సంపాదకీయం ఆగస్ట్ 2021

0
7

[dropcap]సం[/dropcap]చిక పాఠకులకు, తెలుగు సాహిత్య అభిమానులకు నమస్కారం.. దిలీప్ కుమార్ 40 సినిమాల పరిచయ వ్యాసాలను విపరీతంగా ఆదరిస్తూ, ఉత్తమ సాహిత్య విలువలతో, విభిన్నమయిన సమాచారాన్నందించే రచనలను పాఠకులు ఆదరిస్తారన్న మా విశ్వాసాన్ని మరింత బలపరిచినందుకు తెలుగు సాహిత్యాభిమానులందరికీ బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.

నిరంతరం పాఠకులు మెచ్చే రచనలను ఉత్తమ సాహిత్య విలువలతో అందించాలని సంచిక తపన పడుతుంది. విభిన్నమయిన రచనలతో, విశిష్టమయిన శీర్షికలతో మరింతమంది పాఠకులకు ఆకర్షించాలని, అలరించాలని ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా కొత్త కొత్త రచనలను అందించాలని అనుక్షణం ఆలోచిస్తూంటుంది. పాఠకులను అలరించే శీర్షికలను అందించే ప్రయత్నంలో భాగంగా, ఒకప్పుడు విపరీతంగా ప్రజాదరణ పొంది, చారిత్రక విలువ కలిగి ఇప్పుడు విస్మృతిలో పడిన ఉత్తమ గ్రంథాలను పునః పరిచయం చేయబోతోంది సంచిక. గ్రాంథిక భాషలో వున్న ఆయా గ్రంథాలను సరళ వ్యావహారికంలో అందిస్తుంది.  ఒకప్పటి సాహిత్య వ్యాసాలను, విశ్లేషణాత్మక వ్యాసాలనూ తిరిగి అందించటంద్వారా, పాఠకులలో, రచయితలలో, విమర్శకులలో సాహిత్య చైతన్యాన్ని రగిలించాలని ఆశిస్తోంది.  అలాగే ఇంతవరకూ తెలుగులోకి రాని మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు కథలను తెలుగులోకి అనువదించి అందిస్తుంది సంచిక.

తయారుచేసిన సత్యం, మాన్యుఫాక్చర్ద్ ట్రూత్( manufactured truth)  అన్న పదం వుంది. దీన్ని ముఖ్యంగా సమకాలీన రాజకీయాలలో అధికంగా వాడుతున్నారు. ఒక ఆబద్ధాన్ని ఎవరో వాట్సప్ లోనో, ట్విట్టర్ లోనో, ఫేస్‌బుక్ లోనో, లేదా ఇంకేదో రకంగానో ప్రకటిస్తారు. దాన్ని, ఒక పథకం ప్రకారం ప్రచారంలోకి తెస్తారు. ఇక మీడియా దాన్ని అందుకుంటుంది. దానిపై చర్చలు చేస్తుంది. పత్రికలు హెడ్‌లైన్లలో ఆ విషయాన్ని ప్రకటిస్తూ, ఏదో ఘోరం జరిగిపోయిందన్నట్టు ప్రజల మెదళ్ళను ప్రభావితం చేస్తారు. దాంతో అబద్ధం నిజం అయిపోతుంది. ఎప్పుడో నిజం తెలుస్తుంది. అప్పటికే వారి లక్ష్యం నెరవేరుతుంది. అప్పటకి నిజం తెలిసినా లాభం లేని పరిస్థితి నెలకొంటుంది. ఈ తయారుచేసిన సత్యం, దేశంలో ఎన్నికలప్పుడు, తీవ్ర స్థాయికి చేరుకుంటుంది.

ఆ మధ్య చర్చ్ పై దాడి జరిగింది. ఎన్నికలలో వారికి నచ్చని పార్టీ ఓడే వరకూ గోల జరిగింది. చివరికి ఈ విషయం అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఇతర దేశాలు మన దేశానికి హితవు చెప్పాయి. ఆందోళన వ్యక్తం చేశాయి. నిరసన తెలిపాయి. ఎన్నికలయి ఫలితాలు రాగానే అంతా శాంతం. దాదాపుగా ప్రతి విషయంలోనూ ఇదే జరుగుతోంది. సంబంధంవున్నా లేకున్నా ప్రతి విషయం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంతోంది, దేశ ప్రతిష్టను తగ్గిస్తోంది.

