డాక్టర్ అన్నా బి.యస్.యస్.-11

0
12

[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

[లాస్యకి కొత్త చీర కొనాలనుకుంటుంది మాధవి. ఆమె నిద్ర లేచి  టీ తాగాకా, తయారవమని అంటుంది మాధవి. ఎందుకని అడిగితే, మా వూరి బజారులు చూపిస్తాను అంటుంది. అన్నాని కూడా రమ్మంటుంది, కాదంటాడు. ధర్మతేజ తానూ వస్తున్నాననీ, అన్నానీ కూడా బయల్దేరమని అంటాడు. తన గదిలో ‘భక్త ప్రహ్లాద’ సినిమా చూస్తున్న మాధవిని ‘ఆంటీ మీకు పాత సినిమాలు ఇష్టమా’ అని అడుగుతుంది లాస్య. పౌరాణిక సినిమాలంటే ఇష్టమని చెబుతూ హైందవ సంస్కృతి అంటే తనకి గౌరవమని చెబుతుంది. ‘పాత చింతకాయ పచ్చడి’ అని మనసులో అనుకుంటుంది లాస్య. కాసేపటి తర్వాత అందరూ అన్నా కారులో షాపింగ్‍కి వెడతారు. అక్కడ అన్నాని చీర సెలెక్ట్ చేయమంటుంది లాస్య. ఓ చీరని ఎంపిక చేస్తాడు. ఇంతలో ఆసుపత్రికి నుంచి అన్నాకి ఫోన్ వస్తుంది, అర్జంటు కేసు అంటూ. తల్లిదండ్రుల్ని, లాస్యని క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళమని చెప్పి తాను వెళ్ళిపోతాడు. కాసేపటికి లాస్య, మాధవి, ధర్మతేజలు కూడా ఇల్లు చేరుతారు. లాస్యకి భోజనం వడ్దించి తినమంటుంది మాధవి. మీరూ తినండి అంటే, తాము అన్నా వచ్చాక తింటామని చెబుతుంది. లాస్య కావలసినది తిని ధర్మతేజ మాధవీలకు గుడ్ నైట్ చెప్పి తన గదికి వెళ్లిపోతుంది. రాత్రి 10.45కి అన్నా ఫోన్ చేసి, తాను రాత్రికి ఇంటికి రాలేనని, అమ్మానాన్నలని తినేయమని చెప్తాడు. మర్నాడు ఉదయాన్నే లాస్యని లేపి తల స్నానం చేయించి, పూజకు సిద్ధం చేయించి, కొత్త చీర కట్టుకుని రమ్మంటుంది మాధవి. కొత్త చీర కట్టుకుని ఆమె వస్తుండగా, అప్పుడే అన్నా లోపలికి ప్రవేశిస్తాడు. చీరలో లాస్య  బావుందని మాధవితో అంటాడు. ధర్మతేజ లాస్య ఫోటో తీసి ఆమె తండ్రి, తన మిత్రుడు భార్గవకి పంపుతానని అంటాడు. పూజగదిలోకి తీసుకెళ్ళి లాస్యను కూర్చోమంటుంది మాధవి.  ఇక చదవండి.]

[dropcap]త[/dropcap]నూ కూర్చొని.. “చూడు లాస్యా!.. నేను పుట్టిన ఇంట్లో మెట్టిన ఇంట్లో సనాతన హైందవ ధర్మాలను యథాతథంగా నిర్వర్తించేవారు.. దైవం మీద అపారనమ్మకం వున్నవారు.. అదే నాకు మావారికి.. నా కొడుకు అన్నాకు అలవాటయింది. మా వారంటుంటారు.. ‘మా భార్గవగాడికి దైవభక్తి చాలా చాలా అధికమని’.. మావారికి.. నీవు మా యింటి కోడలివి కావాలనే ఆశ.. వారికే కాదు.. నిన్ను చూశాక నాకు కూడా అదే నిర్ణయం కలిగింది.. సరే.. నేను అమ్మవారి శతనామావళి చదువుతూ వుంటాను.. నీవు శ్రద్ధగా అమ్మవారికి కుంకుమ పూజ చేయి..” అంది ఎంతో ప్రీతితో మాధవి.

మాధవి విఘ్నేశ్వర పూజ ముగించి.. శ్రీ లలితా శత నామావళి చదవడం ప్రారంభించింది.

లాస్య ఆమె చెప్పిన రీతిగా.. ఒక్కో నామాన్ని చెప్పడం ముగించగానే.. ఓం.. అని చెప్పి అమ్మవారి పాదాలపై కుంకుమ ఉంచుతూ పూజ చేసింది. పూజా కార్యక్రమం ఒక అరగంటలో ముగిసింది.

