డాక్టర్ గౌరి

1
6

[dropcap]”ఒ[/dropcap]సే గౌరీ!…” వంటింటి ముందున్న పెరట్లో నిల్చుని మా అమ్మ వేస్తున్న కేకలకి… ఇంటికి కుడివైపునున్న దొడ్లో చేదబావి దగ్గరున్న నేను “గౌరింకా రాలేదమ్మా! ఎందుకనో… ఏమో!” అంటూ బిగ్గరగా సమాధానమిచ్చాను.

“అయ్యో! ఇంకా రాలేదా? అసలే ఈ రోజు శుక్రవారం వస్తుందో రాదో? ఇంత పొద్దుపోయేవరకూ, బయట వాకిలూడ్చీ…. చాన్పి చల్లి ముగ్గేయకపోతే ఎలా? ఒరేయ్ రామూలూ! నీవు పొలానికెళుతున్నావు కదా! దారిలో కాస్త ఆగి కర్రె కిష్టమ్మను ఇట్లా ఓమారు వెంటనే వచ్చి వాకిలూడ్చి వెళ్ళమను” అంటూ పొలానికెళుతున్న మా కర్షకన్నకు చెప్పిందమ్మ.

“ఊఁ…” అంటూ సమాధానంగా మూల్గి చెప్పులేసుకుని రాములన్న బయటికి వెళ్ళిపోయాడు.

చేదబావి దగ్గరే ముఖం కడుక్కున్న నేను వంటింటి ముందున్న అడ్డుగోడ వసారాలోకి వచ్చి నుగ్గులు (పిడకలు) కొట్టేసి వుంచిన కుంపటిలో అగ్గిరాజేసి… తెల్లారుజామునే బర్రెపాలు పిండేసిన రెండు ఇత్తడి చెంబులు కుండలో పోసి, కాస్త నీళ్ళు ఆ చెంబుల్లో పోసి కలియతిప్పి, వాటిని కూడా పాలకుండలో పోసి…. పిడకలు కొంచెం రాజుకుని పొగపోయాక కుండను ఆ కుంపటిపై పెట్టి తిన్నగా వంటింట్లోకి వెళ్ళాను. రాత్రే బొగ్గుల పొయ్యి పేడతో అలికి ముగ్గేసి బొగ్గులు కూడా రెడీగా వేసి వుంచాను. కింద కొంచెం ఎండిన కందిపొరక పెట్టి అగ్గిపుల్ల గీసి అంటించాను. రెండునిమిషాల్లో బొగ్గులన్నీ అంటుకున్నాయి. టీ గిన్నెలో నీళ్ళుపోసి పొయ్యిపై పెట్టాను. చిక్కటి పాలుపోసి రుచికరమైన టీ తయారుచేశాను. అమ్మకు పెద్ద ఇత్తడిగ్లాసులో పోసిచ్చాను. నేను తాగి మిగిలింది రాములన్నకు గిన్నెలోనే వుంచాను. వస్తే వేడిచేసి ఇవ్వచ్చు. చిన్నది కిరోసిన్ స్టౌవ్ వుంది. ఈ మధ్యనే మాకు దగ్గర్లో వున్న టౌన్ వనపర్తిలో అన్నతో తెప్పించిందమ్మ. సాయంత్రం పూట మాత్రం టీ ఆ కిరోసిన్ స్టౌవ్ పైనే కాస్తాను. ఉదయం పూటనేమో బొగ్గులపొయ్యి మీదనే మెత్తటి పుట్టమన్నుతో చిన్న చిన్న ఇనుపకడ్డీలని పెట్టి నేనే వేశాను ఆ పొయ్యిని. మూడు మొఖిరలతో కట్టెలపొయ్యి కూడా వేశాను. కళాత్మకంగా… ఇక పొట్టుపొయ్యి వేయడమంటే ఎంతిష్టమో! ఇలా ఐదారునెలలోమారు జీతగాళ్ళతో పుట్టమన్ను తెప్పించి పొయ్యిలను వేసేదాన్ని వంటింట్లో.

నేను బయటికి వచ్చేసరికి కిష్టమ్మ వచ్చింది. పొర్క చేతబట్టి బరబరా వాకిలూడూస్తుంది.

కందిచేనులో కలుపు తీయడానికి వెళ్ళాలనే తొందరలో అఘమేఘాలపై వుందాయె. అది చూసిన అమ్మ “కిష్టమ్మా! అంత ఉరుకుల పరుగుల మీదున్నావ్, కొంచెం నెమ్మదిగా చెయ్ పని. బయటనున్న చాన్పిగోలెంలో గౌరి నిన్న సాయంత్రం సంధ్యకసు ఊడ్చిటందుకు వచ్చినప్పుడు ఓ తట్ట పెండు వేసింది పశువుల కొట్టంలోనుంచి తెచ్చి. చేదబావి దగ్గర ఓ కడవ నీళ్ళు చేదుకొని గోలెంలో పోసి చాన్పి చల్లే ముంత గోలెం పక్కన వుంది చూడు…” అమ్మ ఇంకా ఏమో మాట్లాడుతూనే ఉంది.

