డాక్టర్ ఆనంద్

0
11

[dropcap]అ[/dropcap]ది గోధూళి వేళ. మేత కోసం పొద్దుననగా పొలానికి వెళ్ళిన పశువులు ఇల్లు చేరుకుంటున్నాయి. అప్పటి వరకు తన వెలుగుతో లోకాన్ని సంరక్షించిన సూరీడు పడమటి కొండల చాటుకు చేరుకున్నాడు. పక్షులు రెక్కలు చాచుకుని గూళ్ళు చేరాలని తొందపడతున్నాయి. ‘ఈ ఊళ్ళోకి నేను రావడమే గొప్ప’ అన్నట్లు పెద్దగా హారన్ మ్రోగించుకుంటూ బస్సు వచ్చి ఆగింది. కూరగాయల గంపలు, పండ్లబుట్టలు, కోళ్ళగంపలు అన్నీ దిగుతాయి ఆ బస్సులోంచే. ముందుగా బడ్డీ కొట్లో పిల్లల కోసం గొట్టాలు, జీడీలు, బొరుగుముద్దలు అమ్ముకునే ఆదెమ్మ సరుకు దింపుకుంది. బడి దగ్గర రేగిపండ్లు, జామపండ్లు, కలేపండ్ల అమ్ముకునే పకీరమ్మ పండ్ల గంప ముందుకు జరిపింది.

“దిగు, దిగు ఈ బస్సు నీ సొంత మనుకున్నావా? నువ్వు దిగే లోపు బస్సు పక్కూరుకెళ్ళి పోద్దీ” అంటూ అరిచింది ఆదెమ్మను.

వాళ్ళిద్దరికి వ్యాపారంలో పోటీ. రోజూ గొడవ పడుతూ ఉంటారు. బస్టాండు దగ్గర సోడాలు అమ్ముకునే వెంకటేశం ఆ బస్సులోనే సోడాల కోసం గ్యాస్ తెచ్చుకుంటాడు.

“మీ గోల రోజూ ఉండేదే, తొందరగా దిగండహె” అరిచాడు వెంకటేశం. ఉదయం బస్సులో దగ్గరలోని బస్తీకి పోయి, కావలసినవి కొనుక్కుని సాయంత్రం బస్సుకి తిరిగి నాగులారం చేరుకుంటారు వాళ్ళంతా. అందరు దిగిపోవడంతో బస్సు తిరునాళ్ళ మర్నాటి తీర్థంలా అనిపించింది. అప్పటి వరకు బడ్డీ కొట్టు అరుగు మీద టీ తాగి రిలాక్స్ అయిన డ్రైవరు, కండక్టరు తిరిగి బస్సెక్కారు. ఇదంతా గమనిస్తున్న నేను అందరికంటే చివర నా బ్యాగ్ తీసుకుని బస్సు దిగాను. ఆ చుట్టు ప్రక్కల ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు నాకేసి ‘ఓ వింత జీవి’ని చూస్తున్నట్లుగా. జండా చెట్టు కింద తలగుడ్డచుట్టుకుని, చుట్ట తాగుతూ, పచ్చీసు ఆడుతున్న నలుగురు నన్ను చూడగానే ఆట ఆపేసి లేచి నిలబడ్డారు. విచిత్రంగా నా వైపు చూస్తూ నా దగ్గరికొచ్చారు. బహుశా నా లాంటి వ్యక్తి ఎప్పుడు ఆ ఊళ్ళో బస్సు దిగలేదనుకుంటా.

ఇంతలో వెంకటేశం “సోడా కావాలా సార్, సోడా సార్” అంటూ వచ్చాడు.

“నాకు సోడా వద్దు కానీ, సుబ్బారాయుడి గారిల్లు ఎక్కడ?” అడిగాను వెంకటేశాన్ని.

“ఏమో నాకు తెలీదు, వాళ్ళని అడుగు” అంటూ తప్పుకున్నాడు.

ఇంతలో చెట్టు క్రింద కూర్చున్న నలుగురిలో ఒకాయన ముందుకొచ్చి, “సుబ్బారాయుడి గారిల్లా, బారుగా పోయి కుడివైపు గొందిలోకి తిరుగు. అక్కడ రాములవారి గుడి పక్క గొందిలో వేపచెట్టు ఎదురిల్లే” అని చెప్పాడు.

“ఆయన నీకేవవుతాడు” అడిగాడా వ్యక్తి.

“మా తాతగారులెండి” అన్నాను.

“ఆమెరికాలో ఉన్న కిషోర్ బాబు కొడుకువా” అడిగాడాయన.

అవునన్నాను.

“నీ పేరేంది?” అడిగాడాయన.

