దుర్యోధనుడు ప్రాయోపవేశం విరమించటానికి కారణం ఏమిటి?

1
24

[శ్రీ గోనుగుంట మురళీకృష్ణ రచించిన ‘దుర్యోధనుడు ప్రాయోపవేశం విరమించటానికి కారణం ఏమిటి?’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

[dropcap]ఇ[/dropcap]టీవల నేను ‘పాండవ వనవాసం’ చలనచిత్రం చూడటం జరిగింది. అందులో దుర్యోధనుడు ఘోషయాత్రకు వెళ్ళే ఘట్టం ఉంది. అరణ్యంలో ఉన్న పాండవుల ముందు తన వైభవాన్ని ప్రదర్శించి అవమానించాలని బయలుదేరి గంధర్వుల చేతిలో చిక్కి బంధింపబడతాడు. ఈ విషయం తెలిసిన ధర్మరాజు తమ్ములను పంపించి దుర్యోధనుడిని విడిపించి సుద్దులు చెప్పి పంపేస్తాడు. తన శిబిరానికి తిరిగివచ్చిన దుర్యోధనుడు పాండవులను అవమానించాలనుకుని తనే అవమానం పాలయినందుకు విచారిస్తూ హస్తినాపురానికి తిరిగివెళ్లి తల్లిదండ్రులకు ముఖం చూపించలేనని, ఇక్కడే ప్రాయోపవేశం చేసి ప్రాణం విడుస్తానని చెబుతాడు (ఆహారం తీసుకోకుండా ఆమరణ ఉపవాస దీక్ష చేయటాన్ని ప్రాయోపవేశం అంటారు).

“మనకు తెలియని ఏదో మహత్తర అజ్ఞాతశక్తి సదా పాండవులని సంరక్షిస్తున్నది” అని దుశ్శాసన కర్ణ శకునిలతో అంటాడు.

“మహత్తర అజ్ఞాతశక్తి కాదు అల్లుడూ! ఆ మాయలమారి శ్రీకృష్ణుడు చేసే మహేంద్రజాలం. అతడే నీ శత్రువులకు శక్తి, యుక్తి, సర్వం. దేహప్రాణాల వంటి శ్రీకృష్ణ పాండవులను మనమే వేరు చేస్తే..?” అంటాడు శకుని.

“ఎలా మామా!”

“సుయోధనా! నీవు బలరాముడికి ప్రియశిష్యుడవు కదూ! నీవంటే అతడికి అత్యంత వాత్సల్యమూ, అభిమానమూ కదూ!”

“నిస్సందేహంగా..”

“అలాగే అన్న బలరాముడంటే శ్రీకృష్ణునకు అంత ప్రేమ, గౌరవాభిమానాలున్నాయి. బలరాముని మాటంటే శ్రీకృష్ణుడు జవదాటడయ్యా! బలదేవునితో ఇచ్చకములాడి, మనస్సుని మెప్పించి, అతని కుమార్తె శశిరేఖను మన లక్ష్మణ కుమారునికిచ్చి కల్యాణం జరిపించామనుకో, ఏమౌతుంది?” తన పథకాన్ని బయట పెట్టాడు శకుని.

“భళా మామా! ఆ పాండవుల కన్నా మనమే దగ్గర బంధువులతాం” అంటాడు దుశ్శాసనుడు.

“మనం దగ్గరవుతున్న కొద్దీ ఆ పాండవులు శ్రీకృష్ణుడికి దూరమౌతారు. అప్పుడు వారి గోడు అరణ్యరోదనమే! శశిరేఖాలక్ష్మణ కుమారుల వివాహం జరిపించటం నా వంతు. కనుక ఈ ప్రాయోపవేశానికి స్వస్తి చెప్పి నిశ్చితంగా రాజధాని బయలుదేరు” అని చెబుతాడు శకుని. శకుని మాట ప్రకారం తిరిగి హస్తినాపురానికి బయలుదేరుతాడు దుర్యోధనుడు.

శ్రీకృష్ణుడి ఉపాయంతో ఘటోత్కచుడు మాయాశశిరేఖగా మారి లక్షణ కుమారుడిని ముప్పతిప్పలు పెట్టటం, అసలు శశిరేఖతో అభిమన్యుడి వివాహం జరిగిపోవటం అదంతా తర్వాత కథ.