“రాములయ్య పొలంకాడికెళ్తూ సెప్పేసరికి అంబలి కాస్తా పొయ్యికాడ కూకున్నదాన్ని గట్టిగే లగెత్తుకొచ్చాను. బేగిరం ఇంటికాడకెళ్ళి బువ్వొండలి. కందిచేను కల్పు తీయడాన్కి చేల్కకెళ్ళాలి కూలీ పనికి…” నాల్గు ముంతల చాన్పి గోలెంలో నుంచి ముంచి ఆదర బాదరాగా చల్లి వెళ్ళిపోయింది కిష్టమ్మ.

నేను వెళ్ళి వాకిట్లో ముగ్గేసి వచ్చాను. గౌరి చాన్పి చల్లితే ఎంతో అందంగా, పచ్చగా కళకళలాడుతుంటుంది వాకిలి. కిష్టమ్మ చేసిన పని గౌరి చేసిన పనితో పోల్చుకుంటే… నక్కకు నాగలోకానికి వున్నంత తేడా వుంది. గౌరి వూడిస్తే కాసింత చెత్తకూడా లేకుండా శుభ్రంగా ఉంటుంది. రెండు చేతులతో రెండేసి పరకలు పట్టుకుంటుంది ఆయుధాలుగా. ఓ చేతిలో మెత్తటి ఈత పొర్క… రెండోచేతిలో పుల్లలది… మట్టిఎక్కువగా వున్నచోట పుల్లల పొర్కతోనూ, సాపుగా వున్నచోట ఈతపొర్కతోనూ నెమ్మదిగా ఊడుస్తుంటుంది గౌరి. మా ఇంట్లో పాతికేళ్ళు నుంచి పనిచేస్తుందట అమ్మ చెప్తుంది… నేను పుట్టకముందు నుంచి.

పాతిక గడపలున్న పెద్దలోగిలి మాది. ఇంటికి తగ్గట్టే జనాలు కూడా ఎక్కువే. ఆరుమంది అక్కాచెల్లెళ్ళం… ఆరుమంది అన్నదమ్ములం. మొత్తం బరాబరు డజనుమందిమి. అన్నలందరూ బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ముగ్గురన్నలు పెళ్ళిండ్లు చేసుకొని వేరువేరు ఊళ్ళో ఉన్నారు. ఒక దీపావళి పండుగకి, మా నాన్న తద్దినానికి అందరూ ఊరికి వచ్చేవారు. కలిసిమెలిసి రెండుమూడు రోజులుండి వెళ్ళిపోయేవారు. వాళ్ళంతా వెళ్ళిపోయాక కళకళలాడే మా ఇల్లు బోసిపోయినట్లుగా అయిపోయేది.

నేను పుట్టకముందే చిన్నతనంలో ఓ అక్క మశూచి పోసి, మరో అక్క కుక్కకాటుకి చనిపోయారట. అప్పట్లో సరైన మందులు లేవుగా!

మా రెండో అన్న మా ఊరిలోనే టీచర్‍గా పనిచేసేవాడు. నేనక్కడే చదువుకున్నాను ఐదోతరగతి వరకు. ఆ తర్వాత మాకు దగ్గర్లో ఉన్న వనపర్తి టౌన్లో గరల్స్ హైస్కూల్లో చదువుకున్నాను. వనపర్తి అంటే గుర్తుకొచ్చింది సినిమాలు చూడాలంటే బండి ప్రయాణమే… ఎంతో హాయిగా సరదాగా ఉండేదా రోజుల్లో. సినిమా టికెట్స్ కూడా తక్కువే. నేల పావులా… లేక యాభైపైసలు (సిమెంట్ చేసిన జాగాకి) బెంచీ అయితే రూపాయి, కుర్చీ అయితే రెండేసి రూపాయలు. ఇలా వుండేవి సినిమా టికెట్స్ ధరలు ఆ రోజుల్లో..

