ద్యూత సభలో ద్రౌపది ప్రశ్న సబబేనా?

3
9

[శ్రీ ఎం.వి.ఎస్. రంగనాధం గారి ‘ద్యూత సభలో ద్రౌపది ప్రశ్న సబబేనా?’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]మ[/dropcap]హాభారతం లోని సభా పర్వంలో ద్యూత ప్రసక్తి వస్తుంది. ధృతరాష్ట్రుడు విదురుణ్ణి ఇంద్రప్రస్థం పంపి ధర్మరాజాదులని ద్యూతం ఆడడానికి హస్తినకు ఆహ్వానిస్తాడు. వాళ్ళు వచ్చిన తరువాత, ద్యూత సభలో పెద్దలందరి సమక్షంలో, శకుని ఆడతాడు నా తరపున, పందెం మాత్రం నేను కడతాను, అని దుర్యోధనుడు చెబుతాడు. ఆ విధంగా ధర్మరాజు శకుని ఆట మొదలుపెడతారు.

మొత్తం 20 సార్లు పాచికలు వెయ్యడం జరుగుతుంది. అన్ని సార్లూ కూడా శకునియే పాచికలు వేస్తాడు. ముందుగా సకల సంపదలనూ, తరువాత వరుసగా తన తమ్ముళ్ళనూ, ఆ తరువాత తననూ, ఆఖరిగా భార్యయైన ద్రౌపదినీ పందెం ఒడ్డి ధర్మరాజు ఓడిపోతాడు. ఆటకి ముందూ, పది పందేలు వరుసగా ధర్మరాజు ఓడిన తరువాత, విదురుడు కలగజేసుకుని ఆటని ఆపించడానికి తగిన ఉపదేశం చేస్తాడు. దుర్యోధనుడి చేత తిట్లు తింటాడు కాని ఆట కొనసాగుతుంది. 14 పందేలలో ఏ ఒక్క పందెం గెలవకుండా ఉన్నదంతా పోగొట్టుకుంటాడు ధర్మరాజు. ఇక మనుషులే మిగులుతారు. అప్పుడు వరుసగా, 15వ, 16వ, 17వ, 18వ పందేలలో నకులుణ్ణీ, సహదేవుణ్ణీ, అర్జునుణ్ణీ, భీముణ్ణీ ఒడ్డి ఓడిపోతాడు ధర్మరాజు.

18వ పందెంలో భీముణ్ణి గెలుచుకున్న తరువాత, శకుని, నీవు నీ తమ్ముళ్ళని గజాశ్వాదులని ధనాలను కోల్పోయావు, ఇక ఇప్పుడు నీ వద్ద ఓడకుండా మిగిలిన ధనమేదైనా ఉంటే చెప్పు అని ధర్మరాజుతో అంటాడు. అప్పుడు, ధర్మరాజు, నన్నే పందెంగా పెడుతున్నాను, ఒక వేళ నేను ఓడిపోతే సేవకుడి లాగా అన్ని పనులు చేస్తాను, అని అంటాడు.

ఆ విధంగా పందెంలో తనను తానే ఒడ్డి ఓడిపోతాడు ధర్మరాజు. అప్పుడు, శకుని తమాషాయైన మాట ఒకటి అంటాడు. ఇంకా నీ వద్ద ధనం మిగిలి ఉండగా నిన్ను నువ్వు ఓడిపోవడం మహాపాపం అని ధర్మరాజుతో అంటాడు శకుని. ఇంకాస్త రెట్టించి, నీ కిష్టమైన ద్రౌపదిని ఇంకా ఓడలేదు, ఆమెను పందెంగా ఒడ్డు అని శకుని ధర్మరాజుతో మళ్ళీ అంటాడు. శకుని చెప్పినట్లుగానే ధర్మరాజు చేసి పందెం ఓడిపోతాడు. ఇక అప్పుడు, కర్ణుడు దుర్యోధనాదులు విచ్చలవిడిగా ప్రవర్తించడం మొదలు పెడతారు. వాళ్ళ సంతోషానికి పట్టపగ్గాలు ఉండవు.

