డాక్టర్ అన్నా బి.యస్.యస్.-2

1
12

[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

[డా. అన్నా అమెరికాలో స్పెషలైజేషన్ చేసి వచ్చిన హార్ట్ స్పెషలిస్ట్. గుంటూరు హాస్పిటల్‍లో పని చేస్తుంటాడు. ఒకరోజు ఒక క్లిష్టమైన కేసులో పేషంట్‍కి శస్త్ర చికిత్స చేస్తాడు. ఆపరేషన్ సక్సెస్ అని బయట ఎదురుచూస్తున్న రోగి కుటుంబ సభ్యులకు చెప్పి తన గదిలోకి వెళ్లిపోతాడు. జిల్లా జైలులో ఆ రోజు విడుదల కావల్సిన ఖైదీల జాబితాను పరిశీలిస్తుంటాడు జైలర్ బలరామ్. ముందుగా, రత్తయ్య, జోగీ అనే ఖైదీలను పిలిపించి, వారికి రావల్సిన పైకం అందించి, మళ్ళా నేరాలు చేయద్దని హెచ్చరించి పంపించివేస్తాడు. తరువాత రాఘవయ్యని పిలిపిస్తాడు. చేయని నేరానికి, దొంగ సాక్ష్యాల కారణంగా ఆయన జైలు శిక్ష అనుభవించారని తనకు తెలుసని ఆయనతో అంటాడు బలరామ్. బయటికెళ్ళాక పగ, ప్రతీకారం పెంచుకోవద్దని చెప్పి, ఆయనకి ఇవ్వాల్సిన పైకం ఇచ్చి పంపిస్తాడు. రాఘవయ్య బయటకు రాగానే చంపేయమని – రాఘవయ్య మీద నేరం మోపిన భుజంగవర్మ – పాండు అనే రౌడీని పురమాయిస్తాడు. రాఘవయ్య కోసం పాండు కాచుకుని ఉంటాడు. అయితే రాఘవయ్య, వేరే దారిలో తన గ్రామానికి వెళ్ళిపోయినట్టు ఆలస్యంగా గ్రహిస్తాడు పాండు. ఒక ఆటో మాట్లాడుకుని ఆ ఊరికి బయల్దేరుతాడు. దారిలో ఒక మద్యం కొట్టు దగ్గర ఆగి తాగుతాడు. తిరిగి ఆటో ఎక్కి బయల్దేరమంటాడు. ఇక చదవండి.]

[dropcap]క[/dropcap]రీమ్ పదిహేను నిముషాల్లో పాండు చెప్పిన స్లమ్ ప్రాంతానికి ఆటోను తీసుకొచ్చి ఆపాడు.

“అన్నా!.. నీవు చెప్పిన ఏరియా ఇదే!.. రెండువందల ఏభై ఇచ్చి బండి దిగు.. నే ఎల్లిపోవాల!..” అన్నాడు కరీమ్.

“రేయ్!.. భాయ్.. కరీమ్!.. మనం మళ్లా వెనక్కి వెళ్లిపోవాల్సిందే.. ఈడ మనకు చుట్టాలు లేరు.. ఓ మనిషి కోసం వచ్చినా.. వాడు ఉన్నాడో లేడో కనుక్కొని ఎల్లిపోదాం.. ఆ.. సరేనా.. డబ్బులిస్తా.. భయపడకు.. అటు చూడు.. ఆ బంకు కాడికెళ్లి రాఘవయ్య ఇల్లు ఏదో కనుక్కొని రా..” చిరునవ్వుతో చెప్పాడు పాండు.

తిరుగుబేరం రడీగా వుంది కాబట్టి కరీమ్.. ఎదురుగా వున్న బంకు దగ్గరకు వెళ్లాడు. “అన్నా!.. ఈడ రాఘవయ్య ఇల్లేది..”

“ఏ రాఘవయ్య.. ఈ ఈధిలో నలుగురు రాఘవయ్యలుండారు. ఇంటి పేరేందయ్యా..”

“తెలవదు..”

“తెలవకపోతే ఎలా.. నీ రాఘవయ్య ఇంటిని కనుక్కోడం కష్టం..”

