[box type=’note’ fontsize=’16’] డిటెక్టివ్ కథలు, నవలలు అందరూ రాస్తారు. గోళ్ళు కొరుక్కుంటూ చదివేట్టు చేస్తారు రచయితలు. కానీ కుర్చీలోంచి కింద పడి పొర్లుతూ కూడా గోళ్ళు కొరుక్కుంతూ, సస్పెన్స్‌తో గుండెలు అదిరేట్టు హాస్య సస్పెన్స్ రచయన చేయగలిగే ఏకైక రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి అందిస్తున్న హాస్య సస్పెన్స్ డిటెక్టివ్ రచన ‘ఏమవుతుందో? ఎటుపోతుందో? ఏమో!!’ [/box]
[dropcap]వి[/dropcap]నాష్. విచిత్రమైన మనిషి. అసూయ, అతని రక్తంలోనే వుంది.
తనకు లేకపోతే వున్న వాడిని చూసి అసూయ పడటం సహజమే. కానీ తనకు అన్నీ వున్నా ఎదుటి వాడు బాగుపడటం చూసి ఏడవటం ఓ జబ్బు. ఆ జబ్బే వుంది వినాష్‌కు.
తరతరాలుగా వాళ్ళ వంశంలో అందరికీ బిజినెస్.
ముత్తాతలు పసుపు, తాతలు పొగాకు, తండ్రి ఎరువులూ అలా అమ్ముతూనే వున్నారు.
వినాష్ కూడా వ్యాపారంలోకి దిగాడు.
కాకపోతే వాళ్లంతా స్థిరంగా ఒకటే వ్యాపారం. ఇతగాడు మాత్రం కప్ప లాగా గంతులు.
కొన్నాళ్ళు అది. కొన్నాళ్ళు ఇదీ.
ఎవరైనా ఏదైనా కొత్త వ్యాపారం మొదలెట్టారు అనగానే అర్జంటుగా తానూ అందులోకి దిగిపోవాలి.
“ఇది బాగానే నడుస్తోంది కదురా. మళ్ళీ అదేందుకూ?” అని తండ్రి శాంతకుమార్ చిలక్కి చెప్పినట్లు చెప్తాడు. అయినా వినక పోతుంటే ధృతరాష్ట్రుడిలా ఊరుకున్నాడు. దాంతో అచ్చంగా దుర్యోధనుడిలా మొండిగా మూర్ఖంగా తయారయ్యాడు.
అన్నీ పిచ్చి పనులే. అతగాడో పెద్ద తలనెప్పి వ్యవహారం అందరికీ.
కాకపోతే శాంతకుమార్ గారి ఉప్పు తిని బతికిన వాళ్ళు కాబట్టి వినాష్ ఆగడాలు భరిస్తున్నారు.
అందరిలోకి ముఖ్యుడు కొండలరావు.
వినాష్ బాధ్యత కొండలరావుకి అప్పగించాడు శాంతకుమార్.
వినాష్ ఏదో వెధవ పని చేసి “కొండలరావూ కొంప మునిగింది” అని చెప్పటం కొండలరావు పరుగులు పెట్టటం సర్వసాధారణం.
ఉండాల్సిన అవలక్షణాలు అన్నీ వున్నాయి వినాష్‌కి.
పెళ్లి చేసుకోమంటే వినడు. “అందర్లోకి అందగత్తె కావాలి” అంటాడు. ఎన్ని సంబంధాలు చూసినా ఎవరూ నచ్చరు.
పెళ్ళి చేసుకోని వాడు తిన్నగా వుంటాడా అంటే వుండడు. పిచ్చి వ్యవహారాలు పెట్టుకుని పీకల మీదకి తెచ్చుకుని ‘కొండలరావు కొంప మునిగింది’ అంటం. ఆయన వెళ్లి సర్దుబాటు చేయటం బోలెడు సార్లు జరిగింది.
అటువంటి వినాష్ ఒక పార్టీలో అస్తవ్యస్తని మొదటి సారి చూశాడు. చూడగానే అయిష్టత కలిగింది.
అప్పుడప్పుడే వ్యాపారంలోకి అడుగుపెట్టి విజయం దిశగా వెళ్తున్న అస్తవ్యస్తని అందరూ అభినందించటం చూసి భరించలేకపోయాడు వినాష్.
వెంటనే అక్కడి నుండి వచ్చేసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు.
“మనం కూడా వెంటనే దోమల మందు తయారు చేసి మార్కెట్ లోకి ప్రవేశపెట్టాలి. దాని ధాటికి తట్టుకోలేక దోమ బాణం మట్టికొట్టుకు పోవాలి. అస్తవ్యస్త రోడ్డున పడాలి” అన్నాడు.
“ఎందుకురా? ఏదో పాపం అతని మానాన అతను వున్నాడు. అతనితో మనకేం విరోధం” అని తండ్రి చెప్పాడు. కానీ వినలేదు.
అంతే కాదు. ‘ఏమైంది ఎంతదాకా వచ్చింది’ అని అందర్నీ కంగారు పెట్టి చంపుకు తిన్నాడు.
అతని పోరు పడలేక ఏవో ప్రయోగాలు చేసి ఒకటి కనిపెట్టారు. దానికి మన్మధ బాణం అని పేరు పెట్టారు.
