డాక్టర్ అన్నా బి.యస్.యస్.-10

0
8

[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

[ఇంటికి వచ్చిన లాస్యని కుశల ప్రశ్నలు వేస్తారు ధర్మతేజ, మాధవి. ఫార్మాలిటీ కోసం కాక, శ్రద్ధగా చదవాలని లాస్యకి సూచిస్తాడు అన్నా. తనకి ఏవైనా సందేహాలుంటే అడగమని చెప్తాడు. లాస్య అమెరికా వచ్చి ఎన్ని రోజులయిందో అడిగి, వాళ్ళ బాబాయి గారి పిల్లల గురించి అడుగుతాడు అన్నా. ఆమె చెబుతుంది. అన్నాకి ఆ పేరు ఎందుకు పెట్టారో అడుగుతుంది. చెప్తాడు అన్నా. తరువాత – లాస్య నచ్చిందా అని తల్లిదండ్రులు అన్నాని  అడుగుతారు. ఆ అమ్మాయి వింటే బావుండదని అంటాడు అన్నా. అమ్మాయి నచ్చితే మరో ఏడాది తరువాత వివాహం చేస్తామని అంతారు తల్లిదండ్రులు. ఇంతలో అక్కడికి లాస్య వచ్చి తాను బయల్దేరుతాను అని అంటుంది. మర్నాడు శ్రావణ శుక్రవారం అని, ఆ రాత్రికి ఉండి, పొద్దున పూజ చేసుకుని వెళ్ళవచ్చు అని అంటుంది మాధవి. అన్నా కూడా ఉండమంటాడు. ధర్మతేజ లాస్య బాబాయికి ఫోన్ చేసి వివరం చెప్తాడు. లాస్యకి ఓ జాకెట్ కుడతానని చెప్పి, ఆమెకి భారతీయ సాంప్రదాయాలను గురించి చెప్తుంది. ఆ రాత్రి – అన్నా గదిలోకి వెళ్ళి – లాస్య తమకు బాగా నచ్చిందని చెబుతుంది మాధవి. తల్లిదండ్రులు ఏ నిర్ణయం తీసుకున్నా తనకి సమ్మతమని చెప్తాడు అన్నా. లాస్య నిద్ర లేచాకా, ఆమెని తీసుకెళ్ళి ఓ కొత్త చీర కొనాలని అంటుంది మాధవి.  ఇక చదవండి.]

[dropcap]“అ[/dropcap]వుననుకోండి.. తనకి నచ్చిన దాన్ని తీసి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం..”

“సరే అలాగే!.. వెళదాం..”

ముగ్గురూ హాల్లోకి వచ్చారు. సోఫాల్లో కూర్చున్నారు. టీవీ చూస్తున్నారు.

లాస్య నిద్రలేచి రెస్ట్ రూమ్‌కి వెళ్ళి.. స్నానం చేసి.. మాధవి పంపిన డ్రస్ వేసుకొని క్రిందకు వచ్చింది.

“గుడ్ ఈవినింగ్..” అంది నవ్వుతూ లాస్య.

చిరునవ్వుతో ముగ్గురూ ఆమె వైపు చూశారు.

లక్ష్మి.. నాలుగు కప్పులతో టీ నలుగురికి అందించింది.

“లాస్యా!.. టీ త్రాగు. మనం అలా బజార్‌కు వెళ్లివద్దాం..”

“ఎందుకు ఆంటీ?..”

“ఈ వూరి బజారు ఎలా వుందో చూడు..” నవ్వుతూ చెప్పింది మాధవి.

“అమ్మా!.. మీరు వెళ్లి రండి.. నేను ఇంట్లో వుంటాను..” అన్నాడు అన్నా..

మాధవి చిరుకోపంతో అన్నా ముఖంలోకి చూచింది.

“నో.. నీవు మాతో రావాలి!..” చెప్పింది మాధవి…

“నాన్నా.. మీరైనా చెప్పండి అమ్మకు!..” జాలిగా అడిగాడు అన్నా.

