డాక్టర్ అన్నా బి.యస్.యస్.-23

0
9

[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

[ఆశ్రమానికి తను తీసుకెళ్ళిన చాక్లెట్ల కవర్లను సుమతికి ఇస్తాడు అన్నా. ఆశ్రమం అంతా తిరిగి చూస్తాడు. కాసేపయ్యాక ఆఫీసు గది ముందున్న కుర్చీలో కూర్చుంటాడు. ఇంతలో వెంకటేశ్వర్లు గారి గదిలోంచి భుజంగవర్మ, కాంట్రాక్టరు గోవిందు బయటకి వస్తూ అన్నాని చూస్తారు. ఈలోపు అన్నాని లోపలికి పిలుస్తారు వెంకటేశ్వర్లు గారు. అమెరికాలో ఉండే ధర్మతేజ కొడుకునని చెప్పి, ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం మీరు మా నాన్నగారికి విలువ కట్టలేని కానుకను ఇచ్చినట్టు ఆయన తన డైరీలో వ్రాసుకొన్నారని, ఆ కానుకేమిటో చెప్పగలరా అని అడుగుతాడు అన్నా. మీ తల్లికి ఎంతమంది పిల్లలు అని అడుగుతారు వెంకటేశ్వరులు గారు. తానొక్కడినే అని బదులిస్తాడు అన్నా. తల్లిదండ్రులు బాగున్నారా అని ఆయన అడగగా, వారిద్దరూ గతించారని చెప్తాడు అన్నా. అప్పుడు ఆయన ధర్మతేజ మాధవి దంపతులకు తానిచ్చిన కానుక అన్నా అని చెప్తారు. అన్నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. విచారించవద్దనీ, అంతా దైవనిర్ణయమని ఆయన అంటారు. శ్యామ్ బిఎస్ఎస్ ఏర్పాట్లు ముమ్మురం చేస్తాడు. సభ్యత్వం కోసం చేసిన ప్రయత్నాలకు చక్కని స్పందన వస్తుంది. పార్వతి అన్నాతో మాట్లాడదామని చూస్తే, అన్నా ఫోన్ ఆఫ్ చేసి ఉంటుంది. వెంకటేశ్వర్లు గారితో మాట్లాడేముందు సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు అన్నా. అక్కడ్నించి బయల్దేరుతూ సెల్ ఆన్ చేయగానే పార్వతి కాల్ వస్తుంది. ఆమెని తన ఇంటికి రమ్మని చెప్తాడు. సరేనంటుంది. అన్నా రాజమండ్రి నుంచి గుంటూరు వైపు వస్తుండగా దారిలో వెంకటేశ్వరులు గారు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు. ధర్మతేజ, మాధవిలు తన సొంత తల్లిదండ్రులు కాదనీ, తానొక అనాథనని గ్రహిస్తాడు. మధ్యలో కారు ఆపి వెంకటేశ్వర్లు గారితో మాట్లాడి తన అసలు తల్లిదండ్రులెవరో, తాను ఆశ్రమానికి ఎలా వచ్చానో చెప్పమని అడుగుతాడు. ఓ రోజు వేకువన తమ గేట్ ముందు ఏడుస్తున్న అలికిడి విని ఆయాలు పసిబిడ్డగా ఉన్న అన్నాను ఆశ్రమంలోకి తెచ్చారని ఆయన చెబుతారు. ఇంతలో రోడ్డు మీద ఓ కారుకు యాక్సిడెంట్ అయి కనబడుతుంది. వాళ్ళకి సాయం చేద్దామని దిగుతాడు అన్నా. అందులో ఉన్నది డ్రయివర్.. ప్రక్కన భుజంగవర్మ. మరో వ్యక్తి సాయం చేయడంతో వాళ్ళని తీసుకువచ్చి హాస్పిటల్‍లో అడ్మిట్ చేస్తాడు అన్నా. ఆలస్యం అయిందని, అన్ని విషయాలు ఇంటికి వచ్చి చెప్తానని పార్వతికి ఫోన్ చేస్తాడు. ఇక చదవండి.]

