ఏమవుతుందో??ఎటుపోతుందో?? ఏమో!-1

    7
    5

    [box type=’note’ fontsize=’16’] డిటెక్టివ్ కథలు, నవలలు అందరూ రాస్తారు. గోళ్ళు కొరుక్కుంటూ చదివేట్టు చేస్తారు రచయితలు. కానీ కుర్చీలోంచి కింద పడి పొర్లుతూ కూడా గోళ్ళు కొరుక్కుంతూ, సస్పెన్స్‌తో గుండెలు అదిరేట్టు హాస్య సస్పెన్స్ రచయన చేయగలిగే ఏకైక రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి అందిస్తున్న హాస్య సస్పెన్స్ డిటెక్టివ్ రచన ‘ఏమవుతుందో? ఎటుపోతుందో? ఏమో!!’. [/box]

    ఎక్కడో దూరాన ఆద్యంతాలకు ఆవల నిశ్శబ్ద నీరవమయి ప్రసరించి ఉత్తేజితమయి ఫెటీలున బద్దలయి శూన్యాన్ని ఛేదించుకుని వేల లక్షల కోట్ల మైళ్ళు ప్రయాణం చేసిన సూర్య కిరణం భూమ్మీదికి చేరి విరిగి ముక్కలయి పరావర్తనం చెంది పైకి లేచి సూటిగా దూసుకుపోయి హైద్రాబాద్ నగరం ఊరి పొలిమేరలో పదవ అంతస్తు మీద నిలబడి చూస్తున్న “అస్తవ్యస్త” మొహాన వున్న చెమట చుక్క మీద పడటం వల్ల ఆ చెమట చుక్క వజ్రంలా మెరిసింది.

    బరువుగా నిట్టూర్చాడు అస్తవ్యస్త. పాతికేళ్ళకే వేల కోట్ల ఆస్తికి వారసుడూ, భారత దేశంలోనే పేరుమోసిన దోమా ఇండస్ట్రీస్ అధినేత అయినా పాపం మనసుకి శాంతి లేదు అతనికి. పనిలో మునిగి తేలుతూ ఉండే అస్తవ్యస్త కాస్త తీరిక దొరికితే పిచ్చి చూపులు చూస్తూ నిట్టూరుస్తూ ఉంటాడు.

    అంతలోనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది అతని సెక్రటరీ “ఆత్రత”. పేరుకి తగ్గట్టే ఆత్రం ఎక్కువ. ఏపని చేసినా ఆత్రాలమారి పెళ్ళికొడుకు అత్తగారి మెడలో పుస్తె కట్టేడు అని సామెత చెప్పినట్లూ చేస్తుంది.

    సెక్రటరీ చేసే అస్తవ్యస్తం పనులు సరి దిద్దుకోటంతోనే సరిపోతుంది అస్తవ్యస్తకి.

    ఆత్రత వచ్చిందంటేనే అతనికి టెన్షన్ వచ్చేస్తుంది. ఆ టెన్షన్ అణుచుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గట్టిగా గాలి పీల్చి వదిలి టెన్షన్ పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుని,

    ”ఏమిటి ఆత్రతా?” అని అడిగాడు.

    “సార్. మీరు చెప్పిన పనులు అన్నీ పూర్తి చేసేసాను. అందరికీ ఇన్విటేషన్ పంపించేసాను. ఫుడ్ కూడా ఆర్డర్ చేసేసాను. రాగానే వెల్‌కం డ్రింక్ ఫ్రూట్ పంచ్. ఆ తర్వాత టీ తో రోస్టెడ్ కాజు, లంచ్‌కి అన్నీ ఇటాలియన్, థాయ్ వంటలు ఆర్డర్ ఇచ్చేసాను. అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను. రిటర్న్ గిఫ్ట్స్‌గా ఊల్లూ రామ్ వాళ్ళ స్వీట్ బాక్స్‌లు. ఇంకాసేపట్లో తెచ్చేస్తారు. ఇంకా ఏమైనా చెయ్యాలా సార్? చెయ్యాలంటే చెప్పండి చేసేస్తాను” అంది ఆరాధనగా అతని వంక చూస్తూ.

    “ఇవన్నీ ఎందుకు చేసావు ఆత్రతా?” అని అడిగాడు తెచ్చిపెట్టుకున్న ఓర్పుతో.

    “అదేవిటి సార్. రేపు బోర్డు మీటింగ్ కదా. మీరే చెప్పారుగా?”

    “చెప్పాను. కానీ ఎప్పుడని చెప్పాను చూసుకో.”

