సంపాదకీయం డిసెంబరు 2023

6
10

[dropcap]‘మ[/dropcap] రో సంవత్సరం వెనక్కి వెళ్ళిపోతోంది. 2023 సంవత్సరంలో చివరి నెలలో వున్నాం. ఇప్పుడు మార్పుల కాలం నడుస్తోంది. ఇంకో రెండు రోజుల్లో నాలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారంలో వున్న పార్టీ కొనసాగటమో, కొత్త పార్టీ అధికారానికి రావటమో తేలిపోతుంది. ఆపై వెంటనే అందరి దృష్టి వచ్చే సంవత్సరం జరిగబోయే పార్లమెంట్ ఎన్నికలపైకి మళ్ళుతుంది. ఎంత వద్దనుకున్నా సాహిత్యంపై రాజకీయాల ప్రభావాన్ని విస్మరించలేని పరిస్థితులు సాహిత్య ప్రపంచంలో నెలకొనివున్నాయి. ఒక రచయిత పరిచయం కాగానే ఆ రచయిత కుడివైపా? ఎడమవైపా? అని అంచనా వేయటం, ఆపై, ఆ రచయితను తమవైపు ఆకర్షించాలని ప్రయత్నించటం ఎప్పటినుంచో తెలుగు సాహిత్యప్రపంచంలో స్థిరపడివుంది. అలా ఆకర్షించటంలో, అవార్డులు, సన్మానాలు, పత్రికలలో పొగడ్తల వ్యాసాలు, మీడియాలో ఇంటర్వ్యూలను ఎరల్లాగా వాడటమూ తెలుగు సాహిత్య ప్రపంచంలో స్థిరపడివుంది. ఈ ప్రక్రియలో భాగంగా తమ మాట విననివారిని, తమతో జత కట్టనివారినీ, వారి రచనలనూ విస్మరించటం సర్వసాధారణమయింది. ఈ విస్మరించటం ఏ స్థాయిలో ఉందంటే, అసలు అలాంటి రచయితలున్నారని, వారి రచనలున్నాయనీ కూడా గుర్తించనంత! తమతో లేని వారి పేరు ఉచ్చరించటమే పాపమనుకునేంత! అలా ఎవరయినా పొరపాటున  వారి పేర్లు తలచినా, వారి రచనలను ప్రస్తావించినా  వారు వెలివేతకు గురయ్యేంత! సమ సమాజమనీ, వర్గ వర్ణ భేదాలు లేక అందరూ ఒకటై కలసివుండెే ఒక అద్భుతమయిన సమాజాన్ని కాంక్షిస్తూ, వివక్షతా రహిత సమాజాన్ని, విశాల భావాలు   కోరే వారే సాహిత్యంలో వివక్షతను పాటిస్తూ, సాహిత్య పరిథిని కుచింపచేయటం ఒక విచిత్రమైన దురదృష్టకర స్థితి. ఇందువల్ల సాహిత్యానికి తీవ్రమైన నష్టం కలుగుతోంది. ముఖ్యంగా, ఇలాంటి వివక్షతను చూపే వారందరూ ఒక జట్టుగా వుండి, సామాజికంగా కీలకమైన స్థానాలలో వుండటంవల్ల, పదిమంది అభిప్రాయాన్ని ప్రభావితం చేయగల స్థితిలో వుండటంవల్ల వ్యక్తిగతంగా వారికి లాభంగా వున్నా, సాహిత్యానికి, సమాజానికీ, ముఖ్యంగా భవిష్యత్తరాలకూ తిరిగి సరిచేయలేనంత నష్టం సంభవిస్తోంది. సాహిత్య మాఫియా ముఠాల్లాగ ఏర్పడి, వీరు తెలుగు సాహిత్యాన్ని తమ గుప్పెట్లొ పెట్టుకున్నారు. నలిపి, చిదిమి, నేలరాసి ధూళిలో కలిపేస్తున్నారు. ఈ ముఠాలు చెప్పింది సాహిత్యంగా, మెచ్చింది ఉత్తమ రచనగా, నచ్చినవాడు ఉత్తమ రచయితగా, రచనా నైపుణ్యం, నాణ్యతలతో సంబంధం లేకుండా చలామణీ అవటం ఎంత కాదనాలనుకున్నా కాదనలేని సత్యం.

