డాక్టర్ అన్నా బి.యస్.యస్.-15

0
11

[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

[సాయంత్రం ఇంటికి వచ్చిన అన్నా నారాయణమూర్తి గారి వారిని కుటుంబ సభ్యులను పలకరిస్తాడు. తమ మెడికల్ కాలేజీ ఆవరణలో పార్వతి డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేద్దామని అంటాడు అన్నా. పార్వతి అంగీకరిస్తుంది. రెండు రోజుల తర్వాత ఏర్పాటు చేస్తానని చెప్తాడు అన్నా. అన్నా స్వభావం పార్వతికి నచ్చుతుంది. నారాయణమూర్తికి ఇష్టమైన పదార్థాలు వండిస్తుంది మాధవి. అందరూ టిఫిన్ తింటుంటారు. నాట్య ప్రదర్శనకి తేదీ చెబుతుంది పార్వతి. ఏర్పాటు చేయిస్తానని అంటాడు అన్నా. ధర్మతేజ, మాధవి – లాస్యతో తప్పిన అన్నా వివాహం గురించి తలచుకుని బాధపడతారు. మాధవికి పార్వతి బాగా నచ్చుతుంది. అదే మాట భర్తకి చెబుతుంది. నారాయణమూర్తిని అడగమంటావా అని ధర్మతేజ అంటాడు. ముందు మనవాడి అభిప్రాయం కనుక్కోవాలి అంటూ మాధవి అన్నా గదిలోకి వచ్చి అతని ఉద్దేశం అడుగుతుంది. మీ ఇష్టమే నా ఇష్టం అంటాడు అన్నా. ముందు పార్వతికి తాను నచ్చానో లేదో కనుక్కోమంటాడు. పార్వతితో కాసేపు సమయం గడిపి, చుట్టుపక్కల ప్రాంతాలు చూపించి ఆమె మనసు తెలుసుకోమంటుంది మాధవి. సరేనంటాడు అన్నా. మాధవి సంతోషిస్తుంది. భర్తకి వివరాలు తెలియజేస్తుంది. మర్నాడు ఉదయం జాగింగ్ చేస్తుండగా – తమ కోరికని నారాయణమూర్తి ని చెప్పాలనుకుంటాడు ధర్మతేజ. అదే ఆలోచన నారాయణమూర్తి మనసులోనూ మెదలుతుంది. పార్వతి గురించి మాట్లాడుకుంటారు ఇద్దరూ.  ఇక చదవండి.]

[dropcap]“అ[/dropcap]లాగా!!..”

“అవునురా!..”

“అవునురా!.. ఆమెను గురించి ఎందుకు అడిగావు?..”

“నా కోడలిగా చేసుకోవాలనిరా!..”

పరుగిడుతున్న నారాయణమూర్తి.. అదిరిపోయి.. ఆశ్చర్యంతో ధర్మతేజా ముఖంలోకి చూచాడు.

“ఏమిట్రా.. ఆగిపోయావ్!..” అడిగాడు ధర్మతేజ.

“పార్వతిని నీ కోడలుగా చేసుకొంటావా!” ఆశ్చర్యానందాలతో అడిగాడు నారాయణమూర్తి.

“అవునురా!.. ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు.. మీ చెల్లిలిది కూడా!..”

నారాయణమూర్తి అయోమయావస్థలో నిలబడి పోయాడు.

“ఏమిట్రా.. అలా దిగాలుపడి నిలబడిపోయావ్?..” నారాయణమూర్తి ముఖంలోకి చూస్తూ.. మెల్లగా అడిగాడు

నారాయణమూర్తి విచారంగా నిట్టూర్చాడు.

“ధర్మా!.. నీవు నీ ఇల్లాలు నీ కొడుకు ఎలాంటివారో నాకు నా భార్యకు బాగా.. బాగా.. తెలుసు. నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా చేసికొంటానని నీవు చెప్పిన మాట నాకు ఎంతో ఆనందం.. అన్నా లాంటి యోగ్యుడు అల్లుడుగా రావాలంటే.. దానికి పూర్వజన్మ సుకృతం వుండాలి.. నాకు ఆ యోగం వుందో.. లేదో!..” విచారంగా చెప్పాడు నారాయణమూర్తి.

“ఒరేయ్!.. నారాయణా.. ఎందుకురా అంతగా ఫీలవుతున్నావు?..”