దోమ బాణం కంటే చూడ్డానికి మరి కాస్త అందంగా ఉంది. మంచిరోజు చూసి లాంచ్ చేశారు.
తీరా చూస్తే అట్టర్ ఫెయిల్యూర్.
మన్మధ బాణం పీలిస్తే దోమలు కుట్టటం మానటం మాట అటుంచి వొళ్ళంతా దురద ఇంతేసి దద్దుర్లు. జనం తిట్టిపోశారు.
మన్మధ బాణాలు గోడకి కొట్టిన బంతుల్లా తిరిగి వచ్చేశాయి గోడౌన్‌కి. మండి పడ్డాడు వినాష్.
వాళ్ళకీ కోపాలొచ్చాయి. ‘తగినంత సమయం ఇవ్వకుండా వెంటపడి కనిపెట్టు కనిపెట్టు అని కంగారెట్టి చంపేస్తే ఇలాగే వుంటుంది మరి’ అన్నారు.
దాంతో మరీ కోపం వచ్చింది వినాష్‌కి. ఆ కోపంలో వేగంగా కారు నడిపి ఆటోని గుద్దేసి అక్కడి నుండి పారిపోయి ‘కొండలరావ్ కొంప మునిగింది’ అని ఫోన్ చేసాడు.
‘వీడోహడూ నా ప్రాణం కోరుక్కు తింటున్నాడు’ అని విసుక్కుంటూ డబ్బులు తీసుకుని వెళ్ళాడు కొండలరావు.
అన్యాయంగా అస్తవ్యస్త మీదికి పోయి పళ్ళు రాలగొట్టుకున్నాను ఆని బుద్ధి తెచ్చుకోవడం పోయి అతని కారణంగానే నాకీ కష్టాలు అని అతని మీద కత్తి కట్టాడు.
నానా కుట్రలూ పన్ని బోల్డంత డబ్బు ఖర్చు చేసి మార్కెట్‌కి వెళ్తున్న అస్తవ్యస్త సరుకు దొంగిలించి దాని స్థానంలో నకిలీ సరుకు లోడ్ చేశాడు.
ఫలితం మామూలుగానే దోమ బాణాలు కొన్న జనం నకిలీ సరుకు వల్ల బాధలు పడ్డారు. ఊపిరాడక స్పృహ తప్పారు. కొంతమంది మరణం అంచుల దాకా వెళ్లారు.
హాస్పిటల్స్ నిండా బాధితులే.
పెద్ద గొడవ అయింది. దోమ బాణం ఫ్యాక్టరీని సీజ్ చేసారు. అస్తవ్యస్తని అరెస్ట్ చేశారు.
భగీరథ వల్ల లాభం పొందిన వారెవరో బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చారు.
కేసు పెట్టారు. బెయిల్ ఇప్పించిన పుణ్యాత్ముడే పూనుకుని ఓ లాయర్ని పెట్టాడు. ‘ఫీజు నేనిస్తాను’ అని చెప్పాడు.
ఆ లాయర్ పేరు బండి కనకారావు. ముద్దుగా బంక లాయరు గారు అంటారు అందరూ.
వాయిదాల లాయరు అని మరో పేరు కూడా వుంది.
ఎప్పుడూ వాయిదాలు తప్ప వాదించి ఎరగడు బంక.
కేసు హియరింగ్‌కి రావటం. వాయిదా పడటం. అలా ఆరేళ్ళు గడిచాయి.
అస్తవ్యస్త మీద దిగులుతో భగీరథ, అనారోగ్యంతో శాస్త్రిగారు కన్నుమూశారు.
పోతూ తాను కనిపెట్టినవన్నీ అస్తవ్యస్తకి ఇచ్చాడు భగీరథ.
అస్తవ్యస్తని భాగ్యలక్ష్మికి అప్పగించి ‘జాగ్రత్త మహర్జాతకుడు’ అని చెప్పాడు శాస్త్రిగారు.
స్వంత ఇంట్లో తల్లిని పెట్టుకుని ఏదో జీవితం లాక్కోస్తున్నాడు అస్తవ్యస్త.
అలాగే ఇంకొంత కాలం గడిచేదేమో.
అంతలో ఓ సంఘటన జరిగింది.
కోర్టుకు ఓ కొత్త జడ్జీ వచ్చాడు. కేసులన్నీ శ్రద్ధగా చూసాడు.
బంక వ్యవహారం చూసి మండి పడ్డాడు.
“ఏవిటిది? జన్మ అంతా వాయిదాలేనా? రేపు గనక పార్టీ రాకపోతే వాడిని అరెస్టు చేయించి నిన్ను ఏదో కేసులో ఇరికించి ఉరిశిక్ష వేస్తా జాగ్రత్త” అని హెచ్చరించాడు.
దాంతో విధిలేక అస్తవ్యస్త దగ్గరకు వెళ్లి “ఇంత వరకు లాక్కొచ్చాను. రేపు మీరు హాజరు కావాల్సిoదే” అన్నాడు.
“సరే. కానివ్వండి. నా తల రాత ఎలా వుంటే అలా జరుగుతుంది” అన్నాడు అస్తవ్యస్త.
(తరువాయి కధ మళ్ళీ).