ద్వంద్వాలు

0
11

[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘ద్వంద్వాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]జీ[/dropcap]వితం..

కలిమిలేముల గట్ల మధ్యలో
అపుడపుడు ఆ గట్టునూ
అపుడపుడు ఈ గట్టునూ తాకే
సర్దుబాటు ప్రవాహమై సాగిపోతుంటుంది

సుఖదుఃఖాల సంధ్యలో
చీకటి వెలుగుల దోబూచులాటను
ఉత్సాహాల ఓదార్పుల చితుకులతో
చలిమంట వేసుకుని గమనిస్తూంటుంది

ఆశ నిరాశల గడియారపు గదిలో
అటూ ఇటూ ఊగే లోలకమై
అనుకున్నది అందుకోవాలనే ఆరాటంతో
నిరంతరం కదులుతూనే ఉంటుంది

న్యాయానికి అన్యాయానికి మధ్య
పోరాటానికి నాందీ పలికిన నాటకంలో
గెలుపేదో ఓటమేదో తెలియలేని అంతానికి
రాజీరాగంలో భరతవాక్యం పాడేస్తుంది

తొలి తలుపువద్ద ఊపిరిపోసిన లోకానికి
తుది మలుపువద్ద అదే ఊపిరినప్పజెప్పి
పుచ్చుకున్నదేదీ పట్టుకెళ్ళకుండా
బాకీ చెల్లింపు భద్రంగా చేసి వెళ్ళిపోతుంది

మన నుంచి కనుమరుగవుతూ
మంచీచెడుల రంగుల్లో కుంచెను ముంచి
మనసు కాన్వాసుపై తనను తాను గీసేసి రాసేసి
వీలైనప్పుడల్లా తనగురించి మాటాడుకోమంటుంది

జీవితం అంటే ఇదే కదా..!
ద్వంద్వాల్లో ఇరుక్కున్నదే కదా..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here