వనపర్తి టౌన్లో కొత్త సినిమా వస్తే అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం ఎద్దులు బండిలో. అక్కడ ఆ రోజుల్లో జగదీష్ టాకీస్ ఒకటి, రామాటాకీస్ ఇంకొకటి. రెండిట్లో జగదీష్ లోనే కొత్త సినిమాలు ఆడేవి. ‘శ్రీ వెంకటేశ్వర మహత్యం’ సినిమా వచ్చినప్పుడయితే ‘స్వామిది’ పెద్ద విగ్రహం పెట్టి ఓ పూజార్ని పెట్టి మంత్రాలు, పూజలు బ్రహ్మాండంగా జరిగేవి. ఓ హుండీ కూడా పెట్టింర్రి. ఎన్.టి. రామారావు శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఎంతో అందంగా బాగున్నాడని జనాలు చుట్టుపక్కల పల్లెల నుంచి పెద్ద ఎత్తున ఎద్దులబండ్లు కట్టుకొని వచ్చి విరగబడి చూశారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా కలర్స్ లో ‘లవకుశ’ సినిమా వచ్చినప్పుడు కూడా ప్రజలు అలాగే మహానందంగా చూశారు. రాములవారిగా ఎన్.టి రామారావు, సీతమ్మవారిగా అంజలీదేవి బాగా నటించారు అనేకంటే ఆ పాత్రల్లో వాళ్ళు జీవించారని చెప్పొచ్చు. సంక్రాంతి పండుగ రెండురోజుల్లో ఉందనగా… అమ్మతోపాటు సినిమా చూసేందుకు బండికట్టుకుని వనపర్తికొచ్చాం. పండగకి అక్కడే ఉన్న మా పెద్దక్కను పిల్లల్ని తీసుకురావాలని అమ్మ ఆలోచన. లవకుశ సినిమా రాత్రి ఫస్ట్ షో చూశామందరం. మరునాడు ఉదయం అక్కవాళ్లతో పాటు ఊరికి వెళ్దామనుకునేసరికి… మా నాన్నకు బాగాలేదని విపరీతంగా కడుపునొప్పి వచ్చిందనీ, అనుకోకుండా కర్నూల్ నుంచి పెద్దన్న నిన్న సాయంత్రం వచ్చాడనీ, హాస్పిటల్‍కిక్కడికి తీసుకొద్దామంటే నాన్న రానంటున్నాడనీ ఊర్నించి సైకిల్‍పై వచ్చిన రాములన్న చెప్పాడు. హుటాహుటీన వెంటనే ఊరికెళ్ళామందరం. మేము ఊరికి వచ్చేసరికి అప్పటికే మా నాన్న పరిస్థితి విషమంగా తయారయింది. మేము వచ్చిన బండిలోనే నాన్నను వనపర్తి హాస్పిటల్‍కు తీసికెళ్ళడానికి అన్నీ ఏర్పాట్లు జరిగాయి.

కాని బండిలో ముగ్గురు నలుగురు ఎత్తి పండుకోబెట్టే సమయానికి మా నాన్న ప్రాణాలు అనంత వాయువులో కల్సిపోయాయి. అమ్మతో పాటు మేమంతా ఒక్కసారిగా గొల్లుమన్నాం.

***

సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఎంతో సంబరంగా వుండేది మాకు. ఆ పండుగ మూడురోజులూ ఓ మంచి జ్ఞాపకంలా మాలో పదిలంగా వుండేవి. మా ఊరిలోని ‘కోటమశమ్మ’ గ్రామదేవతకు ఆడాళ్ళు బోనాలెత్తేవారు. ఫలారం బండ్లు తిరిగేవి. రైతులు తమ తమ ఎద్దుల్ని శుభ్రంగా కడిగి మెడగంటల మువ్వల పట్టీలు మెళ్ళో వేసి అందంగా అలంకరించేవారు. బండ్లను కూడా కడిగి చక్రాలను రంగులతో పసుపు కుంకుమలతో, పూల తోరణాలతో, బంతిపూల దండలతో, మామిడి వేప ఆకులతో తోరణాలు చుట్టుకట్టిన ఆ బండ్ల యజమాని కుటుంబానికి చెందినవారు చిన్నా పెద్దా ఎక్కి హుషారుగా కేరింతలు కొడ్తూ మూడుసార్లు తిరుగుతారు. ఇంకా కొంతమందికి, గ్రామదేవత పై మీదకొచ్చి శివమూగేవారు. అలా మూడురోజు పెద్ద జాతర కూడా బ్రహ్మాండంగా జరిగేది. మిఠాయి షాపులు, గాజులు, ఆటబొమ్మల షాపులు… రంగురంగు పానీయాలతో ‘చల్లగా.. తియ్యగా.. పుల్లగా తాగిపోరా పిల్లగా!’ అంటూ షర్బతు అమ్ముకునే వారి కేకలతో ఎంతో సందడిగా వుండేది…. ఆంజనేయస్వామి గుడికి, శివాలయానికి పక్కగా మధ్యనున్న ఖాళీ జాగాలో ఈ జాతర సాగేది. ఎప్పుడైనా సరే ఊళ్ళోకి వీధి భాగవతులు వస్తే అక్కడే రంగస్థలం లాంటిది ఏర్పాటు చేసుకొని పౌరాణిక నాటకాలు ప్రదర్శించేవారు.

