డాక్టర్ అన్నా బి.యస్.యస్.-9

0
10

[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

[తన ఇంటికి వచ్చిన భుజంగవర్మతో మాట్లాడుతుంటాడు అన్నా. తనకి ధర్మోపదేశం చేయద్దని అంటాడు భుజంగవర్మ. అన్నా చెప్పిన మీదట సిద్యా తెచ్చిచ్చిన గ్రీన్ టీ అందుకుంటాడు భుజంగవర్మ. టీ తాగడం పూర్తయ్యాకా, నేరం చేసినవాడు శిక్ష అనుభవించాలని చెబుతూ అందుకే అతని ఇద్దరు అనుచరులని పోలీసులకి పట్టించానని అంటాడు అన్నా. రాఘవయ్యని వదిలేయకపోతే, భుజంగవర్మని పోలీసులకి పట్టిస్తానని చెప్తాడు అన్నా. శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపమని సలహా ఇస్తాడు. భుజంగవర్మ కోపంగా వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడికి నారాయణమూర్తి,. ఇంద్రజ వస్తారు. మర్నాడు వారి పెద్దమ్మాయి పార్వతి పుట్టిన రోజని, సాయంత్రం ఆరుగంటలకు పార్టీకి రావాలని అన్నాకి చెప్పి తమ ఇంటి అడ్రసు రాసి ఉన్న కాగితం ఇచ్చి – ఇంకా చాలామందిని పిలవాలి అంటూ వాళ్లు బయలుదేరుతారు. రాఘవయ్యకి మందులు ఆహారం అన్నీ అమర్చారా లేదో చూసి తన గదిలో కూర్చుని తన గతాన్ని తలచుకుంటాడు అన్నా. యం.ఎస్. పూర్తి చేసి ఇంటికి వచ్చిన అన్నాని తల్లిదండ్రులు ధర్మతేజ, మాధవి ఆత్మీయంగా ఆహ్వానిస్తారు. తల్లిదండ్రులు ఉంటున్న ఊర్లోనే అన్నాకి ఉద్యోగం దొరికింది. ముగ్గురు కలిసి ఉంటారు. ధర్మతేజ మిత్రుడు భార్గవ ఫోన్ చేసి తన కూతురు లాస్య అమెరికా వచ్చిందని, మీ ఇంటికి వచ్చి కలుస్తుందని చెప్తాడు. ఆ అమ్మాయిని అన్నాకి చేసుకుంటే బావుంటుందన్న ఆలోచన అన్నా తల్లిదండ్రులకి వస్తుంది. ఇంతలో లాస్య వాళ్ళింటికి వస్తుంది. లోపలికి ఆహ్వానించి మాటల్లోకి దిగుతారంతా.  ఇక చదవండి.]

[dropcap]“చి[/dropcap]న్నాన్న.. పిన్నీ.. పిల్లలు అంతా బాగున్నారా లాస్యా!..” అడిగాడు దర్మతేజ.

“అంతా బాగున్నారు అంకుల్!..” చిరునవ్వుతో చెప్పింది లాస్య.

“అడ్మిషన్ ఫార్మాలిటీస్ అన్ని ముగిశాయిగా!..”

“ముగిశాయి.. క్లాసెస్ అటెండ్ చేస్తున్నాను..”

“ఓకే!.. సీ.. లాస్యా!.. ఏదో చదివాము.. పాసైనాము అంటే.. ఆ భావన సరికాదు. బాగా ఇన్వాల్వ్ అయి చదవాలి.. ప్రాక్టికల్స్ చేయాలి.. థియరీస్ వ్రాయాలి.. అటెండెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్.. సబ్జక్ట్ రీత్యా మీకు ఏ సందేహం వున్నా.. ఎనీ టైమ్.. యు కెన్ కాల్ మి.. ఓకేనా!..” చిరునవ్వుతో చెప్పాడు అన్నా.

“ఓకే..” నవ్వుతూ చెప్పింది లాస్య.

