[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]
[భుజంగవర్మ, రుద్రయ్య కూర్చుని ఉంటారు. పాండు సెల్‌కి ఫోన్ చేయబోతాడు రుద్ర. వద్దని వారిస్తాడు భుజంగవర్మ. పాండు చికిత్స పొందుతున్నట్లు చెప్పి, అక్కడి వాళ్ళకి తమ గురించి ఏం చెబుతాడోనని భయపడతాడు. ఇద్దరూ సాయంత్రం ఆసుపత్రికి వెళ్ళాలని అనుకుంటారు. భుజంగవర్మ భోజనానికి ఇంటికి వెళ్తుంటే, కూతురు ఫోన్ చేస్తుంది, అమెరికా నుంచి వారం రోజుల్లో వస్తున్నట్లు చెప్తుంది. అన్నా పాండుని ఐసియుకి, రాఘవయ్యని స్పెషల్ వార్డుకి మార్పిస్తాడు. గన్‌మెన్స్ సెక్యూరిటీగా ఉంటారు. సాయంత్రం భుజంగవర్మ, రుద్ర ఆసుపత్రికి వస్తారు. పాండుని చూస్తామని అంటే, ఐసియులో ఉన్నాడు కదరదని అంటారు. కోపంతో డా. అన్నా గదిలోకి వస్తారు. అన్నాకి, భుజంగవర్మకి మధ్య వాదన జరుగుతుంది. రుద్ర అన్నాని బెదిరించబోతే, అన్నా అతన్ని గట్టిగా హెచ్చరిస్తాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. పాండు కోలుకున్నాకా, అసలు అతను రాఘవయ్యని ఎందుకు చంపాలనుకున్నాడో తెలుసుకుంటాడు డా. అన్నా. కోలుకున్న పాండుని జైలుకి పంపిస్తాడు. అక్కడైతే అతని ప్రాణానికి ప్రమాదం ఉండదని అన్నా ఉద్దేశం. పాండు తీసుకున్న అడ్వాన్స్‌కి మళ్ళీ రుద్రకి పంపేస్తాడు అన్నా. తర్వాత రాఘవయ్యని కలిసి భుజంగవర్తతో ఏమిటి శత్రుత్వం అని అడుగుతాడు. రాఘవయ్య భుజంగవర్మ గురించి చెప్తాడు. ఇక చదవండి.]
[dropcap]“అ[/dropcap]హంకారం తలకు ఎక్కివున్నవారికి.. మంచిమాటలు రుచింపవు.. ధర్మాధర్మ విచక్షణా జ్ఞానం వుండదు. యశోధర చేసిన ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరయింది. కాని ఆమె భయపడకుండా ఆమె తన భావాలను భర్త భూపతివర్మ.. మామగారు మార్తాండవర్మ గారికి తెలియజేసింది. సాంతం విన్న ఆ తండ్రి కొడుకులు అలోచించి ఓ నిర్ణయానికి వచ్చి కుటుంబ సభ్యులందరిని సమావేశపరిచారు.
అయిష్టంగానే రుక్మిణమ్మ, భుజంగవర్మ అతని మేనమామ మన్మథరావు ఆ సమావేశానికి హాజరైనారు.”
అన్నాకు రాఘవయ్య చెప్పే కథ అనవసరం అనిపించింది.
“రాఘవయ్యగారూ!.. నాకు భుజంగవర్మగారి జమీందారీ వంశం.. వారి తాత తండ్రుల చరిత్ర అనవసరం. మీకు భుజంగవర్మకు మధ్య ఏర్పడిన వైరానికి గల కారణాన్ని గురించి మాత్రం స్పష్టంగా చెప్పండి.. సరేనా..”
“ఓ.. సారీ సార్!.. అలాగే!..” నిట్టూర్చాడు రాఘవయ్య.. కొన్ని క్షణాల తర్వాత..
“సార్.. భుజంగవర్మ గారికి చాలా పెద్ద తోట వుంది. అందులో అన్ని రకాల ఫలవృక్షాలు.. పూలమొక్కలు వున్నాయి. దాని చుట్టూ ముళ్లకంచె.. కంచెపైన తీగలు.. ఆకులు.. పచ్చని ఆకులు.. మేకలకు ప్రియమైన ఆహారం.