[dropcap]‘మా[/dropcap]నవ జీవితం ఎంతో చిత్రమైనది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికీ వూహకు అందని విషయం. వెంకటేశ్వర్లు గారు చెప్పిన మాటల ప్రకారం.. నేను ఎవరో.. నాకే కాదు.. మరెవరికీ కూడా తెలియదు. ఇరవైఎనిమిది సంవత్సరాల క్రిందట మాట.. కథ .. ఏ తల్లికి నేను.. ఏ కారణంగా భారమై అనాథాశ్రమ వాకిటకి చేరానో!.. ఆ తల్లి ఎవరు?.. ఎటు పోయిందో!.. వుందో.. లేదో!.. ఆమెను ఆ స్థితికి గురిచేసిన ఆ మగాడు.. నా జన్మకారకుడు.. ఎవరో?.. ఆ తల్లిని మోసం చేసి వుండవచ్చు.. వారి అక్రమ సంగమం.. నా జన్మకు కారణం అయి వుండవచ్చు!..’

‘నారాయణమూర్తిగారు.. నేనెరిగి నాన్నగారికి ప్రాణస్నేహితులు. వారి కుమార్తె పార్వతి నన్ను ఎంతగానో అభిమానిస్తూ వుంది. ముఖ్యంగా అమ్మనాన్నలు పార్వతిని తమ కోడలిగా కోరుకొన్నారు. ఆ విషయాన్ని నారాయణమూర్తి గారికి చెప్పారు. ఆ కుటుంబంలోని వారందరికీ నేనంటే ఇష్టం.. పార్వతి పట్టుదల గల వ్యక్తి.. నన్ను చూచి.. అమెరికాను చూచి.. తను కలక్టర్ కావాలనే నిర్ణయాన్ని మార్చుకోలేదు. ‘ఏదైనా తన లక్ష్యసాధన తరువాతనే’ అని తల్లికి తండ్రికి చెప్పింది.. సాధించింది.

ఆమెకు తాను వెంకటేశ్వర్లుగారి నుండి తెలిసి కొన్న తన జన్మ రహస్యాన్ని గురించి తెలియచేయాలి. ఆమె.. వారి తల్లిదండ్రులకు తెలియచేస్తుంది. వారి సమ్మతం ఐతే తన వివాహం అమ్మా నాన్నల కోరిక ప్రకారం పార్వతితో జరుగుతుంది.

వారికి నా కథ నచ్చకపోతే.. వివాహ ప్రసక్తి మరచిపోవాలి.. అంతే కాదు.. నేను పార్వతినే మరచిపోవాలి. నా వృత్తిని సవ్యంగా సాగిస్తూ మానవ సేవే మాధవ సేవగా భావించి జీవితాన్ని నాన్నగారు కలగా వూహించి వ్రాసిన బి.యస్.యస్.ను వృద్ధి చేయాలి. వారి ఆత్మకు శాంతిని కలిగించాలి. జీవితాంతం.. వారి లక్ష్యాన్ని పాటించాలి. ప్రగతిని సాధించాలి.. పార్వతి.. నారాయణమూర్తి గార్ల నిర్ణయాన్ని ఆనందంగా స్వీకరించాలి.. బాధ భయాలకు అతీతంగా వుండాలి..’ ఆ తలంపులతో అన్నా ఇంటికి చేరాడు.

వరండాలో పార్వతి కూర్చుని వుంది.

కారును చూడగానే లేచి వరండా మెట్లు దిగింది.

అన్నా కారును పోర్టికోలో ఆపి దిగాడు.

పార్వతి ప్రీతిగా చిరునవ్వుతో అన్నా ముఖంలోకి చూచింది.

అంతవరకు విచారంగా ఏదేదో ఆలోచనల్లో వున్న అన్నా మనస్సుకు పార్వతి చూపు.. పన్నీటి జల్లు అయింది.

“సారీ!.. పార్వతి గారూ.. ఆలస్యం అయింది..”

“డాక్టర్ వృత్తికి ఇలాంటి ఆలస్యాలు అపుడపుడూ సహజమేగా!.. నో ప్రాబ్లమ్. అలసిపోయారు!..” చిరునవ్వుతో అన్నా ముఖంలోకి చూచింది.

అన్నా.. సోఫాలో కూర్చుంటూ.. “కూర్చోండి”.. మెల్లగా చెప్పాడు.

సింధ్యా వరండాలోకి వచ్చాడు.

పార్వతి అన్నాకు ఎదురు సోఫాలో కూర్చుంది.

“అయ్యా!.. కాఫీ.. టీ.. ఏం కావాలి?”

