ఏమవుతుందో… ఎటుపోతుందో… ఏమో! -14

0
9

[box type=’note’ fontsize=’16’] హాస్యమూ, సస్పెన్స్ మేళవించి పొత్తూరి విజయలక్ష్మి అందిస్తున్న డిటెక్టివ్ రచన ‘ఏమవుతుందో? ఎటుపోతుందో? ఏమో!!‘ పద్నాలుగవ భాగం. [/box]

[dropcap]అ[/dropcap]స్తవ్యస్త, డోలాయ నాలుగు రోజులు అతిథి మర్యాదలు స్వీకరించాక, తమ ఆలోచన బయట పెట్టారు. ప్రకృతి ప్రేమికులు వారు. ప్రకృతి తల్లికి హాని కలిగంచకుండా లాభం పొందటమే వారి ఆశయం. అడవి మూలికలతో చవగ్గా జనానికి మందులు తయారు చేసి ఇవ్వటం అనే ఆలోచనే వాళ్లకి గొప్పగా అనిపించింది వాళ్లకి. ఆనందంగా ‘మీకు సాయం చేస్తాం’ అన్నారు. అందరూ కలిసి కొత్త వనమూలికల కోసం వెతకటం మొదలు పెట్టారు.

సమాజం చాలా చిత్రమైనది. అన్ని మనస్తత్వాలు గలవారూ వుంటారు ఇక్కడ. ఎవరికి కావలసిన వారు వారికి దొరుకుతారు. అస్తవ్యస్తకి సాయం చెయ్యడానికి మంచివాళ్ళు దొరికినట్లే వినాష్‌కి కూడా సాయం చెయ్యటానికి ఓ కుటిల మనస్తత్వం గల వ్యక్తి దొరికాడు. శాంతకుమార్ డ్రైవర్ గుండు. అతని పేరు ఏదో వుంది గానీ గుండు అనే పిలుస్తారు.

అసలు తెలివి తేటలు అంతగా లేకపోయినా, అతి తెలివి తేటలు పుష్కలంగా ఉన్నాయి. అతడిని పట్టుకున్నాడు వినాష్.

“ఎలాగైనా నన్ను ఈ ఆపద నుండి గట్టెక్కించావంటే నిన్ను కోటీశ్వరుడిని చేస్తాను. పోష్ ఏరియాలో మంచి ఇల్లు, కారు, నెలకు ఇంత అని నికరాదాయం ఏర్పాటు చేస్తాను” అని ప్రలోభ పెట్టాడు.

గుండుకి ఆశ పుట్టింది. అలాగే అన్నాడు. అతనికి కొద్దిగా కోయ భాష వచ్చు. సోనియా గాంధీ హిందీ మాట్లాడినట్లు మాట్లాడతాడు.

“నేను మాంచి ఉపాయం ఆలోచించి మిమ్మల్ని అపాయం నుంచి తప్పిస్తాను” అన్నాడు. ఆనందించాడు వినాష్.

తాము అక్కడ వుండి చేసేది ఏమీ లేదు కాబట్టి శాంతకుమార్, కొండలరావు అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. వెళ్లే ముందు అస్తవ్యస్త సాయంతో వియ్యంకుడితో మాట్లాడి కొన్ని కోరికలు కోరుకున్నాడు.

కొడుక్కి ఒక సెల్ ఫోన్, ఒక కారు వాడుకునే అవకాశం కల్పించమని అడిగాడు.

అస్తవ్యస్త వాళ్లకి నచ్చచెప్పి “అవి ఏమీ ప్రమాదం లేని వస్తువులు, మీ అల్లుడికి అవి అంటే చాలా ఇష్టం” అని మర్యాదగా చెప్పాడు. దాడిమి ఒప్పుకున్నాడు .

తన మొబైల్ కొడుక్కి ఇచ్చి కారుని, గుండుని అక్కడే వదిలి టాక్సీ ఎక్కాడు శాంత కుమార్. కూడా కొండలరావు వున్నాడు.

కొడుకుని అడవిలో వదిలి వెళ్తుంటే దుఃఖం ఆగలేదు.

“విధి లిఖితం. మహా మహా వాళ్ళకే తప్పలేదు. దశరథ మహారాజు తెల్లారి కొడుక్కి పట్టాభిషేకం అనుకునీ ఆనందపడి అదే ముహూర్తానికి కొడుకు అడవులకి వెళ్ళటం చూడలేదా. ఇదీ అంతే. మనసు గట్టి చేసుకోండి” అని ఓదార్చాడు కొండలరావు.

