట్స్ ఇచ్చి సాయం చేస్తూండడం నిజం. కానీ దానికి ప్రతిగా తన ఈడు వాడే అయినా ఎత్తుకుని తీసుకుపోవడం అభినందనీయం.

ఆరవ తరగతి చదువుతున్నప్పుడు బళ్ళో జండావందనం రోజు జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో సాగరసంగమంలోని ‘ఓమ్ నమశ్శివాయ’ పాటకి నృత్యం చేసారు పిల్లలు.

ఆ కంఠం అతను ఆరాధించే గాయనిది. ఆమె కంఠం అతన్ని అలరించే కంఠం. ఒత్తిడికి లోనయినప్పుడు ఆమె పాడిన పాటని కూనిరాగం తీసినా మనసుకు ఉపశమనం కలిగించే కంఠం.

తెలుగు టీచర్ వినోదని ఆ పాట పాడిన వ్యక్తి పేరు అడిగాడు.

‘ప్రముఖ నేపధ్యగాయని ఎస్ జానకి పాడిన పాట అది. ఆ కంఠం అద్భుతంగా ఉంటుంది…’ అని చెప్పుకుపోయింది టీచర్.

సంతోషంగా విన్నాడు రేవంత్. ఆ పాట పగలూ రేయీ అతని చెవుల్లో మారుమ్రోగుతూనే వుంది.

రేవంత్ ఆరవ తరగతిలో ఉండగానే మెదక్ జిల్లా రామాయ పేట దగ్గర జాన్సీలింగాపూర్‌లో కాళ్ళు విరిగిన వారికి, పోలియో వ్యాధిగ్రస్తులకు వైద్యం చేసి కాళ్ళు తెప్పించగల విశేష మహత్తు ఉందని ప్రచారం జరిగింది. ఆ విషయం రేవంత్ తల్లిదండ్రులకి ధైర్యాన్నిచ్చింది. దాంతో అతన్ని చెట్లమందు వైద్యానికి తీసుకువెళ్లారు.

అక్కడ వైద్యం చేసే విధానం చాలా మొరటుగా విలవిలలాడిస్తుంది. పడుకోబెడతారు. మామూలు వారి కాళ్ళకి పోలియో వ్యాధికి గురయినవారి కాళ్ళకి తేడా ఉంటుంది. వొంకరగా బలహీనంగా వున్న కాళ్ళని సీదాగా బలంగా చెయ్యాలని ఆ చిన్నవాడి కాళ్ళమీద కూర్చోడం నిలబడడం చేసి రేవంత్‌ని గిలగిలలాడించాడు నాటు వైద్యుడు. కాళ్ళని బలవంతంగా లేపి డబ్బుమని కింద పడెయ్యడం, కాళ్ళ వంకర తీయించాలని గోడకి కూర్చుని రేవంత్ మోకాళ్ళమీద కాళ్ళు పెట్టి ఆ బరువు పెట్టడం ద్వారా కాళ్ళని వొంకరలేకుండా చెయ్యాలని చూసాడు. పాదం వేళ్ళు వెనక్కి తిప్పి మసాజ్ చేసాడు. కడుపుకి చెట్ల మందులిస్తూనే, మోకాళ్ళ మీద నూనె రాసి పెద్ద పెద్దవాళ్ళు తొక్కడం లాంటి భయంకరమైన చర్యల వల్ల వుక్కిరిబిక్కిరిగా వుంది. హృదయవిదారకంగా ఏడ్చినా వదిలింది లేదు. పిల్లాడికి కడుపులోకి ఉప్పు, కారంపొడి కలిపిన ఏదో ఆహారాన్ని ఇచ్చాడు. దాంతో కాలికి వున్న బలం కూడా బలహీనపడింది.

