డాక్టర్ అన్నా బి.యస్.యస్.-17

0
11

[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

[తన తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవాన్ని పార్వతి కుటుంబ సభ్యుల సహకారంతో విభిన్నంగా జరిపిస్తాడు అన్నా. మర్నాడు పార్వతి నాట్య కార్యక్రమం ధర్మతేజ గారి యూనివర్సిటీలో జరుగుతుంది. ఆమెకు ప్రశంసలు, కానుకలు లభిస్తాయి. ధర్మతేజా, మాధవిలను అత్తయ్య, మావయ్య అని సంబోధిస్తుంది పార్వతి తన మాటలలో. నారాయణమూర్తి కుటుంబం ఇండియాకి బయల్దేరే సమయం వచ్చేస్తుంది. పార్వతి తమ కోడలైతే బాగుంటుందని మరోసారి అనుకుంటారు మాధవి, ధర్మతేజా. ఆ ఉదయం ఆపరేషన్ వుందని అన్నా ఆరుగంటలకల్లా హాస్పటల్‌కు వెళ్ళిపోతాడు. నారాయణమూర్తి కుటుంబం ఇండియాకి వెళ్ళేందుకు ఎయిర్‌పోర్టుకు బయల్దేరుతుంటారు. అప్పుడు అన్నా ధర్మతేజకి ఫోన్ చేసి, ఫోన్ నారాయణమూర్తికి ఇవ్వమని చెప్పి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి, హావ్ ఎ నైస్ జర్నీ అని అంటాడు. టాక్సీలో వెళ్తూ నారాయణ మూర్తి, ఇంద్రజ అన్నా గురించి మాట్లాడుకుంటారు. అన్నాని పెళ్ళి చేసుకున్నాక ఐఎఎస్‍కి చదవమంటుంది కూతురితో ఇంద్రజ. పార్వతి మాత్రం తన నిర్ణయంలో మార్పు లేదని అంటుంది. అక్కడ హాస్పటల్‍లో ఉన్న అన్నా అతని జూనియర్ శ్యామ్ పలకరిస్తాడు. ఇద్దరూ కాఫీ స్టాల్‍కి వెళ్ళి మాట్లాడుకుంటుంటారు. ఇక చదవండి.]

[dropcap]శ్యా[/dropcap]మ్ లోని పంక్చ్యుయాలిటీ.. హార్డ్‌వర్క్‌షిప్.. నిర్భయం.. అన్నాకు ఎంతగానో నచ్చాయి. తనకు తగిన శిష్యుడిగా భావించాడు.. అభిమానించాడు.

“బ్రో!.. ప్రశ్న?..”

“అడుగు..”

“వదినా వాళ్లు వెళ్లిపోయారుగా!..”

“ఎవరూ?..”

“అర్థం కాలేదా!.. లేక అర్థం అయినా నా చేత చెప్పించుకొని ఆనందించాలని అనుకొంటున్నారా!..” చిరునవ్వుతో అడిగాడు శ్యామ్..

“అర్థం అయింది..”

“అయితే.. జవాబు చెప్పండి..”

“ఏం చెప్పను?..”

“వెళ్లేటపుడు మీతో ఏమీ చెప్పలేదా!..”

“అ టైమ్‌లో నేను ఆపరేషన్ థియేటర్‌లో వున్నానుగా!..”

“ఓహో!.. అయితే ఓసారి ఫోన్ చేయొచ్చుగా!..”

“ఎందుకు?..”

“క్షేమ సమాచారాలు తెలుసుకొనేటందుకు..”

“వద్దు..”

“కారణం?..”

“సంకల్పబలం సన్నగిల్లవచ్చు!..”

“ఎవరికి?.. మీకా.. వారికా..”

“ఇరువురికీనూ!.. రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకొంటుందట.. ఆ కారణంగా నేను.. కలలు కనకూడదనుకొన్నాను..” నవ్వాడు అన్నా.

“టు ఇయర్స్ అలా!..”