“ఆనంద్” అని జవాబిచ్చాను.

“సక్కంగపో, అక్కడే సుబ్బారాయుడి ఇల్లు” అన్నాడు ఇంకొక అతను.

“ఎల్లి సూపిచ్చి రారాదు” అన్నది బడ్డీకొట్టు సూరమ్మ.

“వద్దు, నే వెళ్తాలెండి” అంటూ బయలుదేరాను.

ఇంతలో ఒకాయన బస్సు దగ్గరికి పరుగెత్తుకొచ్చాడు. “డ్రైవర్ బాబు, డ్రైవర్ బాబు, బస్సు పట్నానికి పోనియ్యరా. పొద్దుటి నుండి అమ్మాయికి పురిటి నొప్పులు వస్తున్నాయి. శానా బాధపడతంది. బస్సు ఎనక్కి తిప్పండి బాబు” అన్నాడు ప్రాధేయపడుతూ.

“ఏమయింది వెంకటసామీ?” అడిగాడు ఒకతను.

“అమ్మాయి పురిటి నొప్పులతో బాధపడుతుందన్నా. బస్తీకి పోతే మంచిదంది మంత్రసాని. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు” అన్నాడు వెంకటస్వామి. అతడి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.

“బస్సు పైకి పోయ్యిరావాల” అంటు డ్రైవరు బస్సు మందుకు కదిలించాడు.

జనమంతా రోడ్ల మీద నడక మానేసి, అంతరిక్షం వైపు పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో, ఇలాంటివి ఎదురవడం చాలా ఆశ్చర్యం. ‘ఇలాంటి ఊళ్ళో తాతయ్య వాళ్ళు ఎలా ఉంటున్నారు?’ అనుకుంటు ముందుకు కదిలాను. వాళ్ళు చెప్పిన గుర్తుల ప్రకారం వెళ్ళి తలుపు తట్టాను. నానమ్మ వచ్చి తలుపు తీసింది. “ఎవరే ఆదిలక్ష్మీ? ఎవరా వచ్చింది?” అంటూ వచ్చాడు తాతయ్య. నన్ను ఇద్దరూ గుర్తు పట్టలేదు.

“ఎవరు బాబు? ఎవరింటికెళ్ళాలి” అడిగింది నానమ్మ.

“నానమ్మా నేను, తాతయ్యా నేను ఆనంద్‌ని గుర్తు పట్టలా?” అన్నాను. ఒక్కక్షణం నివ్వెరపోయారు. తాతయ్య ముందుగా తేరుకుని, “ఒరెరే నువ్వట్రా ఆనంద్, రా, రా, లోపలికి” అన్నాడు.

“అమెరికా నుంచేనా అయ్యా రావడం, మీ అమ్మా, నాన్న కూడ వచ్చారా? ఏరి?” అడిగింది నానమ్మ.

“లేదు నానమ్మా, వాళ్ళు రాలేదు. నేను మిమల్ని చూసి పోదామని వచ్చాను” అన్నాను.

“మా నాయనే, రా అయ్యా లోపలికి” అన్నది నానమ్మ.

“రా ఇలా కూర్చో” అని నన్ను మంచం మీద కూర్చోబెట్టాడు తాతయ్య.

“మీ అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? నీ చెల్లెలు ఎలా ఉంది? నిన్నెప్పుడో ఇంతప్పుడు చూశాను. అచ్చం మనవాడిలాగే ఉన్నాడు కదూ!”

“అవునే, వాడిని చూస్తున్నట్టే ఉంది” అంటూ ఇద్దరు సంబరపడిపోయారు.

“అన్నట్టు, ఆనందూ నువ్వు డాక్టర్‌వి కదూ! నీ చదువు పూర్తి అయినట్లేనా?” అడిగాడు తాతయ్య.

“అయిపోయింది తాతయ్యా, ఒక పెద్ద హాస్పటల్‌లో నాకు ఉద్యోగం కూడా వచ్చింది. వెళ్ళగానే అక్కడ జాయిన్ అవ్వాలి” అన్నాను.

“ఏమే అబ్బాయికి భోజనం పెట్టేదుందా? లేదా? కబుర్లతో కడుపు నింపుతావా?”

“ అయ్యో అన్నం వండి పెట్టేస్తానయ్యా” అని లేచింది నానమ్మ.

“మనం తినట్టు కూరల్లో గొడ్డుకారం ఎయ్యబాకు. వాళ్ళు కారం ఎక్కువ తినరు” అన్నాడు.

