ఏమవుతుందో?? ఎటుపోతుందో??ఏమో??-3

    1
    3

    [box type=’note’ fontsize=’16’] డిటెక్టివ్ కథలు, నవలలు అందరూ రాస్తారు. గోళ్ళు కొరుక్కుంటూ చదివేట్టు చేస్తారు రచయితలు. కానీ కుర్చీ లోంచి కింద పడి పొర్లుతూ కూడా గోళ్ళు కొరుక్కుంటూ, సస్పెన్స్‌తో గుండెలు అదిరేట్టు హాస్య సస్పెన్స్ రచన చేయగల ఏకైక రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి అందిస్తున్న హాస్య డిటెక్టివ్ రచన “ఏమవుతుందో??ఎటుపోతుందో??ఏమో??” మూడవ భాగం ఇది. [/box]

    [dropcap]రై[/dropcap]లు వెళ్ళిపోయింది. భగీరథ, అస్తవ్యస్త మిగిలారు.

    “చెప్పు నాయనా. ఇంత చిన్న వయసులో ఆత్మహత్య చేసుకుందామనుకున్నావా? ఎందుకూ?” అడిగాడు భగీరథ.

    “జీవితం మీద విరక్తి వచ్చేసి” అన్నాడు అస్తవ్యస్త.

    “వివరంగా చెప్పు నాయనా?”

    తన కథ అంతా చెప్పాడు అస్తవ్యస్త. భగీరథ మొహం వెలిగిపోయింది. “నీలాటి వ్యక్తే నాకు కావాలి పద” అన్నాడు.

    ఇద్దరూ ఇంటికి వెళ్లారు. భాగ్యలక్ష్మి తలుపు తీసింది.

    “ఎవరన్నయ్యా ఇతను?” అంది

    “నా బిడ్డ లాటివాడు. ఇక నుండీ మనతోనే వుంటాడు” అన్నాడు.

    ఆవిడ మోహంలో రంగులు మారాయి. ఇప్పటికే ఇద్దరు. మరొకడు తోడయ్యాడు. ‘ఎట్లారా దేవుడా’ అనుకుంది.

    అది గమనించాడు భగీరథ. “భయపడకు అమ్మాయి. ఇతగాడు మా ఇద్దరిలాగా కాదు. బోలెడంత సంపాదిస్తాడు. నీ కష్టాలు త్వరలోనే గట్టెక్కుతాయి” అన్నాడు. కళతప్పిన ఆవిడ మొహంలోకి ఆనందం వచ్చింది.

    ఆవిడ భర్త గౌరీనాథ శాస్త్రి. గొప్ప పండితుడు. జ్యోతిష్యంలో దిట్ట. కానీ డబ్బులు పుచ్చుకోడు. అలా పుచ్చుకుంటే నీ విద్య పనిచేయదు అని ఆయనకు విద్య నేర్పిన గురువుగారు చెప్పారుట. అందుకని ఎవరైనా వాళ్ళంతట వాళ్ళు ఇస్తే పుచ్చుకోటమే తప్ప అడగడు.

    అడగని వాళ్లకు ఇచ్చే అలవాటు మనదేశంలో లేదు. ఇచ్చినా త్రుణమో పణమో అంతే.

    కొన్నాళ్ల కిందట తన జాతకం చూసుకుని “భాగ్యం, నాకు పాము గండం వుంది. తప్పే సూచనలూ కనిపిస్తున్నాయి కాబట్టి మనం కాస్త జాగర్తగా ఉండాలి” అన్నాడు.

    ఆవిడ బెదిరిపోయి ఆయన్ని మంచం దిగకుండా కనిపెట్టుకుని వుంది. రోజంతా మహా మృత్యుంజయ మంత్రం చదువుతూనే వుంది.

    ఆ వేళ తెల్లవారుజామున లాంతరు వెలుగులో గోడ దగ్గర పడున్న నల్లటి పదార్ధాన్ని చూసి “భాగ్యం, ఇదుగో నీ సవరం. మళ్ళీ వెతుక్కుంటావు” అంటూ తీసి ఇవ్వబోయాడు. అది సవరం కాదు నల్ల నాగు. కాటేసింది.

    ఇంకేముంది లబోదిబోమంటూ ఏడిచారు దంపతులు.

    బయట వాళ్ళ అరుగు మీద పడుకుని నిద్ర పోతున్న భగీరథ నిద్ర లేచి పరుగున లోపలి వెళ్ళాడు. పరిస్థితి చూసి చేతి సంచీలోంచీ మూలికలు తీసి వైద్యం చేసేశాడు.

    పోతున్న ప్రాణం తిరిగొచ్చింది.

    భాగ్యలక్ష్మి ఆయన కాళ్ళమీద పడిపోయింది. “ఎవరు మీరు” అని అడిగాడు శాస్త్రి.

    “దేశదిమ్మరిని. ఇల్లూ వాకిలీ లేదు. ఎక్కడో తిని ఎక్కడో పడుకుంటాను. అట్లాగే రాత్రి మీ అరుగు మీద పడుకున్నాను” అన్నాడు.