అమ్మవారి పాదాల చెంతనుంచి ఒక పుష్పం తాను తీసుకొని కళ్లకు అద్దుకొని తలో పెట్టుకొని మరొకటి లాస్యకు ఇచ్చి చెప్పసాగింది మాధవి.. “అమ్మా!.. లాస్యా!.. జగమంతా శక్తిమయం.. ప్రతి స్త్రీమూర్తి శక్తికి ప్రతిరూపం.. మనది కర్మభూమి.. కర్మ అంటే సిద్ధాంతం అని అర్థం. ఆ మహాతల్లి అష్టాదశ శక్తి పీఠాలలో వెలసి తనను నమ్మినవారికి రక్షణగా.. తల్లిగా కాచి కాపాడుతుంది. ఆ తల్లి ఒక్కో ప్రదేశంలోని పీఠంలో ఒక్కో పేరుతో విరాజిల్లుతోంది. వాటిని నిత్యం చదివితే పుణ్యప్రదం.

‘ఓం.. లంకాయాం శాంకరీదేవి, కామాక్షీ కాంచికాపురీ

ప్రద్యుమ్నే శృంఖలాదేవీ, చాముండే క్రౌంచపట్టణే

అల్లంపురీ జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబికా

కొల్హాపురీ మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహంకాళీ, పీఠికాయాం పురూహూతికా

ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్ష వాటికా

హరిక్షేత్రే కామరూపీ, ప్రయాగే మాధవేశ్వరీ

జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్య గౌరికా

వారణాశ్యాం విశాలాక్షీ, కాశ్మీరేతు సరస్వతి

అష్టాదశ పీఠాని, యోగినామపి దుర్లభం

సాయంకాలం పఠేన్నిత్యం, సర్వ శత్రునాశనం

సర్వ రోగహరం దివ్యం, సర్వ సంపత్కరం శుభం॥’

భక్తి పారవశ్యంతో కళ్లు మూసుకొని సుస్వరంతో శ్లోకాలు చదువుతున్న మాధవి వైపు తదేక దీక్షతో చూస్తోంది లాస్య.. “భక్తులను బ్రోచేందుకు అమ్మవారు పై అష్టాదశ పీఠాల్లో వెలిసినట్లే సర్వేశ్వరుడైన బోళా శంకరుడు జ్యోతిర్లింగాలు అనే పేరుతో పన్నెండు ప్రదేశాల్లో వెలిసి పూజలందుకుంటున్నాడు” అంటూ మాధవి ద్వాదశర్లింగ స్తోత్రం ప్రారంభించింది.

‘ఓం సౌరాష్ట్ర సోమనాధంచ, శ్రీశైలే మల్లికార్జునమ్।

ఉజ్జయిన్యాం మహాకాళమ్ ఓంకారమమరేశ్వరమ్॥

ప్రజ్జ్వల్యాం వైద్యనాథంచ ఢాకిన్యాం భీమశంకరమ్।

సేతు బంధేతు రామేశం నాగేశం దారుకావనే॥

వారణాశ్యంతు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీతటే।

హిమాలయేతు కేదారం ఘృశ్మేశంచ విశాలకే॥

ఏతాని జ్యోతిర్లింగాని, సాయం ప్రాతః పఠేన్నరః।

సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి॥’

అంటూ శ్రావ్యంగా శ్లోకాలు పూర్తిచేసిన మాధవి తన్మయురాలై వింటున్న లాస్యతో నవ్వుతూ ఆ శ్లోకాల అర్థాలను వివరించసాగింది.

“పదునెనిమిది క్షేత్రాల్లో అమ్మ కొలువైన స్థానాలనే పీఠాలు అంటారు. వాటిలో అమ్మవారు..

