డాలర్ మొగుడు

2
12

[box type=’note’ fontsize=’16’] డాలర్ మొగుడు డాలర్ మొగుడు అని కనీసం ఇరవైనాలుగు గంటలైనా మురిసిపోనీయలేదావిడనీ వాళ్ళ ఏమండీగారు ఈ కథలో. [/box]

[dropcap]”ఇ[/dropcap]క్కడ సీనియర్ సిటిజన్ క్లబ్ ఉందిట. అక్కడ బ్రిడ్జ్ ఆడతారట. వెహికిల్‌లో మన ఇంటి దగ్గరనే పిక్ అప్ అండ్ డ్రాప్ చేస్తారట. పటేల్ సాబ్ వాకింగ్‌లో చెప్పాడు. మన ఇంటి దగ్గర ఉన్న బస్‌స్టాప్‌లో ఏ నంబర్ బస్ ఎక్కి వెళ్ళాలో చూపించాడు. రేపు పొద్దున అందులో వెళ్ళి, వచ్చేటప్పుడు వాళ్ళ వెహికిల్‌లో వచ్చేస్తాను.”

‘ఏమండీ’ వాకింగ్ నుంచి వస్తూనే ఏకబిగిన ఎనౌన్స్ చేసారు. మేము శాన్ ఫ్రాన్సిస్కో వచ్చి రెండు రోజులు ఐయింది. అప్పుడే వాకింగ్‌కు వెళ్ళటమూ, ఫ్రెండ్స్‌ను చేసుకోవటమూ, ఇక్కడి సీనియర్ సిటిజన్ క్లబ్ గురించి తెలుసుకోవటమూ జరిగిపోయాయి. బ్రిడ్జ్ గురించి తెలిసిన సంతోషంలో నేను వాకింగ్‌కు రాలేదన్న కోపం మర్చిపోయారు. హమ్మయ్య బతికి పోయాను!

మరునాడు పొద్దున్నే, కూతురు బాక్స్‌లో నాలుగు చపాతీలు, నాలుగెందుకు అంటే నువ్వు ఒక్కడివే తినవుకదా, పక్క వాళ్ళకు కుడా ఇస్తావు కదా, అందుకే నాలుగు, పైగా ఆ చపాతీలూ, కూరా ఎలా తయారు చేసారో అందులో ఏమేమి వేసిందో వివరముగా వ్రాసి, దానిని ప్రింట్ ఔట్ చేసి, (ఆ పేపర్, ఎవరికైతే తినమని పెడతారో వాళ్ళకు చూపించాలిట. ముందు జాగ్రత్త అట హేవిటో గోల) ఆ పేపర్, ఓ మంచినీళ్ళ సీసా, కొన్ని బేబీ క్యారెట్లూ, రెండు సాఫ్ట్ డ్రింక్ పాకెట్‌లూ అన్నీ ఓ చిన్న బాక్‌పాక్‌లో సద్ది ఇచ్చింది. బాక్‌పాక్ వెనుక వేసుకొని, జీన్స్ పాంట్, టీ షర్ట్‌లో కాలేజ్ కుర్రాడిలా ఈల వేసుకుంటూ వెళ్ళారు ఏమండీ గారు.

పొద్దున పదింటికి వెళ్ళారు, సాయంకాలమైనా రాలేదు ఎక్కడైనా తప్పిపోలేదు కదా అని ఒకటే గాభరా పడుతూ ఇంటి ముందు తిరుగుతున్నాను. మనవరాలు “అమ్మమ్మా తాతను సముద్రంలో వదిలేసినా, అడివిలో వదిలేసినా ఏ బాధా లేదు, అక్కడా ఎవరినో వకరిని ఫ్రెండ్స్ చేసుకొని హాపీగా ఉంటారు అంటావు కదా అంత టెన్షన్ ఎందుకు, వస్తారులే” అంది.

“నీ మొహం, ఏదో సరదాగా అంటాను. సెల్ కూడా లిఫ్ట్ చేయటం లేదు అని నేను భయపడుతుంటే నీ జోకులేమిటి? మధ్యలో” అని విసుక్కున్నాను.

ఇంతలో ఓ బస్ ఇంటి ముందు ఆగింది. అందులో నుంచి దిగిన ఏమండీగారు, బస్‌లో ఉన్న ఎవరో ఒకావిడతో మాట్లాడుతూ ఎంతకీ రారే! నేనేమో మెట్ల మీద నిలబడి చూస్తున్నాను. బస్ కదిలింది. లోపల ఆవిడకు చేయి ఊపి వచ్చారు.

“ఎవరో గర్ల్ ఫ్రెండ్ దొరికినట్లుంది. అందుకేనా ఇంతాలశ్యం” అన్నాను మూతి తిప్పుతూ.

“మరే తొంభై ఏళ్ళ గర్ల్ ఫ్రెండ్. ఎంతకీ వదలదే!” తమాషాగా అని, “అన్నట్లు బ్రిడ్జ్‌లో నేను ఎనిమిది డాలర్లు గెలుచుకున్నాను” అన్నారు గొప్పగా.

