సంచిక పాఠకులకు, అభిమానులకు, సాహిత్య ప్రేమికులకు… అందరికీ నమస్కారాలు. నిజానికి సంచిక పత్రిక తొలి సంచిక ఏప్రిల్ సంచిక. అంటే సంచిక ప్రారంభ సంచిక ఏప్రిల్ సంచిక. కానీ ఉగాది ప్రత్యేక సంచిక, ఆ వెంటనే రామనవమి నాడు కొన్ని కథలు, కవితలు, వ్యాసాలు ప్రచురితమవడంతో ఇంకా తొలి సంచిక ప్రచురితమవకముందే పత్రికగా ‘సంచిక’కు ఒక గుర్తింపు, పాఠకాదరణ, అభిమానాలు ఏర్పడ్డాయి. ఇది అత్యంత ఆనందకరమైన విషయమే కాదు, ఉత్సాహ ప్రోత్సాహాలను ఇనుమడింపచేసే అంశం. ఈ విధంగానే సంచిక పాఠకాభిమానాన్ని ప్రతి సంచికతో పెంచుకుంటూ పోతూ, అత్యంత ఆకర్షణీయమైన రచనలతో అందరినీ అలరింపజేయాలని కృషి చేస్తుంది. ఈ కృషిలో భాగంగానే ఏప్రిల్ సంచికలో కొన్ని కాలమ్‌లు, కొన్ని సీరియళ్ళు ఆరంభమవుతున్నాయి.
పొత్తూరి విజయలక్ష్మిగారి హాస్య సస్పెన్స్ అపరాధ పరిశోధన సీరియల్ ఏమవుతుందో…ఎటుపోతుందో..ఏమో!!!!!!ఆరంభం నుంచే ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చిత్తర్వు మధు సీరియల్ ‘భూమి నుంచి ప్లూటో దాకా…’ తెలుగు సైన్స్ ఫిక్షన్ సాహిత్య చరిత్రలో ఒక మైలురాయి వంటిది. ఇలాంటి ‘సీక్వెల్’ సీరియల్స్ ఆంగ్ల సాహిత్యంలో కోకొల్లలు. కాని తెలుగులో సైన్స్ ఫిక్షన్ సాహిత్యంలో ఇలాంటి మూడు భాగాల రచన బహుశా ఇదే ప్రథమం. అదీ సంచిక ద్వారా అందడం ఆనందదాయకం. పరిచయం అవసరం లేని సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి. ఆమెకున్న అభిమానుల సంఖ్య అశేషం. బలభద్రపాత్రుని రమణి తన జీవితానుభవాలను ‘జీవన రమణీయం’ పేరిట ధారావాహికంగా ప్రతి వారం అందిస్తున్నారు. బాలల కోసం సమ్మెట ఉమాదేవి ‘నేటి సిద్ధార్థుడు‘ ధారావాహికను ప్రత్యేకంగా అందిస్తున్నారు.
ఏప్రిల్ సంచికతో ఆరు ఫీచర్లు ప్రారంభమవుతున్నాయి. రేవూరు అనంత పద్మనాభరావు తన ఆకాశవాణి అనుభవాలను ‘ఆకాశవాణి పరిమళాలు‘ శీర్షికన ప్రతి నెల సంచిక పాఠకులతో పంచుకుంటారు. రేడియో, దూరదర్శన్‌లలో వారి అనుభవాలు వినోదాత్మకమే కాదు అనేక తెలియని విషయాలను తెలుపుతాయి. అల్లూరి గౌరీలక్ష్మి నెల నెలా జీవితంలోని విభిన్నమైన రంగుల గురించిన ఆలోచనలను ‘రంగుల హేల‘ శీర్షిక ద్వారా పంచుకుంటారు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, విభిన్నమైన రచనలు విశిష్టంగా సృజించి ప్రసిద్ధి చెందిన సలీం ప్రతి పదిహేను రోజులకొకసారి ఒక’కల్పిక‘ ను సంచిక పాఠకులకు అందిస్తారు. ప్రఖ్యాత విమర్శకుడు ‘తెలంగాణ మలితరం కథకులు- కథన రీతులు ‘ శీర్షికన 1960 – 1970 నడుమ తెలంగాణ కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కథకుల పరిచయాలు, కథా విశ్లేషణాత్మక వ్యాసాలు అందిస్తారు.