“నాన్నా.. నేను మీ అమ్మ నిర్ణయాన్ని కాదనగలనా!.. సో.. ప్లీజ్.. బి రెడీ.. నేను రెడీ అయి వస్తాను..” ధర్మతేజ నవ్వుతూ తన గదిలోనికి వెళ్లాడు.

అన్నా.. తల్లి.. లాస్యలను ఓ క్షణం చూచి తన గదికి వెళ్లాడు.

‘భక్త ప్రహ్లాద’.. సినిమా టీవీలో వస్తూవుంది.

ఆసక్తికరంగా చూస్తూవుంది మాధవి.

లాస్యకు అది మహా బోరుగా తోచింది. మాధవి ముఖంలోకి చూచింది.

“ఆంటీ!..”

“ఏమిటి లాస్యా!..”

“మీకు పాత సినిమాలంటే చాలా ఇష్టమా!..”

“పాత సినిమాలంటే కాదు.. పౌరాణిక సినిమాలంటే చాలా ఇష్టం.. లవకుశ.. శ్రీకృష్ణావతారం.. కురుక్షేత్రం.. శశిరేఖాపరిణయం.. శ్రీకృష్ణపాండవీయం.. దానవీరశూరకర్ణ.. ఇంకా ఎన్నో.. అవన్నీ మన హైందవ ధర్మాలకు.. నీతినియమాలకు.. ఆచార వ్యవహారాలకు ప్రతిరూపాలు. వీటిలోని చిత్రకల్పన ఆర్ట్ అసాధారణం.. ఇక కథనం.. రామాయణం.. మహా భారతం.. మన హైందవ సంస్కృతికి ప్రమాణాలు.. పూజనీయ మహాగ్రంథాలు.. చరిత్రలు.. ఐ ఫీల్ ప్రౌడ్ టు సే అయామ్ ఏన్ హైందవి..” చిరునవ్వుతో ఎంతో గర్వంగా చెప్పింది మాధవి..

‘ఓహో!.. మీరు పాత చింతకాయ పచ్చడన్నవమాట!..’ అనుకొంది లాస్య.

అన్నా.. ధర్మతేజ వారి గదుల నుండి డ్రస్ మార్చుకొని హాల్లోకి వచ్చారు.

“అమ్మా!.. మేము రెడీ..” తండ్రిగారి ముఖంలోకి చూస్తూ చెప్పాడు.. అన్నా..

మాధవి సోఫానుండి లేస్తూ..

“లాస్యా!.. పద వెళదాం..” అంది.

నలుగురూ.. కార్లో కూర్చున్నారు.

అన్నా ప్రక్కన లాస్య కూర్చునేలా.. తనూ ధర్మతేజా ముందుగా వెనక సీట్లో కూర్చున్నారు.

అన్నా తల్లి ముఖంలోకి ఒక క్షణం చూచి కార్లో కూర్చొని స్టార్ట్ చేశాడు. ఓ అరగంట లోపల పెద్ద షాపింగ్ మాల్ పార్కింగ్ ప్లేసులో.. కారును ఆపాడు. నలుగురూ దిగారు.. లిఫ్ట్ లో రెండవ ఫ్లోర్‌కి వెళ్లారు.

ఆ షాప్ వారికి ధర్మతేజ దంపతులు చిరపరిచితులే.. అది ఇండియన్ షాపే..

శారీస్ సెక్షన్ చేరి.. కాటన్ శారీస్ కావాలని అడిగింది మాధవి.

రెండు మూడు డిజైన్లు చూపించాడు షాప్ సేల్స్‌మన్.

“ఆ.. లాస్యా!.. చూడు.. నీకు ఏ రంగు.. ఏ డిజైన్ నచ్చిందో చెప్పు..”

“అమ్మా.. నేను చెప్పనా?..” చిరునవ్వుతో అడిగాడు అన్నా..

“నాన్నా!.. అది వాళ్ల మ్యాటర్ మనకెందుకురా!.. కుడి ఎడమైతే!..” నవ్వాడు ధర్మతేజ..