లక్ష్మి కాఫీ కప్పులతో వచ్చి నలుగురికీ అందించింది.

మౌనంగా నలుగురూ కాఫీ తాగారు.

ధర్మతేజ.. లేచి తన గది వైపుకు వెళ్లాడు. ద్వారం వరకూ నడిచి వెనుతిరిగి చూచాడు. గమనించిన మాధవి ఆ గదిలోకి వెళ్లింది.

“ఇక్కడికి వచ్చి ఎంత కాలం అయింది?..”

“టు మంత్స్…”

“మీ బాబాయి గారికి పిల్లలు..”

“ఇద్దరు కొడుకులు.. ఒక కూతురు.. ముగ్గురూ నాకన్నా చిన్నవారు.. మొదటివాడు రవి. మెరయిన్ ఇంజనీరింగ్.. రెండవ వాడు కార్తీక్.. సెకండరీ ఎడ్యుకేషన్ ఫైనలియర్.. చెల్లి వసంత.. టెన్త్ క్లాస్.. చదువుతున్నారు.” క్షణం ఆగి.. “మరి మీకు..”

“నేను ఒక్కడినే!..” చిరునవ్వుతో లాస్య పూర్తి చేయకముందే చెప్పాడు.. అన్నా..

“మీరు ఏమీ అనుకోనంటే.. నేను ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను”

“ఏ విషయంలో!..”

“మీ విషయంలో!..”

“అడగండి..”

“మీ పేరు!.. “

“అన్నా.. అని ఎందుకు మీవాళ్లు పెట్టారు?.. ఇదేగా మీ సందేహం!..”

“అవును..”

“ఆ పేరు నిర్ణయం చేసింది మా అమ్మగారు.. దానికీ ఓ కారణం వుంది..”

“అదేమిటో నేను తెలుసుకోవచ్చునా!..”

“హా..” నిట్టూర్చాడు అన్నా.

“మా అమ్మగారికి ఓ అన్నయ్య గారు వుండేవారు.. మామయ్య వయస్సు పది, అమ్మ వయ్యస్సు ఎనిమిదిగా వున్నప్పుడు మా తాతయ్యగారు గతించారట. ఆనాటి నుంచి కుటుంబ భారాన్ని మా మామయ్య అన్నారావు గారే స్వీకరించి.. ఎన్నో కష్టాలు పడి తాను పదవ తరగతితో చదువు మాని, మా అమ్మను యం.యస్సీ. వరకు చదివించి.. అమ్మ కోరిన మా నాన్నగారితో.. వున్న భూమిని అమ్మి మా అమ్మగారి వివాహం జరిపించారట. ఆ వివాహం జరిగిన ఆరు నెలల్లోనే వారు ఓ ప్రమాదంలో మరణించారట. మా అమ్మకు మామయ్యగారంటే ఎంతో ప్రాణం.. అందుకే ఆమె వారిని సదా పిలిచేలా.. నా పేరును అన్నాగా నిర్ణయించారు.. వారి అన్నగారిలాగా నేను మంచీ.. మానవత్వం.. నీతి.. నిజాయితీ.. ధర్మం.. న్యాయాలను గౌరవిస్తూ.. పాటించాలనేది మా అమ్మగారి ఆశయం..” క్షణం ఆగి.. లాస్య ముఖంలోకి సూటిగా చూస్తూ.. “మా అమ్మగారి ఆశయాన్ని నెరవేర్చడం.. నా ధర్మం.. నా తల్లిదండ్రుల సంతోషమే నా సంతోషం..” చెప్పడం ఆపి.. చిరునవ్వుతో లాస్య ముఖంలోకి చూచాడు అన్నా..

లాస్య నిట్టూర్చి రెస్టురూమ్ అడిగింది. అన్నా చూపించాడు. టీవీ ఆన్ చేసి చూడసాగాడు.

గదిలో.. ధర్మతేజా.. మాధవీలు మంచంపైన కూర్చొని వున్నారు. వారి మధ్యన లాస్య గురించిన చర్చ..

