డాక్టర్ అభిజ్ఞ

0
10

పేద వాళ్ళని ఆదుకుని పెద్ద వాళ్ళకు పుణ్యమిస్తోంది అంటారు కొందరు. ఏది ఏమైనా ఆమెకు ఉన్నతమైన కీర్తి ఉంది.

సూర్యోదయం ఎప్పుడు అందంగానే ఉంటుంది కానీ దాన్ని ఆస్వాదించే వాళ్ళు ఎంత మంది?

ఏసీలో ఉండి రగ్గు లోంచి బయటకు చూస్తూ అభిజ్ఞ “మమ్మీ.. కాఫీ అయిందా?” అంది.

వేడి.. కాఫీ తాగితే గాని మత్తు వదలదు. రాత్రి 2 గంటల వరకు చదువుకుంది. ఎమ్మెస్ పరీక్షలకి ప్రిపేర్ అవుతోంది. మణిపాల్ హాస్టల్ నుంచి వచ్చింది.

అత్తగారు డాక్టర్. మామగారు డాక్టర్. ఆడపడుచు డాక్టర్. మరిది డాక్టర్. ఇంక తను ఎమ్మెస్ చేసి FRCS చెయ్యాలని అత్తగారి కోరిక.

***

“ఏమిటి? అయిన పిల్ల అని సంబంధం చెప్పగానే మెడిసిన్‌లో ఉండగా మీ నాన్న పట్టు బట్టి చేశాడు. లేకపోతే అప్పుడే చెయ్యను, నా ఫ్రెండ్ కూతురు ఎఫ్.ఆర్.సీ.ఎస్ లండన్ రెడీగా ఉంది. ఆమెను కాదని అయిన పిల్ల అని మంచంలో మంచం కంచంలో కంచం అని చేసుకున్నాను. కట్నాలు కానుకలు కాదు, పొలాలు స్థలాలు కాదు నాకు కావలసింది. నా కుటుంబానికి తగిన కోడలు. మేమంతా డాక్టర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్‌లం కనుక నువ్వు పిల్లని చదివిస్తేనే పెళ్లి” అని మాట్లాడింది డాక్టరు జగదాంబ. ఆవిడ హాస్పిటల్ సూపరిండెంట్. కాలేజ్‌లో ప్రొఫెసర్. రెండు పదవులు సమర్థవంతంగా చేస్తుంది.

పిల్లలను బాగా చదివించింది. కూతురును అన్న కొడుకు విజయ్‌కి పెళ్లి చేసి కెనడా పంపింది. రెండో కొడుకు డాక్టర్ చదువుతున్నాడు. 

డాక్టర్ జగదాంబకి బాగా పేరు వచ్చింది. బంధువులు దగ్గర డబ్బు పుచ్చుకోదు. లేని వాళ్ళకు ఊరికే పురుడు పోసి పాత చీరలు, పచ్చడులు పెడుతుంది. దయ దాక్షిణ్యాలు ఉన్నాయి.

అదే ధనవంతుల దగ్గర బిల్లు గట్టిగా వేస్తుందని వినికిడి. పోనీలే ఇది అభిజ్ఞ విషయం. జగదాంబ ఆ మాత్రం స్ట్రిక్ట్ లేందే కోడలు చదువుకోదు అని తెల్సు. ఎంతసేపు అభిజ్ఞ తల్లి తండ్రి లెక్చరర్స్ అయినా, పిల్లకి రెండు పురుళ్లు పోసి ఎప్పుడు మనమల్ని ఎత్తుదామా అన్న ధోరణి. కారణం ఈ రోజుల్లో అసలు పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు ఒన్ ఆర్ నన్ ఉంటూ పిల్లలను కనకుండా కెరియర్‌కే అంకిత మయ్యారు.

