దొంగ ఎవరు?

2
7

[dropcap]సం[/dropcap]క్రాంతి పండుగ రోజు ఉదయం పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టాడు రంగనాథ్. అక్కడ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తన మిత్రుడు ఈశ్వర్రావుతో,

“ఒరే! ఈశ్వరం, నిన్న పండుగ పూటే పాతిక వేలు పోగొట్టుకున్నారా” బాధగా చెప్పాడు.

“ఏం జరిగిందిరా? బస్సులో పిక్ పాకెట్ జరిగిందా? రైటర్ గారిని కేకేయనా? కంప్లైంట్ ఇద్దువుగాని” అడిగాడు ఈశ్వర్రావు.

“బస్సులో కాదురా! ఇంట్లోనే దొంగలు పడ్డారు”

“ఔనా? అయితే డబ్బులే కాకుండా విలువైన వస్తువులు కూడా ఏమైనా పోయాయా?” ఆదుర్దాగా అడిగాడు ఈశ్వర్రావు.

“ఏమీ పోలేదురా! ఆ పాతిక వేలూ తప్ప. ఇంట్లోనే దొంగలు పడ్డారు అంటే నా ఉద్దేశం దొంగలు ఇంట్లోనే ఉన్నారు అని. నీకు ఉన్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాళ్లెవరో చెప్పగలవేమో చూడు, కంప్లైంట్స్ గట్రా లేకుండా!” అసలు విషయం చెప్పాడు రంగనాథ్.

“సరే నా శక్తి మేరకు ప్రయత్నిస్తా! అలా కేంటీన్ వద్దకు పోయి మాట్లాడుకుందాం, రా!” అంటూ స్నేహితుడుని తీసుకుని కేంటీన్ వైపు నడిచాడు హెడ్ కానిస్టేబుల్ ఈశ్వర్రావు.

***

“ఏం లేదురా! మొన్న సాయంత్రం మా కంపెనీ వాళ్ళు అందరికీ పండుగ బోనస్ ఇచ్చారు. ఆ డబ్బులు ఓ కవర్‌లో పెట్టి దానిని ప్యాంటు జేబులో పెట్టుకుని తర్వాత ఆ విషయమే మరచి పోయాను. నీకు తెలుసు కదా! నాకు కొంచెం మతిమరుపు అనీ అలాగే నాకు పర్స్ వాడే అలవాటు లేదనీ” కేంటీన్‌లో కాఫీ తాగుతూ చెప్పసాగాడు రంగనాథ్.

“సరే, ఈ విషయం ఇంట్లో ఎవరెవరికి తెలుసు?” అడిగాడు ఈశ్వర్రావు.

“మొన్న రాత్రి భోజనాలు టైంలో మటుకు మా ఆవిడకి, మా పెంపుడు కొడుకుకు ఈ విషయం చెప్పానురా!”

“మీ పెంపుడు కొడుకు అంటే టీబీ వ్యాధితో బాధపడి చనిపోయిన మీ చెల్లాయి కొడుకు గోపాలేనా? వీళ్ళు సరేకానీ నీకు ఎవరి మీద అనుమానం ఉంది?”

“నాకైతే మా పనిమనిషి అచ్చెమ్మ మీద కొంచెం అనుమానంగా ఉందిరా?” చెప్పాడు రంగనాథ్, కొంచెం సందేహంగా.

“ఏం? ఎందువల్ల నీకు అలాంటి అనుమానం వచ్చింది”

“ఎందుకంటే నిన్న ఉదయం స్నానం చేసి, నా వాష్ రూమ్ లోంచి బయటకు వస్తూంటే, ఈ అచ్చెమ్మ, నేను ప్యాంటు పెట్టిన చోట తచ్చాడుతోంది. నన్ను చూసి ఉలిక్కిపడి, ‘బాబూ! గది తుడుస్తూంటే, ఇదిగో ఏదో కాగితం కింద దొరికింది’ అంటూ ఏదో సూపర్ బజార్ బిల్లు చేతికిచ్చింది”

“మరి నీకు అప్పుడు అనుమానం వచ్చి, జేబులో డబ్బులు ఉన్నయో లేవో చూసుకోలేదా?” అనుమానంగా అడిగాడు ఈశ్వర్రావు.

“లేదురా! పెళ్లి అయ్యి, కొత్తగా కాపురం పెట్టిన మూడు నెలల తర్వాత అమ్మాయి, అల్లుడు ఆ రోజు వస్తున్నారన్న ఆనందంలో ఆ డబ్బు సంగతే గుర్తుకు రాలేదు”

“సరే! అచ్చెమ్మ తీసి ఉంటుందన్నది కేవలం నీ అనుమానం. అంతేనా?”