“ఎలా వుంది.. అమ్మాయి..” అడిగాడు ధర్మతేజ.

“చాలా మోడరన్‍గా వుంది..”

“రూపురేఖలు నచ్చాయా లేదా!..”

“వాటికేం తక్కువ లేదు మనకు కావలసింది మంచి మనస్తత్వమే!..”

“అది ఎలా వుంటుందో తొలి చూపులోనే ఎలా నిర్ణయించగలం?.. దానికి కొంత పరిచయం.. కలసి తిరగడం.. అభిరుచులను.. అభిప్రాయాలను గురించి తెలిసికోవడం జరగాలిగా!..”

“అవును”

“ముందు అన్నింటికన్నా ముఖ్యం.. నీ కొడుకు అభిప్రాయం..”

“వాడు మాత్రం ఇప్పుడేగా చూచాడు.. ఏం చెప్పగలడు?..”

అన్నా.. గది లోనికి వచ్చాడు..

టీవీ ఆపి.. “నాన్నా!.. నీ గురించే మాట్లాడుకొంటున్నాము” నవ్వుతూ చెప్పాడు ధర్మతేజ.

“నాన్నా!.. నా గురించా లేక ఆ లాస్య గురించా!..”

“లాస్యను గురించి మాట్లాడుకోవడమంటే.. అది నీ గురించి మాట్లాడుకుంటున్నామనేగా!..” చిరునవ్వుతో చెప్పాడు

“ప్లీజ్!.. నాన్నా.. ఆ అమ్మాయి వింటే బాగుండదు.. స్టాప్ !..”

“అన్నా!..”

“చెప్పమ్మా!..”

“ఆ అమ్మాయి ఎక్కడ?”

“రెస్టురూమ్‌కు వెళ్లిందమ్మా!..”

“నచ్చిందా!..”

“ఏమిటీ?..”

“నీకు ఆ పిల్ల నచ్చిందా?..”

“అమ్మా!.. ఇపుడు కాదు నా వివాహం.. ఓ సంవత్సరం తర్వాత.. అప్పుడు.. నీకు ఏ పిల్ల నచ్చి.. ‘రేయ్ అన్నా.. ఆ పిల్లేరా.. నా కోడలు’ అని నీవు చెబుతావో.. నేను ఆ పిల్ల మెడలో మారు మాట్లాడకుండా మూడు ముళ్లు వేసి నీ కోడలిని చేస్తాను.. సరేనా అమ్మా!..” చిరునవ్వుతో చెప్పాడు అన్నా..

“వచ్చిన ఆ పిల్లను గురించి నీ అభిప్రాయం?..” నవ్వుతూ అడిగాడు ధర్మతేజ..

“నాన్నా!.. ఇది చాలా అన్యాయమైన ప్రశ్న !.. గంట లోపల ఎలా ఎవరైనా చెప్పగలరు ?.. ఏమ్మా నేను చెప్పింది రైటేనా?..” ప్రాధేయపూర్వకంగా చూస్తూ అడిగాడు అన్నా..

“అంకుల్!..” ఆ గది ద్వారాన్ని సమీపించింది లాస్య.

“ఏంటమ్మా!..”

“నేను వచ్చిన పని అయింది. నేను వెళ్లిపోతాను. మీ అబ్బాయిగారితో పరిచయం అయిందిగా!.. నాకు అవసరం వచ్చినపుడు ఫోన్ చేసి మాట్లాడుతాను” అంది లాస్య మెల్లగా.

ధర్మతేజ భార్య మాధవి ముఖంలోకి చూచాడు.

“చూడు లాస్య!.. రేపు శ్రావణ శుక్రవారం.. ఈ రాత్రికి వుండి రేపు వెళుదువుగాని..” అంది మాధవి.

“ఏమంటారండీ!..” ధర్మతేజ ముఖంలోకి చూచింది మాధవి.