“నా రాఘవయ్య కాదు.. అడుగో.. ఆ ఆటోలో ఉన్నాడే.. వారి రాఘవయ్య..”

“ఓహ్.. అసలోడు ఆయనన్నమాట!..”

“అవును…”

“ఆయన్నడిగి ఇంటి పేరు కనుక్కొనిరా..”

కరీమ్ వేగంగా ఆటోని సమీపించాడు.

“అన్నా!.. ఆ రాఘవయ్య ఇంటి పేరేంటి?.. ఈడ నలుగురు రాఘవయ్యలుండారంట!..”

“ఇంటి పేరా?..”

“అవును..”

“అదేందో.. నాకు తెలవదే..”

“ఇంటి పేరు తెలవకపోతే మనం రాఘవయ్యను పట్టుకోవడం కష్టమంట.. బండిని వెనక్కు తిప్పనా!..” ఆటోలో కూర్చోబోయాడు కరీమ్..!

“అరెరే!.. ఆగరా అవసరపడకు. ఇంటి పేరు తెలవదుగాని.. ఆయన పనిచేసే పెద్దయ్య గారి పేరు భుజంగవర్మ.. కాబట్టి భుజంగవర్మ రాఘవయ్యగారి ఇల్లు తెలుసా అని అడగరా!.. నేనే అడిగేవాణ్ణి.. నేను కొంచెం.. నీకు తెలుసుగా..” నవ్వాడు పాండు.

కరీమ్ విసుగ్గా “సరే!..” అని షాపును సమీపించాడు.

“అన్నా.. భుజంగరావుగారి దగ్గర పనిచేసే రాఘవయ్యగారి ఇల్లన్నా!.. ఎక్కడా?”

“ఏందీ!.. భుజంగరావు దగ్గర పనిచేసే రాఘవయ్యగారి ఇల్లా!.”

“అవునన్నా..!” ఆత్రంగా అన్నాడు కరీమ్.

“మీరు భుజంగరావు మనుషులా..” ఆశ్చర్యంతో అడిగాడు ఆ షాప్ ఓనర్.

“నేను కాదన్నా!.. ఆ ఆటో నాది.. ఆయన భుజంగరావు మనిషి.”

“ఆయన్ని ఇటు పిలు..” అన్నాడు షాప్ ఓనర్.

“అన్నా.. నీవంట ఈడకి రా.. షాపు అన్న నీతో మాట్లాడాలంట..” హెచ్చు స్థాయిలో చెప్పాడు కరీమ్.

పాండు.. నిట్టూర్చి.. తల ఇదిలించుకొని.. రోడ్డు క్రాస్ చేసి షాపు ముందుకు వచ్చి నిలబడ్డాడు.

“నీవు భుజంగవర్మ మనిషివా!..” అడిగాడు షాపు ఓనర్..

అవునన్నట్టు తల ఎగరేశాడు పాండు..

“రాఘవయ్య నీకు తెలుసునా..”

“తెలవదు..”

“ఆయనతో నీకేం పని..”

“కలవాలి.. మాట్లాడాలి..”

“అట్టాగా!..”

“అయితే.. వెనక్కు వెళ్లి మీ అయ్యగారు భుజంగవర్మగారినే అడుగు రాఘవయ్య ఎక్కడని?..” వ్యంగ్యంగా చెప్పాడు షాప్ ఓనర్.

“మా అయ్యగారే రాఘవయ్యను కలవమని ఈడకి నన్ను పంపిండన్నా.. విషయం తెలియాలిగా.. అందుకే..” పాండు మెల్లగా చెప్పాడు.

“అయ్యా!.. నీ పేరేందో!.. నాకు అనవసరం.. ఆ రాఘవయ్యగారు జైల్లో ఉన్నారు..”

“ఈరోజు యిడుదలయిండన్నా!..”

“ఆ..!” ఆశ్చర్యంతో అన్నాడు ఆ షాపు యజమాని.

“అవునన్నా!..”

