డా. గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి గారికి నివాళి

2
10

[dropcap]ఒ[/dropcap]క్క పిలుపు లేదు అన్నయ్య నుంచి..

అవును.. ఒక్క పిలుపు లేదు అన్న దగ్గరి నుంచి.. తమ్ముడూ అని ఒక్క పిలుపు వినిపిస్తే చాలు.. రెక్కలు కట్టుకొని పోయి కాపాడుకొనేవాణ్ణేమో.. 2008లో మా అన్నయ్య శ్రీనివాస్ నన్నెలా ఒంటరి చేసి వెళ్లిపోయాడో.. ఇప్పుడు పదిహేనేండ్ల తరువాత నాకు సరస్వతి అందించిన అన్నయ్య గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి కూడా సరిగా అదే సమయానికి.. అదే విధంగా అర్ధంతరంగా ఏదో హడావుడి పని ఉన్నట్టు వెళ్లిపోయాడు. కనీసం దవాఖానకు తీసుకొని వెళ్లేంత సమయం కూడా ఇవ్వలేదు. యూనివర్సిటీకి వెళ్లడానికి తయారవుతున్న సమయంలో ఒక్కసారిగా గుండె దారుణంగా దెబ్బ కొట్టింది. “బాబాయ్ సీపీఆర్ కూడా చేశాను.. కోలుకున్నట్టే అనిపించి అంతలోనే కుప్పకూలిపోయారు” అని కొడుకు గౌతమ్ చెప్తుంటే.. ఏమని ఓదార్చాలి.. “బాబాయ్ పొద్దున చక్కగా మాట్లాడుతూనే ఉన్నారు నాన్న” అని అమ్మాయి భోరున విలపిస్తుంటే ఆ ఆర్తిని తీర్చేదెలా? నా కంటి నుంచి చుక్క నీరు రావడం లేదు. మెదడు మొద్దుబారిపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఏం మాట్లాడగలను? నన్ను నేనే నమ్మలేకపోతున్నా. హృదయం మోయలేనంత భారమైపోయింది. చుట్టూ చూస్తుంటే ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. కొన్ని తరాల విద్యార్థులు తమ మాష్టారును చూడటానికి ఒక్కుదుటన ఉరికురికి వస్తున్న విద్యార్థులు. చైతన్యరహితమై శాశ్వత నిద్రలోకి జారుకొన్న తమ గురువును చూసి విలపించని విద్యార్థి హృదయం లేదు.

ఇంకెంతో సాహిత్య సేవ చేయాల్సిన గొప్ప రచయితను అంత తొందరగా పోగొట్టుకొన్న సాహిత్య లోకం మూగరోదనైనా అన్నకు వినిపించలేదేమో.. అందరికీ విస్మయమే. బాల శ్రీనివాసమూర్తి వెళ్లిపోవడమేమిటి? ఎవరూ నమ్మడం లేదు. ఇంటికి చేరుకొని అక్కడ పార్థివ దేహాన్ని చూసిన తరువాత కూడా మనసు నమ్మలేని స్థితి. సాహిత్యానికి ఆయన చేసిన సేవలను ప్రశంసించిన వారంతా.. ఆయన ఇంకా చేయాల్సిన పని గురించే చర్చించుకొంటుంటే.. తన ముందు ఇంత పని పెట్టుకొని ఎలా వెళ్లిపోయాడా అని గుండె విలవిల్లాడిపోయింది. నిజంగా అప్పుడే వెళ్లిపోవాల్సిన వయసు కూడా కాదు ఆయనది. సరిగ్గా 57 సంవత్సరాలు మాత్రమే. ఇంకా రిటైర్ కూడా కాలేదు. ప్రొఫెసర్ కావాలని అనుకొన్నాడు. కానీ అది వచ్చేలోగానే.. వెళ్లిపోయాడు. అయినా ఆయన ప్రొఫెసర్ అయితే.. ఆ పదవికి అలంకారం కానీ, ఆయనకు కొత్తగా వచ్చేదేమున్నది?

గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి.. బహుశా సాహిత్య లోకంలో నేనెరిగినంతగా ఆయన్ను ఇంకెవరూ అంత లోతుగా ఎరిగిన వారు లేరేమో.. అష్టావధాని గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ గారి సుపుత్రుడు. ఆయన వారసత్వాన్ని విజయవంతంగా అందిపుచ్చుకొని.. సాహిత్య రంగంలో తనదైన ముద్రను శాశ్వతంగా వేసిన వాడు గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి. నేనెప్పుడూ ఆయన్ను అన్నయ్యా అని పిలవటమే తప్ప.. నన్ను ఆయన తమ్ముడూ అని పిలవటమే.. నా వాట్సాప్ మెసేజీల్లో తమ్ముడూ అని పెట్టిన మెసేజీలు ఎన్నెన్ని ఉన్నాయో లెక్కే లేదు. మార్చి నెలాఖరులో రవీంద్ర భారతిలో జరిగిన రామం భజే శ్యామలం (నా రచన) ఆవిష్కారానికి వచ్చి పుస్తకం తీసుకొని వెళ్లటమే చివరిసారి చూడటం. తరువాత ఫోన్ చేసి తమ్ముడూ ఇంగ్లిష్ కోట్ లను తెలుగులోకి అనువదించి పెడితే అందరికీ సౌకర్యంగా ఉంటుందని సూచించాడు. ఒక విధంగా చెప్పాలంటే.. నా రచనా ప్రస్థానంలో ఆయన లేని పేజీ దాదాపుగా లేనే లేదు. ఆయన కూర్పు చేసిన ప్రతి సంకలనంలో నాచేత వ్యాసాలు రాయించాడు. నా మేరకు నేను రాసిన అనేకానేక రచనలకు ఎలా రాయాలో మార్గదర్శనం కూడా చేశాడు. తాను అన్నీ తెలిసి రాసినా.. తమ్ముడూ ఇది రాస్తున్నా.. ఇది చేస్తున్నా.. అని చెప్పకుండా లేని సందర్భం ఒక్కటి కూడా కనిపించదు. ఆయన జీవితంలో ఎత్తు పల్లాలన్నింటికీ నేను సాక్షీభూతుడిని. ఎంత కష్టపడ్డాడో.. అందరినీ గుడ్డిగా నమ్మినవాడు.. మోసం చేస్తే అంతే గుడ్డిగా ద్వేషించినవాడు. ఒక విధంగా చెప్పాలంటే.. అమాయకుడు, సౌమ్యుడు, దాపరికం లేకుండా మాట్లాడేవాడు బాల శ్రీనివాసమూర్తి.

