దృక్కోణం

23
9

[dropcap]ఆ[/dropcap] రోజు 29వ తారీఖు. అక్టోబర్ ఐదవ శనివారం. ముందు రోజు సెలవు తాలూకు బద్ధకం ఇంకా పోలేదు కాబోలు సూర్య కాస్త ఆలస్యంగా రెడీ అయ్యాడు ఆఫీసుకి. మాములుగా టిఫిన్ తొమ్మిదింటికే రెడీ చేస్తుంది శ్రీమతి. ఆరోజు రెడీ అయ్యేప్పటికే తొమ్మిదింపావు. ఇంకా టిఫిన్ రెడీ కాలేదు. బాగా చికాకు, టెన్షన్ పడిపోతున్నాడు సూర్య. వాటర్ బాటిల్ నింపుకుని, జేబులో పర్సు పెట్టుకుంటూ గోడ గడియారం వైపు చూస్తూనే ఉన్నాడు.

ఇక తట్టుకోలేక అరిచేసాడు “ఇంకెంత సేపు.. టిఫిన్ ఇంకా పెట్టలేదు?” అని.

“ఇదిగో తెస్తున్నానండీ శనివారం కదా ట్రాఫిక్ జాం బానే ఉంటుందని, ఈజీగా తినగలిగే మెత్తని ఇడ్లీ చేశాను.. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయ్.. తింటుండండి.. కారియర్ సర్దేస్తాను..” అంటూ భార్య వంటింట్లోకి పరిగెత్తింది.

ట్రాఫిక్ జామ్‌కీ ఇడ్లీకి లంకె ఏంటో అర్థం అయ్యేలోపు ఆరు ఇడ్లీలు కడుపు లోకి జారుకున్నాయి. మామూలుగా తొమ్మిదీ ముప్పై ఐదుకి కారు తీసే తాను ఆ రోజు తొమ్మిది నలభైకి కారు స్టార్ట్ చేసి రోడ్డు మీదకి చేరుకున్నాడు. రెడ్ ఎఫ్.ఎం.లో ఆర్.జె. సూర్య వ్యాఖ్యానంలో తనకిష్టమైన ‘ఆమనీ పాడవే హాయిగా’ పాట వస్తోంది. కానీ ఆమని బరువుగా పాడుతున్నట్లుంది. లక్డీ కా పూల్ నుండీ సెక్రటేరియట్ దగ్గరుండే తన ఆఫీసుకు వెళ్ళడానికే పావు గంట పైన పట్టేటట్లుంది.

***

ఆ రోజు శనివారం. మామూలుగా ఆరింటికి అలారం పెట్టుకుని లేచే ఆమని, పని పిల్ల రానని పొద్దున్నే అయిదున్నరకె ఫోన్ చెయ్యడంతో నిద్ర మబ్బు వదిలి లేచి కూర్చుంది. గబగబా పిల్లలని రెడీ చేసి వాళ్లకి లంచ్ బాక్స్ ఇఛ్చి ఎనిమిదింటికి వాళ్ళని స్కూల్ వాన్ ఎక్కించి వచ్చి కాఫీ కలుపుకుందామని వంటింట్లోకి వెళ్ళింది. భర్త తనకి ఈ రోజు కాఫీ వద్దు, ఏకంగా టిఫిన్ చేస్తా.. బాగా లేట్ అవుతుందనగానే, మళ్ళీ తానొక్కర్తీకి కాఫీ ఏం కలుపు కుంటా లెమ్మని భర్తకి ఇష్టమైన బెండకాయ వేపుడు తయారీలో నిమగ్నమైంది ఆమని. భర్త పూజాదికాలు ముగించుకుని తొమ్మిదింటికి వస్తారని అంతకు లోగానే కారియర్ సర్దేయాలని ఎంతనుకున్నా.. పొద్దున్నే అరగంట ముందుగానే లేవడం, కాఫీ కూడా తాగకుండా పని చేస్తుండడం వల్ల శరీరం కాస్త బద్ధకించి తొమ్మిదింపావుకి గానీ అవలేదు.. ఆమనికి. భర్తని ఆఫీసుకు పంపించి కాఫీ తాగుతూ ఇంటి పని ఎలా పూర్తి చేసుకోవాలో ప్లాన్ వేసుకుంది ఆమని. పనమ్మాయి చీపురు బాగా లేదని రోజూ చెపుతుంటే పట్టించుకోలేదు.. ఇప్పుడు అదే చీపురుతో తాను పని పూర్తి చెయ్యాల్సి వస్తోంది. పనమ్మాయి అడిగినట్లు కొత్త చీపురు కొని తెద్దామంటే వాళ్ళాయన ఒక్క రూపాయి ఎక్కువగా ఇస్తేగా నెల ఖర్చులకి మించి. ఈ మగాళ్లే ఇంత అని సర్దుకుపోవడం తప్పించి తనకి వేరే మార్గం లేకుండా పోయింది.