సాహిత్య సృజనకు తోడు, నీడగా వుంటూ అనుబంధంగా కొనసాగాల్సిన విమర్శ కూడా ముఠాల గుప్పిట్లో చిక్కుకోవటం మరో విషాదం. సాహిత్య పరిశోధనకూ, సాహిత్య విశ్లేషణకూ ఆలవాలంగా వుండాల్సిన విద్యా సంస్థలు, విశ్వ విద్యాలయాలు కూడా మాఫియా ముఠాలకు అనుబంధాలుగానో, వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అనుకూలంగానో వ్యవహరిస్తూండటం వల్ల తెలుగు సాహిత్య విశ్లేషణలో అధ్యయనం, అవగాహన, లోతైన ఆలోచనలు లుప్తమైపోతున్నాయి. దీనివల్ల, ఎవరికి వారు, తానేమన్నా తందాన అనే ఒక పదిమందిని చేర్చుకోగలిగినా, మాఫియా ముఠాల సమర్ధన సాధించగలిగినా తెలుగు సాహిత్యానికి తానే ఆద్యుడని ప్రకటించి ఆమోదం కూడా పొందగలిగే దుస్థితి తెలుగు సాహిత్య ప్రపంచంలో నెలకొనివుంది.  ఇటువంటి పరిస్థితుల్లో, ప్రాచీన సాహిత్య అధ్యయనం అటుంచి, కేవలం తామే ముఠాతో అనుబంధం ఏర్పరచుకున్నారో ఆ ముఠా నాయకుల రచనలు మాత్రమే చదివి అదే తెలుగు సాహిత్యం అనుకునే ఒక కుర్ర పరాన్నజీవ యువరచయితల తరం తెరపైకి వస్తోంది.

మరోవైపు, తమలోని సాహిత్యసృజన తృష్ణను అణచిపెట్టి జీవికపోరాటంలో జీవితం గడిపి విశ్రాంత జీవితంలో రచనలవైపు మళ్ళుతున్న తరం కూడా అధికంగా కనిపిస్తోంది. ఇదొక విచిత్రమైన పరిస్థితి. యువ రచయితలు అత్యంత ఉత్సాహం కల రచయితలు. విభిన్నమైన రచనలతో తమ శైలికి మెరుగుపెట్టుకుంటూ సాహిత్యాన్ని సుసంపన్నం చేయగలిగే శక్తి కలవారు. వారు ముఠాల గుప్పిట్లలో స్వచ్ఛందంగా ఒదిగి, ఒకే రకమైన రచనలు చేస్తూ, అవార్డులు పొందుతూ, మొదటి అడుగులోనే తామిక నేర్చుకునేదేమీ లేదని జీవితసాఫల్య పురస్కారాలకు బాట నిర్మించుకుంటున్నారు. నిరంతర సృజనద్వారా రచన స్థాయిని పెంచుకుంటూ, నాణ్యతను మెరుగు పరచుకునే బదులు, వేదికలెక్కి ఉపన్యాసాలివ్వటం, పొగడ్తలు, అవార్డుల ప్రలోభాల్లో పడుతున్నారు. పేరు ఎంత గొప్పదిగా చలామణి అయితే అంత గొప్పవారమని భ్రమిస్తూ, రచనల జోలికి పోవటంలేదు. రిటయిర్మెంట్ తరువాత రచనలు ఆరంభించినవారు జీవితంలో ఒక స్థాయికి చేరుకున్నవారు. వారి అనుభవాలవల్ల ఒక స్థాయి పరిణతిని సాధించినవారు. వారి రచనలు సైతం ఒక పరిథిని దాటవు. వారినుంచి చిత్ర విచిత్రమైన రచనలను ఆశించలేము. అంటే, విభిన్నంగా, ఉత్సాహంగా పలు రకాలయిన రచనలను చేయగలిగే యువ రచయితలు రచనలకన్నా ఇతరాలపై దృష్టిపెడుతూంటే, ఉత్సాహంగా రచనలు చేస్తున్న రిటైర్మెంట్ వయసువారు పరిమిత పరిధిలో రచనలు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం తెలుగు పత్రికలు నడిపేవారిని ఒక గమ్మత్తయిన పరిస్థితిలోకి నెడుతోంది.

