మనసును హత్తుకునే మంచి నవల – దూరతీరాలు

0
9

[dropcap]ఊ[/dropcap]హతో, కాల్పనిక ప్రతిభతో ఒక ఇతివృత్తాన్ని నవలగా మలచడం కన్నా తెలిసిన వ్యక్తుల వ్యథా భరిత యదార్థ గాథను నవలగా చిత్రించడం క్లిష్టమైన, మరెంతో బాధ్యతాయుతమైన పని. అటువంటి క్లిష్టతరమైన రచనకు పూనుకుని, ‘దూరతీరాలు’ పేరిట ఓ మంచి నవలను పాఠకులకు అందించారు వాసిరెడ్డి కాశీరత్నం.

ఈ నవలలో ఇద్దరు మహిళల (తల్లీబిడ్డల) జీవితాలను అత్యంత వాస్తవికంగా, ఆసక్తికరంగా చిత్రించారు రచయిత్రి. కథ విషయానికి వస్తే, రామనాథం వద్ద అల్లారుముద్దుగా పెరుగుతుంది లీనా. యాదృచ్ఛికంగా కలిసిన భాస్కర్ తన కాలేజీలోనే చదువుతున్నాడని తెలుస్తుంది. క్రమంగా వారి పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ భాస్కర్ తల్లిదండ్రులు ఒప్పుకోరు. వారి అభ్యంతరానికి కారణం తన పుట్టుక నేపథ్యమే అని తెలిసి ఖిన్నురాలవుతుంది లీనా. తన గురించి నిజం దాచినందుకు రామనాథాన్ని నిలదీస్తుంది. మెంటల్ హాస్పిటల్‌లో ఉన్న కన్న తండ్రి నాయుడు పరిస్థితిని చూసి వ్యథకు లోనవుతుంది. రామనాథం కళ్ల ముందు గతం కదలాడుతుంది. చిన్నతనంలో నాయుడు భార్య అయిన రోజలీన్ పట్ల తన ఆరాధన, ఆమె తోడి అనుబంధం.. ఒకరోజు జాలర్ల వాడకు ఆమెతో పాటుగా వెళ్లి మరణావస్థలో ఉన్న ఆమె తల్లిని చూడడం, రోజలీన్ పట్ల నాయుడి కర్కశ ప్రవర్తన, ఆమె హఠాత్తుగా ఊరు వదలి వెళ్లిపోవడం.. కొన్నేళ్ల తర్వాత ఢిల్లీ వెళ్లిన తనకు, ప్రమాదానికి గురైన రోజలీన్ కనబడడం, ఆమెను ఆసుపత్రిలో జేర్చడం.. ఆమె తన కథనంతా చెప్పడం.. ఫాదర్ చెరియన్‌తో పాపను ఇంగ్లండ్ పంపడం.. రోజలీన్ కూడా ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధమైన తరుణంలో నాయుడు వచ్చి గొడవ చేయడమే కాక, ఆమెను హత్య చేయడం, తాను పాప (లీనా) బాధ్యత తీసుకోవడం, ఇంగ్లండ్ నుంచి పాపను రప్పించి, పెంచి పెద్ద చేయడం.. అన్నీ గుర్తుకొస్తాయి. ఇక, లీనా జాలర్ల వాడకు వెళ్లి తల్లి తాలూకు బంధువులను కలుస్తుంది. వారి జీవితాల్లో వెలుగు నింపాలని, అక్కడ పాఠశాల ఏర్పాటు చేస్తుంది. సముద్రం ఒడ్డున తల్లి విగ్రహాన్ని నెలకొల్పుతుంది. చదువు నేర్పడంతో బాటు వాళ్ల జీవన విధానంలో మార్పు తెస్తుంది. ఆ తరుణంలో భాస్కర్ వచ్చి తన చెల్లెళ్ల బాధ్యత వగైరాలన్నీ పూర్తి అయ్యాయని, లీనా కోసమే వచ్చానని అంటాడు. లీనా తన ఆశయాన్ని మధ్యలో వదిలి రాలేనంటుంది. ఆమె కోసం వచ్చిన భాస్కర్ తానే అక్కడ ఉండిపోతానని అనడు. ఆలస్యంగా వచ్చినందుకు సారీ చెప్పి వెళ్ళిపోతాడు.

నవలలో ప్రతి పాత్రను ఎంతో శ్రద్ధగా చెక్కారు. రచయిత్రి. రామనాథం పాత్రను ఎంతో ఉదాత్తంగా మలిచారు. రోజలీన్, లీనా సంక్షుభిత హృదయాలను అద్వితీయంగా ఆవిష్కరించారు. చక్కని, చిక్కని రచనలను ఇష్టపడే వారికి ఈ నవల తప్పక నచ్చుతుంది.

***

దూరతీరాలు (నవల)
రచన: వాసిరెడ్డి కాశీరత్నం,
పుటలు: 120,
వెల: ₹ 100,
ప్రతులకు: నవ చేతన, ప్రజాశక్తి, విశాలాంధ్ర
రచయిత్రి ఫోన్: 040-23513056, 8790255232

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here