    “మా పాలిట దైవం మీరు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం” అంటూ తన చేతికున్న ఉంగరం తీసి ఇవ్వబోయాడు శాస్త్రి.

    “అలా పుచ్చుకొను. డబ్బు తీసుకుంటే పనిచేయదు విద్య అని మా గురువుగారు చెప్పారు”  అన్నాడు భగీరథ.

    “అట్లా అయితే రెండు రోజులు మా ఇంట్లో వుండి వెళ్ళండి” అని బలవంతం చేశారు ఆ దంపతులు.

    ఆ రాత్రి తన గతం అంతా చెప్పాడు భగీరథ.

    చిన్నతనం నుండి పసరు వైద్యం మూలికా వైద్యం నేర్చుకున్నాడు. ఆయనకీ ఒక్కడే కొడుకు చిన్నప్పుడే భార్య పోతే ప్రాణంగా పెంచుకున్నాడు. ఖర్మ కాలి అతనికి బోదకాలు వచ్చింది.

    పెళ్లీడు వచ్చినా ఎవరూ పిల్లనివ్వలేదు. ఆలా గడుస్తుండగానే అతనికి మలేరియా వచ్చింది. సమయానికి భగీరథ వూళ్ళో లేకపోవటంతో అతను వైద్యం చేయించుకోలేదు. చనిపోయాడు. కొడుకు మరణం భగీరథను క్రుంగదీసింది.

    ఇల్లూ వాకిలి వదిలేసి దేశదిమ్మరిగా మారిపోయాడు. కొంతకాలం అలా తిరిగాక అతనిలో కసి రేగింది. దోమలను సర్వనాశనం చెయ్యాలి. అందుకోసం ఏదైనా వైద్యం కనిపెట్టాలి. శాస్త్రి గారి వూరికి దగ్గరలో ఓ అడవి వుంది. అందులో చాలా ఔషధ గుణాలు కలిగిన మొక్కలున్నాయి. అందుకే వచ్చాడు.

    అంతా విని బాధ పడ్డారు దంపతులు. “మా ఇంట్లోనే వుండండి. ఇది మీ తమ్ముడి ఇల్లు అనుకోండి” అని బలవంత పెట్టి వుంచేసారు.

    రెండేళ్లు గడిచాయి. అడవుల వెంట తిరుగుతూనే వున్నాడు భగీరథ. ఓ మొక్క దొరికింది ఇంకా కొన్ని కలిపి తయారు చెయ్యాలి. కానీ ఆయనకీ ఓపిక తగ్గిపోతోంది. చేతిలో ఎవరైనా కుర్రాడుంటే బాగుండు అని వెతకటం మొదలు పెట్టాడు.

    ఉద్యోగం అయితే చేస్తారు గానీ సహాయం ఏ కుర్రాడు చేస్తాడు?

    “నిరాశ పడకు బావా? నీకు మంచిరోజులొస్తున్నాయి” అని శాస్త్రి ధైర్యం చెప్తూనే వున్నాడు.

    ఆ సమయంలో దొరికాడు అస్తవ్యస్త. ‘అబ్బో మహార్జాతకుడు’ అని చూడగానే చెప్పాడు శాస్త్రి.

    మర్నాటినుండీ భగీరథకూ అస్తవ్యస్తకూ అదే పని చీకటితోనే అడవికి వెళ్ళటం, చీకటి పడ్డాక తిరిగి రావటం.

    అస్తవ్యస్తకి డబ్బు లేకపోయినా పట్టుదల బోలెడంత. అతనైతే అడవిలోనే పడుకునేవాడు. భగీరథను నాన్నగారూ అనేవాడు. పోయిన కొడుకు బతికి వచ్చినట్లూ అయింది భగీరథకి.

    ఎన్నో మూలికలు దొరికాయి. బట్టతలమీద జుట్టు మొలిపించటం. సంతానం లేనివారికి సంతానప్రాప్తి. ఊబకాయం తగ్గించటం వగైరా సమస్యలకు దివ్యమైన ఔషధాలు కనిపెట్టాడు.

    తనకు గురువుద్వారా లభించలేదు. పైగా సగం బరువు నెత్తిన వేసుకున్నాడు అస్తవ్యస్త కాబట్టి వాటిని వ్యాపార పరంగా ఉపయోగించుకోవచ్చు. కాపోతే అవన్నీ ఇప్పటికే కోకొల్లలుగా వున్నాయి. జనం నమ్మరు.

    నమ్మకం అలా ఉంచి పెట్టుబడి ఉండాలిగా. అటు శాస్త్రి గారు, ఇటు భగీరథ ఇద్దరూ డబ్బు పుచ్చుకోరు. కాబట్టి ఇంట్లో వాళ్ళో వీళ్లూ ఇచ్చిన కందులూ గుమ్మడికాయలూ వంటివి తప్ప ధనరూపంలో ఏదీ లేదు.