“అవును.. తాను ఐ.ఏ.ఎస్. ముగించాలట బ్రో!..”

“ఓహో!.. సరే పదండి వార్డుకు వెళదాం..”

ఇరువురూ హాస్పటల్లో ప్రవేశించారు. రౌండ్స్‌కి వెళ్లి పేషంట్లను పరీక్షించి.. మెడిసిన్స్ మార్చే దిన చర్యలో మునిగిపోయారు. కాలచక్రం శ్రావణమాసం నుంచి భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర, పుష్య, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పన్నెండు మాసములు.. ఆయా ఋతువులు సహజ ధర్మాలు రీతిగా జరిగిపోయాయి. ఋతువులు ఆరు.. వసంత ఋతువు (చైత్ర, వైశాఖ మాసములు), గ్రీష్మ ఋతువు (జ్యేష్ఠ ఆషాఢ మాసములు), వర్ష ఋతువు (శ్రావణ భాద్రపద మాసములు), శరత్ ఋతువు (ఆశ్వీయుజ కార్తీక మాసములు), హేమంత ఋతువు (మార్గశిర పుష్య మాసములు), శిశర ఋతువు (మాఘ ఫాల్గుణ మాసములు).

డ్యూటీ ముగించుకొని మిత్రులు ఇరువురూ లంచ్‌కి కూర్చున్నారు. అన్నా దేన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు శ్యామ్‌కి గోచరించాడు.

“బ్రో!.. దేన్నిగురించో డీప్‍గా థింక్ చేస్తున్నట్లుగా వున్నారు?..”

“అవును శ్యామ్!..”

“ఆ విషయం ఏమిటో నేను తెలిసికొనవచ్చునా!..”

“శ్యామ్!.. మనం జీవితాంతం ఈ అమెరికాలో పనిచేస్తూ యంత్రంలా బతకటం నాకు ఇష్టం లేదు..”

“మరి ఏం చేయాలని?..”

“మన భారత్‌కు వెళ్లిపోవాలని..”

“ఎప్పుడు..”

“ఆఫ్టర్ టు ఇయర్స్..”

శ్యామ్ నవ్వాడు..

“ఎందుకు నవ్వుతున్నావ్?..”

“బ్రదర్.. నీకు అర్థం అయింది!..” నవ్వాడు శ్యామ్.

“కాలేదు.. చెప్పు..”

“అప్పటికి పార్వతి మేడమ్ ట్రయినింగ్ పూర్తి అవుతుందిగా!..”

“నేను ఆ వుద్దేశంతో చెప్పలేదు.”

“మరి ఏ వుద్దేశంతో!..”

“పదిలో పదకొండుగా బ్రతకడం.. నాకు ఇష్టం లేదు.. పదిమందికి మంచి చేసి.. వారి మనసుల్లో మంచివాడనే పేరుతో నెంబర్ వన్‌గా బ్రతకాలని నా ఆశయం. మరో వన్ అండ్ ఆఫ్ ఇయర్‌లో అమ్మా నాన్న రిటైర్ అవుతారు. ముగ్గురం మన దేశానికి వెళ్లి మనకు ఆ దేవుడు ఇచ్చిన పరిజ్ఞానంతో.. మన సముదాయానికి ముఖ్యంగా.. మధ్య, పేద వర్గాలకు.. ఓ హాస్పిటల్ నిర్మిస్తాను. ఆ సమయంలో నీలాంటి సహచరుల సాయం నాకు కావాల్సి వస్తుంది. నీవు నాతో రాగలవా?..” ఎంతో ఆశగా అన్నా శ్యామ్ ముఖంలోకి చూచాడు.