“ఆ.. ఆ.. అవును నాన్నా.. యు ఆర్ రైట్!..”

లాస్యా.. అన్నా ముఖంలోకి చూచింది..

“ఆ.. ఆ.. లాస్యా మేడమ్.. త్వరగా సెలెక్టు చేయండి..” అన్నాడు అన్నా..

“మీకు ఏది నచ్చింది..” అడిగింది లాస్య.

“ఎవరికి..”

“మీకు.. మీకు..” చిరునవ్వుతో అంది లాస్య

“నాన్నా!.. చెప్పేయి.. నీ అభిప్రాయాన్ని!..” అంది మాధవి.

“హలో లాస్యగారూ!.. నేను మగాణ్ణి!..”

“మగవారికి టేస్టు వుండదా!..” చిలిపిగా నవ్వింది లాస్య.

ధర్మతేజ నవ్వుతూ అర్ధాంగి.. మాధవి ముఖంలోకి చూచాడు.

మాధవి తల ఆడించింది.

“నాన్నా!.. చెప్పు.. నీకు ఏది నచ్చింది?..” అడిగింది మాధవి.

అన్నా.. “తప్పదా అమ్మా!..” జాలిగా అడిగాడు.

అతని పోజ్ చూసి లాస్య నవ్వింది.

అన్నా.. క్రీకంట లాస్య ముఖంలోకి చూస్తూ..

తనకు నచ్చిన ఓ చీరను చేతికి తీసుకొన్నాడు.. “లాస్యా మంచి రంగు” చిరునవ్వుతో చెప్పాడు అన్నా..

అన్నా సెలక్టు చేసిన చీర చందనం రంగు.. ఎరుపు గీతల మధ్యన ఆకుపచ్చ రంగు బోర్డర్..

అన్నా సెల్ మ్రోగింది.

కాల్ ఫ్రమ్ హాస్పిటల్..

“ఆ.. ఆ.. ఓకే.. డోన్ట్ వర్రీ.. ఐ యామ్ కమింగ్!..” సెల్ కట్ చేసి..

“అమ్మా.. నాన్నా!.. అర్జంట్ కేస్!.. వెళ్లాలి.. ప్లీజ్ యంగేజ్ టాక్సీ అండ్ గో హోమ్..” లాస్య వైపు తిరిగి.. “ప్లీజ్ టేక్ యాజ్ యు విష్..” అన్నాడు ఏదో ఆలోచనతో..

వేగంగా లిఫ్ట్ వైపు నడిచి.. ఎక్కి క్రిందకు వెళ్లి కారును సమీపించి కూర్చొని.. హాస్పటల్‌కు బయలుదేరాడు.

లాస్యకు.. అతని వేగానికి.. అందరినీ కవర్ చేసి.. మాట్లాడి వెళ్లిపోయిన విధానం.. చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘రేపు.. అంటే యం.యస్., పూర్తి అయాక తనూ ఇలాగే పరుగిడవలసి వస్తుందేమో!.. అవును.. పరుగిడాలి.. మానవ సేవే..మాధవ సేవ..’ అనుకొంది లాస్య.

ధర్మతేజ.. మాధవి.. లాస్య బట్టలు తీసుకొని టాక్సీలో ఇంటికి బయలుదేరారు. అన్నా వెళ్లిపోవడంతో.. ముగ్గురూ మౌనంగా కూర్చున్నారు. అరగంటలో ఇంటికి చేరారు..

సాధారణంగా ఏదైనా మేజర్ ఆపరేషన్ చేయబోయేముందు రాత్రి.. అన్నా పూజామందిరంలో చాలాసేపు కూర్చొని దైవధ్యానాన్ని చేసి ప్రశాంతంగా పడుకోవడం.. మరుదినం లేచి కాలకృత్యాదులు తీర్చుకొని పదినిముషాలు దైవం ముందు చేతులు జోడించి నిలిచి తన కర్తవ్యాన్ని గురించి.. ఆ నిర్వహణలో తనకు విజయం కలగాలని దేవుని వేడుకొని.. టిఫిన్ తిని.. తల్లి ఎదురు రాగా.. ధైర్యంతో నవ్వుతూ కార్లో కూర్చొని హాస్పటల్‍కు వెళ్లడం అతనికి అలవాటు.