ఓ రైతు తన మేకలను ఆ ప్రాంతంలో మేపుకొంటున్నాడు. అతని కొన్ని మేకలు అ కంచెపైన అల్లుకొనివున్న తీగల ఆకులను తినసాగాయి. ఆ మేకలు ఆ ఆకులను తినటం వలన కంచెకు వచ్చిన నష్టం ఏమీలేదు.
ఆ సమయానికి నేను భుజంగవర్మ తోట దగ్గరకు కార్లో వచ్చాము. కారును వారే నడిపారు. నేను వెనుక సీట్లో కూర్చున్నాను. కారు గేటు ముందు ఆగింది.
తోట లోపల వుండే కాపలా మనిషి వచ్చి గేటు తెరవలేదు. కారు దిగి నేనే తెరిచాను. భుజంగవర్మ కారు దిగారు. వారి చూపులు కంచె పైకి ప్రాకి.. తీగలను ఆకులను తింటున్న మేకల మీద పడింది.
డ్రైవర్‌ని పోన్ చేసి రమ్మన్నా రానందున వాడిపై కోపంతోపాటు కంచెపై ఆకులు తింటున్న ఆ మేకలను చూచిన భుజంగవర్మగారికి అగ్రహం రెండింతలయింది. ఆ మేకల కాపరిని పిలిచాడు. వాడు ఆ మేకలను కంచెకు దూరంగా తోలి.. మెల్లగా భయంతో.. వారిని సమీపించాడు.
భుజంగవర్మ కాలికి వున్న చెప్పును తీసుకొని బలంగా అతని తలపై నాలుగుసార్లు కొట్టాడు. ఆ వ్యక్తి కింద పడిపోయాడు. స్పృహ కోల్పోయాడు. నేను భయాందోళనలతో వాడి తలను ఒళ్లోకి తీసుకొని చూచాను. నోటినుంచి రక్తం..
కొన్ని క్షణాల్లో అతని శ్వాస నిలిచిపోయింది..
గుండెపై చేయివేసి.. ముక్కు దగ్గర వేళ్లు వుంచి చూచాను. నా అనుమానం నిజం అయింది. ఆ మేకల మునియ్య చచ్చిపోయాడు.
“అయ్యా!.. మునియ్య చచ్చిపోయాడయ్యా..” భోరున ఏడుస్తూ చెప్పాను. భుజంగవర్మకు ముఖం నిండా చమటలు!?..
“ఇపుడు ఏం చేయాలిరా!?..” భయంతో గొణిగారు.
తోట కాపలా వ్యక్తి యానాది నా గొంతు విని పరుగున వచ్చాడు. గేటు తెరిచాడు అతన్ని చూడటంతోనే భుజంగవర్మ
“రేయ్.. రాఘవా.. ఎంత పని చేశావురా.. కంచె మీది నాలుగు ఆకులు మేకలు తిన్నందుకు మునియ్యను కొడతావా..? అరే.. యానాదీ.. మునియ్యను చూడు.. హాస్పిటల్‌కు తీసుకువెళ్లదాం.. పాపం.. వీడు కొట్టిన దెబ్బకు నేలకూలాడు..” అంటూ ఎంతో ప్రేమాభిమానాలను మునియ్య పట్ల ప్రదర్శించి.. నన్ను హంతకుణ్ణి చేశాడు.
వారి మాటలను విన్న నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది..
“అయ్యా!.. తమరు.. తమరు..” పొంగివస్తున్న దుఃఖంతో మాట్లాడలేకపోయాను.
“యానాదీ.. మునియ్యను తాకి చూచి.. శ్వాసను పరిశీలించు..”
“అయ్యా!.. మునియ్య చచ్చిపోయాడయ్యా!…” విచారంగా చెప్పాడు..
నా ముఖంలోకి చూస్తూ..
“అన్నా!.. ఎంత పని చేశావన్నా… నాలుగు పిచ్చి ఆకులను మేకలు మేసినందుకు కోపంతో ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకొన్నావు కదన్నా!.. తప్పు చేశావన్నా!.. తప్పు చేశావు” విచారంగా అన్నాడు యానాది.