“తప్పకుండా!.. నాకు ముగ్గురు మామయ్యలు.. వ్యాపారస్థులు.. ధర్మంగా వర్తిస్తారు. వారికి మంచి పేరు. తండ్రి లేని నన్ను ఇంత దూరం పంపి యం.యస్. చేయించింది మా పెదమామయ్య కృష్ణయ్య. రెండవ మామ పేరు గోపాలయ్య.. చిన్న మామ పేరు శివయ్య.. మా అమ్మ గౌరి.. ఆ ముగ్గురికీ మా అమ్మ అంటే ప్రాణం.. మా తాతయ్యగారు మా పెదమామగారి.. పదిహేను సంవత్సరాల వయసులో చనిపోయారు. అప్పటి నుంచి చదువు మానేసి మా పెదమామయ్య ఆ కుటుంబ భారాన్ని మోశారు. ఇద్దరు తమ్ములను చెల్లి మా అమ్మను.. చదివించారు. మా దగ్గరి బంధువుల అబ్బాయితో మా అమ్మ వివాహాన్ని జరిపించారు. మా అమ్మ నన్ను గర్భవతిగా వున్న సమయంలో.. యాక్సిడెంట్లో మా నాన్నగారు మరణించారు. మా పెదమామయ్య పెండ్లి చేసుకోలేదు. అమ్మతో నాతో వుండిపోయాడు. తమ్ముళ్లకు యుక్తవయస్సులో వివాహాలు జరిపించారు. చిన్న మామకు ఇద్దరు కొడుకులు, మధ్య మామయ్యకు ఇద్దరు కూతుళ్లు, అందరూ కలిసే వుంటున్నాము. మంచికి మారుపేరు మా పెద్దమామయ్య కృష్ణయ్య గారు. ఇంట్లోని వారంతా వారి మాటకు కట్టుబడి వుంటారు. ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు.

మామయ్యల పిల్లలను నన్ను తన బిడ్డలుగా చూచుకొని పెదమామయ్య మురిసిపోతాడు. మీ నిర్ణయాన్ని వారికి తెలియచేస్తే.. వారు తప్పక మనకు మంచి సలహా ఇచ్చి.. మనకు హాస్పిటల్ నిర్మాణానికి కావాల్సిన భూమిని ఏర్పాటు చేయగలరు. బ్రదర్! మీ ఆశయం తప్పక నెరవేరుతుంది. నేను మీ వెనుక నడుస్తాను. ప్రామిస్!..” చిరునవ్వుతో చెప్పాడు శ్యామ్.

“ఓకే.. డియర్! థాంక్యూ వెరీమచ్!..” అన్నాడు అన్నా.

ఆనందంతో ఇరువురు మిత్రులు చేతులు కలిపారు.

ఆ రాత్రి భోజన సమయంలో అన్నా.. వుదయం తనకు శ్యామ్‌కు జరిగిన సంభాషణను అమ్మా నాన్నలకు తెలియచేశాడు.. వారి నిర్ణయాన్ని.. హాస్పిటల్ నిర్మాణాన్ని గురించి వివరంగా వారితో చర్చించాడు.,

ధర్మతేజ.. మాధవీలు ఎంతగానో ఆనందించారు. ఆ సుదినం త్వరలో రావాలని ఇష్టదైవాన్ని కోరుకున్నారు.

***

శ్యామ్.. తన మేనమామ కృష్ణయ్యకు ఫోన్ చేసి.. అన్నా తన నిర్ణయాన్ని తెలియజేశాడు. మల్టీఫెసిలిటీస్ హాస్పిటల్, మెడికల్ కాలేజీ నిర్మాణానికి నలభై ఎకరాల భూమి కావాలని, విచారించి ఏర్పాటు చేయమని.. డబ్బును పంపుతామని చెప్పాడు. నలుగురు రైతులు వారి కుటుంబ అవసరాలకు పొలాన్ని అమ్మాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని విన్న కృష్ణయ్యగారు ఆ రైతులతో సంప్రదించారు. వారు కృష్ణయ్య పెద్దరికాన్ని ఎరిగిన వారైనందున భూమిని మీకే విక్రయిస్తామని చెప్పారు. కృష్ణయ్య తన సొమ్మును టోకెన్ అడ్వాన్సుగా మనిషికి లక్ష ఇచ్చి అగ్రిమెంట్సు వ్రాయించి వారి సంతకాలను తీసుకొని.. శ్యామ్‌కు.. విషయాన్ని తెలియచేశాడు.