తరువాత లించింగ్.., ఇన్‌టాలెరన్స్,  అవార్డు వాపసీ, ఆందోళనలు, విదేశాల్లో నిరసనలు, వేరే దేశాల నాయకుల వ్యాఖ్యలు… మళ్ళీ ఎన్నికల ఫలితాలు రాగానే అంతా నిశ్శబ్దం. తరువాత, రాఫేల్, సీఏఏ, రైతుల ఉద్యమం ఇలా ఉద్యమం, ఇలా, కారణం ఏదయినా ప్రధాన లక్ష్యం ఎన్నికల సమయంలో ప్రభుత్వాన్ని ప్రజల దృష్టిలో పనికిరానిదిగా చూపటం, అధికారం చేజిక్కించుకోవటం తప్ప ఈ తయారుచేసిన సత్యానికి మరో ఉద్దేశం లేదు. ప్రజల శ్రేయస్సనే భావననే లేదు. అదే వుంటే, కరోనా ప్రబలుతున్న సమయంలో ప్రజల ప్రాణాలతో ఆటలాడేవారు కాదు. వాక్సిన్‌ల విషయంలో ఇన్ని అనుమానాలు, ఇంతటి దుష్ప్రచారమూ జరిగేది కాదు. ఆక్సిజన్ లేక ప్రజలు వీధుల్లో ప్రాణాలు వదిలేవారు కారు. దేశ ప్రతిష్ఠ అంతర్జాతీంగా దిగజారేది కాదు. ఇదంతా బెంగాల్ ఎన్నికలు కాగానే శాంతం అయిపోవటం తయారుచేసిన సత్యం ప్రభావాన్ని చూపుతుంది. కేరళ కోవిడ్‌ను ఎదుర్కొన్న విధానం గురించి దేశమంతా చర్చ జరిగింది. ఉత్తర ప్రదేశ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, ఇప్పుడు దేశంలో అధికంగా కరోనా కేరళలోనే వుంది. ఇప్పుడు త్వరలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఆందోళన జీవులకు ఆక్సిజన్ సిలండర్లు దేశవిదేశాలనుంచి అందుతాయి. ఇలాంటి తయారుచేసిన సత్యమే ఇజ్రాయెల్ తయారు చేసిన స్పై వేర్ ప్రచారం. ఆలూ లేదు చూలూ లేదు కూతురికి మనుమరాలు పుట్టిందన్నట్టు, అసలు ప్రముఖుల ఫోన్లు టాప్ అయ్యాయో లేదో తెలియదు కానీ, కమిటీలు, విచారణలు గోలా సాగిపోతున్నాయి. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల కోసం అసత్య నిర్మాణం మొదలయిపోయిందన్నమాట. ఈ గోలలన్నిటిలో స్పష్టంగా తెలుస్తున్నదేమిటంటే, ప్రస్తుత ప్రభుత్వం తయారుచేసిన సత్యాల ప్రచారాన్ని నిరోధించటంలో విఫలమవుతోంది. కేంద్ర ప్రభుత్వం అందించేవి రాష్ట్ర ప్రభుత్వాలు తమ వరాలుగా ప్రచారం చేసుకుంటుంటే కూడా నిజం చెప్పలేని స్థితిలో వుంది ప్రభుత్వం. నిజం చెప్పాలని ప్రయత్నించినా అది అబద్ధంగా ధ్వనించేంత రీతిలో అసత్యాన్ని నిర్మిస్తున్నారు. చివరికి ఆక్సిజన్ లేక మరణించిన వారి గణాంక వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తే వాటిని కలిపి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందన్న నిజాన్ని విస్మరించి మరీ దుష్ప్రచారం తీవ్రంగా సాగింది. ఇలాంటి తయారయిన సత్యాలు కొందరికి తాత్కాలిక లాభాలు తెచ్చిపెట్టినా ఇవి దేశానికి శాశ్వత నష్టాన్ని కలుగచేస్తాయి.