***

సుబ్బారావు ఆఫీసులో పర్మిషన్ తీసుకుని బ్యాంకుకి బయల్దేరాడు. ఎప్పుడూ అమ్మ పెన్షన్ డబ్బుల్ని సొంతానికి వాడుకున్నది లేదు. భార్యకి జీతం కూడా ఇంకా ఇవ్వలేదు. అమ్మాయికి కాలేజీ ఫీజు కట్టడానికి లోన్‌కి అప్లై చేసాడు. అది బాగా ఆలస్యం అయ్యేలా ఉంది. గడువు ఆ రోజే ముగుస్తుంది. అమ్మాయికి నోటీసు ఇచ్చి పంపారు త్వరగా ఫీజు క్లియర్ చేసెయ్యమని. చేసేదేం లేక అమ్మని అడిగి పెన్షన్ విత్‌డ్రావల్ ఫారంలో అమ్మ సంతకం తీసుకుని బ్యాంకుకు వెళ్ళాడు. బ్యాంకులో కాష్ కౌంటర్ ముందు వెళ్ళేటప్పటికే పెద్ద క్యూ ఉంది. శనివారం కదా ఇది మామూలే అనుకున్నాడు. తన వంతు వచ్చే దాకా వాచీ వైపు ఓ వంద సార్లు చూసుకుని ఉంటాడు. తీరా తన ముందు ఉన్నతను చెప్తే గాని తెలీలేదు నెట్వర్క్ డౌన్ అయ్యిందని. ముందున్నతను ఇప్పుడే వస్తా అంటూ పక్కకి వెళ్ళాడు. సుబ్బారావు హమ్మయ్య అనుకుంటూ కౌంటర్‌లో చెయ్యి పెట్టాడు. క్యాషియర్ వాట్సాప్ చూస్తూ ఏదో చాట్ చేస్తున్నాడు.

సుబ్బారావు ఉండబట్ట లేక అడిగేశాడు.. “అయ్యా కాస్త ఆ నెట్వర్క్ సంగతి చూడొచ్చుగా ఇంతమంది ఇబ్బంది పడుతుంటే అంత తీరిగ్గా ఎలా ఉండగలుగుతున్నారు?” అని.

“నేనేం చెయ్యగలను కంప్యూటర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు అదే పనిలో ఉన్నారు” అన్నాడు క్యాషియర్. ‘ఈ గవర్నమెంటు బ్యాంకులు ఎప్పుడు బాగుపడతాయో?.. ఇలాంటి వాళ్ళు ఉంటే.. ఇంకేం బాగు పడతాయి!’ అనుకుంటుండగానే “విత్‌డ్రావల్ ఫారం ఇవ్వండి.. నెట్వర్క్ వచ్చింది” అన్నాడు క్యాషియర్. హమ్మయ్య అనుకుని ఇవ్వబోతుండగా తన ముందున్నతను వచ్చాడు.. “థాంక్ యు సార్.. నెట్వర్క్ వచ్చిందటగా!?” అనుకుంటూ మధ్యలో దూరాడు. అప్పుడనిపించింది సుబ్బారావుకి ఆ రోజు తాను చూసిన దినఫలాలు కరెక్ట్ అని.