ఈనాడు అలా జరుగలేదు.. ఆ కారణంగా మాధవి.. ధర్మతేజ అప్సెట్ అయినారు. ప్రక్కన క్రొత్త అమ్మాయి… ఏమనుకొంటుందో ఏమో అనే భావనతో చిరునవ్వుతో లాస్యను భోంచేయమని వడ్డించి ప్రక్కన కూర్చుంది మాధవి.

“మీరూ తినండి ఆంటీ!..”

“అన్నా వస్తాడమ్మా.. వచ్చాక ముగ్గురం కలసి తింటాం. నీవు తిని వెళ్లి పడుకో అమ్మా.. ఐదుగంటలకు లేపుతాను. తలస్నానం చేయాలి. కొత్త బట్టలు కట్టుకోవాలి. నాతో కలసి మన సాంప్రదాయం ప్రకారం శ్రావణ తొలి శుక్రవారం పూజ చేయాలి.. నీకు ఏం కావాలో దాన్ని నీవు ఆ జగన్మాతను కోరుకోవచ్చు!.. తప్పక సిద్ధిస్తుంది.. అది నా అనుభవం..” చిరునవ్వుతో అనునయంగా చెప్పింది మాధవి.

లాస్య కావలసినది తిని చేయి కడుక్కొని.. ధర్మతేజ.. మాధవీలకు గుడ్ నైట్ చెప్పి తన గదికి వెళ్లిపోయింది.

ఆ దంపతులు ఇరువురూ అన్నా కోసం ఎదురు చూస్తున్నారు..

రాత్రి పదీముక్కాలు.. అన్నా ఫోన్..

ధర్మతేజ తీశాడు సెల్..

“నాన్నా!.. ఈ రాత్రికి నేను రావడంలేదు. ఉదయం ఆరున్నరకల్లా ఇంటికి వస్తాను. అమ్మకు చెప్పండి. మీరు భోంచేసి ఉండరని నాకు తెలుసు. వెంటనే భోంచేసి పడుకోండి.. నాకు కావాల్సింది నేను ఇక్కడ తిన్నాను. గుడ్ నైట్ నాన్నా!..” ఎంతో సౌమ్యంగా చెప్పాడు అన్నా.

“ఈ రాత్రికి ఇంటికి రాడు కదూ!..” అడిగింది మాధవి

“అవును.. ఉదయం ఆరున్నరకల్లా వస్తాడట..”

‘కర్తవ్య నిర్వహణలో తండ్రికి మించిపోయిన కొడుకు. సర్వేశ్వరా!.. నా బిడ్డకు నీవే అండ’ అనుకొంటూ.. “ పదండి.. తిని పడుకొందాం..” అంది మాధవి.

ఇరువురూ వరండా నుండి ఇంట్లోకి వెళ్లారు.

***

ఆ రోజు.. తొలి శ్రావణ శుక్రవారం.. ముందురోజు ఉదయాన్నే ఆ ప్రాంతంలో ఉన్న అరుగురు ముత్తైదువులను.. సాయంత్రంగా వచ్చి తాంబూలం తీసుకొని పోవలసిందిగా పిలిచింది మాధవి.

లాస్యను ఐదున్నరకు లేపింది.. స్నానం చేయమంది.. విసుగ్గానే లేచింది లాస్య.

