[dropcap]నా[/dropcap]లుగవ ఫ్లోర్‌లో ఉన్న ఫ్లాట్‌లో బాల్కనీలో కుర్చీ వేసుకుని కుర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు సాకేతరామ్. సాయంత్రం అయిదు గంటలు అవుతూంది. చల్లటి గాలి వీస్తూంది. హ్యాంగింగ్ పాట్స్ నుంచీ వేలాడుతున్న పూలతీగల నుంచీ సువాసన గాలిలో కలిసి సన్నగా ముక్కుపుటాలను తాకుతూ ఉంది. చదువుకుంటూ మధ్యలో తలెత్తి బయటకు చూశాడు. ఊరి బయటి అపార్ట్‌మెంట్ కావటం వలన వెహికల్స్ రణగొణ ధ్వనులు లేవు. మూడు వైపులా వరిపొలాలు కథల్లో వర్ణించినట్లు కనుచూపుమేర వరకూ పచ్చటి తివాచీ పరిచినట్లు ఉన్నాయి.
మెయిన్ రోడ్డు నుంచీ అపార్ట్‌మెంట్ కు రావటానికి కుడివైపున మట్టిరోడ్డు కనబడుతూ ఉంది. మట్టిరోడ్డుకు అవతల పక్కన గేదెలు గడ్డి మేస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు సిటీ మధ్యలో ఇరుకిరుకు ఇళ్ళలో ఉన్న సాకేతరామ్‌కి ఈ దృశ్యాలు కొత్తగా ఉన్నాయి. ఈ మధ్యనే ఈ ఫ్లాట్ కొనుక్కున్నాడు. అంతకుముందు దాకా అద్దెఇళ్ళలో ఉండేవాడు.
“టీ తీసుకోండి” టీ కప్పు అందిస్తూ వచ్చింది మైథిలి. తను కూడా మరో కప్పు తెచ్చుకుని టీ తాగుతూ ఎదురుగా ఉన్న మరో కుర్చీలో కూర్చుంది. “అటు చూడు మైథిలీ! గడ్డి మేస్తున్న పశువులు, పచ్చటి పొలాలు, వాటి వెనక దూరంగా కనిపిస్తున్న కొండలు ఈ దృశ్యం ఎంతో బాగుంది కదూ!” టీ కప్పు అందుకుంటూ అన్నాడు.
“అవునండీ! ఈ ఫ్లాట్ కొన్న తర్వాత నాకు కూడా ప్రాణానికి హాయిగా ఉంది. అంతకు ముందు అద్దెఇళ్ళలో ఇరుకిరుకుగా, నడుస్తుంటే కిటికీ తలుపులు కొట్టుకుంటూ ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు విశాలమైన గదులు, చల్లటి గాలి. చాలా బాగుంది” అన్నది.
టీ తాగిన తర్వాత కప్పులు తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది మైథిలి. సాకేతరామ్ ఆలోచిస్తూ కూర్చున్నాడు. సాకేతరామ్ తల్లిదండ్రులకి ఇద్దరు మగ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. అందరిలోకీ సాకేత్ చిన్నవాడు. తండ్రి గుమాస్తాగా పనిచేసేవాడు. ఇద్దరు అక్కలకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత తండ్రి హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూశాడు. తండ్రి సంపాదించిన ఆస్తిపాస్తులు పెద్దగా ఏమీ లేవు ఒక్క ఇల్లు తప్ప. అన్నయ్యకి ఉద్యోగం వచ్చింది. తండ్రి బాధ్యతను పెద్దకొడుకుగా తలకెత్తుకోవలసింది పోయి, ఆఫీస్‌లో తనతో పాటు పనిచేసే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని, వేరు కాపురం వెళ్ళిపోయాడు. తల్లిని, తోడబుట్టిన వాళ్ళని పట్టించుకోలేదు.