“అమ్మగారికి ఏమన్నా ఇచ్చావా?..”

“అరగంట ముందు టీ త్రాగాను. మీరు త్రాగండి.. నాకు ఇపుడు ఏమీ వద్దు..”

“భాయ్!.. టీ..”

సింధ్యా లోనికి వెళ్లిపోయాడు.

అన్నా పార్వతి ముఖంలోకి చూచాడు.

తన చేతిని వున్న వాచ్‌ని పార్వతి చూపిస్తూ.. “మీరు ఇచ్చింది.. అందరికీ ఎంతగానో నచ్చింది..” నవ్వుతూ చెప్పింది.

సింధ్యా టీ కప్పుతో వచ్చి అన్నాకు అందించాడు.

అన్నా పార్వతి ముఖంలోకి చూచాడు.

ఆ చూపులు అర్థాన్ని గ్రహించిన పార్వతి.. చిరునవ్వుతో.. “మీరు త్రాగండి..” అంది.

అన్నా టీ త్రాగుతూ.. తన వాచ్‌ని చూస్తూ..

“ఇల్లు చూచుకొన్నారా!..” అన్నాడు.

“నా ప్రెడిసిసర్ ఇల్లు బాగుంది. అందులోనే చేరాను..”

“మీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి..”

“చెప్పండి..”

“ఫ్రెష్ అయి వస్తాను.. టెన్ మినిట్స్ ప్లీజ్!..”

కప్పును టీపాయ్ పై వుంచి.. వేగంగా తన గదివైపుకు నడిచాడు.

లక్ష్మి వరండాలోకి వచ్చింది.

“అమ్మా!.. అన్నింటినీ డైనింగ్ టేబుల్ పై పెట్టాను..” అంది.

“సరే లక్ష్మీ!.. అయ్యగారు స్నానానికి వెళ్లారు. రాగానే వస్తాం.. సరేనా!..”

“అలాగే అమ్మగారూ!..” లక్ష్మి లోనికి వెళ్లిపోయింది.

‘చాలా పొద్దుపోయింది.. పార్వతి భోంచేసిందో.. లేదో.. విషయాన్ని భోజనానంతరం చెప్పాలి’ అనుకొన్నాడు అన్నా..

స్నానం ముగించి.. డ్రస్ మార్చుకొని హాల్లోకి వచ్చాడు. టీవీని చూస్తున్న పార్వతిని చూచాడు.

‘తెల్లటి కలర్ పల్చటి లాల్చీ.. పైజమాతో అన్నా చూచేదానికి చాలా అందంగా వున్నాడు..’ అనుకొంది పార్వతి.

“ఆ.. లేవండి.. భోంచేసి మాట్లాడుకొందాం..”

సోఫాలోంచి లేస్తూ.. “ఆకలిగా వుంది.. నాకు నైన్ కల్లా తినే అలవాటు..” చిరునవ్వుతో ఓరకంట అన్నా ముఖంలోకి చూస్తూ గోముగా చెప్పింది.

“ఓ.. సారీ.. సారీ .. ప్లీజ్ కమ్..”

ఇరువురూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు.

సింధ్యా.. సిల్వర్ ప్లేట్లను వుంచి.. చపాతీలను వడ్డించాడు. రైతా కప్పులు.. సాంబార్ కప్పులను ప్రక్కన వుంచాడు.

పార్వతి .. వేగంగా బాగా తిన్నది.. అన్నా ఆలోచనలతో కొద్దిగా తిన్నాడు.

భోజనాలు ముగిశాయి.. ఇద్దరికీ సింధ్యా పాలగ్లాసులను అందించాడు. అన్నా అందుకొన్నాడు. పార్వతి.. “కడుపు నిండింది.. వద్దు” అంది అన్నా ముఖంలోకి చూస్తూ..

“రాత్రిపూట ఓ గ్లాస్ పాలు త్రాగడం మంచి అలవాటు.. తీసుకోండి..” ప్రీతిగా చెప్పాడు అన్నా..

పార్వతి పాలగ్లాసును సింధ్యా నుంచి అందుకొంది.

“సింధ్యా!.. అమ్మగారి కారును నీవు నడుపుతూ మా వెనకాలే రా!.. నేను వారూ మన కార్లో వారి ఇంటికి వెళతాము. వారిని అక్కడ వదిలి మన కార్లో తిరిగి వద్దాం.”