ఆ రాత్రి ఆమె తండ్రి భార్గవ ఫోన్ చేసి లాస్యతో.. ధర్మతేజకు.. తనకు గల స్నేహాన్ని గురించి వివరంగా చెప్పాడు. “లల్లీ!.. ధర్మతేజ నా ప్రాణమిత్రుడు. చిన్న నాటి నుంచి.. ఒకే వూరి వాళ్లం.. ఒకే స్కూలు కాలేజీలో చదివిన వాళ్లం.. సజాతి వాళ్లం.. బంధువులం.. అతని కొడుకు అన్నా అంటే నాకు చాలా ఇష్టం.. నీ వివాహం అతనితో జరిపించాలనేది మీ అమ్మా.. నా ఆకాంక్ష.. నీవు ఇప్పుడు వాళ్ల ఇంట్లో వున్నావుగా.. అతన్ని స్టడీ చెయ్యి.. ఆ దంపతుల తత్వాలను గురించి పరిశీలన చెయ్యి.. నీకు ఏదైనా సందేహం వుంటే నాకు ఫోన్ చేసి అడుగు.. నీ సందేహాన్ని నేను తీరుస్తాను. అన్నా లాంటి అల్లుడు దొరకడం పూర్వజన్మ సుకృతం.. సరేనా!..” ఎంతో అనునయంగా చెప్పాడు భార్గవ..

నాన్నగారి మాటలను గురించి ఆలోచిస్తూ.. రెస్టురూంకు వెళ్లింది. స్నానం ముగించింది లాస్య,

ఆ సమయానికి మాధవి తాను కొన్న చీర.. రాత్రి భోజనం చేసిన తర్వాత కుట్టిన రవిక, పూలు.. పెట్టిన స్టీలు తట్టతో వచ్చి లాస్య గది తలుపు తట్టింది. లాస్య తలుపు తెరచి బయటికి రాగానే “గుడ్ మార్నింగ్ లాస్యా!.. ఇలా చూడు.. చీర రవిక పూలూ.. వీటిని కట్టుకొని తలలో పూలు పెట్టుకొని క్రిందకు రా!.. అన్నా బయలుదేరినట్టు ఫోన్ చేశాడు.. త్వరగా రా!.. అందరం కలసి ఆ జగన్మాత.. పూజ చేసుకొందాం..” అంది మాధవి.

ఆశ్చర్యంగా ఆమెను చూచింది.. లాస్య.

“ఏం.. అలా చూస్తున్నావు లాస్యా!..” అడిగింది మాధవి.

“అంటే.. మీకు మన ఆచారవ్యవహారాలు.. పూజలు.. పునస్కారాలు.. అన్నీ వివరంగా తెలుసునా!..” ఆశ్చర్యంతో అడిగింది లాస్య.

“తెలుసమ్మా! మా అమ్మా నాన్నలు నేర్పారు..” చిరునవ్వుతో చెప్పింది..

“ఆ.. నేను వెళుతున్నానమ్మా.. నీవు తయారై క్రిందికి రా..” మాధవి వెళ్లిపోయింది.

అన్నా సెలక్టు చేసిన చందనపు కలర్ చీర.. కట్టుకొని మాధవి కుట్టిన బ్లౌజు ధరించి తలలో హేర్ పిన్ను సాయంతో పూలు పెట్టుకొని రెడ్ స్టిక్కర్ చిన్న బొట్టుతో.. తన అలంకారాన్ని అద్దంలో చూచుకొని.. తనకు తాను మురిసిపోతూ.. ‘ఏయ్! లాస్యా!.. సరిలేరు నీకెవ్వరూ!.. అన్నా నిన్ను చూచి పిచ్చోడైపోతాడు..’ అనుకొంటూ ఆనందంగా నవ్వుతూ తన గది నుండి బయటికి వచ్చింది.

అన్నా.. హాల్లోకి ప్రవేశింది మేడపైకి మెట్లు ఎక్కసాగాడు.. లాస్య అన్నాను చూచింది. రాత్రి అంతా పనిచేసినా.. అతని ముఖంలో ఎలాంటి అలసట.. చికాకు కనిపించలేదు..