“పార్వతి మరో రెండు సంవత్సరాలు వివాహానికి అంగీకరించదు. తాను ఐ.ఎ.ఎస్. పూర్తి చేసి కలెక్టర్ కావాలనే పట్టుదలలో వుందిరా!.. నీవు అన్నాకు మరో రెండు సంవత్సరాలు అన్నా.. వివాహాన్ని వాయిదా వేయగలవా?..” ప్రాధేయ పూర్వకంగా అడిగాడు నారాయణ..

“ముందు నీవు పార్వతిని అడుగు.. తనకు అన్నా నచ్చాడా లేదా అనే విషయాన్ని.. నచ్చకపోతే.. దైవనిర్ణయం లేదని మన ఇద్దరం అనుకోవాలి. మన స్నేహాన్ని కొనసాగించాలి.. నచ్చితే నా కొడుకు నా మాట ప్రకారం రెండు సంవత్సరాలు ఆగుతాడు. పార్వతి ‘కలెక్టర్ పార్వతి’గా అయిన తర్వాతే వారి వివాహం.. సరేనా!..” చిరునవ్వుతో చెప్పాడు ధర్మతేజ..

నారాయణమూర్తి ఆనందంగా.. ధర్మతేజ చేతిని తన చేతిలోనికి తీసుకొని.. “రేయ్! ధర్మా!.. నీ నిర్ణయం పట్ల నాకు ఎంతో ఆనందం. నీవు చెప్పినట్టుగానే నేను పార్వతిని అడిగి తన నిర్ణయాన్ని నీకు తెలియజేస్తాను. ఏది ఏమైనా.. మన స్నేహం.. మనం చచ్చేంతవరకూ స్వచ్ఛమైన స్నేహంగా.. ఇలాగే సాగి ఎదుటివారికి ఆదర్శంగా మిగిలిపోవాలి..” కాస్త ఆవేశంతో.. ఎమోషన్‌తో చెప్పాడు నారాయణమూర్తి.

ఇరువురు జాగింగ్ కొనసాగించి ఇంటికి చేరారు.

ఆరోజు శ్రావణ మాసం తొలి శుక్రవారం..

ఆడవారు ముగ్గురూ ఐదుగంటలకు లేచి స్నానం చేసి పూజామందిరం అలంకరణ.. వంటకు కావల్సిన వస్తువుల తయారీ.. కార్యక్రమాల్లో వున్నారు.

అన్నా నిద్ర లేచి.. ఆసనాలు.. యోగా చేసి.. స్నానం చేసి శుచిగా క్రిందికి దిగి వచ్చాడు.

ధర్మతేజ.. నారాయణమూర్తి అదే సమయానికి హాల్లోకి వచ్చారు.

అన్నా.. చిరునవ్వుతో ఇరువురికీ విష్ చేశాడు. హాల్లో సోఫాల్లో కూర్చున్నాడు. లక్ష్మి అందించిన కాఫీ కప్పును అందుకొన్నాడు. మాధవి చెప్పగా.. పార్వతి హాల్లోకి వస్తూ అన్నాతో.. “గుడ్ మార్నింగ్.. కాఫీ తీసుకొని రమ్మంటారా !..” అడిగింది. శ్రావ్యమైన ఆ కంఠస్వరాన్ని విన్న అన్నా.. పార్వతి వున్న వైపు చూచాడు. ఆమెకు కనబడని తన ఎడంచేతిలో వున్న కాఫీ కప్పును పైకెత్తి.. చిరునవ్వుతో చూపించాడు.

పార్వతి అందంగా నవ్వి లోనికి వెళ్లిపోయింది.

మిత్రులు ఇరువురూ.. స్నానాదులు ముగించి.. డ్రస్ మార్చుకొని వచ్చారు.

లక్ష్మి వారికి కాఫీ అందించింది. మిత్రులు ఆనందంగా కాఫీని సేవించారు.

ముగ్గురు స్త్రీమూర్తులు శ్రావణ శుక్రవారం పూజా కార్యక్రమాలను సవ్యంగా నిర్వహించారు. మంగళహారతిని ఇచ్చి మగవారిని లోనికి రమ్మని పిలిచారు.