ఇప్పుడు మగవాడికి ఆడపిల్ల ఎక్కడ దొరకడం లేదు. ఒక ప్రక్క ఆడపిల్ల వద్దు అంటూ అత్తింటి ఆరళ్లు పెరిగిపోయి పిల్లలు ఇప్పుడు ఎక్కడా దొరకడం లేదు. అపురూపంగా ఉన్నారు. అందుకని అభిజ్ఞ తల్లి తండ్రి కంగారు పడుతున్నారు.

డాక్టర్ జగదాంబని ఎవరైనా “నానమ్మ ఎప్పుడు అవుతారు?” అంటే, “ఆఁ, అది ఎంత సేపు? మా కోడలు పెద్ద చదువు చదువుకోవాలి. అప్పుడే పిల్లలు. మేమంతా డాక్టర్స్” అని నవ్వుతుంది.

***

అభీజ్ఞ తల్లి “రా కాఫీ రెడీ” అని పిలిచింది. ‘ఏమిటో పిల్లకి పెళ్లి చేశాను తొందరపడి, చదువు పూర్తి అయ్యాక చెయ్యాల్సింది’ అనుకుంటుంది.

ఓ పండుగ పబ్బం, ఏమి ఆనందం లేదు. ఎంత సేపు చదువు అంటుంది. అల్లుడిని పంపమన్నా పంపదు. మీ యిద్దరూ రండి అంతా కల్సి ఇక్కడే పండుగ చేసుకుందాము అంటుంది.

నువ్వు పిల్లకి పొలాలు ఇవ్వడం కాదు ఒక మంచి పీ.జీ.ఇవ్వాలి. అప్పుడే దానికి విలువ అంటుంది. అల్లుడిని పంపమని అడిగితే “వాడికి అక్కడ తోచదు. వాడు పెద్ద పొజిషన్లో ఉన్నాడు. నంబర్ వన్ తెలుసా?” అంటుంది

ఇదేమి మనిషి అనుకుంటారు అంతా.

చదువుకి అంత అనంతమైన విలువనిస్తు ఉంటారు కొందరు అన్నారు. కోడలు కుటుంబ కీర్తిని పెంచాలి, పంచాలి. అందుకే ఆమె కోడలు విషయంలో చదువుకోవాలని పట్టుపట్టింది.

మెడిసిన్ కాగానే సారెలు చీరలు పెట్టీ ఘనంగా పంపాలని ఆశ పడ్డారు. కానీ ఎమ్మెస్ కోచింగ్‌కి పంపండి అని ఆర్డర్ వేసింది అత్తగారు.

చేసేది ఏముంది తప్పదుగా మరి. ఎంట్రెన్స్ రాసింది. పాసయ్యి ఎమ్మెస్‍లో చేరి పరీక్షలకు వచ్చింది.

కొడుకు శ్రీనివాస చరణ్ తల్లి ఎంత చెపితే అంత. భర్త కూడ జగదాంబ మాటకు విశ్వాసమిస్తాడు. కారణం అమే ఏ పని అయినా పద్ధతిగా చేస్తుంది. అందుకే బంధువులలో కూడా ఆమె అంటే చాలా ఇష్టం అంటారు

అభి జీవితం దాని చదువుపై ఆధారపడి ఉంది అని ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. విద్య మనిషికి ఎంతో విలువను ఇస్తుంది, అందులో డాక్టర్ చదువు ఎంత మందికో ప్రాణాన్ని నిలుపుతుంది. మంచిగా చదవాలి అని జగదాంబ కోడలికి ఆనందపరచే విషయాలు చెపుతుంది. జీవితంలో చదువుకొనే దశలో ఆటగా గాక జీవితాన్ని సీరియస్‌గా తీసుకుని విద్యని అభ్యసించాలి. అప్పుడే ఆ నాలుగు ఏళ్ళ కష్టపడితే జీవితమంతా ఆనందం సొంతమవుతుంది కదా అంటుంది. అది నిజమేగా మరి.