ఆయన తెలుగు పత్రికల మీద పీహెచ్డీ పరిశోధన చేస్తున్న కాలం నుంచే నాకు పరిచయం. నాన్నగారి (కోవెల సుప్రసన్నాచార్య) దగ్గరకు వచ్చి ఆయన మార్గదర్శకత్వంలో ఎన్నెన్నో చర్చలు జరుపుతున్నప్పుడు తమ్ముడిగా గమనించిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. నేను హైదరాబాద్‌కు వచ్చి స్వతంత్రంగా సెటిలవుతున్న క్రమంలో అన్న ఇంటి దగ్గరే ఉన్నా. ఇక ఆంధ్రభూమిలో నేను చేరిన తరువాత మా ఇద్దరి సాన్నిహిత్యం విడదీయరాని ముడి పడింది. మారిపోయింది. అప్పుడు ఆయన సికింద్రాబాద్ ఎస్పీ కాలేజీలో పనిచేసేవాడు. ఆర్థికంగా చాలా కష్టాలు పడుతున్న కాలమది. ఆ సమయంలోనే ఆయన విజేత, ఇతర పోటీ పుస్తక ప్రచురణ సంస్థలకు రిఫరెన్స్ గ్రంథాల రచన ప్రారంభించాడు. అప్పట్నుంచే ప్రభుత్వ ఉద్యోగం కోసం తీవ్రమైన పరిశ్రమ చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం అన్నది ఆయనకు ఆరోజు అత్యంత అవసరమైన పరిస్థితి. కానీ.. ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా వస్తాయో.. ఎన్ని మాయలుంటాయో తెలియదు. చాలా రోజుల పాటు దురదృష్టం ఆయన్ను వెంటాడుతూ వచ్చింది. వరంగల్‌లో ఒక కాలేజీలో బాల శ్రీనివాసమూర్తి కంటే తక్కువ అర్హత ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఇచ్చి.. తనకు రాకుండా చేసినప్పుడు ఎంత బాధపడ్డాడో నాకు మాత్రమే తెలుసు. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో ఇంటర్వ్యూలు జరిగినప్పుడు కూడా ముందే ఎవరికి ఉద్యోగం ఇవ్వాలో నిర్ణయించేసుకొని తూతూ మంత్రంగా ఇంటర్వ్యూలు నిర్వహించడం కూడా దారుణమైన ఘటన. అయినా ఆయన ఏరోజూ అస్త్ర సన్యాసం చేయలేదు. ఏ ఒక్క రోజు కూడా రాయకుండా లేడు. అంతేకాదు.. ఆయన రాయని సబ్జెక్టు కూడా లేదు. ఒక పక్క ఎస్పీ కాలేజీలో పాఠాలు చెప్పటం.. మరో పక్క పోటీ పరీక్షలకు రిఫరెన్స్ గ్రంథాలు రాయడం.. ఇంకో పక్క ఆంధ్రభూమిలో క్రమం తప్పకుండా కాలమ్ రాయడం.. ఇది రెండు దశాబ్దాల కిందటి విషయాలు. ఎడిట్ పేజీకి ప్రతిరోజూ ఒక పేజీ వ్యాసం.. సమకాలీన రాజకీయాలపై రాసేవాడు. అప్పట్లో నెల రోజులు కాగానే ఆంధ్రభూమి సంపాదకుల వారు పేపర్లన్నీ ముందేసుకొని.. ప్రతి వ్యాసంపైనా.. పారితోషికం ఎంత ఇవ్వాలో రాసి తన పీఏకు పంపించేవారు. శీనన్న తాను వ్యాసం రాయగానే.. తమ్ముడూ.. దీనికి ఓ వంద పడుతుందంటవా అని అడిగేవాడు. ఏమైతేనేం నెలకు ఓ మూడువేలు గిట్టుబాటు అయ్యేది. అదీ ఆనాటి పరిస్థితి. అప్పుడే నేను నారపల్లిలో ఇల్లు కట్టుకొన్నాను. అదే సమయంలో తానూ ఇల్లు కొనుక్కోవాలని తపన పడ్డాడు. అప్పడు ఆయనది ప్రభుత్వ ఉద్యోగం కాదు. పేస్లిప్ కూడా ఉన్నట్టు గుర్తు లేదు. పీఎఫ్ అన్నది లేనే లేదు. సుందరం హోం ఫైనాన్స్‌లో మేనేజర్ శ్రీనివాస్ గారు ఉదారంగా వ్యవహరించడంతో పత్రాల ప్రమేయం లేకుండానే హోం లోన్ వచ్చింది. దానితో బోయినపల్లి అవతల సుచిత్ర దగ్గర ఆరు లక్షల రూపాయలతో అన్న ఇల్లు కొన్నాడు (అదే ఇంటిని ఇప్పుడు పునర్నిర్మించారు).