అమ్మవారి విగ్రహరూప కలశానికి నమస్కరించారు. తమ తమ కోర్కెలను విన్నవించుకున్నారు. తీర్థ ప్రసాదాలు మాధవి ఇవ్వగా స్వీకరించారు.

అన్నా.. తన గదికి వెళ్లాడు. వెనకాలే ధర్మతేజ వెళ్లి తలుపు మూసి అన్నా ముఖంలోకి చూచాడు.

“రండి.. నాన్నా!.. మీరు అడగబోయే ప్రశ్న నాకు తెలుసు. అదే ప్రశ్నను నిన్న అమ్మ నన్ను అడిగింది. ఆమెకు జవాబు చెప్పాను. ఆ జవాబు మీకూ తెలుసు కదా నాన్నా!..” చిరునవ్వుతో తండ్రి ముఖంలోకి చూచాడు అన్నా.. అన్నా మాటలకు ధర్మతేజాకు పరమానందం..

‘ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు నాన్నా!..’ అనుకుంటూ ఆనందంగా గది నుండి బయటికి నడిచాడు.. ధర్మతేజ.

పార్వతి పూజాగది నుంచి మేడపైని తన గది వైపుకు నడిచింది. నారాయణమూర్తి ఆమెను అనుసరించాడు.

వెనకాలే వచ్చిన తండ్రిగారిని చూచి.. గదిలో ప్రవేశించగానే.. తండ్రి వైపుకు తిరిగింది పార్వతి.

చిరునవ్వుతో కూతురు ముఖంలోకి చూచాడు నారాయణమూర్తి. వయస్సు వచ్చి ఎదిగిన పిల్లలను కన్న తల్లిదండ్రులు ఏదైనా చెప్పాలంటే.. ఆ పిల్లల చిన్న వయస్సులో లాగా.. చెప్పలేరు. కారణం.. తమ పిల్లలకూ కొంత లోకానుభవం.. జీవితాన్ని గురించి కొన్ని వారి స్వనిర్ణయాల కారణంగా.. తమ నిర్ణయాన్ని ఆ పిల్లల చిన్నపుడు.. వారితో చెప్పినట్లుగా ప్రస్తుతంలో చెప్పలేని స్థితి పెద్దలది. అది వారికి వున్న సంస్కారం.

“అమ్మా!..” సందేహంతో పార్వతి ముఖంలోకి చూచాడు నారాయణ.

“ఏం నాన్నా.. చెప్పతలచుకొన్నది నిస్సంకోచంగా చెప్పండి నాన్నా!” చిరునవ్వుతో అంది పార్వతి.

“పారూ!.. అన్నా విషయంలో నీ అభిప్రాయం ఏమిటి?..”

పార్వతి ఆశ్చర్యంగా నారాయణమూర్తి ముఖంలోకి చూచింది. “ఏ విషయం నాన్నా!..”

“నీ వివాహ విషయం నాన్నా!..”

“నాన్నా!.. నా నిర్ణయం మీరు మరిచారా!..”

“లేదమ్మా!..”

“అయితే.. ఈ ప్రశ్న ఏమిటి?..”

“అంకుల్.. ధర్మతేజా.. నీ గురించి నన్ను అడిగాడు..”

“మీరేం చెప్పారు?..”

“నీ నిర్ణయాన్ని వాడికి చెప్పాను..”

“అందుకు వారేమన్నారు?..

“మౌనంగా వుండి పోయాడు!..”

“చూడండి నాన్నా!.. నా నిర్ణయం మీకు తెలిసిందే.. ఇకపోతే మీ యీ స్నేహితుని కుటుంబ సభ్యులందరూ మంచివారే.. నా వివాహం ఐ.ఎ.ఎస్. అయిన తర్వాతనే.. నాకు భావి జీవితంమ్మీద కొన్ని ఆశలు.. ఆశయాలు.. వున్నాయి. నాకోసం నేను బ్రతకడం గొప్పకాదు. నేను పదిమందిని బ్రతికించే మనిషిగా బ్రతకాలనేది నా సంకల్పం. మరో రెండు సంవత్సరాలు దయచేసి మీరు నా వివాహ ప్రసక్తి నా ముందు ఎత్తకండి. నాకు బాధ కలిగించి కాదన్నానని మీరు బాధపడకండి” అనునయంగా చెప్పింది పార్వతి.