“లాస్య !.. నీవు వెళ్లేది రేపు.. మీ చిన్నాన్నగారితో నేను మాట్లాడుతాను.. రేపు తొలి శ్రావణ శుక్రవారం.. మా ఆవిడ యింటి పూజా కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహిస్తుంది. నీవు కూడా వుండి చూచి ప్రసాదాలు తీసుకొని రేపు బయలుదేరు..” అనునయంగా చెప్పాడు ధర్మతేజ.

యథార్థంగా లాస్య ఆ దంపతులకు బాగా నచ్చింది. జుట్టు, డ్రస్ ఆ దేశ పద్ధతుల ప్రకారం వేసుకొని వచ్చినా.. ఆ పిల్లకు చీరకట్టి ఓసారి చూచుకోవాలని మాధవి అభిప్రాయం. లాస్య తల్లిదండ్రులను మాధవి చూచి వుంది. వారికి మంచి స్థితిగతులు.. వూళ్లో గొప్ప పలుకుబడి.. ధర్మతేజ గారికి దూరపు బంధువులు.. కులగోత్రాలు ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఆ కారణంగా ఆ పిల్లను ఒకరోజు తమ ఇంట్లో వుంచుకొని.. పిల్ల మనస్తత్వాన్ని.. పద్ధతులను గమనించాలని మాధవిగారి వుద్దేశం..

ఆ విషయాన్ని గురించి భార్యా భర్తల మధ్యన చర్చ జరిగింది.

“చెప్పమ్మా !.. మా ప్రపోజల్ నీకు సమ్మతమేనా?..” అడిగాడు ధర్మతేజ..

లాస్య.. అయోమయంగా అన్నా ముఖంలోకి చూచింది.

“అమ్మకు ఈరోజు మీరు వెళ్లడం ఇష్టం లేదు. వుండిపొండి.. ప్లీజ్!..”

చిరునవ్వుతో చెప్పాడు అన్నా.

“లాస్యా!.. ఈరోజు నీవు మాతో కలసి వుంటున్నావు..” తన నిర్ణయాన్ని చెప్పింది మాధవి చిరునవ్వుతో..

“అమ్మా!.. లాస్యా!.. ఇక నీవు మాట్లాడేదానికి లేదు.. మాతో వుంటున్నావు.. నేను మీ బాబాయి గారికి ఫోన్ చేసి నీవు రేపు వస్తున్నట్లుగా చెబుతాను. మేమూ నీకు కావాల్సిన వాళ్లమే.. ఆనందంగా మాతో కలసి ఈ రోజు గడుపు..” నవ్వుతూ చెప్పాడు ధర్మతేజ.

“మీరు వారికి ఫోన్ చేసి చెప్పండి..” అంది మాధవి.

“అంకుల్..” ఏదో చెప్పబోయింది.. లాస్య.

“ఇక మీరు మా అమ్మ మాటను మీరలేరు!..” చిరునవ్వుతో చెప్పాడు అన్నా.

“ఓకే!.. వుంటాను..” సాలోచనగా చెప్పింది లాస్య.. వచ్చి సోఫాలో కూర్చుంది.

ధర్మతేజ.. ఫోన్ చేసి లాస్య ప్రోగ్రామ్ గురించి సుధీర్ గారికి చెప్పాడు. వారు ఆనందంగా ‘ఓకే’ అన్నారు. కారణం.. ఆ అన్నదమ్ములు భార్గవా.. సుధీర్ల నిర్ణయం.. ధర్మతేజ దంపతులు అంగీకరిస్తే.. లాస్య అన్నాల వివాహం జరపాలని… మాధవి లాస్యను.. సమీపించి ఆమె కుడిచేతిని తన చేతిలోనికి తీసుకొని..

“నాతో రా!..” అంది.

ఇరువురూ ఎదురుగా వున్న గదిలోకి వెళ్లారు.

అక్కడ ‘ఉషా’ కుట్టు మిషన్ ఓ మూల వుంది. టేప్‍తో.. మాధవి లాస్యకు జాకెట్ కొలతలను తీసుకొని నోట్ చేసుకుంది.