“అయన చూడబోతే అలా వెళ్ళిపోయాడు. వీడు చూడబోతే తన దారి తను చూసుకున్నాడు. ఇంతమంది పిల్లల్ని నేను ఎలా పోషించను? ఏ గంగలో దూకను?” ఏడుస్తూ కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ అన్నది తల్లి. తల్లి కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంటే ఎంతో బాధగా అనిపించింది సాకేత్‌కి. సాకేత్‌కి తల్లి అంటే చాలా ఇష్టం. తనకి ఉహ తెలిసిన దగ్గర నుంచీ కుటుంబం కోసం ఆమె కష్టపడటం చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండేది. ఖాళీగా ఉండటం ఎప్పుడూ చూడలేదు. విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచన కూడా ఉండేది కాదేమో! ఇప్పుడు కూడా బియ్యం కడిగి పొయ్యిమీద పెట్టి ఏడుస్తూనే పనిచేస్తూంది.
సాకేత్‌కి పందొమ్మిదేళ్ళు. డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతూ ఉన్నాడు. ఈ పరిస్థితులలో తనకి కావాల్సింది చదువు కాదు, సంపాదన. తల్లికి సహాయంగా ఉండాలనే ఉద్దేశంతో చదువు ఆపేసి, ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా చేరాడు. జీతం తక్కువే! అసలు లేనిదాని కంటే ఎంతోకొంత మేలుకదూ! అనుకున్నాడు. ఒకటవ తారీఖు రాగానే జీతం తెచ్చి తల్లి చేతుల్లో పెట్టాడు. ఆ మాత్రానికే సంతోషపడిపోయింది తల్లి. ఆమె ముఖంలో నవ్వు చూస్తుంటే హాయిగా ఉంది సాకేత్‌కి. ఇంటి పనుల్లో సహాయం చేసేవాడు.
స్కూల్లో ఇచ్చే అరకొర జీతం ఏమూలకి? ఏదైనా చిన్న వ్యాపారం చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. స్నేహితుడితో కలసి పుస్తకాల షాప్ పెట్టుకున్నాడు. స్కూల్ పిల్లలకి అవసరం అయ్యే నోట్స్‌లు, పెన్నులు, పెన్సిళ్ళు, స్కూల్ బ్యాగ్‌లు మొదలైనవి అమ్మేవాడు. రెండు సంవత్సరాలు గడిచేసరికి వ్యాపారంలో నిలదొక్కుకున్నాడు. సంపాదన పెరిగిన తర్వాత కుటుంబం కొంచెం గాడిన పడింది. “పెద్దవాడు అలా వదిలేసి వెళ్ళినా నువ్వు ఎంతో బాధ్యతగా ఉంటున్నావు. చిన్నవాడైనా పెద్దమనసు నా బాబుకి” ఆప్యాయంగా బుగ్గలు నిమిరేది తల్లి.
“ఎవరికి చేస్తున్నానమ్మా! నీకు, అక్కలకేగా! మీరంతా నాకు పరాయి వాళ్ళా!” అనేవాడు.
“ఆడపిల్లలకి పుట్టింటి మీద మమకారం ఉంటుంది. ఎప్పుడైనా వస్తే ఆదరంగా చూసి పంపించు నాయనా! ఆడపిల్ల కన్నీళ్ళు పెట్టుకుంటే శుభం కాదు” అనేది తల్లి. “సరేనమ్మా!” అన్నాడు. మూడో అక్క పెళ్ళికి ఉన్న కాస్త ఇల్లు అమ్మవలసి వచ్చింది. తల్లి, తను అద్దె ఇంట్లోకి మారారు. మరో నాలుగేళ్ళు గడిచి పోయాయి. సాకేత్‌కి పెళ్లి అయింది. భార్య కూడా ఉమ్మడి కుటుంబంలో నుంచీ వచ్చింది. పండగలకి, పబ్బాలకి అక్కలు వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నన్ని నాళ్ళూ అన్నీ వండిపెట్టి, బట్టలు పెట్టి పంపించేది.