మేడపైకి నారాయణను పిలవడానికి వచ్చిన ధర్మతేజ.. పార్వతి చివరి మాటలను విన్నాడు. మౌనంగా మేడ దిగి క్రిందికి వచ్చాడు.

భార్యను పిలిచి.. జాగింగ్ సమయంలో తాను నారాయణమూర్తితో చెప్పిన మాటలు.. అతని సమాధానం.. కొద్ది నిముషాల క్రిందట తాను విన్న పార్వతి మాటలను మాధవికి వివరించాడు..

చివరగా..

“మధూ!.. ఆ అమ్మాయి ఐ.ఎ.ఎస్. పూర్తిచేసి వుద్యోగంలో ప్రవేశించాకనే వివాహం చేసికొంటుందట. అంటే రెండు సంవత్సరాల తర్వాత..” నిట్టూర్చాడు ధర్మతేజ.

“అవును.. నేనూ ఇంద్రజను అడిగాను. అదే మాట చెప్పింది. మన అన్నా మాత్రం.. మీ ఇష్టమే నా యిష్టం అంటున్నాడు.. కానీ ఆ పిల్ల నిర్ణయం మాత్రం వేరేలా వుందిగదా!.. అది మనకు అనుకూలించదు..” విచారంగా చెప్పింది మాధవి.

“ఈ విషయాన్ని ఇంతటితో వదిలెయ్యి. స్నేహితులుగా వచ్చారు.. రెండు మూడు రోజులు వుండి వెళ్లిపోతారు.. వారు ఎలా వచ్చారో అలాగే తిరిగి వెళ్లేలా వారిని చూడటం మన ధర్మం.. నేను ఆ పిల్ల ప్రోగ్రామ్‌ను మా ఆఫీస్ కాంపస్‌లో కూడా ఏర్పాటు చేస్తాను.” సాలోచనగా చెప్పాడు ధర్మతేజ.

“ఏ మాటకామాట చెప్పుకోవాలి. పార్వతి మాత్రం సంప్రదాయబద్ధంగా పెరిగిన పిల్ల. ఉదయాన్నుంచి వాతో కలసి నాకు సాయంగా వుండింది. దైవం మీద నమ్మకం భక్తి వుంది. బాబా భక్తురాలట. ప్రతి గురువారం ఉపవాసం వుంటుందట. ఆ రోజంతా పనిచేస్తూవున్నా మనస్సున బాబా నామ జపాన్ని చేస్తూనే వుంటుందట. మనవాడితో చెప్పాను.. వాళ్లు వున్న రెండు మూడు రోజులు కాస్త త్వరగా వచ్చి.. ఆ అమ్మాయిని తీసుకొని వెళ్లి యీ ప్రాంతంలోని ముఖ్యమైన.. చూడవలసిన వాటిని చూపించమన్నాను. అన్నా సరే అన్నాడు” చిరునవ్వుతో చెప్పింది మాధవి.

ధర్మతేజా తల ఆడించాడు.. “అంతా దైవ నిర్ణయం మధూ!..” అన్నాడు విరక్తిగా..

***

అన్నా.. ఆ రాత్రి తన గది మంచి హాస్పిటల్ అడ్మిన్ జి.యం.కు ఫోన్ చేసి.. రేపు సాయంత్రం.. పార్వతీ డ్యాన్స్ ప్రోగ్రాం.. వివరాలు చెప్పి.. చేయవలసిన స్టేజ్ అరేంజ్‌మెంట్స్ గురించి చెప్పాడు..

ఉదయం సెవెన్ థర్టీకి హాస్పిటల్‌కు వెళ్లిపోయాడు. తన స్నేహితుడు డాక్టర్ శ్యామ్‌కు స్టేజ్ అరేంజ్‌మెంట్స్‌ను చెక్ చేయమని చెప్పి డ్యూటీని ముగించుకొని.. ఐదున్నరకల్లా ఇంటికి వెళ్లాడు.

ఆ ఇంట్లోని వారంతా సిద్ధంగా ఉన్నారు. ఆరున్నరకు రెండు కార్లలో ఆరుగురూ బయలుదేరారు. ధర్మతేజ.. నారాయణమూర్తి.. మాధవ్.. ఒక కార్లో, అన్నా.. పార్వతి.. మాధవి.. ఇంద్రజ.. మరో కార్లో బయలుదేరారు. ఏడుగంటలకు చేరారు.