కథారచయిత ఈ కథను ఎంత చిక్కగా అల్లాడంటే సినిమా చూస్తున్న సాధారణ ప్రేక్షకుడికి అసలు సందేహమే రాదు. అయన చెప్పిన కారణం అతికినట్లు సరిపోతుంది. కానీ కొంచెం అలోచించి చూస్తే బలరాముడికి అసలు శశిరేఖ అనే కుమార్తే లేదు. శశిరేఖ కల్పిత పాత్ర. మరి దుర్యోధనుడు ప్రాయోపవేశం విరమించటానికి కారణం ఏమిటి? మహాభారతం లోతుగా చదివినవారికి ఆ విషయం అర్థం అవుతుంది.

వాస్తవానికి తన శిబిరానికి తిరిగివచ్చిన తర్వాత దుర్యోధనుడు ‘నేను గంధర్వుల చేత జయింపబడటం ఒక విధమైన పరాభవం. శత్రువులు అయిన పాండవుల చేత బంధ విముక్తుడిని కావటం అంతకు మించిన పరాభవం. ఏ ముఖంతో తండ్రితోనూ, భీష్మ ద్రోణుల వంటి కురువృద్ధులతోనూ మాట్లాడగలను?’ అనుకుని దుశ్శాసనుడికి పట్టాభిషేకం చేస్తానని అంటాడు. ఆ మాట విని దుశ్శాసనుడు “నువ్వు వహింపవలసిన ఈ రాజ్యభారాన్ని నేను మోయలేను. నూరు సంవత్సరాల పాటు నువ్వే పరిపాలించు” అని చెబుతాడు. కర్ణుడు కూడా “జూదంలో ఓడిపోయిన నాడే పాండవులు నీ దాసులు. రాజుకు ఆపద వచ్చినప్పుడు ప్రాణాలు ఒడ్డి అయినా సేవ చేయాలి కదా!  కాబట్టి ప్రభువు ఋణం తీర్చుకోవటానికి నిన్ను విడిపించారు. ఇందుకు దుఃఖించటం అనవసరం” అని ఓదారుస్తాడు.

శకుని మాత్రం ఇక్కడ కొన్ని మంచి మాటలు చెబుతాడు. “దుర్యోధనా! పాండవులు నీకు ఉపకారం చేసిన మాట నిజం. నువ్వు ప్రత్యుపకారం చేయటం ధర్మం. వారిని సత్కరించు. వారు నీకు తోడబుట్టిన వారే కదా! ప్రేమతో స్నేహం చెయ్యి. అందరూ ఐకమత్యంతో కలసి ఈ రాజ్యాన్ని పరిపాలించండి. ఈ విధంగా చేస్తే ఇరువురికీ సౌఖ్యం, గొప్పతనం వస్తుంది” అని చెబుతాడు.

ఎవరెన్ని చెప్పినా సుయోధనుడు తన పట్టు వదలలేదు. “నేను నిరాహార దీక్ష చేయటానికే నిశ్చయించుకున్నాను. నన్ను వారించకండి. మీరంతా మీ ఇష్టం వచ్చిన చోటికి పొండి” అని చెప్పి సంధ్యావందనం చేసి, దర్భల చాప మీద కూర్చున్నాడు. మౌనవ్రతం అవలంబించి ఇంద్రియాలు చేసే పనులను నియంత్రించుకున్నాడు. అంటే చూడకుండా, మాట్లాడకుండా, కదలకుండా, గాలి పీల్చకుండా, ఆహారం తీసుకోకుండా, మనసు చంచలించకుండా నియంత్రించుకుని క్రమక్రమంగా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో గాలి లేని చోట నిశ్చలంగా ప్రకాశిస్తున్న దీపంలా ఉండిపోయాడు సుయోధనుడు.