సాకేత్ తల్లికి ఆరోగ్యం బాగాలేదు. అన్నయ్య ఎప్పుడో వదిలేసాడు. అక్కలు “పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత మాకేం బాధ్యత ఉంటుంది? అమ్మని నువ్వే చూసుకోవాలి” అని చెప్పేవారు. తల్లిని చూసే వంకతో చీటికీ మాటికీ వచ్చి పదేసి రోజులు ఉండి పోయేవారు. ఇంట్లో కావలసినవి అన్నీ సాకేత్ తీసుకురావటం, మైథిలి వండి పెట్టటం చేసేవారు. మైథిలికి ఆడబడుచుల ధోరణి నచ్చకపోయినా ‘భర్తకి ఇష్టం కాబట్టి’ అనుకుని చేసేది.
ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు ఇవన్నీ చూస్తూ “మీ ఇంటికి చుట్టాలు ఎప్పుడూ తిరణాలకి వచ్చినట్లు వస్తూనే ఉంటారు” అనేవారు. కొన్నాళ్ళకి తల్లి కూడా కన్ను మూసింది. పదేళ్ళు గడిచిపోయాయి. సాకేత్‌కి ఇద్దరు పిల్లలు పుట్టారు. చుట్టాల తాకిడికి, పండగలకి, ఫంక్షన్ లకి సంపాదన ఎప్పటికప్పుడు సరిపోయేది. దాచుకున్నది ఏమీ లేదు.
సాకేత్ బుక్ షాప్ ఇదివరకటిలా ఇప్పుడు జరగటం లేదు. సెల్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, కంప్యుటర్లు వచ్చి, రాసే వర్క్ తగ్గిపోయింది. విద్యార్థులే కాదు, ఉద్యోగులకు కూడా పుస్తకాలతోనూ, పెన్నులతోనూ పని తగ్గిపోయింది. అంతా కంప్యుటర్‌లతోనే గడిచిపోతుంది. పైగా ఏ స్కూల్ కి ఆ స్కూల్ వారే స్టేషనరీ షాపులు నిర్వహిస్తూ పిల్లలందరూ తమ షాపు లోనే కొనాలనే నిబంధన పెట్టారు. సాకేత్ వ్యాపారం మందగించి రాబడి కూడా తగ్గిపోయింది. ఇంట్లో వచ్చిన మార్పులు, పెట్టుపోతల్లో మార్పులు చూసి అక్కలు మూతి విరుచుకునేవారు.
ఇన్నేళ్ళయినా సాకేత్ సొంత ఇల్లు అనేది ఏర్పాటు చేసుకోలేదు. నలభయ్యవ పడిలోకి వచ్చాడు. పిల్లలు స్కూల్‌కి కూడా వెళుతున్నారు. ఈ మధ్యనే బ్యాంక్‌లో లోన్ తీసుకుని అపార్ట్‌మెంట్ కొనుక్కున్నాడు. ఇంకొంత అప్పు చేసి గృహప్రవేశం ఘనంగా చేసాడు. వచ్చిన బంధువులందరికీ బట్టలు పెట్టి మర్యాదలు చేసి పంపించాడు.
“చీకటి పడింది. లోపలకి రండి. దోమలు కుడతాయి” భార్య పిలుపుతో ఆలోచనల నుంచీ బయటపడి కుర్చీలో నుంచీ లేచాడు సాకేత్.
***
కొన్నాళ్ళు గడిచిపోయాయి. ఒకసారి చిన్న అక్క చెప్పాపెట్టకుండా లగేజీతో వచ్చేసింది. బావ, తను పోట్లాడుకున్నారట. ఇక అతనితో కలిసి ఉండనని చెప్పి వచ్చేసింది. ఆమె ధోరణి చూసి తికమకపడ్డాడు సాకేత్. అయినా ఏమీ అనలేదు. నిదానంగా కనుక్కుందామని అనుకుని ఆమెని ఆదరంగానే చూసాడు. తనకి తెలిసినంత వరకు బావ సౌమ్యుడు. కొన్నాళ్ళయిన తర్వాత బావ దగ్గరకి వెళ్లి మాట్లాడాడు. అప్పుడేదో చిన్న తగాదా వచ్చి క్షణికావేశంలో వెళ్ళిపోయిందట. బావకి నచ్చచెప్పి తిరిగి తీసుకువెళ్ళేటట్లు చేసాడు సాకేత్.