***

సావిత్రమ్మకి డెబ్భై నాలుగేళ్లు. పిల్లలంతా స్థిరపడిపోయారు. తాను పెద్ద కొడుకు దగ్గర హైద్రాబాదులో ఉంటుంది. ఈ వయసులో ఎవరో ఒకరు ఆసరా ఉంటే బావుంటుందని కొడుకు దగ్గర ఉంటుంది గానీ తనకి భర్త పెన్షన్ సరిపడా వస్తుంది. తాను ఎవ్వరి మీదా ఆధారపడాల్సిన స్థితిలో నైతే లేదు. కానీ తన పెన్షన్ తనకు నచ్చిన విధంగా ఖర్చు పెట్టుకోవాలని, ఏవో ఆధ్యాత్మిక పుస్తకాలు కొనుక్కుని చదవాలని, మనవళ్లు, మనవరాళ్ల పుట్టిన రోజులకి వాళ్లకి ఏవో కానుకలు కొనివ్వాలని చిన్న చిన్న కోరికలు ఉన్నాయి. నేరుగా చెప్పక పోయినా ఏదో వంక పెట్టుకుని కొడుక్కి చెపుతూ ఉండేది. ఇది అర్థమై వాళ్ళబ్బాయి పెన్షన్ డ్రా చేసినప్పుడు ఒక్కో నెల పెన్షన్ మొత్తం ఆవిడకి ఇచ్చేసేవాడు. ఇది కోడలికి కాస్త కోపం తెప్పించేది. తనడిగితే ఇవ్వడానికి డబ్బులుండవు గానీ వాళ్ళమ్మకి నెల పెన్షన్ మొత్తం ఇవ్వొచ్చు అని చిన్నబుచ్చుకునేది. తల్లా పెళ్ళామా అన్నట్లుండేది సావిత్రమ్మ కొడుకు పరిస్థితి.

***

జానకమ్మకి ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు. కూతుళ్ళంటే వల్లమాలిన ప్రేమ. కొడుకంటే కూడా ఇష్టమే కానీ కోడలు తన ఇష్టానికి వ్యతిరేకంగా ఉద్యోగం చేస్తోందని కోపం. కొడుక్కి చిన్న ఉద్యోగం. తన పెన్షన్ డబ్బులు కలిపితే ఇల్లు గడిచిపోతుందని ఆమె అభిప్రాయం. కానీ కోడలు చదువుకున్నందుకు తానూ ఓ చెయ్యి వేస్తె మరింత సుఖంగా ఉండొచ్చని ఓ స్కూల్‌లో టీచర్‌గా జాయిన్ అయ్యింది. అందుకే తన పెన్షన్‌ని కూతుళ్లకే ఎక్కువగా ఖర్చు పెడుతుంటుంది. కొడుకు ఎవరి ఇష్టమూ కాదనలేక పోయాడు. ఎలాగోలా ఇల్లు నెట్టుకొస్తున్నారు. ఒక్కగానొక్క కూతుర్ని అంటే జానకమ్మ మనవరాలిని మంచి కాలేజీ లోనే జాయిన్ చేసారు.

***

ఆ రోజు ఆదివారం. బాగా పొద్దెక్కే వరకూ పడుకుని లేచి భార్య చేసే స్పెషల్ డిషెస్ తినాలని రోజంతా రిలాక్స్‌గా గడపాలని ఊహించుకున్నాడు సూర్య. తనకి ఒంట్లో నలతగా ఉందని పిల్లలకు స్కూల్ కూడా లేదు కదా మీరే ఏదో ఒక వంట చేసి పెట్టండని చెప్పడంతో కల చెదిరి పోయింది సూర్యకి. నీరసంగానయినా తనకి నచ్చిన రసం చేసాడు. అమ్మనడిగి ఏదైనా పచ్చడి చేద్దాం అనుకుంటుండగానే, “ఏవండీ నోరు బాగా లేదు కాస్త మసాలా వేసి ఏదైనా ఫ్రై చెయ్యండని” శ్రీమతి అన్నప్పుడు తాను రోజూ అది కావాలని, ఇది కావాలని ఆర్డర్ వేసి వంటలు చేయించుకోవడం, అది ఏమాత్రం బాలేకపోయినా వంక పెట్టడం గుర్తొచ్చాయి సూర్యకి. అవును కదా బావున్నప్పుడు తానేమీ అడగలేదు. బాలేక పోయినప్పుడు అడిగిన ఒక్క వంట చెయ్యకపోతే ఎలా అనుకుని ఫ్రిజ్‌లో వెతికాడు. శ్రీమతికి ఇష్టమైన కందగడ్డ కనిపించింది. అది తనకిష్టం లేదు. కానీ ఎలాగైనా భార్యకి ఇష్ట మైన రీతిలో వండాలని నడుం బిగించాడు సూర్య.