“యస్ సార్!..” అన్నాడు సింధ్యా..

“రండి.. చాలా పొద్దుపోయింది..” పార్వతి ముఖంలోకి చూస్తూ అన్నాడు అన్నా..

“ఫరవాలేదు..”

ఇరువురూ కార్లో కూర్చున్నారు. అన్నా కారును స్టార్ట్ చేశాడు.

కారు రోడ్లో ప్రవేశించింది. సింధ్యా పార్వతి కారులో వెనుక వస్తున్నాడు.

“ఏదో చెబుతానన్నారు?..” అన్నా ముఖంలోకి చూచింది పార్వతి.

“అవును.. ధర్మతేజ.. మాధవీలు.. మా అమ్మా నాన్న కారు. ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రిందట నన్ను.. రాజమండ్రి అనాథ పిల్లల ఆశ్రమ నుంచి ధర్మతేజ దంపతులు తీసుకొన్నారు. ఈ విషయాన్ని ఆశ్రమ నిర్వాహకులు వెంకటేశ్వర్లు గారు చెప్పారు. యీ విషయం నాకు కొన్ని గంటలముందే తెలిసింది. దాచి మిమ్మల్ని మోసం చేయడం నాకు ఇష్టం లేదు. యథార్థానికి నేను ఒక అనాథను.. మీ వాళ్లకు ఈ విషయాన్ని చెప్పండి. వారి అభిప్రాయం.. మీ అభిప్రాయం.. ఒకటై.. నేను మీకు నచ్చితే.. మా అమ్మా నాన్నల కోర్కె ప్రకారం మన వివాహం జరుగుతుంది. మీకు మీ వాళ్లకీ నచ్చకపోతే.. వుయ్ విల్ రిమైన్ యాజ్ ఫ్రెండ్స్..” రోడ్డును చూస్తూ గంభీరంగా చెప్పాడు అన్నా..

పార్వతి ఆశ్చర్యపోయింది. తన చెవులను తాను నమ్మలేకపోయింది. పిచ్చిదానిలా అన్నా ముఖంలోకి చూచింది.

“పార్వతిగారూ!.. నేను చెప్పిన ప్రతి అక్షరమూ సత్యం..”

పార్వతి కళ్లల్లో కన్నీరు.. అన్నా ముఖంలోకి చూచింది..

దృష్టి ఆర్పకుండా రోడ్డును చూస్తూ అన్నా కారు నడుపుతున్నాడు.

కారు పార్వతి ఇంటిని సమీపించింది.

పార్వతి దిగింది.. అన్నా కూడా దిగాడు.

పార్వతి అన్నా ముఖంలోకి దీనంగా చూచింది.

అన్నా.. చిరునవ్వుతో ఆమె ముఖంలోకి చూచాడు.. ఆ కళ్లల్లో వున్న కన్నీటిని పార్వతి చూచింది.

“గుడ్‍నైట్” మెల్లగా చెప్పాడు అన్నా..

పార్వతి కళ్లల్లో కన్నీరు.

వెనుతిరిగి వచ్చి కార్లో కూర్చొన్నాడు.

సింధ్యా తాళాలను పార్వతికి ఇచ్చాడు. అన్నా కార్లోకి వచ్చి కూర్చున్నాడు.

అన్నా కారును వెనక్కి త్రిప్పి వేగాన్ని పెంచాడు.

పార్వతి తన కార్లో కూర్చుంది. లోనికి వెళ్లి పోర్టికోలో ఆపి.. దిగి తన ప్లాట్‌కు వెళ్లి మంచంపై వాలిపోయింది. అంతవరకూ అణచి పెట్టుకొనివున్న దుఃఖాన్ని ఆపుకోలేక భోరున ఏడ్చింది. కొద్ది నిముషాల తర్వాత తమాయించుకొని తండ్రికి ఫోన్ చేసింది.

రాత్రి ఒంటిగంట.

ఉలిక్కిపడి లేచి కంటిన్యూగా మ్రోగుతున్న ఫోన్‍ని చేతికి తీసుకొన్నాడు. నారాయణమూర్తి.

పార్వతి.. అన్నా తనకు చెప్పిన విషయాన్ని వివరంగా తండ్రికి చెప్పింది.