అప్పటికే అక్కకి సాకేత్ ఇంట్లో ఇదివరకటి అంత వైభోగంగా జరగక పోవటం, అతని ఆదాయం తగ్గిపోవటం గమనించింది. అక్కడ ఉండటం అసంతృప్తిగా అనిపించి భర్తతో వెళ్ళటానికి అంగీకరించింది. వెళ్ళేటప్పుడు ఉన్నంతలోనే చీరే, సారే పెట్టి పంపిస్తూ “చీటికీ మాటికీ భర్తతో తగవుపడి ఇక్కడకు రావద్దు, మీ పిల్లలు కూడా పెద్దవుతున్నారు, ఇద్దరూ కలిసి ఉండండి” అని చెప్పాడు.
బయటకు వెళ్ళిన తర్వాత ఆమె ఆ మాటలు మార్చి “నన్ను తన ఇంటికి రావద్దు అన్నాడు. నాకేం గతిలేక వచ్చానా!” అంటూ నలుగురికీ చెప్పింది. అందరూ ఆమె మాటే నమ్మారు. ఈ విషయం సాకేత్‌కి ఎప్పటికో తెలిసింది. వాళ్ళు ఎవరూ తన ఇంటికి రావటం లేదు, ఫోన్ చేస్తే మాట్లాడటం లేదు. ఏం జరిగిందో అర్థం కాలేదు ఇప్పటిదాకా. విషయం తెలిసేసరికి బాధ వేసింది. అసలు జరిగిన విషయం ఏమిటో అడగలేదు, తన తప్పు ఉందో లేదో ఆలోచించలేదు, అందరూ కలసి తనని వెలివేసినట్లు చూస్తున్నారు అని మథనపడేవాడు.
సాకేత్ కి అప్పుడప్పుడు ‘చిన్నప్పటి నుంచీ పదిమందిలో కలసి పెరిగాను. ఇప్పుడు ఇలా ఒంటరివాడిని అయ్యానేమిటి? నేనేం తప్పుచేసాను?’ అనిపించేది. నిరంతరం ఆ విషయమే మనసులో తొలిచేస్తూ అశాంతిగా ఉండేది. నిద్రకూడా సరిగా పట్టేది కాదు. ఒక రాత్రివేళ హఠాత్తుగా మెలకువ వచ్చి, ఆలోచిస్తూ కూర్చునేవాడు.
పెద్దన్నయ్య కుమార్తెకి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటున్నారట. అన్నయ్య రియల్ ఎస్టేట్ బిజెనెస్ చేస్తూ బాగా సంపాదించాడట. కొంతకాలం నుంచీ అక్కలందరూ పెద్దన్నయ్యను మంచి చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా అందరూ అక్కడ కలుసుకుంటున్నారు. తనకి ఆహ్వానం రాలేదు. వెళితే బాగుండు, అందరినీ కళ్ళారా చూడవచ్చు అనిపించింది. కానీ పిలుపు రాకుండా ఎలా! ఒకవేళ తన అడ్రెస్ అన్నయ్యకి తెలియలేదేమో! తెలిస్తే చెప్పకుండా ఉంటాడా! కొత్త ఇంట్లోకి మారిన తర్వాత గృహప్రవేశంకి తను పిలిచినా అయన రాలేదు. అప్పుడు వీలుగాక రాలేదేమో! ఇప్పుడు ఒక్కసారి వెళ్లి చూద్దాం అనుకున్నాడు.
మైథిలి అతనితో రావటానికి ఒప్పుకోలేదు. “నాకెందుకో పిలవకపోయినా వెళ్ళటం ఇష్టంగా అనిపించటం లేదండీ! మీ తోడబుట్టినవాళ్ళు కాబట్టి మీకు పట్టింపు ఉండకపోవచ్చు. మీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి. నేను రాను” అన్నది. సాకేత్ ఒక్కడే బయలుదేరాడు.
అన్నయ్య ఇంటికి వెళితే ఎవరూ సాదరంగా ఆహ్వానించలేదు సరికదా, అందరూ శత్రువుని చూసినట్లు చూశారు. “చెల్లి వస్తే నీ ఇంటికి రావద్దన్నవాడివి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు సిగ్గులేకుండా?” అన్నది పెద్దక్క ఈసడింపుగా.