ఇక సంక్రాంతి వైభవం ఇండ్లలో ఐతే గడపకి నాలుగేసి గొబ్బెమ్మల చొప్పున మా ఇంట్లోని పాతిక గడపలకీ, తులసమ్మ దగ్గర, మళ్ళీ వాకిట్లోకి, కొత్త గురికి (చిన్నకుండ)లో ఆవుపాలు పొంగించి అందులో కొత్త బియ్యం… నువ్వులు, బెల్లం దంచి వేయాలి. పాలు బాగా వేడెక్కి ఏ వైపుకు పొంగినాయో చూశాక పై చెప్పిన వాటిని వేసి బాగా ఉడికించి పులగం చేసేవాళ్ళం. దీనికి ఎదురుగా పీటపై ఓ అందమైన అమ్మాయి బొమ్మకి కుంకుమ బొట్టుపెట్టి నిలబెట్టేవారు. ఈ కార్యక్రమం ఇంట్లో వున్న పెళ్ళికాని కన్యలే చేయాలి. బెల్లంతో ఈ నువ్వుల పులగం చేయడానికి ఓ పద్ధతి ఉంటుంది. చక్కగా పసుపు, కుంకుమలతో అలంకరించిన గొబ్బెమ్మలను చతురస్రాకారంలో రెండేసి వరసల చొప్పున పెట్టి…. నాల్గు మూలలకు నాల్గు కొత్త గురిగీలను పెట్టి వాటిల్లో నువ్వులు, బియ్యం, రేగిపండ్లు వేసి…. తెల్లని లేదా పసుపు రంగు దారం ఉండతో మూడు లేక ఐదు చుట్లూ వాటి చుట్టూ తిప్పేవారు. సరిగ్గా మధ్యలో ఆవుపేడతో చేసిన ముగ్గుల్ని చిన్నచిన్న ముక్కలుగా కొట్టి పెట్టి అగ్గిరాజేసి ఆపైన ఈ పులగం వండాలి. అది అయ్యాక ముందుగా సూర్యభగవానునికి నైవేద్యం పెట్టి, ఆ తర్వాత ఇంట్లోని చిన్నాపెద్దలకు ప్రసాదంగా పెట్టి… కొంచెం పులగం ఆ గురిగిలో వుంచి దాన్ని ధాన్యం గాదెతో పెట్టేవాళ్ళం. అలా ఆనందోత్సాహాలతో జరుపుకునే సంక్రాంతి పండుగ వచ్చిందంటే అమ్మో…. వందల్లో గొబ్బెమ్మలు చేయడం… మళ్ళీ వాటికి పసుపు కుంకుమలు పెట్టి పైన గరిక… పిండికొమ్మలు వాటిల్లో గుచ్చి లేదా రంగురంగు పూలతో అలంకరించాల్సి వచ్చేది ప్చ్! ఏమి లేవిప్పుడు అవి. చాలా నిరుత్సాహం వచ్చేసింది.

***

మళ్ళీ మనమిప్పుడు మా పనిమనిషి గౌరి విషయానికి వద్దాం.

శుక్రవారం వచ్చిందంటే గౌరికి చేతినిండా పని. ఇంట్లోవుండే అన్ని గడుపలూ కడగాలి. పసుపు, కుంకుమలు పెట్టి పైన పచ్చపిండితో ముగ్గేయాలి. నడుం టంగ్ మనేదారోజు గౌరికి. రోజుకన్నా ఇంకా పొద్దునే రావాలి. వెళ్ళడానికి మాత్రం పది దాటేది. ఎందుకంటే శుక్రవారం ఇంటికి కుడి ఎడమ వైపులున్న దిడ్డి తలుపులు మొదలుకొని…. బాజాలకి ఎర్రమన్ను జాజు కలిపి పట్టెపెట్టి… ఆ తర్వాత పేడతో అలకాలి. గోడ పొడుగునా చిలుకు ముగ్గు పెట్టాలి. గౌరిలో ప్రత్యేకత చిలుకు ముగ్గు బాగా పెడుతుంది. అదెలా అంటే పిడికెడు నిండా ఓడ్పుగా ముగ్గు పట్టుకొని…. పైన చిన్న చుక్కలాగా… కింద పొడుగ్గా దోసపలుకులా ఓ గీత వేళ్ళ సందుల్లో నుంచి నైపుణ్యంతో వదలుతూ పోవాలి వరసగా. భలేగా వుంటుందా దృశ్యం. గౌరి ఈ ముగ్గు పెట్టడంలో చాలా నేర్పరి. ఎంతో నైపుణ్యాన్ని కనబరుస్తుంది. నాకైతే తనలా ముగ్గేస్తుంటే తదేకంగా దీక్షగా చూడాలనిపించేది… నేనూ ప్రయత్నం చేసేదాన్ని కాని, నాకు గౌరంత చక్కగా ముగ్గు పెట్టేందుకు వచ్చేది కాదు. అయినా ఏదో ఓ నాటికి గౌరిలాగా పెట్టగలనేమోనని నా ప్రయత్నం మాత్రం మానలేదు. ’చిన్నమ్మా! నీవు బాగా పెడ్తావు తల్లీ! నాకు కొంచెం సాయమ్మ సేయమ్మా! ఇంటికాడ యియాల యేం వండలేదు. మా పాపిగాడొస్తే ఇక రంకెలేస్తాడు’ అని గౌరి అంటుండగానే పాపయ్య రానే వచ్చాడు. “ఒసే గౌరీ! ఓ గౌరమ్మో! యెందే గిది? ఇంత పొద్దయినది గంద… యింటికాడ పొయ్యి రాజెయ్యలేదు. గంజి నీళ్ళు కాద్దామంటె కొంపలో పిడికెడు పిండిలేదు. బువ్వ వండుదామంటే దోసెడు నూకగింజలు కూడా లేవు” అంటూ పెళ్ళాంపై రంకెలెయ్యసాగాడు.