“ఔనురా! ఎందుకంటే ఈమధ్య తన కూతుర్ని ఇంటర్‌లో జాయిన్ చేయడానికి కొంచెం డబ్బు సాయం చేయమని మా ఆవిడని అడిగిందిట. అందుకే అనుమానం వస్తోంది” తటపటాయిస్తూ చెప్పాడు రంగనాథ్.

“మరింకేం. ఆమె తీసి ఉంటుంది. ఓ కంప్లైంట్ ఇయ్యి. మిగతాది నేను చూసుకుంటాను” తన బాషలో చెప్పాడు హెడ్ కానిస్టేబుల్ ఈశ్వర్రావు.

“కంప్లైంట్ ఒద్దురా! ఆమె ఇరవై ఏళ్ల నుంచి మా ఇంట్లో పనిచేస్తోంది. ఇంతవరకూ ఇంట్లో ఓ పూచిక పుల్ల కూడా పోలేదు. అలా అనుమానించవలసి వస్తే డిగ్రీ చదువుతున్న మా గోపాల్‌ని కూడా అనుమానించాలి. ఎందుకంటే పది రోజుల క్రితం ‘డాడీ! సంక్రాంతి పండుగ తర్వాత మా ఫ్రెండ్స్ అంతా కలసి నాగార్జున సాగర్ ట్రిప్ ప్లాన్ చేసాం. ఓ ఎనిమిది వేలు రెడీ చేసుకోండి’ అన్నాడు. దానికి నేను ‘అలా కాదురా! మొదటి పండక్కి అక్కా బావా వస్తున్నారు. ఖర్చులు ఉంటాయి. తరువాత చూద్దాం!’ అన్నాను. ఒకవేళ వాడు కూడా తీసి ఉండొచ్చేమో అని నా అనుమానం” సందేహం వ్యక్తం చేసాడు రంగనాథ్.

“ఒరే! వాడు నీ పెంపకంలో పెరిగాడు. అలాంటి పనులు చేస్తాడా?” ఆశ్చర్యంగా అడిగాడు ఈశ్వర్రావు.

“పెంపకం నాదైనా రక్తం మా బావగారిదే కదా! ఆయన ఇలాగే దుబారా ఖర్చులు చేసి, వ్యసనాలకు బానిస అయ్యి అర్ధాంతరంగా పోయాడు. అలాగే వీడు కూడా సాగర్ ట్రిప్‌కు నేను డబ్బులు ఇవ్వనని దొంగిలించి ఉంటాడా అని అనుమానం?”

“సరే! అది అలా ఉంచు. ఇంకా ఎవరిమీదైనా అనుమానం ఉందా?”

“కిందటి నెలలో జరిగిన వాళ్ళ తమ్ముడి కూతురు పెళ్లికి ధన సహాయం చేయలేదన్న కోపంతో మా ఆవిడ కానీ తీసిందా అన్న అనుమానం కూడా ఉందిరా!” మొహమాటం లేకుండా చెప్పాడు రంగనాథ్.

“ఒరే రంగా! నీ వాటం చూస్తే నన్ను కూడా అనుమానించేలా ఉన్నావు. ఇంతమంది మీద అనుమానం ఏమిట్రా? నిన్ను తగలెయ్యా! ఔనూ, ఇంత మందిని అనుమానించావు కదా? మరి మీ అల్లుడు, కూతురు మీద అనుమానం రాలేదా”

“రాలేదురా! ఎందుకంటే, వాళ్ళ ట్రైన్ ఆలశ్యం అవ్వడంతో రావడం రావడం వాళ్లకు కేటాయించిన గదిలోకి వెళ్లి స్నానాదికాలు ముగించుకున్నారు. ఆ తరువాత నేనూ, అల్లుడు, అమ్మాయి, అబ్బాయి వీధి గదిలో భోజనాల సమయం వరకూ పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నాం. ఆ తరువాత కాసేపటికి మా అమ్మాయి రమ వాళ్లమ్మ ఉన్న కిచెన్ లోకి వెళ్లింది, వంటలో సాయం చేయడానికి. అందుకే వాళ్లిద్దరి మీద నాకు అనుమానం లేదు” ఖరాఖండిగా చెప్పాడు రంగనాథ్.

“సరే! అసలు ఇంతకీ డబ్బులు పోయాయన్న విషయం నీకు ఎప్పుడు తెలిసింది?” పరిశోధనలో భాగంగా అడిగాడు ఈశ్వర్రావు.