ఇలాంటి తయారుచేసిన సత్యాలు తెలుగు సాహిత్యాన్ని కూడా పట్టిపీడిస్తున్నాయి. ఇటీవలే కొందరు పనికట్టుకుని తెలుగు సాహిత్యంలో హిస్టారికల్ ఫిక్షన్ రచనలకు ఆద్యులం తామే అనీ, గత ఇరవై, ముప్పై సంవత్సరాలుగా తెలుగులో హిస్టారికల్ ఫిక్షన్ సాహిత్యమే లేదని, తామే ఆరంభించి ఉద్ధరించి, ప్రామాణికాలేర్పరుస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. వందిమాగధ గణ భజన బృందాలతో డప్పులు కొట్టించుకుంటున్నారు. ఇల్లెక్కి, గొంతులెత్తి అరుస్తున్నారు.    తమని తాము మభ్యపెట్టుకుంటూ, ఇతరులను మభ్యపెట్టటమనే అభాస నాటకం ఎంత స్థాయికి చెరిందంటే, హిస్టారికల్ ఫిక్షన్ కథలో హిస్టరీ తప్పుందంటే, అది అంత పట్టించుకోవాల్సింది కాదని రచయితలూ, సంపాదకులూ సమర్థించుకుని తప్పు  చూపించినవాడిదే దోషమన్న రీతిలో డప్పులుకొట్టుకోవటం, దానికి వందిమాగధ భజన బృంద గణాలు తప్పట్లు తాళాలువేస్తూ అసత్యాన్ని సత్యం చేయటంలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. రాజకీయ రంగంలో తయారుచేసిన అసత్యాన్ని, ఆసక్తిలేక ఎదుర్కోలేకపోయినా, సాహిత్య రంగంలో ఇలాంటి అసత్య తయారీలను అడ్డుకొని నిజానిజాలు వివరించాలని సంచిక ప్రయత్నిస్తోంది. ఇందులో వ్యక్తిగతమేమీలేదు. కేవలం సాహిత్య సంబంధి ఈ ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగా సంచిక త్వరలో తెలుగులో హిస్టారికల్ ఫిక్షన్ కథల సంకలనం తయారుచేస్తోంది. 1912లో ప్రచురితమయిన తొలి హిస్టారికల్ ఫిక్షన్ కథనుంచి, నేటివరకూ ప్రచురితమయిన కథలను వీలయినన్ని పరిశీలించి, చక్కని కథలను ఎంచుకుని సంకలించాలనుకుంటోంది. ఎంతో చరిత్ర వున్న తెలుగు హిస్టారికల్ ఫిక్షన్ చరిత్రను తమకే పరిమితం చేసుకోవాలనే ప్రయత్నాలను ఎదుర్కోవటంలో భాగంగా త్వరలో సంచికలో తెలుగులో హిస్టారికల ఫిక్షన్ రచనలను పరిశీలించి విశ్లేషించే వ్యాస పరంపర ఆరంభమవుతుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే సంచిక త్వరలో హిస్టారికల్ ఫిక్షన్ కథల పోటీని నిర్వహించబోతోంది. వివరాలు త్వరలో ప్రకటిస్తుంది. ఇప్పటినుంచే కలాలకు పదునుపెట్టి మెదడును ఆ వైపు నెట్టి సిద్ధపడటం ఆరంభించండి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయటంలో సంచికకు మీ సహాయ సహకారాలందించండి.

1 ఆగస్ట్ 2021 నాటి సంచికలో ప్రచురితమవుతున్న రచనల వివరాలివి

సంభాషణం:

  • ప్రొఫెసర్ విజయ రేచల్ అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్

ప్రత్యేక వ్యాసం:

  • మా అన్న మీనన్ మలయాళీ కాదు – డా. కె.ఎల్.వి. ప్రసాద్

సీరియల్స్:

  • కశ్మీర రాజతరంగిణి -43 – కస్తూరి మురళీకృష్ణ
  • జీవన రమణీయం-171- బలభద్రపాత్రుని రమణి
  • రెండు ఆకాశాల మధ్య -25 – సలీం
  • ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు -13 – గంటి భానుమతి
  • కలగంటినే చెలీ-6- సన్నిహిత్

కాలమ్స్:

