ఈజీగా ఇంగ్లీష్ ఛాప్టర్ 8

0
9

[dropcap]మీ[/dropcap]రు తెలుగు మీడియమా? అయితే ఇది మీ కోసమే. ఇకపై మీరు మాతృభాషలాగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. MNC జాబ్ తెచ్చుకోగలరు.

~

బూట్ క్యాంపు – మూడవరోజు ( పార్ట్ 2)

“నేను చేరింది స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవటానికి. అక్కడ చేరి మూడు రోజులు అవుతున్నా, గ్రామర్ పాఠాలు గానీ, స్పోకెన్ ఇంగ్లీష్‌కి సంబంధించి ఏదయినా బేసిక్ లెసన్స్ కానీ మొదలు పెట్టలేదు.

బూట్ కాంపులో మూడవ రోజు మా గోల్స్ ఏమిటి అని ఆడిగి కనుక్కున్నారు. ఆ తర్వాత చిరునవ్వుతో, అవి గోల్స్ కాదు కేవలం డ్రీమ్స్ అని చెప్పారు. అవును, మేము ఏవయితే గోల్స్ అని అనుకుని మా గోల్స్ చెప్పామో అవి గోల్స్ కాదని, కేవలం కలలు మాత్రమే తేల్చి చెప్పారు. చెప్పొద్దూ చెడ్డ చిరాకు వేసింది.

ఆ తరువాత, మాకు ధైర్యాన్నిస్తూ, కలలే మన విజయానికి పునాది అని చెప్పుకొచ్చారు.

విజయం లభించాలి అంటే గోల్స్ ఉండాలి,

గోల్స్ ఏర్పడాలి అంటే, కలలు ఉండాలి,

మన కలల్ని నిజం చేసుకోవాలంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్పుకొచ్చారు. మన విజయయాత్ర సులభంగా సాగాలి అంటే ఒక మోటివేషన్ ఉండాలి అని చెప్పారు.

  • ఇంగ్లీష్‍లో అనర్గళంగా మాట్లాడటానికి ఒక మోటివేషన్ (ప్రేరణ – ఉత్తేజ పరిచే కారణం) ఉండాలి
  • జీవితంలో ఒక మోటివేషన్ ఉండాలి అంటే స్పష్టమైన గోల్ ఉండాలి
  • స్పష్టమైన గోల్‌ని సెట్ చేసుకోవడానికి కలలు ఖచ్చితంగా ఉండాలి

ఈ కలలు ఎలా ఉండాలి అంటే మనల్ని కుదురుగా కుర్చోనివ్వనంత బలంగా ఉండాలి, ఈ కలలు మనల్ని వెంటాడి వేధించాలి. నిద్రలో వచ్చే కలలు కాదు, నిద్ర పట్టనివ్వకుండా చేసే కలలు కావాలి. ఈ కలల దిశగా మనం అడుగులు వేస్తే అది గోల్ అవుతుంది లేదా పగటి కలగా మిగిలి పోతుంది.

మనం మన కలలు నిజం చేసుకునే వైపు ప్రతిరోజు అడుగులు వేయాలి. మనం పెద్ద పెద్ద అడుగులు వేశామా, చిన్న అడుగులు వేశామా అన్నది కాదు ముఖ్యం, ఆగకుండా అడుగులు పడుతున్నాయా లేదా అన్నదే ముఖ్యం.

అనేక గ్రామీణ ప్రాంతాలలో యువత తాలూకు కలలు పగటికలలు లాగా తెల్లారి పోవటానికి కారణం, వారిని సరియైన విధంగా మోటివేట్ చేసే వారు లేకపోవడం.

కాబట్టి కలలు మన విజయానికి మొదటి అడుగు.

ఆ కలల్ని ఎలా మనం నిజం చేసుకుంటున్నాము అన్న దాని మీద మన విజయం ఆధారపడి ఉంది.

కలలని ఇంగ్లీష్‌లో డ్రీమ్స్ (Dreams) అంటారు కద, ఈ డ్రీమ్స్‌కు తోడు ఇంకో అయిదు డీతో మొదలయ్యే అంశాలు చెప్పి, మా డ్రీమ్స్‌ని ఎలా గోల్స్ గా మార్చుకోవాలో చెప్పుకొచ్చారు.