ఏడవ తరగతి చదువుతుండగా దెబ్బ తగిలి చెవిలో కర్ణభేరికి రంధ్రం ఏర్పడింది. దాంతో అటువైపు వినికిడి తగ్గింది. సర్జరీ చెయ్యడం కష్టం అని వైద్యులు చెప్పడంతో అది అలాగే ఉండిపోయింది.

ఎనిమిదవ తరగతి చదువుతుండగా ఇంటికి కొత్త టీవీ వచ్చింది. దాంతో రేవంత్‌కి ప్రాణం లేచి వచ్చినట్లయ్యింది.

ప్రముఖ గాయని ఎస్ జానకి పాటలు, ఇంటర్వ్యూ చూసే ఆవకాశం రేవంత్‌కి కలిగింది. మొట్టమొదటిసారి ‘స్వరాభిషేకం’ అడ్వర్టైజ్‌మెంట్ ప్రోమోలో చూసినప్పుడు సంతోషంతో మనసు ఉప్పొంగింది. ఆమెని చూడాలి మాట్లాడాలన్న తహతహ కలిగింది.

జానకమ్మ అడ్రస్ కోసం గూగుల్ సెర్చ్ చేసాడు. శరవణన్, బద్రీనాథ్ అనే ఇద్దరు ఆమెని కలిసేందుకు తోడ్పడ్డారు. రెండువేల పద్నాలుగులో జానకమ్మతో ఫోన్లో మాట్లాడే అవకాశం లభించింది. ఆ రోజు రేవంత్‌కి సుదినం.

రెండువేల పదిహేనులో జానకమ్మని చూసి మాట్లాడిన మధురానుభూతి రేవంత్‌కి వుంది. రెండువేల పంతొమ్మిదిలో వాళ్ళ ఇంటికి వెళ్లి జానకమ్మని కలవడం వెయ్యి ఏనుగుల బలం ఇచ్చింది రేవంత్‌కి. ఆమెతో వున్నా ఫోటోలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంవల్ల అతనికి విభిన్నమైన గుర్తింపు ఆ చిన్న వయసులో వచ్చింది.

ఇరుగు పొరుగుల మాటలు నిత్యం రేవంత్‌ని బాధించడం మామూలుగా మారింది.

“మీ అమ్మానాన్నని చూసుకోవలసిన మగపిల్లాడివి నువ్వు. కానీ నీ పరిస్థితి ఇలా అయ్యింది. వాళ్ళే నిన్ను చూసుకుని తీరాలి” అని ఒకరంటే, “పూర్వ జన్మలో ఏమి పాపం చేశారో మీ అమ్మా నాన్నా, అందుకే అనుభవిస్తున్నారు” అని మరొకరు. ఇలా ఎందరో ఎన్నో అనడం రేవంత్ చూస్తూ ఇబ్బందికి గురిఅవుతూ ఎదిగాడు.

“మీ అమ్మానాన్నల తర్వాత నిన్ను చూసేదెవరు” అని అడిగిన సంఘటనలూ వున్నాయి. అవన్నీ నిత్యం రేవంత్‌ని బాధిస్తూనే ఉంటాయి.

తొంభై శాతానికి పైగా వచ్చిన పర్‍సెంటేజితో పదవతరగతి పాసవ్వడం వెయ్యి ఏనుగుల బలం ఇచ్చింది.

తెలంగాణ జిల్లా రంజోల్‌లో ‘డిప్లొమా ఇన్ ఇఇఇ’ లో చేరాడు. హాస్టల్‌కి ఆటోలో తమ వూరినుండి అమ్మతో బయలుదేరివెళ్లిన రేవంత్ కాలేజీకి చెప్పులతో చేతులు పట్టి నడిచి వెళ్ళాడు. మర్నాటినుండి మిత్రులే ఎత్తుకుని కాలేజీకి హాస్టల్ నుండి తీసుకువెళ్ళసాగారు.

