సంపాదకీయం జనవరి 2024

0
11

[dropcap]తె[/dropcap]లుగు పాఠకులకు, సాహిత్యాభిమానులకు, రచయితలకు,  సంచికను విశేషంగా అభిమానిస్తున్న అందరికీ సంచిక వెబ్ పత్రిక 2024 నూతన సంవత్సర ఆర్థిక, హార్దిక శుభాకాంక్షలు తెలుపుతోంది.

నూతన సంవత్సరం వస్తున్నదంటే, గత సంవత్సరంలో సాధించిన విషయాలు, ఆశ, నిరాశలు, భవిష్యత్ ప్రణాళికలు, లక్ష్యాలు వంటివి విశ్లేషించటం ఆనవాయితీ.

గత సంవత్సరం అంటే, 2023లో సంచిక పాఠకాదరణ ఎంతగా పెరిగిందంటే, కొన్ని సంవత్సరాలుగా  తెలుగు సాహిత్యంపై పట్టు బిగించి సాహిత్య గతిని నిర్దేశిస్తున్న వెబ్ పత్రికలన్నిటికన్నా అధిక సంఖ్యలో పాఠకులను ఆకర్షిస్తున్న వెబ్ పత్రికగా సంచిక నిలుస్తోంది. ఇందుకు కారణమయిన రచయితలు, పాఠకులందరికీ సంచిక శిరస్సు వంచి ప్రణామం చేస్తోంది.

సంచిక పత్రికను ఆరంభిస్తున్నప్పుడు, రాజకీయాలు లేకుండా, ఏదో ఓ భావజాలానికో, ఉద్యమానికో కొమ్ముకాయకుండా, సెన్సేషనల్ సినిమా గాసిప్ వార్తలు లేకుండా కేవలం సాహిత్యం పై ఆధారపడే పత్రికలు తెలుగులో బ్రతికి బట్టకట్టటం అసంభవమని శ్రేయోభిలాషులెందరో హెచ్చరించారు. గతంలో మూతబడిన సాహిత్య పత్రికలను ప్రస్తావించారు.

అయితే, సంచికకు తెలుగు పాఠకుల విచక్షణ పట్ల అత్యంత విశ్వాసం వుంది. తెలుగు పాఠకులున్నారు. కానీ, వారు తెలుగు సాహిత్యం పట్ల నిరాశతో వున్నారు. సాహిత్యాన్ని తమ గుప్పెట్లో బిగించిన సాహిత్య మాఫియా ముఠాలు తెలుగు సాహిత్యాన్ని ఒక చట్రంలో బిగించాయి. ఆ చట్రంలో ఇమడని సాహిత్యాన్ని, రచయితలను ప్రధాన సాహిత్య స్రవంతికి దూరం చేశారు. ఇది సాహిత్యానికీ సామాన్య పాఠకుడికీ నడుమ అగాధాన్ని సృష్టించింది. మాఫియా పెద్దలు పీఠంపై వుంచిన రచనలు, రచయితలు – సామాన్య పాఠకుడిని నిరాశకు గురిచేస్తున్నారు. దాంతో అందరూ ఆకాశానికెత్తే రచనలే ఇలా వుంటే, ఎవరూ అంతగా ప్రస్తావించని రచనలేం బాగుంటాయి అనుకుంటారు పాఠకులు .  సాహిత్యానికే దూరమవుతారు. ప్రస్తుతం జరుగుతున్నదిదే. అందుకే తెలుగు చదవగలిగేవారెంతో మంది వున్నా, నిజంగా చదువుతున్నవారి సంఖ్య తక్కువగా వుంటోంది. అయితే, పాఠకుల ఆకాంక్షలను, ఆశలను, నిరాశలను, సందిగ్ధాలను ప్రదర్శించి, ఆశాభావం కలిగించే రచనలు లేకపోవటంవల్ల, ఉన్నా  తెలియక పోవటం వల్ల, వీరంతా సాహిత్యానికి దూరంగా వుంటూ, ఎప్పుడో తాము మెచ్చిన ఒకప్పటి సాహిత్యాన్నే ఇంకా చదువుతూన్నారు. చక్కటి సాహిత్యాన్ని అందిస్తే, వీరంతా సమకాలీన సాహిత్యాన్ని చదువుతారు. ఆదరిస్తారు. పాఠకుల విచక్షణపై వున్న ఈ నమ్మకంతోటే, ఎవరెంతగా నిరాశ పరచినా, వెనుకకు లాగుతున్నా, పట్టించుకోకుండా, ఉత్తమ  సాహిత్యానికి పెద్ద పీట వేస్తూ, విభిన్నమైన అంశాల ఆధారంగా సృజించిన రచనలను అందిస్తే పాఠకులు ఆదరిస్తారన్న నమ్మకంతో సంచిక వెబ్ పత్రిక ఆరంభమయింది.