“శిక్ష ఏడేళ్లు.. ఆరున్నర సంవత్సరం గడిచింది. మరో ఆరు నెలలుంది శిక్షాకాలం..” అన్నాడు షాపు ఓనరు.

“అన్నా..! మీరన్నదీ నిజమే!.. కానీ.. రాఘవన్న మంచితనానికి.. జైల్లో చేసిన చాకిరీకి మెచ్చి.. శిక్ష ఆరునెలలు తగ్గించారు..”

“అన్నా!.. నా డబ్బులియ్యన్నా!.. నేను పోతా.. నీవు ఈ పెద్దాయనతో తీరిగ్గా మాటాడుకో..” దీనంగా అడిగాడు కరీమ్.

“ఒరే వుండ్రా.. ఆయన ఈడలేకపోతే.. నాకేం పని.. ఇద్దరం కలసి పోదాం..”

“నీ పేరేంది?..” అడిగాడు షాపు ఓనరు.

“పాండురంగ..”

“అయ్యా!.. పాండురంగా!.. ఈ రోజు ఇంతవరకూ రాఘవయ్య వూర్లోకి రాలేదు. ఆ ఎదురు గొందిలో మొదటి ఇల్లే వాళ్లది. ఇంట్లో ఎవరూ లేరు. ఇల్లు శిధిలావస్థలో వుంది. రాఘవయ్య జైలుకెళ్లిన వార్త విని వాళ్ల అమ్మ గుండె ఆగి చనిపోయింది. భార్య దిగులుతో మరో సంవత్సరం తర్వాత గతించింది. ఒకే పాప.. వాళ్ల మేనమామ తీసుకెళ్లిపోయాడు. ఆమె ఈ పాటికి కాలేజీకి రావాల్సిన వయసు. ఎలా వుందో.. ఎక్కడ వుందో!.. ఆ దైవానికే తెలియాలి.” విచారంగా చెప్పాడు షాపు యజమాని కృష్ణయ్యగారు.

పాండు వేగంగా ఆ గొందిలో ప్రవేశించాడు. ఆ ఇంటి పరిసరాలను పరిశీలించాడు. ఎదురింటివారిని.. ప్రక్కఇంటివారిని రాఘవయ్య వచ్చాడా అని అడిగాడు.

“రాలేదు..” అదే వారి జవాబు.

పాండు మైకం చాలావరకు తగ్గింది.

‘వాడు ఇంకా ఈ ప్రాంతానికి రాలేదు. ఈ వూరికి.. నగరానికి మధ్యన భూములు.. తోటలు.. ఆ ప్రాంతంలో ఆగి వాణ్ణి కాపుకాచి పట్టుకోవడం సులభం. ఇక్కడినుంచి వెంటనే బయలుదేరాలి..’ ఆ నిర్ణయంతో ఆటోను సమీపించాడు పాండు.. కూర్చున్నాడు.. కరీమ్ ఆనందంగా ఆటోను స్టార్ట్ చేసి ముందుకు నడిపాడు.

ఆటో వెళ్లిపోయిన పదిహేను నిముషాలకు ఓ ‘ఆడి’ కారు వచ్చి ఆగింది.

ఆ షాపు ఉన్న ప్రాంతం నాలుగు రోడ్ల కూడలి.. తూర్పు పడమరలుగా విశాలమైన మెయిన్ రోడ్డు.. ఉత్తర దక్షిణాలుగా బ్రాంచిరోడ్.. కృష్ణయ్యగారి షాపు కార్నర్ ప్లాట్‌లో వుంది. వారు ముగ్గురు అన్నదమ్ములు. ముగ్గురూ వ్యాపారస్థులే. తాత తండ్రులనుంచి వారు ఆ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. వారికి దూరపు చుట్టం రాఘవయ్య.. కృష్ణయ్య తమ్ములు గోపాలయ్య.. శీనయ్య. వారిది చాలా పెద్ద షాపు. మూడు భాగాలుగా జనరల్ స్టోర్స్, సిగరెట్, బీడీ, కాఫీ.. గృహావసర సామాగ్రి.. వస్త్రాలు.. సర్వం.. వారి షాపుల్లో దొరుకుతాయి. కృష్ణయ్యగారు జనరల్ స్టోర్సు రెండవ భాగమైన సిగరెట్ మొదలగువాటిని విక్రయిస్తుంటారు.