అభి పుట్టింట్లో జాగ్రత్తగా రాత్రుళ్ళు చదువుతుంది. ఇంట్లో టీవీ పెట్టరాదు, ఒక్క న్యూస్ మాత్రం వినవచ్చును, చూడవచ్చును. 

ఇంటికి ఎవరైనా వచ్చినా అభి వచ్చి మాట్లాడకూడదు. ఊరికే చిరునవ్వు నవ్వి వెళ్లిపోవాలి.  అత్తింటి విషయాలు అసలు మాట్లాడకూడదు. కొంతమంది అమ్మలక్కలు ఇంటికి వచ్చినప్పుడు “మీ అమ్మాయి పెళ్ళి మా అమ్మాయి పెళ్లి ఒక్కసారే అయింది. దానికి ఇద్దరు పిల్లలు మీ అమ్మాయి ఏమిటి, ఇంకా చదువుకుంటుంది” అంటారు. అసలు అల్లుడు పండక్కి వచ్చిన జాడ లేదు అని వ్యంగ్యంగా అంటారు.

అందుకు అభి బాధపడుతుందని అత్తగారు పెద్దగా మాట్లాడవద్దు అంటుంది.

హై క్లాస్ కుటుంబాల పద్ధతి వేరు. చదువు, ఎదుగుదల వీటికి ప్రాముఖ్యత నిస్తారు. అందుకే వారు సంఘంలో ఒక స్థాయి కోరుకుంటారు. ఆ స్థితి రావాలంటే విద్య, ఉద్యోగం, డబ్బు, పరపతి తెచ్చుకోవాలి. ఇవన్నీ కావాలంటే విద్య ముఖ్య పునాది. కొందరు జీవితాల్లో విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. కొందరు సంపాదనకు ప్రాధాన్యత నిస్తారు. ఏదైనా అందుకోవడమే చాలా కష్టం. జగదాంబ రోజు ఉదయం కోడలితో మాట్లాడుతుంది. “నువ్వు బాదం పాలు తాగి, దానిమ్మ రసం తాగు” అని చెపుతుంది. “మీ అమ్మ కాలేజీ పనిలో మర్చిపోతుంది, అందుకని చక్కగా నువ్వు గుర్తు చెయ్యి. లేకపోతే నువ్వు కలుపుకుని తాగు” అని చెప్పేది. కోడలు కష్టపడకూడదని అవసరం అయిన వస్తువులు పంపేది. హెల్త్ ఈస్ వెల్త్ అంటూ ఉండేది. కోడల్ని కంటికి రెప్పలా చూసుకునేది.

***

జగదాంబ గతంలోకి వెళ్లి ఆలోచిస్తూ ఉంది.

మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా పెళ్లి చేశారు. అప్పటికి రావు మెడిసినయి వాళ్ళ ఊళ్ళో ప్రాక్టీస్ చేస్తున్నాడు. మెడిసిన్ చదివిన జగదాంబ అయితే చేదోడు వాదోడుగా ఉంటుందని భావించాడు.

కానీ తన బామ్మ పెళ్లి తరువాత చదువు ఆపెయ్యమన్నది. అదెలా ఇంకా పరీక్షలు కాలేదు అని తను అంటే పిల్లని అత్తింటికి సారెతో పంపాలని అన్నది. అయ్యో ఇంత కష్టపడి చదువుకుంది, పరీక్షలు రాయకపోతే ఎలా అన్న రావు మాటలు వినలేదు.

అత్తింటికి వచ్చింది. అక్కడ అత్త వారి మెప్పు పొందాలని, ముఖ్యంగా బామ్మగారికి నచ్చినట్లు ఉండాలి. పంజాబీ డ్రెస్లు వేసుకోకూడదు. నైటీ వేసుకుని కనబడ కూడదు. పల్చని చీరలు కట్టుకోకూడదు. ఇది ఆమె రూల్స్. ఓకే అన్నది. మెడిసిన్ పుస్తకాలు పుట్టింట్లో వదిలి వచ్చింది. మళ్లీ పుట్టింటికి వెళ్ళనివ్వలేదు.

