ఏమవుతుందో… ఎటుపోతుందో… ఏమో! -6

    0
    9

    [box type=’note’ fontsize=’16’] డిటెక్టివ్ కథలు, నవలలు అందరూ రాస్తారు. గోళ్ళు కొరుక్కుంటూ చదివేట్టు చేస్తారు రచయితలు. కానీ కుర్చీలోంచి కింద పడి పొర్లుతూ కూడా గోళ్ళు కొరుక్కుంటూ, సస్పెన్స్‌తో గుండెలు అదిరేట్టు హాస్య సస్పెన్స్ రచన చేయగలిగే ఏకైక రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి అందిస్తున్న హాస్య సస్పెన్స్ డిటెక్టివ్ రచన ‘ఏమవుతుందో? ఎటుపోతుందో? ఏమో!!‘ ఆరవ భాగం. [/box]

    [dropcap]అ[/dropcap]స్తవ్యస్త తిరిగి వ్యాపారం మొదలు పెట్టాక చాలా వరకు పాత పనివాళ్ళనే పిలిపించి ఉద్యోగాలు ఇచ్చాడు. మంచి సెక్రటరీ కావాలి. జాలితో ఆత్రతకి సెక్రటరీ పోస్టు ఇచ్చాడు గానీ అదో అయోమయం మేళం.

    చదువు డిగ్రీల కన్నా లోకజ్ఞానం ముఖ్యం. అలా అని ప్రకటన ఇచ్చాడు.

    కొంతమంది వచ్చారు ఇంటర్వ్యూకి. తనే స్వయంగా ఇంటర్వ్యూ చేశాడు.

    మొదటి అమ్మాయి పేరు లత.

    “చూడండి. మీ నాన్నగారు పొద్దున బజారుకి వెళ్లి వంకాయలు, కాకరకాయలు, అరటికాయలు, చామదుంపలు తెచ్చారు. మీ అమ్మ ఏ కూర వండుతుంది?” అని అడిగాడు.

    “బెండకాయ” అని జవాబు చెప్పింది లత.

    రెండో అభ్యర్థి సుందరి.

    ప్రశ్న అడగ్గానే బావురుమని ఏడ్చింది. “మా నాన్న గారు లేరండీ” అంది.

    “సరే. పోనీ ఎవరో ఒకరు కూరలు తెచ్చారు. మీ అమ్మ ఏం కూర చేస్తుంది?” జాలిగా అడిగాడు.

    మళ్లీ భోరున ఏడ్చింది సుందరి. “అమ్మ కూడా లేదండీ” అంది.

    మూడో శాల్తీ అరుణ.

    అతను ప్రశ్న అడగ్గానే మొహం మాడ్చుకుంది.

    “ఇదే మన సమాజంలోని దౌర్భాగ్యం. ఓ పక్క బీద సాదలు గంజి లేక అలమటిస్తుంటే అగ్ర కులాల వాళ్ళు నాలుగేసి కూరలు తెచ్చుకోవడం. ఏం వoడాలా అని ఆలోచన చెయ్యటం. బూర్జువా…” అంటూ దెబ్బలాటకి దిగింది.

    బెదిరిపోయాడు అస్తవ్యస్త. “కాసేపు ఆగి మళ్లీ పిలుస్తా” అన్నాడు.

    అప్పుడు డోర్ తెరుచుకుని లోపలికి వచ్చింది ఓ మెరుపు తీగ.

    కళ్ళు గిర్రున తిరిగాయి అతగాడికి.

    అప్రయత్నంగా అదే ప్రశ్న వేశాడు.

    చిన్నగా నవ్వింది.

    “మా నాన్న గారు పొద్దున్న పూట కూరలకి వెళ్ళారు అంటే ఆయనకు ఉద్యోగం లేదని అర్ధం. అటువంటి వాళ్ళు బయటకు వెళ్తే ఓ పట్టాన ఇంటికి రారు. కనిపించిన వాళ్లతో బాతాఖానీ వేసి ఎప్పటికో కొంపకి చేరతారు.

    కాకరకాయ ఆలస్యం అవుతుంది. అరటికాయ వేపుడు త్వరగానే అవుతుంది గానీ వేపుడు రాత్రి పూట అన్నంతో బావుంటుంది. చామదుంపలకేం తొందర. కాబట్టి అమ్మ వంకాయ కూర చేస్తుంది” అని తియ్యగా చెప్పింది.

    అస్తవ్యస్త ఆనందానికి హద్దులు లేవు.

    “యు అర్ సెలెక్టెడ్” అన్నాడు.

    చిన్నగా నవ్వింది. “ఐ యామ్ సారీ. నేను జాబ్ కోసం రాలేదు” అంటూ తన విజిటింగ్ కార్డ్ ఇచ్చింది.

    కె. డోలాయ.

    ఆ తర్వాత నాలుగు లైన్లు ఆవిడ డిగ్రీలు వున్నాయి. తర్వాత రెండు లైన్లు ఆవిడకి వున్న కంపెనీల పేర్లు వున్నాయి.

    అదిరి పడ్డాడు అస్తవ్యస్త. “మీరు… ఇక్కడ… ఇలా…” అన్నాడు.

    “మీతో బిజినెస్ టై అప్ చేసుకుందామని వచ్చాను” అంది.

