డ్రస్సిరో

0
7

[dropcap]కో[/dropcap]డె జింకలు రెండు –
కోడె తనువుల పొంగులో వున్నాయి.
పోట్లాడుకుంటున్నాయి.
పోట్లాటనో, కాక ఆటనో
తమకెవ్వడు కపతి లేడు అనుకున్నాయి
కానీ,
కాలం మాటేసింది.
రానే వచ్చింది చిరుత
కరువనున్న పాము నెరి దాగి కొనినట్లు
పరుగందుకున్నాయి జింకలు – చెరో వేపు
ఎవని కెట్టులగునో ఎవ్వడెరుంగును?
ముందు బ్రతుకే వుండదు
చిరుత వెన్నంటింది ఒక్క కోడె జింకను.

జింక ముందు, చిరుత వెనుక
ఒకటి రక్షించుకోడానికి, ఒకటి భక్షించడానికి
స్పీడు – ‘నైంటీ సిక్స్ కేయంపీహెచ్’
కోడె జింక సాగుతోంది
తిన్నగా కాదు – పాములా వంకర్లు తిరుగుతూ
గాలిలో కెగుస్తూ, భూమిని అంటీ అంటనట్లుగా ఎగుస్తూ
జింక చిక్కనే చిక్కింది చిరుతకు.
జింక జీవనాళాలు చిరుత కోరల బిగువున
ఇన్నినాళ్ళ ఈ జీవం నిన్ను చేరుకుందిలే…
క్షణములోన బ్రతుకు సంసార విభ్రాంతి
నీటిపైన గుండు నిల్చునా మునగక?

జింక గొంతు చిరుత కోరలతో పెనుగులాడింది
కోడె జింక తన జీవనాళాల్ని చిరుత కోరల బిగువుల్నించి – వూడ బెరుక్కుంది!
తిరిగి పరుగందుకుంటే?
ఊహూఁ. భూమి గుండ్రంగానే వుంది… ఎంత తిరిగినా తిరిగి అక్కడికే!
ఆకసంబు శూన్యమందు శబ్దము పుట్టె!
వాదులు జేసి గురుని వెన్నంటి జూడూ
కూలబడిన నరుడు కుదురుట అరుదయా
తా తెగించువాడే దండియౌ భువిలోన
కత్తిని విసిరేవానిని ఆ కత్తితోనే గెలవాలని…

ఇప్పుడు
జింక పరుగందుకోలేదు!
జింక నిలిచిపోయింది – చిరుతపులికి ఎదురుగా!
చిరుతను ఎదిరించి నిల్చుంది!
తన పిడికిళ్ళలో యిమిడి వున్న రెండు పిడిబాకుల్ని –
చిరుత డొక్కలోకి దించింది!
బాకుల్ని దించిన జింక చిరుతను గాల్లోకి ఎత్తింది! –
భీముడు జీమూతుడ్ని ఎత్తినట్లు.
గాలిలోకి ఎత్తి నేల మీదికి ఎత్తివేసింది
దించిన పిడిబాకుల్ని వెనక్కు లాక్కుంది
బాకుల్ని మరొక్కమారు చిరుత డొక్కలోకి దించింది.
కుమ్ముతూ చిరుతను అల్లంత దూరం తోసుకెళ్ళింది –
బుల్డోజరు మట్టిదిబ్బను తీసుకెళ్ళినట్లుగా
జింక బాకుల్ని లాక్కుంది
ఇప్పుడు పరుగందుకుంది జింక

చిరుత –
నెత్తురోడుతూన్న డొక్కల చిరుత
నేలమీంచి లేచింది.
లేవలేక లేవలేక లేచింది
ఒంటికంటిన దుబ్బను దులుపుకుంది
వేయలేక వేయలేక అడుగువేసింది
నాలుగడుగులే వేసింది
నేలమీది కొరిగింది
ఒరిగిపోయిన చిరుత యింక లేవనే లేదు – శాశ్వతంగా లేవనే లేదు!
జింకను వేయడం తన జన్మహక్కని తలచిన చిరుత-
ఆ భోజ్యం చేతుల్లోనే తన అసువుల్ని బాసింది!
ఎప్పుడూ ఆకుల్ని మేసే పురుగులే కాదు,
అప్పుడప్పుడూ పురుగుల్ని మేసే ‘డ్రస్సిరో’లు కూడా వుంటాయి!
(‘డ్రస్సిరో’ ఒక అడవి మొక్క)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here