“అబ్బా మీరూ డాలర్లు సంపాదించారా! నా మొగుడూ డాలర్ మొగుడు అని అందరికీ చెప్పుకోవచ్చు” అన్నాను అప్పటిదాకా పడ్డ గాభరాను మర్చిపోయి సంబరంగా.

“ఏమిటీ ఇప్పటి దాకా నేను సంపాదించి నీ చేతిలో పోసిన లక్షలు లెక్కలేదా? ఎనిమిది డాలర్లకే ఇంత సంతోషపడిపోతున్నావు?” అన్నారు కాస్త కినుకగా.

“ఎంతైనా డాలర్ డాలరే కాదా! అందుకేగా ప్రపంచమంతా డాలర్ వెనుక పడుతోంది” అన్నాను నవ్వుతూ.

“తాతా నేనూ నీ కోసం ఇందాకటి నుంచి ఎదురుచూస్తున్నాను. ఈ రోజు వాకింగ్‌కు నాతో వస్తానన్నావు కదా, వస్తావా అలిసిపోయావా?” సందట్లో సడేమియాలా అడిగింది మనవరాలు.

“అలసట ఏమీ లేదు. పద వెళదాము” అని బయలు దేరారు.

***

“అమ్మమ్మా, నేను నాలుగు డాలర్లు గెలుచుకున్నాను” అన్నది మనవరాలు వాకింగ్ నుంచి లోపలికి వస్తూనే.

“వావ్ ఇవ్వాళ ఏమిటీ, నువ్వూ మీ తాత డాలర్లు తెగ గెలిచేస్తున్నారు. ఎక్కడ గెలిచావేమిటి?” అడిగాను.

“తాత దగ్గరే గెలిచాను. అలా అలా నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళాము. తిరిగి నడిచేందుకు ఇద్దరికీ ఓపిక లేకపోయింది. అక్కడ బస్ స్టాప్ ఉంది. ఈ స్టాప్‌లో బస్ వస్తుంది అని నేనంటే రాదని నాలుగు డాలర్లు బెట్ కట్టారు. బస్ వచ్చింది. నాకు నాలుగు డాలర్లు ఇచ్చారు తాత…” అంటూ నాలుగు డాలర్లు చూపిస్తూ ఒకటే నవ్వేస్తోంది.

ఇంకేమనాలో తెలీక బిత్తర పోయి చూస్తున్న నన్ను చూసి నవ్వు ఆపి, “అమ్మమ్మా నాకు వద్దులే నువ్వు తీసుకో” అని ఇచ్చేయబోయింది.

అప్పటికి కాస్త తేరుకొని, “వద్దులే బంగారూ నీకేగా ఇచ్చింది ఉంచుకో” అన్నాను. సూక్ష్మంలో మోక్షం మనవరాలికే ఇచ్చారు ఇంకెవరికో ఇవ్వకుండా అని కాస్త తృప్తి పడ్డాను.

ఆ రోజు అలా గడిచిపోయింది. మరునాడు పొద్దున్నే పిల్లలకు ఏమైనా చేసిపెడుదామని ఫ్రిజ్‌లో ఏమున్నాయా అని చూస్తున్నాను. “అమ్మమ్మా ఇప్పుడు నువ్వేమి చేసినా మేము తినలేము. లంచ్ బాక్స్ అంటూ హడావిడి పడకు. మేము స్కూల్ లోనే తినేస్తాము. సాయంకాలం ఆలూ పరోటా చేయి” అని చెప్పి వెళ్ళింది మనవరాలు.

ఏమిటో ఈ ఉరుకులూ పరుగులూ… ఏదీ తినే సమయమే ఉండదు వీళ్ళకు. అందరూ వచ్చే టైం కల్లా అంతా సిద్దం చేసుకొని ఉంటే, వాళ్ళు రాగానే వేడి వేడిగా చేసి పెట్టవచ్చు అని అన్నీ ఉన్నాయో లేదో అని చూసుకుంటే కొత్తిమీర కనిపించలేదు. ఎట్లాగా ఏమి చేయటమా. ‘మన దగ్గర లాగా కాదు, ఉప్పు కోసం, పప్పు కోసం పరుగులు పెడితే తేలేము, దూరం వెళ్ళాలి అందుకే ముందే అన్నీ చూసుకొని తెచ్చుకుంటాము’ అంది మా అమ్మాయి. ఇప్పుడు కొత్తిమీర అంటే ఇంకేమైనా ఉందా అని మీమాంస పడుతుంటే, ఏమండీ “అట్లా వాకింగ్‌కు వెళ్ళొస్తాను. దగ్గరలోనే చిన్న సూపర్ మార్కెట్ ఉంది, ఏమైనా తేవాలా?” అని అడిగారు.

