ఏమవుతుందో… ఎటుపోతుందో… ఏమో! -11

0
9

[box type=’note’ fontsize=’16’] హాస్యమూ, సస్పెన్స్ మేళవించి పొత్తూరి విజయలక్ష్మి అందిస్తున్న డిటెక్టివ్ రచన ‘ఏమవుతుందో? ఎటుపోతుందో? ఏమో!!’ పదకొండవ భాగం. [/box]

[dropcap]కా[/dropcap]రు నుండీ వినాష్‌ను బయటకు లాగిన జంబూక అతను అతి దీన స్థితిలో వున్నాడు అని గమనించింది.

నల్ల రాతి శిల్పం లాగా పొడుగ్గా సన్నగా చువ్వ లాగా వుంది జంబూక. అడవుల్లో మారుమూల ప్రాంతాల్లో నివసించే ఆ తెగ వారు శారీరకంగా చాలా బలవంతులు. ఎంత దూరమైనా సునాయాసంగా నడుస్తారు. అవసరం వస్తే ఆయుధాలు లేకుండానే ఒట్టి చేతులతో తమ మీద దాడి చేసిన జంతువులను చంపేస్తారు.

చీమ తన శరీరానికి మించిన భారం మోసినట్లు ఎంత బరువైనా అవలీలగా మోసేస్తారు. వినాష్‌ను పిల్లాడికి మల్లే భుజాన వేసుకుని తమ గూడెం వైపు నడక సాగించింది జంబూక.

కొంత దూరం వెళ్లేసరికి జంబూక తండ్రి దారిమి కొందరు మనుషులతో ఎదురయ్యాడు. కూతురు ‘అహహ్హయో’ అని పెట్టిన కేకలు విని అటు వచ్చాడు.

కూతుర్ని, భుజాన వున్న ఆ శాల్తీని చూశాడు.

“కేసీ కిసీ?” అని అడిగాడు.

“కిసీ ఆసీ పీసి” అంది జంబూక దీనంగా.

“మెసీ ఓసీ, తాసీ” అన్నాడు కూతురికి ధైర్యం కలిగించేలా.

వెంట వున్న మనుషులు వినాష్‌ని పల్లకీ ఎత్తినట్లు ఎత్తి తీసుకుపోయారు. వాళ్ళ గుడిసెలో పడుకోబెట్టారు. గొంతులో మేక పాలు పోశారు. తరువాత కాస్త ఇప్ప సారా లాటిది పోశారు.

అది తాగి ఓ పగలు, ఓ రాత్రీ ఒళ్ళు తెలీకుండా నిద్ర పోయాడు.

***

అక్కడ శాంత కుమార్‌కి కంటి మీద కునుకు లేదు. కొడుకు జాడ తెలియటం లేదు. వెతికిద్దామంటే మార్గం కనిపించటం లేదు. పోలీసులు చేతులు ఎత్తేశారు.

“ఎక్కడ ఉన్నాడో ఊహా మాత్రంగానైనా తెలియక పోతే ఎట్లా కనిపెడతాం. అడివిలో చిక్కుకు పొయాడు. ఆ అడవులు మన రాష్ట్రంలో వున్నాయా ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయో కూడా తెలియటం లేదు. భగవంతుని మీద భారం వేసి ఊరుకోండి” అన్నారు జాలిగా.

యజమాని బాధ చూసి భరించలేకపోతున్నాడు కొండలరావు. వినాష్ ఏదో వెధవ పని చేసి ‘కొండలరావు కొంప మునిగింది’ అంటూ ఫోన్ చేసి విసుగు తెప్పించిన మాట నిజమే.

‘ఈ కుర్రాడు కాస్త తిన్నగా వుండేలా చూడు స్వామీ’ అని దణ్ణం పెట్టుకున్నాడు గానీ ఈ విధంగా అతా, పతా లేకుండా పోవాలని అనుకోలేదు.

ఏమైనా జరగరానిది జరిగితే శాంత కుమార్ గుండె ఆగిపోతుంది. ఏం చెయ్యాలో తోచక సతమతం అవసాగాడు.

***

అక్కడ వినాష్‌కి స్పృహ వచ్చింది. ఒక్క క్షణం అంతా అయోమయంగా అనిపించింది. మెల్లిగా జరిగింది అంతా గుర్తుకి వచ్చింది.

తను కార్లో లేడు. అంటే ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదేదో కొత్త చోటు. ‘ఎక్కడ వున్నాను’ అని చుట్టూ చూశాడు.

అప్పుడే లోపలికి వచ్చింది జంబూక.

