సంపాదకీయం ఫిబ్రవరి 2021

6
12

[dropcap]సం[/dropcap]చిక పాఠకులకు, సాహిత్య ప్రేమికులకు వందనాలు. ప్రస్తుతం తెలుగు సాహిత్యం ఏ స్థాయిలో వున్నదంటే హైదరాబాదులో జరిగే సాహిత్య పండుగలో తెలుగు సాహిత్యానికి స్థానం లభించనంత దుస్థితిలో వుంది. దీనర్థం తెలుగులో సాహిత్యం రావట్లేదనా? లేక, తెలుగులో వస్తున్నది సాహిత్యం కాదనా? తెలుగు సాహిత్యాన్ని జాతీయ స్థాయిలో పరిచయం చేసే ఒక సవ్యమైన వ్యవస్థ లేని తెలుగు సాహిత్య దుస్థితిని ఇది స్పష్టం చేస్తుంది. తెలుగు సాహిత్య సంఘాలు బోలెడన్ని వున్నాయి. కానీ, ఎవరి కుంపటి వారిదే. ఎవరి సాహిత్యం వారిదే అన్నట్టు గుంపులు, ముఠాలుగా వున్నాయి తెలుగు సాహిత్య సంఘాలు. ఈ పరిస్థితి మారితే కానీ, తెలుగు సాహిత్యం అంతర్జాతీయ స్థాయి అటుంచి కనీసం జాతీయ స్థాయిలో నయినా గుర్తింపు పొందే అవకాశం లేదు.

ముందుగా తెలుగు సాహిత్య పెద్దలు, విమర్శకులు, సంఘాలు రచయితను కాక రచనను, రచన సంవిధానాన్ని చూసి సాహిత్య  విలువను నిర్ణయించటం నేర్చుకోవాలి. నిజం చెప్పాలంటే ప్రస్తుతం సాహిత్యం సృజించటంకాదు, సాహిత్యాన్ని చదవటం నేర్పించాల్సిన పరిస్థితి నెలకొని వుంది. చదివేవారు పాత రచనలు చదువుతున్నారు. కొత్తవారు చదవకుండానే తమవారిని, తమను తాము ఉత్తమ రచయితలుగా ముద్రలువేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం వుంది. అందుకే, తెలుగు వారు కోట్లసంఖ్యలో వున్నా పత్రికలు చదివేవారు వేల సంఖ్యలోవున్నారు. పుస్తకాలు కొనేవారు వందలసంఖ్యలో కూడా వుండటంలేదు.

ఇటీవలి కాలంలో టెక్స్ట్ చదవటంకన్నా వినటం చూడటానికే అధిక సంఖ్యాకులు ఇష్టపడుతున్నారు. “ఆడియోవుంటే పంపు, డ్రైవింగ్లోనో ఆఫీసులో పనిచేస్తూనో వినవచ్చు” అనే వారు అధికమవుతున్నారు. వీడియో చూడటంలో వున్న సౌలభ్యం టెక్స్ట్ చదవటంలో లేదంటున్నారు. ఈ పరిస్థిని గమనించి అర్థం చేసుకున్న సంచిక ఉగాది నుంచి ఆడియో వీడియో పత్రికగా కూడా పాఠకుల ముందుకు రాబోతోంది.

ఉగాదినుంచీ సంచిక పత్రిక వెబ్ పత్రికగా వస్తుంది. సంచికలో ప్రచురితమయిన రచనలన్నీ సంచిక సోదర సంస్థ “మైఇండ్మీడియా” రేడియో చానల్‌లో ప్రసారమవుతాయి. కొన్ని ఎంపిక చేసిన రచనల వీడియోలు యూట్యూబ్ చానల్‌లో వుంటాయి. ప్రతిచోటా ఇతర రెండు మాధ్యమాల లింకులుంటాయి. అంటే ఒక రచన చదివి అది వినాలనుకున్నా చూడాలనుకున్నా అక్కడే లింకులుంటాయి. అలాగే ఒక రచన విని దాన్ని చదవాలనుకున్నా వినాలనుకున్నా అక్కడే లింకులుంటాయి. ఈ రకంగా ఇంకా పెద్ద సంఖ్యలో తెలుగు సాహిత్యాభిమానులను చేరాలని సంచిక ప్రయత్నిస్తోంది.

తెలుగు తెలిసి చదవటం రానివారు, చదవాలని వున్నా చదవలేనివారు, చదివే సమయం లేని తెలుగు సాహిత్యాభిమానులు ఈ రకంగా సంచిక పాఠకులుగా మారతారని సంచిక ఆశిస్తోంది. ఈ విషయంలో సాహిత్యాభిమానుల సహకారంతోపాటూ సలహాలు సూచనలనూ సంచిక ఆహ్వానిస్తోంది.

విభిన్నము విశిష్టమూ అయిన శీర్షికల ద్వారా పాఠకులను ఆకర్షించాలన్న సంచిక ప్రయత్నంలో భాగంగా ఈ నెల సంచిక అందిస్తున్న రచనల వివరాలు:

సంభాషణం:

  • శ్రీమతి అంగులూరి అంజనా దేవి అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్

కాలమ్స్:

  • రంగుల హేల 35:  బ్రతుకు బొట్టు – అల్లూరి గౌరిలక్ష్మి
  • నా జీవన గమంలో…! -1- తోట సాంబశివరావు

గళ్ళ నుడికట్టు:

  • సంచిక-పదప్రహేళిక-ఫిబ్రవరి 2021- దినవహి సత్యవతి

వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా -11 – ఆర్. లక్ష్మి

కథలు:

  • ఆయుధం – సలీం సయ్యద్
  • ఒక ప్రశ్న – గొర్రెపాటి శ్రీను
  • గాలివాన వెలిసింది – గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం
  • శ్రమరత్న – నల్ల భూమయ్య

కవితలు:

  • చీకటి… ఎప్పటికీ ఒంటరిదే! – శ్రీధర్ చౌడారపు
  • నిర్మోహం – డా. కోగంటి విజయ్
  • జ్ఞానోదయం – పి.వి.రమణ
  • ఉండలేకనే – శ్రీ సాహితి
  • తీరని దాహం – రమాదేవి బాలబోయిన

బాలసంచిక:

  • జయించాలి జీవితం – కంచనపల్లి వేంకటకృష్ణారావు

అవీ ఇవీ:

  • జరాసంధుడు – అంబడిపూడి శ్యామసుందర రావు

పుస్తకాలు:

  • దైవంతో నా అనుభవాలు – పుస్తక పరిచయం – భావరాజు పద్మిని

ఎప్పటిలానే ఈ సంచిక కూడా పాఠకులని ఆకట్టుకుందని ఆశిస్తూ…

సంపాదక బృందం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here