ఆరు అడుగుల అందగాడు.. ఆజానుబాహుడు.. షాపును సమీపించి గోల్డ్ ఫ్లాక్ కింగ్ సైజ్ సిగరెట్ పాకెట్‌ను తీసుకొని.. సిగరెట్ను బయటికి తీసి వెలిగించాడు..

“డాక్టర్ సార్.. నమస్కారం..” వారిని చూచిన కృష్ణయ్యగారు నవ్వుతూ చెప్పారు.

“నమస్తే అన్నా!.. అంతా బాగున్నారా!..” అడిగాడు డాక్టర్ అన్నా.. చిరునవ్వుతో..

“సర్వేశ్వరుని దయ.. అంతా క్షేమమే.. ఆరు అంతస్తుల భవన నిర్మాణం ఎంతవరకు వచ్చింది సార్..”

“మరో ఆరు నెలల్లో పూర్తవుతుంది.. కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ అమెరికా నుండి వస్తాయి. హాస్పటల్‌ను అక్టోబరులో ఓపెన్ చేయబోతున్నాము.”

“చాలా సంతోషం సార్!.. మీ సంకల్పం సవ్యంగా నెరవేరుతుంది..” అన్నాడు కృష్ణయ్య.

ఆ క్షణంలో అతని చూపులు చాక్లెట్స సీసాపై వున్న ‘సెల్’ వైపు మరలింది. చేతికి తీసుకొన్నాడు. కృష్ణయ్యకు అర్థం అయింది.. అది పాండూది అని.

“సార్.. చిన్న సాయం చేయాలి..”

“చెప్పండి.. ఏమిటో..”

“పది నిముషాల ముందు ఒకతను ఆటోలో ఇక్కడికి వచ్చి సెల్ ఇక్కడ పెట్టి మర్చిపోయి వెళ్లిపోయాడు. పేరు పాండు.. అతను ఆటోలో సిటీ వైపుకే వెళుతున్నాడు. ఈ సెల్‌ను అతనికి ఇవ్వండి సార్!..” అంటూ సెల్‌ను అన్నాకు చూపించాడు కృష్ణయ్య.

అన్నా దాన్ని చేతిలోకి తీసుకొన్నాడు.

“ఇస్తాను.. వస్తానండీ!..”

వేగంగా నడిచి కారును సమీపించి కూర్చొని స్టార్ట్ చేశాడు. కారు ఐదు నిముషాల్లో గృహ ప్రాంతాన్ని దాటింది. రోడ్డు రెండు వైపులా పచ్చని పంట పొలాలు.. మామిడి.. జామ తోటలు.. చెరకు చేలు..

దాదాపు కిలోమీటరు దూరంలో అన్నాకు రెండు ఆటోలు గోచరించాయి. రెండూ ఆగివున్నాయి.

ఇరువురు వ్యక్తుల మధ్య పెనుగులాట..

అన్నా కారు వారిని సమీపించింది. పది అడుగుల దూరంలో కారును ఆపి అన్నా కారు దిగాడు.

ఆ ఇరువురు వ్యక్తులు.. ఒకరు రాఘవయ్య.. రెండవ వ్యక్తి పాండు..

దృఢకాయుడైన పాండు రాఘవయ్యను కొట్టి క్రింద పడదోసి అతని చేతులను కట్టివేయాలని కరీమ్‌ను తాడు కోసం అడిగాడు.

అదే సమయానికి అన్నా ఆ ఇరువురినీ సమీపించాడు..

భుజంపై చేయి వేసి అన్నాను చీదరించుకొని ఛంగున లేచి అన్నా చొక్కాను పట్టుకున్నాడు పాండు. చేతిని పక్కకు నెట్టి కిందపడివున్న రాఘవయ్యను లేవదీయ ప్రయత్నించిన అన్నాను నెట్టి బలంగా కొట్టాడు పాండు..