సంకెళ్ళలోనూ పూలు పూసినా, స్వేచ్చగా అడవిలో విశృంఖలంగా పూసే పూల అందమే వేరు. అందుకే, సంచిక రచయితలపై ఎలాంటి ప్రతిబంధకాలు విధించలేదు. సృజనాత్మక స్వేచ్చ వుండటంతో, ఎలాంటి సంశయాలు లేకుండా రచయితలు సంచికకు రచనలను అందిస్తున్నారు. తమ మనసు లోలోతుల్లోని ఆలోచనలకు అక్షర రూపం ఇస్తున్నారు. పాఠకులను అలరిస్తున్నారు. దాంతో, ఉత్తమ సాహిత్యానికి, నాణ్యమైన రచనలకు సంచిక చిరునామాగా మారింది. ప్రతి పాఠకుడినీ అలరింఛే ఏదో అంశాన్ని అందిస్తూ పాఠకులను ఆకర్షిస్తూ, సంఖ్యను పెంచుకుంటూ, ఈరోజు, తెలుగు వెబ్ పత్రికలలో అతి వేగంగా పాఠకుల సంఖ్యను పెంచుకుంటూ, అత్యధిక పాఠకులను ఆకర్షిస్తున్న  పత్రికగా నిలుస్తోంది. భవిష్యత్తులో పాఠకులను మరింతగా ఆకర్షిస్తూ సంఖ్యను పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంది.

పాఠకులను తెలుగు రచనలవైపు ఆకర్షించటంలో భాగంగా సంచిక యూట్యూబ్ చానల్ ను ఏర్పాటు చేసింది. సంచిక నిర్వహించే సాహిత్య కార్యక్రమాలతో పాటూ సంచిక రచనల ఆడియోలు కూడా ఈ చానెల్‌లో వుంటాయి. చాలామందికి తెలుగు తెలుసు. కానీ, చదివే సమయం వుండదు. చదవాలనివున్నా కొందరికి చదవటం రాదు. అలాంటివారికోసం సంచిక యూట్యూబ్ చానల్ ఆరంభించింది. యూట్యూబ్ చానల్ ద్వారా అలాంటి శృత పాఠకులను కూడా ఆకర్షించాలని సంచిక ప్రయత్నిస్తోంది.

యూట్యూబ్ చానల్ ఆరంభించటం వెనుక మరో కారణం వుంది.

ఇటీవలి కాలంలో, యూట్యూబ్ చానల్ ఒకటి ఏర్పాటు చేయటం, అందిన రచనను అందినట్టే చదవేయటం చాలామంది చేస్తున్నారు. ఈ చదవటంలో, రచయిత అంటూ ఒకడున్నాడు, ఆ రచయితకు రచనపై సృజనాత్మక హక్కు వుంటుంది, అన్న ఆలోచనను ఎవరూ కనబరచటంలేదు. రచయితలు సైతం, ఎవరయినా తమ రచన చదువుతున్నామనగానే, ఈ రకంగానయినా తమ రచన పదిమందికి చేరుతుందని సంతోషిస్తున్నారు. కొందరయితే, మీ రచన చదివేము, మాకు చానెల్ మెయింటేనెన్స్‌కి ఖర్చవుతుందని చెప్పి రచయితల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. మరికొందరు సమీక్షలు రాసి, చదివి, సమీక్షించినందుకూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒకవేళ ఏ రచయిత అయినా, నా అనుమతి లేకుండా నా రచన ఎలా చదువుతావని నిలదీస్తే, నీకే క్రెడిట్ ఇచ్చాను ఇంకేం కావాలని అడుగుతున్నారు. ఇది శోచనీయమైన పరిస్థితి.