    అటు భగీరథ ఆరోగ్యం క్రమంగా క్షీణీస్తోంది. అస్తవ్యస్తకు నిరాశ కలిగింది. తన ఇరన్ లెగ్ ప్రభావమేమో అనుకుంటూ వుండగా అదృష్టం తలుపుతట్టింది.

    ఒక శుభ ముహూర్తాన ఆయన ఆశయం ఫలించింది.

    దోమల నివారణకు బ్రహ్మాస్త్రం లాటి మందు దొరికింది.

    కానీ మళ్ళీ డబ్బు సమస్య.

    లోన్ కోసం బ్యాంకుకి వెళ్లారు.

    అక్కడా వీళ్ళకి అనుకోని అదృష్టం ఎదురయింది. ఆ బ్రాంచిలో అంతకు ముందుండే మానేజర్‌కి అప్పులిస్తే తిరిగి తీర్చరేమో అని భయం. అంబానీకి అప్పివ్వాలన్నా వణికి పోతాడు. ఎవరికీ అప్పులివ్వక పోవడంతో ఆ బ్రాంచ్ హెడ్డాఫీసు దృష్టికి వెళ్ళింది. వాళ్ళు మండిపడి వెంటనే టార్గెట్ పూర్తి చెయ్యమని శ్రీ ముఖం పంపారు. కొత్త మేనేజర్‌కి చెమటలు పట్టాయి. అడగటం ఆలస్యం అప్పులిచ్చేస్తుండగా భగీరథ అస్తవ్యస్త వెళ్లారు. పెద్దగా వివరాలు అడక్కుండానే అప్పిచ్చేసాడు.

    అస్తవ్యస్త దోమా ఇండస్ట్రీస్ ప్రారంభించాడు.

    అంతరిక్షానికి అవలీలగా వెళ్లిన మానవుడు ఆఫ్ట్రాల్ నలుసంత వుండే దోమ మీద విజయం సాధించలేక పోతున్నాడు. ఎన్ని ఉపాయాలు చేసినా లాభం ఉండటం లేదు.

    జనం విసిగి పోతున్నారు. అటువంటి సమయంలో మార్కెట్ లోకి వచ్చింది దోమ బాణం. అస్తవ్యస్త ప్రోడక్ట్.

    చిన్నగా షర్టు గుండీ పరిమాణంలో ఉంటుంది. రూపం కూడా అలాగే ఉంటుంది. పైన చిన్న చిల్లులు రెండు. అడుగున ఎక్కడ అంటించినా అంటుకునే గమ్ లాటి పూత. పదేసి దోమబాణాలు ఒక పాకెట్. ఒక్కో పాకెట్ పదిహేను రూపాయలు.

    ఒక దోమ బాణం తీసుకుని చేతిమీదగానీ వాచీ మీదగాని అంటించుకోవాలి. దోమలున్నాయని అనుమానం రాగానే దోమ బాణాన్ని గట్టిగా పీల్చాలి. అప్పుడు అందులోనే ఔషధం ఆ మనిషి ఒంటి లోపలి వెళ్లి ఒక విధమైన ప్రకంపనాలను సృష్టిస్తుంది. అంటే రాజకీయనాయకుడు ప్రజల జోలికి రానట్లూ దోమలు ఆ మనిషి జోలికి రావు.

    కాకపోతే ఆ మందు ముక్కు పొడుం లాగా ఘాటుగా ఉండటంతో పీల్చగానే అయిదారు తుమ్ములు వస్తాయి.

    దోమల బాధ తగ్గింది. తుమ్ములొస్తే మాత్రం ఏం అనుకున్నారు జనాలు.

    అనతికాలంలోనే దోమ బాణం విపరీతమైన ప్రజాదరణ పొందింది. మార్కెట్‌లో ఎక్కడ చూసినా దోమ బాణాలే. మిగిలిన దోమల మందులన్నీ శీర్షాసనం వేసేశాయి.

    అస్తవ్యస్త సిటీలో ఇల్లు కొనుక్కున్నాడు. ముందు ఓ గది వేయించి అందులో శాస్రి గారినీ, భగీరథనూ కూచోబెట్టాడు. ఆయన జ్యోతిష్యం. ఈయన మూలికా వైద్యం.

    ఇంటి పెత్తనం భాగ్యలక్ష్మిది. ఆవిడని ‘అమ్మా’ అని పిలుస్తాడు అస్తవ్యస్త.

    దోమా ఇండస్ట్రీస్‌కి మంచి పేరొచ్చింది. కాబట్టి మెల్లిగా మిగిలిన ప్రాడక్ట్స్ అంటే బట్టతలమీద జుట్టూ వగైరాలు కూడా లాంచ్ చేద్దామనుకున్నాడు.

    అప్పుడే కొట్టింది దెబ్బ. రాముడి పాలిట రావణాసురుడి లాగా. కృష్ణుడి పాలిట కంసుడి లాగా. అస్తవ్యస్త జీవితంలోకి ఓ విలన్ ప్రవేశించాడు.

    అతని పేరు వినాష్.

     (తరువాయి కథ వచ్చే భాగంలో)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here