    గాభరాగా చేతుల్లోని డైరీ తిరగేసింది. “మార్చ్ 30 న అన్నారు.”

    “రేపేంటి?”

    “ఫిబ్రవరి 28” చెప్తుంటే ఆత్రత కంఠం వణికింది.

    “ఎన్ని సార్లు చెప్పాను నీకు? కంగారొద్దు. నిదానంగా పనులు చెయ్యి అని. వినవు”

    అప్పటికే ఆత్రత మొహం కందిపోయింది. కళ్ళల్లో నీళ్లు. భోరున ఏడవటం మొదలు పెట్టింది. “సారీ సార్” అంది వెక్కుతూ.

    “పర్వాలేదులే. ఆర్డరిచ్చిన ఫుడ్ మీరు తినండి. స్వీట్ ప్యాకెట్లు మీరంతా తలోటీ ఇంటికి పట్టుకెళ్లండి. రేపు లంచ్ బాక్స్‌లు తెచ్చుకోవద్దని స్టాఫ్‌కి చెప్పు” అన్నాడు హుందాగా .

    “మీరెంత మంచివారు సార్. ఇంకొకళ్ళయితే నేను చేసే పొరబాట్లకి నన్ను జైల్లో పెట్టేవాళ్ళు” అని భోరున ఏడవటం మొదలు పెట్టింది.

    “ఏడుపు ఆపి పని చూసుకో” అనేసి అక్కడినించి వెళ్ళిపోతూ గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగి చూసాడు.

    ఆత్రత అతని వంక చూస్తోంది. ఆ చూపులో భక్తి, ప్రేమ, అనురాగంతో కూడిన ఆరాధన. గోపిక కృష్ణుడిని చూస్తున్నట్లు.

    అస్తవ్యస్త ఆత్రత వంక చూసాడు. ఆ చూపుల్లో జాలి. యజమాని కుక్క పిల్లను చూస్తున్నట్లు.

    అంత ధనవంతుడూ, గొప్పవాడూ అయిన అస్తవ్యస్థ ఆ ఘటాన్ని సెక్రటరీగా భరిస్తున్నాడంటే బలమైన కారణం వుంది.

    అదో పెద్ద కధ.

    ***

    నాలుగేళ్ల క్రిందట అస్తవ్యస్త జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. చుట్టూతా విషమ పరిస్థితుల వలయం.

    అతన్ని చూసి తల్లి లాటి భాగ్యలక్ష్మికి కడుపు తరుక్కుపోయింది.

    ఇంచుమించు పిచ్చెక్కే స్థితికి చేరుకున్నాడు. అతన్ని ఈ పరిస్థితుల నుండి బయట పడేయాలంటే దూరంగా పంపించాలి అనే ఆలోచన కలిగింది. ‘ఏకంగా పెళ్లి చేసి పంపేస్తే ఆ సందట్లో పడి ఈ బాధలు మర్చిపోతాడు. ఒకే దెబ్బకి రెండు పిట్టలు’ అనుకుంది. కాకపొతే పరిస్థితుల రీత్యా ఇదంతా కాస్త రహస్యంగా జరిపించాలి కాబట్టి ఏ పేపర్లోనో వేయించకుండా తెలిసిన వాళ్లకి చెప్పి సరిపెట్టింది.

    ‘మా అబ్బాయికి అర్జంటుగా పెళ్లి చెయ్యాలి, అదీ అర్జంటుగా. గ్రీన్ కార్డు వున్న అమ్మాయి కావాలి. సంబంధం కుదిర్చిన వాళ్లకి మంచి బహుమానం కూడా’ అంది భాగ్యలక్ష్మి.

    ఆ సాయంత్రానికల్లా ఆకుపచ్చ రేషను కార్డు పుచ్చుకుని వచ్చేసింది ఆత్రత. ఆత్రత తండ్రి ఆదినారాయణ పోస్ట్‌మాన్‌గా పని చేస్తున్నాడు .

    కబురు అందగానే ఆ అవకాశం మళ్ళీ ఎవరైనా తన్నుకు పోతారేమో అని ఆఫీసుకే వెళ్లి తండ్రిని తీసుకొచ్చేసింది.

    ఎవరో వచ్చారు అనగానే ఇంట్లోంచీ బయటికి వచ్చింది భాగ్యలక్ష్మి.

    “నమస్కారం. నాపేరు ఆత్రత. ఇదుగో మా నాన్న. ఇదుగో మా ఆకుపచ్చ రేషన్ కార్డు” అంది గబా గబా.

    భాగ్యలక్ష్మికి ముందు అసలేమీ అర్థం కాలేదు. అర్థం అయ్యాక బుర్ర గిర్రున తిరిగింది. నోట మాట రాలేదు. అంతలోనే అటుగా వచ్చాడు అస్తవ్యస్త.