“ఓయ్! ఇగో పాపిగాడా! అలా అరవమాకు. పెద్దమ్మోగోరు సూసినారంటే కోపమొస్తుంది” సైగలతో గౌరి చిన్నకంఠంతో చెప్పగానే పాపయ్య శాంతించి కొంచెం తగ్గాడు.

నేనింట్లోకెళ్ళి అమ్మనడిగి ధాన్యం కుండలు,,, గాగులుండే రెండు రెక్కలున్న అర్రల్లోకెళ్ళి ఓ కుండలోనుంచి ఓ సోలెడు బియ్యం నూకలు తెచ్చి పాపయ్య పై సెల్లాలో పోసి, ఓ చిన్నగిన్నెనిండా చింతకాయ తొక్కు తెచ్చి యిచ్చాను. “వెళ్ళు…. వెళ్ళి తొందరగా అన్నం వండు. ఈలోగా గౌరి పని పూర్తిచేసుకొని వస్తుందిలే” అంటూ అతన్నింటికి పంపాను.

గౌరి పాపయ్య దంపతులకు పిల్లలు లేరట. తమ సుట్టాల పిల్లనెవ్వరినో సాక్కొందట. పెంచి పెద్దచేసి పెళ్ళి కూడా చేశారట. ఇప్పుడు కూతురు అల్లుడు ఇక్కడ లేరట: దేశం వెళ్ళారని చెప్పింది మన్ను మోయడానికి.

మన్ను మోయడానికి దేశం వెళ్ళారంటే ఏమిటో మొదట్లో నాకర్థం కాలా. ఆ తర్వాత తెలిసిన విషయం. అప్పట్లో నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణంలో ఊళ్ళో నుంచి ఎంతోమంది శ్రామికులు పనికెళ్ళేవారు. కంట్రాక్టర్లు ఊళ్ళోకి వచ్చి జనాలకి సంవత్సరానికి సరిపడ డబ్బులిచ్చేసి వాళ్ళని తీసికెళ్ళేవారు. మళ్ళీ ఏడాదికే వెళ్ళినవాళ్ళు ఊళ్ళోకి తిరిగొచ్చేవారు.

ఆ కాలంలో మా రెండో మేనమామ శ్రీనివాస్‍రావు సివిల్ ఇంజనీర్. చాలా సంవత్సరాలు నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణమప్పుడు పనిచేసేవాడు. సెలవురోజుల్లో వాళ్ళక్కని చూసేందుకు… అదే మా అమ్మ దగ్గరికి వచ్చేవాడు జీపులో…. మా ఊళ్ళోని పిల్లలంతా జీపు చుట్టూ చేరి చోద్యంగా చూస్తుంటే… మాకెంతో గర్వంగా ఉండేదా దృశ్యం. ఇంకో విషయంలో కూడా మాకెంతో గర్వంగా ఉండేది. అది ఏమిటంటే గ్రామ్‌ఫోన్ పెట్టడం. మంచి మంచి పాత సినిమాపాటలు రికార్డ్స్ ఉండేవి. మా అన్నలో, మామయ్యలో పాటల రికార్డ్స్ తెచ్చేవారు. గ్రామఫోన్‍కి కుంజీ ఇచ్చి ఆన్‍చేసి సౌండ్ పెడ్తే వాకిట్లో నుంచి వెళ్ళేవాళ్ళు కొంతసేపు మా వాకిట్లో ఆగి నిల్చుని ఆనందంగా వినేవారు పాటలు. లవకుశ, సంపూర్ణ రామాయణం మున్నగు నాటకాల సెట్ల రికార్డ్స్ కూడా వుండేవి. మా ఊరు గ్రామ పంచాయితీ ఆఫీస్‍లో మొట్ట మొదటిసారిగా రేడియో పెడ్తే…. ఊళ్ళోని జనాలంతా కూలీ నాలీ విషయం మర్చిపోయి…. అది వినడానికి ఉదయం, సాయంత్రం అక్కడికి చేరుకొని కింద సెల్లబట్టు… గొంగడో వేసుకొని కూర్చొని అబ్బురంగా చోద్యంగా ముక్కుమీద వేలేసుకుని వినేవారు. పొద్దున ఆరుగంటలకీ, సాయంత్రం ఆరుగంటలకీ మాత్రమే రేడియో పెట్టేవారు. అక్కడ పనిచేసే బంట్రోతు ఛోటేమియా అనే ముస్లిమ్ అతను. వీధుల్లో అక్కడక్కడ కిరోసిన్ వీధి దీపాలుండేవి. చేతిలో ఓ నిచ్చెన కిరోసిన్ సీసా… బట్ట పట్టుకొని వీధి వీధి తిరిగేవాడు. స్థంభాలలాంటి వాటిపైన ఓ అద్దాల డబ్బాలాంటిది వుండేది. అందులో కిరోసిన్ బుడ్డి వుండేది. అది తెరవడానికి ఓ వైపు తలుపులా వుండేది… అందులో గ్యాస్‍నూనె పోసి… అద్దాలకున్న మసిని చక్కగా బట్టతో తుడిచి అగ్గిపెట్టెలోనుంచి ఓ పుల్లగీసి దీపం వెలిగించి తలుపేసి అక్కడి నుంచి మళ్ళీ వేరే వీధిలోకి వెళ్ళేవాడు. గ్రామపంచాయితీ ఆఫీస్‍లోకి రేడియో వచ్చాక ‘భక్తిరంజని’ మొదలు వార్తలు పాటలు అన్నీ లౌడ్ స్పీకర్‍తో పెద్దగా వినిపించేవి మా ఇంటిదాకా. అవి వింటూ చెట్లకు బావిలోనుంచి నీళ్ళు చేది పోయడం… పూలు తెంచడం… చెట్లకు పేడ ఎరువు వేయడం ఇలా ఎన్నెన్నో పనులు చేసేదాన్ని. నాకు చిన్నప్పటి నుంచి చెట్లంటే ప్రాణం. బంతిపూలు, కనకాంబరాలు, మరువం, చేమంతులు, సీజన్‍లో విరగగాసేవి దొడ్లో… పొద్దున్నే పచ్చగా కళకళలాడుతున్న ఆ చెట్లనీ, రంగురంగుల పూలని మైమరపుగా చూస్తూ బొగ్గుపొడితో పళ్ళుతోముకోవడం నా దినచర్య. నేనలా తిరగడం ఇష్టముండక… “ఆ వనవిహారం ఇక చాలించి… ముఖం కడుక్కుని వంటింట్లోకి రావే!…” అంటూ మా అమ్మ కోపంగా కేకేసేది.