పైకి చెప్పకపోయినా వినాష్ వివాహం విషయంలో ఆనందించిన వ్యక్తి కొండలరావు ఒక్కడే. ఆ వినాష్‌తో కొండలరావు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడు ఏ గొడవ తెచ్చి పెడతాడో అని ఎప్పుడూ టెన్షన్. పక్కలో బల్లెంలా ఉండేవాడు. అతని పెళ్లి జరిగి అతని బాధ్యత జంబూక తీసుకున్న తర్వాత కొండలరావు ప్రాణం నిశ్చింతగా ఉంది. కొంత కాలం పాటు అడవిలో వుంటే పూర్తిగా బాగుపడతాడు అనుకున్నాడు.

అక్కడ గుండు తన ప్రయత్నం ప్రారంభించాడు. వినాష్‌తో చర్చించాడు.

ఫోను, కారు వచ్చే సరికి వినాష్‌కి ధైర్యం వచ్చింది. అవసరమైతే కార్లో పారిపోవచ్చు. ఎంత బలవంతురాలు అయినా జంబూక కారు వెనక పరిగెత్తుకుంటూ రాలేదు.

ఇంకొన్నాళ్ళకి మళ్లీ ఆ పర్వదినం వస్తుంది. ఆ సమయంలో ఎట్లాగైనా ఓ అడవి పిల్లను అస్తవ్యస్త కనుక కావలించుకొనేలాగా చెయ్యగలిగితే తను జంబూకని వివాహం చేసుకున్నట్లు అస్తవ్యస్త డోలాయను వదిలి చచ్చినట్లు ఆ అడవి పిల్లను పెళ్లి చేసుకుని తనలాగే ఈ అడవి వాళ్లకి అల్లుడై పోతాడు.

ఇది మొదటి భాగం. ఇది ఏ ఆటంకం లేకుండా పూర్తి చేసిన తర్వాత మళ్లీ పటిష్టంగా ప్లాన్ వేసి జంబూక అడ్డు తొలగించుకుని ఆ తర్వాత డోలాయ మనసు గెలుచుకుని… అని ఏవేవో ప్లాన్లు వేశాడు.

గుండు ఓ ఫ్రెండ్‌ను సంపాదించాడు. వాడి పేరు కురుమ. సిగరెట్లు, విదేశీ మద్యం ఇచ్చి వాడిని మచ్చిక చేసుకున్నాడు. వాడి సాయంతో అన్నీ సిద్ధం చేశాడు.

ఒక నిర్జన ప్రదేశంలో నిలువెత్తు గొయ్యి తీసి అక్కడ గొయ్యి వున్నది అని తెలియకుండా పైన ఆకులు కప్పిపెడతారు. పెళ్లి కాని వారు జీవిత భాగస్వామిని వెతుక్కునే ఆ విశేషమైన రోజున విలువైన వన మూలికలు వున్నాయి అని చెప్పి అస్తవ్యస్తను అక్కడికి తీసుకు వెళ్తాడు కురుమ. అతను గోతిలో పడేలా చేస్తాడు. అస్తవ్యస్త గోతిలో పడి ఆర్తనాదాలు చేస్తాడు. అటుగా వచ్చిన ఏ ఆడపిల్లో అతడిని బయటికి తీస్తుంది. ఆ సమయంలో అస్తవ్యస్త ఆ పిల్లను అప్రయత్నంగా కావలించుకుంటాడు. ఇక ఆ తర్వాత వివాహం.

“మరి ఆ సమయంలో ఆడపిల్లే అటు వస్తుందని ఏమిటి నమ్మకం? మగవాళ్ళు రావచ్చుగా” అన్నాడు గుండు.

“అలా కాకుండా నేను చూసుకుంటా” అని హామీ ఇచ్చాడు కురుమ.

 అందరూ ఆ సమయం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది.

ప్లాన్ ప్రకారం కురుమ గొయ్యి తవ్వించి మిగిలిన ఏర్పాట్లు కూడా చేసేసి ఇక అమలు పరచటానికి పూనుకున్నాడు. అస్తవ్యస్త దగ్గరకు వెళ్ళాడు.

