[dropcap]సం[/dropcap]చిక పాఠకులకు, సాహిత్యాభిమానులందరికీ, నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం తెలుగు సాహిత్యం నూతన పోకడలు పోతూ, వినూత్న ప్రయోగాలతో సాహిత్య విశ్వంలో తనదయిన ప్రత్యేక పాత్ర పోషిస్తుందన్న ఆశ సంచికకు వుంది.
సంచిక పత్రిక దృష్టి కేవలం సాహిత్యం పైనే కేంద్రీకృతమయి వుంటుంది. దీన్లో వ్యక్తిగతాలకు తావు లేదు. వ్యక్తి అశాశ్వతం. సాహిత్యం శాశ్వతం. భారతీయ ధర్మం దృష్టి ఎప్పుడూ శాశ్వతాల పైనే. వ్యక్తులు వస్తూ పోతూ వుంటారు. సరస్వతీదేవిని అర్చిస్తూ రచనల మాలలు అర్పిస్తూనే వుంటారు. కాబట్టి సరస్వతీ స్వరూపమయిన సాహిత్యం శాశ్వతం. అందుకే ప్రపంచంలో ఇతర ఏ నాగరికతలో, ధర్మంలో లేని విధంగా భారతీయ ధర్మంలో సాహిత్యానికి అత్యంత ప్రాధాన్యం. శబ్దం దైవం. శబ్దాన్ని వెన్నంటి వుండే అర్థం దైవం. అక్షరం దైవ స్వరూపం. మన జీవితం దైవానికి అంకితం. దైవం ధర్మం. అందుకే సత్యం వద, ధర్మం చర అన్నది మన జీవన విధానంలో విడదీయరాని సూత్రం. కాబట్టి దైవ స్వరూపమయిన సాహిత్యం ధర్మబద్ధమైన జీవితం గడపటంలో సమాజానికి మార్గదర్శనం చేసేదిగా వుండాలి. మంచిని చెడు నుంచి వేరు చేసి చూడగలిగే విచక్షణనివ్వాలి. ఎలాంటి కష్ట నష్టాలెదురయినా, ధైర్యంగా ఎదుర్కొంటూ ధర్మాన్ని ఆచరించే ఆత్మవిశ్వాసాన్నివ్వగలగాలి. అందుకే సమాజహితం కోరేది సాహిత్యం అయ్యింది.
కానీ, తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక పద్ధతి ప్రకారం సాహిత్యంలోంచి హితం తొలగించారు. ఒక పద్ధతి ప్రకారం సాహిత్యానికి పరిధులు విధించి, అనంతమయిన రచయిత సృజనాత్మకతను సంకెళ్ళలో బిగించి, ఈ పరిధులు పరిమితులు ఎవరూ అధిగమించకుండా చుట్టూ కంచుకోట నిర్మించారు. ఇది ఒక్కడివల్ల సాధ్యమయ్యే పనికాదు. కలసికట్టుగా పనిచేస్తూ, ఒకరికొకరు తోడవుతూ సాహిత్యాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఇదే సాహిత్యం, ఇలా రాసేదే సాహిత్యం, దీని గురించి రాసేదే సాహిత్యం అంటూ ప్రామాణికాలేర్పరచారు. మొత్తం సాహిత్యం స్వరూపాన్నే మార్చేశారు. ఇందుకు ఒప్పుకోకుండా సృజనాత్మక స్వేచ్చను ప్రదర్శించే రచయితలను పద్ధతి ప్రకారం విస్మృతిలోకి నెట్టారు. ఫలితంగా, ఈ రోజు ఒక రచయిత పేరు వినబడాలన్నా, ఒక రచయిత రచనలు ప్రచారంలోకి రావాలన్నా, అతని మరణం తరువాత అతని రచనలు సజీవంగా వుండాలన్నా ఏదో ఒక ముఠాలో చేరటం తప్పనిసరి అవుతోంది. లేకపోతే, అతని రచనలను మోసే కుటుంబ సభ్యులయినా వుండాలి. ఇలాంటి పరిస్థితుల్లో, ఒక