ఏమవుతుందో… ఎటుపోతుందో… ఏమో! -7

    0
    7

    [box type=’note’ fontsize=’16’] డిటెక్టివ్ కథలు, నవలలు అందరూ రాస్తారు. గోళ్ళు కొరుక్కుంటూ చదివేట్టు చేస్తారు రచయితలు. కానీ కుర్చీలోంచి కింద పడి పొర్లుతూ కూడా గోళ్ళు కొరుక్కుంటూ, సస్పెన్స్‌తో గుండెలు అదిరేట్టు హాస్య సస్పెన్స్ రచన చేయగలిగే ఏకైక రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి అందిస్తున్న హాస్య సస్పెన్స్ డిటెక్టివ్ రచన ‘ఏమవుతుందో? ఎటుపోతుందో? ఏమో!!‘ ఏడవ భాగం. [/box]

    [dropcap style=”circle”]ఆ[/dropcap] ఇల్లు పెద్ద సరస్సు మధ్యలో వుంది. చిన్న వంతెన మీదుగా వెళ్ళాలి. ఉదయ్‌పూర్ లేక్ ప్యాలస్‌లా వున్న ఆ ఇంటిని చూసి “మీరు ఏదైనా రాజవంశానికి చెందినవారా” అన్నాడు అస్తవ్యస్త.

    “కాదండీ. తరతరాలుగా మాది కబ్జా వంశం. మా తాతగారు అప్పుడెప్పుడో ఈ స్థలం ఆక్రమించుకున్నారు. తీరా చూస్తే అది చెరువు. అలా వదిలేశారు. నాకే ఈ ఆలోచన వచ్చింది. చెరువు ఎండిపోయిన సమయంలో ఇలా ఇల్లు కట్టించేశా. వర్షాలు పడి ఇదుగో ఈ విధంగా అయినది” అంది.

    ఇద్దరూ లోపలికి వెళ్లారు. పరిచయాలు అయ్యాయి. దోమ బాణం ఓనర్ అని తెలిసి పరమానంద పడింది.

    “నీటి మధ్యన ఇల్లు. దోమలు పీక్కు తినేవి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాటి బారి నుండి తప్పించుకోలేక పోయాం. అప్పుడు మీ పుణ్యమా అని దోమ బాణం వాడి సుఖంగా వున్నాం” అని తెగ మర్యాదలు చేసేసింది.

    అస్తవ్యస్త, డోలాయ మధ్య స్నేహం పెరిగింది. ఇష్టం ఏర్పడింది. ప్రేమగా మారింది.

    ఇరు వైపులా పెద్దవాళ్ళు కూడా సరే అనుకున్నారు. కాకపోతే జాతక రీత్యా అస్తవ్యస్తకి ఆలస్యంగా చెయ్యాలి పెళ్లి.

    “అంటే ఎన్నేళ్లకి?”

    “38 దాటాక” చెప్పింది భాగ్య లక్ష్మి.

    “ఓస్ అంతేనా. ఆలస్యంగా అంటే ఏ అరవై దాటాకనో అనుకున్నా. 38 అంటే ఈ రోజుల్లో మగ పిల్లాడికి ఎర్లీ మేరేజ్. ఇప్పుడు ఎంత వయసూ” అని ప్రశ్నించాడు అనంత రామ్.

    “35” చెప్పింది.

    “మరిహానేం. ఈ మూడేళ్ళ పాటూ ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత నల్లేరు మీద బండి నడకలా ఉంటుంది జీవితం” అన్నారు

    ఆ సమయంలోనే ఒక రోజు వినాష్ షాపింగ్‌కి వెళ్ళాడు. నాలుగు అంతస్థుల ఆ మాల్‌లో ఏం కొనాలో తెలియక పిచ్చిగా తిరుగుతూ వుండగా మెరుపులా కనిపించింది డోలాయ. తొలి చూపులోనే ఫిదా అయిపోయాడు. ‘హాయ్’ అని పలకరించి పరిచయం చేసుకున్నాడు.

    “ఏం కొనాలో తెలియటం లేదు. గంట నుండి పిచ్చిగా తిరుగుతున్నా” అంది.