అంతా ప్రశాంతంగా విన్నాడు నారాయణమూర్తి.. “రేపు నేను వచ్చి అన్నాతో మాట్లాడుతాను. నీవు బాధపడకుండా ప్రశాంతంగా పడుకో!..” సెల్ కట్ చేశాడు నారాయణమూర్తి.

పార్వతి నిట్టూర్చి.. పడకపై వాలిపోయింది.

***

డాక్టర్ శ్యామ్, డి.ఐ.జి. వినోద్, అడ్వకేట్ ఆనందరావు ఉదయం ఆరున్నరకల్లా అన్నా నిలయానికి వచ్చారు.

అన్నా.. అపుడే యోగ ముగించి వరండాలోకి వచ్చాడు. మాధవయ్య గారి కాలు చాలావరకు నయం అయింది. వారూ వరండా నుంచి వీధిగేటు వరకూ మెల్లగా ఎలాంటి సపోర్టు లేకుండా నడకను ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఒకే కార్లో దిగిన ముగ్గురినీ చూచి అన్నా నవ్వుతూ వారిని సమీపించి.. వారితో కలసి వరండాలోకి వచ్చారు. కూర్చున్నారు.. సింధ్యా వారిని చూచి లోనికి వెళ్లాడు.

“గుడ్మార్నింగ్ సార్” అన్నాడు అడ్వకేట్ ఆనందరావు.

“చెప్పండి.”

“ఈ రోజు జడ్జిమెంటు సార్!..”

“ఎలా వుంటుంది?..”

“కరీమ్ సాక్ష్యంతో.. గెలుపు మనదయింది సార్.. పాండు రుద్ర గాళ్లకు మూడేళ్లు జైలు శిక్ష.. యాభైవేలు జరిమానా, భుజంగవర్మ గారికి ఐదేళ్లు కారాగార శిక్ష లక్షరూపాయలు జరిమానా విధిస్తారు సార్. డి.ఐ.జి. వినోద్ గారు భుజంగవర్మను అరెస్టు చేయాలని పైనుంచి ఉత్తరువులు.. మీతో ఒకమాట చెప్పి వారి ఇంటికి వెళ్లాలని వచ్చారు..”

“భుజంగవర్మ గారికి రాత్రి యాక్సిడెంటు జరిగింది. ప్రస్తుతంలో వారు హాస్పటల్లో ఉన్నారు. ఇపుడు వారి కండిషన్ ఎలా వుందో కనుక్కోవాలి..” డాక్టర్ శ్యామ్ ముఖంలోకి చూచాడు అన్నా

శ్యామ్ హాస్పటల్‍కు ఫోన్ చేశాడు. స్పృహ వచ్చిందని, స్పెషల్ రూమ్‍లో ఉన్నారని డాక్టర్ శృతి చెప్పింది. శ్యామ్ ఆ విషయాన్ని అందరికీ చెప్పాడు.

“వారి కాలు విరిగింది.. సర్జరీ చేసి స్టీల్ ప్లేట్లు బోల్ట్స్ సెట్ చేయబోతారు.. నడిచేదానికి కనీసం ఒక నెల అవసరం.. కాట్టి ప్రస్తుతం వారిని అరెస్టు చేయలేరు. కాలు విరిగితే వారు ఎటూ పారిపోలేరు కదా!.. కొంత కాలం ఆగండి!..” మెల్లగా చెప్పాడు అన్నా..

వరండా నుండి వీధిగేటు వరకూ వున్న ఖాళీ పేవుమెంటు మీద మెల్లగా నడుస్తున్న మాధవయ్య వారి మాటలను విన్నాడు.

లాయర్ ఆనందరావు, డి.ఐ.జి. వినోద్ ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు.

సోఫా నుండి లేచారు.

“సరే సార్!.. ఇక మేము వెళతాం.. హాస్పిటల్‍కు వెళ్లి భుజంగవర్మను డి.ఐజి. వినోద్.. నేనూ చూస్తాం!..” అన్నారు లాయరు ఆనందరావు గారు.

సింధ్యా టీ కప్పులతో వచ్చి అందరికీ అందించాడు.

“ఇపుడు కాదు సార్.. నేను లేక మా శ్యామ్ మీకు ఫోన్ చేస్తాము. అపుడు వచ్చి చూడండి..” చెప్పాడు అన్నా.