ఆ ఎక్సర్‌సైజ్ తరువాత, స్మార్ట్ గోల్స్ గూర్చి చెప్పి, గోల్ షీట్స్ ఇచ్చారు. నిజం చెపుతున్నా ప్రసాద్, నేను రాయల్ సాఫ్ట్ స్కిల్స్ క్యాంపస్‌లో చేరకుండా ఉండి ఉంటే, నా జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండి పోయేది. నా జీవితానికి ఒక స్పష్టమైన లక్ష్యం, ఒక కుదురు లభించాయి అంటే అక్కడి టీచింగ్ విధానాలే కారణం.

రాయల్ సాఫ్ట్ స్కిల్స్ కాంపస్‌కి ఇతర స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్‌స్టిట్యూట్లకి ప్రధానమైన తేడా:

గుడ్డెద్దు చేలో పడ్డట్టు మన చేత గ్రామర్ ఎలా బట్టీ పట్టించారో గుర్తుందిగా మనం ఇది వరకు చేరిన రెండు స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లలో. ఇలా గుడ్డిగా ఇంగ్లీష్ గ్రామర్ చెప్పటంతో మొదలెట్టి, టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, గ్రామర్, ట్రాన్స్‍లేషన్ అంటూ గందరగోళం క్రియేట్ చేసి, స్కూళ్ళలో కాలేజీలో చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ మనకు చెప్పి మనల్ని బిత్తర ఎత్తించారు. అదేదో సామెత చెప్పినట్టు, ఆ పద్దతుల ద్వారా మనకు ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చేటట్టయితే స్కూళ్ళలో, కాలేజీలోనో వచ్చేసేదిగా.

అలా గుడ్డిగా గ్రామర్ పాఠాలు బట్టీ పడితే ఇంగ్లీష్‌లో ఫ్లూయెన్సీ రాదు అని మనకు అర్థం అవుతూనే ఉంటుంది. అయినా గుడ్డిగా గ్రామర్ పాఠాలు బట్టీ పట్టాము, అనువాద పద్దతిలో అవస్థలు పడ్డాము.

కానీ రాయల్ సాఫ్ట్ స్కిల్స్ క్యాంపస్‌లో, ఇటువంటి కాలం చెల్లిన విధానాలు పాటించకుండా చాలా సైంటిఫిక్‌గా ఇక్కడ మా స్పోకెన్ ఇంగ్లీష్ ప్రయాణం మొదలెట్టారు.

ఇక్కడ వాళ్ళ నినాదం ఏమిటి అంటే, “మాతృ భాషలో మాట్లాడినంత సులభంగా సునాయాసంగా ఇంగ్లీష్‌లో మాట్లాడింపజేస్తాము

ఈ దిశగా , మొదట అసలు మా కలలు ఏమిటి అన్న విషయం తెలుసుకోవటం ద్వారా మాతో గోల్ సెట్టింగ్ ఎక్సర్ సైజ్ చేయించారు.

ఏదో ఉత్తినే ఇంగ్లీష్ చెప్పి వదిలేస్తే అది రాయల్ ఎలా అవుతుంది, నాకు ఈ రోజు ఇంత సామర్థ్యం ఎలా వస్తుంది?

గోల్ సెట్టింగ్ ఎక్సర్ సైజ్ చేయించే ముందు, మాచే SWOT ANALYSIS  చేయించారు.

ఈ “స్వాట్ అనాలిసిస్” ద్వారా మాకు మా అసలు శక్తి సామర్థ్యాలు తెలియవచ్చాయి.

వారు మాతో, ఆ “స్వాట్ అనాలిసిస్”, ఆ గోల్ సెట్టింగ్ ఎక్సర్‍సైజ్ చేయించకుండా ఉండుంటే మాకెవ్వరికీ, జీవితం పట్ల ఇంత స్పష్టత వచ్చి ఉండేది కాదు” చాలా తన్మయత్వంతో చెప్పాడు రాజు.

ఈ గోల్ షీట్స్ ఇవ్వబోయే ముందు ఒక అద్భుతమైన ఆడియో ప్లే చేసి వినిపించారు. అది ఎర్ల్ నైటింగేల్ అనే ఒక ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణుడి ప్రసంగం. ఇది చాలా పాత రేడియో కార్యక్రమం.

1950 ప్రాంతాలలో ఎర్ల్ నైటింగేల్ అమెరికన్ రేడియోలొ ఇచ్చిన ఈ ముఫై ఎనిమిది నిమిషాల రేడియో ప్రసంగం ఎంతో మందిని ప్రభావితం చేసింది.