రేవంత్ వాళ్ళతో వారం రోజులపాటు వుండి తిరుగుముఖం పట్టింది అతని తల్లి. అతనికి మూడుచక్రాల సైకిల్ వున్నమాట నిజమే కానీ దాన్లో ఇతను కూర్చున్నా వెనకనుండి బలంగా నెట్టుకుపోవాలి. అది కష్టం. దానికంటే రేవంత్‌ని ఎత్తుకుని వెళ్లడమే సులభమనిపించింది అతని మిత్రులకి.

కలలూ కోర్కెలూ ఆశలూ ఆశయాలూ వున్నంత మాత్రాన తనలాంటి వారికి అవి తీరడం సులభం కాదనిపించింది రేవంత్‌కి. ప్రాక్టికల్స్ ఉంటాయి. డ్రాయింగ్ లేయాలి. పెన్సిల్ సాయంతో అంతా పెర్ఫెక్ట్‌గా ఉండాలి. థియరీలో పాస్ అయినా ప్రాక్టికల్ వర్క్ తనకి కష్టం అని నిర్ణయించుకున్నాడు

రూమ్ అద్దెకి ఇఛ్చిన ఇంటాయన దగ్గరికి వెళ్లి తన కష్టం వెళ్లబోసుకున్నాడు. “మిత్రులుంటారు కానీ నేను ఖాళీ చేసి వెళ్ళిపోతాను” అన్నాడు.

“అదేంటి?” అని నోరు వెళ్ళబెట్టాడాయన.

“ఎలక్ట్రికల్ సబ్జెక్టు మాలాంటి వారికి కష్టం సర్” అన్నాడు.

“అమ్మాయిలు కూడా ఊరుదాటి హాస్టల్ లేకపోతే గది అద్దెకి తీసుకుని కష్టపడి డిప్లొమా చేస్తుంటే అబ్బాయివి నీకు భయమేంటి?” అడిగాడు,.

“నా శరీరం సహకరించదని తెలియక చేరానండీ”

“కసిని నీ మీద నువ్వే పెంచుకో. ఆ కసితో కానివన్నీ కాగలిగేలా చేసుకో” అన్నాడు.

“నీకు వయసు వుంది, మంచి తెలివి వుంది, కష్టించే తత్త్వం వుంది. లేనివి కాళ్ళేగా. నీ కలలు సాకారం చేసుకునేందుకు చేతుల సాయం బాగా తీసుకో” అన్నాడు.

ఇంటిముందు గదిలో అద్దెకి ఉంటున్న అమ్మాయిలని ఆయన పిలిపించాడు.

“మీరైనా రేవంత్‌కి ధైర్యం చెప్పండి” అన్నాడు.

“చెయ్యగలనూ అనుకో రేవంత్ చేసి తీరతావు” అని చెప్పారు.

నవ్వాడు విరక్తిగా రేవంత్. ‘చెప్పడం ఎవ్వరికైనా తేలికే. చెయ్యడమే కష్టం’ అన్న భావాన్ని వ్యక్తం చేసింది అతని ఆ నవ్వు.

“నేను నీకు డ్రాయింగ్స్ కొన్ని చేసి పెడతాను, ధైర్యంగా వుండు” అంది ఒక అమ్మాయి.

రేవంత్ కళ్ళల్లోకి కొద్దిగా ఆశావాదం వొచ్చింది.

“థాంక్స్. కానీ నువ్వు కొన్ని చేసినా చాలదు. చాలా వర్క్ ఉంటుంది కదా” అన్నాడు.

“కుర్చీలో కూర్చుని టేబుల్ మీద డ్రాయింగ్ చెయ్యలేను… అన్ని ఇక్కడ మంచి మనసుతో నువ్వు వేసి ఇచ్చినా పరీక్షలో కుర్చీలో కూర్చుని వెయ్యలేను” అన్నాడు.

“… …..”