“ఓ అదా! నిన్న మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత పిల్లలకు బట్టలు కొందామని బయలుదేరాం. అప్పుడు జ్ఞాపకం వచ్చింది డబ్బులు సంగతి. వెంటనే పాత ప్యాంటులో చూస్తే లేవు. బయటికి చెబితే బాగుండదని, మాట్లాడకుండా ఊరుకుని, నా క్రెడిట్ కార్డుతో బట్టలు కొన్నానులే, అది వేరే సంగతి. అసలు ఇంటి దొంగ ఎవరో అనుభవజ్ఞుడైన నీ ద్వారా తెలుసుకుందామని ఇదంతా నీకు చెప్పా. సరే నీ అనుమానం ఎవరిమీద? వాళ్ళు ఎవరో తెలిస్తే కొంచెం జాగ్రత్త పడదామని” వేడుకుంటూ అడిగాడు రంగనాథ్.

“ఒరే, ఇలాంటివి ఎలిమినేషన్ పద్ధతిలో ఒక్కొక్కరినే మినహాయించుకుంటూ పోవాలి. నువ్వు చెప్పిన ప్రకారం ముందుగా మీ అమ్మాయిని అల్లుడ్ని తీసేద్దాం. మిగిలిన వారిలో మీ ఆవిడను కూడా తీసేయొచ్చు. ఎందుకంటే అలా చేయడం వలన ఆమెకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇక మిగిలిన వారు అచ్చెమ్మ, గోపాల్. వీరిలో ఎవరు తీసేరనేది రహస్యంగా దర్యాప్తు చేస్తా. ఈ పండుగ నాలుగు రోజులు పోనీ” రంగనాథ్‌ని సముదాయించి ఇంటికి పంపాడు హెడ్ కానిస్టేబుల్ ఈశ్వర్రావు.

***

ముక్కనుమ రోజున కూతురు, అల్లుడు వెళ్లి పోవడంతో ఇల్లంతా బోసి పోయినట్లు అనిపించింది రంగనాథ్‌కి.

ఆ మర్నాడు ఆఫీసులో ఉన్న రంగనాథ్‌కి ఫోన్ చేసి, “ఏరా! ఓ సారి స్టేషన్‌కి వస్తావా, ముందు మీ పనిమనిషి అచ్చెమ్మని మాములుగా అడిగి చూద్దాం. అంతకీ ఒప్పుకోక పోతే కేసు ఫైల్ చేసి మా పద్థతిలో విచారిద్దాం” అడిగాడు ఈశ్వర్రావు.

“అవసరం లేదురా! ఆ డబ్బు ఎక్కడ పోయిందో అదే ప్యాంటులో మళ్లీ దొరికింది. ఇంక ఆ సంగతి వదిలేయ్” నెమ్మదిగా చెప్పాడు రంగనాథ్.

“ఔనా! పోనీలే, అది నీ కష్టార్జితం. అందుకే దొరికింది. ఇంతకీ ఆ డబ్బుని ఎవరు తీసారని నీ అనుమానం?” ఉత్సాహంగా అడిగాడు ఈశ్వర్రావు.

“మా అమ్మాయి” నిర్లిప్తంగా చెప్పాడు

“నాకు తెలుసురా! మొన్న నువ్వు చెబుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఆ రోజున నువ్వు, మీ అల్లుడు వీధి గదిలో మాట్లాడుతూ ఉండగా మీ అమ్మాయి కిచన్ లోకి వెళ్లింది అన్నావు చూడు. అప్పుడే తీసి ఉంటుంది. ఔనా? ఇంతకీ ఎందుకు తీసింది? మళ్లీ ఎందుకు పెట్టింది?” అనుమానంగా అడిగాడు ఈశ్వర్రావు.

“ఏం లేదురా! నా నిర్లక్ష్యం మరియు మతిమరుపు గురించి తెలియచేయాలని అలా చేసిందిట. ఆ నాలుగు రోజుల్లోనూ నేను అసలు ఆ సంగతే ఎత్తకపోయేటప్పటికి ఊరికి వెళ్లే ముందు నా జేబులో పెట్టి, తర్వాత ఫోన్ చేసి ఆ విషయం చెప్పింది” అసలు విషయం చెప్పాడు రంగనాథ్.

“ఓర్నీ, ఎంత కంగారు పెట్టావురా? మొత్తం మీద ఇంటి దొంగని ఈ ఈశ్వర్రావు కూడా పట్టలేడని మరోసారి ఋజువయ్యింది” నవ్వుతూ చెప్పాడు హెడ్ కానిస్టేబుల్ ఈశ్వర్రావు.