“అమ్మయ్య బతికించారు. కాస్త  కొత్తిమీర తెండి. కొత్తిమీర లేకపోతే ఆలూ పరోఠా ఏం బాగుంటుంది? కాస్త త్వరగా వచ్చేయండీ ప్లీజ్, ప్లీజ్. ఏ పటేల్ సాబ్‌తోనో ముచ్చట్లు పెట్టుకొని కూర్చొకండి ప్లీజ్ ప్లీజ్.” అన్నాను.

“మరీ అంత బతిమిలాడక్కరలేదులే. తొందరగానే వస్తాను” అని అభయమిచ్చారు.

చెప్పానే కాని కాస్త అనుమానంగా “సరిగ్గా చూసి తెస్తారుగా ” అన్నాను.

“ఏమిటి నాకు తెలీదా? ఎన్నిసార్లు కూరలు తేలేదు నేను?” అన్నారు చిరు కోపంగా.

“ఎందుకు తేలేదు మహరాజులా తెచ్చారు. కాకపోతే నాకు కూతురు పుట్టినప్పుడు, డాక్టర్ తోటకూర ఎక్కువగా పెట్టండి, కాల్షియం బాగా పడుతుంది, సాయంకాలం సొరకాయ, బీరకాయ లాంటి లైట్ కూరలు పెట్టండి తేలికగా అరుగుతాయి అని చెపితే, నా కూతురుకు కూతురు పుట్టి అది హైస్కూల్ కు వెళుతున్నా సంచీ నిండా నవనవలాడే తోటకూర, నిగనిగా మెరిసిపోయే పెద్ద పెద్ద సొరకాయలు రెండు తెస్తున్నరుగా! ఇప్పటికీ అవి వండలేక, తినలేక చస్తున్నా. అందుకేగా ఈ మధ్య కూరలు నేను తెచ్చుకుంటున్నాను” అని మనసులోనే గొణుక్కొని, బయటకు మాత్రం అవునండీ మీరు చాలా బాగా తెస్తారు అని ఉబ్బేసాను.

***

చేతిలో ఓ పెద్ద కవర్‌తో తాత, స్కూల్ నుంచి మనవరాలు ఒకేసారి వచ్చారు. ఏమిటీ ఇంత పెద్ద కవర్ అని చూస్తే దాని నిండా ఏదో ఆకు ఉంది.

“చూసావా ఎంత ఫ్రెష్‌గా ఉందో కొత్తిమీర. బాగుంది కొత్తిమీర కారం కూడా చేస్తావని నాలుగు డాలర్లది తెచ్చేసాను.”

కవరులోనుంచి తీసిన ఆకుకూర పట్టుకొని అటూ ఇటూ తిప్పి చూసాను. ఈ దేశంలో కొత్తిమీర ఇలా ఉంటుందా? ఆకు కాస్త పెద్దగా వేరుగా ఉన్నా కొత్తిమీర సువాసనైనా ఉండాలిగా అని ముక్కు దగ్గర పెట్టుకొని చూసినా వాసన తెలీలేదు కాని పెద్ద పెద్ద తుమ్ములు మూడొచ్చాయి!

“ఏమిటండీ ఈ పిచ్చాకు?” అన్నాను అయోమయంగా!

“పిచ్చాకు కాదు అమ్మమ్మా. దీనిని సలాడ్లలో వేస్తారు. దీని పేరు…

“ఏదో ఏట్లో పేరు. ఏ పేరైతే ఏముంది. కొత్తిమీర తెండీ అని ముద్దుగా చెపితే నాకా మాత్రం తెలీదాని గొప్పలకు పోయి నాలుగు డాలర్లు పెట్టి ఏదో పిచ్చాకు తెస్తారా?” అన్నాను కోపంగా.

“పిచ్చాకో మంచాకో. నువు ఎప్పుడైనా కొత్తిమీర ఇది అని చూపించావా నాకు? పోనీ పాపం అని తెచ్చి పెడితే వంకలు పెడుతున్నావా?” అన్నారు ఏమండీగారు అంతకన్నా కోపంగా.

“ఇన్నేళ్ళ సంసారంలో మీకు తోటకూర తప్ప ఇంకే ఆకుకూర తెలీదని తెలుసుకోకపోవటం నాదే తప్పు. ఎంచక్కా ఎనిమిది డాలర్లు సంపాదించారు అని సంబర పడ్డాను. నాలుగు డాలర్లు మనవరాలితో బెట్ కట్టి ఓడిపోయారు. నాలుగు డాలర్లు పెట్టి ఏదో పిచ్చాకు కొనుకొచ్చి నన్నే దబాయిస్తున్నారు, నేను  కొత్తిమీర ఎట్లా ఉంటుందో చూపించలేదని. డాలర్ మొగుడు డాలర్ మొగుడు అని కనీసం ఇరవైనాలుగు గంటలైనా మురిసిపోనీయలేదు!” ఉక్రోషంగా సణుక్కున్నాను!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here