“నా వెన్నెముక చాలా బలహీనం, వెన్నెముక కింద కుడివైపు బరువుని ఆన్చుతాను. కష్టపడి కూర్చున్నా అక్కడ నెప్పిగా ఉంటుంది.”

“నువ్వు కింద కూర్చో. నేను డ్రాయింగ్ బోర్డు తెచ్చి ఇస్తాను. అక్కడ కూర్చుని బొమ్మలు వెయ్యచ్చు, రాయచ్చూ. పరీక్షల ముందే ఈ విషయం మీద పర్మిషన్ తీసుకుందాం” అంది ఇంకొక అమ్మాయి.

వాళ్లంతా రిక్వెస్ట్ లెటర్ పెట్టి కింద కూర్చునే రేవంత్ పరీక్ష రాసేలా చూసారు.

మొదటి సంవత్సరంలో వెయ్యికి ఎనిమిది వందల తొంభై ఎనిమిది మార్కులతో కాలేజీ టాపర్ అయ్యాడు రేవంత్. రెండవ సంవత్సరంలో వెయ్యికి తొమ్మిదివందల ఇరవైనాలుగు మార్కులొచ్చి ప్రథములలో ప్రథముడిగా ఉత్తీర్ణుడయ్యాడు.

ఓపెన్ యూనివెర్సిటీనుండి డిగ్రీ చేసి ఎమ్మేలో ఎనభై రెండుశాతం మార్కులు తెచ్చుకుని అందరి అభినందనలూ అందుకున్నాడు రేవంత్.

‘వింజమూరి నర్సింహులు జీవితం సాహిత్యం’ మీద డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి దగ్గర పీహెచ్‌డి చేస్తున్నాడు.

“మీకు ధైర్యాన్ని మీమీద నమ్మకాన్ని పెంచిన సంఘటనని ఆఖరుగా మాతో పంచుకోండి” అన్న ప్రశ్న అతన్ని ఒక నిముషం ఆలోచింప చేసింది.

“వీల్ చైర్లో కూర్చుని బటన్ సాయంతో దాన్ని నడపడం చాలా థ్రిల్ కలిగించింది. కలెక్టరుగారి చేతుల మీదుగా అప్లై చేసిన మూడునెలలకే దాన్ని పొందడం నాకు ఆనందం, ధైర్యం ఆత్మవిశ్వాసం కలిగించిన విషయం” అన్నాడు.

“నేను మీ ద్వారా కొందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తానండీ” అన్నాడు రేవంత్.

“నా భుజం చరిచిన ఇంటి ఓనర్ అంకుల్, స్రవంతి, ప్రతిభల ప్రోత్సాహం, నన్ను ఎత్తుకుని కాలేజీకి తీసుకువెళ్లిన మిత్రుల సహకారం, నా మూడు చక్రాల బండిని సైతం ముందుకు లాగిన రమణ సర్, ‘ఏ అనారోగ్యం వచ్చినా లీడ్ నీదే. నీ జ్వరం, దగ్గు, జలుబు నిన్ను వెనక్కి లాగలేవు’ అని భరోసా ఇఛ్చిన రాజ్‌కుమార్ సార్లు నా విజయానికి వెనక వున్నవారు.

చంద్రబాబు, చిదానందం, శరత్ చంద్ర, సంధ్య, మంజులా కులకర్ణి, కామేశ్వర్, తెలుగు టీచర్ వినోద, పవర్ వీల్ చైర్ కోసం కలెక్టర్‌కి వినతిపత్రం రాసిన రవి – అందరికి సంచిక ఆన్‌లైన్ పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

అమ్మా, నాన్నా, అక్కల గురించయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వాళ్ళు నా బలం, బలహీనత” అన్నాడు రేవంత్.

ఉన్నత విద్యావంతుడు రేవంత్ మరిన్నఉన్నత శిఖరాలను అధిరోహించాలని అందరం ఆశిద్దాం.

”Disability is not inability.”

”If there is a wheel there is a way.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here