“ఇంటి దొంగని పట్టడానికి అసలు ఇంట్లో దొంగతనమే జరగలేదు కదరా?” నవ్వుతూ బదులిచ్చాడు రంగనాథ్.

“ఔను కదా! మరి ఉంటారా!” అని ఫోన్ కట్ చేసాడు ఈశ్వర్రావు.

***

తన మిత్రుడు ఈశ్వర్రావుకు అబద్ధం చెప్పేనన్న బాధ, మనసుని తొలిచేస్తుండగా నిన్న జరిగిన సంఘటన ఓసారి జ్ఞాపకం తెచ్చుకున్నాడు రంగనాథ్.

***

నిన్న సాయంత్రం అల్లుడు వాళ్ళు వెళ్లిన తర్వాత పాత బట్టలు వాష్‌కి ఇద్దామని చూసిన రంగనాథ్‌కి ప్యాంటు జేబులో పాతిక వేలుతో ఉన్న కవరూ, వాటితో పాటు అమ్మాయి రాసిన ఓ లెటరూ ఉండడం కనిపించింది.

డబ్బులు తీసుకుని, ఆతృతగా ఆ లెటర్ చదవడం మొదలెట్టాడు రంగనాథ్.

నాన్నకి,

రమ నమస్కరించి వ్రాయునది.

మేము వచ్చిన రోజున, కిచెన్‌లోకి వెళుతూ మీ గదిలో ఏమైనా విలువైన వస్తువులు బయటపెట్టి మరచి పోయారా అని చూసా. అప్పుడు, నాకు మీ ప్యాంటు జేబులో ఉన్న కవర్ అందులో పాతిక వేలు కనబడ్డాయి. వెంటనే తీసి నా వద్ద జాగ్రత్త చేసాను.

ఎందుకంటే..

కాపురం పెట్టిన మొదటి రోజుల్లో నాకు మా అత్తయ్య గారు చెప్పారు మా ఆయనకి క్లిప్టోమేనియా అనే మానసిక రుగ్మత ఉందని. ఏదైనా వస్తువు కనబడితే అవసరం లేకపోయినా దొంగిలించడం దాని లక్షణంట. అయితే ఈ రెండు నెలల్లో మా ఇంట్లో నేను జాగ్రత్తగా ఉండడం వలన ఏమీ పోలేదు కానీ ఆఫీసులో చిన్న చిన్న వస్తువులు పోతూంటాయని ఈయన మానసిక స్థితి తెలిసినవారు కొంతమంది చెప్పారు. పెళ్లి అయిన తర్వాత మా ఆయన మన ఇంటికి రావడం ఇదే మొదటిసారి కాబట్టి అలవాటు ప్రకారం ఆయన నీ జేబులోంచి కూడా ఏదైనా తీస్తారేమోనని అనుమానంతో ఎందుకైనా మంచిదని ఆ కవర్ జాగ్రత్త చేసా. మొన్న బట్టల షాపులోనూ, అలాగే మార్కెట్ లోనూ నేను ఈయన వెనకాలే ఎందుకున్నానో ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది. నేను రోజంతా ఈయనను కనిపెట్టుకుని ఉండడం వలన నీతో ఈ విషయం చెప్పడం కుదరక నిన్న రాత్రి ఈయన పడుకున్న తర్వాత ఈ లెటర్ రాసి, ఈ ఉదయం డబ్బుతో పాటు నీ ఫాంట్ జేబులో పెట్టాను.

కంగారు పడవద్దు. ఇది ఏమీ ప్రమాదకరమైన వ్యాధి కాదుట. త్వరలో నయమవుతుంది. ఎల్లుండి ఓ సైకియాట్రిస్ట్ దగ్గర అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నాము.

ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు.

చదవడం అవ్వగానే ఈ లెటర్ చింపి వేయండి.

ప్రేమతో మీ అమ్మాయి

రమ

ఆ ఉత్తరం చదివిన వెంటనే దానిని ముక్కలు ముక్కలుగా చింపేసాడు రంగనాథ్.

***

నిన్నటి జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చిన రంగనాథ్ ఏదో జ్ఞాపకం వచ్చి, వెంటనే కూతురికి ఫోన్ చేయసాగాడు, అల్లుడి విషయంలో ఆమె తీసుకున్న ముందు జాగ్రత్తలకు అభినందనలు చెప్పడానికి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here