అవసరమైన డబ్బును కృష్ణయ్యగారి సాయంతో.. విక్రయదారులకు బ్యాంక్ అకౌంట్సును ఓపెన్ చేయించి ట్రాన్సఫర్ చేశాడు అన్నా. నలభై ఎకరాల భూమి విక్రయ పత్రాలు అన్నా పేరుమీద వ్రాయబడ్డాయి.

రిజిస్ట్రేషన్ డేట్‌ని నిర్ణయించి కృష్ణయ్య గారు శ్యా‍మ్‌కి పదిరోజుల ముందు తెలియచేశాడు. మిత్రులిరువురూ భారత్‌కు వచ్చి స్థలాన్ని చూచుకొని.. సర్వే చేయించి.. మ్యాప్స్ తయారు చేయించుకొని.. రిజిస్ట్రేషన్ చేయించుకొని.. పత్రాలతో తిరిగి అమెరికాకు వెళ్లిపోయారు.

నలభై ఎకరాల భూమి పత్రాలను ధర్మతేజ.. మాధవీలకు చూపించాడు అన్నా.. త్వరలో కొడుకుతో కలసి జన్మభూమి భారత్ వెళ్లబోతున్నామని ఎంతగానో ఆనందించారు.

స్థల డ్రాయింగ్‌ను భారత్ నుండి వచ్చి.. అక్కడి యం. ఆర్క్.. చేసిన ‘నిహారిక లీడింగ్ ఆర్కిటెక్ట్ అండ్ వ్యాల్యూవర్’ చేత మెడికల్ కాలేజీ, హాస్పిటల్ బిల్డింగ్స్.. డిజైన్సును తయారుచేయించారు.. వన్ ఆర్ టూ డిస్కషన్స్‌తో అన్నింటినీ ఫైనల్ చేయించారు ఇద్దరు మిత్రులు.

మరో ఆరునెలల్లో.. భారత్‌కు.. స్వదేశానికి వెళ్లబోతున్నామనే ఆలోచనతో ధర్మతేజ.. మాధవీలు ఎంతో ఆనందించారు. ధర్మతేజ.. నారాయణమూర్తికి ఫోన్ చేసి.. ముగ్గురం భారత్‌కు రాబోతున్నామని.. అన్నా హాస్పిటల్ నిర్మించబోతున్నాడని.. మేము అక్కడికి రాగానే రెండు నెలల్లోపల.. అన్నా పార్వతుల వివాహం జరిపించాలని.. ఆపై సంవత్సరానికల్లా తనకో మనుమడో.. మనుమరాలో కావలని.. వారిరువురి తియ్యని కోర్కెలను ఎంతో ఆనందంగా తెలియచేశాడు. నారాయణమూర్తి.. ఇంద్రజ సంతోషించారు. ఆ సుదినం కోసం ఎదురు చూస్తున్నామని ఆనందంతో జవాబిచ్చారు.

ఆరోజు.. అన్నా వుదయాన్నే హాస్పిటల్‌కు వెళ్లాడు. ధర్మతేజ.. తన యూనివర్సిటికి వెళ్లాడు.

మాధవి బజారు వెళ్లి మంత్లీ ప్రావిజన్స్ కొనుక్కొని ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఆమె కారు బ్రేక్ ఫెయిల్ అయింది. మాధవి కారును కంట్రోల్ చేయలేకపోయింది. డోర్ తెరచుకొని దూకేసింది.