“వాడు నాకు కావాలి.. వాడిని నేను నాతో రిక్షాలో తీసుకొని వెళ్లాలి.. నీవు అడ్డురాకు..” అంటూ అరిచాడు పాండు.

ఒంటికి తగిలిన దెబ్బలవలన రాఘవయ్య లేవలేని స్థితి. ఆటో కరీమ్‌కు అది అన్యాయమని తెలిసినా భయంతో ఏమీ చేయలేని పరిస్థితి.

ఎపుడైతే అన్నా పాండూకు ఎదురు తిరగాడో కరీమ్ రాఘవయ్యను పైకిలేపి ఆటోలో కూర్చోపెట్టాడు. తనవద్ద బాటిల్‌లో ఉన్న మంచినీటిని ఇచ్చాడు.

అనునయంగా ఎంత చెప్పినా పెనుగులాట వీడని పాండూను అన్నా ఘాటుగా తను ఎరిగిన కరాటే స్టయిల్లో రెండు తగిలించాడు. పాండు నేలకూలాడు.

కారు డిక్కీ తెరచి పాండూను అందులో పడేసి మూశాడు. గాయాలతో స్పృహ కోల్పోయి వున్న రాఘవయ్యను తన కార్లో వెనుక సీట్లో పడుకోబెట్టాడు. కరీమ్‌ను వెనకాలే రమ్మన్నాడు. కారును స్టార్ట్ చేశాడు.

అరగంటలో అన్నా కారు హాస్పటల్ ఆవరణలో పోర్టికోలో అగింది.

కారు దిగి కారు డిక్కీ తెరిచాడు. స్పృహలేని పాండూను, రాఘవయ్యను స్ట్రెచర్‌పై వేసుకొని వార్డులోకి తీసుకొని వెళ్లిపోయారు.

***

కరీమ్ ఆటో వచ్చి ఆగింది. కరీమ్ భయంభయంగా హాస్పటల్లో దిక్కులు చూచాడు.

ఓ నర్స్ వచ్చి.. “ఎవరు కావాలి..” అడిగింది.

“పది నిముషాల ముందు ఆ కార్లో వచ్చారే.. ఆ డాక్టరుగారు కావాలి” అంటూ ఎదురుగుండా వున్న అన్నా కారును చూపించాడు కరీమ్.

“అది డాక్టరు అన్నా సార్ గారి కారు..”

“నేను సార్‌నే కలవాలి.. నన్ను ఆయన రమ్మన్నారు..”

“సరే.. నాతో రా!..”

ఆమె ముందు, వెనకాలే కరీమ్ డాక్టర్ అన్నా వున్న గది వైపునకు నడిచారు. సమీపించారు.

ఆగమని చెప్పి.. ఆ నర్స్ గది తలుపును తెరచికొని లోనికి వెళ్లి మూసింది.

రెండు నిముషాల తర్వాత గది నుండి బయటికి వచ్చింది.

“సార్.. నిన్ను లోనికి రమ్మన్నారు.. వెళ్లు..” చెప్పింది నర్స్.

కరీమ్ భయంతో మెల్లగా తలుపు తెరచి తలను లోనికి పెట్టాడు.

“రా!.. రా!.. భాయ్!.. రా!…” చిరునవ్వుతో పిలిచాడు అన్నా.

ఆ పిలుపు విన్నాక కరీమ్‌కు ధైర్యం వచ్చింది. ముఖంలో సంతోషం.

“నమస్తే సార్.!..”

“నమస్తే… రా కూర్చో..” కుర్చీ చూపించాడు అన్నా.

కరీమ్ కుర్చీలో కూర్చున్నాడు. పక్కనే వున్న ప్లాస్కులోవున్న టీని గ్లాసులో వంచి కరీమ్‌కు అందిస్తూ..

“నీ పేరేమిటి భయ్యా..” అని అడిగాడు.

“కరీమ్ సార్!..” గ్లాసు అందుకున్నాడు.

“టీ త్రాగు.. మాట్లాడుకుందాం..” లేచి రెస్టురూమ్ లోకి వెళ్లాడు అన్నా..

ఐదు నిముషాల తర్వాత వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు..

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here