    “అమ్మా. నా మనసేం బాగాలేదు. కాసేపు నా గదిలో తలుపులేసుకుని కూచుంటాను. నువ్వేం గాభరా పడకు. తలుపులు బాదకు” అనేసి వెళ్ళిపోయాడు.

     గ్రీకు శిల్పం లాగా వున్న అతడిని చూసి ఆత్రత మూర్ఛ పోయినంత పని చేసింది.

    “ఈయనేనా పెళ్ళికొడుకు?” అంది.

    “అవును వీడే” అంది భాగ్యలక్ష్మి

    “అవునా. మరి ఎందుకూ ఆలస్యం. ఆకు పచ్చ కార్డు వున్న అమ్మాయి కావాలన్నారు. వచ్చేశాను. ఆయన చేత నా మెళ్ళో పసుపు తాడు కట్టించేసెయ్యండి” అంది కంగారుగా

    అప్పటికి కాస్త తేరుకున్న భాగ్యలక్ష్మి విషయం వివరించి చెప్పింది .

    ఆవిడకి కావాల్సింది ఇండియాలో ఆకుపచ్చ రేషన్ కార్డున్న అమ్మాయి కాదనీ, అమెరికాలో గ్రీన్ కార్డు వున్న అమ్మాయనీ తెలుసుకుని భోరున ఏడిచింది ఆత్రత. ఏడుస్తూనే ఇంటికి వెళ్ళింది.

    ఏడుస్తూనే గుప్పెడన్నము తిని పడుకుంది గానీ నిద్ర పట్టలేదు.

    కళ్ళ ముందు ఆ అందగాడే కదలాడుతున్నాడు. వదలకూడదు. కాళ్ళ మీద పడి వేడుకోవాలి. అతనొప్పుకోక పోతే ఉరేసుకుని చచ్చిపోవాలి అని నిర్ణయించుకుంది.

    వెంటనే, లేచి ఓ కాయితం మీద తన మనసులోని ఆవేదన అంటా రాసి సూసైడ్ నోట్ తయారు చేసి కింద పక్కాగా సంతకం పెట్టి ఓ కవర్లో పెట్టి అప్పుడు నిద్ర పోయింది.

    తెల్లారి లేచాక ఓ అనుమానం వచ్చింది. అసలే అగ్గిపెట్టేంత ఇల్లు. అందులోనూ నాన్న పోస్టుమాను. ఈ వుత్తరం ఆయన కళ్ళ పడితే ఎవరికో ఒకళ్ళకి డెలివర్ చేసిగానీ ఊరుకోడు. వాళ్ళ పొరుగున వెంకటస్వామి అని ఒకతను వున్నాడు. వృత్తి రీత్యా పోలీసు కానిస్టేబుల్ .

    చనువుగా బాబాయ్ అని పిలుస్తుంది అతన్ని.

    ఆ వుత్తరం అతని చేతికి ఇచ్చి “బాబాయ్. నేను చచ్చిపోతే ఈ ఉత్తరం మా వాళ్లకి ఇవ్వు”

    పోలీసు వుద్యోగం కాబట్టి చావంటే భయం లేదతనికి.

    “సరే ఎప్పుడు చచ్చిపోతావ్?” అన్నాడు తాపీగా టీ తాగుతూ.

    “ఇప్పుడే చెప్పలేను. చచ్చిపోతానని కూడా ఖచ్చితంగా చెప్పలేను. చచ్చేదాకా ఈ కవరు ఓపెన్ చెయ్యకు. అలా చేస్తే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు” అంది.

    అలాగే అన్నాడు .

    పోలీసు వుద్యోగం కాబట్టి ఆలాటి సెంటిమెంట్లు ఏమీ లేవు. ఆత్రత అటు వెళ్ళగానే కవరు విప్పి చదివాడు.

    అతని మనసులో ఓ మెరుపు లాటి ఆలోచన.

    విధి విచిత్రమైనది. ఎప్పుడే నాటకం ఆడుతుందో ఎవరూ చెప్పలేరు. లేకపోతే ఎక్కడి అస్తవ్యస్త? ఎక్కడ వెంకట స్వామీ?

    ఇతని బుర్ర లోని ఆలోచన అతని జీవితాన్ని అనూహ్యంగా మలుపు తిప్పుతుందని ఎవరైనా ఊహించగలరా?

    అదెలా జరిగిందంటే??????

    (… వచ్చే సంచికలో, ఏమవుతుందో.?.. ఎటుపోతుందో??)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here