    “నేనూ అంతే. రెండు గంటల నుంచి తిరుగుతున్నా” అన్నాడు.

    మరో అరగంట సేపు ఇద్దరూ కలిసి తిరిగారు.

    “కాఫీ తాగుదామా” అన్నాడు. ‘సరే’ అంది. ఇద్దరూ కలిసి కాఫీ తాగారు.

    గాల్లో తేలిపోతూ ఇంటికి వెళ్ళాడు. తండ్రితో ఆ శుభవార్త చెప్పేసాడు. కొడుక్కి నచ్చిన అమ్మాయి దొరికినందుకు శాంతికుమార్ యెగిరి గంతు వేశాడు.

    “నాన్నగారూ వీలైనంత త్వరగా నా పెళ్లి జరిగిపోవాలి” అన్నాడు వినాష్.

    ‘అలాగే’ అని మాట ఇచ్చి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. 11 పట్టు చీరెలు, 11 నగల సెట్లు, 11 పెట్టెల అలంకరణ సామాగ్రీ, 11 రకాల పళ్ళూ, 11 రకాల స్వీట్స్, 11 రకాల పూలు, 11 కిలోల కుంకుమ, 11 కిలోల పసుపూ తీసుకుని ఆర్భాటంగా వెళ్ళాడు పిల్ల ఇంటికి.

    అనంతరామ్ ఆ ఆర్భాటం చూసి ఆశ్చర్యపోయాడు. “ఏవిటివన్నీ?” అన్నాడు.

    మీకు కాదు మా కాబోయే కోడలికి. డోలాయకి అన్నాడు శాంతికుమార్.

    “అనవసరంగా హైరానా పడ్డారు. మా అమ్మాయికి పెళ్లి కుదిరిపోయింది…” అన్నాడు అనంత రామ్.

    తల మీద పిడుగు పడినట్లు అయింది శాంతికుమార్‌కి.

    అసలే కోతి, కల్లు తాగింది, నిప్పు తొక్కింది అన్నట్లు… ఈ విషయం విని వినాష్ ఏం వినాశనం చేస్తాడో అని అదో భయం.

    ఎన్నో విధాల బతిమాలాడు. భంగపడ్డాడు. కానీ ప్రయోజనం లేక నిరాశతో వెను తిరిగాడు.

    ఈ నిజం తెలుసుకున్న వినాష్ మండిపడ్డాడు. కారు అమిత వేగంగా నడుపుతూ పట్టు తప్పి ఓ టీ కొట్టు లోకి దూసుకు పోయాడు.

    ప్రాణ నష్టం జరగలేదు. కానీ కొట్టు దెబ్బతిందని వాళ్ళు తన్నటానికి వచ్చారు.

    వెంటనే కొండలరావుకి ఫోన్ చేసి ‘కొండలరావు కొంప మునిగింది’ అని చెప్పాడు.

    “వీడోహడూ నా ప్రాణాలు తోడేస్తున్నాడు. పెళ్లయితే దోవన పడతాడు అనుకుంటే అదీ కావటం లేదు… నా ఖర్మ” అని నెత్తి బాదుకుని డబ్బు తీసుకుని బయలు దేరాడు.

    డోలాయ పెళ్ళి అస్తవ్యస్తతో ఖాయం అయిందని తెలుసుకుని నిప్పులు కక్కాడు వినాష్. తర్వాత శాంతించాడు.

    ‘పెళ్లి కుదిరిందే కానీ కాలేదుగా. పెళ్లి పీటలెక్కబోతున్న సమయంలో పెళ్ళికొడుకు మారి, మరొకడు వెళ్లి పుస్తె ముడి వెయ్యటం వెయ్యి సినిమాల్లో చూశాం. ఇక్కడ ఇంకా మూడేళ్ళ సమయం ఉంది. కాబట్టి అతగాడిని తప్పించి తన ఆశ నెరవేరేలా చూసుకోవాలి’ అనుకున్నాడు.

    అతని మనసులో ఓ పథకం రూపుదిద్దుకుంది.

    (తరువాత కధ మళ్ళీ).

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here