ఆ దూకడంలో తలకు తీవ్రమైన గాయం.. యం.యస్.యల్.యాంగిల్ తలలో కణతవైపున గుచ్చుకొంది. స్పృహ కోల్పోయింది. తల రక్తస్రావంతో తడసిపోయింది. చూసినవారు చెప్పగా ఆమెను పోలీసులు హాస్పటల్లో జాయిన్ చేశారు. అన్నా అదే హాస్పటల్లో పనిచేస్తున్నాడు. ఓ హార్టు సర్జరీని ఆ సమయంలో చేస్తున్నాడు. విషయం శ్యామ్‌కు తెలిసింది. అన్నా ఆపరేషన్ థియేటర్లో ఉన్న కారణంగా రెండు గంటల తర్వాత అతనికీ విషయాన్ని చెప్పాడు శ్యామ్..

బెడ్ పై మాధవి..

చుట్టూ నలుగురు డాక్టర్లు.. నర్సులు.. అందరూ భయాందోళనలతో ఉన్నారు.

మాధవికి ఆపరేషన్ చేయాలని అన్నా కన్నా సీనియర్ డాక్టర్ విలియం అన్నాడు.

అన్నా కాగితంపై సంతకం చేశాడు.

అప్పటికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసివున్నారు డాక్టర్ విలియం..

అన్నా.. కన్నీళ్లతో తల్లి ముఖంలోకి చూచాడు. తలకు కట్టుకట్టి యున్నారు.

స్పృహ లేని ఆమె చేతిని తాకి వంగి చెవిదగ్గర.. “అమ్మా!.. అమ్మా!..” గద్గద స్వరంతో పిలిచాడు అన్నా..

ఆ తనయుడి పిలుపు.. ఆ తల్లి పగిలిన మస్తిష్కానికి సోకింది.. మెల్లగా కళ్లు తెరిచింది.

అన్నా కన్నీళ్లు ఆమె బుగ్గలపై పడ్డాయి.

కళ్లను విశాలంగా తెరిచింది మాధవి.. వెంటనే మూతబడ్డాయి ఆ కళ్లల్లో కన్నీరు.

అమ్మ చేతిలో తన చేతిని వుంచి దీనంగా ఏడుస్తూ తల్లి ముఖంలోకి చూచాడు అన్నా!..

బి.పి. స్క్రీన్ డౌన్ అవుతూ వుంది.

హాస్టుబీట్ అస్తవ్యస్తం..

అతికష్టం మీద మాధవి కళ్లు తెరిచింది.

“అమ్మా!.. అమ్మా!.. అమ్మా!..” తలమీద తన కుడిచేతిని వుంచి ఆ తల్లి కళ్లల్లోకి చూచాడు.

“ఆ.. ఆ.. నా.. నా.. నాన్న.. నాన్న.. జా.. జా..” తల ఒరిగిపోయింది.. చిలక ఎగిరిపోయింది..

విలియం అన్నా భుజంపై చేయివేసి గట్టిగా పట్టుకొన్నాడు.

విషయం విన్న శ్యామ్ పరుగున లోనికి వచ్చాడు. అన్నాను తన చేతుల్లోకి తీసుకొన్నాడు.

నర్స్.. మాధవి ముఖంపైకి తెల్లని వస్త్రాన్ని జరిపింది.

అరగంట తర్వాత మాధవి శరీరాన్ని అంబులెన్సులో ఇంటికి చేర్చారు.

విషయాన్ని విని.. ధర్మతేజ పరుగున వచ్చి బోరున ఏడుస్తూ మాధవి ప్రక్కన పడిపోయాడు. శ్యామ్.. ఆ పై జరగవలసిన కార్యకలాపాలకు అన్నాకు తోడుగా నిలిచాడు.

***

మాధవి మరణం.. ధర్మతేజ.. అన్నాల జీవిత విధానాలను మార్చేసింది. ఆప్యాయపు పలకరింతలు మితం అయినాయి.