ఈ రేడియో ప్రసంగానికి చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి.

అమెరికాలో ఎంతో మందిని బిలియనీర్లుగా మార్చటంలో ఈ రేడియో ప్రసంగం కీలక పాత్ర పోషించింది.

అదే విధంగా ఇవ్వాళ ట్రెయినర్లుగా ఉన్న ఎంతో మంది పర్సనాలిటి డెవలెప్‍మెంట్ ట్రెయినర్లు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస రచయితలు ఏమి చెప్పారంటే ‘ఈ రేడియో ప్రసంగం వినటం ద్వారానే తాము ఈ స్థాయికి వచ్చాము’ అని చెప్పుకొచ్చారు.

అంత గొప్ప రేడియో ప్రసంగాన్ని మాకు బూట్ క్యాంపు మూడవరోజు వినిపించారు.

ఆ రేడియో ప్రసంగంలోని ప్రతి వాక్యం ఒక కొటేషన్ కింద మనం చెప్పుకోవచ్చు.

ఎర్ల్ నైటింగేల్ తన ప్రసంగాన్ని ఇలా ప్రారంభిస్తారు. “నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ ష్వైట్జర్ ఏమి చెబుతారు అంటే, ఒక వ్యక్తి విజయానికి లేదా అపజయానికి ఒకే ఒక కారణం అతను ఆలోచించే పద్దతి. ఆలోచన చేసే విధానం మార్చుకుంటే ఏదయినా సాధించవచ్చు.

దురదృష్టవశాత్తు వంద మందిలో కేవలం ఒక్కడే (కేవలం ఒక్క శాతం మాత్రమే) తాను అనుకున్న కలల్ని అనుకున్నట్టు నిజం చేసుకుంటున్నాడు.

దీనికి సపోర్ట్‌గా ఒక స్టడీ రిపోర్ట్ కూడా ప్రెజెంట్ చేస్తాడు ఎర్ల్ నైటింగేల్.

“ఇదిగో ఆ ఆడియో తాలుకూ లింకు నీకు ఇస్తున్నాను” అని ప్రసాద్ ఫోన్‌కి ఆ లింకు పంపాడు రాజు.

https://www.youtube.com/watch?v=s9IVpdOAXG4

మాట్లాడుతున్నాడే కానీ రాజు ఆలోచనలు మళ్ళీ హైదరాబాద్ దిల్‍సుఖ్‍నగర్ లోని రాయల్ సాఫ్ట్ స్కిల్స్ క్యాంపస్ వైపు పరుగులు తీశాయి.

***

వేదిక మీద నిలబడి తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నాడు సంతోష్. అతని వదనం ప్రసన్నంగా ఉంది, ముఖ్యంగా అతని మాటల్లో దయ ఉంది. తనపై నమ్మకం ఉంచి చేరిన అందరికీ విజయం అందజేయాలి అన్న తపన అతని చూపుల్లో ఉంది.

అతని మాటలు మంద్రంగా గది అంతా వ్యాపిస్తున్నాయి.

“మీ లక్ష్యం ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడటం. చాలా మంచి లక్ష్యం ఏర్పరచుకున్నారు. కానీ, ఏ లక్ష్యం అయినా నెరవేరాలి అంటే ముఖ్యంగా కావాల్సింది బలమైన కల. జ్వలించే కోరిక నుంచే కలలు పుడతాయి. ఈ జ్వలించే కోరికని ఇంగ్లీష్‌లో ‘బర్నింగ్ డిసైర్’ అంటారు. ఏదో ఒకసారి మతాబులా వెలిగి తుస్సుమంటే దాన్ని బర్నింగ్ డిసైర్ అనలేము. మీరు ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా నిరంతరం మీలో ఒక జ్వాల లాగా రగులుతూ ఉండే కోరిక మాత్రమే మీ చేత అద్భుతాలు చేయిస్తుంది.

ఇలాంటి కోరిక ఉన్నప్పుడే మీ కలలు నిజాలు అవుతాయి.

ఒక వ్యక్తికి బర్నింగ్ డిసైర్ ఉన్నా సరైన గైడెన్స్ దొరకకపోతే అతను అడ్డదారులు తొక్కడమో, లేదా డిప్రెషన్‌కి గురి కావడమో జరుగుతుంది. మనం ఇందాకే చెప్పుకున్నట్టు,

Dream + 5D లు తోడైతే, మీ కలలకి ఒక సరి అయిన మార్గం దొరికినట్టు అవుతుంది. అప్పుడు మీ కలలు గోల్స్ అని చెప్పబడతాయి.