రజకార్ల మూమెంట్ అయ్యాక మా ఊళ్ళో ముస్లింలు బాగానే వుండేవారు. మా పెద్దన్నకు ఆదినారాయణ, మాసుమ్, జాన్‍మియా, బషీర్ మున్నగువారితో బాగా స్నేహంగా మాట్లాడేవాడు. ఆ రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బెనారస్ ఎం. ఏ చేసింది మా పెద్దన్న అంటే నమ్ముతారా? అంత చదువుకున్న ఊళ్ళోకి వచ్చినప్పుడు బయట అరుగులపై కూర్చొని అందరితో కలివిడిగా నవ్వుతూ మాట్లాడేవాడు.

ఆ రోజుల్లో ఇంట్లో డబ్బు ఉండేది కాదు. అమ్మకం, కనుగోలుపై వస్తు మార్పిడి ఉండేదారోజుల్లో. ఒక్కోమారు మా ఊళ్ళోకి సీజన్ పట్టి పొలాలో పండే కూరగాయల్ని…. నేరేడు, జామ, రేగి, జానపండ్లు బుట్టల్లో  తెచ్చి అమ్మేవారు. గిద్దడో, అర్ధ శేరో, నూకలో, జొన్నలో, సద్దలో, తైజలో, అరెక బియ్యమో పెడ్తే ఆ గింజలకు తగినట్లుగా పండ్లు… కాయకూరలిచ్చేవారు. రకరకాల చిరుధాన్యాలు పుష్కలంగా వుండేవి ఇండ్లలో. గెనుసుగిద్దడంటే నాకెంతో ఇష్టం. మా ఊరివైపు మోర్రంగడ్డ అనేవారు. వాటిని కూడా గింజలకే ఇచ్చేవారు. ఇవి అవి అని కాదు. మనింట్లో ఏం గింజలుంటే అవి తీసుకునే వారు… మాకారోజుల్లో పుట్లు పుట్లు వడ్లు పండేవి. బోలెడన్ని పంటపొలాలుండేవి. వాటితోపాటు కందులు, పెసలు, బెబ్బర్లు, ఉలవలు, అరికలు మున్నగు చిరుధాన్యాలు కూడా బాగా పండేవి.

నాకు చిన్నప్పుడు మా ఇంటిపక్కన రాజమణి అనే ప్రియనేస్తం వుండేది. తనతో బాగా ఆడుకునేదాన్ని. మొత్తం మీద ప్రతిమనిషి జీవితంలో బాల్యం అదో మరపురాని ఓ మధుర జ్ఞాపకం.

అవునూ, మీకింకా గౌరికున్న మరో గొప్పతనం గురించి చెప్పనేలేదు కదూ…. వస్తున్నా… చెప్పడాన్కి అక్కడికే వస్తున్నాను.

మా పనిమనిషి గౌరి పార్శ్వపు తలనొప్పికి, దిష్టికి, బెణుకునొప్పులకు మరింకేవో నొప్పులకి మంత్రం వేసేది. ఏ మందూ మాకూ లేకుండానే అదేం చిత్రమోగాని వెంటనే తగ్గేవట. మా ఊరు ఎదుట్లకి దగ్గర్లో చుట్టుపక్కల నున్న కేశంపేట, చెన్నారం, చాకలిపల్లి, చీర్కపల్లి, గొల్లపల్లి, ఏదుల, రేయెద్దుల, రేవల్లె మున్నగు ఊర్ల నుంచి గౌరి మంత్రం కోసం ఆ రోజుల్లో బండ్లు కట్టుకొని జనాలొచ్చేవారు. మీరు నమ్ముతారో లేదో మరి ఇది మాత్రం ముమ్మాటికి నిజం. ఎందుకంటే నా కళ్ళతో చూశాను కాబట్టి.