కొడుకు కష్టపడటం చూసి, వంటింటి వైపు వెళ్లి చాలా రోజులైన వాళ్ళమ్మ సాయం చెయ్యడానికి వచ్చింది. మొత్తానికి అమ్మ సాయంతో శ్రీమతికి ఇష్టమైన కందగడ్డ వేపుడు చేసాడు సూర్య. భార్యను లేవమని చెప్పి పిల్లలని అమ్మకు స్నానానికి వేణ్ణీళ్ళు పెట్టమని చెప్పి తాను డైనింగ్ టేబుల్ సర్దాడు. ఎలాగైతేనేం శ్రీమతి వచ్చేప్పటికి వేడి వేడి అన్నం, కంద గడ్డ వేపుడు వడ్డించాడు. కుటుంబమంతా కలిసి కూర్చుని బోంచేసి చాలా రోజూలైంది. అంతా హాయిగా ముచ్చట్లాడుతూ తిన్నారు.

భోజనాలయ్యాక పిల్లలు ఆడుకోవడానికి పక్కింటికెళ్లారు. సూర్యా వాళ్ళావిడా బాల్కనీలో కుర్చీలు వేసుకుని మాట్లాడుతూ కూర్చున్నారు..

“ఎందుకు? ఉన్నట్టుండి సుస్తీ అయింది” అగిగాడు సూర్య.

“నిన్న పని పిల్ల రాలేదు.. పైగా చీపురు బాగా అరిగిపోయింది.. దాంతో ఊడ్చేటప్పటికీ తలప్రాణం తోక కొచ్చింది. కొత్త చీపురు తెప్పిద్దామంటే మీరేమో మరీ లెక్క వేసి నెల ఖర్చుల కిస్తారు. ఏం చేద్దాం నిన్న ఈ విషయం మీకు చెప్పి వచ్చేటప్పుడు డైమండ్ బ్రాండ్ చీపుర్లు రెండు తెమ్మని ఎన్ని సార్లు వాట్సాప్ చేసానో తెలుసా.. ఆన్లైన్‌లో ఉండి కూడా చూడరు. చివరికి విసిగి వేసారి పోయాననుకో..” అంది ఆమని.

“అయ్యయ్యో అంత పనైందా.. నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఆమనీ.. నిన్న ఆఫీస్‌కి వెళ్లడం బాగా ఆలస్యమైందా.. వెళ్ళేటప్పటికి క్యాష్ కౌంటర్ ముందు పెద్ద క్యూ ఉంది. హడావిడిగా వెళ్లి కౌంటర్ ఓపెన్ చేసానా.. నెట్వర్క్ కాస్తా పోయింది. అప్పుడు చూడాలి నా పరిస్థితి.. ఓ సుబ్బారావు అట వచ్చాడు చూడు.. అదేదో నేనే పాడు చేసినట్లు క్లాసు పీకుతున్నాడు.. ఒక వైపు నెట్వర్క్ ఇంజినీరుతో చాట్ చేస్తున్నాను.. ఓ వైపు నువ్వు చీపురు బొమ్మ వాట్సాప్ చేసేప్పటికి నాకు చిర్రెత్తుకొచ్చిందంటే నమ్ము. కాసేపటికి డైమండ్ బొమ్మ పెట్టావు. ఈ టైంలో నగలు, వజ్రాలు కావాల్సొచ్చిందా అని తెగ కోపం వచ్చిందనుకో..”