గోల్స్ ఉన్న వ్యక్తికి విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.

మీ గోల్ స్మార్ట్ గోల్ అయితే మీ విజయం ఖాయం.

ఇక్కడ SMART అంటే,

S = Specific Goal

M= Measurable Goal

A = Achievable Goal

R = Realistic Goal

T = Time Bound Goal

మనం ఇప్పుడు ఒక్కో అంశాన్ని గూర్చి వివరంగా తెలుసుకుందాము.

Specific Goal:

అస్పష్టంగా ఏదో ఒక గోల్ అని అనుకోవటం వల్ల ఎటువంటి లాభం ఉండదు.

ఒక ఉద్యోగంలో చేరాలి అని అనుకోవడం కంటే నేను ఖచ్చితంగా ఫలానా కంపెనీలో చేరాలి అనుకోవడంలో స్పష్టత ఉంది కద.

అస్పష్టమైన గోల్: “నేను జాబ్ తెచ్చుకోవాలి”

స్పష్టమైన గోల్: “నాకు అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్స్ డెవలప్ చేయటంలో ఆసక్తి ఉంది. నాకు అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ ఆపరేట్ చేయటంలో అనుభవం ఉంది. నాకు లీడర్ షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి.

డెలాయిట్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా చేరటం నా లక్ష్యం. ఇంక సరిగ్గా నాలుగేళ్ళలో నేను డెలాయిట్‌లో హైదరాబాద్ కాంపస్‌లో, మినిమం పది లక్షల పాకెజ్‌తో, ఉద్యోగం తెచ్చుకుంటాను.

స్పష్టమైన గోల్ సెట్టింగ్ చేసుకోవడం వల్ల ఒక ముఖ్యమైన కలిసొచ్చే అంశం ఏమిటి అంటే మీకు ఇక దారి ఏర్పడి పోతుంది. మీ గోల్ వైపుకి రోజు మీరు స్టెప్ బై స్టెప్ చేరుకోగలరు.

ఈ స్పష్టమైన గోల్‌లో మీరు గమనించాల్సిన అంశాలు:

1) మీ శక్తి యుక్తులు, మీ అభిరుచులు, ఇష్టాయిష్టాలు మీకు తెలిసి ఉంటే మీరు స్పష్టమైన గోల్ ఏర్పరచుకోగలరు.

2) మీరు చేరాలనుకుంటున్న కంపెనీ, మీ ఉద్యోగం టైటిల్, ఆ ఉద్యోగంలో మీరు చెయ్యాల్సిన పనుల పట్ల మీకు క్లియర్‌గా ఒక ఐడియా ఉంది

3) ఏ ఊర్లో, ఏ ఆఫీస్, ఏ బ్రాంచి అన్న విషయం పట్ల మీకు క్లియర్‌గా ఒక ఐడియా ఉంది

4) ఏ సంవత్సరం, ఎంత జీతంతో చేరబోతున్నారో మీరు ముందుగానే ప్లాన్ చేసుకోగలరు.

Measurable Goal:

ఉత్తినే తలా తోక లేని గోల్ పెట్టుకుని అది ఎలా అఛీవ్ చేయాలో తెలియక, మొదట్లో ఉన్న ఉత్సాహం రాన్రాను నీరు కారిపోయిన వారిని చాలా మందిని చూశాను. ఒక్కొక్క అడుగూ మన గోల్ వైపు వేస్తూ ఉంటే మనకు మన గోల్‌కి మధ్య దూరం తరిగిపోతూ మనలో కొత్త ఉత్సాహం వస్తుంది. అలాంటి కొలవగలిగిన పద్దతులు లేని గోల్స్ మనలో ఉత్సాహాన్ని ఇవ్వవు.

కొలబద్దలు లేని గోల్: నేను బాగా సక్సెస్‌ఫుల్ గా ఉంటాను.

కొలబద్దలు ఉన్న గోల్: నేను ఫలానా దేశం కెళ్ళి, ఫలానా యూనివర్శిటీలో, ఫలానా కోర్స్ చదివి, ఫలాన ఉద్యోగంలో ఫలానా దేశంలో, ఫలాన అంత పే పేకేజితో చేరుతాను.