లాస్యను చూచిన అన్నా.. “లాస్యా!.. శుభోదయం..” అందంగా నవ్వాడు. అతని నోటి పైపళ్లవరుస తెల్లగా మల్లెల్లా మెరిశాయి. నొక్కుల వుంగరాల జుట్టు నొసటిపై వింత అందాన్ని ఇస్తూ వుంది.

‘ఈ మనిషి చాలా అందగాడు.. అబ్బా!..’ అనుకొంటూ అతన్నే చూస్తూ ముందుకు అడుగు వేసిన లాస్య కాలు మెట్టుపై చివరన పడడంతో.. తూలి ముందుకు పడబోయింది.

ఎదురుగా వస్తున్న అన్నా.. తన ఎడం చేతిని సాచి.. లాస్య పడకుండా ఆపాడు. నాలుగు కళ్లూ కలిసాయి.

“చీర మీకు అలవాటు లేదుగా.. అందువల్లే తడబడ్డారు..” నవ్వుతూ చేతిని పైకెత్తి లాస్య సవ్యంగా నిలబడేలా చేశాడు అన్నా..

అదే సమయానికి అతని గొంతు విన్న మాధవి.. ధర్మతేజాలు హాల్లోకి వచ్చారు. అన్నా తన చేత్తో పైకి లేపుతున్న లాస్యను.. అన్నా మాటలను విన్నారు.

ఆ దృశ్యం.. ఆ దంపతుల కిరువురికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఒకరి ముఖంలోకి ఒకరు చూచుకొని ఆనందంగా నవ్వుకొన్నారు.

“చీర కుచ్చిళ్లు ఎత్తిపట్టుకొని నెమ్మదిగా నడవాలి లాస్యా!..” అనునయంగా చెప్పింది మాధవి..

“అమ్మా! హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్.. గాడ్ ఈజ్ గ్రేట్!..” నవ్వుతూ ఆనందంగా చెప్పాడు అన్నా.. క్షణం తర్వాత.. “ఈ రోజు తొలి శ్రావణ శుక్రవారం కదూ!.. అందుకే లాస్యకు చీరను కట్టబెట్టావు. చీరలో లాస్య చాలా అందంగా వుందమ్మా!..” వేగంగా తన మనసులోని మాటను అనేసిన అన్నా.. మరుక్షణంలో.. ‘ఒరేయ్!.. ఆవేశపడ్డావు కదరా!.. అమ్మా నాన్నలు ఏమనుకొంటారో.. ఆ అమ్మాయి ఏమనుకొంటుందో.. అనే అలోచనే చేయకుండా త్వరపడ్డావు..’ అనుకొన్నాడు.

“అన్నా!.. నీవు అన్నమాట సత్యం. చీరలో లాస్య అప్సరసలా వుంది.. ఏమండి.. ఏమంటారు?.. నవ్వుతూ అడిగింది మాధవి.

“ఆ.. ఆ.. నీవు చెప్పింది నిజం..” అన్నాడు ధర్మతేజ..

“అమ్మా.. ఫ్రెష్ అయి కిందకు వస్తాను..” అంటూ అన్నా తన గదిలోకి వెళ్లిపోయాడు.

లాస్య చిరునవ్వుతో మాధవిని సమీపించింది.

ధర్మతేజ లాస్యను ఫొటో తీశాడు.. “అమ్మా లాస్యా!.. ఈ నీ ఫొటోను నా మిత్రుడు అదే మీ నాన్న భార్గవకు పంపుతాను. వాడు ఎంతగానో ఆనందిస్తాడు..” అని తన గదిలోకి వెళ్లిపోయాడు.

“రా లాస్యా!.. పిలిచింది మాధవి.

ఇరువురూ పూజా గదిలో ప్రవేశించారు.

కలశం పెట్టి జగన్మాత రూపాన్ని అద్భుతంగా అలంకరించింది మాధవి. అగరువత్తుల కమ్మని వాసన గదిలో నిండిపోయింది. ఎంతో ప్రశాంతం.. ఆనందం..

“కూర్చో..” అంది మాధవి.

లాస్య కూర్చుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here