ఈ విషయం పాతాళంలో ఉన్న రాక్షసులు అందరికీ తెలిసింది. వారు అప్పటికి ఇంద్రుడి చేతిలో ఓడిపోయి పాతాళంలో దాక్కున్నారు. దుర్యోధనుడు ఈ విధంగా చేస్తే తమ వర్గం నశించిపోతారు అని దుఃఖించారు. వెంటనే కులగురువు అయిన శుక్రాచార్యుడి చేత పాతాళహోమం చేయించారు. హోమగుండంలో నుంచీ ఒక ‘కృత్య’ (జ్వాలా రూపంలో ఉన్న రాక్షసి) వెలువడింది. “నేను చేయవలసిన పని ఏమిటో చెప్పండి” అని కృత్య అడిగితే దుర్యోధనుడిని పాతాళ లోకానికి తీసుకురమ్మని ఆదేశించారు.

వెంటనే కృత్య వెళ్లి నిరాహార దీక్షలో ఉన్న దుర్యోధనుడిని ఎత్తుకొచ్చి రాక్షసులకు అప్పగించింది. వారు అతడి యోగక్షేమాలు కనుక్కొని “నువ్వు మహావీరుడవు. భరతవంశాన్ని ఉద్దరించటానికి పుట్టినవాడివి. పిరికితనంతో ఆత్మహత్యకు ఎందుకు పూనుకున్నావు? ఆత్మహత్య చేసుకునే వాడిని ఈ ప్రపంచం హీనుడిగా పరిగణిస్తుంది. అపకీర్తి కలుగుతుంది. నువ్వు సాధారణ మానవుడివి కాదు. నీ పూర్వ జన్మ వృత్తాతం చెబుతాము. విను.” అంటూ ఇంకా ఇలా చెప్పసాగారు.

“సుయోధనా! ఒకసారి రాక్షసులమైన మేము పరమేశ్వరుడి గురించి గొప్ప తపస్సు చేశాం. మా తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు నిన్ను సృష్టించి మాకు అధినేతగా ప్రసాదించాడు. నీ శరీరం ఎలాంటిదంటే –

“నీదగు పూర్వ దేహము వినిర్మల వజ్ర శిలా విశేష సం
పాదితమస్త్ర శస్త్ర పరిపాటనమభేధ్యము గాదు, నిత్య ని:
ఖేదము పుష్పకోమలము ఖేచర భూచర కామినీ మనో
హ్లాదన మిట్లుగానభవుడర్ధి నొనర్చె నుమాసమేతుడై”
(శ్రీమదాంధ్ర మహాభారతం – అరణ్యపర్వం – షష్టాశ్వాసము నుంచీ)

నీ శరీరంలోని మొదటిభాగం (శిరసు నుంచీ నాభి వరకు) స్వచ్చమైన వజ్రాలతో, గొప్ప పాషాణంతో సమకూర్చబడింది. అస్త్ర శస్త్రాలతో ఖండించటానికి శక్యమైనది కాదు. ఎల్లప్పుడూ ఆనంద తన్మయత్వంతో కూడి ఉండేది, పువ్వులలాగా సుకుమారమైనది. ఆకాశంలో సంచరించే స్త్రీల, భూమిలోని స్త్రీల మనస్సులకు సంతోషం కలిగించేది. ఈ విధంగా ఉండేటట్లు పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ప్రీతితో నిన్ను నిర్మించాడు.

కారణజన్ముడవైన నువ్వు అవతరించటం తోనే నీకు సాయం చేయటానికి అనేక తెగలకు చెందిన రాక్షసులు క్షత్రియ వంశాలలో జన్మించారు. వారంతా గొప్ప పరాక్రమవంతులు, శత్రువులను పారద్రోలగలిగినవారు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు వంటివారు దేవతల మహిమలు పంచుకుని జన్మించినవారు అయినప్పటికీ రాక్షసుల ప్రభావం చేత రాబోయే రోజులలో ఒక మహాయుద్ధంలో కొడుకులు, సోదరులు, శిష్యులు అనే విచక్షణ లేకుండా ఒకరినొకరు చంపుకుంటారు. నువ్వు అర్జునుడిని చూసి కొంత భయపడతావని మాకు తెలుసు. అందుకు విరుగుడు కూడా ఆలోచించాము. శ్రీకృష్ణుడి చేత నరకాసురుడు వధించబడ్డాడు కదా! ఆ నరకాసురుడి అంశ కర్ణుడిలో ప్రవేశిస్తుంది. అప్పుడు కర్ణుడు ఇనుమడించిన ఉత్సాహంతో కృష్ణార్జునులను జయించగలడు.