రచయిత రాయకపోతే పత్రికలు లేవు. ఎడిటర్ లేడు. విమర్శకుడు లేడు. రచయిత రాయకపోతే ప్రచురణకర్తలకు ప్రచురించేందుకు ఏమీ వుండదు. రచనలు లేకపోతే వాటిని యూట్యూబుల్లో చదివేవారికి ఎంత మంచి స్వరమున్నా చదివేందుకు ఏమీ దొరకదు. అంటే, ఎవరెవరయితే తనకు ఏదో ఫేవర్ చేస్తున్నట్టు రచయిత భావించుకుంటూ, వొదిగొదిగి విధేయుడిగా వుంటున్నాడో, నిజానికి వారంతా, రచయిత మీద ఆధారపడి బ్రతికే పరాన్నజీవుల లాంటి వారన్నమాట. కానీ, పరాన్నజీవి లక్షణం తనకు ఆశ్రయమిచ్చిన జీవికి హాని కలిగిస్తుంది. అది దాని లక్షణం. సాహిత్యం, రచయితలు ఈ పరాన్నజీవుల పాలపడ్డారు. తెలుగు సాహిత్యంలో రచయితలు ఈ పరాన్నజీవుల బారిన పడకుండా తమని తాము రక్షింఛుకునే వీలు కల్పిస్తోంది సంచిక. రచయితల రచనలను చదివించి సంచిక యూట్యూబ్ చానల్‌లో ప్రచురిస్తుంది. రచయితలంతా సంచికలో షేర్ హోల్డర్లుగానే భావిస్తుంది సంచిక. కాబట్టి, సంచిక ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎలాంటి ఆదాయం వచ్చినా దాన్ని రచయితలందరితో పంచుకుంటుంది సంచిక. ఇందుకు విధివిధానాలనూ తయారుచేస్తోంది. యూట్యూబ్ చానల్ ఏర్పాటుకు ఇదీ ఒక ప్రధాన కారణం.

ఇంతేకాదు, సంచిక మరో కోణంలో కూడా రచయితల కోసం పనిచేస్తోంది. తెలుగు మీడియా ఒక పద్ధతి ప్రకారం ఒకే భావజాలానికి స్థానం ఇస్తూ వస్తోంది. ఇది ఏ స్థాయికి చేరిందంటే, ఆ భావజాలంలో రాసేవాడే రచయిత, ఇతరులు కాదు, వారు రాసేది సాహిత్యం కాదు అనేంత! అందుకని, రచయితలు పెద్దల ఆమోదం కోసం, సాహిత్య ప్రపంచంలో ప్రధాన స్రవంతిలో వుండటం కోసం తమ వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా రచనలు చేస్తున్నారు. అలా  తమ స్వభావానికి భిన్నమైన రచనలు చేసి తమ స్వంత వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారు రచయితలు.  రచయితలపై ఆ ప్రతిబంధకాన్ని కూడా తొలగించాలని ప్రయత్నిస్తోంది సంచిక. ఇప్పటికే తెలుగు మీడియాలో ఒక ప్రత్యామ్నాయ స్వరంగా గుర్తింపు పొందుతోంది సంచిక. రచయితలు రాయాలనుకున్నది రాసే స్వేచ్చను ఇస్తోంది సంచిక.

కానీ, ఇంకా, అవార్డులు, సన్మానాల రంగంలో అడుగుపెట్టలేదు సంచిక. త్వరలో సంచిక ఉత్తమ రచయితలకు, ఉత్తమ రచనలకు అవార్డులివ్వాలని ఆలోచిస్తోంది.