మన రెండు కళ్ళూ ఒకదాన్ని ఒకటి ఎలా చూడలేవో అలాగే నమ్మకం, సైన్స్ ను అంగీకరించదు. సైన్స్ విశ్వాసాన్ని ఒప్పుకోదు. కడుపు చించితే అక్షరంముక్క రాని గౌరిలో ఇంత దిట్ట ఎలా కాగలిగిందో నాకర్థం కావడం లేదు. తన పూర్వికుల నుంచీ మంత్రాలు నేర్చుకుందట చిత్తశుద్ధితో.

మా ఇంటికి ఉదయాన్నే ‘కరణంగారి వాళ్ళింట్లో పని చేస్తుందట…’ అంటూ ఎద్దుల బండిపై పేషంటుని తీసుకుని వచ్చేవారు… నేరుగా మా ఇంటి దగ్గరికే.

“అమ్మా! గౌరుందా?” అని అడిగేవారు.

“ఉంది. ఆగండి పిలుస్తాను….” అంటూ పశువుల కొట్టంలో ఊడుస్తున్న గౌరినుద్దేశించి “డాక్టర్ గౌరీ! ఎక్కడున్నావ్? ఇవతల నీకోసం పేషంట్లు వచ్చారు” అంటూ పిలుస్తూ పశువుల దొడ్లోకి వెళ్ళేదాన్ని.

“ఏందమ్మా! ఎవరొచ్చినరు? నేను డార్టరనేంటి?…. ” అంటూ బోద్యంగా చూస్తూ అడిగేది.

“నీకోసం రోగులొచ్చినారే డాక్టర్ గౌరీ!” అనేదాన్ని మళ్ళీ నవ్వుతూ.

“ఊర్కో చిన్నమా! నేను డాటర్నియేంటి? అంటూ చేతుల్లో వున్న పొర్కలను కిందపడేసి గబగబా వాకిట్లోకెళ్ళి పేషంట్ బండాగిన చోటికెళ్ళింది. బండాయన పెళ్ళాంకి పార్వ్శపు తలనొప్పట. మంత్రం వేసి వాళ్ళిచ్చిన అర్థరూపాయో, రూపాయో తీసుకునేది.

“వాళ్ళు ఫీజ్ ఎంతిచ్చార్ డాక్టర్ గౌరీ?” నవ్వుతూ మళ్ళీ అడిగేదాన్ని.

“ఇంద…. ఈ  రూపాయే యిచ్చినారు” అంటూ పిడికిలి విప్పేది.

“ఇంకేం పండుగే నీకు సాయంత్రం నాలుగు కల్లు సీసాలొస్తాయి. మస్తు మస్తుగా కల్లు సీసాలు తాగేస్తారు నీవూ… పాపయ్య”

“అమ్మో! లేదమ్మా. ఈ రూపాయితో ఉప్పు, మిరపకాయ… కూసంత నూనె… రొండు ఎల్లిగడ్డలు తెచ్చుకుంటాను సింగన్న దుకానానికెళ్ళి. రాత్రి బువ్వలోకి జరంత ఎల్లికారం నూరతానమ్మా” సంబరంగా చెప్పింది.

“హేంటీ!? ఈ ఒక్క రూపాయిన ఇన్ని వస్తువులు వస్తాయా గౌరీ?” ఆశ్చర్యంగా అడిగాను.

“అగసూడు చిన్నమ్మ…. ఎంత సిత్రంగా అడుగుతుందో? పావలా మిరపకాయలు, పావలా ఎల్లిగడ్డ… పావలా నూనె… పదిపైసల ఉప్పు…. పదిపైసల చింతపండు….” లెక్క చెప్తుంది గౌరి నాకు నవ్వుతూ.

అవునుమరి… యాభై… అరవై సంవత్సరాలా మధ్యకాలంలో రూపాయికి వచ్చే వస్తువులు. ఇప్పుడా అవకాశమే లేదుకదా!

ఎంత అమాయకమైన నవ్వు… స్వచ్చమైన మనస్సుగల గౌరిది. నిజంగా చాలా మంచి మనస్సు. మా అమ్మకు తానంటే తన పిల్లలాగే చాలా ప్రేమాభిమానాలు. ఓసారి ఏమైందంటే గౌరికి విపరీతమైన జ్వరమొచ్చి పనిలోకి రాలేకపోయింది. పాపయ్య వచ్చి చెప్తే మా అమ్మే… ఊళ్ళో వుండే ఆర్.ఎం.పి డాక్టర్ ప్రభుదాస్‍కి కబురు పంపి పిలిపించి, పాపయ్యతోపాటు గౌరింటికి పంపింది చూసి మందులిమ్మని. ఆ డాక్టర్ ప్రతిమాటకు ముందు ఊతపదంగా ‘ఊష్ణం… ఊష్ణం…’ అంటాడు ప్రతిదానికీను. ఆయన గౌరీకి ఓ సూదీ, మందుగోళీలిచ్చి మళ్ళీ ఇంటికొచ్చి మా అమ్మతో “ఊష్ణం… మామూలు జ్వరమే. ఏం ఫర్వాలేదమ్మా రెండురోజుల్లో తగ్గిపోతుంది” అని చెప్పి వెళ్ళాడు.