“రేయ్.. యానాదీ.. వాడిని కారు వెనుక సీట్లో వుంచరా.. హాస్పిటల్‌కు తీసుకెళ్లి డాక్టరుకు చూపిద్దాం రా… పాపం కొనవూపిరి వుందేమో!…” ఎంతో నటనపూర్వక సానుభూతి.. అభిమానం.. ఒలకబోశాడు.
ఆ యిరువురూ మునియ్యను వెనుక సీట్లో వుంచి.. వారు ముందు కూర్చొని.. నన్ను వదిలేసి వెళ్లిపోయారు. చేయని నేరానికి నేరస్థుడను అయాను. ఏడుస్తూ బంగళా వైపుకు నడిచాను.
హాస్పటల్లో డాక్టర్ వాడు ఎపుడో చనిపోయాడని నిర్ధారణ చేశారు. భుజంగవర్మ ఇంటికి వచ్చాడు.
పోలీసులు వచ్చారు. నాకు సంకెళ్లు వేసి తీసుకొని వెళ్లారు. రెండు నెలల తర్వాత.. ఏడు సంవత్సరాలు కారాగార శిక్ష అని జడ్డిగారు తీర్పు ఇచ్చారు.. నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు..
ఆరు నెలల క్రింద గుంటూరు జైలుకు మార్చారు.
ఏ నేరమూ చేయకుండా ఏడు సంవత్సరాలు కారాగార శిక్షను నేను అనుభవించాను.
నేను జైల్లో వున్న సమయంలో సంవత్సరం లోపలే నా తల్లి గతించింది. మరో సంవత్సరం తర్వాత నా ఇల్లాలు మరణించింది. మహానుభావుడు.. దూరపు బంధువు కృష్ణయ్యగారు నా బిడ్డ చిన్నీని హాస్టల్లో చేర్పించి చదివించారు.. కానీ.. మూడు సంవత్సరాల కిందట నా బావమరిది చలపతి అతని భార్య గోవిందమ్మ అమ్మాయిని తమతో తీసుకొని వెళ్లిపోయారని.. ఓసారి జైలుకు వచ్చిన కృష్ణయ్య చెప్పి వెళ్లాడు. నన్ను జైలునుంచి ఆరుమాసాలు ముందుగానే విడుదల చేశారు. మా బంధువు కృష్ణయ్యను కలిసేటందుకు వెళుతున్న సమయంలో ఆ పాండుగాడు నన్ను అటకాయించి కొట్టాడు.. నేను కింద పడిపోయాను. ఆ సమయంలో దేవుడులా మీరు వచ్చి నన్ను కాపాడారు. బాబుగారూ.. మీ రుణాన్ని నేను ఈ జన్మలో తీర్చుకోలేను. మీకు శతకోటి వందనాలు సామీ!..” అంటూ కన్నీళ్లతో చేతులు జోడించాడు రాఘవయ్య.
సుదీర్ఘమైన విచారకర కథను విన్న తర్వాత అన్నా.. మౌనంగా కళ్లు మూసుకున్నాడు.
ఐదు నిముషాల తర్వాత కళ్లు తెరచి..
“రెండు మూడు రోజుల్లో మిమ్మల్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేస్తారు. నేను మీకు ఇచ్చే సలహా!.. మీరు నాతో మా యింట్లో వుండిపొండి. నేను ఏకాకిని. నా అనేవాళ్లు ఎవరూ నాకు లేరు… కానీ నా సిద్ధాంతం… నా జీవితంలో నాకు పరిచయమైన వాళ్లంతా నా వాళ్లే!… మీ అమ్మాయిని మీరు నా ఇంటికి రాగానే నేను తీసుకొని వస్తాను. ఆమె ఏ చదువు చదవాలనుకుంటే… ఆ చదువు చదివిస్తాను. మీ కూతురు చిన్నీని.. నా చెల్లిగా చూచుకొంటాను. ఈ నా నిర్ణయానికి మీ అభిప్రాయం ఏమిటి రాఘవయ్యగారూ!..” ఎంతో ప్రశాంతంగా చిరునవ్వుతో అడిగాడు అన్నా.