ఆ తరువాత ఆయన క్రమంగా సద్గురు శివానందమూర్తి గారి శిష్యుడయ్యారు. శివానందమూర్తి గారే..  శ్రీనివాసమూర్తి చేత మన తెలంగాణం.. తెలుగు మాగాణం అన్న గ్రంథాన్ని రాయించారు. తెలంగాణ సాహిత్యంపై మొట్టమొదటి సమగ్రమైన రచనగా చెప్పవచ్చు. ఆ తరువాత తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం రావడంతో అన్న ఆర్థిక సమస్యలు ఒక్కటొక్కటిగా తీరుతూ వచ్చాయి. దీంతో అన్న తన రచనలు, సంపాదకత్వ రంగాల్లో విజృంభించాడు. తెలంగాణ ప్రాంతంలోని అనేక మంది లబ్ధ ప్రతిష్ఠుల ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణను ఆవిష్కరింపజేస్తూ.. ‘ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ’ అన్న గ్రంథాన్ని రచించాడు శీనన్న.. ఆ ఒక్క రచన చాలు శీనన్న కీర్తిని శాశ్వతం చేయడానికి. నేను ఆయనతోనే అన్నాను. అన్నా ఇక నువ్వు ఏమీ రాయకపోయినా చాలు.. నిన్ను ఈ ఒక్క పుస్తకం తెలుగు సాహిత్యంలో నిలబెడుతుందని. ఈ గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం వచన రచనలో సాహిత్య పురస్కారాన్ని అందించింది. సిద్దిపేట గురించి మా ప్రసిద్దిపేట అన్న రచన చేశాడు. తెలుగు పత్రికారంగంపై ఆయన చేసిన పరిశోధన అత్యద్భుతమైనది. ఎప్పటికీ నిలిచేది. పీవీ నరసింహరావు బయోగ్రఫీ కూడా ఆయన ఈ మధ్యనే పూర్తిచేసి ఆవిష్కరింపజేశాడు. అంతకుముందు తన విమర్శ వ్యాసాల సంకలనాలను రెండింటిని తీసుకొని వచ్చాడు. ఇక సంకలనాల సంపాదకత్వంలో ఆయనకు సాటి అయినవారు లేరనే చెప్పాలి. తెలుగు సాహిత్య రంగంలో లబ్ధ ప్రతిష్ఠులైన వారిపై వెయ్యి పేజీలకు పైగా ఒక సమగ్రమైన గ్రంథాన్ని వెలువరించడంలో ఆయన ఎంతో కృషి చేశారు. అందులో శ్రీశ్రీపై నేను రాసిన వ్యాసం కూడా చోటు చేసుకొన్నది. ఆ తరువాత తెలంగాణ వైతాళికులు  అనే సంకలనం మరో అద్భుతమైన ప్రయత్నం. తెలంగాణ సాహిత్య అకాడమీ వారు ఇటీవల ప్రచురించిన తెలంగాణ సాహిత్య చరిత్ర గ్రంథానికి సంపాదకత్వం వహించింది కూడా బాల శ్రీనివాసమూర్తి అన్నే. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నెన్ని రచనలు చేశాడో చాంతాడంత జాబితా అవుతుంది. వ్యాసాలనైతే గణించడమే కష్టం. ఇప్పడు మాజీ ప్రధాని వాజపేయి బయోగ్రఫీ రాస్తున్నాడు. సగం పూర్తయింది కూడా. ఇంకా చాలా చాలా ప్రాజెక్టులు ముందు పెట్టుకొన్నాడు. విద్యార్థులను బిడ్డల్లాగా చూసుకొన్నాడు. బిడ్డా అనే సంబోధించేవాడు. ఎలాంటి వ్యాసాన్నయినా.. అత్యంత వేగంగా.. అతి సమర్థంగా రాయగల రచయిత. అలాంటి అన్నయ్య ఇవాళ లేకపోవడం నాకు వ్యక్తిగతంగా ఆఘాతం. తెలుగు సరస్వతికి తీరని నష్టం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here