గౌరికి జ్వరం పూర్తిగా తగ్గి మళ్ళీ యథావిధిగా పనిలోకి వచ్చేవరకు మా అమ్మకు మనస్సు మనస్సులో లేదంటే నమ్మండి.

ఆ రోజుల్లో పనివాండ్ల పట్ల ఎంతో శ్రద్ధాసక్తులు కనబర్చేవారు యజమానులు.

***

కాలచక్రం ఎవరికోసం కూడా ఆగదుకదా! తనంతట తాను ముందుకు పోతూనే ఉంది.

నాకు పెళ్ళై మావారితో కాపురానికి మా ఊరు ‘ఎదుట్ల’ నుంచి అంటే ఆ చిన్న పల్లెటూరి నుంచీ… రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరమే సరిగా తెలియని నేనూ… ఏకంగా దేశ రాజధాని అయిన ఢిల్లీకే వెళ్ళాను.

మా అన్నలకు, అక్కలకు అందరికీ పాలమూరు జిల్లాలోని సంబంధాలే కుదిరి పెళ్ళిండ్లు అయ్యాయి. నా ఒక్కదానికే వేరే జిల్లాలోని సంబంధం… దేశరాజధానిలో కాపురం. అక్కడ మనుష్యులు కొత్త! భాష కొత్త! ఆచారవ్యవహారాలు కొత్త! నాకు మాత్రం ‘పానీ…’ అన్న మాట తప్ప మరో హిందీ ముక్కే రాదు ఆ రోజుల్లో. తర్వాత… తర్వాత మెల్లిగా హిందీ మాట్లాడటం నేర్చుకున్నాను. మా ఊరిమీద, మా అమ్మమీద చాలా బెంగ. ఆ బాధ దిగుళ్ళతోనే కొన్ని నెలలు గడిచాయి. ఉన్నట్లుండి మా ఊరి నుంచి రాములన్న రాసిన ఉత్తరం వచ్చిందో రోజు. ఆ ఉత్తరంలోని విషయం ‘గౌరి చనిపోయిందనీ’. ఆ వార్త తెల్సి చాలా బాధపడ్డాను, ఏడ్చాను కూడాను.

కాలచక్రం త్వరిత గతిన తిరుగుతూనే ఉంది.

కొన్నిసంవత్సరాలు గడిచిపోయాయి. ఇద్దరిపిల్లలకు తల్లినయ్యాను. ఆ తర్వాత అమ్మమ్మనయ్యాను, నానమ్మనయ్యాను.

ఇప్పటికీ ఎవరికైనా మైగ్రెన్ తలనొప్పి అదే పార్శ్వపు నొప్పి అనీ, ఎన్ని మందులు వాడిన తగ్గడంలేదనీ అంటే నాకు నిజంగా మా గౌరియే గుర్తుకొస్తుంది. గౌరి వేసే మంత్రం కోసం ఎంతోమంది ఊళ్ళు నుంచి ఎద్దులబండ్లలో వచ్చేవారు. ఇప్పటి జనరేషన్ ఆ విషయాన్ని అంగీకరించదు. ‘నాన్సెన్స్! మంత్రాలకు రోగాలు తగ్గడమేమిటంటారు’. సైన్స్ తెల్సిన వాళ్ళకవి పూలిష్‍గా కన్పించవచ్చుగాని, నేను మాత్రం వీటిని నమ్ముతాను. మనకున్న రెండు కళ్ళు ఒకదాన్ని ఒకటి ఎలా చూడలేవో… అలాగే సైన్స్ నమ్మకం ఈ రెండూను. సైన్స్‌ను నమ్మకం ఒప్పుకోదు. నమ్మకాన్ని సైన్స్ అంగీకరించదు. కళ్ళారా చూసిన నాకామాత్రం మనస్సు నిండా విశ్వాసమే! అరవైయవ దశాబ్దం దాటి కొన్నినెలల్లో డెభ్భైయవ దశాబ్దంలోకి అడుగుపెట్టబోతున్న నాకు మాత్రం ఇప్పటికీ గౌరి గుర్తుకొస్తుంది.

“నానమ్మా! ఓయ్ నాయనమ్మా! నేను అన్నం తినేశాను. నాకిక ‘చీమ – చక్కెరపలుకు’ కథ చెప్పవా?” అంటూ పక్కలో చేరిన నా మనుమరాలు ఆధిత్రి మాటలతో వులిక్కిపాటుతో ఈ లోకంలోకొచ్చాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here