ఉత్తమ రచన చేసినా అది గుర్తింపు పొందుతుందన్న నమ్మకం లేదు. కాబట్టి, పేరు, గుర్తింపు కోరే రచయితలు, ముఖ్యంగా యువ రచయితలు, సరిగా రచనలు చేయటం రాకున్నా ఏదో ఓ ముఠాలో చేరి పేరు సంపాదించటంపైనే దృష్టి పెడుతున్నారు. ఇది సాహిత్యంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతున్నది. ఎంతగా అంటే కథ సరిగ్గా అల్లటం తెలియనివారి కథలు ఉత్తమ కథల సంకలనాల్లో చేరుతున్నాయి. దాంతో, ఇంకా అడుగులు సరిగ్గా వేయటం రాకముందే, అన్నీ తెలుసన్న విశ్వాసం ఏర్పడి వారి ఎదుగుదలను దెబ్బ తీస్తోంది. వీరిని చూసి ఇతర రచయితలు ఈ దారిలో ప్రయాణించటమో, లేక, పేరు తెచ్చుకునేందుకు మరో అడ్డదారిని వెతుక్కోవటమో చేస్తున్నారు తప్ప, రచనల్లో నైపుణ్యం సాధించాలన్న తపనను ప్రదర్శించటంలేదు. దీని దుష్ఫలితం సంచిక గ్రహించింది. అందుకే ‘ఇయర్ హుక్’ అనే ఆడియో ప్లాట్‌ఫారంతో జతకట్టి యువ రచయితలకు రచనా పద్ధతులు నేర్పి, వారి కథలను సంచికలో ప్రచురిస్తుంది. ‘ఇయర్ హుక్’ ఆడియో కథను ప్రసారం చేస్తుంది. ఈ రకంగా రచనా నైపుణ్యం కల చక్కని రచయితలను తయారు చేయటం ద్వారా భవిష్యత్తులో చక్కని రచనలు చేసే యువ రచయితలతో సాహిత్య రంగాన్ని ఉన్నత స్థానంలో నిలపాలని ప్రయత్నిస్తోంది.
ఈ ప్రయత్నాలలో భాగంగానే సాహిత్య అకాడమీ అవార్డుల నిర్ణయాలలోని అనౌచిత్యాలను వివరింఛే ప్రయత్నం చేస్తోంది సంచిక. ఇది ఆయా రచయితలపై వ్యక్తిగత విమర్శ కాదు. ఈ విమర్శ సాహిత్య సంబంధి మాత్రమే. సమాజానికి మంచి చెప్పి సరయిన మార్గం చూపే రచనలను విస్మరించి ఒకే రకమైన భావజాలాన్ని సమర్ధించే రచనలకే పట్టం కట్టి అలాంటి రచనలను ప్రామాణికం చేయాలన్న ప్రయత్నాలను వ్యతిరేకించటం తప్ప, ఈ విమర్శలో వ్యక్తిగతం ఏమీ లేదు.
ఒకవైపు సాహిత్యంలోని అనవసరమైన హానికరమయిన అంశాలను ప్రక్షాళన చేయాలని ప్రయత్నిస్తూ, మరోవైపు, విభిన్నమయిన రచనలను ప్రచురించటం ద్వారా సాహిత్యాన్ని పరిపుష్టం చేయాలని సంచిక ప్రయత్నిస్తోంది. సంచిక చేస్తున్న ఈ ప్రయత్నాలకు సహృదయులయిన సాహిత్యాభిమానుల సమర్థన ఎల్లప్పుడూ వుంటుందన్న నమ్మకంతో సంచిక తాను నమ్మిన కర్తవ్యాన్ని, ధర్మమమనుకున్న దానిని నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది. గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సంచికను మరింత పెద్ద సంఖ్యలో పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తోంది సంచిక.
~
సంచికలో 1 జనవరి 2023 తేదీన ప్రచురితమవుతున్న రచనల వివరాలివి.