అంతేకాదు, భూలోకంలో లక్షల కొలది రాక్షసులు సంశప్తకులు అనే పేరు కలవారుగా జన్మించారు. వారు యుద్ధంలో వెనుకంజ వేయని వీరులు. కాబట్టి సుయోధనా! ఎన్ని ఆటంకాలు ఎదురైనా రాబోయే రోజుల్లో ఈ భూమండలం మొత్తం నీ పరిపాలనలోకి వస్తుంది. నువ్వు ఏకచత్రాధిపత్యంగా ఏలుకుంటావు. నువ్వు ఈ విధంగా నిరాశతో ఆత్మహత్యకు పూనుకోవటం న్యాయం కాదు. నీకు విజయం సిద్ధిస్తుంది. ఇంకో ఆలోచన నీ మనసులోకి రానీయవద్దు” అంటూ అనేక విధాలుగా ధైర్యం చెప్పారు రాక్షసులు. దుర్యోధనుడిని సన్మానించి, ప్రేమతో కౌగలించుకుని వీడ్కోలు చెప్పారు. కృత్య అతడిని మళ్ళీ యథాస్థానం లోకి తీసుకువచ్చి విడిచిపెట్టింది.

అది అర్ధరాత్రి సమయం. కర్ణ, దుశ్శాసన, శకుని వంటి వారు అందరూ గాడనిద్రలో ఉన్నారు. దుర్యోధనుడికి మెలకువ వచ్చింది. ఇదంతా కలా, నిజమా అనుకున్నాడు, ఆశ్చర్యపడ్డాడు. ఉత్సాహం వచ్చింది. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు అని నిర్ణయించుకున్నాడు.

తెల్లవారింది. కర్ణుడు వచ్చి “సుయోధన మహారాజా! మరణం ఎప్పుడో ఒకప్పుడు మనుషులు అందరికీ సంభవించేదే! బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే మానవులు గెలుపు వలన లభించే సౌఖ్యాలను పొందగలరు.

“సత్యంతే ప్రతి జానామి వధిష్యామి రణేర్జునం
గతే త్రయోదశే వర్షే సత్యే నాయుధ మాలాభే
ఆనయిష్యామ్యహం పార్ధాన్ వశం తవ జనాధిప”
(వ్యాసభారతం నుంచీ)

పదమూడవ సంవత్సరం గడిచిన తోడనే రణరంగంలో అర్జునుడిని వధించి తీరుతాను. ఇదిగో! ఈ ఆయుధం పట్టి ప్రమాణం చేస్తున్నాను. పాండవులను నీకు వశులుగా చేస్తాను (పూర్వకాలంలో వీరులు ఆయుధం పట్టి ప్రమాణం చేస్తే ప్రాణాలు ఒడ్డి అయినా ఆ ప్రతిజ్ఞ నెరవేర్చేవారు). కాబట్టి ఇది నవ్వు నిర్వేదం చెందవలసిన సమయం కాదు” అంటూ ఓదార్చి దుర్యోధనుడిని ప్రేమతో కౌగలించుకున్నాడు.

ఇటు కర్ణుడు, అటు రాక్షసులు చెప్పిన ప్రోత్సాహవాక్యాలు తలచుకుంటూ ప్రాయోపవేశం విరమించి మంత్రులను పిలిచి ప్రయాణ సన్నాహాలు చేయాల్సిందిగా ఆజ్ఞాపించాడు దుర్యోధనుడు.

ఇదీ జరిగిన విషయం! అయితే కావ్యాలలో రాసింది మొత్తం సినిమాలో చూపించటానికి సాధ్యం కాదు. సినిమా అనేది వినోద ప్రధానమైనది. సామాన్య ప్రేక్షకులకు, పామరులకు సులభంగా అర్ధం అయ్యేటట్లు కొన్ని కల్పనలు చేసి తెరకు ఎక్కిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here