శ్రీలంకలోని ట్రింకోమలిలో – శ్రీశాంకరీదేవి,

తమిళనాడులోని కంచిలో – శ్రీ కామాక్షీదేవి,

గుజరాత్ లోని ప్రద్యుమ్నంలో – శ్రీ శృంఖలాదేవి,

కర్నాటక నందలి మైసూరులో – శ్రీచాముండేశ్వరీ దేవి,

ఆంధ్రప్రదేశ్లోని అల్లంపురం నందు – శ్రీజోగులాంబాదేవి,

ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో – శ్రీ భ్రమరాంబికా,

మహారాష్ట్రలోని కొల్హాపూర్‍లో – శ్రీ మహాలక్ష్మీదేవి,

మహారాష్ట్ర నాందేడ్ నందు – శ్రీ ఏకవీరాదేవీ,

మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ నందు – శ్రీ మహాకాళీదేవి,

ఆంధ్రప్రదేశ్ పిఠాపురం నందు – శ్రీ పురూహూతికాదేవి,

ఒరిస్సాలోని కటక్‍లో – శ్రీ గిరిజాదేవి,

ఆంధ్రప్రదేశ్ దాక్షారామంలో – శ్రీ మాణిక్యాదేవి,

అస్సాంలోని గౌహతి నందు – శ్రీ కామరూపిణీ,

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగలో – శ్రీ మాధవేశ్వరీదేవి,

హిమాచలప్రదేశ్ లో ని జ్వాలాకేతంలో – శ్రీ వైష్ణవీదేవి,

బీహారు నందలి గయ క్షేత్రంలో – శ్రీ మాంగల్యగౌరీ దేవి,

ఉత్తరప్రదేశ్ వారణాసి నందు – శ్రీ విశాలాక్షి

కాశ్మీరు రాష్ట్రంలోని జమ్మూ నందు – శ్రీ సరస్వతీదేవి

పేర్లతో జగన్మాత భక్తులకు కొంగుబంగారమై విలసిల్లుతోంది.

ఇక సర్వేశ్వరుడైన బోళా శంకరుడు మన భరత ఖండంలో పన్నెండు స్థానాల్లో లింగస్వరూపుడై వున్నాడు. వాటినే జ్యోతిర్లింగాలు అంటారు. అవి:

సౌరాష్ట్ర నందలి వీరవల్‍లో – సోమనాథేశ్వరుడు,

ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో – మల్లికార్జునుడు,

మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీలో – మహాకాళేశ్వరుడు,

శివపురిలో – ఓంకారేశ్వరుడు,

ఉత్తరా ఖండ్ లోని కేదార్నాధ్ లో – కేదారనాధుడు,

మహారాష్ట్రలోని త్రిపదవిషోర్ లో – భీమశంకరుడు,

ఉత్తరప్రదేశ్ వారణాశిలో – విశ్వనాథుడు,

మహారాష్ట్రలోని నాసిక్‍లో – త్రయంబకేశ్వరుడు,

మహారాష్ట్రలోని పార్‍విలలో – వైద్యనాధుడు,

గుజరాత్ నందలి దారుకావనంలో – నాగేశ్వరుడు,

తమిళనాడు రామేశ్వరంలో – రామేశ్వరుడు,

రాజస్థాన్ షివార్‍లో  – మహేశ్వరుడుగా ప్రసిద్ధిపొందారు.

“ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు హైందవతకు ఆచార పూజా పునస్కారాలకు ప్రమాణాలు.. ప్రత్యక్ష నిదర్శనాలు. మన హైందవులు ఆస్తికులని తెలియచేసే సాక్ష్యాలు.. సారాంశం.. ఆయా క్షేత్రాలను మన హైందవ సోదరీ సోదరులు దేశం నలు మూలల నుంచి ఆ ప్రదేశాలకు చేరి సర్వేశ్వరులను దర్శించి.. ఎంతో ఆనందం పొందుతారు.. మన హైందవ వ్యవస్థ సుస్థితమైన సాదృశ్యమైనది. యుగాల చరిత్ర కలది. వుయ్ షుడ్ ఫీల్ ప్రౌడ్ బోరన్ యాజ్ హైందవ్.. హోప్ యు హావ్ బోర్డ్ విత్ మై స్పీచ్..” లాస్యను చూస్తూ నవ్వింది మాధవి.

యథార్థంగా మాధవి ఉపన్యాసం లాస్యకు ఎంతో బోర్ కొట్టింది. ఓ తరుణంలో నిద్ర కూడా వచ్చిందనే చెప్పాలి. తొట్రుపాటుతో “లేదు ఆంటీ!..” అంది మెల్లగా లాస్య.

“ఈ విషయాలన్నీ నీకు ఎందుకు చెప్పానో చెప్పగలవా?..”

లాస్య తొట్రుపాటుతో మాధవి ముఖంలోకి చూచింది.

“నేను తెలుసుకొనేటందుకు..” మెల్లగా అంది.