“ఓ గొప్ప మూలిక ఆచూకి దొరికింది. దానితో గుళికలు తయారు చేసి సేవిస్తే వార్థక్యం జాడలు కనిపించవు. యెనభై ఏళ్లు వచ్చినా పళ్ళు వూడవు. జుట్టు రాలదు. చర్మం ముడతలు పడదు. ఇంతవరకు మీరు కనిపెట్టినవన్నీ ఒక ఎత్తు. ఇది ఒక్కటీ ఒక ఎత్తు” అన్నాడు.

ఆవేళ అస్తవ్యస్త కాస్త నలతగా వున్నాడు. ఒళ్ళు నెప్పులు, జలుబు భారం. అయినా కురుమ మాట వినగానే బయలుదేరాడు. డోలాయ వారించింది.

“ఇవ్వాళ వాళ్ళ స్వయంవరం పండగ హడావిడి వుంది. నీకూ ఆరోగ్యం బాగాలేదు. ఇవాల్టికి విశ్రాంతి తీసుకుని రేపు వెళ్దాం” అంది.

ప్రాణం పోయినా డోలాయ మాట కాదనడు అస్తవ్యస్త. వెంటనే ఆ ప్రయత్నం విరమించుకుని సుఖంగా పడుకున్నాడు.

వూహించని సంఘటన ఎదురయ్యేసరికి కంగారు పడ్డాడు కురుమ. వెంటనే వెళ్ళి వినాష్‌కి ఈ మాట చెప్పాలి అనుకుని అక్కడి నుండి వెళ్ళబోతుంటే అక్కడికి వచ్చింది జంబూక. అతన్ని ఆపేసింది.

“అన్నకు ఒళ్ళు పట్టు” అని ఆజ్ఞాపించింది. కురుమ ఇరుక్కు పోయాడు.

అక్కడ వినాష్‌కి ఒకటే కంగారు. అస్తవ్యస్త ఎట్లా గోతిలో పడతాడో, ఆ తరువాత ఘట్టం ఎలా జరుగుతుందో చూడాలి అని కుతూహలం అతడిని నిలవనివ్వలేదు. గుండుని వెంట బెట్టుకుని బయలుదేరాడు.

ఆ చోటుకి వెళ్ళాడు. అసలే అడివి. ఎక్కడ ఏం వుందో అక్కడి వాళ్ళకే తెలియాలి.

“ఏదీ గొయ్యి. ఏడీ అస్తవ్యస్త! ఈ కురుమ గాడు ఏడీ?” అని గాభరాగా తిరగేస్తూ దభీమని గోతిలో పడిపోయాడు వినాష్. అది చూసి గుండు ఒకటే ఏడుపు. “అదేవిటి సార్. మీరు పడిపోయారు” అని గుండెలు బాదుకుంటూ వుంటే వినాష్ మండిపడ్డాడు.

 “ఏడుపు ఆపి నన్ను బయటికి లాగు” అన్నాడు.

“నాకు చేతకాదు. మిమ్మల్ని తియ్యబోతే నేనూ గోతిలో పడిపోతాను” అన్నాడు ఇంకా పెద్దగా ఏడుస్తూ.

“అయితే ఎవరినైనా పిల్చి ఏడు” అన్నాడు వినాష్.

 మనిషి కోసం వెతకటం మొదలు పెట్టాడు గుండు. ఆ ప్రాంతంలోనే తిరుగుతోంది ఓ అమ్మాయి. తన పేరు డింభ.

“నువ్వు అటు వైపు వెళ్లు. నీకు మంచి మొగుడు దొరుకుతాడు” అని కురుమ చెప్పితే అటు వచ్చింది.

 గుండుకి ఆ సమయంలో పండగ స్వయంవరం వగైరా విషయాలు ఏవీ గుర్తు లేవు. వినాష్‌ను కాపాడటమే అతని ఏకైక లక్ష్యం. అందుకే డింభ కనిపించగానే చేతులు జాపి “దేవుడు పంపించాడు నిన్ను” అంటూ పరుగున వెళ్ళాడు.

తన అన్వేషణ ఫలించింది అని ఆనందంతో అతన్ని ఆలింగనం చేసుకుని ‘జింబిరి బారే, జింబీరి బారె’ అని కేకలు పెట్టింది డింభ.

(తరువాత కధ మళ్ళీ).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here