విదురుణ్ణి ఉద్దేశించి, భవనంలో ఊడవడానికి ద్రౌపదిని తీసుకురమ్మని, దుర్యోధనుడు అంటాడు. దానికి విదురుడు ఆగ్రహించి ద్రౌపది ఎప్పటికీ దాసి కాజాలదు, ఎందుకంటే ధర్మరాజు తాను ముందే ఓడటం వల్ల తరువాత ద్రౌపదిని పందెం పెట్టే అధికారం పొగొట్టుకున్నాడు, కనుక ద్రౌపది ఓడబడ లేదు, అని చెబుతాడు.

విదురుణ్ణి ఛీత్కరించి దుర్యోధనుడు ప్రాతికామి అనే సూతుడికి ద్రౌపదిని పిలుచుకొచ్చే పని అప్పజెబుతాడు. ప్రాతికామి వెళ్ళి చెప్పగానే, ద్రౌపది ఒక ప్రశ్న వేసి సమాధానం ధర్మరాజు నడిగి వచ్చి చెప్పమని ప్రాతికామిని వెనక్కి పంపుతుంది. ఆ ప్రశ్న ఏమిటంటే, నీవు నిన్ను తొలుత ఓడితివా లేక, నన్ను ఓడితివా, అని. ప్రాతికామి సభలో ధర్మరాజుకి ఇది వినిపిస్తే అతడు అచేతనుడై ఉండిపోతాడు కానీ సమాధానం చెప్పడు.

ఆవిణ్ణి (ద్రౌపదిని) ఇక్కడికే వచ్చి ధర్మరాజుని అడగమను, ఆ ప్రశ్న, అతడు దానికి చెప్పే జవాబు సభలోని వారు అందరూ వింటారు అని దుర్యోధనుడు ప్రాతికామిని మళ్ళీ పంపిస్తాడు. అప్పుడు, ద్రౌపది సభకి మళ్ళీ వెళ్ళి కురువంశీయులను నేను ఏమి చెయ్యాలో అడుగు, వాళ్ళు ఎలా చెబితే అలా నేను నడుచుకుంటాను అని అంటుంది. ఆ మాట సభలో ప్రాతికామి చెప్పిన తరువాత కూడా దుర్యోధనుని మొండిపట్టు తెలిసిన వారవడం చేత ఎవరూ నోరెత్తరు. ద్రౌపదిని సభకు తీసుకొనిరా అని మళ్ళీ చెప్పగా ఆమె దగ్గరకు వెళ్ళడానికి భయపడుతున్నట్లు కనిపించిన ప్రాతికామిని వద్దని ఆ పని దుశ్శాసనుడికి అప్పజెప్పాడు, దుర్యోధనుడు. అప్పుడు, దుశ్శాసనుడు ఆమె జుట్టు పట్టుకొని సభలోకి ఈడ్చుకు రావడం, ఆమె రోదించడం, అందరికీ తెలిసిందే.

ద్రౌపది వేసిన ప్రశ్నకి సంబంధించి సభలో జరిగిన వాదోపవాదాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అందరూ చెప్పక ముందే, విదురుడు స్పష్టంగా ధర్మరాజు ముందే ఓడడం వల్ల ద్రౌపది ఓడింపబడలేదు అని చెప్పాడు. భీష్ముడు సమాధానం చెప్పీచెప్పనట్లుగా చెప్పాడు. భీష్ముడు ఏమన్నాడంటే ధర్మస్వరూపము అతి సూక్ష్మము. ఇతరుల ధనం ఎవరూ పందెంలో పెట్టరు. స్వామి కాబట్టే అలా చేశాడు అని అనుకోవాలి. స్త్రీ ఎప్పుడూ తన స్వామికి అధీనురాలే. ధర్మరాజు తాను ఓడినట్లు స్వయంగా చెప్పాడు. అతడు ఎప్పుడూ ధర్మం తప్పడు.

దుర్యోధనుని తమ్ముడు వికర్ణుడు ఏమన్నాడంటే ధర్మరాజు ధూర్తులైన జూదరుల చేత ప్రేరితుడై ద్రౌపదిని పందెం పెట్టాడు. ఆమె కేవలం ధర్మరాజుకి మాత్రమే కాదు, పాండవు లందరికీ భార్య. అదీ కాక, అతడు ముందు తాను ఓడి తరువాత ద్రౌపదిని పందెం పెట్టాడు, అదీ శకుని ప్రోత్సాహం వల్ల. ఇదంతా చూస్తే, ద్రౌపది ఓడబడలేదని అనిపిస్తోంది.