అన్నా మాటలకు రాఘవయ్య హృదయం ద్రవించింది. అవధులు లేని ఆనందం.. కళ్లనుండి ఆగని ఆనంద బాష్పాలు..
“సామీ!.. మీరు నా పాలిట దేవుడు!..” అన్నా చేతులను తన చేతిలోకి తీసుకొన్నాడు. కళ్లకు అద్దుకొన్నాడు.
“దేనికీ భయపడకండి!.. అన్నీ నేను చూచుకుంటాను” అంటూ గదినుంచి బయటకు నడిచాడు అన్నా.
***
భుజంగవర్మ.. తన ఆఫీసు గదిలో కాలుకాలిన పిల్లిలా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. ఓ మూల రుద్రయ్య బిక్కముఖంతో భుజంగవర్మ ముఖంలోకి చూచేదానికి భయపడుతూ దొంగ చూపులు చూస్తున్నాడు.
“రేయ్!.. రుద్రా!..”
“చెప్పండి దొరా!..”
“నాకు ఆ రాఘవయ్య సజీవంగా కావాలి!.. లేదా వాణ్ణి చంపి భూస్థాపితం చేసినట్టు ఆనవాళ్లయినా కావాలి!.. నీవు చేయగలవా.. చేయలేవా!..”
“చేస్తానయ్యా!..”
“ఎప్పుడు?…”
“నెల రోజుల్లో!..”
“చేయలేకపోతే!..”
“అనకండయ్యా.. ఆ మాట మరోసారి!.. చూస్తూ వుండండి.. నెల రోజుల్లో ఏ జరుగబోతుందో!.. చూడండి!..”
పౌరుషంగా చెప్పాడు రుద్ర.
“మాటలు అనవసరం.. క్రియ కావాలి!..”
“అలాగే.. చూపిస్తాను..”
“ఏం చూపిస్తావ్?..” వెటకారంగా అడిగాడు భుజంగవర్మ.
“నేను ఎవరన్న విషయాన్ని!..”
“ఒరేయ్!.. వాగుడు కట్టిపెట్టి ఏం చేయబోతున్నావో.. ఆ విషయం.. ప్లాన్.. ఏమిటో చెప్పు..”
“అది మాటలతో చెప్పేది కాదు దొరా.. చేతలతో చేయాల్సింది..” వికటంగా నవ్వాడు రుద్రయ్య.
భుజంగవర్మ సెల్ మ్రోగింది. ఫోన్ చేసింది వారి కూతురు పావని..
“హల్లో!.. ఆ.. ఆ.. చెప్పమ్మా!..”
“నాన్నా.. నేను బాంబేలో దిగాను. ఫ్లయిట్ మారి హైదరాబాద్ మూడు గంటల్లో దిగుతాను. ప్లీజ్ సెండ్ కార్ టు ఎయిర్‌పోర్ట్..” చెప్పింది పావని.
“అమ్మా!.. నేనే వస్తానమ్మా!..”
“సరే!.. నాన్నా!.. మీ యిష్టం..” సెల్ కట్ చేసింది పావని.
“రేయ్!.. రుద్రా.. ఇక నీవు వెళ్లు.. పాండుగాడు మనలను గురించి ఎవరికీ ఏమి చెప్పకుండా వుండేలా వాడికి చెప్పవలసిన మాటలు చెప్పు..” ఆవేశంగా చెప్పాడు భుజంగవర్మ.
రుద్ర తల ఆడించి వెళ్లిపోయాడు.
భుజంగవర్మ మస్తిష్కంలో అన్నా ఆలోచనలు.
‘ఎవడు.. ఈ అన్నా.. వీడి తల్లిదండ్రులెవరు? ఏ వూరు?.. వాడు మహా జీనియస్ అన్నాడు పార్వతీశం.. ఏంటి వాడి గొప్పతనం.. కనుక్కోవాలి.. అసలు వాడి బ్యాక్‌గ్రౌండు ఏమిటో తెలుసుకోవాలి..’ అనుకుంటూ హాస్పిటల్ ఎం.డి. పార్వతీశానికి ఫోన్ చేశాడు భుజంగవర్మ.