“అంటీ.. ఏంటిది..” ఆశ్యర్యంతో అడిగింది లాస్య..

“నీకు జాకెట్ కుడతాను.. రేపు నీవు చీర కట్టుకోవాలి.. చాలా మంచిరోజు..”

“చీర నేను ఇంతవరకు ఎపుడూ కట్టుకోలేదు ఆంటీ!..”

“ఓకే.. నో ప్రాబ్లమ్.. నేనున్నాగా!.. ఐ విల్ డ్రస్ అప్ యు..” చిరునవ్వుతో చెప్పింది మాధవి.

క్షణం తర్వాత.. “చీరా రవిక.. మన సంప్రదాయ దుస్తులు. ఏ జాతివారు ఎక్కడికి వెళ్లినా.. వారి ఆచార వ్యవహారాలను పాటించాలి.. నీకు ఈ విషయం తెలుసో తెలీదో.. మనం చక్కగా చీర జాకెట్‍తో బజారుకు వెళ్లితే ఈ తెల్ల దొరసాన్లు మనలను వింతగా చూస్తారు. కొందరు మనల్ని చూచి ఇంతకుముందే పరిచయం వున్నట్టుగా నవ్వుతారు.. మన కట్టూ బొట్టూ అంటే.. వీరిలో కొందరికి చాలా ఇష్టం. యు నో అయామ్ కండక్టింగ్ ఎ స్కూల్ ఆఫ్ ఇండియన్ కల్చర్.. క్లాసెస్ ఆర్ ఒన్లీ వీకెండ్స్.. సాటర్ అండ్ సన్డే.. టు షిఫ్ట్స్.. రెండు వందలమంది వస్తారు. నాకు సాయంగా మనవాళ్లే హవుస్ వైవ్స్ రాగిణి.. గీతిక.. నాతో కలసి పనిచేస్తున్నారు. నేను ఈ స్కూల్ ఎందుకు రన్ చేస్తున్నానో తెలుసా.. ఈ దేశంలో పుట్టిన మన కుటుంబాల పిల్లలు.. మన ఆచారవ్యవహారాలను.. ప్రార్థనా విధానాలను.. సంస్కృతిని.. చరిత్రను తెలుసుకోవాలనే సంకల్పంతో చేస్తున్నాను. నేను చేసే పనితో నాకు ఆనందం.. ఆత్మకు సంతృప్తి వుంది. నా జీవిత విధానం.. నీకు నచ్చిందా లాస్యా!..” ప్రీతిగా అడిగింది మాధవి.

“యస్.. ఆంటీ!.. యు ఆర్ రియల్లీ గ్రేట్ అంటీ..” అంది లాస్య. మాధవి చెప్పిన మాటలను గురించి ఆలోచించసాగింది. లక్ష్మి.. భోజనానికి అన్ని డైనింగు టేబుల్ మీద సిద్ధంచేసి వచ్చి మాధవికి చెప్పింది.

నలుగురూ.. సరదాగా కబుర్లతో కలసి భోజనం చేశారు.. లేచిన తర్వాత లాస్యకు పై అంతస్తులో మరో రూమ్ తలుపు తెరచి “ఈ రూమ్ నీది.. విశ్రాంతి తీసుకో. లక్ష్మి ఫోర్ థర్టీకి కాఫీ ఇస్తుంది..” నవ్వుతూ చెప్పి మాధవి క్రిందకు వెళ్లిపోయింది.

లాస్య మంచంపై వాలిపోయింది.

లక్ష్మి వచ్చి ఓ జోడి చుడీదార్ మంచంపై వుంచి..

“చిన్నమ్మగోరూ!.. డ్రస్ మార్చుకోండి.. అమ్మగారు ఇచ్చిరమ్మన్నారు..”

“సరే!..” అంది లాస్య.. లక్ష్మి క్రిందకు వెళ్లిపోయింది.

