డ్రైఫ్రూట్స్‌తో బొమ్మలు

0
10

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘డ్రైఫ్రూట్స్‌తో బొమ్మలు’ అనే రచనని అందిస్తున్నాము.]

ఈమధ్య కాలంలో ఎండు ఫలాలను ఎక్కువగా తింటున్నప్పటికీ క్రీ.పూ. నాలుగు వేల సంవత్సరాల కిందటే ఈ సంప్రదాయం మొదలయినట్లుగా తెలుస్తోంది. పూర్వం కూరగాయల్ని కూడా ఎండబెట్టి ఒరుగులుగా చేసుకుని కూరగాయలు దొరకని కాలంలో తినేవాళ్ళట. బహుశా ఈ పండ్లను కూడా అలాగే తినడం మొదలుపెట్టి ఉండవచ్చు. మామూలుగా కోసిన ఫలాల్నే ఎండబెట్టి ఎండు ఫలాలుగా మారుస్తున్నారు. అయినప్పటికీ ఆయా ఫలాల్లో ఉండే పోషక విలువలు ఏమీ మారక పోవటంతో ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారు. మొదటగా మెసపటోమియాలో ఈ ఎండు ఫలాలను తినటం మొదలయిందని చెప్పవచ్చు. ఎక్కువగా ఎడారుల్లో ప్రయానించేవారు, అడవుల్లో నివసించేవారు వీటిని తింటారు. ఎండు ద్రాక్ష, ఏప్రికాట్లు, పీచ్‌లు, ఖర్జూరాలు, బెర్రీలు, చెర్రీలు రేగు పండ్లు ప్రధానమైనవి. యాపిల్, పైనాపిల్, మ్యాంగో వంటి వాటిని ఎండబెట్టి క్యాండిడ్లుగా మారుస్తున్నారు. నేనీ మధ్యనే పైనాపిల్ క్యాండిడ్లను తిన్నాను. రుచి, తీపిదనం ఏమీ మారలేదు. ఫలాలను సహజమైన ఎండలో కానీ, వేడిగాలి వచ్చే డ్రైయర్స్ ద్వారా గానీ ఎండబెడతారు. డ్రైప్రూట్స్‌తో తయారైన బొమ్మలు చూద్దాం.

జీడి పప్పులతో పాపాయి బొమ్మను చేశాను చూడండి. గారాబాల పాపాయి కాబట్టే ఖరీదైన జీడి పప్పుతో తయారు చేశాను. జీడి మామిడి చెట్ల నుంచి జీడి పప్పులు వస్తాయి. ఈ జీడి మామిడి కాయ విచిత్రంగా ఉంటుంది తెలుసా! ఏ కాయలకైనా పండు లోపలే విత్తనాలు ఉంటాయి. కానీ జీడి మామిడికి మాత్రం పండు బయటి భాగంలో విత్తనం ఉంటుంది. ఇది అన కార్డియేసి కుటుంబనానికి చెందిన మొక్క. జీడి మామిడి తోటలు ఎక్కువగా పండే వేటపాలెం మా స్వస్థలo. అందుకే ఈ చెట్లను చూస్తూ పెరిగాం. ప్రతి కూరలోనూ జీడి పప్పు వేసుకుని వండుకునేవాళ్ళం. జీడిపప్పు వలవటం అనేది అక్కడి మహిళలకు వెన్నతో పెట్టిన విద్య. జీడిపప్పు ఉత్పత్తిలో ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించిన దేశాలలో భారతదేశం కూడా ఒకటి. జీడి మామిడి కాయ రసంతో పీచుతో మంచి రుచిని కలిగి ఉంటుంది. జీడిపప్పులో అనేక పోషకాలు ఉండడం వలన ఎక్కవ ప్రసిద్ధి చెందింది. జీడి చెట్టు పువ్వులు చిన్నవిగా ఉంటాయి. మొదట పూసినపుడు అకుపచ్చ రంగులో ఉండి ఆ తర్వాత ఎరుపు రంగులోకి మారతాయి. అధికమైన కొవ్వు పదార్థాలున్న గింజలుగా జీడిపప్పు పేరెన్నికగన్నది. నేను ఇలాంటి జీడి పప్పుతో అందమైన ముద్దుగారే మూడేళ్ళ పాపను చేశాను. గులాబీ రేకలను తలలో పూలుగా ఆల్లి పెట్టాను. జుట్టు కోసం కాఫీ పొడిని ఉపయోగించాను. ముద్దులొలికే జీడి పప్పు పాప ముద్దు మాటలు వినండి.