ఈ సంవత్సరం సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత తల్లావఝ్ఝుల పతంజలి శాస్త్రి గారికి అభినందనలు తెలుపుతున్నది సంచిక. కానీ, ఒక విషయాన్ని ఎత్తి చూపకుండా వుండలేకపోతోంది. ఈసారి అవార్డుల ప్రకటన ఎలాంటి సంచలనానికీ కారణం కాలేదు. దీనికి కారణం ఏమిటంటే, పతంజలి శాస్త్రి రచయితగా ఎంత ప్రతిభావంతుడయినా, ఎన్ని గొప్ప రచనలు చేసినా, రచయితగా ఆయనకు సాహిత్య పెద్దల ఆమోదముద్ర లభించటమే.. ఆయన ఆయా వర్గాలవారి గుర్తింపు పొందక పోయివుంటే, ఎన్ని చక్కని రచనలు చేసినా ఆయనకీ అవార్డు దక్కేది కాదన్నది, చివరికి మిగిలిన  పుస్తకాల జాబితా చూస్తే స్పష్టమవుతుంది.

చివరి స్థాయికి చేరిన  పుస్తకాలలో భాస్కర యోగి (తెలంగాణా సాహిత్య సౌరభాలు), ముకుంద రామారావులు (రాత్రి నదిలో ఒంటరిగా) తప్ప మిగతా అంతా ఒకే భావజాలంతో,  ఏదైనా సంస్థ ద్వారానో, ఉద్యమం ద్వారానో లేక ఉద్యమంతో సంబంధం వున్న వ్యక్తులతో సన్నిహిత  సంబంధం వున్నవారే అవటం గమనార్హం! భాస్కర యోగి, ముకుంద రామారావుల  రచనలు చివరి పది పుస్తకాల జాబితాలో వుండటం ఒక రకంగా సాహిత్య అకాడమీ సభ్యులకు రక్షణ కవచం లాంటిది.

సాహిత్య అకాడమీపై ఒకే భావజాలం వున్నవారు కబ్జా చేయటంతో వారికి ఆమోదయోగ్యం కాని వారి రచనలకు గుర్తింపు లభించే వీలు లేని పరిస్థితి నెలకొంది. కంటి తుడుపుగా ఓ రెండు ఇతర రచనలున్నా(ఇవి రక్షణ కవచాలు) వారికి అవార్డు లభించదని జాబితా తయారయినప్పటినుంచే అందరికీ తెలుసు. పతంజలి శాస్త్రి ప్రతిభ పట్ల ఎవరికీ  ఎలాంటి శంకలు  లేకున్నా, ఆయనకీ అవార్డు అందుకునే అన్ని అర్హతలూ వున్నా, అసలయిన అర్హత – being accepted by the people who matter – లేకపోతే ఈ నామినేషన్ కూడా దక్కేదో లేదో అనుమానమే!!! ఎందుకంటే, ఎందరో ఉత్తమ రచయితలు మాఫియా ముఠాల్లో చేరకపోవటం వల్ల, వారి దృష్టిలో పడకపోవటం వల్ల అనామకులుగా మిగిలిపోయారు. వారి రచనలు విస్మృతిలో పడ్డాయి. ఇది ఏ రకంగానూ అవార్డు పొందిన రచయిత పట్ల విమర్శగా భావించకూడదు. ఆయన అదృష్టం బాగుందని అభినందించటం, అంత అదృష్టం లేని చక్కని రచయితల పట్ల సానుభూతి వ్యక్తపరచటం మాత్రమే!! సాహిత్య అకాడమీతో సహా, తెలుగు సాహిత్య ప్రపంచం పట్ల, సాహిత్యానికి కాక, వ్యక్తిగతాలకు ప్రాధాన్యం ఇచ్చే స్థిరపడిన అవ్యవస్థిత వ్యవస్థ పట్ల ఈ  విమర్శ. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చి రచయితకు కాదు, రచనకు ప్రాధాన్యం ఇచ్చే వ్యవస్థ కోసం సంచిక ప్రయత్నాలు ఆరంభిస్తోంది.

