ఏమవుతుందో… ఎటుపోతుందో… ఏమో! -9

0
6

[box type=’note’ fontsize=’16’] హాస్యమూ, సస్పెన్స్ మేళవించి పొత్తూరి విజయలక్ష్మి అందిస్తున్న డిటెక్టివ్ రచన ‘ఏమవుతుందో? ఎటుపోతుందో? ఏమో!!’ తొమ్మిదవ భాగం. [/box]

[dropcap]అ[/dropcap]స్తవ్యస్త కారు పూర్తిగా ఆటోమేటిక్. వినాష్ కారు ఆటోమేటిక్‌తో బాటు మనిషి కల్పించుకున్నా పనిచేస్తుంది. మనిషి ఎలా నడపాలో వివరాలు అన్నీ ఓ పుస్తకంలో స్పష్టంగా రాసి వుంటాయి.

ఆ పుస్తకం పాతకాలం టెలిఫోన్ డైరెక్టరీ అంత వుంటుంది. అందులో వివరాలు వెతుక్కోవటం గడ్డి వామిలో సూది వెతుక్కోవటం అంత కష్టం.

ఎప్పుడైతే కారు ఎటో పోతూందో వినాష్ గాభరాగా పుస్తకం తీసి వెతకడం ఆరంభించాడు.

ఓ పట్టాన దొరికితేనా.

‘వీడి బొందలా వుంది ఈ పుస్తకం’ అని తిట్టుకుని, మళ్లీ ఆటోమేటిక్‌లోకి మళ్లాడు.

గమ్యం మార్చే ప్రయత్నం చెయ్యటం మొదలు పెట్టాడు.

అలా గమ్యం మధ్యలో మారిస్తే కారుకు అనుమానం వస్తుంది. ‘నువ్వేనా మార్చింది’ అని అడిగింది.

అప్పుడు యజమాని ‘అవును నేనే’ అని కోడ్ భాష లో సమాధానం చెప్పాలి. అసలే కొత్త కారు. ఆ పైన కంగారు. కోడ్ వర్డ్ గుర్తుకు రాలేదు.

కారు ఓ రెండు నిముషాలు ఆగి మళ్లీ అడిగింది.

ఫలితం లేదు. ముచ్చటగా మూడో సారి అడిగి చూసింది.

సమాధానం లేదు. ఏదో మోసం జరిగిందని అర్థం అయిపోయింది కారుకి. భద్రతా చర్యలు ప్రారంభించింది.

కారు తలుపులు లాక్ అయిపోయాయి.

ఇక అవి తెరుచుకోవు. బయటి నుండి కారు యజమాని గానీ, తయారు చేసిన కంపెనీ వారు గానీ వచ్చి తెరవాలి.

అప్పుడు కోడ్ గుర్తుకు వచ్చింది వినాష్‌కి. అడిగినప్పుడు జవాబు చెప్పకుండా ఆలస్యంగా చెప్పటంతో కారు ‘ఖచ్చితంగా వీడేవడో దొంగ వెధవ’ అని నిర్ణయించుకుని దుష్ట శిక్షణ మొదలు పెట్టింది.

పై నించి ఓ చెయ్యి వచ్చి మాడు పగిలేలా కొట్టేస్తోంది. ఎదురుగా వున్న స్పీకర్లు ఘోరంగా తిట్టేస్తున్నాయి.

‘నీ మొహం మండా. నేనే నే’ అని చెప్పినా కారు వినదు. ఆగదు.

అతి కష్టం మీద కొండలరావుకి ఫోన్ చేసి ‘కొండలరావ్, కొంప మునిగింది’ అన్నాడు. విషయం తెలుసుకుని తల బాదుకున్నాడు కొండల రావు.

“అవన్నీ మనకు వద్దు మహాప్రభో, బెంజ్ కారు కొనుక్కోండి చాలు అన్నాను. వినలేదు. పోనీ జర్మనీ దేశంలో తయారు చేసిన కారు కొనండీ అన్నాను. అదీ వినలేదు. దగ్గరగా వుంటే ఏదైనా చేద్దును. ఎక్కడో వెయ్యి కిలోమీటర్లు వెళ్లిపోయారు. నేనేం చావను?? మీరే ఏదో దారి చూసుకోవాలి” అని చేతులు ఎత్తేశాడు.

ఏడుపు వచ్చింది వినాష్‌కి.

అతి కష్టం మీద దెబ్బలు, తిట్లు తప్పించుకుని పుస్తకం తీసాడు.

అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు కారు వెళ్లి ఏ గొడకో గుద్దుకుని ఆగిపోతుంది.

లోపల ఉన్న మనిషికి దెబ్బలు తగలవు.

కారు ఆగిన తర్వాత ఏం చెయ్యాలో అప్పుడు చెప్తుంది ఆ కారు.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూచున్నాడు వినాష్.

అంతకంతకూ వేగం పెంచుకుంటూ ఓ అడవిలో ప్రవేశించి అడ్డదిడ్డంగా పోయి ఓ చెట్టుకు గుద్దుకుని ఆగిపోయింది వినాష్, అస్తవ్యస్తతో పోటీ పడి చేయించుకున్న ఆ కారు.

(తరువాత కధ మళ్ళీ).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here