ఒకరికి తెలియకుండా ఒకరు తప్పతాగి.. ఆ మత్తులో సోలి నిద్రపోయేవారు. ఉద్యోగాలకు వెళ్లడం మానేశారు. పనిమనిషి లక్ష్మి ఏడుస్తూనే వారికి తినేటందుకు కావాలసినవి తయారు చేసేది. కానీ ఇరువురూ తినేవారు కాదు. మిత్రుడు శ్యామ్ ఇరువురికీ ఎంతో నచ్చచెప్పేవాడు.

“అన్నా!.. నీకు తెలియనిది అంటూ లేదు.. అమ్మ ఆకస్మికమరణం నీకే కాదు.. ఆమెను ఎరిగిన అందరికీ గ్రేట్ షాక్.. కొడుకువైన నీ గురించి వేరే చెప్పాలా!.. బ్రదర్!.. అంతా దైవ నిర్ణయం.. ఎవరు ఎన్నిచెప్పినా.. నీ భాధను నీవే కంట్రోల్ చేసుకోవాలి. యు ఆర్ గ్రేట్ డాక్టర్.. ఎందరినో అనేక విధాలుగా నీ ట్రీట్మెంట్ ద్వారా కాపాడి రక్షించగల సమర్థుడవు. ప్లీజ్ కంట్రోల్ అన్నా.. ప్లీజ్ కంట్రోల్.. మనం భారత్‌కు వెళ్లి చేయవలసిన హాస్పిటల్ నిర్మాణాన్ని గురించి ఆలోచించు. ఈ రెండు అమ్మ ముఖ్య ఆశయాలు. వీటిని నీవు నెరవేరిస్తే.. అమ్మ ఆత్మకు పూర్తిగా శాంతి కలుగుతుంది. మన కంటికి కనబడని అమ్మ ఆత్మ మన చుట్టూనే నీవు ఆ రెండు పనులు పూర్తి చేసేవరకు తిరుగుతూ ఉంటుందన్నది నా నమ్మకం.. అమ్మ కళ్లముందు లేదు.. ప్రస్తుతంలో.. కానీ ఆమె దీవెనలు నీకు సదా వుంటాయి. ప్లీజ్!.. అటెండ్ టూ హాస్పటల్.. అన్నా !.. నా మాట విను..” దీనంగా చెప్పాడు శ్యామ్.

బాధతో తాను చేసిన తప్పు.. అన్నాకు శ్యామ్ మాటల వల్ల అర్థం అయింది.

మరుదినం.. అన్నా వుదయాన్నే హాస్పటల్‌కు వెళ్లిపోయాడు. వారింటికి వచ్చిన శ్యామ్.. ధర్మతేజను కలిశాడు. ఏడుస్తున్న ధర్మతేజతో “సార్!.. మీరు ఇలా కన్నీటితో కుమిలిపోతూ వుంటే.. అన్నా ఎలా ధైర్యంగా వుండగలడు?.. ఎంతో జీవితాన్ని.. ఎన్నో సమస్యలను ఎదుర్కొని.. సమస్యా పరిష్కారంతో.. విజయాన్ని సాధించి.. ఈ స్థితికి వచ్చివుంటారు మీరు!- ఎవరి విషయంలో ఏది జరిగినా.. అది దైవ నిర్ణయంగా భావించే తత్వం మనది. మీరు ఊరట పొంది అన్నాకు ధైర్యం చెప్పి భావిజీవితం సాఫీగా సాగేలా చేయవలసింది.. మీరే కదా సార్!..” శ్యామ్ ధర్మతేజ కళ్లల్లోకి దీనంగా చూచాడు.