పార్వతీశంగారు కాల్ రిసీవ్ చేయలేదు. భుజంగవర్మ తన ప్రయత్నం మానలేదు. మూడవ ప్రయత్నం ఫలించింది.
“రేయ్.. పార్వతీశం!.. ఎవడురా ఆ అన్నా!..”
“వాడి వివరాలు నీకెందుకురా!?..”
“నాకు కావాలి..” ఆవేశంగా చెప్పాడు భుజంగవర్మ
“అదే.. ఎందుకని అడిగాగా!..”
“వాడు నా వాళ్లను తన కస్టడీలోకి తీసుకొన్నాడు.. అది తప్పు..”
“నీవు తప్పు అంటున్నావు.. ఒప్పు అంటున్నాడు అతను.. అతను నా హాస్పిటల్లో పనిచేసే రెగ్యులర్ డాక్టర్ కాదు. హి ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఫర్ హార్ట్ డిసీజెస్.. మహా మేధావి.. డాక్టర్ సోలోమన్ శిష్యుడు.. నేనూ వారి శిష్యుడనే. అతను నాకంటే వందరెట్లు తెలివైనవాడు. దేశప్రజల ఆరోగ్యం.. శ్రేయస్సు కోసం.. అలాంటి వారు మనకు చాలామంది కావాలి. అతనితో పోటీ పడకు.. గెలవలేవు.. ఓడిపోతావు..” చివరి పదాన్ని గట్టిగా చెప్పి సెల్ కట్ చేశాడు పార్వతీశం.
భుజంగవర్మ స్థితి అయోమయం.. పార్వతీశం సహకరిస్తాడని ఆశించాడు. అతని అంచనా తలక్రిందులయింది. ‘వినాశకాలే విపరీత బుద్ధి..’ ఆరునెలల ముందు జైలునుండి విడుదలయిన రాఘవయ్య.. తనకు అపకారం చేస్తారనే నిర్ణయంతో.. అతన్ని లేపేయాలని.. అతను జైలునుంచి బయటకు వచ్చే రోజును జైల్లోని సిండికేట్ వర్గం ద్వారా తెలిసికొని రుద్రయ్య పాండూలను సెట్ చేశాడు. రుద్రయ్య ఆ మహా ఘనకార్యాన్ని పాండూకు అప్పగించాడు. తాగుబోతు పాండు ఎక్కుబెట్టిన గురి బెడిసికొట్టింది.. పాండుగాడు అన్నా చేతికి దొరికిపోయి తన్నులు తిని హాస్పటల్ పాలైనాడు. ..అన్నా వాడిపై కేసు పెట్టి జైలు పాలు చేశాడు.. రాఘవయ్యకు తన నిలయంలో ఆశ్రయం కల్పించాడు అన్నా. పాండు రాఘవయ్యల ప్రస్తుత పరిస్థితి భుజంగవర్మకు పెద్ద సమస్య!.. మనస్సుకు తీరని అశాంతి!..
***
బొంబాయి ఎయిర్‍పోర్టులో స్పైస్ జెట్ బోయింగ్ విమానం హైదరాబాదు వైపు బయలుదేర సిద్ధంగా వుంది. ప్రయాణీకులు విమానంలో ఎక్కి వారివారి స్థానాల్లో కూర్చున్నారు. భుజంగవర్మ కుమార్తె పావని.. ఆలస్యంగా వచ్చి.. ఎయిర్ హెూస్టెస్ చూపించిన తన సీట్లో కూర్చుంది. ఇ-వరుసలో అది త్రీ సీటర్.. విండో సైడ్‌న వున్నది అన్నా… ‘ఎఫ్’ సీట్. పావని సీట్ మధ్యది. వాక్‌వే సైడ్ చివరి సీట్లో ఓ యాభై సంవత్సరాల మాత… దానికి నేరుగా ఓ అరవై సంవత్సరాల పెద్దమనిషి. వారి ప్రక్కన ఇరవై అయిదు సంవత్సరాల అందాల యువతి. విండో వైపు ఓ ఇరవైఏడేళ్ల యువకుడు కూర్చుని వున్నారు.