  • రంగుల హేల 41: చిత్రమైన హింసలు – అల్లూరి గౌరిలక్ష్మి
  • ఆచార్యదేవోభవ-31 – డా. రేవూరు అనంతపద్మనాభరావు
  • అలనాటి అపురూపాలు -75 – లక్ష్మీ ప్రియ పాకనాటి
  • జ్ఞాపకాల పందిరి-69- డా. కె. ఎల్. వి. ప్రసాద్
  • నా జీవన గమనంలో… 31 – తోట సాంబశివరావు
  • జ్ఞాపకాల తరంగిణి-6 – డా. పురుషోత్తం కాళిదాసు
  • ఇది నా కలం-5 : స్ఫూర్తి కందివనం – సంచిక టీమ్
  • అన్నింట అంతరాత్మ-7: పాదసేవకుడిని,, పాదరక్షను నేను! – జె. శ్యామల
  • కాజాల్లాంటి బాజాలు-82 టైమేదీ? – జి.ఎస్. లక్ష్మి

గళ్ళ నుడికట్టు:

  • సంచిక-పదప్రహేళిక- ఆగస్టు 2021- దినవహి సత్యవతి
  • కొత్త పదసంచిక-1 – ఎమ్మెస్వీ గంగరాజు

వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా -17 – ఆర్. లక్ష్మి
  • రామం భజే శ్యామలం-51- కోవెల సంతోష్ కుమార్
  • బాల సాహిత్యం – ఒక పరిశీలన – ఎన్. కె. బాబు

భక్తి:

  • యాత్రా దీపిక – చిత్తూరు జిల్లా 42 పళ్ళికొండేశ్వరస్వామి – పి.యస్.యమ్. లక్ష్మి
  • సత్యాన్వేషణ- 52 – సంధ్య యల్లాప్రగడ

కవితలు:

  • డైరీ లోపల – శ్రీధర్ చౌడారపు
  • స్నేహం – డా. కోగంటి విజయ్
  • అంటు మామిడి తోట కాడ – సాదనాల వేంకటస్వామి నాయుడు
  • చివరి మాట – ఝాన్సీ కొప్పిశెట్టి
  • సాహితీ సముద్రుడు సినారె – డా.టి.రాధాకృష్ణమాచార్యులు

కథలు:

  • పొత్తాలు – అగరం వసంత్
  • విజయనగరంలో ఆ రాత్రి – కౌండిన్య భోగరాజు
  • అందం – యమ్.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి

విద్య:

  • ఈజీగా ఇంగ్లీష్ ఛాప్టర్-9 – డా. వివేకానంద్ రాయపెద్ది
  • సరిగ్గా వ్రాద్దామా-4 – నండూరి సుందరీ నాగమణి

పుస్తకాలు:

  • మహా యోగిని త్రిజట – పుస్తక విశ్లేషణ – డా. సిహెచ్. సుశీల

ప్రయాణం:

  • సోమశిల సందర్శనం – నర్మద రెడ్డి

సినిమాలు:

  • ఒక దిలీప్‍కుమార్ – నలభై పార్శ్వాలు -18 హల్‌చల్ – సినీ పరిచయం – పి. జ్యోతి
  • కమర్షియల్ మసాలా లేని ‘మేము’ – సినీ విశ్లేషణ – ఎం. బిందుమాధవి

బాలసంచిక:

  • మంత్రకత్తె ఆటకట్టు – కంచనపల్లి వేంకటకృష్ణారావు
  • మా బాల కథలు-7. అమ్మ నైవేద్యం – ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి

అవీ ఇవీ:

  • దేవ గురువు బృహస్పతి – అంబడిపూడి శ్యామసుందర రావు
  • ‘సిరికోన’ చర్చా కదంబం 1 – డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ
  • కమలా నెహ్రూ – పుట్టి నాగలక్ష్మి
  • శ్రీ డబ్బీ చెల్లయ్య గారి స్మారకోపన్యాస సభ ప్రెస్ నోట్ – ఘండికోట విశ్వనాధం
  • శ్రీమతి కోడూరి పార్వతి స్మారక ప్రప్రథమ విశిష్ట పురస్కార ప్రదానోత్సవం – డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ
  • పిడపర్తి వెంకట రమణశర్మ గారి జ్ఞాపకార్థం కథల పోటీ 2021 ప్రకటన – సంచిక టీమ్

సలహాలు, సూచనలు రచనలతో తెలుగు సాహిత్యాభివృద్ధికి తోడ్పడాలని పాఠకులకు, రచయితలకూ విన్నపం.

సంపాదక బృందం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here