కర్ణుడు ఏమన్నాడంటే “ద్రౌపది ధర్మానుసారం ఓడిందని అనుకోవడం వల్లనే పెద్దలు మిన్నకున్నారు. ధర్మరాజు తన సర్వస్వం పందెం ఒడ్డినప్పుడు ఆ సర్వ ధనములో ద్రౌపది కూడా ఉంది. ధర్మరాజు ద్రౌపదిని పందెం పెట్టినప్పుడు, ఆయన తమ్ముళ్ళు మౌనంతో అంగీకరించారు (acquiescence).”

ఆ తరువాత, సభలో జరిగిన గలాభా, ద్రౌపది వలువలు ఒలవడానికి దుశ్శాసనుడు చేసిన విఫల ప్రయత్నము, కృష్ణలీల అందరికీ తెలిసిందే. అయినా, విషయం తేలలేదు. విదురుడు ప్రహ్లాదోపాఖ్యానంలోని ధర్మప్రసంగము గురించి చెప్పి, మౌనంగా ఉంటే లాభం లేదు, ద్రౌపది ప్రశ్న గురించి మీ అభిప్రాయాలు చెప్పండి అని అందరినీ కోరాడు. భీష్ముడు ధర్మనిర్ణయం చెయ్యడంలో తన అశక్తతను తెలియజేస్తూ, బలవంతులు ఏది ధర్మం అంటే అదే నెగ్గుతుంది, ఇప్పుడు కర్ణదుర్యోధనులు నిర్ణయించిన ధర్మమే అన్నిటి కన్నా పైన ఉంది, అని చెప్పి, ధర్మరాజు ఒక్కడే ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ధర్మం నిర్ణయించడానికి ప్రామాణికుడు అని చెప్పాడు.

విదురుడు తాను అంతకు ముందు చెప్పిన అభిప్రాయమే కొంచెం విడమరచి ఇలా చెప్పాడు ధర్మరాజు తాను ఓడక ముందే ద్రౌపదిని పందెం పెట్టియుండిన యెడల, అప్పుడు అతనికా అధికారం ఉండేది. కాని, తాను ఓడి అతడు పందెం పెట్టే అధికారాన్నే పోగొట్టుకున్నాడు. అనధికారి వేసిన పందెం గురించి గెలుపోటముల ప్రసక్తే అసంగతం.

భీముడు భీషణ ప్రతిజ్ఞలు చెయ్యడం, తరువాత అశుభ సూచకాలు కనిపించడం అయిన తరువాత, చివరకు ధృతరాష్ట్రుడు కలిపించుకుని ద్రౌపదిని వరాలు కోరుకోమనడం, ఆమె మొదట ధర్మరాజుని తరువాత మిగిలిన నలుగురు భర్తలని స్వతంత్రులను చేయమని కోరడం అందరికీ తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆమె తన స్వతంత్రం గురించి ధృతరాష్ట్రుణ్ణి ఏమీ కోరలేదు. కారణం, తాను ఓడబడలేదని తనకు తెలియడం వల్ల.

ఈ మొత్తం వృత్తాంతం పరిశీలిస్తే, విదురుడికి స్పష్టంగా ధర్మం ఏమిటో తెలుసని, శకునేమో ధర్మరాజు తనను తాను ఒడ్డి ఓడిన తరువాత నాలుక కరుచుకున్నంత పని చేశాడని (ధర్మరాజు దగ్గర ద్రౌపది రూపంలో ధనం ఉండగానే తనను తాను ఓడిపోయాడుగా, అందుకని), స్త్రీధనం అంటే కొంతమంది ఉద్దేశ్యంలో స్త్రీ రూపంలో ఉన్న ధనం అని, స్త్రీ ఒకరికి అధీనురాలని ఆమెకు స్వతంత్రమైన ఉనికి (independent existence) లేదని సభలో వ్యక్తమైన అభిప్రాయాలు, మనకి అర్థమవుతాయి. స్త్రీని ధనంగా చూడకూడదు, స్త్రీ దాసియైనా కూడా జూదరి గృహాల్లో ఆమెను ఎవరూ పందెం ఒడ్డరు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమయ్యింది. ధర్మరాజు మౌనానికి అర్థం యజమానికి వ్యతిరేకంగా దాసుడికి (slave) మాట్లాడే స్వతంత్రం లేదని.