ఆ హాస్పిటల్ యూనివర్సిటీలో డాక్టర్స్, నర్సెస్, ఇతర విభాగాల్లో పనిచేసే కార్యనిర్వాహకులు.. ఆడ మగతో హాలు నిండిపోయింది.

ప్రోగ్రాం రెండు నిముషాల్లో ప్రారంభం కాబోతోందనగా.. అన్నా స్టేజి పైకి వచ్చి ఇంగ్లీషులో..

“లేడీస్ అండ్ జంటిల్మెన్.. బాయిస్ అండ్ గర్ల్స్.. మిస్ పార్వతి.. డాటర్ ఆఫ్ ఇంద్రజా నారాయణమూర్తి.. ఫ్రమ్ భారత్.. విల్ ప్రజంట్ హర్ డ్యాన్స్ ప్రోగ్రాం.. త్రీ పార్ట్స్.. కూచిపూడి.. భరతనాట్యం.. కథాకళి.. ప్లీజ్ పీ అండ్ ఎంజాయ్.. థ్యాంక్యూ!..” అని చెప్పి స్టేజి దిగాడు.

స్టేజిపైన లైట్లు ఆరిపోయాయి. సుమధుర సంగీతం ప్రారంభమయింది. పార్వతి రంగప్రవేశం చేసి కూచిపూడి నాట్య విన్యాసాలను ప్రదర్శించింది. పదినిముషాలు విరామం తర్వాత భరతనాట్యం.. పదినిముషాల గ్యాప్.. చివరగా కథాకళి నాట్యప్రదర్శనతో ప్రోగ్రాం ముగిసింది.

యూనివర్సిటీ డీన్ ‘విల్సన్’.. పార్వతి నాట్యాన్ని గురించి ప్రశంసించారు. కానుకగా.. రెండువేల డాలర్లు అందించారు. అనేకులు వచ్చి పార్వతితో.. కరచాలనం చేయబోయారు.. ఆడా మగా.. పార్వతి మన సంప్రదాయం ప్రకారం.. చిరునవ్వుతో చేతులు జోడించింది.. పదిన్నరకు పరమానందంతో అన్నా.. పార్వతి తదితరులు ఇంటికి చేరారు.

మరుసటి దినం.. ధర్మతేజ.. మాధవీల మ్యారేజి డే!.. అన్నా తన డైరీలో తల్లిదండ్రుల పుట్టినరోజులు.. వారి మ్యారేజి డేట్స్.. వారు అమెరికాకు వచ్చిన రోజు.. తన పుట్టినరోజు.. ఆయా నెలల్లో.. తేదీల్లో.. నోట్ చేసుకొంటాడు.. ప్రతి సంవత్సరం కొత్త డైరీ కొనగానే.. దినచర్యను ప్రతిరోజు డైరీలో వ్రాయటం అతని అలవాటు.. ఆనందం.. నేటి దినచర్యను వ్రాసి పేజీ త్రిప్పి చూచాడు.. తన తల్లిదండ్రుల మ్యారేజి డే.. మనస్సున ఎంతో సంతోషం.. నాన్న స్నేహితుడు.. అతని కుటుంబం వచ్చివున్నారు. ఆ కారణంగా ఈ మ్యారేజ్ డేను గ్రాండ్ గా జరపాలని నిర్ణయించుకొన్నాడు.

పార్వతి గుర్తుకు వచ్చింది.

‘విషయాన్ని పార్వతికి చెప్పి తన సాయంతో.. అమ్మా నాన్నల మ్యారేజీడేని అందరికీ ఎన్నటికీ గుర్తుండిపోయేలా చేయాలి’ అనుకొన్నాడు అన్నా.

రాత్రి పదకొండు గంటలు..

పార్వతి గదిని సమీపించి కాలింగ్ బెల్ నొక్కాడు.

ఆ గదిలో.. పార్వతి ఇంద్రజలు నిద్రపోతున్నారు.. సెకండ్ టైమ్ కాలింగ్ బెల్ శబ్దాన్ని విన్న పార్వతి లేచి వచ్చి తలుపును తెరిచింది. ఎదురుగా వున్న అన్నాను చూచింది.

“ఏమిటి సార్ !..” ఆశ్చర్యంతో అడిగింది పార్వతి.

“రండి.. మీతో మాట్లాడాలి!..” చిరునవ్వుతో చెప్పాడు అన్నా.