టీ త్రాగి.. డి.ఐ.జి. వినోద్.. అడ్వకేట్ ఆనదరావు వెళ్లిపోయారు.

శ్యామ్ తాను చేసిన బి.యస్.యస్. వాట్సప్‍కు వచ్చిన రెస్పాన్సును అన్నాకు చూపించాడు. హాస్పటల్ మరో నెల లోపలే సిద్ధం అవుతుందని, కాలేజీ బిల్డింగ్సు అన్నీ రడీ అయ్యాయని.. తాను తీసిన సైట్ ఫొటోను అన్నాకు చూపించాడు.

మౌనంగా అన్నింటినీ చూచాడు అన్నా.

వీధి గేటుముందు కారు అగింది. పావని ఆ కారునుండి దిగి వేగంగా వరండా వైపుకు వచ్చింది. ఆమె ముఖంలో అప్రసన్నత.. కలవరం.

“గుడ్ మార్నింగ్ సార్!..”

“గుడ్ మార్నింగ్!..”

“మీతో రెండు విషయాలు చెప్పాలి..”

“ఏమిటవి?..”

“ఒకటి మా నాన్నగారికి సంబంధించినది.. రెండవది మీకు సంబంధించినది..”

“నాకు సంబంధించినది ఏమిటి?..”

“మా నాన్నగారు మిమ్మల్ని చంపేదానికి ఎత్తులు వేస్తున్నారు..”

అన్నా.. శ్యామ్.. మాధవయ్యలు పావని మాటలను విని ఆశ్చర్యపోయారు.

“అన్నా!..” ఏదో చెప్పబోయాడు శ్యామ్.

అన్నా ఎడంచేతిని పైకెత్తి అతన్ని చెప్పకుండా చేశాడు. పావని ముఖంలోకి చూచాడు.

“రెండవది ఏమిటి?..”

“నాన్నగారికి ఆపరేషన్ చేయాలట. ఓ-పాజిటివ్ రక్తం.. నాలుగైదు బాటిల్సు కావాలట. ఆ రక్తం.. హాస్పటల్‍లో స్టాక్ లేదు..” కన్నీళ్లతో బొంగురు పోయిన కంఠంతో దీనంగా అన్నా ముఖలోకి చూచింది పావని.

“రెండవ విషయాన్ని గురించి నీవు బాధపడొద్దు.. నేను చూచుకొంటాను.. మీ నాన్నగారిని కాపాడుతాను..”

“మరి.. మీ విషయం సార్!..” దీనంగా అడిగింది పావని.

“ఎందుకమ్మా బాధపడతావ్.. నా గురించి నాకు ఇప్పుడు భయం లేదు. ఇదిగో ఈ తమ్ముడు శ్యామ్.. ఆ మాధవయ్యగారు.. మా సింధ్యా.. లక్ష్మి.. వీరంతా ఉన్నారు.. నా వారుగా.. నాకేం భయంలేదు. మీరు వెళ్లండి.. డాక్టర్ శృతి సహకారంతో మీ నాన్నగారిని చూచుకోండి. నేను మరో గంటలో బయలుదేరి వస్తాను. రక్తాన్ని ఏర్పాటు చేసి ఆపరేషన్ చేయిద్దాం..” ఎంతో సౌమ్యంగా చెప్పాడు అన్నా..

పావని.. కన్నీటితో వారికి చేతులు జోడించింది.. “సార్!.. మా నాన్నగారిని మీరే కాపాడాలి! ప్లీజ్..” దీనంగా చెప్పింది.

“మీరు నిర్భయంగా వెళ్లండి..” చిరునవ్వుతో చెప్పాడు అన్నా..

పావని వెళ్లిపోయింది.

శ్యామ్ దీనంగా అన్నా ముఖంలోకి చూచాడు.

“భయపడకు.. బాధపడకు.. అంతా పైవాడి నిర్ణయం..” తన తల్లిదండ్రులు.. వెంకటేశ్వర్లు చెప్పిన పచ్చినిజాలు జ్ఞప్తికి రావడంతో అతని కళ్లల్లో కన్నీరు సుడులు తిరిగింది.

“అన్నా!.. నేను మీ కళ్లల్లో కన్నీటిని ఇంతవరకూ చూడలేదు!.. ఎందుకున్నా.. ఈ కన్నీళ్లు..” దీనంగా అడిగాడు శ్యామ్.

(ముగింపు వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here