అయితే, ఈ సందర్భంగా సంచిక పాఠకులనుంచి కూడా బాధ్యతాయుతమైన ప్రవర్తనను ఆశిస్తోంది. ఏ రచననూ, రచయిత పేరు చూసి తీసిపారేయకుండా, పొగిడేయకుండా చదివి నిర్ణయించుకోవాలి. సాహిత్య ప్రపంచంలోని పలు కారణాల వల్ల  రచయితల పట్ల  అపోహలు ప్రచారంలోకి వస్తాయి. వాటిని పట్టించుకోకుండా రచనను చదివి రచయిత నాణ్యతను నిర్ణయించుకోవాలి. అలాగే, తమకు ఏ రచయిత రచన అయినా నచ్చితే, ఆ రచయితకు అది తెలియబరచాలి. ఆ రచనను ఇతరులతో పంచుకోవాలి. ఏదయినా రచన నచ్చకపోతే, తార్కికంగా నచ్చని అంశాన్ని తెలియచేయాలి. అంతేకానీ, ఆవేశకావేశాలను ప్రదర్శించటం సాహిత్య అభిమానులకు కూడని పని. ముఖ్యంగా, ధార్మిక అంశాల గురించిన భేదాభిప్రాయాలు నెలకోంటే, ఆ రచనను, రచయితను విమర్శించేకన్నా, ఆ అంశాన్ని మరో కోణంలో ప్రదర్శించిన ఇతర రచన గురించి చర్చిస్తే, ఆ ఇతర రచనలకు ప్రచారం కల్పిస్తే, ధార్మిక అంశాలపై దుర్వ్యాఖ్యానం చేసిన రచనకు, రచయితకు అనవసరమైన ప్రచారాన్ని, ప్రాధాన్యాన్ని కల్పించినట్టవదు. ఎలాగయితే, ప్రచారం లభించకపోతే, తీవ్రవాదుల దాడి నిష్ఫలమవుతుందో, అలాగే అనవసర ప్రచారం లభించకపోతే, ధార్మిక దుర్వ్యాఖ్యల రచయితలకు వారనుకున్న ప్రచారం లభించదు. తమకు భౌతిక దాడుల బెదిరింపులొస్తున్నాయని ప్రచారం చేసుకుని సానుభూతి పొంది, martyrs for the cause of truth అన్నట్టు పోస్టులు పెట్టే వీలుండదు. కాబట్టి, ఎవరైనా రాముడు, రామాయణాల గురించి అవాకులూ చవాకులూ రాస్తే, వారి రచన స్వేచ్చను వారికే వదిలేసి, ఆ రచనను ప్రస్తావించకుండా రాముడు, రామాయణాన్ని సరయిన రీతిలో ప్రదర్శించిన రచనల గురించి చర్చిస్తే చెత్త రచనకు ప్రచారం లభించదు. మంచి ఆలోచనలు విస్తరిస్తాయి. ఎవరి స్వేచ్చకూ భంగం కలగదు. మంచి మైకులో, చెడు చెవిలో చెప్పమంటారు. కానీ, మనం మంచిని విస్మరింఛి చెడుకు ప్రచారమిస్తున్నాం. సాహిత్యాభిమానులు ఈ విషయం గ్రహించాలి. రాముడిని దూషించే ఒక కథకు సమాధానంగా రాముడిని సరిగ్గా అర్ధంచేసుకున్న పది కథలున్నాయి. కానీ, దూషించిన ఆ ఒక్క కథ అందరికీ తెలుస్తోంది. మంచిగా చూపిన కథలు మరుగున పడుతున్నాయి. కాబట్టి, ఆవేశ ప్రదర్శన ఎంత సమంజసమైనా, విచక్షణ లేకపోతే అనర్థదాయకమౌతుంది. కాబట్టి మంచి రచనల గురించే మాట్లాడదాము. చీకటిని ఎంత తిట్టినా లాభం లేదు. చిరు దీపం వెలిగిస్తే చాలు ఘోరాంధకారం కూడా పారిపోతుంది.