“ఎక్కడికి?..”

“టెరస్ పైకి.. చల్లగా హాయిగా వుంటుంది..”

ప్రశ్నార్థకంగా చూచింది పార్వతి అన్నా ముఖంలోకి..

“రేపు మా అమ్మా నాన్నల పెండ్లిరోజు..

“ఆ..”

“అవును.. ఆ విషయాన్ని గురించి మీతో మాట్లాడాలి!..”

“పదండి..”

ఇరువురు పై అంతస్తులోని టెరస్ పైకి వెళ్లారు.

నగరం.. విద్యుద్దీపాల కాంతిలో కనులకు ఎంతో ఇంపుగా వుంది.

“ఎలా జరపాలని మీ వుద్దేశం?..” క్షణం తర్వాత..

“మీరు ప్రతి సంవత్సరం జరుపుతారా!..” అడిగింది పార్వతి.

“యస్!..”

“ప్రతిసారి ఎలా జరుపుతారో.. ఈసారీ అలాగే జరపండి..” అంది పార్వతి.

“ఈసారి మీరూ.. మీ కుటుంబం మాతో వున్నారుగా!.. మీ పద్ధతిలో వెరైటీగా చేయాలని నా ఆశ!..”

పార్వతి మౌనంగా ఆలోచనలో వుండిపోయింది.

“పార్వతిగారూ!..”

“నో.. గారూ.. ఒన్లో పార్వతి!” చిరునవ్వుతో చెప్పింది పార్వతి.

క్షణం తర్వాత “నా నిర్ణయాన్ని చెప్పనా?..”

“చెప్పండి..”

“అయితే వినండి.. ఓ మంచి హెూటల్లో డబుల్ రూమ్ బుక్ చేయండి. అందులో ఓ ప్రక్కన స్టేజి.. ఛైర్స్.. గార్లెండ్స్.. పూజారిగారు.. మాంగల్యాలు.. పండ్లు పూలు.. పసుపు కుంకుమా అన్నీ కావాలి.”

“అన్నీ దొరుకుతాయి గాని, పూజారిగారూ!..”

“మా నాన్నగారు!..” నవ్వుతూ చెప్పింది పార్వతి.

“మీ నాన్నగారు పెండ్లి చేయిస్తారా!..”

“చేయిస్తారు..”

“ఓకే.. ఓకే..” ఆనందంగా నవ్వాడు అన్నా.. క్షణం తర్వాత..

“మీ నాట్య ప్రదర్శనం.. అందరికీ ఎంతో ఆనందం కలిగించింది. నా మిత్రులందరూ ఫోన్ చేసి నాకు చెప్పారు..”

“అది అంతా మీవల్లనేగా!.. నాకు చాలా ఆనందం!.. ధ్యాంక్యూ!..” అంది పార్వతి.

“నో!.. ఆ మాటను చెప్పవలసింది నేను..”

“ఎందుకు..”

“రేపటి అమ్మా నాన్నల మ్యారేజిడే సెలబ్రేషన్ ప్రోగ్రామ్‌ని అద్భుతంగా నిర్ణయించినందుకు..” తృప్తిగా నవ్వాడు.

“వెళ్ళామా!..”

“ఆ.. పదండి.. ఆ.. మీరు ఐ.ఎ.ఎస్. చేస్తున్నారని విన్నాను..”

“చేయబోతున్నాను..”

“ఆల్ ది బెస్ట్.. చాలా మంచి నిర్ణయం..”

పార్వతి చిరునవ్వుతో క్రిందికి నడిచింది. అన్నా ఆమెను అనుసరించాడు.

***

ఉదయం ఏడుగంటల కల్లా అన్నా రెడీ అయి హాస్పటల్‌కు వెళ్లిపోయాడు.

సాధారణంగా ఆ రోజున.. అంటే తల్లిదండ్రుల పెండ్లి రోజున ఉదయం ఐదు గంటలకు లేచి తన ప్రాతః కాల దినచర్యలను ముగించి.. స్నానం చేసి తల్లి తండ్రి దగ్గరకు వచ్చి విష్ చేసి వారు చేసే పూజా పునస్కారాలకు సాయంగా.. ఉండేవాడు. ఇరువురికీ తాను క్రొత్త దుస్తులను తెచ్చి ఇచ్చేవాడు. డ్యూటీకి వెళ్లి త్వరగా తిరిగి వచ్చి వారిని తీసుకొని మంచి రెస్టారెంటు వెళ్లి.. ముగ్గురూ వారి వారికి కావాల్సినవి తిని పది గంటల ప్రాంతంలో ఇంటికి చేరేవారు.