“అవును..” తల వూపింది మాధవి.. క్షణం తర్వాత.. “లాస్యా.. నేటి యువతులు.. యువకులతో సమానంగా అన్ని రంగాల్లో పాల్గొంటున్నారు.. విజయాలను సాదిస్తున్నారు. కానీ మన సంస్కృతిని.. వ్యవస్థను మరిచిపోయి కట్టు బొట్టు మార్పుతో చాలా వికృతంగా తయారవుతున్నారు. కొందరు ఆవేశంలో మొగవారికి లొంగిపోయి.. వారిచేత మోసపోయి బాధపడేవారు.. ప్రేమ అనే పేరుతో వివాహాన్ని చేసుకొని.. వ్యక్తిత్వ బేధాభిప్రాయాలతో.. ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోలేక ‘ఇగో’తో విడాకులు తీసుకొని విడిపోతున్నారు. చిత్ర విచిత్రంగా బ్రతుకుతున్నారు. పాశ్చాత్య విజ్ఞానం.. నా దష్టిలో మనుగడకు సాధనం.. మధురమైన తాంబూల చర్వణానికి సున్నాన్ని ఎంత వాడుకొంటామో.. ఈ పాశ్చాత్య విజ్ఞానాన్ని అలాగే ఉపయోగించుకోవాలి. మన సంప్రదాయాలను.. ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా.. గౌరవించడం.. పాటించడం.. మన ధర్మం. అందులోనే మనకు ఆదరణ.. గౌరవం.. ఎదుటివారి అభిమానం లభిస్తాయి..” మాధవి చెప్పడం ఆపి ద్వారం వైపు చూచింది.

ధర్మతేజా.. అన్నా.. చిరునవ్వుతో కనుపించారు.. లోనికి వచ్చారు. కలశానికి నమస్కరించారు. మాధవి వారికి తీర్థ ప్రసాదాలను ఇచ్చింది.

“పదండి.. టిఫిన్ చేద్దాం!..” చెప్పింది మాధవి.

నలుగురూ గదినుండి బయటకు నడిచారు.

లక్ష్మి.. డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ సిద్ధం చేసింది. ఇడ్లీ.. వడ.. సాంబార్.. టెంకాయ చట్నీ..

నలుగురూ కూర్చున్నారు. లక్ష్మి వడ్డించింది. సరదా కబుర్లతో.. టిఫిన్ తిన్నారు.. కాఫీ త్రాగారు.

లాస్య మేడ పైని తన గదికి వెళ్లి చీర.. బ్లవుజ్ విప్పి టీషర్టు.. జీన్స్ ధరించింది. బ్యాగ్ సర్దుకొని క్రిందికి వచ్చింది. “ఆంటీ!.. అంకుల్!.. ఇక నేను బయలుదేరుతాను” అంది.

“ఆ చీర, బ్లవుజ్ తీసుకొన్నావా?..” అడిగింది మాధవి.

“ఆ.. అందరికీ థ్యాంక్స్..” చిరునవ్వుతో చెప్పింది.

ధర్మతేజ.. మాధవి ముఖంలోకి చూచాడు.

“నేను నీతో రానా అమ్మా!..” అడిగాడు ధర్మతేజ.

“వద్దు అంకుల్!.. నేను వెళతాను..” అంది లాస్య

నలుగురూ వరండాలోంచి హాల్లోకి వచ్చారు. అన్నా.. లాస్య దగ్గర తాళం తీసుకొని తన కారును పోర్టికోనుండి బయటకు తీసి షెడ్లో పెట్టి.. అక్కడ వున్న లాస్య కారును పోర్టికోలోకి తీసుకొచ్చాడు. తాళాన్ని లాస్యకు అందించాడు.

“ఆంటీ.. అంకుల్.. బయలుదేరుతాను..” బ్యాగ్‌ను వెనుక సీట్లో వుంచి.. తాను స్టీరింగు ముందు కూర్చుంది లాస్య.

“జాగ్రత్తగా వెళ్లిరండి..” చిరునవ్వుతో చెప్పాడు అన్నా.

“ఒకే.. ధ్యాంక్యూ!.. బై!..” లాస్య కారు ముందుకు వెళ్లిపోయింది.

ముగ్గురూ ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు.. చిరునవ్వుతో.. లోనికి వెళ్లారు. సోఫాల్లో కూర్చున్నారు. ధర్మతేజ ఫోన్ రింగయింది.

“హలో!..”

“నేను రా!..”.

“ఓ.. భార్గవా!..”

“అవును..”

“అమ్మాయి.. ఇపుడే బయలుదేరింది.. వాళ్ళ చిన్నాన్న ఇంటికి..”.

“ఏం ఇబ్బంది పెట్టలేదు కదా!..”

“నో.. నో.. తన వల్ల మాకు ఏమిటిరా ఇబ్బంది?.. వుయ్ త్రీ ఫెస్ట్ వెరీ హ్యాపీ!.. మాతో తాను అంతగా కలసిపోయింది.. నీవు చెల్లమ్మ సరే అంటే.. లాస్య నా కోడలవుతుంది..” నవ్వాడు ధర్మతేజ.