“శ్యామ్.. మీ పిన్ని అందరిలాంటి ఆడమనిషి కాదు. కార్యేషు దాసి.. కరణేషు మంత్రి.. భోజ్యేషు మాతా.. శయనేషు రంభ.. ఒక ఇల్లాలికి ఉండాల్సిన లక్షణాలు ఇవి. నా మాధవి ముమ్మూర్తులా ఆ లక్షణాలకు ప్రతిరూపం.. ఆమె లేని నా జీవితం శూన్యంగా వుంది. ఈ ఇల్లు ఎడారిలా వుంది.. నేను ఏ వైపు చూచినా తన రూపం.. పలకరింపు నాకు కనిపిస్తూ.. వినిపిస్తున్నాయి. ఆ జ్ఞాపకాలు నా గుండెను పిండేస్తున్నాయి. నెలకు మూడు రోజులు మా పడకలు వేరు.. మిగతా అన్నిరోజులు ఇరువురం.. మంచి చెడ్డలను గురించి.. అన్నా భవిష్యత్తు గురించి మాట్లాడుకొని ఓ నిర్ణయానికి వచ్చి అనందంగా నిదురించేవాళ్లం.. అలాంటి నా జీవిత భాగస్వామి నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్లి పోయింది. నాకు తీరని మనో వ్యథను మిగిలించింది.. మెలకువగా వుంటే ఆమె జ్ఞాపకాలు నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. అందుకే నన్ను నేను మరచిపోయేదానికి త్రాగుతున్నాను.. త్రాగుతున్నాను..” కన్నీటితో దీనంగా చెప్పాడు ధర్మతేజ.

లేచి రెస్ట్ రూమ్ వైపుకు వెళ్లబోయిన ధర్మతేజా తూలి క్రింద పడబోయాడు.

శ్యామ్.. పడబోయిన వారిని తన చేతులతో పట్టుకొన్నాడు. రెస్టురూమ్ లోనికి తీసుకొని వెళ్లాడు.

ఐదు నిముషాల తర్వాత.. వారిని మంచంవద్దకు తీసుకొని వచ్చాడు.

ధర్మతేజ.. మంచంపై వాలి.. చిరునవ్వుతో..

“నాన్నా!.. శ్యామ్!.. ధన్యవాదాలు.. అన్నాను జాగ్రత్తగా చూచుకొంటానని నాకు మాట ఇవ్వగలవా!..” తన కుడిచేతిని ముందుకు సాచాడు.

శ్యామ్ వారి కళ్లల్లోకి కొన్ని క్షణాలు చూచాడు. ఆ కళ్లు తన్ను అర్థిస్తున్నాయి. తన చేతిని ధర్మతేజా చేతిలో వుంచి.. “సార్!..” అన్నాడు.

“కాదు.. బాబాయ్..”

ఆశ్చర్యంతో చూచాడు శ్యామ్..

“నన్ను బాబాయ్ అని పిలిచే దానికి మీకు అభ్యంతరం లేదుగా!..” దీనంగా అడిగాడు ధర్మతేజ..

“లేదు బాబాయ్!.. లేదు..”

ధర్మతేజ ఆనందంగా నవ్వాడు.

లక్ష్మి పాలగ్యాస్‌తో వచ్చింది.

శ్యామ్ ఆ పాలగ్లాసును అందుకున్నాడు. బలవంతంగా.. ధర్మతేజా చేత ఆ పాలను త్రాగించాడు.

వస్తానని చెప్పి వెళ్లిపోయాడు శ్యామ్..

“లక్ష్మీ!..”

ధర్మతేజ నిలువును విని పరుగున వచ్చింది.

“అయ్యా..”

దగ్గరకు రమ్మని ఎడంచేతిని పైకెత్తి పిలిచాడు. లక్ష్మి వారిని సమీపించింది.

“టేబుల్ మీది డైరీ.. పెన్.. ఇలా ఇవ్వు..”

రెంటిని లక్ష్మి ధర్మతేజాకు అందించింది.

“నీకు నేను చాలా రుణపడిపోతున్నాను లక్ష్మీ!..” విచారంగా అన్నాడు ధర్మతేజ.

“అయ్యా!.. అదేం మాటయ్యా.. మీరు చెప్పిన పని చేసేదానికే గదయ్యా నేనుండేది!..” అనునయంగా అంది లక్ష్మి.

సెల్ మ్రోగింది. లక్ష్మి ధర్మతేజ చేతికి అందించింది.

“హలో!..”

“హలో!..”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here