ఈ విధమైన గోల్ వల్ల ఉపయోగం ఏమిటి అంటే, నువ్వు ఏయే కోర్సులు చేయాలి, ఏయే పరీక్షలు పాసవ్వాలి, ఎంత పర్సంటేజి తెచ్చుకోవాలి, ఏయే సాఫ్ట్‌వేర్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళి, ఎప్పుడు వెళ్ళి, వీసా కోసం ప్రయత్నాలు మొదలెట్టాలి, ఫలానా కంపెనీ సెలక్షన్ ప్రాసెస్‌లో భాగంగా ఏయే రౌండ్స్ ఇంటర్యూలో ఉంటాయి, ఆయా రౌండ్స్‌కి ఎలా సన్నద్ధం కావాలి అన్న అంశం గూర్చిపూర్తి స్పష్టత ఉంటుంది. అప్పుడు ఒక క్లారిటితో ప్రయత్నాలు చేస్తూ పోతే, ఒక్కొక్క స్టెప్ మన గమ్యానికి దగ్గర అయిన తృప్తి కలిగి మనకు కొత్త ఉత్సాహం వస్తుంది.

Achievable Goal:

ఎప్పటికీ చిన్న గోల్స్ పెట్టుకోకూడదు. ఇది మంచి విషయమే. కానీ అలా అని చెప్పి మన శక్తికి మించి గోల్స్ పెట్టుకుని నిరాశ చెందటం అసలు మంచిది కాదు.

ఇంగ్లీష్‌లో మాట్లాడటం వరకు సంబంధించి నేను ఇలా అసాధ్యమయిన గోల్స్ పెట్టుకోవటాన్ని వ్యతిరేకిస్తాను. నేను ఇంకో గంటలో మొత్తం ఇంగ్లీష్ భాషపై పట్టు సాధిస్తాను, అని ఎవడైనా అంటే వాడు ఖచ్చితంగా మూర్ఖుడే.

ఏ స్కిల్ అయినా సాధన ద్వారానే సాధ్యం అవుతుంది. ఒక నిర్ణీత గడువు పెట్టుకుని ‘నేను రేపటికల్లా అమెరికన్ ప్రెసిడెంట్ అవుతాను’ అని ఎవడైనా అమలాపురంలో కూర్చుని అనుకున్నాడు అనుకోండి. అది సాధ్యమవుతుందా? రేపటికల్లా అన్నది అస్సలు సాధ్యం కాదు. పోనీ, దానికి ఒక పథకం ప్రకారం, ఒక టైం ఫ్రేం నిర్ణయించుకొని ప్రయత్నాలు చేసినా, అమెరికాలోనే పుట్టిన అమెరికన్ పౌరులకు మాత్రమే అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యే అర్హత ఉంది అని వారి రాజ్యాంగంలో ఉంది అన్న అంశం విస్మరించరాదు.

ఇటీవల కొందరు వ్యక్తిత్వ వికాస శిక్షణ నిపుణులు ‘ఎవ్వర్నీ పట్టించుకోవద్దు, నీవు ఏమన్నా అనుకో అది సాధ్యమవుతుంది, కలలు కను, బలంగా కలలు కను, విచిత్రంగా కలలు కను అంటూ ఊదరగొడుతున్నారు’. కానీ సాధ్యాసాధ్యాలు విస్మరించి నేల విడిచి సాము చేస్తే బోల్తా పడే ప్రమాదం ఉంది కద.

ఇందుకు SWOT ANALYSIS ఉపయోగపడుతుంది.

అసాధ్యమైన గోల్స్: నేను ఏ ప్రయత్నం చేయకుండానే ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడాలి.

అఛీవబుల్ గోల్స్: నేను నా జీవిత లక్ష్యాన్నిషార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ అన్న విధంగా రాగల ఏడేళ్ళలో ఇప్పుడు ఉన్న స్థితికన్నా కొన్ని వేల రెట్లు మంచి స్థితికి చేరుకుంటాను. ఇందుకు ఒక క్రమ పద్దతిలో ఇంగ్లీష్‌లో మాట్లాడటం నేర్చుకుంటాను.

(లేదా) నేను ఫలానా కంపెనీలో ఫలానా పొజిషన్‌కి చేరుకుంటాను

(లేదా) నేను రాగల అయిదేళ్ళలో కనీసం అంటే మరో రెండు ప్రమోషన్లు సాధించి ఫలానా పొజిషన్‌కి చేరుకుంటాను.