యువ రచయితలు తమ మాఫియా ముఠాల జట్టు గుర్తించిన పత్రికలనే పత్రికలుగా గుర్తిస్తారు. ఆ పత్రికలకే రచనలు చేస్తారు. ఆ పత్రికలో తమవారు చేసే రచనలనే చదవకున్నా పొగడుతారు. ఏ ముఠాకీ చెందక, ఏ వొక్క వ్యక్తికీ కొమ్ము కాయక, కేవలం సాహిత్యానికే పెద్ద పీటవేసే ‘సంచిక’ లాంటి పత్రికలకు వారు రాయరు. రాస్తే విశాలభావాలను ప్రవచించేవారు వీరిని వెలివేస్తారు. ఇక పరిణత రచయితలు కూడా ఈ మాఫియా ముఠాల దృష్టిలో పడాలని తమ స్వీయ వ్యక్తిత్వాన్ని విస్మరించే ప్రయత్నాలు చూస్తూండటం బాధాకరం. అయితే, కొందరు మాత్రం ఎలాంటి ప్రలోభాలలో పడకుండా తమకు నచ్చిన రీతిలో రాస్తున్నారు. వారు ‘సంచిక’కు రాసేందుకు ఏమాత్రం భయపడరు. ఎవరి మెప్పుల కోసమో, అవార్డుల కోసమో కాకుండా తమకు నచ్చినట్టు రాస్తారీ రచయితలు. పత్రికలు మూత పడుతున్నప్పుడల్లా, కడవలకొద్దీ మొసలి కన్నీళ్ళు కార్చేవారు, నడుస్తున్న పత్రికలు  సాహిత్యానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తే, వాటిపై అప్రకటిత నిషేధం ప్రకటిస్తున్నారన్నమాట…మళ్ళీ తెలుగు చదివేవారు తగ్గుతూ తెలుగు ప్రమాదంలో పడిందని వేదికలెక్కి వాపోయేవారూ వీరే!!!

అయితే, విభిన్నమైన రచనలను విశిష్టమైన రీతిలో అందిస్తూ, అన్ని తరాల పాఠకులను ఆకర్షించాలని , తెలుగు సాహిత్య పరిథిని విస్తృతం చేయాలని, ఒక తరం నుంచి మరో తరానికి అందుతూ తరం తరం నిరంతరం సజీవ స్రవంతిలా తెలుగు సాహిత్యాన్ని నిలిపేందుకు తనవంతు ప్రయత్నం చేయాలని ‘సంచిక’ ప్రయత్నిస్టోంది. కానీ, ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో విభిన్నమైన రచనలను చేసేవారు లభించటం లేదు. రచయితలలో షార్ట్‌కట్‍లు వెతికేవారే తప్ప, రచనలను విశిష్టంగా చేయాలన్న తీవ్రమైన తపన,  passion,  యువ రచయితలలో కనిపించటంలేదు. ఇలాంటి పాషన్‌ను పరిణతి పొందిన రచయితల నుంచి ఆశించటం కుదరదు. అయినాసరే కొందరు రచయితలు విస్తృతంగా, విశిష్టంగా రచనలు సంచిక కోసం  చేస్తూండటం ‘సంచిక’ అదృష్టం. కానీ,  ఇంకా అనేక రకమైన రచనలు పాఠకులకు అందించాలని ‘సంచిక’ తపిస్తోంది. ఆత్రపడుతోంది.  అనెేక విశిష్టమైన పర భాషల రచనలను తెలుగు పాఠకులకు అందించాలనుకుంటోంది.  కానీ, సంచిక కోరిన అంశాల ఆధారంగా వ్యాసాలు రాసేవారు లేరు. అనువాదాలు చేసేవారు లేరు. విమర్శ అంటే తెలుసుకుని నిష్పాక్షిక విమర్శ చేయాలనుకునేవారు లేరు. సాహిత్యం అంటే, ఒకే రకమైన భావజాలంతో, ఒకే రకమైన రీతిలో, ఒకే రకమైన రచనలు చేయటమే అనుకుంటున్న యువ రచయితలు సాహిత్యం విస్తృతిని వైశాల్యాన్ని గుర్తించలేరు. అయినా సరే, ‘సంచిక’ తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నది. త్వరలో విభిన్నమైన రచనలు చేయటంలో వయసుతో సంబంధం లేకుండా ఔత్సాహికులకు శిక్షణ నివ్వాలని  పథకాలు వేస్తోంది. ఈ పథకాలను త్వరలో ఆచరణలో పెడుతుంది. అలాగే, రామకథాసుధ సంకలనం తరువాత నూతన సంకలనానికి సంబంధించిన విషయాలను త్వరలో ప్రకటిస్తుంది.