కళ్ళు విప్పి మంచం మీద కూచున్న వినాష్‌ని చూసి ఆనందం పట్టలేక “యాంగిరి బారో, యాంగిరి బారో” అని అరిచింది.

ఆ ఆకారాన్ని చూసేసరికి, ఆ అరుపు వినే సరికి వినాష్‌కి గుండె దడ దడలాడింది.

జంబూక అరుపు విని దారిమి, అతని భార్య కటిక, ఇంకొంతమంది పరుగున వచ్చారు.

అతన్ని చూసి ఆనందంతో “యాంగిరి బారా, యాంగిరి బారా” అని అరిచారు

వినాష్‌కి ఏడుపు వచ్చింది. ‘బతికి వున్నానని ఆనందపడ్డాను. ఎక్కడ బతికున్నాను నా బొంద. చచ్చి నరకానికి వచ్చాను. వీళ్ళు యమ భటులు’ అనుకున్నాడు.

వాళ్ళు చాలా సంతోషంగా డాన్సు చేశారు. ‘కారీస, కీస జాస్మి’ అని పలకరించారు.

వాళ్ళ ఆకారాలు, భాష అంతా అయోమయంగా వుంది. స్నేహంగా వున్నారు. కాబట్టి యమకింకరులు కాదేమో అని కాస్త ఆశ కలిగింది. జేబులు తడుముకుని మొబైల్ బయటకు తీసాడు.

అది వారికి చూపించి ‘ఛార్జర్ వుందా’ అని అడిగాడు.

దాన్ని అందుకుని అందరూ గుంపుగా కూచుని పరీక్షగా చూశారు. వాళ్ళకి కోపం వచ్చింది.

దాన్ని రాతితో కొట్టి ముక్కలు చేసి వాటన్నింటినీ గుంట తవ్వి అందులో పాతి పెట్టారు.

లబోదిబోమని ఏడిచాడు వినాష్.

“ఓరి మీ అమ్మా కడుపులు మాడా” అని బ్రహ్మానందం లాగా నెత్తి బాదుకున్నాడు.

అతని ఏడుపు చూసి జంబూక కూడా ఏడవడం మొదలు పెట్టింది. దారిమి, కటిక కూడా ఏడవడం మొదలు పెట్టారు.

ఓ వృద్దుడు ‘క్రాష్ట’ అని ఓదార్చాడు. ‘జజ్జం, ‘ఆస్థి’ అని వెళ్లి కాసేపటికి తిరిగి వచ్చాడు.

ఏవో ఆకులు పట్టుకు వచ్చి ఇచ్చాడు. నలుగురు వ్యక్తులు అవి నూరి పసరు తీశారు.

వినాష్ ఒంటికి పట్టించారు.

“ఏం చేస్తున్నారు రా? మీరు మనుషులా, యమభటులా? నేను బతికున్నానా? చచ్చిపోయానా?” అని ఏడిచాడు.

మళ్ళీ గొంతులో ఇప్ప సారా లాంటిది పోశారు. మళ్ళీ ఒళ్ళు ఎరక్కుండా పడుకున్నాడు.

***

కొండలరావుకి మనసులో బాధ పెరిగి పోతోంది.

ఇలా అయితే శాంత కుమార్ బతకడు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఒక దారి దొరికింది. అస్తవ్యస్త. అతనికి అలాటి ఆటోమాటిక్ కారు వుంది. అతన్ని అడిగితే ఏమైనా సాయం చేస్తాడేమో. కానీ అంతలోనే సందేహం. వినాష్ అస్తవ్యస్తకి పరమ శత్రువు. సాయం చేస్తాడా? ‘పోనీ అడిగి చూద్దాం’ అని వెళ్ళాడు.

అస్తవ్యస్త ఉత్తముడు. విషయం వినగానే “అలాగా. అయ్యో పాపం. నేను కూడా ప్రయత్నం చేస్తా” అన్నాడు.

అలాగే నలుగురికీ ఫోన్లు చేసి మాట్లాడాడు. అస్తవ్యస్త కార్‌లో ఒక సదుపాయం వుంది. వినాష్ కారు లోనూ వుందే వుంటుంది. అలా వుంటే ఈ కారు ఆకారు ఆచూకీ కనిపెట్టగలదు.

వెంటనే తన కారులో శాంత కుమార్‌నీ, కొండలరావునీ తీసుకుని బయలుదేరాడు. కొండల రావు చెప్పిన  విషయాలను ఆధారం చేసుకుని అడవి దిక్కుగా వెళ్ళాడు. కాస్త శ్రమ పడ్డాక వినాష్ కారు ఆచుకి తెలిసింది.

(తరువాత కధ మళ్ళీ).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here