“నేను ఆ ఉద్దేశంతో అనలేదు” అంటూ సాకేత్ వివరించి చెప్పబోయినా వినిపించుకోలేదు.“నీ బుద్ధి ఎలాంటిదో నాకు తెలియదూ! ఇంకా సమర్థించుకుంటున్నావు. ఇంకెప్పుడూ నీ మొహం మాకు చూపించకు. వెళ్ళు” అంటూ చెడామడా దులిపేశారు. వాళ్ళ మాటలతో సాకేత్ తల వాచిపోయినట్లు అయింది. బాధగా తిరిగి వచ్చేశాడు.
విచారంగా బాల్కనీలో కూర్చున్న భర్తని చూసి “ఏం జరిగిందండీ!” అని అడిగింది మైథిలి. అక్కడ జరిగినదంతా చెప్పాడు సాకేత్. “నా సంపాదన తగ్గిపోయింది. ఇదివరకటిలా గ్రాండ్‌గా చూడటం లేదని వాళ్ళకి మనసులో ఉంది. డబ్బుకి ఎంత ఇబ్బందిగా ఉన్నా అప్పో, సొప్పో చేసి వాళ్లకి పెట్టాను. చిన్నక్క భర్తతో తగాదా పడి ఆరునెలలు మన ఇంట్లో ఉన్నా నేను కాదనలేదు. మళ్ళీ ఇద్దరూ కలుసుకునేటట్లు చేసాను. వాళ్లకి నేను చేసిన మంచి అంతా బూడిదలో పోసిన పన్నీరులా అయింది.” అన్నాడు బాధగా.
“పోనీలెండి! ఇదీ ఒకందుకు మన మంచికే జరిగింది. అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు దూరంగా ఉండటమే మంచిది” అన్నది మైథిలి.
“చిన్నప్పుడు మా అమ్మ ఆడపిల్లల్ని కంటనీరు పెట్టించవద్దు. ఆదరించి పంపు అని చెప్పేది. ఆ మాటలు నా మనసులో ముద్రించుకుపోయాయి. అంతా నా వాళ్ళే కదా అనుకున్నాను. ఎంత ఖర్చుచేశానో, ఎంత శ్రమపడ్డానో కూడా గుర్తుంచుకోలేదు. చివరికి చిన్నమాట పట్టింపు కోసం నన్ను వదిలేసి, డబ్బు గల అన్నయ్య దగ్గరకు చేరారు. పోనీ వెళితే వెళ్ళారు, నన్ను ఏకాకిని చేయటం దేనికి?” అన్నాడు.
“మీరే తప్పు చేయలేదు. ఎవరికీ అన్యాయం చేయలేదు. ఆ సంతృప్తి చాలు. దేవుడు కూడా మీకు అన్యాయం చేయడు. బాధ పడకండి”
“అటు చూడు మైధిలీ! ఇదివరకు ఇక్కడ కూర్చుంటే ఎదురుగా పచ్చటి పొలాలు, గడ్డి మేస్తున్న గేదెలు కనిపించి, ఆ దృశ్యం ఎంతో అందంగా ఉండేది. ఇప్పుడు పొలాలు ఎండిపోయాయి. గేదెలు కనిపించకుండా పోయాయి. ఆ బీడుభూమి కూడా నా మనసు లాగానే శూన్యంగా ఉంది” అన్నాడు.
“పశువులు ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయి. అవి కనబడటం లేదని మీరు బాధ పడుతున్నారు గానీ, మీరు కనబడటం లేదని అవి బాధ పడవు. ఎందుకంటే పశువులకి ఫీలింగ్స్ ఉండవు, సెంటిమెంట్స్ ఉండవు. కొంతమంది మనుషులు కూడా అంతే! ఎటు అనుకూలంగా ఉంటే అటు వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోవటం అనవసరం. మర్చిపోండి” అన్నది మైథిలి.
సాకేతరామ్ నిట్టూర్చాడు.