ఏది ఎంత వరకు…

0
10

[dropcap]కా[/dropcap]రం న్యూస్ చానల్లో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నాడు మధు. అతన్ని కలవడానికి వచ్చిన అతని స్నేహితుడితో, “అరే గిరి నువ్వా? ఏంటిలా ఉరుము లేని పిడుగులా హఠాత్తుగా వచ్చావ్” అన్నాడు.

“ఏం లేదు, ఈ ఏరియాలో ఓ చిన్న పని ఉంటే చూసుకుని ఇలా మీ ఆఫీసుకు వచ్చాను. అవునూ నిన్న రాత్రి పార్టీకి వస్తానని రాలేదేం”.

“ఏం చెప్పనూ! మా ఆవిడ పరమ నస మనిషి. ఒట్టి పల్లెటూరి రకం. వీకెండ్స్‌లో బయటికి వెళితే చాలు, బడ బడా వాగుతూ పెద్ద గొడవ చేస్తుంది. అందుకే ఆమె నోట్లో పడ్డం ఇష్టం లేక రావడం మానుకున్నాను. మా ఆవిడంత చాదస్తపు మనిషిని నువ్ చూసుండవ్. నూతిలో కప్పంటే నమ్ము” చెప్పాడు మధు.

“ఆ విషయం నువ్ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆమె వాలకం చూస్తేనే తెలుస్తుంది పల్లెటూరి మొద్దని. అలాంటి మహిషితో నువ్ వేగుతున్నావంటే గ్రేట్ రా బాబూ.” నవ్వుతూ చెప్పి “సరేరా వస్తా” అని వెళ్ళి పోయాడు గిరి.

ఆ సంభాషణ విన్న పక్క సీటు డి.టి.పి ఆపరేటర్ సునంద, కాస్త అసహనంగా “మధూ, మీ శ్రీమతి గురించి అతనితో అలా చెప్పడం ఏం బాలేదు. మీ మధ్య జరిగింది ఆయనకెందుకూ చెప్పడం. మీ ఆవిడ, రాత్రి పూట స్నేహితులతో పార్టీకి వెళ్ళడం మంచిది కాదని, మీ మంచి కోరే చెప్పి ఉంటుంది. అయినా, ఏది ఎంత వరకూ చెప్పాలో అంత వరకే చెప్పడం మంచిది. పరిధి దాటిపోతే,వాటి పరిణామాలు కూడా వేరేగా” అని ఆమె ఇంకా ఏదో చెప్పేంతలో-

“మీ పని చూడండి సునంద గారూ, ముందు మీ పరిధి మీరు క్రాస్ చేయకండి” చెప్పాడు మధు విసుగ్గా. ఆ తరువాత అతను బిజీగా పని చేసుకుంటుండగా ఫోన్ వచ్చింది. ఎత్తి హలో అనడమే ఆలస్యం అన్నట్టు, అవతలి వ్యక్తి “నమస్తే సార్, నా పేరు వేణు, మీరు కారం న్యూస్ చానల్‌లో చేసే స్ట్రింగ్ ఆపరేషన్స్ అంటే నాకు ఎంతో ఇష్టం. మీరు చేసే స్ట్రింగ్ ఆపరేషన్స్ కోసం కాళ్ళకి తాళ్ళు కట్టుకుని, కళ్ళకి జోడు పెట్టుకుని మరీ ఎదురుచూస్తాను. ఎక్కడెక్కడ, ఏ ఊర్లో ,ఏ ప్రాంతంలో ఏవేం అక్రమాలు జరుగుతున్నాయో సక్రమంగా పూస గుచ్చినట్టు చక్కగా వివరించి చెబుతారు మీరు. హి, హి, హి” చెప్పాడతను.

“చాలా సంతోషవండీ” చెప్పాడు మధు తెగ పొంగిపోతూ.

“నేను మీ కారం లోకల్ న్యూస్ చానల్ మాత్రమే చూస్తాను. మిగతా వార్తా చానళ్ళు చూడబుద్ది కాదు నాకు. మీ చానల్ చూడ్డానికి గల ముఖ్య కారణం మీరే సార్” చెప్పాడు ఉత్సాహంగా.

“మీ మాటలు వింటుంటే, నేను మధ్యాహ్నం అన్నం తినలేనేమో అనిపిస్తోంది.”

“అంటే నా మాటలు అంత విరక్తి కలిగిస్తున్నాయా సార్” అడిగాడు వేణు.

“అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు. నే అన్నది, మీ అభిమానం వింటుంటే, సంతోషం రెట్టింపు అయిపోతోంది. నాలో ఉత్సాహం ఉప్పెనలా పొంగిపోతోంది. మీ మాటలతోనే కడుపు నిండిపోతోంది. ఇక అన్నం తినలేనేమో అని దాని అర్థం” అని క్షణం ఆగి “మీలాంటి వారి కాల్‌ని ఇలా వదిలేయకూడదు. రికార్డు చేసి మా కారం లోకల్ న్యూస్ చానల్ ప్రేక్షకులు అందరికీ కూడా వినిపించాలని నిర్ణయించుకున్నాను. కనుక మీరు కేవలం నా స్ట్రింగ్ ఆపరేషన్స్ మాత్రమే ఎందుకు చూస్తా అన్నారో మరికాస్త వివరంగా చెప్పండి” అని తనలో తనే తెగ మురిసిపోయాడు. ఆ తరువాత, పక్కనున్న డీటీపీ ఆపరేటర్‌కి, విను అన్నట్టు సైగ చేసాడు. తరువాత, ఆ ఫోన్ రికార్డింగ్‌తో పాటు, స్పీకర్ కూడా ఆన్ చేశాడు.

“ఎంత మాట, తప్పకుండా చెబుతాను సార్. మీ స్ట్రింగ్ ఆపరేషన్స్ మాత్రమే చూడటం ఎందుకంటే, అప్పుడోసారి మా బావమరిదికి కరోనా వచ్చింది. రెమిడిసివర్ ఇంజెక్షన్ దొరక్క అందరం చిందర వందరైపోతూ టెన్షన్ పడుతుండగా, మీరు లైవ్‌లో పలాన ఏరియాలో ఈ ఇంజెక్షన్ల దందా ఎక్కువగా ఉందనీ, ఓ ముఠా కొందరు ఆటో డ్రైవర్సుని అడ్డుపెట్టుకుని వీటిని ఎంతకి ఏ ఏ ఏరియాల్లో ఎలా అమ్ముతున్నారో లాంటి మొత్తం వివరాలు చెప్పారు. దాంతో నేను అక్కడికి వెళ్ళి వారినీ వీరినీ వాకబు చేసి, హాయిగా ఆ ఇంజెక్షన్లు కొనుక్కున్నాను. మనలో మాట, మిగతా వారికి కూడా ఈ సమాచారం చెప్పి కొంత మొత్తం తీసుకున్నాను.

అలాగే, ఆ మొదటి లాక్‌డౌన్‌లో మందు లేక మంద బుద్దిలా తయారయ్యాను. అప్పుడే మీరు మీ చానల్లో, బ్లాక్‌లో మందు ఎవరు ఎలా కొనుక్కుంటున్నారో, వారి కోడ్ బాష ఏవిటో అన్నీ వివరంగా వీడియో తీసి చూపించారు. ఎప్పటినుండో మందు లేక అల్లాడిపోయిన నేను, హుటా హుటిన వెంటనే వెళ్ళి నాలుగు సీసాల మందు బాటిళ్ళు కొని తెచ్చుకున్నాను. ఆ తర్వాత వాటిని ఇంట్లో పెట్టుకుని, ఆరారా ఆ మందు నోరారా తాగాను. చాలా మేలు చేశారు సార్. అంత వరకూ ఎందుకు సార్, మొన్న మా పక్క ఊరిలో మసాలా రికార్డింగ్ డాన్సులు చూడలేకపోయానని తెగ ఇదై పోయాను. కానీ మీరు అర్ధ నగ్న నృత్యం అనే పేరుతో ఆ డాన్సులు కళ్ళకి కట్టినట్టు పదే, పదే చూపించి మరీ చెప్పారు. కాకపోతే కొంచెం అక్కడక్కడా కనబడకుండా” అని అతను ఏదో చెప్పేంతలో మధు ఆవేశంగా అడ్డుపడి “షటప్, నేను చూపించేది ప్రజల్ని, పోలీసులని అప్రమత్తం చేయడానికి. నువ్ వివరాలు తెలుసుకుని, ఇలా ఉపయోగించుకుంటావని కాదు” అంటూ అతన్ని చేడా మడా తిట్టి ఫోన్ పెట్టేసి, అయోమయంగా అటూ ఇటూ చూసాడు. అందరూ మధు వంక జాలిగా చూశారు. “చీ ఛీ పరువు తీశాడు దరిద్రుడు.” అని తల బర బరా గోక్కుని “ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారా! ఖర్మ, వీడిని దేవుడు కూడా బాగుచేయలేడు” అని ఆ డి‌టి‌పి ఆపరేటర్ వంక చూశాడు .

ఆమె చిన్నగా నవ్వుతూ, “అందుకే, ఏదీ అతి కాకూడదు. ఏది ఎవరికి చెప్పాలో, ఏది ఎంత వరకూ మాట్లాడాలో, ఏది ఎలా ఎంత వరకూ చూపించాలో మీరు ఇప్పటికైనా తెలుసుకోవాలి మరి” చెప్పిందామె.

అవును అన్నట్టు తలూపాడు మధు, ఆవదం మొహంతో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here