అన్నా.. తల్లి ముఖంలోకి చూచాడు. మాధవి నవ్వింది.

“ఎందుకమ్మా.. నవ్వుతావు?..”

“మీ నాన్నగారు అన్నది నాకు నచ్చిన మాట..”

“అమ్మా!.. ప్లీజ్.. నామాట విను.. మరో సంవత్సరం పాటు నన్ను స్వేచ్ఛగా బ్రతకనీయండి..” బ్రతిమాల సాగాడు. ధర్మతేజ..

“ఇది మా ముగ్గురి అభిప్రాయంరా..” అంటూ సెల్లో మాట్లాడుతున్నాడు.

“సరేరా!.. నీ మాటను నేను కాదంటానా?.. ఓకే.. ఓకే.. ఆమె చదువు పూర్తికానివ్వరా!..” నవ్వుతూ చెప్పాడు భార్గవ.

“ఓకే రా! అలాగే!..” ధర్మతేజ సెల్ కట్ చేశాడు. భార్య ముఖంలోకి చూచాడు..

“ఏమంటున్నాడు మన కొడుకు?..”

“పాత పాటే.. మరో సంవత్సరం వాయిదా!..”.

“అవును నాన్నా.. ప్లీజ్ యాక్సెస్ట్ ఇట్..”

భార్యాభర్తలు ఒకరి ముఖాలు ఒకరు చూచుకొని నవ్వుకున్నారు.

అన్నా.. సోఫాలో కూర్చొనివున్న తల్లి తొడలపై తలపెట్టుకొని..

“అమ్మా!.. నీ కొడుకుని నీవు సపోర్టు చేస్తావుగా..” జాలిగా అడిగాడు అన్నా.

“నాన్నా!.. నీ యిష్టమే నా యిష్టం..”

“నాన్నా.. మరి మీరు?..”

“నీ మాటను నేను ఏనాడు కాదన్నాను నాన్నా!..”

అన్నా.. తల్లి తండ్రి ముఖాల్లోకి చూచి.. “అమ్మా.. నాన్నా!.. నేను చాలా అదృష్టవంతుణ్ణి..” ఆనందంతో కళ్లు మూసుకున్నాడు.

***

లాస్య.. తన తండ్రి భార్గవకు ఫోన్ చేసి అన్నా ఇంట్లో తన అనుభవాలను గురించి.. మాధవీ.. ధర్మతేజలను గురించి వివరంగా చెప్పింది.

భార్గవ అంతా విని.. “అమ్మా!.. లాస్యా!.. వారిది చాలా మంచి కుటుంబం. ధర్మతేజా నేను చిన్న వయస్సులో ఒకే వూర్లో కలసి చదువుకొన్నాము. పెరిగాము. నాకు తోచిన ఒక్క మాటలో చెప్పాలి అంటే.. నేను నా పెద్ద అల్లుడు ‘అన్నా బాబే’ అని ఫిక్స్ అయిపోయా!..” తన ధృఢ సంకల్పాన్ని తెలియచేశాడు భార్గవ.

తండ్రి నిర్ణయం లాస్యకు రుచించలేదు. కారణం.. మాధవి ఆచార వ్యవహారాలు.. నమ్మకాలు.. ఆమె చెప్పిన మాటలు తనకు నచ్చలేదు. ఇక ధర్మతేజా.. అర్థాంగి మాటను జవదాటడు. ఇక అసలు హీరో.. అన్నా!.. మనిషి మహా స్తబ్ధు.. ఎపుడూ ఏదో అలోచిస్తూ వుంటాడు. అమ్మా నాన్నల పట్ల ఎంతో గౌరవం.. వారికి తెలియకుండా ఏ పనీ చేయకపోవడం.. అతనిలోని ఆ లక్షణాల పట్ల తనకు అసంతృప్తి..

తాను వచ్చేటపుడు ‘ఆ రాత్రి ఓ మంచి క్లబ్కు అన్నాతో కలసి జాలీగా త్రాగి.. డ్యాన్స్ చేసి.. ఆనందంగా గడపగలనని’ అనుకొంది. కానీ.. ఆ సాయంత్రం అన్నా హాస్పటల్‌కు.. తాను ఇద్దరి ముసలి వాళ్ల మధ్యన వారి గత జీవిత పురాణాలను వింటూ బోరెత్తిపోయి ‘ఎందుకు వచ్చానురా బాబూ!..” అనుకొంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here