ఇంతకు ముందు రోజుల్లో ఎవరింటికి వెళ్ళినా పండ్లు తీసుకెళ్ళేవారు. బహుశా వీటిలా మంచి చేసేది ఏమీ లేవని మన పూర్వీకులు ఇలాంటి ఆచారాలు పెట్టి ఉండవచ్చు. కానీ ఈమధ్య డ్రైఫ్రూట్స్‌ను ఇవ్వడం ఎక్కువయింది. పెళ్ళిళ్ళకు సైతం శుభలేఖతో పాటు డ్రైఫ్రూట్స్ డబ్బాలను పంచి పెడుతున్నారు. అందుకే షాపుల వాళ్ళు వాటిని అందంగా ప్యాక్ చేయడం మొదలు పెట్టారు. ఫ్లవర్ బొకేల్లాగా డ్రైఫ్రూట్స్ బాస్కెట్‌లు తయారు చేయడం కళగానూ, ఆదాయ వనరు గానూ మారింది. పెళ్ళిళ్ళల్లో సైతం అందంగా ప్యాక్ చేసిన పండ్ల పళ్ళేలు వేదికల వద్ద పెడుతున్నారు. ఇన్ని చూశాక నా చెయ్యి కూడా ఊరుకుంటుందా! ఈ డ్రైఫ్రూట్స్‌తో ఒక పాపనే చేద్దామనుకున్నాను. దీని కోసం ఒక ప్లాస్టిక్ బొమ్మను కొనుక్కోచ్చాను. ఈ బొమ్మకు డ్రైఫ్రూట్స్ పావడాను కుట్టాలి. జీడిపప్పు, బాదం, పిస్తా. కిస్‌మిస్‌లను తీసుకున్నాను. అట్టముక్కను కోన్ ఆకారంలో మడిచి పిన్ కొట్టేశాను. ఈ పొట్లంలో కిస్‌మిస్‌ను నింపాను. అలాగే ఐదారు కోన్లు చేసుకోవాలి. ఒక్కొక్క కోన్‌లో ఒక్కొ రకం ఫ్రూట్స్ సింపాను. ఇవి బయటకు రాకుండా కూడా పిన్ కొట్టాను. ఇప్పుడు ప్లాస్టిక్ బొమ్మ చుట్టూరా పావడా వలే అందగా అమర్చాను. డ్రైఫ్రూట్స్ పాప తయారయింది. గిఫ్ట్ రెడీ అయింది.

పిస్తా పప్పులతో స్టెతస్కోపును తయారు చేశాను. బలవర్థకమైన పిస్తా పప్పును తింటే స్టెతస్కోపుతో పరీక్ష చేయించుకునే అవసరం రాదనే విషయాన్ని చెప్పాలని ఇలా చేశాను. హస్పిటల్‌కు చిన్న పిల్లలు వస్తుంటారు. సరిగ్గా తినటం లేదని తల్లులు పిర్యాదు చేస్తుంటారు. అలాంటి పిల్లల కోసమే నేనిలా బొమ్మలు చేస్తుంటాను. కూరగాయలు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌తో వింత వింత ఆకారాలు సృష్టిస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను. నాకొచ్చిన చిత్రలేఖనాన్ని ఉపయోగించి జంతులు, పిల్లలు, పరికరాలు వంటివి సృష్టించి తద్వారా ఆరోగ్యాన్నీ సైన్సునూ అందజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు స్టెతస్కోప్ ఆకారంలో పిస్తా పప్పును అమర్చాను. డాక్టరు గారి రూములో పెట్టాను పిల్లలంతా ఆసక్తిగా గమనించారు. రోజూ పిస్తా పప్పులు బాగా తినాలని చెప్పాను. సరేనని తలూపారు.

ఇప్పుడు ఆడపిల్లల్ని ఆకట్టుకునేలా మరో ప్రయోగం చేశాను. అంజీర్ పండ్లతో నెక్లెస్‌ను తయారు చేశాను. అంజీర్ పండ్లను సాధారణంగా అత్తి పండ్లు అని పిలుస్తారు. వీటిని శాస్త్రీయంగా ‘ ఫైకస్ ఎరికా’ అంటారు. వీటిని ఎండబెట్టాక చక్రాల్లా ఉంటాయి. ఒక పురి కొసకు గుచ్చి చుట్టలు చుట్టి అమ్ముకుంటారు. యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్లు, విటమిన్లు, మినరల్స్ అధిక మోతాదులో ఉండటం వలన మంచి పౌష్టికాహరంగా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ పని తీరును మెరుగు పరుస్తుంది. దీంట్లో ఉండే ఫైబర్ ప్రొ బయాటిక్‌గా పని చేస్తుంది. ఎండిన అత్తి పండ్లను క్రమం తప్పకుండా వాడుకోవడం వలన ప్రేగు కదలికలు సక్రమంగా జరుగుతాయి. మలబద్దకాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నివారిస్తుంది. గుండ్రని అంజీర్ పండ్లను క్రమంగా అమర్చి నెక్లెస్‌గా మార్చాను. అంజీర్ పండ్ల నెక్లెస్ ను మీరూ ధరించండి.

కిస్‌మిస్ పండ్లతో డి.ఎన్.ఏ.ను తయారుచేశాను. ద్రాక్ష పండ్లును ఎండబెట్టి కిస్‌మిస్‌లు తయారు చేస్తారు. పాయసంలో జీడిపప్పు కిస్‌మిస్‌లు వేసి రుచిగా తయారు చేస్తారు. శరీరంలో ఉండే డి.ఎన్.ఏ వంశ పారంపర్య లక్షణాలను కలిగి ఉంటుంది. తాతలు, మత్తాతల దగ్గర నుంచీ వచ్చే వారసత్వ లక్షణాలను దాచి ముందు తరాలకు అందించడానికి పనికొస్తుంది. ప్రోటీన్ల ఉత్పత్తిలో డీ.ఎన్.ఏ కీలకపాత్ర పోషిస్తుంది. జీవి యొక్క జన్యువులను కోడ్ చేస్తుంది. ఆకుల్లో కిరణ జన్య సంయోగ క్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. డీ ఆక్సీరైబొ న్యూక్లిక్ యాసిడ్ అని డి.ఎన్.ఏ పూర్తి పేరు. డి.ఎన్.ఎ ను 1869 లో జోహాన్నస్ పెడ్రిక్ మీషెర్ అనే శాస్త్రవేత్ర మొదటిసారిగా కనుగొన్నాడు. నేను కిస్‌మిస్ లను డి.ఎన్.ఎ.ల ఆకారంలో పెట్టి పిల్లలకు చూపించాను. డి.ఎన్.ఎ గురించి వివరించాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here