సాయంత్రం రావు తొమ్మిదింటికి వచ్చేవాడు. అతని కోసం ఆ యింట్లో ఎవరు ఎదురుచూడరు. తాను తిన్నగా వెళ్లి మజ్జిగ తాగి పడుకుంటాడు. రాత్రి సరైన ఆహారం ఉండేది కాదు. రావు హాస్పిటల్ దగ్గర చపాతీ తిని వస్తుండేవాడు. పెళ్ళానికి తెస్తే ఆ ఇంట్లో పెద్ద రాద్దాంతమే అనుకుంది.

ఎలాగో పరీక్షల టైం కి రావు పుట్టింటికి పంపాడు. హతొస్మి అనుకుంటూ వెళ్ళింది.

అక్కడి తిండికి మనిషి నీరసించి పోయింది. మాటలు మనసుకు బాధ నిచ్చాయి. సబ్జెక్టు అంతా మరచి పోయింది. కానీ పట్టుదలగా పాస్ అయితే చాలు అనుకుంది.

పట్టుదలగా చదివి పరీక్షలు రాసింది. ఆఖరు పరీక్ష రోజు రావు వచ్చి ప్రొఫెసర్స్‌తో మాట్లాడి వచ్చాడు.

ఆ మర్నాడే అత్తింటికి ప్రయాణం అయింది.

అతని సంపాదన కావాలి. జగదాంబ రావు వచ్చే వరకు ఉంటానంటే “పాతివ్రత్యం ఏమి అక్కరలేదు, నువ్వు తిను” అనేవారు. వారి ప్రవర్తన చాలా ఇబ్బంది గానే ఉండేది. అన్నం దగ్గరికి వచ్చాక రాత్రి పూట ఎప్పుడు కూర ఉండేది కాదు. మరిదికి కూర, అడబడుచుకు పులుసు ఉంచమనేది అత్తగారు. ఇంక ఊరగాయ, మజ్జిగ వేసుకుని తిని సరిపెట్టుకుంది.. భర్త ఇవేమీ పట్టిచుకునేవాడు కాదు. నెలకి తల్లికి ఓ పదిహేను వేలు ఇచ్చేవాడు. ఆమె ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టేది. తన వాళ్లు ఊర్లోనే ఉన్నారు. వాళ్లకి వండిన కూరలు, పిండివంటలు పంపేది.. కోడలు సంగతి అనవసరం అనేది.

బామ్మగారికి ఎప్పుడు మునిమనమడిని చూసి తరించాలనీ, బంగారు ఉగ్గు గిన్నెతో పాలు పట్టలని కోరిక. “నా కోరిక తీర్చరా, ఒరే మీ తాత పుట్టాలి రా” అనేది.

సారె చీర, చలిమిడి, మిఠాయి కాజ పెట్టీ పసుపు కుంకం పిండి పెట్టీ ‘మళ్లీ పురిటికి రావాలని’ అక్షింతలు వేసి దీవించి పంపారు.

బామ్మ సారె చూసి నవ్వి “మీ అమ్మ ఈ సారి బొమ్మ సారె పెట్టి పంపాలి” అని స్వీట్ తీసుకుని తిన్నది. ఆ ఇంట్లో ఎవరికీ చదువు విలువ, కళల విలువ తెలియదు. ఎంత సేపు వండుకోవడం తినడమే.

బామ్మ కోరిక తీరింది.. జగదాంబ పరీక్ష పాసయినా, ఎవరికి ఆనందం లేదు. “ఇంక రేపటి నుంచి మొగుడుతో కల్సి హాస్పిటల్‌కి వెళ్లి పోతుంది, ఇంటిపనులు పక్కన పడేసి” అని నిష్ఠూరంగా మాట్లాడేవారు. అటువంటి వ్యతిరేక పరిస్థితిలో శ్రీనివాస్ పుట్టాడు. బామ్మ బంగారు ఉగ్గు గిన్నెలో పాలు పట్టింది, ఆవిడ కోరిక తీరింది.