ఈ నెల ప్రత్యేక వ్యాసం – నగరం పొలిమేరల్లోని ‘మేథ తోట‘ ‘స్వాధ్యాయ‘ గురించినది. కోవెల సుప్రసన్నాచార్య గారి కల అది. రీసెర్చి స్కాలర్లకు, సాహిత్య పిపాసులకు, రిఫరెన్స్ కోసం అవసరమయ్యే పుస్తకాలన్నింటినీ ఒక చోట చేర్చి అందించాలన్నది వారి ఆశయం. ఫలితంగా వారి తనయుడు కోవెల సంతోష్ కుమార్ ‘స్వాధ్యాయ’ అనే మేథ తోట (లైబ్రరీకి తెలుగు పదం) ను ఏర్పాటు చేశారు. దాని పరిచయం ఈ వారం ప్రత్యేక వ్యాసం.
‘వ్యాసం’ వర్గంలో శ్రీవల్లీ రాధిక ‘కాల్పనిక సాహిత్యంలో ధర్మసూక్ష్మాల‘ను వివరిస్తే, వి.ఎ.కుమారస్వామి గారు ‘అధ్యాపన పద్ధతుల’ను బోధిస్తున్నారు. కోవెల సుప్రసన్నగారు ప్రతీ నెల విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యాన్ని విశ్లేషిస్తూ అందించే వ్యాసపరంపరలో తొలి వ్యాసం ‘వేయి పడగలు – విశ్వలయ‘. వేయిపడగలను నూతన దృక్పథంతో విశ్లేషిస్తుంది. వేయి పడగల పఠనానికి నూతన దృష్టిని అందిస్తుంది.
ఇంకా కథలు, కవితలు, పుస్తక పరిచయం, సభలు, పుస్తక సమీక్ష, సినీ విశ్లేషణ, సినీ సమీక్షల వంటి అనేక అంశాలను ఇకపై ప్రతి సంచిక అందిస్తుంది. అయితే ఇతర వెబ్ పత్రికలకు భిన్నంగా సంచిక డైనమిక్ వెబ్ పత్రిక కావడంతో, కొన్ని ఫీచర్లు, సీరియల్స్ వారం వారం, మరికొన్ని పదిహేను రోజుల కొకసారి, ఇంకొన్ని నెలకొకసారి అందుతాయి. కాబట్టి ఎప్పుడు ఏ రచన ప్రచురితమవుతుందో తెలియక కలిగే సందిగ్ధం నుంచి తప్పించుకోవాలంటే సంచిక పాఠకులు సంచికకు సబ్‌స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా ఉచితం. సబ్‌స్క్రైబ్ చేయటం వల్ల సంచికలోని రచనలు ప్రచురితమైన వెంటనే సంచిక అందుతుంది. దాని ఆధారంగా రచనలను చదవచ్చు. ఈ రకంగా ‘ఎప్పుడొస్తుందో’ అన్న ఎదురుచూపులకు, రచనను మిస్ అవటాన్ని తప్పించుకోవచ్చు.
మరిన్ని నూతన రచనలతో, విభిన్నమైన అంశాలతో ‘మే’ నెల సంచిక మీ ముందుకు వస్తుంది. ఈలోగా సంచికలోని రచనలను చదివి నిర్మొహమాటమైన అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలపాలని పాఠకులకు మనవి. ఇంకా ఎలాంటి రచనలు సంచిక నుంచి ఆశిస్తున్నారో తెలిపితే, వీలు వెంబడి అలాంటి రచనలను అందించే ప్రయత్నం చేస్తాము. ఎలాగయితే సాహిత్యం అందరిదో, సంచిక పత్రిక కూడా మన అందరిదీ. రచనలు, సలహాలు, సూచనలతో సంచిక అందరినీ అలరించే విధంగా తీర్చిదిద్దే వీలు కల్పించంది. తద్వారా మనకు సంతృప్తి, ఆనందాలు లభిస్తాయి. సాహిత్యం సుసంపన్నమవుతుంది.
అన్ని వైపుల నుంచీ అందే ఉన్నతమైన రచనలకు ఆహ్వానం పలుకుతోంది తెలుగు సాహిత్య వేదిక – సంచిక.