సంభాషణం:
- శ్రీమతి ఉదయశ్రీ ప్రభాకర్ అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్
సీరియల్స్:
- జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-26 – కస్తూరి మురళీకృష్ణ
- నియో రిచ్-32 – చావా శివకోటి
- మేనల్లుడు-14 – ముమ్మిడి శ్యామలా రాణి
- జగన్నాథ పండితరాయలు-12- విహారి
- డాక్టర్ అన్నా బి.యస్.యస్.-10 – సిహెచ్. సి. ఎస్. శర్మ
- నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-4 – మూలం: కె.ఎం. మున్షీ. అనువాదం – కస్తూరి మురళీకృష్ణ
- నేను.. కస్తూర్‌ని-3 – మూలం: డా. హెచ్.ఎస్. అనుపమ. అనువాదం – చందకచర్ల రమేశ బాబు
కాలమ్స్:
- అలనాటి అపురూపాలు -149 – లక్ష్మీ ప్రియ పాకనాటి
- జ్ఞాపకాల పందిరి-143- డా. కె. ఎల్. వి. ప్రసాద్
- చిరుజల్లు-52 – శ్రీధర
- సామెత కథల ఆమెత-5 – బిందుమాధవి మద్దూరి
- సంగీత సురధార-7 – డా. సి. ఉమా ప్రసాద్
- జ్ఞాపకాల తరంగిణి-77- డా. పురుషోత్తం కాళిదాసు
- అన్నింట అంతరాత్మ-44: ఆత్మీయతా ముద్రను.. ‘శుభాకాంక్షల కార్డు’ను నేను! – జె. శ్యామల
- సంచిక విశ్వవేదిక – నూతన సంవత్సర శుభాకాంక్షలు – మోటమఱ్ఱి సారధి
భక్తి:
- నారద భక్తి సూత్రాలు-3 – సంధ్య యల్లాప్రగడ
గళ్ళ నుడికట్టు:
- సంచిక-పదప్రహేళిక- జనవరి 2023- దినవహి సత్యవతి
- నూతన పదసంచిక-44: కోడిహళ్లి మురళీమోహన్
- సంచిక పద ప్రతిభ-44: పెయ్యేటి సీతామహాలక్ష్మి
వ్యాసాలు:
- అమ్మ కడుపు చల్లగా -34 – ఆర్. లక్ష్మి
- దేశ విభజన విషవృక్షం-21 – కోవెల సంతోష్‌కుమార్
- ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-13 – వేదాంతం శ్రీపతిశర్మ
- ఘండికోట బ్రహ్మాజీ రావు కథల్లో రైల్వే ప్రస్తావన – డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి
కవితలు:
- గడుసరి కాలం – శ్రీధర్ చౌడారపు
- ఇల్లు చేరుకోవాలి – డా. కోగంటి విజయ్
- ముందుకు రానీ – అగరం వసంత్
- కాస్త ఆగవా – విస్సాప్రగడ వేంకట కృష్ణ సాయి
- ఆవేదన – ఏరువ శ్రీనాథ రెడ్డి
- సృష్టి కనికట్టు – చందలూరి నారాయణరావు
కథలు:
- నగరంలో మరమానవి 4 – చిత్తర్వు మధు
- మ్యూజియం సోఫా! – గంగాధర్ వడ్లమన్నాటి
- కూతురంటే కూతురే మరి – శ్యామ్ కుమార్ చాగల్
- లాక్‌డౌన్ నేపథ్యంలో.. – అక్షర
- సత్య రక్షణ – సిహెచ్. సి. ఎస్. శర్మ
- ప్రపంచం మారిపోతుంది – ఎం.జి. వంశీ కృష్ణ
- కోడిపిల్ల కొనమంటే కొత్తపొలం కొంటానన్నాడట – వేలమూరి నాగేశ్వరరావు
పుస్తకాలు:
- ఈ పుస్తకానికి సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారమా?-2 – కస్తూరి మురళీ కృష్ణ
- ఒక సరికొత్త ప్రయత్నం – ‘సినీ కథ’ – అశోక్ కుమార్ కె.పి.
ప్రయాణం:
- అమెరికా ముచ్చట్లు-24 – శ్రీధర్ రావు దేశ్‌పాండే
- ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ యాత్రా విశేషాలు-5 – కలవల గిరిజారాణి
సినిమాలు/వెబ్ సిరీస్:
- కొరియానం – A Journey Through Korean Cinema – 46- గీతాచార్య వేదాల
- మరుగునపడ్డ మాణిక్యాలు – 26: ‘గుడ్ విల్ హంటింగ్’ – పి. వి. సత్యనారాయణ రాజు
- సినిమా క్విజ్-18 – శ్రీనివాసరావు సొంసాళె
బాల సంచిక:
- భూమి మీద దేవతలు – కంచనపల్లి వేంకటకృష్ణారావు
అవీ ఇవీ:
- ఫొటో కి కాప్షన్ 27 – ఎన్. కె. బాబు
- యువభారతి వారి ‘పగలే వెన్నెల’ – పరిచయం – అశ్వనీ కుమార్. పి
- మహా తపోధనుడు శౌనక మహర్షి – అంబడిపూడి శ్యామసుందర రావు
- వివిధ రంగాలలో సేవలందిన మహిళా మంత్రి డా. రాజేంద్ర కుమారి బాజ్‌పాయ్ – పుట్టి నాగలక్ష్మి
- 1960 నాటి ఓ మంచి కథ ‘అవేద్యాలు’ – ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ
ఎప్పటిలాగే మీ సూచనలు, సలహాలతో సంచికను ముందుకు నడిపిస్తారన్న విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం