ఏది ఉగాది?!

0
8

[dropcap]ఎ[/dropcap]వరి కోసం ఎప్పుడాగక, మౌన సాక్షిగ సాగిపోయే
చివరె లేని కాలరూప రథము కేది లెక్కయే లేదు!√√

ఆదివారమను, బూదివారమను, రెండు సమానమే,
ఏది శతాబ్దేది ఉగా దేది పట్టదా బండి మెదడుకు!√√

పండుగని, పబ్బమని ఉబ్బి కబ్బముల నింపువాడు
ఎండి, ఆశలెండి, నిట్టూర్పు లూర్చువాడు ఈ మనిషే!√√

కడుపు నిండని బడుగు మనిషికి, లేనె లేదెపుడు పని,
గడుసు కోయిళ్ళ ఆకుటూయళ్ళ గీతాల ఆమనులతో! √√

రెక్కాడితేనె ఆడు డొక్క కొక్కటే, వినబడే ఆ సంగీతం ,
లెక్క తప్పని తాళంతో,చుట్టి వేసే తన ప్రేవుల గీతం!√√

ఎవరి కోసం ఉగాదుల, ఈ పంచాంగపు గ్రహ మార్పుల
రివాజు ఉత్సవాలు, స్తోత్రాలు, రిక్తహస్తాల దానాలు?!√√

మనిషియె పట్టని ఘనాపాఠుల కేల నీరాజనాలు?!
అణచటమే హక్కను నిర్దయ కేల వ్రృథా కైవారాలు! √√

ఒక్కడి కోస మంద రందరి కోసం ఒక్కడన్నది హుళక్కి!
చెక్కుచెదరక నే నొక్కడి నుంటే చాలు, అదే లక్ష్యం, మోక్షం!√√

ఇక తా నొచ్చానని కొసరి కొసరి కూసే కోయిల రాకతో
లోకం చేసే శుష్కార్భాటం కాదా, యీ ఉగాది నాటకం!?√√

మనిషికి, మాటకు, సత్యనిష్ఠకు, ఏ వని స్వాగతమనగ
ఆ నిరవధిక స్వేచ్ఛా సురభి అందర కందునో, నాడె ఉగాది! √√

ఆలోచనల తావులకు, ఊహల విరులకే అడ్డుగోడల
నిలపాలని ఏ నాడనుకోమో, నాడే ఆ అచ్చపు ఉగాది!√√

ప్రకృతిని విను మనిషి, ప్రజ నాదరించు ప్రభుత నాందులు
ఏ కోయిల విన్పించని ఆనంద గీతుల సిసలైన ఉగాదికి!!√√

ఇది నైరాశ్యం కాదు, విప్లవ మసలె కాదు, ఒక హెచ్చరికే!
ఏ సంఘం మూలం మరుస్తుందో, దాని తుదికిది ఆది యని√√

మూలం మనిషి, ఆలంబన ప్రకృతి, రెంటి రక్షె శ్రీకృష్ణ గీత
కాలం చూస్తోంది ఏ రాజుల, ప్రజల బుద్ధెటు మొగ్గుతోందో!√√

ఆ పరీక్షలో మన ఉత్తీర్ణతకు సంకేతమే, చల్లగ చూసేప్రకృతి
ఆ పాటి విచక్షణ లేదో, ఉగాది కనర్హుడవే, ఇదే దాని శాసనం√√

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here