ప్రభుత్వ పోస్టులకు అప్లై చేసి ఇద్దరు పోస్టులు తెచ్చుకుని ఆ మాయాజాలం నుంచి బయటపడ్డారు.

కాలక్రమంలో ఆడపిల్లనీ, పిల్లాడిని కన్నారు. రావు తమ్ముడు పల్లెలో తల్లి, తండ్రి, పెళ్లికాని అక్కని చూస్తూ వ్యవసాయం చేస్తున్నాడు. జగదాంబ వాళ్ళు విశాఖలో సెటిలయ్యారు.

పండుగ పబ్బలకి వెడతారు, అంతే. అత్తింటిలో తనలా కోడలు బాధలు పడకూడదు అన్నదే జగదాంబ ధ్యేయం. అది అర్థం చేసుకున్న వారు తక్కువ. కాని ఆమె కోడల్ని సుఖపెట్టడం కోసం ఇలా ప్రవర్తించింది అని తెలుసుకున్న వాళ్ళు సంతోషపడ్డారు.

***

సెల్ ఫోన్ రింగ్‌తో జగదాంబ ఆలోచన లోంచి బయటకు వచ్చింది. అభిజ్ఞ ఫోన్. ఏదో డౌట్ కోసం చేసి అడిగింది.

జగదాంబ సంతోషంగా సబ్జెక్టు చెప్పింది. రెండేళ్ళలో అన్ని చదువులు పూర్తి అయ్యాయి. లండన్ చదువు కూడా పూర్తి చేసింది.

అభిజ్ఞ సంపూర్ణ విద్యావంతురాలిగా సారె చీరతో అంత్తింట అడుగు పెట్టింది. గుమ్మంలో కారు దిగేటప్పటికి అబిజ్ఞ, ఎఫ్.ఆర్.సి.ఎస్, లండన్ అన్న నేమ్‌ప్లేట్‌పై బంగారు అక్షరాలు. ఆకుపచ్చ రంగు ప్లేట్‌పై మెరుస్తున్నాయి.

ఆ ఇంటి గోడపై తన భర్త పేరు కింద తన పేరు మెరుస్తూ స్వాగతం పలికింది.

అంతకంటే స్త్రీకి ఇంక ఆనందమేమున్నది? జగదాంబ స్వీట్ ప్యాకెట్ ఓపెన్ చేసి కోడలు నోట్లో స్వీట్ ముక్క పెట్టింది.

“తొందరలో ఈ ఇంట బుల్లి డాక్టర్ రావాలి. నేను ఎలాగూ రిటైర్ అయిపోతాను. మీరిద్దరూ హాస్పిటల్ చూసుకోండి. పిల్లల్ని మేము చూస్తాము. సాయంత్రం హాస్పటల్‌లో సీనియర్ సిటిజన్స్‌కి ఫ్రీగా చూస్తాము అని బోర్డ్ పెట్టాము” అని చెప్తున్న అత్తగారి ఉన్నత భావాలకి అభిజ్ఞ, ఆమె తల్లి తండ్రులు ఎంతో ఆనందపడ్డారు, ఆశ్చర్యపడ్డారు.

ఎంత చదువుకున్నా తన కుటుంబం ఉన్నతి కోసం స్త్రీ ఎంతో ఆలోచించి అడుగు వేస్తుంది. విద్యావంతులైన ఎందరో మహిళలు, ఉన్నత చదువులు పదవులు ఉన్న స్త్రీలు ఉండబట్టే సమాజంలో కుటుంబ వ్యవస్థ ఉన్నతిలో ఉన్నది. అందుకే భారతీయ సంప్రదాయం ఎందరికో ఆదర్శం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here