రచయిత ఆశాజీవి. తాను నిరాశ లోతుల్లో కూరుకుపోతూ కూడా సమాజానికి ఆశాజ్యోతిని అందిస్తాడు. అందుకే, సంచిక ఎన్నెన్నో పథకాలతో ఆశలతో నూతన సంవత్సరంలోకి ఆడుగుపెడుతోంది. గత సంవత్సరాల్లో లాగే రచయితలు తమ విశిష్టమయిన రచనలతో సంచికను పరిపుష్టం చేస్తూ, పాఠకులను మరింతగా ఆకర్షించేందుకు దోహదం చేస్తారని ఆశిస్తోంది. సంచికను ఆదరిస్తున్న పాఠకులు తామే కాదు, ఇతరులకు కూడా సంచిక గురించి చెప్పి వారితోనూ సంచిక చదివిస్తారనీ, ఈ రకంగా ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తూ జగతిని వెలుగు మయం చేసినట్టు, సంచికను తెలుగు సాహిత్య ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలిపి సాహిత్య ప్రపంచాన్ని, మాఫియా ముఠాల ఉక్కు పిడికిలి నుంచి తప్పించి, ఉత్తమ సాహిత్యానికి పెద్దపీట వేయటంలో తోడ్పడతారనీ ఆశిస్తోంది సంచిక. తోడ్పడాలని అభ్యర్ధిస్తోంది.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఎప్పటిలానే సీరియల్, వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, ఇంటర్వ్యూ, పిల్లల కథ, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 జనవరి 2024 సంచిక.

1 జనవరి 2024 నాటి ‘సంచిక’లోని రచనలు:

సంభాషణం:

  • డా॥ వి. ఆర్. రాసాని అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్

సీరియల్:

  • అంతరిక్షంలో మృత్యునౌక-5 – పాణ్యం దత్తశర్మ

కాలమ్స్:

  • సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో…21 – వి. శాంతిప్రబోధ – సారధి మోటమఱ్ఱి
  • శ్రీ మహా భారతంలో మంచి కథలు-5 – శ్రీ కుంతి

వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా -46 – ఆర్. లక్ష్మి
  • మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు-8 – పాణ్యం దత్తశర్మ
  • మన భజన సంప్రదాయ సాహిత్యం – డా. సి. భవానీదేవి

కవితలు:

  • రాతిరి రంగస్థలం – శ్రీధర్ చౌడారపు
  • కొత్త దారిలో.. – డా. విజయ్ కోగంటి
  • ఆ రోజే మళ్ళీ – చందలూరి నారాయణరావు

కథలు:

  • ఇదేం బహుమతి కథ కాదు – గంగాధర్ వడ్లమన్నాటి
  • విశ్వాసఘాతకుడు – కర్లపాలెం హనుమంతరావు

పుస్తకాలు:

  • ఇక్కడి మనుషుల అక్కడి జీవితాలు – అక్కడి మనుషుల ఇక్కడి బంధాలు – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్

బాల సంచిక:

  • విశ్వాసం – కంచనపల్లి వేంకటకృష్ణారావు

అవీ ఇవీ:

  • ‘గాంవ్ కా గమ్ – ఖేత్ కా ఖేత్’ – పుస్తకావిష్కరణ సభ ప్రెస్ నోట్ – చలపాక ప్రకాష్

సంచిక ప్రకటనలు:

  • ‘సంచిక – పదప్రహేళిక’ గళ్ళనుడికట్టుకు విరామం – సంచిక టీమ్
  • శ్రీమతి కావేరి చటోపాధ్యాయ ఆత్మకథ అనువాదం ‘ఆటుపోట్ల కావేరి’ త్వరలో – ప్రకటన – సంచిక టీమ్

ఎప్పటిలాగే మీ సూచనలు, సలహాలతో సంచికను ముందుకు నడిపిస్తారన్న విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here