ఇద్దరూ హాయిగా నవ్వుతూ ముందు రోజు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు..

“అన్నట్లు, సుబ్బారావు గారంటే నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని ఉన్నాడా?” అడిగింది ఆమని.

“నీకెలా తెలుసు?” అడిగాడు సూర్య.

“ఆయన మన అత్తయ్య గారి స్నేహితురాలు జానకమ్మ కొడుకే లెండి. పక్క సందు లోనే ఉంటారు. మొన్న ఆవిడతో మాట్లాడుతూ అత్తయ్య చెపుతుంటే విన్నాను. వాళ్ళ అమ్మాయి ఫీజుకి డబ్బు కోసం ఇబ్బందిగా ఉందని ఆయనా వాళ్ళ ఆవిడా అనుకుంటున్న విషయం చర్చకు వచ్చింది. అస్తమానూ ఆడ పిల్లలకే నగా నట్రా పెట్టకపోతే నీ కొడుకు పిల్లకి ఫీజు కట్టడానికి కాస్త సాయం చేయొచ్చుగా అని అత్తయ్య ఆవిడకి చెపుతుండగా విన్నాను. మీ అమ్మ, మా అబ్బాయి మీ బ్యాంకు లోనే క్యాషియర్ అనీ వెళ్లి నా పేరు చెప్పి త్వరగా పెన్షన్ డబ్బు డ్రా చేసి ఫీజు కట్టమని వాళ్ళబ్బాయికి చెప్పమని సలహా ఇస్తుండగా విన్నాను. సుబ్బారావు గారికి కాస్త నామోషీ కాబోలు. మీతో ఏమీ చెప్పలేదా?” అడిగింది ఆమని.

లేదన్నట్లు అడ్డంగా తలాడించాడు సూర్య.

“ఇంతకీ ఈ రోజు పని పిల్ల చీపురు గురించి గొణక్కుండా పని చేసి వెళ్లినట్లుంది ఏంటో విశేషం?.. ” అని ఆమని అంటుండగానే.. “అమ్మా.. మేము ఈరోజు నానమ్మ చెప్పిన మాట విని రెండు డైమండ్ బ్రాండ్ చీపుర్లు కొని తెచ్చాం. వాటి తోనే పనమ్మాయి ఊడ్చి వెళ్ళింది.. మీరే నయం పిల్లలూ అని మెచ్చుకుంది కూడా.. నువ్వెప్పుడూ మమ్మల్ని మెచ్చుకుందే లేదు..!” అని నొచ్చుకుంటున్న పిల్లల్ని చూసి ఆమని మురిసి పోతూ.. భాగవతం చదువుకుంటున్న అత్తగారి వైపు ఆరాధనగా చూసింది.

***

జానకమ్మ మనవరాలు మంచి మార్కులొచ్చాయని ప్రోగ్రెస్ రిపోర్ట్ ఓ చేత్తో, ఫీజు రసీదు ఓ చేత్తో పట్టుకుని వచ్చి అమ్మకీ, నాన్నకీ చూపించింది.

“మాకు మాత్రమే కాదమ్మా, నువ్వు నానమ్మకీ చూపించాలి, తన ఆశీర్వాదామూ తీసుకోవాలి” అని కోడలు చెపుతుంటే జానకమ్మ మనసులో ఏదో మూల అపరాధ భావన. అలాగే కోడలిపై గౌరవంతో కళ్ళు చెమర్చాయి.

***

ఆ క్షణంలో అందరి మదిలో ఒకటే భావన.. కాలం వెనక్కి తిరిగితే బావుణ్ణు మన దృక్కోణం మార్చుకుని మన మధ్య పొరపొచ్చాలు రాకుండా చేసుకోవచ్చు కదా అని. కానీ గడియారం అయిదు గంటలు కొట్టింది నేను ముందుకే పరిగెడతాను అన్నట్లు.

ఆమని హుషారుగా వంటింటి వైపు పరుగు పెట్టింది టీ పెట్టడానికి.

అక్కడ అందరి నోరూ తీపి చెయ్యడానికి జానకమ్మ సున్నుండలు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here