***

అన్నా తన గదిలో కూర్చొని కంప్యూటర్లో ఏదో.. ఎవరికో.. మెసేజ్ చేస్తున్నాడు.

మాధవి గదిలో ప్రవేశించింది.

“అన్నా!..”

“అమ్మా!..”

“ఆ పిల్ల నాకూ.. మీ నాన్నగారికి బాగా నచ్చిందిరా!..”

“అమ్మా !.. మేరేజెస్ ఆర్ మేడ్ ఇన్ది హెవెన్.. పైవాడి నిర్ణయం ఎలా వుందో !.. అయినా ఆ అమ్మాయి యిక్కడికి చదువుకొనేదానికి వచ్చింది. ఆ చదువు యం.యస్. పూర్తి కావాలిగా!.. అంటే రెండు సంవత్సరాలు.. మనం ఆ అమ్మాయిని బాగా స్టడీ చేయవచ్చు.. తన ఆకారం నీకు నాన్నకు నచ్చి వుండవచ్చు.. ఆశయాలు.. మనస్సు ఎలాంటిదో తెలిసికోవాలంటే కొంత సమయం అవసరం కదమ్మా!.. లెట్ మీ సీ.. ఏనాటికైనా నా వివాహం.. మీకు నచ్చి.. మీరు మెచ్చిన అమ్మాయితోనే జరుగబోతోంది. నాకు తల్లిదండ్రులుగా మీరు ఎంతో చేశారు. నేను.. మీ కొడుకుగా.. నా వివాహ విషయంలో.. మీ కోర్కెను తీర్చడం నా బాధ్యత.. నా వయస్సులోని వాళ్లు బాహ్య సౌందర్యాన్ని చూస్తారు. అది తనకు నాకు పరిమితం. కాని తల్లిదండ్రులైన మీరు.. ఆ కుటుంబాల పేరు ప్రఖ్యాతులను.. వ్యక్తుల తత్వాలను.. విచారించి వారు మనకు తగిన వారా కాదా అని ఆలోచించి మీ నిర్ణయాన్ని పిల్లలమైన మాకు తెలియచేస్తారు. అలాంటి మీ నిర్ణయం నాకు సమ్మతం అమ్మా!..” అనునయంగా చిరునవ్వుతో చెప్పాడు అన్నా..

అతని మృదుమధురమైన మాటలకు తల్లిదండ్రులపైన.. అతనికి వున్న గౌరవాభిమానాలకు.. ఆ తల్లి మనస్సు పులకించింది. అన్నా తలను తన హృదయానికి హత్తుకొంది.. నొసటన ముద్దు పెట్టుకొంది. “సర్వేశ్వరుడు నిన్ను సదా రక్షించుగాక నాన్నా!..” హృదయపూర్వకంగా దీవించింది.

ఆ తల్లీ కొడుకుల సంభాషణ ప్రారంభంలోనే అక్కడికి వచ్చిన ధర్మతేజ కుమారుని తత్వానికి.. అతను తన తల్లితో చెప్పిన మాటలను విని ఎంతో సంతోషంతో అర్థాంగి మాధవి ముఖంలోకి చూచాడు. అన్నా భుజంపై ఆదరంగా చేయి వేశాడు. “గ్లాడ్ బ్లెస్ యు మై సన్.. నో ఫెయిల్యూర్ ఇన్ యువర్ లైఫ్.. వన్ డే లాట్ ఆఫ్ ప్యూపిల్ బిహైండ్ యు.. మైడియర్ !..” తన కుడిచేతిని అన్నా శిరస్సుపై వుంచి మనసారా దీవించాడు ఆ తండ్రి.

“ఏమండీ!..”

“ఆ పిల్ల నిద్రపోతూ వున్నట్లుగా వుంది. లేచిన తర్వాత మనతో తీసుకెళ్లి ఓ చీర కొనుక్కొని వద్దామా !..”

“నీ దగ్గర కొత్తవి చాలా వున్నాయిగా మధూ!..” అన్నాడు ధర్మతేజ.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here