ఈ విధంగా అఛీవబుల్ గోల్స్ పెట్టుకోవడం వల్ల మీరు ఖచ్చితంగా విజయం సాధించగలరు. దీన్ని ఇంగ్లీష్‌లో ప్రెడిక్టబుల్ గోల్స్ అంటారు.

అంటే మనం ఒక ప్రయాణం మొదలెట్టి బస్సులో కూర్చున్న తర్వాత, మన వాళ్ళకు ఫోన్ చేసి, ‘నేను ఫలానా టైం కి చేరుకుంటాను’ ఊరికి అని చెప్తాము కద. అదే విధంగా, ‘ఫలానా టైంకి బస్సు లంచ్‌కి ఫలానా ఊర్లో ఆగుతుంది, ఫలానా స్టాప్‌కి ఫలానా టైం కి చేరుకుంటుంది’ అని చెప్తాము కద. ఇది కూడా అలాగే అన్న మాట.

Realistic Goal: మీ గోల్ ఎప్పటికీ సత్య దూరంగా ఉండకూడదు. గొప్ప విజయాలు సాధించిన వారందరూ అప్పటి దాకా సృష్టిలో లేని విషయాల్నే కలలు కని సాధించారు, అది నిజమే. కానీ ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడాలి అన్నది ఇక్కడ మన గోల్.

సత్యదూరమైన గోల్: ‘నేను జస్ట్ ఇలా కళ్ళు మూసుకుని, తెరిచేసి ఇంగ్లీష్‌లో మాట్లాడేయాలి’ అన్నది సత్య దూరమైన గోల్ అవుతుంది.

రియలిస్టిక్ గోల్ : నేను ఫలానా నెలకల్లా, ఎటువంటి తడబాటు లేకుండా, ఎటువంటి తప్పులు లేకుండా, నా మనసులో ఉన్న భావాలని ఉన్నవి ఉన్నట్టు, ఎవ్వరితోనైనా సరే మాట్లాడగలిగే విధంగా సాధన చేస్తాను. ఇందుకు నేను మా ట్రెయినర్స్ చెప్పే చిట్కాలు, వారు సూచించే విధానాలు పాటిస్తాను.

ఒక నిర్ణీతమైన స్పష్టమైన లక్ష్యం ఎప్పటికీ సుసాధ్యమే.

Time Bound Goal:

ఎప్పటికో ఒకప్పటికి నేను విజయం సాధిస్తాను, అని ఎన్నటికీ అస్పష్టంగా కలలు కనకూడదు. ఎప్పటికీ ఒక నిర్ణీతమైన గడువు పెట్టుకుని గోల్ సాధించాలి అని అనుకోవడంలో ఖచ్చితమైన విజయావకాశాలు ఉంటాయి.

ఈ విషయంలో మనం గత సంచికలో, డెడ్ లైన్ అన్న అంశంలో కూడా తెలుసుకున్నాము.

మీ జీవిత లక్ష్యాలని ఎప్పటికీ ఈ కింది విధంగా విభజించుకోండి.

Next year: సరిగ్గ ఇదే రోజుకు వచ్చే సంవత్సరానికి నేను ఏమి సాధించాలి? (దీనిని షార్ట్ టర్మ్ గోల్ అంటారు)

5 years: రాగల అయిదేళ్ళలో నేను ఏమి సాధించాలి? (దీనిని మిడ్ టర్మ్ గోల్ అంటారు)

10 Years: రాగల ఏడేళ్ళలో/లేదా పదేళ్ళలో నేను ఏమి సాధించాలి? (దీన్ని లాంగ్ టర్మ్ గోల్ అంటారు)

మీ గోల్స్ గూర్చే ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి.

మీ గోల్స్‌ని ఈ క్రింది విధాలుగా విభజించుకోవచ్చు.

1) Personal Mastery Goals

2) Career / Job & Financial Goals

3) Family & Fun related Goals

4) Spiritual Goals

(వీటిని ఎలా ప్లాన్ చేసుకోవాలి, వీటిని ఎలా సాధించాలి, వీటికి సంబంధించి గోల్ షీట్స్ తదితర అంశాలు వచ్చేవారం ‘ఈజీగా ఇంగ్లీష్’లో అందజేస్తాను)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here