    ఆశ్చర్యపోయాడు. “నాతోనా” అన్నాడు.

    “అవును. మీరు దోమబాణం తయారు చేస్తున్నారు. అవి వాడితే తుమ్ములు వస్తాయి. కాబట్టి రుమాలు అత్యవసరం. గుడ్డ రుమాలు బావుండదు. టిస్యూ పలుచగా వుండి చిరిగి ముక్కుకి అతుక్కు పోతుంది. నేనో కొత్త రకం పేపర్ రుమాలు కనిపెట్టాను. మృదువుగా, చిరిగి పోకుండా ఉంటుంది. కమ్మని సువాసన. లేత గులాబీ రంగు. చూడండి శాంపిల్” అంటూ తీసి ఇచ్చింది.

    చూడగానే ఫిదా అయిపోయాడు.

    ఇద్దరూ వ్యాపారం గురించి మాట్లాడుకున్నారు. ఒక ఒప్పందానికి వచ్చారు.

    “ఇక నేను వెళ్తాను” అంటూ లేచింది.

    కారుదాక వెళ్లి “మిమ్మల్ని ఒక మాట అడగనా” అన్నాడు.

    “అడగండి” అంది.

    “నా పేరు విచిత్రమైనదే. అలాగే మీ పేరు డోలాయ నేనెక్కడా వినలేదు” అన్నాడు.

    నవ్వింది డోలాయ. “అందరూ నా పేరు వినగానే అడిగే ప్రశ్న మీరు ఇంతసేపటి తరువాత అడిగారు. యు అర్ గ్రేట్” అంది.

    “ఇంతకీ మీ పేరు?”

    “మీకు అర్జంట్ పనులు ఏమీ లేకపోతే అలా డ్రైవ్‌కి వెళదాం. దార్లో మాట్లాడుకోవచ్చు” అంది

    వెంటనే కారెక్కేసాడు అస్తవ్యస్త.

    “నాపేరు వెనక పెద్ద కథ వుంది” అంటూ మొదలు పెట్టింది.

    నిజమే పెద్దకథే వుంది. అనంతరామ్, ఆది లక్ష్మి దంపతులకు పెళ్లయిన ఎన్నో ఏళ్ళ దాకా పిల్లలు పుట్టలేదు. వారి ఇంటి జ్యోతిష్యుడు విశ్వంగారు మాత్రం “నీకు సంతాన యోగం వుంది. కాస్త అటూ ఇటూగా అయినా నువ్వు తండ్రివి అవుతావు” అని అనేకమార్లు కుండ బద్దలు కొట్టి మరీ చెప్పాడు. ఆయన మాట నిజమే అయింది. నలభయ్ అయిదు నిండాక ఆదిలక్ష్మి కడుపు పండి కూతురు పుట్టింది.

    “మహార్జాతకురాలు. కాకపొతే కాస్తంత గ్రహదోషం వుంది. ఆలస్యం చెయ్యకుండా పదకొండో రోజునే నామకరణం చెయ్యండి. ‘ఖ’ అనే అక్షరంతో ఆరంభమయ్యే పేరు పెట్టండి” అని చెప్పాడు విశ్వం గారు. ఖ అక్షరంతో పేరు ఎక్కడ దొరుకుతుంది. ఖర్మ నాశిని అని పెడదాం అనుకున్నారు. ఖర్మ కాదు కర్మ అనాలి కాబట్టి కుదరదు. ఖర వాహిని అని ఏ దేవతైనా ఉందేమో అని వెతికారు. లేదు. ఖర తాడిత. ఖర పీడిత అలా అన్ని పేర్లూ చూసారు ఒక్కటీ కుదర్లేదు.

    తెల్లారితే నామకరణం. మళ్ళీ విశ్వంగారి దగ్గరకు పరిగెత్తి త్రాహి త్రాహి అన్నారు.

    ఆయన మళ్ళీ చూసి “పోనీ డో” అనే అక్షరంతో మొదలయ్యే పేరు పెట్టండి” అన్నాడు.

    అదీ కష్ట తరమే అయింది. అవతల ముహూర్తం ఆసన్నం అయింది.

    హడావిడిగా డోలా ప్రియ అని పేరు పెట్టేశారు.

    పిల్లకు ఎప్పుడూ ఏదో అనారోగ్యం. ఓ న్యూమరాలజిస్ట్ చూసి “పేరు నప్పలేదు. ప్రి అనే అక్షరం తొలగించండి డోలాయ అని పిలవండి” అని సలహా ఇచ్చాడు.

    లేక లేక పుట్టిన పిల్ల ఒక అక్షరం కాదు నాలుగు తొలిగించమన్నా తొలగిస్తాడు అనంతరాం.

    వెంటనే ప్రి తీసేసి డోలాయ అని పిలవటం మొదలు పెట్టారు. డోలాయ ఆరోగ్యం బాగుపడింది.

    తన పేరు వెనక కథ చెప్పటం ముగిసే సరికి వాళ్ళ ఇల్లొచ్చేసింది.

    “రండి ఇదే మా ఇల్లు” అంది.

    ఇంటిని చూసి అస్తవ్యస్త కళ్ళు గిర్రున తిరిగాయి.

    (మిగతా కథ తరువాతి భాగంలో)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here