కానీ ఈ రోజున జస్ట్ ‘విష్’ చేసి పని వున్నదని చెప్పి వెళ్లిపోయాడు.

అన్నా ఆ చర్యకు వారిరువురూ.. ఏదో బాధలో వున్నాడని అనుకొన్నారు. ‘బాధ’ అనే పదం వారికి తోచగానే జ్ఞప్తికి వచ్చేది లాస్య.. ‘మనతో చెప్పలేదుగాని వాడి మనస్సున లాస్య జ్ఞాపకాలు ఇంకా వున్నాయి..’ అనుకొన్నారు ఆ దంపతులు. రెండు గంటలకు తన బావమరిది జయదేవ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వస్తామని నారాయణమూర్తి.. కుటుంబ సభ్యులు.. రాత్రికి వస్తామని చెప్పి వెళ్లిపోయారు.

మూడు గంటలకు అన్నా ఫోన్ చేశాడు. రిసీవ్ చేసింది మాధవి.

“అమ్మా!..”

“చెప్పు నాన్నా!..”

“పొద్దున అత్యవసర కేసు విషయంగా మీతో సరిగా మాట్లాడకుండా బయలుదేరాను. డ్యూటీని ముగించి ఇంటికి వస్తాను.. మనం బయటకు వెళదాం.. అమ్మా!.. ఈ రోజు మీ పెళ్లి రోజు కదా!..” ఎంతో అనునయంగా చెప్పాడు అన్నా.

“నారాయణమూర్తి వాళ్లు ఎవరో స్నేహితుని ఇంటికి వెళ్లిపోయారు. సాయంత్రం వస్తామన్నారు. మనం బయటకు వెళితే వారు..”

“ఇబ్బంది పడతారు గదా అంటావ్!.. అమ్మా.. మనం వెళ్లే హోటల్‌కు వాళ్లను రమ్మని అంకుల్‌కి ఫోన్ చేద్దాం..” అన్నాడు అన్నా.. మాధవి పూర్తిగా చెప్పకముందే.

ఆరుగంటలకు వచ్చి ధర్మతేజా.. కారు వచ్చి పోర్టికోలో ఆగింది. మాధవి ముఖద్వారం వద్దకు వచ్చి నిలబడింది. ధర్మతేజాను చూచింది. నారాయణమూర్తి వాళ్లు వెళ్లిన విషయం.. అన్నా వస్తున్నట్టు ఫోన్ చేసిన విషయం ధర్మతేజాకు చెప్పింది.

“అన్నా.. నాకూ ఫోన్ చేశాడు మధూ.. స్నానం చేసి వస్తాను..” చెప్పి తన గదిలోకి వెళ్లిపోయాడు.

అన్నా కారులో వచ్చి దిగాడు. వేగంగా ఇంట్లోకి నడిచాడు.

హాల్లో టీవీని చూస్తున్న తల్లిని సమీపించి ప్రక్కన కూర్చొని.. “అమ్మా!.. నీవు రెడీనా?.. నాన్నగారు వచ్చారా?..” అన్నాడు.

“ఆ.. నేను రెడీ!.. మీ నాన్నగారు వచ్చి రెస్టురూమ్‌కు వెళ్లారు..”

“సరే అమ్మా!.. నేనూ రెడీ అయి ట్వంటీ మినిట్స్‌లో వస్తాను. మనం బయలుదేరుదాం..” అంటూ పైకి తన గదికి వెళ్లిపోయాడు అన్నా.

ఉదయం ఎంతో సీరియస్‌గా కనిపించిన అన్నా ఇపుడు మహా హుషారుగా సంతోషంగా కనిపించాడు మాధవికి.

తన కర్తవ్య నిర్వహణలో విజయం చూచిన వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నా బిడ్డ విషయంలో అదే జరిగి వుంటుందని.. తనూ ఆనందంగా నవ్వుకొంటూ తనయుని మనస్సున దీవించింది.

ముందు ధర్మతేజ.. పదినిముషాల తర్వాత అన్నా.. మాధవిని సమీపించారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here