“సరేలే మనవడికి ఇష్టమైనట్లు చేస్తాలే” అంటూ గబగబ వంట మొదలు పెట్టింది. ఇద్దరు కలిసి దగ్గరుండి కొసరి కొసరి తినిపించారు. ఆరుబయట వెన్నెల్లో నాకు పడక ఏర్పాటు చేసి, చెరో ప్రక్క మంచం వేసుకున్నారు. “మీ నాన్నకు గడ్డపెరుగంటే ఎంత ఇష్టమో. తాటి ముంజలంటే ప్రాణమయ్యా. చెరుకు గడలు నోటితో కొరుక్కుని తినేవాడు. నీకు గుర్తుందా? ఓ సారి బడికి పోతుంటే కాలికి రాయి కొట్టుకుని ఎంత రక్తం కారిందో?” ఇలా నాన్న గురించి చాలా పొద్దు పోయేవరకు కబుర్లు చెబుతూ నిద్రపోయారు. చాలా ఏళ్ళ తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాయా ముసలి ప్రాణాలు.

మర్నాడు తెల్లవారేసరికి మా నాన్న చెల్లెలు, నాకు అత్త అవుతుంది, ఆమె వచ్చింది తన కొడుకు సదాశివంతో.

“నువ్వు వచ్చినట్టు నేనే కబురు పెట్టానయ్యా. ఎప్పటి నుండో మిమ్మల్నందరినీ చూడాలని తపించిపోతుంది ఆనందు. అందుకే రమ్మన్నాను” అన్నది నానమ్మ. అత్తయ్య నా ప్రక్కనే కూర్చుని మా కుటుంబం గురించి వివరాలన్నీ అడిగింది. సదాశివం వచ్చిన దగ్గర నుండి మాట్లాడుతూనే ఉన్నాడు.

నేను అడగకుండానే, “నా పేరు సదాశివం బావా, మేము ఈ ప్రక్క ఊళ్ళోనే ఉంటాము. తాతయ్య ఎప్పుడూ మీ గురించి చెప్తూ ఉంటాడు. ఎప్పటి నుండో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాము. అందుకే తెలియగానే అమ్మ, నేను ఉన్నపళాన వచ్చాం బావా” అంటూ నా చెయ్యి పట్టుకుని గలగల మాటాలాడుతున్నాడు.

“ఏంటి తాతయ్య కుంటుతున్నావు? ఏదీ చూడనీ” అంటూ తాతయ్య కాలు ఒళ్ళో పెట్టుకుని జాగ్రత్తగా పరిశీలించాడు. అతని మాటల చాకచక్యానికి, చొరవకు ఆశ్చర్యం వేసింది నాకు. అన్నదమ్ములు లేని నాకు బావా అంటు అతను ఆత్మీయంగా పిలవడం చాలా నచ్చింది.

“బావా అలా ఊళ్ళోకెళ్ళాదాం వస్తావా? మామయ్య చదువుకున్న బడి, మన పొలాలు అన్నీ చూపిస్తాను” అన్నాడు. “అలాగే” అంటూ అతని వెంట బయలుదేరాను.

దార్లో ఒకాయన కనిపించి “ఏం సదాశివం, మీ మామయ్య కొడుకు వచ్చాడటగా, ఇతనేనా?” అడిగాడు.

“అవును మాష్టారు.” అంటూ, “బావా, ఈయన రంగనాధం మాష్టారు” అంటు మా ఇద్దరికీ పరిచయం చేశాడు.

“ఈ స్కూల్లోనే మీ నాన్న, నేను కలిసి చదువుకున్నాం బాబు. ఈ చెట్టు క్రింద గోలీలు, కబడీ ఆడేవాళ్ళం. మీ నాన్నకు ఎప్పుడు అమెరికా వెళ్ళాలని పెద్ద చదువులు చదవాలని కోరికగా ఉండేది. నేను ఇక్కడే టీచర్‌గా స్థిరపడ్డా. మీ నాన్న కాలేజీలో చదువుతూ మీ అమ్మను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. మామగారి ద్వారా అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు” అని చెప్పి ముగించాడు. ఈ ఊరి జ్ఞాపకాలను మీ నాన్న మర్చిపోయాడు అనే భావం ఆయన మౌనంలో నాకు తోచింది. స్కూలంతా ఓ సారి చూసి ఇద్దరము పొలం దారి పట్టాము.

దార్లో సదాశివం చాలా మందిని పలకరించాడు. నమస్కారం తాతయ్యా అంటూ, ఏం బాబయ్ బావున్నావా? ఏం పెద్దమ్మ ఎలా ఉన్నావ్? ఇలా అందరినీ వరుసపెట్టి పిలవడం చూసి ఆశ్చర్యపోయాను. వాళ్ళు కూడ “ఏరా సదాశివం, మీ మామయ్య కొడుకా? అమెరికా నుండి వచ్చాడట కదా!” అంటు నన్ను కూడా పలకరించారు.