హడావిడిగా కూర్చోవడంలో పావని చేయి అన్నా చేతికి తగిలింది.
“సారీ సార్!…” అంది పావని ప్రాధేయపూర్వకంగా.. ఒదిగి సవ్యంగా కూర్చుంది.
“నో ప్రాబ్లమ్.. ప్లీజ్ ఫీల్ ఫ్రీ!..” చిరునవ్వుతో చెప్పాడు అన్నా.
ఎయిర్ హెూస్టెస్‌ల సందేశాల తర్వాత విమానం బయలుదేరి రన్‌వేలో ప్రవేశించి ఆకాశం వైపుకు ఎగిరింది. కొన్ని క్షణాల్లో మబ్బుల్లో ప్రవేశించి.. భూమినుండి పదమూడువేల అడుగుల ఎత్తుకు చేరి.. గంటకు ఏడువందల కిలోమీటర్ల వేగంతో విమానం గగనతలంపై హైదరాబాదు వైపుకు సాగిపోతూవుంది. ఎయిర్ హెూస్టెస్‌లు అల్పాహారాన్ని డిస్ట్రిబ్యూట్ చేయటం ప్రారంభించారు. కొందరు టికెట్లోనే అధికంగా చెల్లించి ఫ్రీ మీల్ తీసుకొంటారు. కొందరు వారి అవసరానికి తగినట్టుగా కొనుక్కొని తింటారు. ఏదిఏమైనా నేల మీది వెల కన్నా ఆకాశంలో వెల ఆరు.. ఏడు.. రెట్లకు పై మాటే.
విమానంలో ఎడమవైపు కిటికీ దగ్గర అన్నా.. దానికి హారిజాంటల్‌గా ఇ-రో లో బి సీట్లో మధ్య సీట్లో వున్న.. ఓ అందాల భామ.. అప్రయత్నంగా ఇరువురి చూపులు కలిసాయి.
ఆ యువతి ముఖంలో ఆశ్చర్యం..
తలను ప్రక్కకు తిప్పుకొని పేపర్ చూస్తున్న అన్నాను ఆమె వంగి కొన్ని క్షణాలు పరీక్షగా చూచింది.
ఆమె మస్తిష్కంలో అన్నాను గురించిన ఆలోచనలు.. కిటికీ గుండా వెనక్కి పరిగెత్తే మేఘాలను చూడసాగింది.. మధ్యలో రెండు సార్లు అన్నా వైపు చూచి తలను త్రిప్పుకొంది.
ఆమె మాట ప్రకారం చివర ‘డి’ సీట్లో కూర్చొనివున్న తల్లి ‘సి’ సీట్లో వున్న ఆమె తండ్రి.. సీట్లు మారారు. అంటే పెద్దాయన పావని ప్రక్కకు చేరాడు. ఇ-వరుసలో ‘డి’ సీట్లో కూర్చున్న తండ్రికి ‘ఎఫ్’ సీట్లో కూర్చొనివున్న అన్నాను చూడమని తన తండ్రికి చెప్పింది ఆ యువతి.
వారు.. అన్నాను పరీక్షగా చూచారు.
‘యస్.. అతనే ఇతను..’ అనుకొన్నారు.
‘బి’ సీట్లో ఉన్నది వారి పెద్ద కూతురు పార్వతి.. వారి పేరు నారాయణమూర్తి.. వారి ఇల్లాలు ఇంద్రజ.. చిన్న కొడుకు మాధవ్.. నలుగురూ బొంబాయి నుండి వివాఖపట్నం.. వయా హైదరాబాద్ ప్రయాణం చేస్తున్నారు.
నారాయణమూర్తిగారు లేచి.. వాక్‌వేలో నిలబడి అన్నా ప్రక్కన కూర్చొనియున్న ఇంద్రజను తన సీట్లో కూర్చోమని చెప్పారు. ఆమె లేచింది. ఇరువురూ సీట్లు మారారు.
అన్నా ప్రక్కన కూర్చున్న నారాయణమూర్తి అతని ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూచాడు.
ఇరువురి చూపులు కలిశాయి. నారాయణమూర్తి చిరునవ్వుతో..
“బాబూ!..” అన్నారు.
(ఇంకా ఉంది)