విదురుడు చెప్పిన తీర్పుని ఇప్పటి న్యాయశాస్త్రం ప్రకారం ఆలోచిస్తే విషయం చాలా బాగా అర్థం అవుతుంది. మన 1872 కాంట్రాక్టు చట్టం ప్రకారం అనుచిత ఒత్తిడిలో చేసుకున్న కాంట్రాక్టులు చెల్లవు. ఆ చట్టంలోని 16వ సెక్షనులో కాంట్రాక్టులలో అనుచితమైన ఒత్తిడి (undue influence) గురించి చెప్పబడింది. దాని ప్రకారం, కాంట్రాక్టులు కుదుర్చుకొనే రెండు పక్షాలలో ఒక పక్షం వారు రెండో పక్షం వారి ఇచ్ఛ (free will) మీద ప్రాబల్యం కలిగియుండే స్థితిలో ఉండి ఆ స్థితిని అనుచితమైన అనుకూల్యము (undue advantage) పొందడానికి ఉపయోగిస్తే ఆ కాంట్రాక్టు అనుచితమైన ఒత్తిడితో ప్రేరితమైంది అని అంటారు.

దీనికి ఉదాహరణలు చాలా చెప్పవచ్చు. ఒక పోలీసు అధికారి తన కస్టడీలో ఉన్న ముద్దాయి నుండి పది లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తిని ఒక లక్ష రూపాయలకే కొంటే ఆ కాంట్రాక్టు చెల్లదు. ఎందుకంటే, ముద్దాయిని లొంగతీసుకొనే స్థితిలో ఆ అధికారి ఉన్నాడు కాబట్టి. అలాగే, ఒక యజమాని తన నౌకరుతో ఉద్యోగం నుండి తొలగిస్తాం అన్న బెదిరింపు మీద చేసుకునే వేరే ఒప్పందం ఏదీ చెల్లదు. అలాగే, వెంటనే ఆపరేషను చెయ్యాల్సిన పరిస్థితిలో ఉన్న రోగికి వైద్యం నిమిత్తం అయ్యే ఖర్చు కోసం హెచ్చు వడ్డీకి డాక్టరే అప్పు ఇస్తే ఆ కాంట్రాక్టు చెల్లదు. ఇవ్వన్నీ చెల్లుబాటు అయ్యేటట్లు చట్టం ఉంటే జరిగే అన్యాయాలు ఊహించడం కష్టం కాదు.

ధర్మరాజు తాను ఓడిన తరువాత దాసుడు (బానిస) ఐపోయాడు. ఆ తరువాత యజమాని తన దాసుడితో వేసే పందెం ఏదైనా చెల్లదు. దాసుడు పందెం వేసినా అది తన ఇష్టంతో వేసినది అవదు. యజమాని ప్రోద్బలంతో వేసినది అవుతుంది. నిజానికి ధర్మరాజు తాను ఓడిన తరువాత శకుని చెబితేనే ద్రౌపదిని పందెంలో ఒడ్డాడు. అందుకని, అసలు ఆ పందెమే చెల్లదు. ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే, అసలు ద్యూతంలో పాల్గొనడమే ధర్మరాజు తన ఇచ్ఛతో చేసినది కాదు. తన పెద్దరికాన్ని అడ్డుపెట్టుకొని ధృతరాష్ట్రుడు ఆయన మీద బలవంతంగా రుద్దిన ఒక బాధ్యత. అందుచేత, ఆసాంతము ద్యూతంలో అనుచితమైన ఒత్తిడి ధర్మరాజు మీద పనిజేసింది. ఆ కోణంలో చూస్తే, పందేలు ఏవీ కూడా చెల్లవు. ఈ విషయాలు విదురుడు మొత్తుకుంటున్నా కూడా సమర్థించకుండా మౌనంగా ఉండో లేక ఇంకేదో చెప్పో తప్పించుకున్న వాళ్ళందరూ భారత యుద్ధంలో దారుణంగా శిక్షించబడ్డారు.

ఏది ఏమైనా, ఉన్నతమైన స్థితిలో ఉండి ఇతరులనీ వాళ్ళతో తమకున్న బంధాలనీ తమకి అనుగుణంగా మలచుకోవాలని చూసే వాళ్ళు ఎన్ని కాలాలలో ఉన్నా వాళ్ళకి ద్రౌపది వేసిన ప్రశ్న ఒక పెద్ద గుణపాఠం.

Image Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here