నాన్న బాల్యం ఇంతమంది ఆత్మీయుల మధ్య గడిచింది. నాన్న చాలా అదృష్టవంతుడు కదా! అనిపించింది. ఇద్దరం నడుస్తుంటే సదాశివం, “బావా, నువ్వు డాక్టర్‌వట కదా! ఇక్కడే ప్రాక్టీసు పెట్టకూడదు” అన్నాడు.

“అదేంటి ఇక్కడ హాస్పటల్ లేదా?” అడిగాను.

“లేదు బావా, చిన్న జ్వరమొచ్చినా బస్తీకి పోవలసిందే. కొంత మంది దార్లోనే చనిపోతారు. మా నాన్న కూడ వైద్యం అందక చనిపోయాడు. తాతయ్యకు ఓసారి జ్వరం వచ్చింది. బస్తీకి తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేరిస్తేగాని తగ్గలేదు. అమ్మమ్మ చాలా కంగారు పడి మామయ్యకు రమ్మని ఫోన్ చేసింది. కానీ మామయ్య రాలేదు. ఈ చుట్టప్రక్కల ఊళ్ళన్నీ ఇంతే బావా. నువ్వు ఇక్కడ ప్రాక్టీసు పెట్టచ్చుగా బావా” అన్నాడు సడన్‌గా.

“నీలాంటి మంచివాళ్ళు ఇక్కడ ప్రాక్టీసు పెడితే అందరం ఆరోగ్యంగా ఉంటాము బావా. అయినా ఈ పల్లెల్లో మీరేం ఉంటారు? చాలా కష్టం” అన్నాడు.

పెద్ద చదువు చదువుకోకపోయినా అతని లోకజ్ఞానానికి, సమయస్ఫూర్తికి ఆశ్చర్యం వేసింది.

“ఎందుకు కష్టం?” అన్నాను.

వెంటనే ఆశ్చర్యంగా నావైపు చూశాడు సదాశివం.

నేను బస్సు దిగిన వెంటనే ఒకతను తన కూతురు డెలివరీ గురించి బాధపడటం గుర్తొచ్చింది నాకు.

“ఇక్కడ మీకు సౌకర్యాలేవీ లేవు కదా!” అన్నాడు.

“మరేం పర్వలేదు. మీరంతా ఉంటున్నట్లే నేనూ ఉంటాను. నేను ఇక్కడే ప్రాక్టీసు పెడతాను” అన్నాను స్థిరంగా.

“మామయ్య ఒప్పుకోడేమో” అన్నాడు.

“ఈ ఊళ్ళు ఇంకా ఇలా ఉన్నాయనే విషయం నాకు తెలీదు. నాన్నను నేను ఒప్పిస్తాను. నాన్న లక్ష్యం నాన్నను అమెరికా చేర్చింది. నా లక్ష్యం నన్ను వీళ్ళకు సేవ చేయమంటోంది. అక్కడ నేను లేకపోయినా డాక్టర్లకు కొదవ లేదు. కానీ, ఇక్కడ ఇదంతా మా నాన్న తిరిగిన ఊరు. ఆయన స్నేహితులు అంతా నా వాళ్ళే. నేను వాళ్ళకు సేవ చేస్తాను” అన్నాను.

ఒక్కసారి సదాశివం నన్ను ఎత్తుకుని “నువ్వు శభాష్ బావా, నువ్వు చాలా గొప్పవాడివి” అంటూ నన్ను గిరగిరా తిప్పాడు.

ఇంటికెళ్ళి నా నిర్ణయాన్ని తాతయ్యకు, నానమ్మకు తెలియజేశాను. హాస్పిటల్ ఏర్పాటు గురించి ఊరి వాళ్ళతో మాట్లాడమన్నాను. నానమ్మకు ఏనుగెక్కినంత సంబరం.

“నువ్వు ఈ పల్లెటూళ్ళో ఎలా ఉంటావయా?” అన్నాడు తాతయ్య

“ఇక్కడ నీకేమీ డబ్బులు రావు” అన్నాడు ఊళ్ళో ఒకాయన.

“పది రోజులుండి పారిపోతావు” అన్నాడు మరొక ఆయన.

తాతయ్య మాత్రం “నా కొడుకు చాలా సంస్కారవంతుడురా ఆనంద్. అందుకే నీలాంటి గొప్ప కొడుకు కలిగాడు” అన్నాడు.

నా సంకల్పం బలహీనపడకుండా ఆశీర్వదించమంటూ తాతయ్యను కోరుకుని అమెరికాకు తిరుగు ప్రయాణమయ్యాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here