పాఠకులకు వైవిధ్యమైన రచనలను అందించాలని ‘సంచిక’ పత్రిక సదా కృషి చేస్తోంది.

విభిన్న దృక్కోణాలకు, విభిన్న స్వరాలకూ చోటిస్తున్న విశిష్టమైన సాహిత్య వేదిక ‘సంచిక’ లోని అన్ని రచనలు చదువరులను ఆకట్టుకుంటున్నాయి.

పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు గాను కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

ఉత్తమ సాహిత్యాన్ని పాఠకులకు అందించాలన్న ‘సంచిక’ ప్రయత్నాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము.

ఎప్పటిలానే సీరియల్, వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడికట్టు, ఇంటర్వ్యూ, పిల్లల కథ, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 డిసెంబరు 2023 సంచిక.

1 డిసెంబరు 2023 నాటి ‘సంచిక’లోని రచనలు:

సంభాషణం:

  • శ్రీమతి పుట్టి నాగలక్ష్మి అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్

సీరియల్:

  • అంతరిక్షంలో మృత్యునౌక-4 – పాణ్యం దత్తశర్మ

కాలమ్స్:

  • సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో…20 – వి. శాంతిప్రబోధ – సారధి మోటమఱ్ఱి
  • శ్రీ మహా భారతంలో మంచి కథలు-4 – శ్రీ కుంతి

గళ్ళ నుడికట్టు:

  • సంచిక-పదప్రహేళిక- డిసెంబరు 2023- దినవహి సత్యవతి

వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా -45 – ఆర్. లక్ష్మి
  • మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు-7 – పాణ్యం దత్తశర్మ

కవితలు:

  • పాకానపడిన ప్రేమకథ – శ్రీధర్ చౌడారపు
  • మాటంటే..! – డా. విజయ్ కోగంటి
  • చందలూరి మినీ కవితలు – చందలూరి నారాయణరావు
  • అనుభవాల కడలి – డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి
  • నన్ను నేను తెలుసుకుంటూ (అనువాద కవిత) -మూలం: డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి, అనువాదం: కొల్లూరి సోమ శంకర్

కథలు:

  • గులాబీ రంగు రోడ్డు – సలీం
  • ‘సుమా’నవత్వం – గంగాధర్ వడ్లమన్నాటి
  • స్వయం భక్షణ – జి.వి. కళ్యాణ శ్రీనివాస్

పుస్తకాలు:

  • శతాబ్దంన్నర కాలపు తెలుగు సాహిత్య వైభవాల చరిత్ర, ఒక సింహావలోకనం – ‘సబ్బని సాహిత్య వ్యాసములు’ – పుస్తక సమీక్ష – సంకేపల్లి నాగేంద్రశర్మ

బాల సంచిక:

  • అరుదైన జంతువు – కంచనపల్లి వేంకటకృష్ణారావు

అవీ ఇవీ:

  • సహస్ర బాహుల ‘కార్తవీర్యార్జునుడు’ – అంబడిపూడి శ్యామసుందర రావు
  • తెలుగు రామాయణానికి కీర్తి కిరీటమీ పద్యం – వేదాల గీతాచార్య
  • శిశుపాల వధ – కురుక్షేత్ర యుద్ధానికి నాంది పలికిందా? – పాలకుర్తి రామమూర్తి

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here